ఆలోచన లోపించిన ప్రతిమ కథ “కంకాళం”

2004 డిసెంబర్ “అరుణతార”లో వి.ప్రతిమ “కంకాళం” అనే కథ రాశారు. ఇది వుత్తమకథగా కూడా ఎన్నికైంది.

మహిళలు రాస్తున్న కథలు అత్తగారి పెత్తనాల్తో, నడుము చూసి సొల్లు కార్చే మగాళ్లతో, పురుషాధిక్యత లాంటి బరువైన పదాల్తో నిండిపోతున్న సందర్భంలో, ఒక మహిళ ఆర్ధిక, రాజకీయ విషయాలపై కథ రాయడం అభినందనీయం. పంచరంగుల ముద్రణామోహానికీ, లక్షల పాఠకులనే గ్లామర్‌కి లోనవ్వకుండా ‘అరుణతార’ లాంటి పత్రికని ఎన్నుకోవడం మరింత మంచి విషయం.

కథ “పో” చెప్పినట్టు అనుభూతి, ఐక్యత పద్ధతిలోనే సాగుతుంది. ఇక్కడ అనుభూతి రాఘవయ్య మరణం పట్ల సానుభూతి. రాఘవయ్య మరణాన్ని నాటకీయం చెయ్యలేదు. కథ కలిగించే అనుభూతిని “మామ్” చెప్పిన నాటకీయ అనుభూతి అనలేం. కథ మొత్తం చెప్పి మీ సమయం వృధా చెయ్యకుండా అవసరం అయిన మేరకే చూద్దాం.

కథలో సంఘటన రాఘవయ్య మరణం. రాఘవయ్య రైతు. పదెకరాల రైతు. మరణానికి కారణం ఏమిటన్న ఆలోచన చేస్తే చెరుకు ఫాక్టరీ మూతపడిపోవడం. రాఘవయ్య డబ్బులు రాకపోవడం.. దానికి కథలో చాలా కారణాలు చెప్తారు.

చంద్రశేఖర్ అనే పాత్ర ఫ్యాక్టరీలో ఒక కెమిస్టు, మాటల్లోంచి చూస్తే పాఠకులకి నిజము అనిపిస్తుంది. బ్రెజిల్ అనే దేశంలో పెట్రోల్‌లో పావలా వాటా “ఇథనాల్” కలుపుతారనీ, ఆ ఇథనాల్ చెరుకునుంచి తీస్తారనీ, అందువల్ల చెరుకు రైతులూ, ఫ్యాక్టరీలూ, పర్యావరణం, దేశమూ అన్నీ బావున్నాయనే అనిపిస్తుంది. అదొక ఆదర్శంగా, ఆచరణీయంగా అనిపిస్తుంది. మన దేశం అలా చెయ్యకుండా మేధావుల్ని బయటిదేశాలకి తోలేస్తోందనీ, చంద్రశేఖర్ ఇచ్చిన ఎన్నో విలువైన సూచనల్ని బుట్టదాఖలు చేశారని చదివి ధర్మాగ్రహము వస్తుంది. మనం కూడా బ్రెజిల్ లాగా రైతుల, రాఘవయ్యల మరణాల్ని ఆపుకోవాలనీ, ఫ్యాక్టరీల్నీ, దానిలోని వుద్యోగుల్నీ కాపాడుకోవాలన్న ఆవేశమూ కలుగుతుంది. కథ ముగుస్తుంది. అక్కడ ఆగి మనం కొంచెం ఆలోచిస్తే..

బ్రెజిల్‌లో భూమి చాలా సారవంతమైనది. అపారమైన నీటి వనరులూ, అమెజాన్ అడవులతో వుండేది. కేవలం చెరుకు కాదు. కాఫీకి ఎప్పటినుందో ప్రసిద్ధం. సోయా, పాలు, మాంసం ఇలా వ్యవసాయాధారిత పరిశ్రమలే ఆ దేశం వెన్నెముక. అయితే ఆ సౌభాగ్యం ప్రజలకి లేదు. అక్కడ భూమి రైతుల చెతుల్లో లేదు. ఎస్టేట్లుగా వున్నది. పెద్ద పెద్ద కంపెనీల చేతుల్లో వున్నది. బిగ్‌లాండ్ బ్రెజిల్ లాంటి ఎన్నో కంపెనీలు అక్కడి భూమిని ఆక్రమించి వున్నాయి. పల్లెల్లోని భూముల్లో 47 శాతం భూములు ఒకే ఒక్క శాతం హౌస్ హోల్డ్స్(House Holds) చేతుల్లో వున్నాయి. సుమారు కోటీ, ఇరవై లక్షల ఇళ్లకి సెంటు భూమి లేదు. ఎనభై శాతం చిన్న రైతుల చేతుల్లో కేవలం 18శాతం భూమి వున్నది. పెద్ద పెద్ద ఎస్టేట్లలో 166 మిలియన్ హెక్టార్ల భూమి వాడకంలో లేకుందా వున్నది. చెరుకు పండించదగ్గ భూమి 320 మిలియన్ హెక్టార్లుంటే అందులో కేవలం 5శాతం మాత్రమే వుపయోగించబడున్నదని నిపుణులు అంచణా వేస్తున్నారు. కారణం   చట్టాలు. ప్రజల వద్ద పెట్టుబడి లేకపోవడం.

ఈ కారణాల వల్ల అసమానతలు తీవ్రంగా పెరిగాయి. ప్రజల్లోని అసమానతల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో వున్న దేశం బ్రెజిల్. దేశంలోని ధనికులు, జనాభాలో కేవలం పది  శాతం మంది. దేశ సంవత్సరాదాయంలో 48 శాతం తీసుకొంటున్నారు. అట్టడుగువాళ్లు జనాభాలో 20 శాతం మందికి దేశ సంవత్సరాదాయంలో రెండు శాతం మాత్రమే దక్కుతోంది. రెండున్నర కోట్లమంది దారిద్ర్యపు రేఖకంటే ఎంతో అట్టడుగున బతుకుతూ వుంటే ఐదుకోట్లమంది ఒక్క పూటే తిని బతుకుతున్నారు. చెరుకుతోటల్లో కూలీలు కేవలం రెండు డాలర్ల రోజు కూలీ కోసం 15-16 గంటలు పని చేస్తున్నారు. ఇంత సారవంతమైన భూమిలోణూ పండించేది కేవలం వ్యాపార పంటలే. 1990లో బ్రెజిల్ 1 బిలియన్ డాలర్ల విలువైన ఆహార ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటే 2002 నాటికి అది 10 బిలియన్ల డాలర్లకు ఎగబాకింది. ప్రపంచంలోనే పంచదార వుత్పత్తిలో మొదటి స్థానంలో వున్న బ్రెజిల్‌లో పంచదార వుత్పత్తి చేసేది సహకార మిల్లులూ కాదు. రైతుసంఘాలూ కాదు. కోసాన్(Cosan loD) అనే కంపెనీ “VHP రకం పంచదారని కనిపెట్టింది. ఆ కంపెనీ 12 మిల్లుల్తో, 30 రిఫైనరీల్తో అతి పెద్ద కంపెనీ.  ఇంకా సావో మార్టినో, ఆక్వార్ గునానీలాంటి ఎన్నో కంపెనీలున్నాయి. ఈ ఫాక్టరీల్లో కూలీలకిచ్చే జీతాలు ఒక్క పూట తిండికి చాలవు.

ఇథనాల్ వుత్పత్తిలో అమెరికా తర్వాతి స్థానంలో వున్న బ్రెజిల్‌లో కొయిమెక్స్ అనేది అతి పెద్ద కంపెనీ. ఈ కంపెనీల టర్నోవర్లూ, లాభాలూ చూస్తే మనకి కళ్లు తిరుగుతాయి. ఈ కంపెనీల పుట్టుకా, పెరుగుదలా క్రమంలో వేలాది రాఘవయ్యలు పోయేరు. కోట్లాది మంది రోడ్డున పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజల్ని బానిసలుగా మార్చి వెట్టి చాకిరి చేయిస్తున్నారు. ఈ బానిసత్వాన్ని కనిపెట్టి వదిలించడానికి ఒక రకం పోలీసుశాఖ అక్కడ పని చేస్తోంది. ఎన్నో స్వచ్చంద సంస్థలు పని చేస్తున్నాయి. ఆందోళనలు రేగుతూనే వున్నాయి.

బ్రెజిల్  ఒక నూతన సామ్రాజ్యవాద దేశంగా మారిపోయిందనీ, చైనా, ఇండియాల సరసన చేరిందనీ ఎన్వర్  హోక్సా లాంటి వాళ్ల సాక్ష్యాధారాలతో నిరూపిస్తూ పుస్తకాలు రాశారు. బ్రిక్(BRIC) సంఘణ కాకతాళీయం కాదు. బొలీవియా, మొజాంబిక్, ఇథోపియా దురాశగా నాశనం చేస్తున్నారని శాస్త్రజ్ఞులూ, ఆలోచనాపరులూ గగ్గోలు పెడుతున్నారు. పెట్టుబడి అంటేనే విధ్వంసం, విద్రోహం. ప్రకృతినీ, మానవ శ్రమనీ నిర్లజ్జగా, క్రూరంగా, దురాశగా దోచుకోకుండా పెట్టుబడి ఎలా పెరుగుతుంది? ఇక్కడ ఆగుదాం.

కథలో రెండో కారణం పంచదారని మనం దిగుమతి చేసుకోవడం. పంచదారని మనం OGL కింద దిగుమతి చేసుకుంటున్నాం. వ్యవసాయం మీద ఆధారపడ్డ వుత్పత్తులు ఒక పరస్పరాంగీకారం లేకపోతే, ఇక్కడ మనకి పంట పోయి అవసరం అయినపుడు అడ్డగోలు ధర పెట్టవలసి రావచ్చు. ప్రపంచంలోనే పంచదార వినియోగంలో మనది మొదటి స్థానం. 1995 – 96 నుంచి 2010 – 11 వరకు పదిహేనేళ్ళ కాలంలో 2004 – 05లో (800MT) 2009 – 10 లో (2500MT) రెండేళ్ళు మాత్రమే మనం దిగుమతి చేసుకున్నాం. ఈ కాలంలో మన  దిగుమతులకంటే ఎగుమతులు చాలా చాలా ఎక్కువ. సరే అంకెలు వదిలేస్తే ఈ డిమాండు ఎవరిది? ఎవరికోసం?ఈ కోరిక, పంచదార దిగుమతి చేసుకోకూడదన్నది.  పంచదార మిల్లుల యజమాన్లది. NFCSF అధ్యక్షుడు కల్లప్ప అవడే పంచదారపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 30 శాతం వరకూ పెంచాలంటున్నాడు. దాని కార్యదర్శి వినయ్ కుమార్ మనం పంచదార  దిగుమతి ఆపాలన్నాడు.

ISMAకి చెందిన అవినాష్ వర్మ పంచదార కంట్రోల్ అంటే లెవీ ఎత్తేయమన్నాడు. పంచదార పరిశ్రమ మనదేశ రాజకీయాల్ని శాసించగలంత శక్తిమంతం. శరద్ పవార్ చిన్నకొండ గుర్తే. మొత్తానికి వీళ్లు లెవీ తీయించేసుకోగలిగారు. దిగుమతి కూడా ఆపేస్తే ఇక ఇంత పెద్ద మార్కెట్లో ధరల ఇష్టారాజ్యం చలాయించవచ్చన్న దురాశ వీళ్లది. తమ కష్టాలకి కారణం కూలీవాడని చూపించి చెరుకు నరికే యంత్రాన్ని పట్టుకొచ్చేరు. ఒక్కొక్కటే కోటి రూపాయలు చేసే మిషన్లు. 2011 -12లో 87 వాడారనీ వాటి కొనుగోలు కోసం ప్రభుత్వం ఏభై కోట్లు సబ్సిడీ ఇచ్చిందనీ, గతేడాది మొత్తం చెరుకులో 8 శాతం నరికిన యంత్రాలపై ఈసారి 25 శాతం నరకాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ కూలీలు రోడ్డున పడుతున్నారనీ నందా కసబే రాశాడు. నిజమే. కూలీవాళ్లనీ, వుద్యోగస్థుల్నీ తీసి పారెయ్యడానికి ఎంత ఖర్చైనా పెడుతుంది ప్రభుత్వం ఇంతకీ ఫాక్టరీ వాళ్లు రాఘవయ్యకు డబ్బులు ఎందుకివ్వలేదు.? చక్కెర కర్మాగారాలు రైతులకీ, కూలీలకీ ఇవ్వవలసిన డబ్బులు వాయిదా వెయ్యడం, ఎగ్గొట్టడం సర్వసామాన్యం. చెరుకే కాదు. వ్యాపారం మీద ఆధారపడ్డ ఏ వ్యవసాయ వుత్పత్తికైనా అదే పరిస్థితి. వరి కావచ్చు. శనగ కావచ్చు. గోగు కావచ్చు. మొక్కజొన్న కావచ్చు. గ్రామాల్లో షావుకార్లూ, రైస్ మిల్లర్లూ వగైరాలూ ఇలాగే పెరిగారు.

పంటల్లో మిగులు ప్రారంభం అయిననాడే పెట్టుబడికి విత్తనాలు పడతాయన్నది ప్రాధమిక సూత్రం. మిగులున్న రైతులు షావుకార్లకి అరువులిస్తారు. అప్పులిస్తారు. ఆ డబ్బుతో సరుకు కొని, దాచి బాకీలు వాయిదా వేసి, ఎగ్గొట్టి, సరుకు ధర పెరిగినప్పుడు లేదా కృత్రిమంగా పెంచి సరుకు అమ్మి లాభాలు తీస్తారు షావుకార్లు. దీన్నే స్పెక్యులేషన్ అని అంటాం. భారతీయ పారిశ్రామిక పెట్టుబడికి మూలం  ఈ స్పెక్యులేషన్ లాభాలే. బొంబాయి, కలకత్తాల్లోణి మార్వారీ, పార్సీ పెట్టుబడిదార్ల చరిత్ర చదివితే స్పెక్యులేషనూ, నల్లమందు వ్యాపారము, వడ్డీ వ్యాపారమూ వాళ్ల మూలాలని తెలుస్తుంది. జె.డి.బిర్లా చరిత్ర దొరుకుతుంది షాపుల్లో.

ఈ విషయం కథలో స్పష్టంగా చెప్పకుండా పంట తగ్గడం, ధర లేకపోవడం, సరుకు పేరుకు పోవడం, ఎం.డీ మారిపోవడం అని ఏవేవో సంబంధం లేని కారణాలు చూపించడం పెట్టుబడిని వెనకేసుకురావడమే.  అర్ధసత్య, అసత్య ప్రకటనే. ఫ్యాక్టరీ దివాళా తీయడానికి కారణం పర్చేసింగ్ ఆఫీసర్లు, మేనేజరూ చేసిన అవినీతి అని చెప్పడం మరో పెట్టుబడిదారీ వ్యూహం.. అమిత ధనార్జన, అత్యంత లాభాలు మాత్రమే ఏకైక నీతిగా, ఆదర్శంగా బతికే పెట్టుబడి అందరికంటే ఎక్కువగా అవినీతి గురించి మాట్లాడుతుంది. అవినీతి ఫలితాలను చిలువలు వలువలుగా  వర్ణిస్తుంది కానీ వాటికి కారకులుగా గుమస్తాలనీ, కానిస్టేబుల్నీ, అర్ధరూపాయి లంచం అడిగిన బంట్రోతునీ చూపించి లైసెన్సు రాజ్యం పోవాలని కేకలు పెడుతుంది. అమెరికా ఎంతో ఎక్కువగా మానవ హక్కులు గురించి మాట్లాడ్డం చూస్తున్నాం. వరి వేసినప్పుడు బావున్నాయనీ, పెళ్ళిళ్ళు, చదువులు చేసాడనీ, శనగ, చెరకు వేసి చెడిపోయాడని రాయడం నిర్ధిష్టంగా కొంత సరైందేమో కానీ సాధారణంగా పూర్తిగా తప్పు. వరి రైతులు కుదేలైపోవడం కొన్ని వేల రచయితలు కథలు కథలుగా రాశారు. వ్యాపారంలోకి వెళ్లాక ఆహారం అని లేదు. వినిమయాన్ని మించిన మిగులుకి వ్యాపార సూత్రాలు వర్తిస్తాయి.

ఇథనాల్ వుత్పత్తి చేస్తే ఫాక్టరీలు బావుంటాయనీ, రైతులకు డబ్బులిచ్చేస్తాయనీ, కొత్త ఇథనాల్ మిల్లులొస్తాయనీ. గ్రామాలు  జవజవాలడతాయనీ రాయడం కేవలం పెట్టుబడికి పనికొచ్చే ప్రచారమే అవుతుంది. నా అంచనాకి కథలోనే దాఖలాలున్నాయి. కథ ప్రారంభంలోనే కర్మాగారం. గత వైభవాన్నీ, వర్తమాన దైన్యాన్నీ ఎంతో మమకారంతో వల్లిస్తారు. బోర్డులో అక్షరాలు రాలిపోవడాన్ని సహానుభూతితో రాస్తూ ఫాక్టరీ మీద జాలి పుట్టించే ప్రయత్నం చేస్తారు. లక్షా ఎనభై వేల టన్నులు గానుగాడిందనీ,  ప్రభుత్వ అవార్డు పొందిందనీ ఫాక్టరీని కీర్తిస్తారు. వుత్పత్తినీ, వుత్పత్తి సాధనాల్నీ ప్రేమించడం, కీర్తించడం పెట్టుబడిదారీ దృక్పథంలో భాగం. పాడైపోయిన రోడ్లనీ, పెరుగుతున్న పిచ్చి మొక్కల్నీ, పాకుతున్న పాముల్నీ వర్ణించిన రచయిత కూలీల, రైతుకూలీల జీవితాల్లోకి తొంగి చూడకపోవడం దృక్పధంలో భాగమే.

వ్యాపారం  లేకపోతే, దెబ్బతింటే వ్యవసాయం చచ్చిపోతుందని చెప్తూ, ఇథనాల్ వ్యాపారం కూడా చెయ్యాలని చెప్పడం, పరాకాష్టగా శీధిల వ్యాపారం స్థావరంలోనే వ్యవసాయాన్ని (రాఘవయ్యని) చంపడం దృక్పధానికి చెందినదే. అయ్యో! ఫాక్టరీ బావుంటే రాఘవయ్య బతుకునే అన్పించేలా కథ రాయడం పెట్టుబడికి ఎత్తిన హారతే.

రాఘవయ్య పదెకరాల (ధనిక) రైతు కావడం యాదృచ్చికం కాదు. ధనిక రైతులు పెటి బూర్జువా దృక్పధంతోనే వుంటారు. పెట్టుబడి తన విశాల ప్రాంగణంలోకి రైతుల్నీ, పెట్టి బూర్జువాల్ని రానిస్తుందని చెప్పొచ్చు. వారి ప్రయోజనాలు, మనుగడా పరస్పరాశ్రితాలు. కానీ కూలీవాణ్ని, మానవశ్రమని తమ పొలిమేరల్లోకి రానియ్యకుండానే గేటు ముందు సాయుధ రక్షకుల్ని కాపలా వుంచుతుంది. అదో అనివార్య, నిరంతర ఘర్షణ.

ప్రభుత్వం చేతకానిదనీ, సీరియస్‌గా లేదనీ రాయడం కూడ ఆ దృక్పధంలోంచి పుట్టిందే. చేతకాని ప్రభుత్వాలు వుండవు. ప్రభుత్వం అంటేనే రాజ్యం. రాజీ పడలేని వర్గ(దోచేవాళ్లూ, దోచబడేవాళ్లూ) వైరుధ్యాల ఫలితంగానే రాజ్యం వుంటుందని ఎంగెల్స్ తన రచనల్లో ఓపికగా స్పష్టం చేశాడు. వర్గసమాజంలో రాజ్యాన్నీ, ప్రభుత్వ రంగ వ్యాపారాన్నీ (సహకార మిల్లులు) గొప్పగా, మంచివిగా చూడ్డం అంతిమంగా పెట్టుబడిదారీకే లాభం. “వర్గ వైరుధ్యాలను అదుపులో వుంచవలసిన అవసరం నుండి రాజ్యం పుట్టింది. రెండు వర్గాల ఘర్షణలోంచి పుట్టింది కాబట్టి అది అప్పటికి ఆర్ధికంగా శక్తివంతమైన వర్గం యొక్క పరికరంగా వుంటుంది” అని ఎంగెల్స్ రాశాడు. చరిత్ర రోజుకొక్కసారి ఈ వాక్యాన్ని రుజువు చేస్తున్నది. దీన్నిగురించి పాఠకుల్లో స్పృహ కలిగించకుండా, సీడీసీ చైర్మన్ రఘునాధరెడ్డి మంచివాడని రాయడం, చక్కెర ఫాక్టరీ ప్రస్తుతం ఎండీ మారిపోతే అంతా బావుంటుంది అని రాయడం . వాళ్ల దోపిడీ, ఆ దోఫిడీ సూత్రాల పట్ల ఎరుక కలిగించే ప్రయత్నం చెయ్యకుండా, మేనేజరు ఆస్తులు పెరిగిపోవడాన్నీ, వాళ్ల అవినీతిని రాయడం కూడా దృక్పధానికి సంబంధించిన విషయమే. అవినీతి విషయమే. కానీ దోపిడీ ఇంకా పెద్ద, ప్రధాన, అసలు విషయం. దృక్పధం ప్రయోజనాన్నీ, ప్రయోజనం వస్తువునే నిర్ణయిస్తుందన్నట్లు ఈ దృక్పధంలోంచి పుట్టిన కథకి సహజంగానే బ్రెజిల్ ఒక వుదాహరణ, ఆదర్శం అయ్యింది. ఇందాక “పో’ గురించి అన్నాను. “పో” అమెరికన్. అమెరికన్ పుట్టుకే పెట్టుబడిలో జరిగింది. వస్తువు శిల్పాన్ని ఎన్నుకుంటుందంటే అదే. దృక్పధానికీ, వస్తువుకీ, శిల్పానికీ సహజ ఐక్యత కథలో కుదిరింది.

దృక్పధం రచయిత వ్యక్తిగత రుగ్మత కాదు. ఏ వ్యవస్థలోని వ్యక్తులూ ఆ దృక్పధంలోనే వుండడం సహజం. ట్రాట్‌స్కీ అన్నట్లు సమాజ స్వభావం రచయిత వర్గ స్వభావాన్ని నిర్దేశిస్తుంది. కొంచెం అధ్యయనం, కొంచెం పరిశీలన, కొంచెం ఆలోచన రచయితల్ని సరైన మార్గంలో పెడతాయి.

నేను చెప్పినవన్నీ మామూలు విషయాలు. పేపర్లో విషయాలు. నాది ప్రాధమిక జ్ఞానం. నాది వానాకాలం చదువు. కానీ కనీసం ఈ చిన్న విషయాలు సంపాదకులు రచయితతో చర్చించి వుంటే పాఠకులకి ఒక మంచి కథ దొరికి వుండేది.

 

 

 

 

 

Download PDF

8 Comments

  • manjari lakshmi says:

    చాలా బాగుంది చిత్రగారూ మీ విమర్శ. అరుణతారలో ఎన్. రుక్మిణిగారి కథ కూడా అంత బాగా లేదు. తండ్రి కులం గురించి పిల్లలకు పెద్దయ్యే దాకా తెలియదంటే నమ్మ లేము. చుట్టు పక్కల వాళ్ళన్నా అనకుండా ఉంటారా. తల్లి పిల్లలు విల్లాల్లో ఆడుకుంటమ్ కోసం ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చోవటాన్ని సమర్ధిస్తున్నట్లుగా కూడా రాశారు. ఈ కథ మీద కూడా మీ అభిప్రాయం చదవాలని ఉంది.

    • chitra says:

      మేడం గారూ మీ సమయం వెచ్చించి చదివినందుకు ధన్యవాదాలు. రుక్మిణి గారి కథ QUEEN విక్టోరియా మళ్ళీ నవ్వింది ఫై నా అభిప్రాయం అందరికీ పంపాను. మీ మెయిల్ ఇవ్వగలిగితే మీకు కూడా పంపుతాను . శ్రద్ధ గా చదివే పాట్హకుల కోసం చాలా ఎదురు చూస్తున్నా. CHITRAMARAO@GMAIL.COM

      • manjari lakshmi says:

        మీరు 15 రోజులై ఏమీ రాయకపోతే మీరు వ్యాసాలు రాయటం వరకే పరిమితమేమో అనుకున్నాను. నా ఇ-మెయిల్ అడ్రస్ manjari.lakshmi57@gmail.com.

  • Thirupalu says:

    సారంగ లో ఇంత మంచి విశ్లేషనాత్మక రచనలు వస్తాయని ఇప్పుడే చూశాను.
    మీవిశ్లేషణ చాలా చైతన్య వంతంగా ఉంది!

  • Sivakumar Tadikonda says:

    “పంచరంగుల ముద్రణామోహానికీ, లక్షల పాఠకులనే గ్లామర్కి లోనవ్వకుండా ‘అరుణతార’ లాంటి పత్రికని ఎన్నుకోవడం మరింత మంచి విషయం.” అంటారు చిత్రగారు మొదట్లోనే ఈ విశ్లేషణలో. ఏ కథగానీ లేక చర్చగానీ ఒక భావానికీ, ఒక ఇజానికీ పరిమితమవుతూ అలాంటి భావాలనీ, ఇజాలనీ ప్రోత్సహించే మాధ్యమాలలో మాత్రమే దర్శనమివ్వడం, echo chambersలో మాట్లాడుకోవడంవంటిది. అలా కాకుండా, అందరికీ అందుబాటులోవుండే పత్రికలలో ప్రచురితమవుతే కథలో / చర్చలో వెలువరించిన భావాలని స్పష్టీకరించడానికీ లేక దానిలోని లోటుపాట్లు సవరించుకోవడానికీ, వేరే అభిప్రాయాలవల్ల ప్రభావితంకావడానికీ ఆస్కారం దొరుకుతుంది. అలాంటప్పుడు limited circulation వున్న “అరుణతార”లో ఈ కథని ప్రచురణకి పంపడం మంచివిషయమెలా అవుతుంది? దీన్ని ఉత్తమ కథగా ఎంపికజేసి కథా సంకలనంలో చేర్చడంవల్ల ప్రచురణకు దాదాపు పదిసంవత్సరాల తరువాతకూడా ఈ విశ్లేషణకి తావునిచ్చి ఆ సంకలనకర్తలు మేలే చేశారేమో?
    “ఇది వుత్తమకథగా కూడా ఎన్నికైంది.” అంటారు మొదటి పేరాలో. ఉత్తమకథగా ఎన్నిక కాకపోతే చిత్రగారు ఈ కథనిగూర్చి పట్టించుకునేవారు కాదా? అలా అయితే, ఈ విశ్లేషణ ఆ ఎంపికచేసినవారికి మాత్రమే పరిమితమా? వార్షిక కథా సంకలనాలకి “ఉత్తమ” అని బిరుదుని ఆ సంకలనాలు ఇవ్వడం నిజమేగానీ, అది ఆ సంకలనకర్తల స్వాభిప్రాయం మాత్రమే అనుకోవచ్చుగా! పైగా, ఆ కథలు ఎలా ఉత్తమ కథలయ్యాయో వారెక్కడా వివరింపరు. ఇలాంటి పరిస్థితిలో ఈ విశ్లేషణ రచయిత్రికి ఎలా తోడ్పడుతుంది?
    “నాది ప్రాధమిక జ్ఞానం. నాది వానాకాలం చదువు.” అంటూనే చిత్రగారు “ట్రాట్స్కీ”, “ఎంగెల్స్”, “పో” ఏమన్నారో చెబుతారు; “ISMA”, “NFCSF”నీ ఉటంకిస్తారు – ఈ రెండు సంస్థలేవో ఈ విశ్లేషణని చదివేవారికి ఎలా ఉపకరిస్తాయో కథని చదవడానికీ, అర్థంచేసుకోవడానికీ తోడ్పడతాయో ఈ చదువరికి తెలియలేదు. NFCSF అధ్యక్షుడు, కార్యదర్శీ ఏమన్నారో చిత్రగారు చెబుతారు; ప్రతీ సంస్థా వెలువరించే రిపోర్ట్లకీ, నిర్ణయాలకీగూడా వ్యతిరేకత వుండొచ్చునన్న విషయం చిత్రగారి అభిప్రాయంతో స్పష్టమవుతుంది. All Ph.D.s are not equal. నా పాత కొలీగ్ ఒకసారి అన్నాడు – “95% of the doctors did not graduate in the top 5% of their class.” అని. ఈ అబ్సర్వేషన్ ప్రతీ ఫీల్డ్కీ వర్తిస్తుంది. నిజాన్ని ఒప్పుకోవడం సాధారణంగా కష్టమవుతుంది అన్నదానికి ఉదాహరణగా సూర్యోదయంగూర్చి వున్న భావనని చెప్పుకోవచ్చు. “సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు” అని ఇప్పటికీ అంటారు – అది సూర్యుడు చేసే పని కాదు, భూమి తనచుట్టూ తాను తిరగడంవల్ల కలిగే ఫలితం మాత్రమేనని తెలిసిన తరువాతకూడా. అలాగే, ఆ 95% శాతం వాళ్లల్లో ISMA, NCFSF అధికారులుండొచ్చు, మిగిలిన 5%లో చిత్రగారుండవచ్చు. బళ్లు ఓడలయి చిత్రగారు ఆ సంస్థల అధికారుల్లో ఒకరయినాగూడా వారు వెలువరించే రిపోర్టులమీద బయటినించీ విమర్శ వస్తుందనేది నిర్వివాదాంశం. ఈ నిజానికి చిత్రగారు తమ ఆలోచనల్లో చోటివ్వాలి.
    అందరూ బావిలో కప్పలే ననేది కథలోనే స్పష్టమవుతుంది – “బ్యాంకుల కిప్పుడు అప్పులిచ్చేది … ఒక యాపారమయిపోయుండాది .. రైతుల్ని ముంచేదానికి …” అంటుంది రత్నమ్మ. ఆమె వుండేది మరీ చిన్న బావిలో – బ్యాంకులెప్పుడూగూడా దేశ సేవకై స్థాపింపబడలేదనేది ఆమెకి తెలియదు. రాఘవయ్య వున్నదిగూడా ఒక బావిలోనే అయినా, ఎరువులూ, విత్తనాలూ, నీళ్లూ, అన్నీ కొనాల్సిరావడంతో ఏ పంటేసినా గిట్టుబాటు కావడంలేదన్న విషయాన్ని అర్థంచేసుకున్నవాడు. “వందకోట్లు చేసే ఫ్యాక్టరీని రెండుకోట్లకి బేరం పెట్టారంటన్నా ..” అనేడుస్తాడు రవణయ్య. ఆ విలువల తేడాకి ఎన్నో అంశాలు దోహదంచేసినప్పటికీ, “ఎక్కడివాళ్లక్కడ గాదెకింద తవ్వుకు తినడ” మనే అంశం మాత్రం ప్రత్యేకంగా కనిపించి, అందరికీ కనపడ్డా ఏమీ చెయ్యలేని నిస్సహాయత భారతదేశానికిమాత్రమే ప్రత్యేకతలాగా కనిపిస్తుంది అతనున్న పరిధిలో. (As an aside, I highly recommend “Confessions of an Economic Hitman” by John Perkins.) చంద్రశేఖరంవున్న బావి పరిధి ఇథనాల్ తయారీగూర్చి, దానివల్ల ప్రయోజనాలగూర్చీ అతనికి తెలియజేసింది. అతని పరిధికన్నా చిత్రగారి పరిధి విస్తృతమనేది నిర్వివాదాంశం. అయితే, ఈ కథలోని పాత్రలకి అంతకంటే విస్తృత పరిధినివ్వాలంటే రచయిత్రి ఆ పాత్రల్లోకి పరకాయప్రవేశంచేసి ప్రతీ పాత్రనీ ఒక సర్వజ్ఞుడిగా, సర్వజ్ఞురాలిగా (“ట్రాట్స్కీ”, “ఎంగెల్స్”, “పో” లని కాచి వడపోసినవారిలాగా) మలచాలి (కొన్ని తెలుగు సినిమాల్లో నౌకర్ పాత్రధారి గొప్ప వేదాంత బోధ చేసినట్లుగా). అదప్పుడు కథ కాక వ్యాసమవుతుంది. అయినప్పటికీ, అది ఆ వ్యాసకర్తవుండే బావి పరిధిని చూపడానికి మాత్రమే సహాయపడుతుంది. రచయిత్రి సర్వజ్ఞురాలయినాగూడా కథని నిస్సహాయతని ప్రతిబింబించేలా రాయగలగడం గొప్పే అవుతుంది తప్ప ఏమాత్రం తక్కువకాదు.
    “కనీసం ఈ చిన్న విషయాలు సంపాదకులు రచయితతో చర్చించి వుంటే పాఠకులకి ఒక మంచి కథ దొరికి వుండేది.” అని ముగిస్తారు చిత్రగారు తమ విశ్లేషణని. అయితే, వారి విశ్లేషణకి చాలా పెద్ద కాన్వాస్ కావలసి వచ్చింది. విశ్లేషణ రచనకీ, రచనలో వెల్లడయిన, వెల్లడించివుండవలసిన భావాలకీ పరిమితం చెయ్యడమనేది నేనొక రచయితగా ఆశిస్తాను. ఇక్కడ, “ఇది ఉత్తమ రచన ఎందుకయింది?” అన్న ప్రశ్న ప్రతిమగారికి కాదు సంధింపబడ్డది (దాన్ని ఉత్తమ రచనగా ఎన్నుకోవడంలో ఆమె చేసిన తప్పేమిటి – ఒక్క ఆ కథని రాయడం తప్ప?) – కధాసాగర్ సంపాదకులకి. అయితే, చివరివాక్యంతో, “అసలు ఈ కథని మీరెలా ప్రచురించారు?” అంటూ “అరుణతార” సంపాదకులు కూడా ఈ కలాఘాతానికి గురయినవారే. ఈ రెండు ప్రశ్నలూ ఇలా పబ్లిక్ ఫోరంలో గాక వారిని వేర్వేరుగా అడిగి జవాబులు తెలుసుకుని వుండవలసింది.
    చివరగా – “వుత్తమ” ఏమిటండీ, “ఉత్తమ” గాకుండా?

    • ramarao says:

      శివకుమార్ గారూ ! బావుంది రెండు అభిప్రాయాల మీదా మీ ధర్మాగ్రహం చూసాను . మనం మాట్లాడుకోవడం ఎలా?
      chitramarao@gmail.com

  • Ennares says:

    చిత్ర గారూ,

    విషయం గురించి రచయితకున్న knowledge నంతా కథలో ఇరికించటం కథాసంవిధానానికి ఎంత మాత్రం మేలు చేయదు, కథ ఆ తరహాది అయి, పాత్రలూ పరిస్థితులూ చర్చకు అవకాశమిచ్చేవిగా ఉంటే తప్ప. చక్కెర పరిశ్రమ గురించి, బ్రెజిల్ లోని స్థితిగతుల గురించి మీకున్న (లేక మీరు సేకరించిన) సమాచారాన్నంతా ఏకరువు పెట్టి, ఈ విషయం కథలో స్పష్టంగా చెప్పకుండా…, వాళ్ల దోపిడీ, ఆ దోపిడీ సూత్రాల పట్ల ఎరుక కలిగించే ప్రయత్నం చెయ్యకుండా… అంటూ మీరు వాపోవటం ఎంత సమంజసమో ఆలోచించండి. కథ డిమాండ్ చేస్తే తప్ప వివరణలు, చర్చలు కథలో అవసరమా? మామ్, ‘పో’ ల కథల్ని మీరు చదివినట్టు తెలుస్తోంది మీ విశ్లేషణను చూస్తే. మరి ఆ మహా రచయితలు తమ కథల్లో మీరు కోరుకున్నట్టుగా విషయం గురించిన చర్చలు చేశారా? వాళ్లకు ఎంత నాలెడ్జి వున్నా కథలో తాము పాత్ర అయినా అలా చర్చలు చేయలేదనే విషయాన్ని మీరు గమనించలేదా? ఆలోచించండి. రచయితకు ఎంత తెలిసినా కథలో దాన్ని ప్రదర్శించాలనే లౌల్యాన్నుంచి ప్రయత్నపూర్వకంగా తప్పుకోవాలి.

    ఎన్నారెస్

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)