అవన్నీ ‘చెప్పినవే’ తప్ప ‘రాసినవి’ కాదు!

 Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)పాదబద్ధోzక్షరసమః తంత్రీలయసమన్వితః

శోకార్తస్య ప్రవృత్తోమే శ్లోకో భవతు నాన్యథా

శిష్యుడు భరద్వాజుడితో కలసి వాల్మీకి తమసానదికి స్నానానికి వెళ్ళాడు. అంతకుముందే ఆయన నారదుని నోట  సంక్షిప్తంగా రామాయణ కథ విన్నాడు. దానినే భావన చేస్తున్నాడు. స్నానానికి దిగబోతుండగా క్రౌంచ పక్షి జంట కనిపించింది. మగపక్షి కామపరవశస్థితిలో ఉంది. అంతలో ఒక కిరాతకుడు బాణం వేసి దానిని నేలకూల్చాడు. ఆడపక్షి శోకించసాగింది. వాల్మీకిలోనూ కరుణశోకాలు ఉబికివచ్చాయి. అప్రయత్నంగా ఆయన నోట కొన్ని మాటలు వెలువడ్డాయి:

మా నిషాద ప్రతిష్ఠామ్ త్వ మగమ శ్శాశ్స్వతీస్సమాః

యత్ క్రౌంచ మిథునా దేకమ్ అవధీః కామమోహితమ్

(ఓ కిరాతుడా! క్రౌంచ మిథునంలో కామపరవశంగా ఉన్న ఒక పక్షిని చంపావు. అందువల్ల నువ్వు ఎక్కువ కాలం జీవించవు [శాశ్వతంగా అపకీర్తిని మూటగట్టుకుంటావు])

ఆశ్చర్యపోయిన శిష్యుడు అప్పటికప్పుడు ఆ మాటల్ని కంఠస్థం చేశాడు. స్వయంగా వాల్మీకికీ ఆ మాటలు విస్మయం కలిగించాయి. నేను ఏం పలికానన్న ఆలోచనలో పడ్డాడు. ” చూశావా, నేను పలికిన ఈ మాటలు సమాక్షరాలతో పాదబద్ధంగా ఉన్నాయి. వాద్యయుక్తంగా, లయబద్ధంగా పాడుకోడానికి వీలుగానూ ఉన్నాయి. శోకార్తితో నేను అన్న ఈ మాటలు శ్లోకమే తప్ప మరొకటి కావు” అని శిష్యుడితో అన్నాడు.

ఆశ్రమానికి తిరిగి వెళ్ళిన తర్వాత కూడా వాల్మీకి దాని గురించే ఆలోచిస్తున్నాడు. శిష్యుడు తను కంఠస్థం చేసిన మాటల్ని సహాధ్యాయులతో పంచుకున్నాడు. వారు కూడా ఆశ్చర్యానందాలలో తలమునకలవుతూ వాటిని కంఠస్థం చేశారు. అంతలో బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి అతిథి సేవలు అందించి ఆయనతో మాట్లాడుతున్నాడే కానీ మనసంతా తన నోట వెలువడిన మాటల మీదే ఉంది. బ్రహ్మ ఆయన పరధ్యానాన్ని గమనించి చిరునవ్వు నవ్వాడు. “నీ నోట వెలువడింది శ్లోకమే. ఈ ఛందస్సులోనే నువ్వు రామాయణం చెప్పు” అన్నాడు. వాల్మీకి రామాయణం చెప్పాలని సంకల్పించుకున్నాడు. అయితే, ఇంకొక చింత ఆయనను వేధించడం ప్రారంభించింది. దీనిని కంఠస్థం చేసి ఎవరు మధురంగా గానం చేస్తారనుకున్నాడు. అంతలో ఆశ్రమంలోనే ఉంటున్న కుశలవులు ఆయనను దర్శించుకున్నారు. వారిని చూడగానే వాల్మీకి చింత తీరింది. వీరే తన రామాయణ గానానికి అర్హులనుకున్నాడు. కుశలవులు రామాయణం నేర్చుకున్నారు. వీధులలో, రాజమార్గాలలో తిరుగుతూ దానిని గానం చేయడం ప్రారంభించారు.

కవిత్వం పుట్టుక గురించీ, అది కలిగించే సంభ్రమాశ్చర్యాల గురించీ చెప్పే ఈ ఘట్టంలో చెప్పుకోవలసిన విశేషాలు అనేకం ఉన్నాయి. మరో సందర్భానికి వాటిని వాయిదా వేసి ప్రస్తుతానికి వద్దాం. వాల్మీకి రామాయణం ‘రాశా’డన్న మాట మూలంలో ఎక్కడా లేదు. ఆయన రామాయణం ‘చెప్పాడు’, లేదా ‘చేశాడు’. శిష్యులు ఆయన చెప్పిన శ్లోకాన్ని రాసుకోలేదు, కంఠస్థం చేశారు. రామాయణం చెప్పడం పూర్తి అయిన తర్వాత దీనిని ఎవరు ‘కంఠస్థం చేసి గానం చేస్తా’రనే వాల్మీకి అనుకున్నాడు. కుశలవులు దానిని కంఠస్థం చేసి గానం చేయడం ప్రారంభించారు. విచిత్రం ఏమిటంటే, నేను చూసిన రామాయణ ప్రతిలో తెలుగు తాత్పర్యం కూర్చిన పండితుడు, వాల్మీకి రామాయణం చెప్పాడు, చేశాడు అని ఉన్న ప్రతిచోటా ‘రచించాడు’ అనే మాట ఉపయోగించారు!

కాలం మన ఆలోచనలను, అలవాట్లను ఎలా నియంత్రిస్తుందో గ్రహించడానికి ఇదొక ఉదాహరణ. అంతేకాదు, మన చరిత్రశూన్యతకూ నిదర్శనం. లిఖితసంప్రదాయం చివరికి సంప్రదాయ పండితులలో కూడా ఎంత అలవాటుగా  జీర్ణించుకుపోయిందంటే, ఒకప్పుడు మౌఖిక సంప్రదాయం ఉండేదనీ; వ్యాసవాల్మీకులు మౌఖిక సంప్రదాయానికి చెందినవారనే స్ఫురణ వారికీ లేదు.

భారతీయులు, గ్రీకులు, ఆఫ్రికన్లు అనే తేడా లేకుండా ప్రాచీన కవి, కథకులందరూ కవిత్వం లేదా కథ చెప్పారు, రాయలేదు. తమ కవిత్వం తంత్రీలయబద్ధంగా ఉండాలనుకున్నారు. తాము చెప్పే కథలకు, వీరగాథలకు, వంశచరిత్రలకు తంత్రీలయ నేపథ్యం ఉండేలా చూసుకున్నారు.  ఇంతకీ విషయమేమిటంటే, కుంటా కింటే వంశచరిత్రను చెప్పే గాథికుని గుర్తించి హేలీకి తెలియజేసిన గాంబియా మిత్రులు ఒక హెచ్చరిక కూడా చేశారు: సంగీత నేపథ్యం లేకుండా గాథికులు నోరు విప్పరట! దాంతో హేలీ ఆ ఆఫ్రికన్ వాల్మీకిని కలుసుకోడానికి ముగ్గురు దుబాషీలు, నలుగురు సంగీతకారులతో సహా పద్నాలుగు మందిని వెంటబెట్టుకుని వెళ్ళాడు.

గాంబియాకు వెళ్ళేముందు కన్సాస్ సిటీకి వెళ్ళి కజిన్ జార్జియాను ఓసారి చూసిరమ్మని ఎందుకో అతని మనసు చెప్పింది. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. తను అంతవరకు తెలుసుకున్నవీ, ఇకముందు తెలుసుకోబోయేవీ చెప్పగానే ఆమె సంభ్రమం పట్టలేకపోయింది.  మరోసారి దీవెనలు అందించింది.  గాంబియా చేరుకున్న హేలీ, “గాథికుడు ఏడీ, ఎక్కడ” అని ఆతృతగా మిత్రులను అడిగాడు. వాళ్ళు అతని వైపు వింతగా చూసి, “గాథికుడు ఇక్కడెందుకుంటాడు? ఊళ్ళో ఉంటా”డని చెప్పారు.  హేలీ ఆ ఊరికి ప్రయాణమయ్యాడు.  తను గాంబియా నది మీదుగా వెళ్లాలని నిర్ణయించుకుని ఒక లాంచీని అద్దెకు తీసుకున్నాడు. చుట్టుదారిలో సరకులు చేరవేయడానికి ఒక లారీని, ఒక ల్యాండ్ రోవర్ ను కుదుర్చుకున్నాడు. దుబాషీలు, సంగీతకారులతో సహా పద్నాలుగుమందిని వెంటబెట్టుకున్నాడు. మార్గమధ్యంలో జేమ్స్ ఐలండ్ లో ఆగాడు. అక్కడినుంచే బానిసల ఎగుమతి జరుగుతూ ఉండేది. దానిపై ఆధిపత్యం కోసం ఫ్రాన్స్, ఇంగ్లండ్ లు రెండువందల ఏళ్లపాటు ఘర్షణపడ్డాయి. అక్కడి శిథిలాల మధ్య కాసేపు తచ్చాడాడు. ఆనాడు బానిసలను బంధించడానికి ఉపయోగించిన పురాతనమైన గొలుసు అవశేషం లాంటివి  ఏవైనా దొరుకుతాయేమోనని ఆశగా వెతికాడు. ఏదీ దొరకలేదు. చిన్న గచ్చుముక్కను, ఇటుక ముక్కను తీసుకున్నాడు. తిరిగి లాంచీ ఎక్కబోయేముందు, ఎక్కడో అట్లాంటిక్ ఆవల వర్జీనియాలో ఉన్న తన పూర్వీకుడు కుంటా కింటే తన కూతురుకు ‘కాంబీ బొలోంగో’ పేరుతో పరిచయం చేసిన ఆ నదిని ఒకసారి తేరిపార చూశాడు. అక్కడినుంచి అల్ బ్రెడా అనే ఓ చిన్న ఊరికి చేరుకున్నాడు. ఆ తర్వాత కాలినడకన అంతకంటే చిన్నదైన మరో ఊరు చేరాడు. ఆ ఊరు పేరు జఫూరు. గమనించారో లేదో, జఫూరు అనే మాటలో ‘ఊరు’ ఉంది, అచ్చంగా మన తెలుగు ‘ఊరే’. ఆఫ్రికాలోనే కాక, పశ్చిమాసియాలో కూడా ఊళ్ళ పేర్లలో తెలుగు ‘ఊరు’ కనిపిస్తుంది. దీని గురించి మరోసారి చెప్పుకుందాం.

valmiki

జీవితంలో మరే దశలోనూ అందుకోలేని ‘భావోద్వేగపు పరాకాష్ట’స్థితిని పశ్చిమాఫ్రికాలోని ఆ మారుమూల పల్లెలో తను గడిపిన తొలిరోజున అందుకున్నానని హేలీ అంటాడు.

జఫూరుకు వాళ్ళు కనుచూపు మేరలో ఉండగానే బయట ఆడుకుంటున్న పిల్లలు చూసి  పెద్దవాళ్ళకు చెప్పారు. అంతా బిలబిల్లాడుతూ పూరి గుడిసెల్లోంచి బయటకు వచ్చారు. ఆ ఊరి జనాభా 70 మందిని మించి ఉండదు. ఎన్నో మారుమూల గ్రామాల్లానే ఈ ఊరు కూడా రెండు శతాబ్దాల క్రితం ఎలా ఉందో అలాగే ఉంది. అన్నీ మట్టితో నిర్మించిన గుండ్రటి పూరిళ్ళు. కప్పులు గోపురాకారంలో ఉన్నాయి.  జనం అంతా ఒక వృద్ధుని చుట్టూ చేరడం ప్రారంభించారు. ఆ వృద్ధుడిది చిన్నపాటి ఆకారం. తెల్లని అంగరఖా వేసుకున్నాడు. నెత్తిన ఒక పెట్టె లాంటి టోపీ పెట్టుకున్నాడు. చూడగానే ‘ఒక ముఖ్యమైన వ్యక్తి’ అనే భావన కలిగించేలా ఉన్నాడు.

తను ఎవరిని కలసుకోడానికీ, ఎవరిని వినడానికీ ఆ ఊరు వచ్చాడో ఆయనే ఈయన అని హేలీకి దుబాషీలు చెప్పారు. ఆయనే గాథికుడు కెబ్బా కంజీ పొఫానా!

దుబాషీలు ఆయనతో మాట్లాడుతుండగా, జనం గుర్రపు నాడా ఆకారంలో హేలీకి దగ్గరగా నిలబడి ఆసక్తిగా అతనినే గుచ్చి గుచ్చి చూస్తున్నారు. ఒక అమెరికన్ నల్లజాతీయుని చూడడం వారికి ఇదే మొదటిసారి. ఆ కారు నలుపు మనుషుల మధ్య కొట్టొచ్చినట్టు కనిపించే తన గోధుమవర్ణాన్ని తలచుకుని హేలీ సిగ్గుపడ్డాడు. కాసేపటి తర్వాత జనాన్ని దాటుకుంటూ ఆ వృద్ధుడు హేలీని సమీపించాడు. అతని ముఖంలోకి నిశితంగా చూశాడు. నా మాండింకా భాష నీకు అర్థమవుతుందా అన్న ప్రశ్న ఆ చూపుల్లో కనిపించింది. తర్వాత అతనికి ఎదురుగా కూర్చున్నాడు.

శతాబ్దాలుగా, తాతముత్తాతల కాలం నుంచీ మౌఖికంగా జాలువారుతున్న కింటే వంశ చరిత్రను చెప్పడం ప్రారంభించాడు. అది కేవలం సంభాషణ రూపంలో లేదు. తాళపత్రాలను చదువుతున్నట్టు ఉంది. జనం నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. గాథికుడు మధ్య మధ్య ఛాతీనుంచి ముందుకు వంగుతున్నాడు. మిగతా దేహం స్థాణువులా ఉండిపోయింది. కంఠనాళాలు ఉబ్బి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఒకటి రెండు వాక్యాల తర్వాత దుబాషీలకు అవకాశమిస్తూ వెనక్కి వాలుతున్నాడు. ఆయన మాటలు దాదాపు భౌతిక వస్తువులను రూపుకడుతున్నాయి. సంక్లిష్టమైన కింటే వంశచరిత్ర ఆయన నోటినుంచి అలవోకగా ప్రవహిస్తోంది. ఎవరు ఎవరిని పెళ్లాడారు, వారి పిల్లలు ఎవరు, వారు ఎవరిని పెళ్లాడారు, వారి పిల్లలు ఎవరు…

తన చెవులను తనే నమ్మలేనట్టుగా హేలీ అప్రతిభుడవుతున్నాడు. గాథికుని నోట దొర్లే విస్తారమైన వివరాలే కాదు, ఆయన శైలి కూడా బైబిల్ శైలిని తలపిస్తోంది.

మిగతా కథ తర్వాత…

 

 

Download PDF

6 Comments

  • K.Geeta says:

    ఇలా వంశగాథల్ని (ప్రత్యేకించి కొన్ని కులాలకు సంబంధించి) వినిపించే గాథికులు మన దేశం లో ఇంకా ఉన్నారండీ-
    కాకపోతే వీళ్లు ఒక్కో ఊరూ వెళ్తూ, చెప్తూ ఉంటారు. మంచి ఆసక్తిదాయకంగా ఉన్నాయి మీ వ్యాసాలూ, శైలీ.
    -కె.గీత

  • ns murty says:

    భాస్కరం గారూ,

    మీ కథనం మంచి ఆసక్తికరంగా సాగుతోంది. మీరు ఒక ముఖ్యమైన పరిశీలన చేశారు… వాల్మీకి రామాయణం ‘రాయడం’ గురించి. అది చాలా మంచి పరిశీలన .

    భాషకి ఒక లిపి తయారవడానికి ఎన్ని వేల ఏళ్ళు పడుతుందో అంచనాలు పక్కనబెట్టి, లిపి తయారై,రాయడం ఒక అభ్యాసం గా రూపుదిద్దుకోడానికి కొన్ని వందల ఏళ్ళు పడితే, ఆ అభ్యాస దశనుండి ఆ భాషలో కావ్యసృష్టికి జరగడానికి మరికొన్ని వందల ఏళ్ళు పడుతుంది. అక్షరాస్యత (ఎక్కువగా) లేని నాగరికతలలో (భారతదేశం) లిపి ఉన్నా, సాహిత్య సృష్టి కేవలం మౌఖికంగానే ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది… అందులో చెప్పబోయే విషయానికి లక్ష్యం చదువుకి నోచుకోనివారే కాబట్టి.

    అభివాదములు.

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు మూర్తి గారూ…

    • వలలుడు says:

      //భాషకి ఒక లిపి తయారవడానికి ఎన్ని వేల ఏళ్ళు పడుతుందో అంచనాలు పక్కనబెట్టి, లిపి తయారై,రాయడం ఒక అభ్యాసం గా రూపుదిద్దుకోడానికి కొన్ని వందల ఏళ్ళు పడితే, ఆ అభ్యాస దశనుండి ఆ భాషలో కావ్యసృష్టికి జరగడానికి మరికొన్ని వందల ఏళ్ళు పడుతుంది. అక్షరాస్యత (ఎక్కువగా) లేని నాగరికతలలో (భారతదేశం) లిపి ఉన్నా, సాహిత్య సృష్టి కేవలం మౌఖికంగానే ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది… అందులో చెప్పబోయే విషయానికి లక్ష్యం చదువుకి నోచుకోనివారే కాబట్టి.//
      ఐతే ఇక్కడ ప్రశ్న ఎంపికకు సంబంధించింది తప్ప అభ్యాసానికి సంబంధించింది కాదు. కొన్ని సంస్కృతుల వారు కాగితాలు, శాసనాల కన్నా ప్రజల నాల్కలనే ఎంచుకున్నారు. వేదం వ్రాయడం పాపంగా భావించబడటం వంటివి ఇప్పటికే చర్విత చర్వణం. ఐతే అది ఇక వాగ్రూపంలోనే ఉంటే కోల్పోతామేమోనని భయం వేసిననాడు మాత్రమే దాన్ని వాగ్రూపంలోకి మలచడానికి ఇచ్చగించారు. అంటే మొదట వ్రాతరూపంలో ఉంటే దాన్ని ఉచ్చరించడం రాక ఎలా దాని ప్రత్యేకత కోల్పోతుందనుకున్నారో, తర్వాత వాగ్రూపాన్నే నమ్ముకుంటే ఇక అది నిలవదని భావించారన్నమాట. ఈ రెండు భావనలకూ మధ్య వేల యేళ్ల అంతరం ఉంది. ఇది కేవలం అభ్యాసానికీ, అలవాటుకీ సంబంధించింది కాదు.
      ఇక మన ఇంటిపేర్లు కూడా వాగ్రూపంలో నిక్షిప్తం చేసిన చరిత్రే. కానీ కేవలం వాగ్రూపంలోనే ఉండటంతో మనం ఆ చరిత్రని దాదాపుగా కోల్పోయి ప్రస్తుతం కేవలం ఆ చిహ్నాల్ని మిగుల్చుకున్నాం. అంటే ఇక్కడ మన(తెలుగు)వాళ్లకి వాగ్రూపంలోనే ఉంటే ఇది పోగొట్టుకుంటామన్న ఎరుక కలగలేదన్నమాట. తామెలా కేవల సాంకేతికాలైన ఇంటిపేర్లు ఉంచి మిగిలిన కథను వాగ్రూపంగా చెప్పుకోగలుగుతామో తమ తర్వాతి తరాలు అలానే వాటిని అలానే పరిరక్షించుకోగలవని భ్రమించారన్నమాట. ఇదంతా కేవలం అభ్యాసంలేకనే చేసిన పని కాదు. వారు అవసరం లేదనుకున్నారంతే.

      • వలలుడు says:

        క్షమించాలి పై వ్యాఖ్యలో
        //ఐతే అది ఇక వాగ్రూపంలోనే ఉంటే కోల్పోతామేమోనని భయం వేసిననాడు మాత్రమే దాన్ని వాగ్రూపంలోకి మలచడానికి ఇచ్చగించారు//
        అని వ్రాసిన వాక్యంలో టైపో వాళ్ళ అర్థరహితమైనది. దాన్ని
        ఐతే అది ఇక వాగ్రూపంలోనే ఉంటే కోల్పోతామేమోనని భయం వేసిననాడు మాత్రమే దాన్ని లిఖిత రూపంలోకి మలచడానికి ఇచ్చగించారు
        అని చదువుకోగలరు.

Leave a Reply to కల్లూరి భాస్కరం Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)