వీలునామా – 8 వ భాగం

veelunama11
శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

                     పడి లేచే కడలి తరంగం

 ఎస్టేటు చేరుకుని అందులో కొంచెం కుదురుకున్న ఫ్రాన్సిస్ హొగార్త్ ఆ ఎస్టేటు ధరా, తనకి లభించిన సంపదా చూసుకొని ఆశ్చర్య పోయాడు. బేంకులో వున్న నగదూ, షేర్లూ, ఇంకా అక్కడక్కడా మదుపు పెట్టిన డబ్బూ, అంతా కలిసి జేన్ అనుకొన్నట్టు దాదాపు నలభై వేల పౌండ్ల పైనే వున్నట్టుంది. ఎస్టేటు లో కొంచెం భూమిని సాగు చేయించినట్టున్నాడు పెద్దాయన.

ముందు ఎల్సీ ఆ వూరి జనం ఫ్రాన్సిస్ ని ఆదరిస్తారా అని అనుమానపడింది కానీ, ఆ భయం అర్థం లేనిది. ఆ వూళ్ళో ఇదే అంతస్థుకి చెందిన కుటుంబాలలో దాదాపు ఇరవై మంది పెళ్ళీడు కొచ్చిన ఆడపిల్లలుంటే, నలుగురు పెళ్ళీడుకొచ్చిన యువకులున్నారు, విలియం డాల్జెల్ తో సహా. అలాటప్పుడు, యుక్త వయసుల్లో వున్న ఇద్దరమ్మాయిలు ఊరు వదిలి, చక్కగా చదువుకుని పెళ్ళి కాని ఒక మగవాడొస్తూంటే ఊళ్ళోని సంపన్న కుటుంబాలు అతన్ని ఎందుకు నిరాదరిస్తాయి?  సహజంగానే అతని కొరకు విందులూ, వినోదాలూ ఏర్పాటు చేయబడ్డాయి. తమ తమ కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి తండ్రులూ, తల్లులూ ఎంత దూరమైనా వెళ్తారూ, ఆత్మ గౌరవాన్ని ఎంతైనా చంపుకుంటారు.  బ్రిటిష్ సంఘంలో ఎంత విషాదకరమైన పరిస్థితి! ఒక వర్గాన్ని ఆకాశానికెత్తేస్తూ, ఇంకో సగాన్ని పాతాళానికి నొక్కేస్తూ…

ఇహ స్కాట్లాండ్ లో ఒక మారుమూల పల్లెటూళ్ళొ అంతకంటే మెరుగైన పరిస్థితి ఎలా వుంటుంది? అప్పటికే పల్లెటూళ్లలో మధ్య తరగతి, సంపన్న కుటుంబాలనుంచి యువకులు అవకాశాలు వెతుక్కుంటూ, కాలనీల్లోకి, భారతదేశానికో, అమెరికాకో, ఆస్ట్రేలియాకో వెళ్ళిపోతున్నారు. అంత దూరం కాకుంటే కనీసం పట్టణాలకైనా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో పడి వుండడం తప్ప చేసేదేం వుంది? చదువూ లేక, వృత్తీ వ్యాపారాలూ లేక, కేవలం ఎవరో ఒకరు వచ్చి కన్నె చెర విడిపించాలని ఎదురు చూడాల్సి రావడం ఎంత దుర్భరం!

కాలనీల్లోంచి తిరిగొచ్చిన యువకుల కంటికి సహజంగా తమతోటి కలిసి ఆడుకుని పెరిగి పెద్దయిన యువతులకంటే, చిన్న వయసులో వున్న బాలికలే ఎక్కువ నచ్చుతారు. పాపం, చదువూ, జీవనాధారమూ, పెళ్ళీ లేక ఒక తరం యువతులంతా అమ్మా-నాన్నల పంచనో, అన్న దమ్ముల పంచనో పడి వుండాల్సొస్తుంది.

ఇంత దుర్భరమైన పరిస్థితిలో, ముఫ్పై అయిదేళ్ళ బ్రహ్మచారీ, చదువు సంధ్యలున్నవాడూ, ఆస్తి పరుడూ తమ మధ్యకొస్తే ఆడపిల్లల తలి దండ్రుల ఆశలు ఆకాశాన్నంటటంలో ఆశ్చర్యమేముంది? అతన్ని విందులకూ, వినోదాలకూ ఆహ్వానిస్తూ కుప్పతెప్పలుగా ఉత్తరాలొచ్చి పడ్డాయి.

అయితే ఈ పరుగు పందెంలో అందరికన్నా ముందు పరుగు ప్రారంభించింది మాత్రం రెన్నీ దంపతులే. తన కింద, తన సంస్థలోనే పనిచేస్తున్న ఫ్రాన్సిస్ ఉన్నట్టుండి గొప్ప ఆస్తిపరుడు కాగానే, రెన్నీ ఆ అవకాశాన్ని వొదల దల్చుకోలేదు. తన కూతురు ఎలిజాకి ఇంతకన్న మంచి వరుణ్ణి తాను తేలేడు. అందుకే ఒకసారి తన ఎస్టేటు చూడడానికి రమ్మని ఫ్రాన్సిస్ ఆహ్వానించిందే తాడవు, రెన్నీ దంపతులు కూతురితో సహా వస్తామని మాటిచ్చారు.

నిజానికి శ్రీమతి రెన్నీ ఫ్రాన్సిస్ ని వూళ్ళో వుండే సంపన్న కుటుంబాలు ఎగరేసుకు పోతారేమోనని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఫ్రాన్సిస్ సహజంగా ముభావి. పైగా యేళ్ళ తరబడి ఒంటరితనానికి అలవాటు పడ్డవాడు. అందుకే వూళ్ళో కుటుంబాలతో పెద్దగా మనసిచ్చి కలవలేకపోయాడు. అతనికెందుకో వూళ్ళో వాళ్ళు అంత నచ్చలేదు కూడా. అన్నిటికంటే వూరి వాళ్ళు జేన్, ఎల్సీల పట్ల చూపించిన నిరాదరణ అతన్ని ఎంతో నొప్పించింది. ఆ నిరాదరణ ఆ అక్క-చెల్లెళ్ళ పట్ల కాదనీ, తన తండ్రి పట్ల అనీ అతను గుర్తించలేకపోయాడు.

చాలా మామూలు మనుషులుండే ఆ వూళ్ళో, పెద్దాయన హొగార్త్ భావాలూ, మతపరమైన నమ్మకాలూ, కొంచెం విభిన్నంగా అనిపించేవు. దాంతో వూరి వారికి అతనంటే కొంచెం అనుమానం అసహనం కూడా వుండేవి. అతని పెంపకంలో పెరిగిన అమ్మాయిలవడం చేత, ఆ అనుమానమూ, అసహనమూ, జేన్, ఎల్సీల పైకి కూడా తిరిగాయి. దానికి తోడు వేరే ఆడదిక్కులేని ఇల్లు. వాళ్ళిద్దర్నీ ఆయన మగపిల్లల్లా పెంచాడందులో. అయేసరికి వూరి వారికీ హొగార్త్ గారి కుటుంబానికి పెద్ద సఖ్యతేమీ వుండేది కాదు.

అదెలాగున్నా, పెద్దాయన ఆడపిల్లలకి చిల్లి గవ్వ ఇవ్వకుండా వీధిలో నిలబెట్టాడని తెలిసినప్పుడు మాత్రం, వూరి వాళ్ళు చాలా బాధ పడ్డారు. వాళ్లకొరకు చందాలు పోగు చేయలనుకున్నారు కూడా. చిన్న చిన్న సహాయలు చేయాలనుకున్నారు. అయితే జేన్, ఎల్సీలిద్దరూ ఎవరి దయా దాక్షిణ్యాల మిదా ఆధారపడదల్చుకోలేదు. అందుకే వూరొదిలి పట్నంలో బ్రతుకు తెరువు వెతుక్కుంటున్నారనీ, చాకలి మనిషి, పెగ్గీ ఇంట్లో అద్దెకుంటున్నరనీ తెలిసి వూళ్ళొ వాళ్ళు బాధ పడ్డారు.

పెగ్గీ చాలా యేళ్ళు స్కాట్ లాండు వదిలి ఆస్ట్రేలియాలో వుండడం వల్ల, ఆమె ఆలోచనలో కొంచెం వైశాల్యం వచ్చింది. అందుకే వూరి వాళ్ళలా, హొగార్త్ నమ్మకాలకీ, ఆచార వ్యవహారాలకీ ఆడపిల్లలని తప్పు పట్టలేదు. వూళ్ళో వున్నప్పుడు కూడా వాళ్ళ బట్టలు వుతికి ఇస్త్రీ చేస్తూ, వాళ్ళతో చనువుగా, స్నేహంగా వుండేది పెగ్గీ.   జేన్, ఎల్సీలు ఇల్లొదిలి వెళ్ళేటప్పుడు పెగ్గీలాగే, ఇంట్లోని నౌకర్లూ, చాకర్లూ అందరూ ఎంతో బాధ పడ్డారు.

 

  ***

  ఎడిన్ బరోలోని ఆ వీధిలో ఆ చిన్న ఇల్లు దొరకడం అదృష్టమే, అనుకుంది పెగ్గీ. చిన్నదైనా ఇల్లు శుభ్రంగా వుంది. గాలీ వెల్తురూ ధారాళంగా వచ్చే గదిని అక్క-చెల్లెళ్ళిద్దరికీ అద్దెకిచ్చింది. పెగ్గీ చెల్లెలి మావగారు థామస్ లారీ కి కూడా, ఇల్లూ, ఇంట్లోంచి బయటికి చూసే కిటికీ భలే నచ్చాయి. పెగ్గీ చెల్లి పిల్లలయిదుగురికీ ఇల్లు బ్రహ్మాండంగా నచ్చేసింది.

జేన్, ఎల్సీలు మాత్రం, దిగజారిపోయిన పరిస్థితులూ, అంత చిన్న ఇంట్లో సర్దుకోవడమూ తలచుకుని భయపడ్డారు. ఎంత శుభ్రంగా వున్నా, ఆ ఇంట్లోంచి వాళ్ళకలవాటు లేని లేమి అడుగడుగునా తొంగిచూస్తోంది.

అయినా, వాళ్ళిద్దరూ పెగ్గీ కుటుంబంతో వీలైనంతగా సర్దుకుపోవాలనే నిశ్చయించుకున్నారు. అందుకే, ఆ రాత్రి భోజనం వాళ్ళు పెగ్గీ కుటుంబంతో పాటు కలిసే చేసారు, పెగ్గీ ఎంత వారించినా. ఆ గందరగోళానికి వాళ్ళకసలు భోజనమే సయించలేదు. ఏదో తిన్నామనిపించి తమ గదికి వెళ్ళి కూర్చున్నారు. వున్నట్టుండి బావురుమంది ఎల్సీ.

“జేన్! నాకిక్కడేం బాగోలేదు. చాలా భయమేస్తుంది. పేదరికం గురించి కవితలు రాయడమూ, చదవడమూ వేరు, నిజాంగా పేదరికాన్ని అనుభవించడం వేరు. పేదరికంలో అందముందని ఎందుకు రాస్తారు, జేన్?”

“నువ్వవన్నీ ఆలోచించకు ఎల్సీ! నిజానికి నాకు మన వూళ్ళో వున్న కుటుంబాలూ, వాళ్ళ కృత్రిమ మర్యాదలూ, కపటనాటకాలకంటే పెగ్గీ కుటుంబమే ఎంతగానో నచ్చింది. మనకీ పరిస్థితి నచ్చినా నచ్చకపోయినా, మనం సర్దుకు పోక తప్పఫు! అర్థమయిందా?”

“అబ్బ! ఆ పెద్ద తాతగారు ఎందుకలా దగ్గుతాడు జేన్? ఆయన దగ్గరొచ్చే ఆ ముక్కు పొడుం వాసన! టీ కప్పులోంచి సాసర్లో పోసుకుని తాగుతారు వీళ్ళు, చూసావా? ఛీ!”

“ఎల్సీ! నిజం చెప్పు, అవన్నీ అంత ముఖ్యమైన విషయాలా? వాళ్ళలాగా ఏ పరిస్థితికైనా యెదురీదే శక్తి లేనందుకు మనం సిగ్గుపడాల్సిన మాట!  ఏదో పెద్ద చదివేసుకున్నాం అన్న అహంకారం తప్ప మన దగ్గరేముంది, ఆలోచించు!”

“ఏమోలే! ఇవాళ రాత్రైతే నేనొక్క మాట కూడా రాయలేను. మనసంతా చికాగ్గా వుంది. ఈ వూరూ, ఈ మురికీ, ఈ ఇల్లూ…”

“అదేం లేదు ఎల్సీ! బయట ఎడిన్ బరో చాలా అందంగా వుంటుంది తెల్సా! రేపు నిన్ను బయటికి తీసికెళ్తా! ఇద్దరమూ అలా నాలుగు వీథులూ నడిచొద్దాం, సరేనా?”

“సరే! రేపణ్ణించి మళ్ళీ రాయడం మొదలు పెడతా! ఇవాళ్తికి వొదిలేస్తా!”

“అవును! నీకెప్పుడు మనసులో హాయిగా అనిపిస్తే అప్పుడే రాసుకో. ఇప్పుడిక పడుకో!”

తలుపు దగ్గర చప్పుడైంది. పెగ్గీ గుమ్మంలోంచి మొహం లోపలికి పెట్టి,

“అమ్మాయిగారూ! అంతా బాగుందా? ఇంకా ఏమైనా కావాలా?” అని అడిగింది.

“లేదు పెగ్గీ! ఏమీ వొద్దు, కానీ నువ్వొచ్చి కాసేపు కూర్చోరాదూ?” జేన్ ఆహ్వానించింది.

పెగ్గీ లోపలికొచ్చి కూర్చొంది.

ఎల్సీ గబగబా తన కగితాల కట్ట సంచీలోకి తోసేసింది. అవన్నీ ఎల్సీ ఎవరికో రాస్తున్న ప్రేమలేఖలనుకుంది పెగ్గీ!

“చిన్న అమ్మాయిగారు ఏదో ఉత్తరాలు రాసుకుంటున్నట్టున్నారు. నేనొచ్చి పాడు చేసానా?”

“వుత్తరాలు కాదు పెగ్గీ! ఎల్సీ ఒక పుస్తకం రాస్తోంది!”

“పుస్తకమే? వామ్మో! నాకు అసలు సరిగ్గా చదవడమే రాయడం రాదమ్మాయిగారూ! మీరా పుస్తకాలెలా రాస్తారో గానీ! అయితే, దానికేమైనా డబ్బొస్తుందాండీ?”

“చూద్దాం! వస్తుందో రాదో!”

“అంతే లెండీ! చదువున్న మారాజులు! నాకు పెన్ను పట్టుకుంటే అక్షరం ముక్క రాదు! ఆస్ట్రేలియాలో వున్నప్పుడు ఇంటికి ఉత్తరాలు రాసే దిక్కులేకపోయింది. ఎవరినైనా అడగడానికి సిగ్గు పడిపోయాను. ఏదో కూడబలుక్కోని నా ఇష్టం వొచ్చినట్టు రెండు మాటలు రాసి పడేసేదాన్ని లెండి. అందుకే, నాలా అవస్థలు పడొద్దని ఈ పిల్లలందరికీ చదువు చెప్పిస్తున్నాను.”

“పెగ్గీ! నువ్వు నీ ఆస్ట్రేలియా జీవితం గురించి చెప్పాలి మాకు. నాకైతే భలే కుతూహలంగా వుంది!”

“ఎందుకు లెండి అమ్మాయి గారు! మీరవన్నీ మళ్ళీ ఏ పుస్తకంలోనో రాస్తే అంతా నన్ను చూసి నవ్వుతారు!” అనుమానంగా అంది పెగ్గీ!

నవ్వింది ఎల్సీ!

“లేదు పెగ్గీ నువ్వు చెప్పే సంగతులు నేనెప్పుడూ పుస్తకాల్లో రాయను సరేనా?”

ఆమె కాగితాల్లోకి తొంగి చూసింది పెగ్గీ.

“అమ్మాయి గారూ! మీర్రాసే లైనులు ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా వున్నాయండి! అంటే మీరు రాసేది కవితలే కదండీ?”

“అవును పెగ్గీ ! అవి కవితలే!”

“ఇహ అయితే నా గురించి చెప్తా లెండి. కథలైతే భయం కానీ, కవితలైతే భయం ఎందుకు?”

“అవునూ, నువ్వు ఆస్ట్రేలియానుంచి ఒంటరిగా వచ్చావెందుకు? అందరూ నువ్వు పెళ్ళి చేసుకుని జంటగా వస్తావనుకున్నారు.”జేన్ కుతూహలంగా అడిగింది.

“అవునండీ! పెళ్ళాడడానికి అవకాశాలు కూడా వచ్చాయండి. కానీ, నేను పెళ్ళాడి నా దారి చూసుకుంటే, ఈ చిన్న పిల్లల గతి ఏమిటి చెప్పండి? ఒకరిద్దరైతే ఈ పిల్లల బాధ్యత కూడా తీసుకుంటామన్నారు కానీ, నాకెందుకో నమ్మకం లేక పోయింది!”

“ఈ పిల్లలు పెద్దయ్యాక మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళు పెగ్గీ! అప్పుడు మళ్ళీ ఎవరైనా నచ్చితే పెళ్ళి చేసుకో.” సలహా ఇచ్చింది ఎల్సీ.

“లేదు లేమ్మా! నాకు చాలా నచ్చిన మనిషికి మెల్బోర్న్ లో పెళ్ళయిపోయింది. అతను మాత్రం ఎన్నాళ్ళని ఆగతాడు చెప్పండి? నాకు తెల్సుసు చిన్నమ్మాయి గారూ, మీరేమనుకుంటున్నారో! పెగ్గీ లాటి దాన్ని కూడా ఇష్టపడే మగవాళ్ళుంటారా, అనేకదా? అయితే ఆస్ట్రేలియా లాటి చోట అంద చందాలకంటే కష్టపడే మనస్తత్వానికే ఎక్కువ విలువ. అందుకే నాలాటి దాన్ని కూడా చేశుకోవడానికి ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు ముందుకొచ్చారు. ఇంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి నా కథ చెప్తా వినండి.”

పెగ్గీ సర్దుకుని నేల మీద చతికిలబడింది. ఎల్సీ అక్క దగ్గరికి జరిగి, ఆమె వొళ్ళో తల పెట్టుకుంది. జేన్ చెల్లెలి జుట్టులోంచి వేళ్ళు పోనిచ్చి దువ్వుతూ, పెగ్గీ కథ వినడానికి సిద్ధమైంది.

  ***

(సశేషం )

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)