వీలునామా – 7వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

పాత ఉత్తరాలు

ఫ్రాన్సిస్ ఎడిన్ బరో వొదిలి ఎస్టేటులో వుండడానికి వొచ్చే రోజు ఎల్సీ తల నొప్పిగా వుందని తన గదిలోనే పడుకుంది. జేన్ అతన్ని సాదరంగా ఆహ్వానించి, బంగళా, తోట అంతా తిప్ప్పి చూపించింది. నౌకర్లందరినీ పరిచయం చేసింది. వీలైతే వాళ్ళని పనిలో వుంచుకోమని సలహా కూడ ఇచ్చింది. అంతే కాదు, జేన్ ఇంతకు ముందు వృధ్ధులైన పనివాళ్ళకి పన్లోకి రాకపోయినా, ఎంతో కొంత సొమ్ము ముట్టచెప్పేది, పెన్షన్ లాగా. ఆ సంగతి కూడా చెప్పిందతనితో.

ఆమె మాటలన్నీ శ్రధ్ధగా విన్నాడు ఫ్రాన్సిస్. తను కూడా అలాగే కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు.

ఎస్టేటంతా తిరిగి చూసి అక్కడ ప్రకృతి సౌందర్యానికి పరవశించిపోయాడు నగరవాసి అయిన ఫ్రాన్సిస్.

“ఇదంతా వొదిలి వెళ్ళాలంటే నువ్వు పడే బాధ నాకర్థమవుతుంది జేన్,” అన్నాడు.

“ఉమ్మ్మ్….నిజం చెప్పాలంటే, ఫ్రాన్సిస్, నాకు ఇల్లూ తోటా కంటే, ఇదిగో ఈ రెండిటినీ వొదిలి వెళ్తున్నందుకు ఎక్కువ దిగులుగా వుంది,” అంటూ రెండు అందమైన గుర్రాలని చూపించింది.

“నేనూ ఎల్సీ, ఎప్పుడూ ఈ రెండిటి మీదనే స్వారీ చేసే వాళ్ళం. ఫ్రాన్సిస్, ఈ గుర్రాలనీ, కుక్కలనీ, దయగా చుస్తానని నాకు మాటిస్తావా? వాటిని నేనూ, ఎల్సీ ఎంతో ప్రేమతో పెంచుకున్నాం. పట్టణంలో పెరిగిన నీకు జంతువుల మీద ఎలాటి అభిప్రాయం వుంటుందో మరి,” సందేహంగా అంది జేన్.

“నువ్వన్నది నిజమే జేన్. నేను ఎప్పుడూ జంతువులని పెంచి, ప్రేమించలేదు. అసలు నాకొక్కడికే తిండి సరిపోయేది కాదు. అయినా, నీ మాట ఏదీ నేను కాదనను. అసలు మనిద్దరి పరిచయం ఇలా కాకుంటే ఎంత బాగుండేది. ఇంత జరిగినా నీకు నామీద ఎలాటి కోపమూ లేదన్నదొక్కటే నాకు తృప్తి. చాలా మంది వకీళ్ళని కలిసి వీలునామా చూపించాను, ఏదైనా ఒక దారి కనబడి మీకిద్దరికీ సహాయం చేద్దామని. ఇంత డబ్బు కంటే మా నాన్నగారు నాక్కొంచెం ప్రేమ ఇచ్చి వుంటే నేనెక్కువ సంతోషపడి వుండే వాణ్ణి. ఆ సంగతే ఆయనకు తట్టలేదు,” అన్నాడు ఫ్రాన్సిస్ ఆవేదనగా.

“ఫ్రాన్సిస్! ఈ ఎస్టేటూ, ఆస్తి పాస్తులూ నీ చేతుల్లో సురక్షితంగా వుంటాయి. నాకా నమ్మకం వుంది. నిజానికి, నేను సంవత్సరాల తరబడీ నేర్చుకున్నదొక యెత్తయితే, కిందటి నెలరోజులలో నేర్చుకున్నదొక యెత్తు. ఎప్పుడు లేనిది నేను మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల గురించి ఆలోచించాను! పొట్ట పోసుకోవడం అంత తేలికైన విషయం కాదని ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది నాకు. కష్టపడి పని చేసేవాళ్ల మీద గౌరవం పెరిగింది. ఫ్రాన్సిస్! ఒక్కటే సలహా ఇస్తాను నీకు! పాత జీవితాన్నెప్పుడూ మరచిపోవద్దు. “నడ మంత్రపు సిరి” అని నిన్నెవరూ వెక్కిరించే పరిస్థితికి వెళ్ళకుండా వుండు. నేనన్న మాటలు నిన్ను నొప్పిస్తే క్షమించు!”

“జేన్! పాత జీవితం గుర్తున్నా లేకపోయినా, నీ మాటలు మాత్రం తప్పకుండా గుర్తుంటాయి,” నవ్వాడు ఫ్రాన్సిస్.

“ఆ రోజు మీ వూళ్ళో చర్చిలో ఫాదరు చెప్పిన ఒక్క మాట నేనూ మర్చిపోనూ!”

“ఏమిటది?”

“అంతా మన మంచికే నన్న మాట. దేవుడు ఏది చేసినా మన మంచి కొరకే నన్న మాట. వుదాహరణకి, మావయ్య ఇలా వీలునామా రాయలేదనుకో! ఏం జరిగి వుండేదో తెలుసా?”

“ఏమిటి?” కుతూహలంగా అడిగాడు ఫ్రాన్సిస్.

“డబ్బు కోసమే నా చుట్టూ తిరిగిన వాణ్ణి, నేనేమాత్రమూ గౌరవించలేని వాణ్ణి వివాహమాడి వుండెదాన్ని.”

ఫ్రాన్సిస్ నివ్వెరపోయాడు.

“అంటే…”

“అంత బాధ పడటానికేమీ లేదిందులో, ఫ్రాన్సిస్.”

“అంటే, నా వల్ల నువ్వు నిలవనీడా, పెళ్ళాడే అవకాశమూ అన్నీ పోగొట్టుకున్నావన్నమాట! బాధ పడకుండ ఎలా వుంటాను జేన్!”

“అబ్బే! అలా కాదు! నేనతనికి నేనున్న పరిస్థితి వివరించాను, ఇద్దరమూ విడిపోవాలని నిశ్చయించుకున్నాం, అంతే!”

“ఎల్సీ పెళ్ళి సంగతి?”

“మేమింకా దాని గురించి ఆలోచించలేదు. అదిప్పుడు కవితా ప్రపంచంలో మునిగి వుంది. ఎలాగైనా కవితల పుస్తకం ప్రచురించి, మా ఇద్దరికీ జీవనోపాధి వెతకాలని దాని తాపత్రయం.”

“అవునా? అదీ మంచిదే.”

“అవును కానీ ఎల్సీ విమర్శ తట్టుకోలేదు. విమర్శని తేలిగ్గా తీసుకోని మనిషి కవితా సంకలనాలేం వేయిస్తుంది చెప్పు?”

“ఫర్వాలేదు జేన్. కొంచెం సున్నిత మనస్కురాలంతే. నాకు కవిత్వం తెలుసన్న సంగతి తనతో చెప్పకు! మామూలుగా చదివి బాగున్నదీ లేనిదీ నీతో చెప్తాను. నీ సంగతేమనుకుంటున్నావు?”

“నాకు ఎల్సీ బాధ్యత లేకపోయినట్లయితే ఏవరైనా ధనవంతుల ఇంట్లో ఇంటి వ్యవహరాలు చూసే హౌస్ కీపరుగా వుద్యోగం వెతుక్కునేదాన్ని. కానీ, ఎల్సీని ఒంటరిగా వొదిలి వెళ్ళడం నాకిష్టం లేదు. ఏదేమైనా, రేపు ఇద్దరమూ ఎడిన్ బరో వెళ్తున్నాము. అక్కడ ఒక స్నేహితురాలి ఇంట్లో చిన్న గది అద్దెకు తీసుకుంటున్నాం.అన్నట్టు, ఇక్కడ మా ఇద్దరి గదుల్లో వున్న సామాను మేం తీసుకోవచ్చన్నారు. కానీ, అక్కడ చిన్న గదిలో ఈ సామానంతా పట్టదు. ఇంకో ఇల్లూ అద్దెకు తీసుకునేంతవరకూ ఏవో కొన్ని ముఖ్యమైనవి తప్ప, చాలా వరకు ఇక్కడే వుంచి వెళతాను. నీకేమైనా అభ్యంతరమా?”

“లేదు లేదు! ఇక్కడే వుంచుకో. గదులకి తాళాలు కూడా వేయిస్తాను, భద్రత కోసం.”

“తాళాలు వేసుకు వెళ్ళేంత అపనమ్మకం నాకు నీ మీద లేదు ఫ్రాన్సిస్. అంతే కాదు, అన్ని గదులూ అప్పుడప్పుడూ కిటికీలూ, తలుపులూ తెరిచి శుభ్రం చేయిస్తూ వుండలి.”

“సరే, అలాగే. ఎడిన్ బరో లో నువ్వు అద్దెకు తీసుకున్న గది ఎక్కడ?”

ఆ వీధి పేరూ, ప్రాంతం పేరూ చెప్పింది జేన్.

“అరే! ఆ ప్రాంతం నాకు బాగా తెలుసు. నేనక్కడ కొన్నాళ్ళున్నా కూడా!”

“అవునా? మీ అమ్మగారు ఎక్కడ వుండేవారు? ఆవిడ ఙ్ఞాపకం వుందా నీకేమైనా?”

“లేదు జెన్. అయితే ఎడిన్ బరో కంటే ముందు నేనింకెక్క డో వున్నట్టు లీలగా గుర్తుంది. అది మా అమ్మతోనేనో కాదో అంత బాగా గుర్తు రావడం లేదు.”

“ఆవిడ బ్రతికి వుందంటావా?”

“వకీలు గారైతే అవుననే అంటారు. ”

“ఏమో మరి! బ్రతికి వుండీ నిన్ను కలుసుకునే ప్రయత్నం చేయకుండా వుంటుందా? అలాటి తల్లి వుంటుందా ఎక్కడైనా?”

“ఆవిడ పరిస్థితి ఏమిటో! ఆవిడకీ మా నాన్నగారికీ మధ్య సంబంధాలు ఎలా వుండేవో! అయితే, ఆవిడకి సహాయం అవసరమైతే నేను సాయపడొచ్చని వుంది విల్లులో! కానీ, వకీలు గారు నన్ను ఆవిడ కోసం వెతకొద్దని సలహా ఇచ్చారు!”

“నువ్వు ఆస్తి పరుడవైన విషయం తెలిస్తే, ఆవిడే నిన్ను వెతుక్కుంటూ రావొచ్చు కదా!”

“ఒకసారి నాన్నగారి పాత ఉత్తరాలు వెతికితేనో? వకీలు గారు నాకు ఆయన పెట్టె తాళాలు ఇచ్చారు. ఇద్దరం కలిసి ఒక్కసారి ఆయనకి సంబంధించిన కాగితాలన్నీ చూద్దామా? ఎక్కడైనా నాకు మా అమ్మ ఆచూకీ దొరుకుతుందేమో!”

“సరే పద!”

ఇద్దరూ దాదాపు రెండు గంటలు కాగితాలన్నీ చూసారు. ఎక్కడా ఫ్రాన్సిస్ జన్మ వృత్తాంతం కానీ, అతని తల్లిని గురించిన సమాచారం కానీ దొరకలేదు. ‘ఫ్రాన్సిస్ స్కూలు ఫీజులు’ అనే ఫోల్డరులో కొన్ని బిల్లులు మాత్రం దొరికాయి.

ఎవరో స్త్రీ చేతి రాతతో ఫ్రెంచిలో వున్న ఒక వుత్తరాల కట్త కూడా దొరికింది. కుతూహలంగా ఉత్తరాలు తెరిచారు. అన్నీ ఫ్రెంచి లో వున్నాయి.

“నాకు ఫ్రెంచి బాగా వచ్చు. ఇటివ్వు, నేను ఉత్తరాలు చదివి విషయాలు చెప్తాను!” ఉత్తరాలు తీసుకొంది జేన్.

మార్గరెట్ అనే ఫ్రెంచి స్త్రీ కొన్ని సంవత్సరాల పాటు హొగార్త్ కి రాసిన ఉత్తరాలు అవి.

“….ఫ్రాన్సిస్ స్కూల్లో బాగా చదువుతున్నాడని తెలిసి సంతోషించాను. ఇప్పటికైనా ఆ పసివాణ్ణి నువ్వు ప్రేమించగలిగితే మంచిది. మా వాడు ఆర్నాల్డ్ ఎంత తెలివైన పిల్లాడనుకున్నావ్? క్లెమెన్స్ కూడా అంతే. స్కూల్లో అంతా వాళ్ళిద్దర్నీ తెగ మెచ్చుకుంటారు…” ఇక మళ్ళీ ఆ వుత్తరంలో ఫ్రాన్సిస్ ప్రసక్తి లేదు.

ఆ తర్వాత అన్ని వుత్తరాలూ ఓపిగ్గా చదివారు. ఎక్కడా ఫ్రాన్సిస్ ప్రసక్తే లేదు. ఆవిడెవరో కానీ, స్నేహంగా, అభిమానంగా, ఆప్యాయంగా రాసినట్టనిపించింది. ఆవిడ వుత్తరాలని బట్టి ఆవిడ ఒక వితంతువనీ, ఇద్దరు పిల్లలతో ఒంటరిగా బ్రతుకుతోందనీ అర్థమైంది వాళ్ళకి.

ఆవిడ ఉత్తరాల నిండా తన పిల్లల ముద్దూ మురిపాలు, తన వ్యాపారం విషయాలూ, వున్నాయి. పిల్లలక్కూడా హొగార్త్ తెలిసినట్టే వుంది. ఆవిడకి చాలా చిన్నప్పుడే పెళ్ళైనా, ఆ పెళ్ళి వల్ల పెద్దగా సుఖపడినట్టు లేదు.

అన్నిటికంటే ఆసక్తికరమైన వుత్తరం చివరికి కనబడింది. అప్పుడే బహుశా హొగార్త్ తన మేనకోడళ్ళని పెంచుకోబోతున్నట్టు చెప్పి వుంటాడు.

“… పోన్లే! నువ్వెందుకనో ఫ్రాన్సిస్ ని సొంత బిడ్డలా ప్రేమించలేకపోతున్నావు. ఈ అమ్మాయిలని ప్రేమగా పెంచుకొంటే నీ ఒంటరితనం తగ్గొచ్చు. మనిషన్నవాడికి ప్రేమతో కూడిన బంధాలు తప్పకుండ వుండాలి. లేకపోతే జీవితం మిద ఆసక్తి పోతుంది.

నాకూ, ఆర్నాల్డ్, క్లెమెన్స్ ల ప్రేమ లేకపోతే జీవితం ఎంత అససంపూర్తి, అనిపిస్తూ వుంటుంది. నేను వాళ్ళని ఎప్పుడు ఫిలిప్ పిల్లలుగా అనుకోలేదు. అనుకుని వుంటే వాళ్ళని ప్రేమించగలిగే దాన్ని కాదు. నువ్వేమో, ఫ్రాన్సిస్ తల్లి మీద వున్న అయిష్టాన్ని ఆ పసి వాడి మీద చూపిస్తున్నావు. ఎవరికి తెలుసు? నీ మేన కోడళ్ళిద్దరి పెంపకంతో నీ మనసు మెత్తబడి నీ కొడుకునీ చేరదీస్తావేమో! అలా జరిగితే నాకంటే ఎక్కువగా సంతోషించే వాళ్ళుండరు!

మీ చెల్లెలు మేరీ మరణం గురించీ, ఆమె మరణించిన పరిస్థితులను గురించీ ఎంతో ఆవేదనతో రాసావు. చదివి చాలా బాధ పడ్డాను. అమ్మా నాన్నలు కుదిర్చిన పెళ్ళి చేసుకుని నేనెంత కష్టపడ్డానో, ఇష్టపడ్డ మనిషిని పెళ్ళి చేసుకొని మేరీ అంతే కష్టపడింది.

నాకు మా అమ్మా-నాన్నా ఈ పెళ్ళి నిశ్చయం చేసినప్పుడు వొద్దని నేనెంత ఏడ్చానో నాకింకా గుర్తే. ఈ పెళ్ళిలో వాళ్ళసలు నా ఇష్టాయిష్టాల ప్రమేయమేమీ లేదన్నట్లు ప్రవర్తించారు. అయితే, నా పెళ్ళిలో ఒక్క సుగుణం వుంది. ఈ పెళ్ళి గురించి నాకే కలలు లేకపోవడం మూలాన ఆ కలలు విఫలమై మనసు ముక్కలయే అనుభవం నాకు కాలేదు, మేరీకిలా.

నేను చాలా సార్లు ఆలోచించాను, మనలని ఎక్కువగా నొప్పించే శక్తి మనల్ని ప్రేమించే వాళ్ళకుందా, లేక మనల్ని ద్వేషించే వాళ్ళకుందా అని. ఇప్పుడనిపిస్తోంది- ఎవరికీ కాదు, మనల్ని నొప్పించుకునే శక్తి అందరికంటే మనకే ఎక్కువగా వుంది, అని. మేరీ తన కలలన్నీ నేల కూలిపోతూంటే నిస్సహాయురాలిలా చూస్తూండి పోయింది. నేనేమో బ్రతుకుతో అడుగడుగునా పోరాటం చేస్తూనే వున్నాను. నువ్వేమో ఒక చిన్న పొరపాటు వల్ల అందమైన కుటుంబ జీవితానికి దూరమై పోయావు. ఇతర్లు చేసిన హాని నించి మనకి సహాయం చేయడానికి చట్టలూ, న్యాయ వ్యవస్థా వుంది కదా? అలాగే మనుషులని తమ నించి తాము కాపాడుకోనెటట్లు చేసే న్యాయ వ్యవస్థ వుంటే ఎంత బాగుండేది కదూ? అప్పుడు మన ముగ్గురం ఇలా వుండేవాళ్ళం కాదు!

ఇప్పుడైతే నా ఆశలన్నీ పిల్లల మీదనే పెట్టుకున్నా! నా బ్రతుక్కంటే క్లెమెన్స్ బ్రతుకు సంతోషకరంగా వుంటే నాకంతే చాలు!

నా ఇష్ట ప్రకారమే పెళ్ళి చేసుకోమని దాన్నెప్పుడూ బలవంత పెట్టను. తెలివైన వాళ్ళని కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోనివ్వకపోతే యేలా? మీ ఇంగ్లీషు వాళ్ళలో లోపమేంటో తెల్సా? ఆడపిల్లలకి నిర్ణయాలు తీసుకొనే స్వతంత్రం వుంది కానీ, అలా నిర్ణయాలు తీసుకోవడానికి కావల్సిన శిక్షణ మాత్రం లే దు. ఇప్పుడు నాకు ఎక్కడ పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లల్ని చూసినా అదొకలాంటి భయం వేస్తుంది.

నీ మేన కోడ ళ్ళిద్దర్నీ చదివించు! వాళ్ళు మానసికంగా, శారీరకంగానూ దృఢంగా వుండేటట్లు శిక్షణ ఇప్పించు. వాళ్ళ అమ్మకంటే ఎక్కువ లోక ఙ్ఞానం వచ్చేలా తీర్చి దిద్దు.

కుటుంబంలో శాంతీ, చదువుకునే వసతీ వుంటే చాలు, ఆడపిల్లలు ఏదైనా నేర్చుకోగలరూ, ఎక్కడైనా నిలదొక్కుగోలరు. ప్రేమా, పెళ్ళీ,సంతోషమూ, అంటావా? అవి వాళ్ళు వాళ్ళ ఙ్ఞానాన్నీ, తెలివితేటల్నీ, స్వతంత్ర్యాన్నీ ఉపయోగించుకోవడాన్ని బట్టి వుంటుంది. ఆపైన కొంచెం అదృష్టం కూడా కల్సి రావాలనుకో!

కానీ వాళ్ళకు చదువులు చెప్పించకుండా, అందమైన బొమ్మల్లా తయారు చేస్తే మాత్రం వాళ్ళు బాధ్యత ఎప్పటికీ తెలుసుకోరు. అందుకే నా మాట విని వాళ్ళిద్దరికీ మగపిల్లల్లాగే చదువులు చెప్పించు. అమాయకత్వానికీ, అఙ్ఞానానికీ చాలా తేడా వుంది. అందుకే కొంచెం ప్రపంచ ఙ్ఞానం అవసరం. దానికి చదువొక్కటే మార్గం.

జేన్ అంతా నీ పోలికే ననీ, ఎల్సీ తన తల్లి పోలికనీ రాసావు. పిల్లల కబుర్లు నీ ఉత్తరాల్లో చదివి చాలా ఆనందిస్తాను. నీతో చెప్పానో లేదో కానీ ఈ మధ్య క్లెమెన్స్ చిన్న చిన్న అబధ్ధాలాడటం నేర్చుకుంటోంది. దానికి ఎవర్నీ నొప్పించడం ఇష్టం వుండదు. అందుకే చిన్న చిన్న అబధ్ధాల సహాయంతో ఇరుకున పెట్టే సంఘటనలనించి తప్పించుకోవాలనుకుంటుంది. అయితే మనిషన్న తర్వాత నొప్పిని భరించటం నించీ, నొప్పి కలిగించటం నించీ సంపూర్తిగా తప్పించుకోలేమని చెప్పాను. నొప్పించినా సరే, అవసరమైతే చేదు మందు తాగించక తప్పదు కదా!

కిందటి వారం, ఒక రోజు ఆర్నాల్డ్ అల్లరి చేస్తూ హాల్లో పూల కుండీని పగల గొట్టాడు. నాక్కోపం వస్తుందని భయపడి, క్లెమెన్స్ అన్నని రక్షించటానికి, తానే ఆ కుండీని పగలగొట్టానని అంది. కానీ దానికి నిజాన్ని నా దగ్గర ఎక్కువ సేపు దాచే చాకచక్యం లేకపోయింది. అబధ్ధమాడినందుకు మందలించాను.

“అమ్మా! ఆర్నాల్డ్ మీద నీక్కోపం వస్తుందనీ, ఆ కోపాన్ని వాడు తట్టుకోలేడనీ భయ పడ్డాను. అందుకే అబధ్ధమాడాను! అన్నకి కూడా సంతోషమే కాదా?” అంది క్లెమెన్స్.

“లేదు క్లెమెన్స్! మామూలు మనుషులు వాళ్ళు చేసే పనుల పర్యవసానాలు భరించగలిగే వుంటారు. కుండీ పగలగొట్టేటప్పుడు ఆర్నాల్డ్ కి నాక్కోపం వస్తుందనీ తెలుసు, దాన్ని తను తట్టుకోక తప్పదనీ తెలుసు. తమకోసం పక్క మనిషి అనవసరమైన త్యాగాలు చేయడం ఎవరికీ ఇష్టం వుండదు. కాబట్టి అలాటి అలవాటు మానుకో. భవిష్యత్తులో నిజంగా నువ్వు ఇతర్ల కోసం ఇష్టాలని వదులుకోవాలసిన తరుణాలు రాక తప్పదు. అయితే అలాటి సమయాల్లో కూడ, నిజాన్ని మాత్రం దాచకు”, అని చెప్పాను.

వీలైనంతవరకూ వాళ్ళిద్దరూ స్వతంత్రంగా ఆలోచించుకోవడమే అలవాటు చేస్తున్నాను. ఎందుకంటే నేనింక ఎక్కువ రోజులు బ్రతకనని అనిపిస్తోంది! ఒక్కసారి పిల్లలిద్దర్నీ తీసుకొని రావొచ్చుగా నువ్వు? క్లెమెన్స్, ఆర్నాల్డ్ ఇద్దరికీ నేను నీ మేనకోడళ్ళ గురించి చెప్పాను. కలుసుకోవాలని కుతూహలంగా వున్నారు. వీలైతే వాళ్ళను తీసుకొని ఒక్క సారి రా.

వుండనా,

మార్గరెట్

 

ఆ వుత్తరం వెనక హొగార్త్ గారి చేతి రాతలో “మార్గరెట్- మరణం- డిసెంబరు 18, ” అని వుంది. అంటే ఆ వుత్తరం రాసిన కొన్నాళ్ళకే మార్గరెట్ మరణించిందన్నమాట.

“మావయ్య ఈ వుత్తరాలు నాకు చూపించి వుంటే బాగుండేది. కొన్ని విషయాలు ఎవరితోనూ పంచుకోలేం కాబోలు!” జేన్ అంది బాధగా.

“మా అమ్మ గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు. ఆమెకోసం మనం వెతికి ప్రయోజనం వుండదు. ఆ విషయం వదిలేద్దాం లే జేన్!” ఫ్రాన్సిస్ అక్కణ్ణించి నిరాశగా లేచాడు.

Download PDF

2 Comments

  • Radha says:

    శారద గారూ, చాలా మంచి నవలని మా కోసం అందిస్తున్న మీకు ధన్యవాదాలు. నవలలోని ఈ క్రింది వాక్యాలు ప్రతి ఒకరూ రాసిపెట్టుకో తగినవి కదా!
    “నేను చాలా సార్లు ఆలోచించాను, మనలని ఎక్కువగా నొప్పించే శక్తి మనల్ని ప్రేమించే వాళ్ళకుందా, లేక మనల్ని ద్వేషించే వాళ్ళకుందా అని. ఇప్పుడనిపిస్తోంది- ఎవరికీ కాదు, మనల్ని నొప్పించుకునే శక్తి అందరికంటే మనకే ఎక్కువగా వుంది”
    “తమకోసం పక్క మనిషి అనవసరమైన త్యాగాలు చేయడం ఎవరికీ ఇష్టం వుండదు. కాబట్టి అలాటి అలవాటు మానుకో. భవిష్యత్తులో నిజంగా నువ్వు ఇతర్ల కోసం ఇష్టాలని వదులుకోవాలసిన తరుణాలు రాక తప్పదు. అయితే అలాటి సమయాల్లో కూడ, నిజాన్ని మాత్రం దాచకు”

  • శారద says:

    రాధ గారూ,
    చాలా ధన్యవాదలు.
    నిజానికి ఈ నవల అనువాదం నేనెక్కువగా ఎంజాయ్ చేస్తున్నాను. ఒక వంద ఏళ్ళ కింద యూరోపు లో ఆడవాళ్ళ పరిస్థితికి నాకు ఆశ్చర్యమూ, బాధా కలిగాయి ఈ నవల చదువుతూంటే.
    ముందు ముందు భాగాలు కూడ నచ్చుతాయని ఆశిస్తాను.
    శారద

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)