విప్లవాల్లోని ఒంటరితనం గురించి రాయాలి : అల్లం రాజయ్య

rajayya1

 అల్లం రాజయ్య గారితో ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేసాను. అసలు ఆయనను ఇంటర్వ్యూ చేసే అర్హత నాకు ఉందా.. అని ఎన్నో ప్రశ్నలు.

మరో అరగంటాగి వస్తారా, కూర వండుతున్నా అన్నారు. అయితే ఇప్పుడే వస్తాను, ఇంటర్వ్యూ అంటే మరీ ఫార్మల్ కాదులెండి అని మరో పది నిమిషాల్లో ఇంటి బెల్లు కొట్టాను. ఆయన తన కథల్లోని సామాన్య రైతు పాత్రల్లా సజీవంగా కళ్ల ముందు ఎటువంటి భేషజం లేకుండా లోనికి ఆహ్వానించారు.  అంత వరకు ప్రశ్నలు వేసిన మనసుని పక్కకు నెట్టి పరిచయంగా వంటింట్లో నిలబడి, ఆయన చేస్తున్నది గమనిస్తూ మాట్లాడడం మొదలు పెట్టాను. వాళ్ల చిన్నమ్మాయి  ఇంట్లో ఉన్నారు రాజయ్య గారు. అమ్మాయి వచ్చే లోగా కాస్త వండి పెట్టాలన్న ఆప్యాయత కలిగిన ఆ తండ్రి హృదయానికి . అందుకు జోహార్లు మనసులో అర్పించకుండా ఉండలేకపోయాను. అలా  ఆయన్ని చూడగానే మా నాన్నగారు జ్ఞాపకం వచ్చి క్షణం లో బిడియాలన్నీ పోయాయి నాకు.

అమెరికా లో మీకు బోరుగా లేదాండీ. అనడిగాను, ఏమీ లేదమ్మా, ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక పనితో పొద్దు పోతుంది. ఈ పిల్లల్ని వాళ్ల చిన్నప్పుడు పట్టించుకునే సమయం లేకపోయింది. ఇప్పుడైనా వీళ్లతో గడపడం బావుంది. అన్నారు. మనుమరాలిని ఒక పక్క ఆడిస్తూ. అక్కడ గంట సేపు ఉందామనుకున్న నేను నలభై ఏళ్ల తన జీవన యానం గురించి ఆయన చెప్తూంటే ఆ దృశ్యాలన్నిటిలోకి ప్రవేశిస్తూ, ప్రవహిస్తూ మైమరిచి మూడు గంటలైనా అక్కడే ఉండిపోయాను. ప్రతి సంఘటన ఆయన మాట్లాడుతూంటే ఆ వెనుకే నేను అక్కడ అడుగుపెడ్తూ ఉన్నాను. అదొక అద్భుతమైన భావన. గుండె చెమ్మగిల్లిన కన్నీటి అలజడి. పోరాటాల అలుపెరగని ఆయాసం. సమాజం, మనుషుల మధ్య  సంబంధ బాంధవ్యాల తాత్త్విక యోచన. అడవి పొడవునా పరుచుకున్న మట్టి తీగెల రక్త సింధూరం.   రాయడం తక్షణ అవసరమని భావించి నలభై ఏళ్ల పాటు ఉధృతంగా రచనోద్యమాన్ని భుజానికెత్తుకున్న అలుపెరగని శ్రామికుడు.
ఒక శ్రమ జీవి, ఒక ఉద్యమ కర్త, పీడిత జనం తరఫున నిలబడ్డ కథకుడు, ఉపాధ్యాయుడు….రకరకాల రూపాల్లో నా చుట్టూ ప్రత్యక్షమైన అల్లం రాజయ్యలలో కథకుడితో ఇంటర్వ్యూ ఇది.

rajayya-geeta

Qకథా రచయిత కావడానికి దోహదపడిన మీ  తొలి రోజుల గురించి చెబుతారా?

నేను  తెలంగాణాలోని  కరీంనగర్ జిల్లా, మంథని తాలూకా లోని దగ్గరలో ఉన్న మారుమూల గ్రామమైన గాజుల పల్లి లో  పేద రైతు కుంటుంబానికి చెందిన వాడిని. అప్పట్లో  గ్రామాలలో భూస్వామ్య వివక్ష  ఉండేది. పేద వాళ్ల పట్ల చాలా వివక్ష ఉండేది. అంతరానితనం బాగా ఉండేది. మేం మధ్య కులాలకు చెందిన వాళ్లం. మా నాన్న ఊర్లో పెద్దమనుషులలో ఒకరు. సహజంగానే మా ఇంటి ముందు పంచాయితీలు జరిగేవి. వాటి సారాంశమంతా పేద ప్రజల్ని ఎలా అణిచిపెట్టాలనే. ఇవన్నీ చూసి చిన్నతనంలో నాకు బాగా బాధ కలిగేది.  నా మీద చెరగని ముద్ర వేసాయి. మాతో పాటూ పొలాలలో పనిచేసే మనుషులపట్ల వివక్ష అంతా అన్యాయమైందనే భావన కలిగేది.

1965 ప్రాంతం లో నేను అయిదో తరగతి చదివే సమయంలో మా అమ్మమ్మ ఊరుకు వెళ్లాను. అది మా ఊరి కంటే పెద్ద గ్రామం. వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిన గ్రామం. అక్కడే దొరల వ్యవస్థని, అనేక గ్రామీణ వృత్తుల్ని నేను చూసాను.  అక్కడికి వెళ్లాక ఇంకా బాగా అంతరాలకు సంబంధించిన విషయాలు బాగా అర్థం అయ్యాయి. అక్కడి నుంచి మంథనికి హైస్కూలు చదువు కోసం వెనక్కు  వచ్చాను మళ్లీ.
Qస్వయంగా మీరు వివక్షని అనుభవించేరా?
అంతే కదా. నేను వెనక్కు వచ్చే సమయానికి నాకు బాగా ఊహ తెలిసింది. క్లాసులలో మొదలుకుని అన్ని చోట్లా ఒక కులాన్ని, మరొక కులం వాళ్లు వివక్ష గా చూసేవారు. హైస్కూలుకు లో అడుగు పెట్టిన తొలి నాళ్లలోనే ఒక యుద్ధవాతావరణం ఏర్పడింది. మేం గ్రామీణ పిల్లలం దుమ్ము కొట్టిన కాళ్లతో, ఒంటి నిండా వెండి ఆభరణాలతో, జుట్టు తో, వ్యవసాయ పిల్లల్లా, ఎక్కడో అడివి నుంచి వచ్చిన వాళ్లలా కనిపించే వాళ్లం. మమ్మల్ని అంతా విచిత్రంగాచూడడం, ప్రతీ దానికీ అపహాస్యం చేసేవాళ్లు. దాంతో మా హైస్కూల్లో రెండు గ్రూపులుగా ఏర్పడి అస్తిత్వాల కోసం కొట్లాటలు జరుగుతూ ఉండేవి.
అప్పటి భయంకరమైన భూస్వామ్య సమాజాల్లో మనుషుల మధ్య వివక్ష, హింస, దోపిడీ అన్నీ బాగా ఉన్న వ్యవస్థ అది. ఆ క్రమంలో విద్యార్థి నాయకుడిగా ఎదిగిన నేను జూనియర్ కాలేజీ నిర్మాణం కోసం పిల్లలందర్నీ పోగుచేసి చుట్టు పక్కల గ్రామాలన్నీ తిరిగి కర్రల్ని సంపాదించి స్వయంగా పాటుపడ్డాను.1969 లో చివరి హెచ్ ఎస్సీ లో స్కూల్లో జనరల్ సెక్రటరీగా అగ్ర కులాలకు వ్యతిరేకంగా నిలబడి గెలిచాను.

ఇక విద్యార్థి జీవితం ముగిసాక ఉద్యోగాలలో ఎవరు ఉంటున్నారు అనే ఆలోచన మొదలైంది. సహజంగా అన్ని ఉద్యోగాలలోనూ ఆంధ్ర ప్రాంతం వారే ఉండే వారు. అప్పట్లోనే నేను ప్రత్యేక తెలంగాణా ఉద్యమం లో బాగా ఉధృతంగా పాల్గొన్నాను. అందువల్ల మా చదువు కూడా ఒక సంవత్సరం పోయింది. కేవలం విద్యార్థి ఉద్యమం కావడం వల్ల అప్పట్లో ఉద్యమం  పూర్తిగా నిలబడలేకపోయింది. అది కొంత హింసాత్మకంగా మారింది కూడా.

Q
పుస్తకాలతో మీ అనుబంధం గురించి-

అదే వస్తున్నా. ఇక మరో పక్క నా జీవితంలో రచయితగా అంకురార్పణ జరుగుతూ వచ్చింది. ఎనిమిదో తరగతి నుంచీ నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. మా మేనత్త, మా ఇండ్లల్లో ఓరల్ ట్రెడిషన్లో చాలా కథలు చెప్పేవారు. అంతే కాకుండా గ్రామాలలో జానపద కళాకారులు చెప్పే కథల్ని బాగా వినే వాళ్లం. ఎనిమిది లో లైబ్రరీకి మొదటిసారి వెళ్లాను. లైబ్రరీ ఎంతగా ఇష్టమైందంటే దాదాపు హెచ్ ఎస్సీకి వచ్చే సరికి నేను లైబ్రరీలో పుస్తకాలన్నీ  చదివేసాను. అక్కడే రష్యన్ సాహిత్యం, రవీంద్రనాథ్ టాగూర్, బంకించంద్ర , ప్రేం చంద్ ఇలా భారతీయ సాహిత్య కారులే కాకుండా, ప్రపంచ సాహిత్య కారులందరూ రాసిన సాహిత్యాన్ని చదివేసాను.

Qమీరు చదివిన సాహిత్యం ఎలా ప్రభావితం చేసింది?

ఒక పక్క ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, మరో పక్క వ్యక్తిగత జీవితంలో సాహిత్య పరిచయం. ముఖ్యంగా చలం రచనలతో బాగా ప్రభావితమయ్యాను.
సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలనే తపన తో అస్తవ్యస్త, గందరగోళ జీవితం ప్రారంభమైంది. రాజకీయాలు, సాహిత్యమూ మధ్య చదువు వెనక పడిపోయింది.
70 లలో వరంగల్ లో కాలేజీలో చేరాను. చేరాక పునరాలోచన మొదలయ్యింది. చదువైన సంవత్సరం తర్వాత కొంత గందరగోళ పరిస్థితినించి బయటికి వెళ్లాలనిపించి వ్యవసాయం చేసాను. మళ్లీ అక్కడా గిట్టుబాటు ధరలు లేకపోవడం, గ్రామాల్లో ఉండే సంక్షోభం వల్ల మళ్లా బయటికి వెళ్లిపోయాను. ఆనాటి గ్రామీణ సంక్షోభం, బయటి నుంచి వచ్చిన నాగరికతకు చెందిన కొత్తఆలోచనలు, గత జీవితంలోని పరిస్థితుల నించి వరంగల్ కు వెళ్లాను. అక్కడ సాహితీ మిత్రులు కలిసారు. కరీంనగర్ చుట్టు పక్కల పేద ప్రజలకు ఏదైనా న్యాయం జరిగేదుందా అని నిరంతరం ఆలోచన చేసేవాణ్ణి. నేనుచదివిన సాహిత్యంలో ఇతర ప్రాంతాలలో ఉన్న హాయైన జీవితం మా తెలంగాణా ప్రాంతంలో ఎందుకు లేదనే ప్రశ్న వెంటాడేది. 73 ప్రాంతం లో ఒక పక్క ఉద్యమ జీవితంతో బాటూ వివాహ జీవితం ప్రారంభమైంది. వెనువెంటనే నేను ఉద్యోగం వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.  ఆ ప్రయత్నంలో భాగంగా నాకు 75 లో అదిలాబాద్ లో ఉద్యోగం రావడం తో నా ప్రస్థానం కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ కు మారింది.

Qమీ మొదటి కథ “ఎదురు తిరిగితే” గురించి చెప్పండి.

ఎమర్జెన్సీ సమయానికి  గ్రామాలకు వెళ్ళడం, ప్రజల్ని కొంత ఉత్తేజితుల్ని చేసేవాళ్లం. పత్రికలకు కరపత్రాలు రాసేవాణ్ని మొదట. మా ఊరికి పి.వి.నరసింహారావు వచ్చినపుడు ఆ సభలో  ఉన్న ఒక హరిజనుడు ఈ ప్రాంతానికి సంబంధించిన అన్యాయాల గురించి  అడిగిన ప్రశ్నలకు స్పందించి నేను మొట్టమొదట “ఎదురు తిరిగితే” కథని యథాతథంగా పేర్లు కూడా మార్చకుండా రాసేను. ఆ కథలో గ్రామీణ దోపిడీ, అణిచివేత, అసంబద్ధ సంబంధాలు, గ్రామీణ వ్యవస్థ కు సంబంధించి ఒక పరిపూర్ణ చిత్రం అది. తర్వాత “క్రాంతి ” అనే పత్రికను కొద్దిరోజులు నడిపాం. ఇక కరీంనగరలో మిత్రులందరం కలిసి “విద్యుల్లత” అనే పత్రికను ప్రారంభించారు.

Q
మీ రచనా ప్రస్థానం గురించి చెప్పండి.

మిత్రులు “బద్లా”  అనే కథా సంపుటి వేసారు. అది ఆ తర్వాత బాన్ అయ్యింది. అందుకోసం నన్నొక కథను అడిగారు. అప్పటికే నేను కథ రాసినా అందులో చేర్చే సాహసం చెయ్యలేదు. నిజానికి పదోతరగతి నుంచి డైరీలు, కవితలు, కథలు రాసేవాణ్ణి. “ముగింపులు-ముందడుగులు” అని నవల కూడా రాసేను. అప్పటి సాహిత్యం అంటే సుమారుగా మూణ్ణాలుగు వేల పేజీలు రాసి  ఉంటాను. అదంతా గాంధీ ప్రభావంతో రాసిన అహింసా రాతలు. అవన్నీ ఎక్కడా ప్రింట్ చేయించలేదు. కాలక్రమంలో అన్నీ ఎటో పోయాయి. అయితే అలా నాకు రచన అలవాటు అయ్యింది. అయితే నా ప్రాంతపు  ప్రత్యేకత అప్పటికి నా రచనల్లోకి అడుగుపెట్టలేదు.  మొట్ట మొదటగా “ఎదురు తిరిగితే” తో సిసలైన కథా ప్రస్థానం ప్రారంభమైంది.
Qకథల గురించి-

భారతీయ సమాజంలో ఉత్పత్తి విధానంలో ఉండే అమానవీయతని గురించి నేను సిరీస్ ఆఫ్ స్టోరీస్ రాసాను. అందులో మొదటిది మహదేవుని  కల- ఉత్పత్తి విధానంలో ఉత్పత్తికి, వ్యక్తిగత ఆస్తికి వచ్చిన సంఘర్షణ కు రూపం ఆ కథ. రెండోది “మనిషి లోపలి విధ్వంసం”. వ్యవసాయాధార భారతీయ సమాజంలో ఉత్పత్తి విధానం మనిషి లోపల విధ్వంసానికి ఎలా కారకమవుతుందో చిత్రించాను. తర్వాత మధ్యవర్తులు. చదువు భూమి పుత్రుల్ని వేరుచేసి, మరలా వాళ్లనే వాహికలుగా చేసుకుని కింది సెక్షన్లని దోపిడీ చెయ్యించడం.
నీల, కమల కథలు స్త్రీల సమస్యలకు సంబంధించినవి. ఏ సమాజం మారినా స్త్రీ పాత్ర మరలా ఒకటే. అత్యంత అమానవీయ, అప్రజాస్వామికంగా మహిళల్ని చూడడానికి వ్యతిరేకంగా రాసినవి.
ప్రత్యర్థులు- రాజకీయ నాయకులకు  సంబంధించినది. ఒక సమాజంలో ఎందుకు ఒక వ్యక్తి భూస్వామి గానూ, మరొక వ్యక్తి దోపిడీకి గురవుతూ కనిపిస్తాడు. అనేది ప్రశ్న.

చివరిది “అతడు” – ఇలాంటి అమానవీయ సమాజంలో నేడు అన్ని రకాల వైరుధ్యాలను అర్థం చేసుకుని, పరిష్కరించి, ప్రజలను ముందుకు తీసుకుపోయే కార్మిక వర్గ పార్టీ గురించి రాసినది.

ఇక కార్మిక కథలు. బొగ్గు గనులకు సంబంధించిన కథలు అనేకం రాసేను. నాతో రచయితలు అందరి కథలూ కలిపి సమిష్టిగా దాదాపు 50,60  అన్ని రకాల పుస్తకాలు

ప్రచురించేం. నాకు ఉద్యోగం, ఉద్యమం, వ్యక్తిగతం, రచన..ఇలా నాలుగు జీవితాలుండేవి. అన్నీ సమతూకం గా చూసుకుంటూ క్రమంగా  రాసిన కథలన్నీ మొదట ప్రజా తంత్ర లో, తర్వాత ఎక్కువగా సృజన ,అరుణ తార, ఆంధ్ర జ్యోతి  లాంటి అన్ని పత్రికలలో   అచ్చయినాయి.

Qమీ “మనిషి లోపలి విధ్వంసం” కథ అన్ని భారతీయ భాషలలోకి అనువాదం అయ్యింది కదా? ఆ కథ లో ఉన్న గొప్ప ఫిలసాఫికల్ థాట్ గురించి చెప్పండి.

Allam Rajaiah
మాడ్ ఆఫ్ ప్రొడక్షన్  “మనిషిలోపలి విధ్వంసం”. భారతీయ ఉత్పత్తి విధానం మనుషుల్ని వ్యక్తిత్వం లేకుండా ఎందుకు తయారుచేస్తూంది?  ఆత్మహత్యలకు ఎందుకు ప్రేరేపిస్తూంది?
మనిషికి చావు, పుట్టుకలు ఎక్కడి నించి ప్రారంభం అవుతాయి? నా ఉద్దేశ్యంలో మనిషికి చావు పుట్టిన మొదటి సంవత్సరం నుంచే ప్రారంభమవుతుంది. చిన్నతనం నుంచీ వేసే ప్రతి ప్రశ్ననీ సంహరించి రోజూ మనిషిని చంపుతూ ఉంటాం. ముందుగా కుటుంబం ఒక భయంకరమైన యూనిట్, తర్వాత స్కూలు , ఉద్యోగం, ఉత్పత్తి విధానం ఇవన్నీ అంత కంటే  భయంకరమైన యూనిట్లు, కాంపులు. ఇన్నిటిని తప్పించుకుని మనిషి ఎక్కడ బతుకుతాడు? ఒక రోజులో నిర్ణయమవుతుందా మనిషి చావు?  విధ్వంసమనేది ఎక్కడ జరుగుతుందనే కథ”మనిషి లోపలి విధ్వంసం”. ఇది అన్ని భారతీయ భాషల్లోకి ట్రాన్సిలేటయ్యింది.  ఇంటర్నెషనల్ లెవెల్ కు కూడా పోయింది. అలెక్స్ అనే అతను ఈ కథ మీద ఎంఫిల్ చేయడానికి అమెరికా నుంచి వచ్చాడు నా దగ్గరికి.
Qనవలల గురించి-
జగిత్యాల జైత్యయాత్ర 79 లో జరిగిన తర్వాత మొత్తం గ్రామాలలో ఉండే భూమి సమస్య, రైతు కూలీ పోరాటాల సంఘటనలకు ప్రతి స్పందనగా “కొలిమి అంటుకున్నది” నవల రాసేను. ఆ తర్వాత ఊరు, అగ్ని కణం నవలలు. “అగ్నికణం”భూస్వామ్య ప్రాంతంలో మహిళలకు సంబంధించిన మానవీయ జీవితాలకు సంబంధించిన నవల.
ఇక గ్రామాలలో నిర్బంధం వచ్చాక అడవి పరిశీలన మొదలైంది. ఇక అప్పటి నుంచీ ఆదివాసీ కథల్ని రాయడం మొదలుపెట్టాను. చాలా మంది రాసేరు. అందులో భాగంగా నేను, సాహు కలిసి రాసిన పరిశోధనాత్మక నవల “కొమరం భీం”. నా చివరి నవల “వసంత గీతం”. అదంతా సాయుధ దళాల చిత్రీకరణ.

Q
విరసంతో మీ అనుబంధం గురించి చెప్పండి.

రైతు కూలీ సంఘాల ఏర్పాటు, విరసం లో సభ్యత్వం ఇదంతా ఒక ప్రయాణం. ఆ ప్రయాణం లో భాగంగా నేను తెలంగాణా, రాయల సీమ, కోస్తా ఆంధ్ర  జిల్లాలన్నిటి తో పాటు, ఇతర రాష్ట్రాలలో   కూడా తిరుగుతూ ఉండేవాణ్ణి. విరసంలో నేను ఎప్పుడూ సభ్యుడిగానే ఉన్నాను. నేను ప్రధానంగా రచయితను. సమాజంలోని మార్పులని రికార్డు చేసేవాణ్ణి. అందుకే  నేనెప్పుడూ నాయకత్వ సమస్యలకు పోలేదు. ఆ జిల్లాలకు సంబంధించిన అనేక కథలు అంటే రైతుకూలీ సంఘాలు, ఉద్యమాలు-మారేదశలు, సంఘాల్లో వచ్చే సమస్యలు వీటికి సంబంధించిన కథలు రాసేను.

Q
ఎవరికోసమైతే మీరు రచనలు చేసే వారో వాళ్లకు మీ రచనలు చేరేవంటారా?

నా మొదటి రోజుల్లో నేను ఓరల్ ట్రెడిషన్ లో రాసేవాణ్ని గనుక అనేక గ్రామాల్లో అవి చదువుకునే వాళ్లు.
ఎమర్జన్సీ తర్వాత నా మొదటి కథ అచ్చయ్యింది. నేను మా ఊరికి పోతూంటే ఒక చోట ఒక అరవై మంది నిలబడి ఒకతను కథ  చదువుతుంటే వింటున్నారు. అది తీరా చూస్తే నా కథ. అందులో ఉన్న వ్యతిరేకులు నన్ను కొట్టటానికి కూడా సిద్ధమయ్యారు. అలా నా కథ నా మీదనే ఎదురు తిరిగింది కూడా.

కార్యకర్తలకు చెప్పుకోవడానికి వీలైన కథలు కొన్ని రాసాను. అవి ముఖ్యంగా చైనా మొ.న దేశాల్లో ఉద్యమాల పాత్రను తెలియజేసేవి. మేధావి-మూర్ఖుడు-బానిస మొ.న చైనా కథలు  ఇలాంటివి. రైతుకూలీ మహాసభలు జరిగినప్పుడు అప్పటి వరకు జరిగిన అన్ని సంఘటనలూ అర్థంకావడానికి 3 గంటల వ్యవ్యధిలో ప్రదర్శించే పెద్ద నాటకాన్ని రాసేను.
Qసమాజంలో పీడన ఏదైనా మారిందంటారా ఇప్పటికి?
కింది సెక్షన్లలో కొంచెం తిండి దొరుకుతూంది ఇప్పుడు. పీడన రూపం మారినా భయంకరమైన దోపిడీ,హింసా  తగ్గిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఉద్యమాలు, ఎకనామిక్ గ్రోత్, మార్కెట్ వ్యవస్థ లో పెరిగిన స్కిల్డ్ వర్కర్ అవకాశాలు  ఇవన్నీ కారణాలు. ఇక దోపిడీ అన్ని రంగాలకు విస్తరించింది.
Qఆదివాసీ సమాజాలలో ఏదైనా మార్పు వచ్చిందా?

వనరులకు తప్ప ఆ సమాజం దగ్గర మార్కెట్ ఎకానమీకి పనికొచ్చే స్కిల్ లేదు. కనుక వాళ్లను నిజంగా అభివృద్ధి చెయ్యడానికి సంబంధించి మనస్ఫూర్తిగా ఏ సమాజమూ సిద్ధంగా లేదు. ఇప్పుడూ వనరుల దోపిడీ కొనసాగుతూనే ఉంది.  అక్రమ గనులు తవ్వకాల వల్ల నిర్వాసితులయిపోయిన జీవితాలెన్నో. ఆదివాసీ సమాజాలు సామ్రాజ్యవాద వ్యతిరేకంగా సమీకరించబడుతూ ఉన్నాయి. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు.

Qతెలంగాణా రచయితగా మీకు ఎప్పుడైనా ఐడెండిటీ క్రైసిస్  ఏదైనా వచ్చిందా?
లేదు. నాకెప్పుడూ రాలేదు.  ముందుకుపోతున్న జీవితంలో ముందుకు తీసుకెళ్తున్న అనేక మందితో  కలిసి నడవడం పట్ల ఉన్నదృష్టి నా రచనలపట్ల ఎప్పుడూ లేదు నాకు.
ఆచరణ ముఖ్యమైనది.   అదీగాక ఎవరు మంచి కథ రాసినా అది నాదే అన్న భావనకు లోనవుతాను. నాకు తెలిసినంతవరకు సాహిత్యం వ్యక్తిగతమయింది కాదు. అది నా స్వంత ఆస్తి కాదు. అందుకే నాకు సంక్షోభం లేదు.
Q2000 తర్వాత మీరు రచనలు చెయ్యకపోవడానికి కారణం ?
నా వరకు నేను భూస్వామ్య, పెట్టుబడిదారీ, ఉద్యమ సమాజాల్ని చిత్రించాను. 2000 నుండీ ఇప్పటివరకూ జరుగుతున్న ఈ పెను మార్పుల్ని చిత్రించలేదు.
అంతా ఇంకా పరిశీలన చేస్తూ ఉన్నాను. ప్రపంచ విప్లవాల్లో వచ్చిన ఒంటరితనం గురించి రాయాలని అనుకుంటున్నాను.  ఏదో ఒక ప్రక్రియ రోజూ రాస్తాను. కానీ ఫిక్షన్ రాయలేదు.  చాలా మంది రచయితలు రాసిన వాటీకి చేదోడు, వాదోడుగా ఉండడం, చదవడమూ చేస్తున్నాను ఇప్పటికీ.  అవసరమైతే క్లాసులు, చర్చావేదికలు పెట్టడం  మొత్తంగానైతే సాహిత్యం తోనే తిరుగుతున్నా.వీరోచితమైన, విషాద భరిత ఉప్పెన లాంటి  జీవితంలో నడిచొచ్చిన వాణ్ణి. నాకు తప్పకుండా రాయాలనిపిస్తే రాస్తాను ఎప్పుడైనా. రాయాల్సిన అవసరం పడాలి అంతే.

ఇంటర్వ్యూ: కె.గీత

రాజయ్య గారి ఫోటో: అల్లం చందన

 

Download PDF

18 Comments

  • ఉద్యమాలనుండి పుట్టుకొచ్చిన రచయితగా, ఉద్మమాన్ని దిశా నిర్దేశం చేసే సాహిత్య సృజనకారునిగా మా కామ్రేడ్ అల్లం రాజయ్య గారి నుండి ఆయన రాస్తానన్న రచనకై ఆశగా ఎదురు చూస్తూ..

    ఇంటర్వ్యూ చేసిన కె.గీత గారికి కృతజ్నతలతో,,

  • aparna says:

    ఇంటర్వ్యు చాల సూటిగా, స్పష్టంగా ఉందండీ. మీరన్నట్లు నాక్కూడా ఆయనతో మాట్లాడడమే పెద్ద సాహసం లానే అనిపిస్తుంది. చాల విషయాలు తెలిసాయి. థాంక్స్!

  • సాయిపద్మ says:

    చాలా మంచి ఇంటర్వ్యూ .. కధల వెనుక మనిషి, ఆ మనిషి సింప్లిసిటీ అన్నీ కళ్ళకు హత్తుకొనేలా ఉంది. ఉద్యమాల కోసం, ఉనికి కోసం .. రాసే ఎన్నో రాతల్లో .. విప్లవం లోని వొంటరితనం గురించి రాసేవాళ్ళ గురించీ, రాయాల్సిన అవసరం గురించి చెప్పిన గొప్ప కధకులు రాజయ్య గారు. ఇంత మంచి ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు గీత గారూ.. చాలా విషయాలు తెలిసాయి . నాలుగు పార్శ్వాల రాజయ్య గారి జీవితం , తమ ప్రయారిటీస్ తెలుసుకోవాలనుకొనే వారందరికీ ఒక పాఠం..!!

  • dr kakani sudhakar says:

    geetha gariki danyavvadaalu. edurutiriginamanishi ippatiki edurutirukuthune unnadu kani bathuku maraledu.rajaiah gari sahiti prasthanam telusukovadam anamdamgaundi

  • kurmanath says:

    ఈ కాలపు గొప్ప రచయిత. మన హృదయాల్ని నలిపేస్తున్న, మన బతుకుల్ని చిదిమేస్తున్న హింస మూలాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకుని, మన జీవితాల్ని, పోరాటాల్ని కథలుగా అనువదిస్తున్నమహా రచయిత రాజయ్య. అతనితో గడపడం గొప్ప సంతోషాన్నిచ్చే అనుభవం.

  • srinivas vemula says:

    గీత గారు,
    చాలా థాంక్స్ ఫర్ ది ఇంటర్వ్యూ. రాజయ్య గారి గురించి మరియు అయన రచనల గురించి చాలా విషయాలు తెలిసాయి.

    శ్రీనివాస్ వేముల
    హైదరాబాద్

  • అల్లం రాజయ్య గారితో ముఖాముఖి అందించినందుకు ధన్యవాదాలండీ గీత గారు. చదువుతున్నట్లు అనిపించలేదు. ఆయనతో మాట్లాడుతున్నభావన కలిగింది. చిరపరిచుతులైన రాజయ్య గారి గురించి మరిన్ని విషయాలు తెలిశాయి. ఆయన కలం నుండి పురుడు పోసుకునే కొత్త రచనల కోసం ఎదురు చూస్తుంటా.

  • రవి says:

    చాలా బాగుందండి. శాంతి గారు అన్నట్టు రాజయ్య గారితో ఆత్మీయంగా మాట్లాడినట్టే ఉంది.

  • 1990లలో కారా మాస్టారు కొన్ని సంకలనాలు ప్రచురించారు. ఆ సంకలనంలో రాజయ్యగారి రచన నాకు మొదటిగా పరిచయం. అనవసరమైన అలంకారాలేమీ లేని ఒక నిరాడంబరమైన శైలితోనే ఆయన సమాజంలోని బీభత్సాన్ని వ్యక్తి మనస్తత్వంలో బీభత్సంగా ప్రతిబింబించడం నాకు గొప్ప ఆశ్చర్యం కలిగించింది. అటుపైన ఆయన కథలు మరి కొన్ని చదివాను. ఉద్యమం, విప్లవం, ఆవేశమే కాకుండా, అసలిదంతా ఎందుకు అనే తాత్త్విక ఆలోచన కనిపిస్తుంది ఆయన కథల్లో. బహుశా 90 ల తరవాత పరిణామాలలో ఆ తాత్త్వికతకి దిక్కుతోచకనేమో ఆయన రాయడం లేదు? మళ్ళీ రాస్తారని ఆశిద్దాం. చక్కటి ఇంటర్వ్యూనందించిన గీతగారికి ధన్యవాదాలు.

  • K.Geeta says:

    ఇంటర్వ్యూ చదివి స్పందించిన మీ అందరికీ కృతజ్ఞతలు-
    రాజయ్య గారితో మాట్లాడడం మరిచిపోలేని ఒక గొప్ప ఇన్స్పిరేషన్ & ఎడ్యుకేషన్.
    రాజయ్య గార్కి ప్రత్యేక కృతజ్ఞతలు-
    -కె.గీత

  • KALARAVI says:

    hi geeta
    good interview

  • bhasker says:

    చాలా మంచి కథకుడితో ఇంటర్వ్యూ. ఒక్క గుక్కలో చదివానంటే నమ్ముతారా, గీత గారూ!? మీ రచనా శైలి అలా ఉంటుంది మరి. రాజయ్య గారిని ఇంటర్వ్యూ చేసేందుకు భయపడ్డానని రాసారు. మీరు నిజంగా అర్హులు.
    రాజయ్య గార్ని చూడడం, చదవడం నిజంగా ఓ గొప్ప ఎడ్యుకేషన్.
    అప్పట్లో, సృజనలో అల్లం సోదరుల రచనలు విరివిగా వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఓ పాఠకుడు చమత్కరించాడు ‘ సృజన సృజనంతా అల్లం వాసన వేస్తుందని’!
    అల్లం ఘాటా! మరి మజాఖానా !
    హాట్స్ ఆఫ్ టు యు , గీత గారూ..!

  • ఇటీవల రాయకపోవడానికి కారణాలను రాజన్న నుంచి రాబడితే బాగుంటుంది. ఇది ముఖ్యమైన విషయమని నేననుకుంటున్నాను. ఆయన ఎక్కడా ఈ విషయంపై పూర్తిగా మనసు విప్పినట్టు కనపడదు. రఘోత్తమ్‌రెడ్డిగారు రాయకపోవడానికి కారణాలు కొంతలో కొంత తెలుస్తున్నాయి. రాజన్న ఆ మాత్రం కూడా బయటపడకుండా వస్తున్నారు. ఆయన పెనుమార్పులని వేటిని అనుకుంటున్నారో, వేటిని పరిశీలిస్తున్నారో, ప్రపంచ విప్లవాల్లో ఒంటరితనం అని దేన్ని అంటున్నారో తెలుసుకోవడం అవసరం. ఈ మూడింటి మధ్య సంబంధమున్నదా లేదా అనేది కూడా తెలుసుకోవాలని ఉంది. సీనియిర్‌ రచయితగా సీరియస్‌ రచయితగా ఆయన వర్తమాన పరిణామాలపై వివరంగా మాట్లాడితే బాగుంటుంది.

  • allam rajaiah says:

    నా పుస్తకాలు
    పర్స్పెక్టివ్ పబ్లికేషన్స్ ,హైదరాబాద్ వారు ఆరు సంకలనులుగా ప్రచిరిస్తున్నారు
    ఇంతవరకు వచినవి
    అల్లం రాజయ్య నవలలు
    సృష్టికర్తలు-కథలు
    కొమురం భీమ-ఆదివాసి నవల
    అచులో
    వసంత గీతం-నవల
    ఇంకా రెండు కతసంకలనలు
    ,

    వసంత గీతం-నవల

  • sreenvas chandragiri says:

    Geetha garu thanks for the vivacious interview..

  • Pentaiah veeragoni says:

    Nenu meeto bhavaalu panchukuntaanu

  • BasithMA says:

    Rare angle…

  • BasithMA says:

    Rajaiah gaaru 2000 taruvaata aDapA,daDapA raastunna ràast7nnaTTi rachanalu pradhAnaMgA ‘pIDita kulaala saMkshObhaM’, ‘vaariki vimukti eMduku saadhyaM kaavaTa ledani’ anipistOMdi.
    BahuSA…. ippuDu mariMtagA A diShalO raastaaranukuMTa…
    _baasit.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)