ఛానెల్ 24/7- 16 వ భాగం

sujatha photo

(కిందటి వారం తరువాయి)

 

ఆయనకు దక్షిణామూర్తిని చూడాలనిపించింది. అతన్ని భరించాలనిపించింది. ఆయన తప్పకుండా ఏదో ఒకటి అంటాడు. తన జీవితాన్ని విమర్శిస్తాడు. ఇది కూడదంటాడు. తను ఇంకెలాగో ఉండాలంటాడు. ఆయన తనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. తన స్నేహితుడు. ఆయన ఇంకోలా ఎలా వుంటాడు.

బాయ్‌ని పిలిచి దక్షిణామూర్తిగారిని లోపలికి తీసుకు రమ్మన్నాడు. తను గబగబ వచ్చేశాడు. ఆయన అందరినీ పలకరిస్తూ స్టూడియో బయటే నిలబడ్డాడు. ఆయనకొసం తను ఆగలేదు. ఇప్పుడాయన చెప్పేవన్నీ తన మనసు తనకు చెబుతున్న విషయాలు. తన గురించి తనకు తెలిసినవీ, తన విజ్ఞత తనను మనిషిగా  ఉండమని హెచ్చ్చరిస్తున్నవే. ఇప్పుడు దక్షిణామూర్తి వస్తాడు అనుకొన్నాడు ఎస్ఆర్‌నాయుడు.

***

 

“ఇప్పుడు అడుగుతున్నా మేడం.. మీ పర్సనల్ లైఫ్ ఎందుకు డిస్టర్బ్ చేసుకున్నారో చెప్పండి..”

“నయనా.. నువ్వు ప్రశ్న సరిగ్గా అడుగు. నేను తిన్నగా చెబుతాను. నీ ఆలోచనలోంచి నన్ను చూస్తున్నావు. నా జీవితంలో డిస్ట్రబెన్స్ లేదు. నేనో మార్గం ఎంచుకొని అటు తిన్నగా నడుస్తూ వచ్చాను. ఒక వ్యాపారి తన వ్యాపారం అభివృద్ధి చేసుకొన్నట్లు నాయర్‌తో విడిపోయేసరికి నేను ఎడిటర్‌గా వున్నానని చెప్పానుగా. ఒక పత్రికా నిర్వహణ నా పర్సనల్ లైఫ్‌కి ఎక్కడా టైం కేటాయించనివ్వలేదు. ప్రపంచంకంటే కొన్ని గంటలు ముందుగా నిద్రలేవలసిన ఒక జర్నలిస్ట్ తనని తాను ఎంతగా అప్‌డేట్ చేసుకోవాలో అంతా చేశాను. ఇతర పత్రికలతో పోటీ, నా పత్రిక నిరంతరం సర్కులేషన్ పెంచుకోవటం కోసం నే పడ్డ తపన, నా కేంప్‌లో నేను కలుసుకొనే మనుష్యులు,నా జీవితానికి కేంద్ర బిందువు నా కెరీర్, నేను ఉమెన్ ఎడిటర్‌ని, టాప్‌మోస్ట్ జర్నలిస్ట్‌ని, ఎడిటర్స్ గిల్డ్ మెంబర్‌ని. నా ఎడిటోరియల్స్ గురించి నిరంతరం చదువు విశ్రాంతి లేని నా జీవితంలో నాయర్ ఎక్కడో మాయం అయ్యాడు”

“అంటే  కెరీర్, పర్సనల్ లైఫ్‌కి విలువివ్వదా..?”

“మనం ఒక ప్రవాహంలో వున్నాం. ఉదయం నిద్రలేవటం దగ్గరనుంచి ఆఫీస్ ఫోన్స్, బయటనుంచి కలుసుకోవలసిన వీఇపిలు.  పర్సనల్ లైఫ్‌కి ఒక గీత చెరిగిపోయింది. నాయర్‌తో విడిపోయాక నాకింకో పర్సనల్ జీవితం ఏముంది. పాపాయి చదువుకొంటుంది. బాబాయి కుటుంబంతో వుంది. నాకు ఆమె బాధ్యత లేదు. నేను, నాకోసం చరిత్రలో ఒక పేజీ సంపాదించుకోవాలనుకొన్నాను. అది నా లక్ష్యం.”

“వైఫల్యాలు, నష్టాలు. ఏవీ లేవా…?”

“ఓ గాడ్ నీకింకా అర్ధం కావటం లేదు. నాకోసంగా పిల్లలు లేరు. స్నేహితులు, బంధువులు, విహారయాత్రలు ఏవీ లేవు. తెలుసు కదా. మన పత్రిక పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. చానల్ లాంచ్ చేశాం. పొలిటికల్ ఎడిటర్‌ని. నేనెక్కిన మెట్లు ఏవీ మిగల్లేదు. కానీ నాకోసం వెనక్కి తిరిగి చూస్తె ఈ కెరీర్ వదిలేస్తే నేనేం చేయాలో నాకు తెలియదు. వృత్తి తప్ప నాకేం లేదు.”

“ఇందుకు బాధపడుతున్నారా? ఏమైనా నష్టపోయారా..?”

“బాధపడటం లేదు. నన్నెవరన్నా ఇలా వుండాల్సిందే అని నిర్భంధించారా.. లేదే.. నాకై నేను ఎంచుకొని కోరి వరించిన జీవితం. అటు నష్టపోయానో లేదో అర్ధం కాని జీవితం. నన్ను ఓ మీటింగ్‌లో నా జీవితంలో జరిగిన  యదార్ధ హాస్య సంఘటన, మీరు అందరితో కలిసి నవ్వుకొన్న్న సంఘటన గురించి చెప్పమని అడిగారు. హాస్య సంఘటన అలాంటిదేమీ లేదు. మరపురాని సంఘటనలంటే అవార్దులు తీసుకొనే అవకాశాలు తప్ప ఇంకేం లేదు. దాన్ని నేను నిర్వచించలేక పోతున్నాననుకొంటా..”

“అంటే కుటుంబ జీవితం పాపాయితో గడపటం మిస్ అయ్యారా…?”

“ఏమో,  కుటుంబ జీవితం నాకు ప్రత్యేకంగా అందించిన ప్రత్యేకమైన అనుభవాలు  ఏవీ లేవు. అటు నాన్నగారి సమయబద్ధమైన పొలిటికల్ జీవితం. అందులో ఆయన కుటుంబం కోసం కేటాయించినది ఏదీ లేదు. ఇటు నాయర్ కోరుకొన్న జీవితంలో నేను ఎల్లాగూ లేను. ఆయంతో కలసి ఉన్నంతకాలం ఆయన రాజకీయాలకు చెందిన మనిషే. ఆయనకు పర్సనల్ జీవితం ఉంటే ఆయన సొంత బతుకే. తను గొప్ప వ్యక్తిగా ఎదగటం. మరి ఈ మనుష్యులు నాకు నేర్పింది ఇదేనేమో ”

“కెరీరే లక్ష్యం అయితే ఇంకేముండదా మేడం..”

“ఇంకా అంటే బహుశా లేదేమో.. నీకు ఉద్యోగం లక్ష్యం. ఉదయం లేచి తయారై ఆఫెస్‌కు వస్తావు. సాయంత్రం వరకూ గంటకోసారి న్యూస్‌లో కనిపించాలి. ఇప్పుడే శ్రీధర్ అన్నాడు. ఐదవుతూనే నువ్వు ఇంకో ప్రీ రికార్డెడ్ ప్రోగ్రాంకు అటెండ్ అవ్వాలని. ప్రోగ్రాం కాన్సెప్ట్‌ని బట్టి ఏం కట్టుకోవాలో, ఏ నగలో, ఏ డ్రస్‌లో ఆలోచిస్తావు. నీకు పాప వుంటే దాన్ని గురించి ఉదయం నుంచి ఎన్నిసార్లు ఆలోచించగలిగేదానివి”

నయన ఆలోచిస్తుంది.

స్వాతి ఆమెను చూస్తోంది.

“నయనా.. ఎప్పటి సంగతో చెబుతున్నా. మా పాపకి పన్నేండేళ్లు వచ్చాయి. మొదట్లో నేను గమనించలేదు కానీ, ప్రతిరోజూ నేను ఇంటికి వచ్చేవరకు మేలుకొని వుండేది. ఒక్కోసారి ఆఫీస్‌కు వచ్చేది. చాంబర్‌లోకి రాకుండా బయటనే కూర్చునేది. రిపోర్టర్స్ రూంలో కూర్చుని వాళ్లతో మాట్లాడేది. నేను నా పనులయ్యాక కలిసేదాని. ఇద్దరం కలిసి కారెక్కేవాళ్లం. దాన్ని దగ్గరకు తీసుకొన్నా నాకు ఏదో ఫోన్, నేనేదో ఆఫీస్‌లో ఎవరితోనో ఏదో చెప్పాల్సిన అవసరం, థర్డ్ ఎడిషన్‌లోనో, లాస్ట్ ఎడిషన్‌లోనో చేయాల్సిన మార్పులు, లాస్ట్ మినిట్స్‌లో వచ్చిన ఫ్లాష్ న్యూస్ ఏదో ఒకటి నా మనసంతా. పోనీ ఏ మీటింగ్‌కో కలిసి వెళ్ళేవాళ్లం. ఆ మీటింగ్‌లో నేను మొత్తంగా వుండగలను. కానీ పాపాయి పాత్ర ఎంతవరకూ. మొదటిసారి అందరూ పలకరిస్తారు. ఇంకా దగ్గరివాళ్లయితే దగ్గర కూర్చోమంటారు అంటే. నేను తనని ఎంత ఎంగేజ్ చేయగలను” అంది.

“నెమ్మదిగా తర్వాత మానుకొందనుకొంటా” స్వాతి ఆలోచిస్తూ ఊరుకొంది.

తలెత్తి చినంగా నవ్వింది

“ఆమె పెళ్ళి కోసం ముందుగా వారం రోజులున్నాను. ఇంట్లో పెళ్ళయ్యాక తను అమెరికా వెళ్ళే ఏర్పాట్లలో వుంది. తను వెళ్ళేందుకు రెండు నెలలు పట్టింది. ఆ రెండు నెలల్లో రెండు సార్లు తన కోసం వెళ్ళేను. మొత్తం పాపాయి కోసం నేను సంవత్సరంలో నాలుగైదు రోజులు కేటాయించానేమో. ఇంట్లోనే వున్నా పెద్దగా కలిసి లేము. నా పనుల్లో నేను, పాపాయికి నేనేం ఇచ్చాను. తనను కనటం తప్ప”

“ఇప్పుడు అమ్మలా ఆలోచించారు” నవ్వింది నయన.

“అంటే నయనా. మన సొసైటీలో స్త్రీలకు ప్రత్యేకమైన ఫార్మేట్ వుంది. ఆమె ఎలా వుండాలో ఎవరో ఆలోచించి డిజైన్ చేసి ఇచ్చిన ఫార్మెట్. దాన్ని సొసైటీ ఆమోదించింది. ఆమె ఇలా ప్రేమించాలి. ఇలా పెళ్ళాడాలి పిల్లల్ని కనాలి. కుటుంబానికి ఇలా సేవ చేయాలి. ఆమె మనసులో ఈ స్థాయిలో మెల్టింగ్ పాయింట్ వుండాలి. మరి నేను అలా కాకుండా ఇంకోలా వుంటానంటే అతిగా లేదూ. ఈ స్వేచ్చని ఎవరు ఎలా ఆమోదిస్తారు. ఇటు నాయర్‌ కోసం విచారించకా, అటు పాపాయిని సరిగ్గా తల్లి పాత్రలో వుండి చేరదీయకా, స్వాతిలాగా కెరీరిస్ట్‌గా నిలబడ్డానంటే నాకేం విశేషణాలుంటాయి చెప్పు”

నయన తడబడింది. నిజం మాట్లాడితే ఏం బావుంటుంది. తన ఉద్ధేశ్యంలో తన దృష్టిలో ఈవిడ చాలా స్ట్రిక్ట్. ఎండితో కలిసి ప్లాన్ వేస్తే అవతలవాడు మటాష్, తను ఏదైనా కావాలనుకొంటే ఎలాగైనా సాధిస్తుంది. దయాదాక్షిణ్యాలు లేవు. ఇంకా అబ్బో.. ఎవర్నీ ప్రేమించదు. శిఖండి. ఏం మనిషిరా బాబూ అనేవాళ్ళే ఎక్కువమంది. ఎంతదాకా ఎందుకు. తనకే పదిసార్లు హెచ్చరికలు చేసింది. గ్రూప్‌లు కట్టకూడదంటుంది. అతి చనువు కూడదంటుంది. అనవసరమైన రిలేషన్స్ పెంచుకోవద్దంటుంది. బహుశా కళ్లెత్తి చూస్తే ఆవులిస్తే పేగులు లెక్కపెడుతుంది. నయననే చూస్తున్న స్వాతి నవ్వింది.

“నేను నీ ఆఖరి ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. ” అన్నది.

నయన కంగారుగా చూసింది.

“ఇంకేం లేదు మేడం” అన్నది.

“ఇంకేమున్నాయో ఆలోచించుకో. నీకు ఇరవై నిముషాలే టైం” అన్నది కుర్చీలో హాయిగా రిలాక్సయిపోతూ.

***

దక్షిణామూర్తిగారు డోర్ తెరుచుకుని లోపలికి వచ్చారు. ఫోన్‌లో మాట్లాడూతున్న ఎస్ఆర్‌నాయుడు లేచి ఆయన్ను కూర్చోమన్నట్టు తన ఎదురుగ్గా వున్న చూపించి మర్యాద చేశాడు. ఆఫీస్ మొత్తం బాంబే నుంచి వచ్చిన ఇంటీరియర్ డెకొరేషన్ ఎక్స్‌పర్ట్ డిజైన్ చేశాడు. చాలా అందమైన ఆఫీస్. దక్షిణామూర్తి తన కాబిన్‌ను ఆశ్చర్యంగా చూస్తున్నాడా లేదా ఆయన మొహం వంక చూస్తున్నాడు ఎస్ఆర్‌నాయుడు. కూర్చుంటూ పై కండువాతో ముఖం తుడుచుకొంటూ ఎదురుగ్గా రాక్స్‌లో వున్న పుస్తకాల వంక చూస్తున్నాడు.

“భోజనం చేద్దాం దక్షిణామూర్తిగారూ” అన్నాడు ఎస్ఆర్‌నాయుడు.

దక్షిణామూర్తి తల వూపాడు.

“ఫ్రెష్ అవుతారా?” అన్నాదు ఎస్ఆర్‌నాయుడు.

“వస్తూ బాత్‌రూంకు వెళ్ళివచ్చా” అన్నాడాయన.

ఆయన ఖద్దరు షర్ట్, జీన్స్ పాంట్ తమాషాగా వుంటుంది. ఆ కాంబినేషన్ పైన ఖద్దరు తువ్వాలు వంటిది మెడచుట్టూ వేసుకొంటాడు. ఎస్ఆర్‌నాయుడు చాలా స్టయిల్‌గా వుంటాడు. చక్కని మడత నలగని షర్టు నలుపు తెలుపులుగా వున్న ఉంగరాల జుట్టు చక్కగా దువ్వుకొని  ఎప్పుడు పడితే అప్పుడు లైవ్‌లో కనిపించటానికి వీలుగా రెడీగా వుంటాడు.

భోజనం వచ్చింది. ట్రేలో వున్న డిష్‌లన్నీ ఒక్కోటి తీసి చూస్తున్నాడు దక్షిణామూర్తి. నాకు సాంబార్ చాలోయ్ అన్నాడు బాయ్‌తో. బటర్ నాన్, పుల్కా కూడా ఉన్నాయి సార్ అన్నాడు బాయ్. వద్దులేవయ్యా రైస్ తింటాను అన్నాడాయన.

“ఎలా వుంది చానల్” అన్నాడు ఎస్ఆర్‌నాయుడుతో.

“చూస్తున్నారుగా సెకండ్ ప్లేస్‌లో. అటూ ఇటూ ఫస్ట ప్లేస్ కూడా”

“అవును చాలా సెన్సేషనల్ చేసావు” అన్నాడు దక్షిణామూర్తి.

తింటున్నది గొంతులో పడ్డట్టు అయింది. సెన్సేషనల్ అంటే ఈయన వెక్కిరింతా పొగడ్తా.

“మొన్న మీ చైర్మన్‌గారు ఎయిర్‌పోర్టులో కలిశారు.  చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆయనకు పవర్ ప్రాజెక్ట్ వచ్చిందంటగా. మీ కృషి చాలా వుందన్నాడు.

తింటున్న భోజనం కమ్మగా లేదనిపించింది ఎస్ఆర్‌నాయుడుకు.

చైర్మన్ ఆదికేశవులుకి ఎన్నో బిజినెస్‌లు వున్నాయి. ఎన్నో సంస్థల్లో పెట్టుబడులున్నాయి. ఈ చానల్‌లో ఆయనకూ షేర్స్ ఉన్నాయి. నేనూ స్వాతీ డైరెక్టర్స్ . తెలుసు కదా..”

“ఆయన తమ్ముడు శ్రీరంగనాయకులు నేనూ క్లాస్‌మేట్స్”

ఈసారి దగ్గొచ్చింది ఎస్ఆర్‌నాయుడుకు. ఇది తనకు తెలియదు.

“అయితే పెద్దయ్యాక ఎప్పుడూ రిలేషన్స్‌లో లేము. మొన్నమాటల్లో చెప్పుకొన్నాము. శ్రీరంగనాయకులు మినిష్టర్ అయ్యాక నేను కలుసుకొన్నది లేదు. ఇష్యూ బయటికి వచ్చాక నీతో మాట్లాడాలనుకొన్నా.”

ఎస్ఆర్‌నాయుడుకు ఏం మాట్లాడాలో తోచటం లేదు. ఆదికేశవులు కాలేజ్ సంగతి ఎక్కడా బయటకు రాకుండా తనే చూశాడు. గవర్నమెంట్ లాండ్ అది. లీజ్‌కు తీసుకొన్నారు. పర్మిషన్స్ తెచ్చుకోవచ్చునని బిల్డింగ్స్ కట్టేశారు. ఆ స్థలం లీజుకు ఇచ్చినందుకు అప్పటి కమీషనర్‌ను కోటీశ్వరుణ్ణి చేశాడు ఆదికేశవులు. ఆయన ఆస్తులు సగం తన పేరుపైనే ఉన్నాయి. ఈ చానల్‌లో తను పెట్టిన షేర్లు అతను ఇచ్చినవే. వాళ్ల కోసం తను ఏం చేస్తే సరిపోతుంది..?”

“నువ్వు చాలా రిస్క్ తీసుకొంటున్నావు. నీతో మాట్లాడాలనే వచ్చా. ఓన్లీ ఫ్రెండ్లీగా. నువ్వు స్వాతి కలిసి డెయిలీని ఎన్నో ఎడిషన్లు చేశారు. ఆ పెట్టుబడి ఎక్కడిదో నాకు తెలుసు. ఈ చానల్ పెట్టుబడీ నాకు తెలుసు. స్వాతి నాన్నగారు బతికుంటే ఇదంతా జరిగేది కాదు. ఒకప్పుడు ఆ పత్రికకు ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఉండేది. అవ్వాళ్టి పార్టీ లీడర్స్‌కి పదవులు లేవు. ప్రజాసేవ తప్ప. ఆదికేశవులు దాన్ని టేకోవర్ చేశాడని అందరికీ తెలుసు. బయట నువ్వు చాలా బద్నామ్ అవుతున్నావు”

ఇంత చెబుతూ తాపీగా అన్నం తింటున్న మనిషి వైపు తెల్లబోయి చూస్తున్నాదు ఎస్ఆర్‌నాయుడు.

“పత్రిక, చానల్ అడ్డంపెట్టి ఎన్నింటికి పర్మిషన్ తెచ్చుకొన్నాడో నువ్వెలా డిల్లీ చుట్టూ తిరుగుతున్నావో నీ తోటివాళ్లు ఎంతలా గమనిస్తున్నారో తెలుసా నీకు”

దక్షిణామూర్తి ఏనాడో పాతికేళ్ల గతంలోంచి లేచొచ్చి కూర్చున్నట్టు వుంది ఎస్ఆర్‌నాయుడుకి.

ఇద్దరూ ఎడిటోరియల్‌లో షిఫ్ట్ ఇన్‌చార్జ్‌లుగా పనిచేసేవాళ్లు. ఎడిటోరియల్ రాయటంలో పోటి, రిపోర్టింగ్‌లో పోటీ. కొత్త కొత్త విషయాలు రాయటంలో పోటీ. ఆరోగ్యకరమైన పోటీలో ఇద్దరూ వెలిగిపోతుండేవాళ్లు.

“నాతో శ్రీరంగనాయకులు చెప్పారు. ఒక్క రూపాయి చేతిలోంచి పెట్టకుండా ఎలా సంపాదించారో ఆదికేశవులు చెప్పుకొచ్చాడు. తను మినిష్టరుగా అడ్డమైన లాబీయింగ్‌లతో ఎన్ని కాంట్రాక్టులు, ఎన్నో పర్మిషన్లు ఇప్పిస్తూ వాళ్లందరిచేత ఈ చానల్‌లో పెట్టుబడులు పెట్టించాడో, మొత్తం చానల్స్‌లో టాప్‌లో ఎలా ఉందో చెప్పాడు నాకు. నువ్వు స్వాతి ఎవరెవరికి కొమ్ము కాస్తున్నారో, ఏం స్టోరీలు చేస్తున్నారో, ఎవరిని ఎలా బెదిరిస్తున్నారో, ఇవన్నీ నీకు వాళ్లు తెలిసే చేస్తున్నావా? ఆదికేశవులు బావున్నాడు. వాళ్ల తమ్ముడూ బావున్నాడు. వాళ్ల ఆస్తులు , పిల్లలు అంతా బావున్నారు. మరి నువ్వెలా వున్నావు? ఇదంతా నీకెందుకు నీ అంత మంచి రైటర్ ఎవరున్నారు? నీ పిల్లలు బుద్ధిమంతులు. చక్కగా చదువుకొన్నారు. నీకు కోట్ల ఆస్తులు లేకపోతే ఏం.. ఎందుకిదంతా. ఆదికేశవుల్ని ఎదిరించాడని. ఆ కల్నల్ పర్సనల్ లైఫ్ చానల్‌లోకి లాగి నవ్వుల పాలు చేశావు. ఆయన ఎవరిని చేరదీస్తే నీకెందుకు. ఎదుటివాళ్ల బెడ్‌రూమ్స్‌లోకి తొంగిచూడాలా నువ్వు”

తినటం ఆపి దక్షిణామూర్తి వైపు చూస్తున్నాడు నాయుడు. ఆయనకు ఊహించని దెబ్బ ఇది. దక్షిణామూర్తిని ఎలా తొక్కేయాలా అని ఉదయం నుంచి ఆలోచిస్తున్నాడు తను. ఉద్యోగం సద్యోగం లేక దిక్కులేక ఉన్నాడనుకొన్నాదు. ఈయన తనకే పాఠాలు చెబుతున్నాడు.

“నీకు నేను చెప్పటం ఏమిటి అని ఆలోచించాను. నేను పత్రిక వదిలేశాక నీకు తెలుసుగా పుస్తకాల ట్రాన్స్‌లేషన్ పెట్టుకొన్నాను. మానవ చరిత్ర పన్నెండు వాల్యూమ్స్ అయ్యాయి. తెలుగు మాండలికాలు తయారయ్యాయి. పిల్లల పుస్తకాలు చాలా చేసాను. ఒక రకంగా ఇదివరకటి కంటే తీరిక లేకుండా వున్నా. మనం చేయవలసిన పనులు ఎన్నో వున్నాయి. అవన్నీ వదిలేసి ఇప్పుడిలా.. ఇదంతా ఎందుకు? నాకు తోచింది చెప్పాను. వినటం, వినకపోవటం నీ ఇష్టం.” అన్నాడు ఎస్ఆర్‌నాయుడు వంక చూసి.

ఎస్ఆర్‌నాయుడుకి నోటమాట రాలేదు. పాతికేళ్ళ గతంలోకి నడిచిపోయి దక్షిణామూర్తితో కలిసి రాత్రివేళ లాంగ్ డ్రైవ్ చేయాలనిపించింది. పత్రిక వృద్ధిలోకి రావటం కోసం కొత్త కొత్త ప్రయోగాల కోసం రాత్రిళ్ళు నిద్రపోక  మేలుకొని చేసిన చర్చలు గుర్తొస్తున్నాయి. ఎక్కడో తమ స్నేహం, జీవిత మాధుర్యం చేజారాయి. తను తుఫానులో కొట్టుకుపోయాడు.

“తినలేను” అన్నాడు నీరసంగా తింటున్న ప్లేటు వదిలేసి.

“తిను తిను.. నేను కంపెనీ ఇస్తా. ఇంకా ఫ్రూట్ సలాడ్ వుంది చూశావా?”అన్నాను దక్షిణామూర్తి కప్పు చేతిలోకి తీసుకొని.

ఎందుకో దక్షిణామూర్తిపైన కోపం రాలేదు. తన హోదా తన చానల్. తన గొప్పతనం ఏవీ గుర్తు రాలేదు. తనను నిలదీసే ధైర్యం ఎవ్వరికుంటుంది. తను ఎవ్వరికైనా సమాధానం చెప్పుకోవాలా అంటే తన మనస్సుకే అనుకొన్నాడు. శాంతిగా అనిపించింది. తీరిగ్గా భోజనానికి ఉపక్రమించాడు. రూం చల్లగా వుంది.

 

దక్షిణామూర్తి తాపీగా ఫ్రూట్ సలాడ్ తింటూనే వున్నాడు. చుట్టూ నిశ్శబ్దం కానీ, రూమ్ నిండా గడ్డకట్టుకుపోయిన మాటలున్నాయి.

***

“లాస్ట్ క్వశ్చన్.. ఉద్యోగం ఎందుకు వదిలేస్తున్నారు?”

నవ్వింది స్వతి.

“ఎప్పుడో ఒకప్పుడు దాన్ని వదిలేయాలి. ఇంకా పదేళ్ల తర్వాత వదిలేస్తే మిగతా జీవితం కోసం ఏదైనా ప్రిపేర్ అయ్యే టైం వుండదు. ఇప్పటికే చాలా లేట్”

“ఇప్పుడేం చేయాలి మీరు”

“ఇప్పటిదాకా చేయకుండా వదిలేసినవి, చేత్తో పట్టుకోవాలి. నయనా నేను వారం రోజుల క్రింతం మన ఓల్డేజ్ హోంకి వెళ్లాను. ఈ మధ్య ఆరునెలలుగా అటువైపు వెళ్లలేదు. నాన్న ఉద్యోగం వదిలేక దాదాపు ఎనిమిదేళ్లు.. ఆయన పోయేదాకా అందులోనే వున్నారు. అఫ్‌కోర్స్ల్ దాన్ని, హోంని ఆయనే డెవలప్ చేశారనుకో.. మంచి పుస్తకాల లైబ్రరీ, కామన్ హాలు.. చక్కటి తోటలు.. ఎంత బావుందో తోట  ఇప్పుడు. ఇవన్నీ ఆయన తను ఉండబోతున్నాననే ఇష్టంతో తనకంటే  పెద్దవాళ్ల కోసం, తన తొటివాళ్ల కోసం ప్రేమగా ప్రతి రాయిని చూశారు. నిజంగా హోం ఆయన కొలీగ్స్‌తో నిండివుంది. ఆ వృద్ధాప్యంలో శరీరం ఆయన స్వాధీనంలోంచి పోతున్న సమయంలో కూడా ఎలాంటి జీవితం గడిపారో తెలుసా? అదో మాటల పూలదోట. ఎంతోమంది మేధావులు, చదువుకొన్నవాళ్లు, రచయితలు, పొలిటిషన్స్ అందరూ వృద్ధులే. ఒక తెలివైన వాతావరణం, బాధని నవ్వుకొనే ధైర్యం, మృత్యువుని ఎదుర్కొనే నిర్లిప్తత. నొప్పిని పంచుకొనె ప్రేమ, ఒకళ్ల కోసం ఒకళ్ళున్నామనే ఓదార్పు.. ఓ గాడ్ ఎలా వుండేదో హోం. నేను నాన్న వున్నంతకాలం దాన్నలా ఫీలవలేదు. ఎంతో నిర్లిప్తంగా అదే నా  ఉద్యోగంలా ఎవరెవరు ఏం కావాలని చెప్తారో అవన్నీ కొనుక్కుని, డాక్టర్ విజిట్స్ అటెండవుతూ అందరి ఆరోగ్యం విచారిస్తూ అదొక పని, అందులో నా ఆనందం, హృదయం పెట్టలేదు. ప్రతివాళ్లు ఏదో ఒకటి ఎలాంటి కోరికలు కోరేవాళ్లూ. పేపర్లు, రంగులు. ఒకాయనకి సంగీతం నేర్చుకోవాలనిపించి సంగీతం మేష్టారు, ఒకాయనకి మంత్రాలకు అర్ధం తెలుసుకోవాలని సంస్కృతం వచ్చినాయన సాయం. ఇలాంటివి. ఎవరేనా ముసలాళ్ళు ఇలాంటి కోరికలు కోరతారా? వీళ్లు స్వీట్ సిక్స్‌టీస్ వాళ్లు, నిత్యయవ్వనంతో ఉండేవాళ్లు. ఇది ఇప్పుడు చెబుతున్నా. కానీ అవ్వాళ అది నాకు అంతులేని చాకిరి. వాళ్లందరూ అడిగినవన్నీ నేను నా ట్రెయినీలు, మేనేజర్లు పోయి కొనుక్కురావటం అందరికీ అందాయా లేదా టిక్ పెట్టుకోవటం అదే తెలుసు. కానీ నేను వారం క్రితం  వెళ్లానా? అక్కడ మా చిన్నప్పుడు మాకు వంట చేసి పెట్టిన మా పెంపుడు తల్లి తొంభై ఏళ్ళ ముసలామె నన్ను చూడాలని కోరింది. ఆవిడకు జ్ఞాపకశక్తి పోయింది. నన్ను, నా భర్తని, నా పాపని  చూడాలని అడుగుతోంది. నాకింకా పాతికేళ్ళే అనుకొంటోంది. తీరిగ్గా కూర్చోబెట్టుకొని నా దగ్గర చివరి రోజులు గడపాలని ఉందన్నది. వంటరిగా వుండలేను, పాపా నీతో వచ్చేస్తా. నీ మొగుడు, పిల్లలు వాళ్లతో వుంటానే. అందరూ వెళ్ళిపోయారమ్మా. ఇంతమందిని పెంచాక అందరూ వెళ్లారే. నన్ను ఇలా వదిలేసి వెళ్లిపోతే ఎలా? నన్ను ఇంటికి తీసుకుపో అంటుంది. అందరినీ పిలు  నేను చూస్తాను అంటోంది. ఎవర్ని పిలవాలి? నాతోపాటు ఒకేచోట  ఒకే వంటగదిలో అన్నాలు తిన్న నా స్నేహితులెక్కడ? ఎవరి తల్లిదండ్రులు వాళ్లని పిల్లల్నీ వాళ్లే పెంచలేదు. ప్రజలకోసం పార్టీ కోసం ఎక్కడెక్కడో వాళ్లు వుంటే మేం ద్రాక్ష గుత్తిలో పండుల్లా ఒక్కళ్ళతో ఒక్కళ్ళు ఉన్నాం. ఇప్పుడు పెద్దయ్యాక ఎప్పుడో, ఎక్కడో ఏ పార్టీలోనో, ఏ ఫ్లయిట్‌లోనో కలుస్తుంటారు. ఏరి నా స్నేహితులు? నా పరివారం? నాకేం కావాలో నేనేం చేయాలో నాకు అర్ధం అయింది. నా పెంపుడు తల్లిని నాతో తేలేను. నేనే అక్కడికి వెళ్లిపోతా. నా పాత స్నేహితులను పిలుచుకొంటా. అందరం కలసి మేమంతా కలసి ఈ వయసులొ ఇంకో ప్రపంచం ఏదయినా నిర్మిస్తామేమో చూడాలి. అందరం కెరీర్ కోసం పరుగులు తీశాం. ఇప్పుడెవరు ఎలా వున్నారో, వాళ్లకు కావలసింది దొరికాక వాళ్ల మనసు నిండుగా వుండలేదా.. ఒక్కళ్ళకొకళ్ళం మళ్లీ ఏం కావాలో తేల్చుకోవాలి. నేను ఒక పెద్ద పరయాణం పెట్టుకొన్నాను” అన్నది స్వతి.

మాటల్లో నయన ఎప్పుడో లేచి వచ్చింది. స్వాతి వడిలో తల పెట్టుకొంది. ఆమె చుట్టూ అంతులేని ఎదారి ఉన్నట్లు. ఆమెకు అంతులేని దాహంగా వున్నట్లు, ఆమెకు రెండూ చేతుల నిండా ప్రేమను ఎత్తి ఇవ్వాలన్నట్లు అనిపించింది నయనకు.

స్వాతికి అర్ధం అయింది. నయన జుట్టు సవరిస్తూ..

“కదా నయన.. నాకు చాలా కావాలి. ఎంతో ప్రేమ కావాలి. చాలా పొసెసివ్‌గా ఉండలానిపిస్తోంది నయనా. నా ప్రయాణం కరక్టేనా?” అంది స్వాతి.

“హండ్రెడ్ పర్సంట్ మేడం. మీకోసం ఉద్యానవనాలున్నాయి మేడం. ఎందరమో మీ ఫాన్స్ మీలాగా ఉండాలనుకొన్నాం. మీరే మా అందరి రోల్ మోడల్. మీరంటే మాకెంతో ఇష్టం” అన్నది నయన.

 

***

 

స్వాతి, నయన.. ఎండి చాంబర్‌లోకి వచ్చారు. ఎస్.ఆర్.నాయుడు దీక్షగా ప్రివ్యూ చూస్తున్నాడు. సాయంత్రం టెలికాస్ట్ కాబోతున్న ప్రోగ్రామ్ కం ప్రోమో. శ్రీధర్ నిలబడి చూస్తున్నాడు. హేమమాలిని డాన్స్ బైట్ అప్పటివరకూ చూస్తున్నాడు. కళ్లు మూసుకొని శివార్చనతో వున్న అమె శివుడి గొంతు విని భుజాలు ఒక్కసారి విదిల్చి కళ్లు తెరిచింది. చాలా అందంగా వుంది ఆ బైట్. ఇంకో ప్రఖ్యాత కూచిపూడి నర్తకి స్క్రీన్ పైకి వచ్చారు. ప్రోమో కోసం ఇంట్లో షూట్ చేసినట్లున్నారు. ఆవిడ పాదం కదలికలో ఏదో బరువు తెలుస్తోంది. విశ్వవిఖ్యాత కళకారిణి ఆమె. వయసు దాటాక వచ్చిన చిన్న వణుకు అది పాదాల్లో కూడా తెలుస్తోంది.

“శ్రీధర్ ఈ బైట్ తీసేయ్. ఆవిడ డాన్స్ ప్రోగ్రామ్స్ మాస్టర్ క్యాసెట్స్ మన దగ్గర ఎన్నో వున్నాయి కదా. దాన్లోంచి ఒక చిన్న డాన్స్ తీసుకో. ఆవిడ ఇలా డాన్స్ చేయలేకపోవటం చూపించటం నాకు బాగాలేదు.” అన్నాడు.

“టైం తీసుకొంటుందా?” అన్నాడు మళ్లీ.

“లేదు సర్. ఫైవ్ మినిట్స్ పని. ఇంకా ట్రిమ్మింగ్ చేస్తూనే వున్నారు” అన్నాడు శ్రీధర్.

“ఇప్పుడు ప్రోమో ఇచ్చేద్దాం. తొమ్మిది గంటలకు ప్రోగ్రాం మొదలయ్యే లోపల ప్రతి పది నిమిషాలకు ప్రోమో రన్ చేద్దాం” అన్నాడు మళ్లీ.

తల వూపాడు ఎస్.ఆర్.నాయుడు. ఆయన కళ్లన్నీ హేమమాలిని పైనే వున్నాయి. తన వయసె. ఎంత సిస్టమాటిక్‌గా ఎంత అందంగా ఎలా వుంది ఆమె నృత్యం. కళని ఆరాధిస్తే వచ్చే అవుట్‌పుట్ అది. జీవితం మొత్తంగా నృత్యమే. తనూ జీవితం మొత్తం చేసింది జర్నలిజమే. జర్నలిజమే అంటే విపరీతమైన కాంక్ష. తన ఆలోచన రక్తంలో ఆ కోరిక కలగలసి పోతే ఈ అక్షరాలన్నీ కౌగలించుకోవాలని ఎంత ఆశ. ఆ ఆశకు ఇవ్వాళ్తి రూపం. ఒకప్పుడు తన మనసులో మోగిన పదాలు ఎలాంటివి.. ఎవ్వరివి.. తనలా  ఉండటం కరక్టేనా?

సమ్మెకట్టిన కూలీలు

సమ్మెకట్టిన కూలీ భార్యల బిడ్డల ఆకలి చీకటి చిచ్చుల

హాహాకారం! ఆర్తారావం

ఒక లక్ష నక్షత్రాల మాటలు

ఒక కోటి జలపాతాల పాటలు.

ఇలాంటి అపురూపమైన పదాలు తన మనసుని మోహపరిచేవి. నిద్ర రాకుండా చేసేవి. ఇవే తన జీవితాన్ని వెలిగించాయి. ఈ వృత్తి లేకుండా తను లేదు. ఇవ్వాళ ఆయన మనసు అల్లకల్లోలంగా వుంది.

“ఏంటి సర్ ఆలోచిస్తున్నారు” అన్నది నయన.

ఆయన కళ్లెత్తి చూశాడు. ఎదురుగ్గా స్వాతి. పక్కనే నిలబడింది నయన.

“నువ్వు వెళ్లిపోవాలా స్వాతి?” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు.

నయన మొహం వికసించింది.

“అదే సర్.. అదే సర్..” అన్నది గొంతులో ఇంకో మాట పెగలక.

స్వాతి ఆయన వైపు నిదానంగా చూసింది.

“ఎన్నాళ్లు పని చేసినా ఇంతే కదా. ఎప్పుడో ఒకప్పుడు సెలవిక అనాలి కదా” అన్నది.

“ఒన్ మినిట్ సర్.. శైలేంద్ర కాల్ చేస్తున్నారు. రికార్డింగ్ ఒకటి మిగిలి వుంది సర్. రవళిగారు వెయిటింగ్..” అంటూనే ఫోన్ తీసి శైలేంద్రగారూ వస్తున్నా అంటూ డోర్ తీసుకొని వెళ్లిపోయింది నయన.

“నా పైన కూడా కోపం వచ్చింది కదూ స్వాతి” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు.

“మీపైన అని ప్రత్యేకం ఎందుకు. నేను చెయనిది మీరు చేశారా? మనం తప్పించుకోగలిగమా, ఈ ప్రవాహానికి ఎదురీదటం ఎవరివల్ల అవుతుంది” అంది నిర్లిప్తంగ అస్వతి.

“ఎదురీడటం స్వార్ధం అయితే ఉండిపోతావా?” అన్నాడాయన.

స్వాతి ఏదో అనబోయింది.

ఫోన్ మోగింది. స్పీకర్ ఆన్ చేసాడు ఎస్.ఆర్.నాయుడు.

“సర్ వైజాగ్ నుంచి రిపోర్టర్ రాజు సర్” అంది పి.ఏ.

“ఏమయ్యా” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు.

“స్కూప్ సర్” అన్నాడు రాజు.

స్వాతి నవ్వింది.

“ఏమిటి?”

“సర్ ప్లీజ్ మీరు మరో విధంగా భావించకపోతే చెబుతాను. ఇది ఆఫ్ ది రికార్డ్ అనుకోండి సర్” సందేహిస్తున్నాడు రాజు.

ఆయన మొహంలో నవ్వు మాయం అయింది.

“ఏమయింది రాజూ?”

సర్. ఆదికేశవులుగారి రియల్ ఎస్టేట్ కంపెనీ సీఇఓతో పాటు ఇద్దరు బిజినెస్ మేనేజర్స్ ఇక్కడ గెస్ట్ హౌస్ రెయిడ్‌లో దొరికారు సర్” అన్నాడు.

“వాట్” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు ఉలిక్కిపడి.

“సిఇఒ దొరకటం ఏమిటయ్యా . ఆర్ యూ ష్యూర్?”

“సర్ ప్లీజ్. ఒక్క నిముషం ముందే సర్.. ఇవన్నీ చాలా కాలం నుంచి జరుగుతున్నవే సర్. కాకపోతే ఇవ్వాళ్టి రెయిడ్‌లో పట్టుకొన్నారు. ఆయన రిసార్ట్స్‌లో రాత్రి ఏజంట్ల మీట్ జరిగింది సర్. చాల మంది రియల్ ఎస్టెట్ వాళ్లంతా ఇంతే సర్. కొందరు మార్కెటింగ్ మేనేజర్స్ అసిస్టెంట్లుగా అమ్మాయిలు ఉంటారు సర్. కస్టమర్స్‌తో అమ్మాయిలే డీల్ చేస్తారు కదా. లోకేషన్‌కి తీసుకుపోవటం ఆ తర్వాత చాలా వ్యవహారాలు జరుగుతాయి. కస్టమర్స్‌ని ఎట్రాక్ట్ చేయటానికి…” రాజు చెపుతూనే వున్నాడు.

ఎస్.ఆర్.నాయుడుకి చెమటలు పట్టాయి.

తలెత్తి స్వాతి వైపు చూశాడు.

ఆమె  చిరునవ్వు నవ్వింది.

ఒక్కనిముషం తటపటాయించాడు ఎస్.ఆర్.నాయుడు.

“ఫ్లాష్ న్యూస్ ఇచ్చేద్దాం” అన్నాడు స్వాతితో.

“ఆదికేశవులుగారి మెయిన్ బిజినెస్సే ఇది. ఆయన ఒకేసారి ఇద్దరి గొంతు పట్టుకొంటాడు” అన్నది నవ్వుతూ స్వాతి.

“రాజు అంతటా ఇదే జరుగుతుందా?” అన్నాడు ఆసక్తిగా రాజుతో.

“సర్. ఇది ఆస్తులు కొనిపించటం సర్. మంచి యాడ్స్ చూస్తున్నారు కదా సరి. ఒక్కో వెంచర్ ఓపెనింగ్‌కి ఎన్ని లక్షలు ఖర్చుపెడతారు పబ్లిసిటీకి. ఇందులో బంపర్ డ్రాలు, కిలో బంగారాలు, కార్లు ఎలా వస్తున్నాయి సర్. ఇవన్నీ రిసార్ట్స్‌లో జరిగే మెయిన్ బిజినెస్‌లు ఏమిటి సర్. మీరు ఎరగని విషయాలేమీ లేవు సర్. నాచేత చెప్పిస్తున్నారు సర్ మీరు. మనం స్టార్ హోటల్లో రైడింగ్స్ గురించి ఇచ్చినప్పుడు..” రాజు పాత పురాణాలు మొదలుపెట్టాడు.

“సరే.. నువ్వు శ్రీధర్‌తో మాట్లాడు. ఫ్లాష్ ఇచ్చేద్దాం” అన్నాడు.

“సార్..” అన్నాడు అవతలనుంచి రాజు, అతని గొంతులో ఆశ్చర్యం కళ్లకు కట్టినట్టు వినిపిస్తోంది.

టీవీలో పెద్ద స్క్రీన్‌పైన ప్రోమో వస్తోంది. తొమ్మిదిగంటలకు  ఫుల్ ఫుల్ మూన్.. భూమికి దగ్గరలో చంద్రుడు.

ఎస్.ఆర్.నాయుడు చిరరగ్గా ఫోన్ చేశాడు.

“శ్రీధర్ ఫుల్ ఫుల్ మూన్ ఏంటోయ్.. చక్కని తెలుగు పదమే లేదా.. నాన్సెన్స్…”

స్వాతి నవ్వింది.

“తెలుగులోనే మాట్లాడండి” అన్నది.

ఏ భాషలో మాట్లాడినా రేపు మనిద్దరం ఈ చానల్‌లో వుంటామా…” లేకపోతే ఆదికేశవులు డ్రాప్ అవుతాడా…” భుజాలు ఎగరేసింది స్వాతి.

“నేనయితె హోమ్ కే” అన్నది నవ్వుతూ..

***

 

శ్రీకాంత్ అద్దాల్లోంచి క్రిందకు చూస్తున్నాడు. స్ట్రీట్ చివరదాకా వరసగా వేసిన చెట్లనుంచి పసుపు పచ్చని పూలు ఒక్కటొక్కటీ రాలుతున్నాయి. అద్దాల్లోంచి చూస్తుంటే రోడ్డంటా పసుపు పచ్చని తివాసీలా ఉన్నది. అప్పుడే వచ్చిన ఉత్తరం జేబులోంచి తీశాడు. ఇంతకు ముందు చదివిందే. అక్షరం అక్షరానికి గుండె కొట్టుకుంటూనే వుంది.

శ్రీకాంత్ నువ్వంటే నాకెంతో గౌరవం. నీవంటే నమ్మకం. నాకే కాదు ఈ ప్రపంచంలో అందరికీ నమ్మకం. అవ్వాళ నేనొచ్చినప్పుడు మీరు ఓ ప్రోగ్రాం చేస్తున్నారు. క్రేన్ కెమేరాపైన కూర్చున్నతను మిమ్మల్నెందుకో పైకి వచ్చి ఆ లోకేషన్‌లో ఏదో అబ్జర్వ్ చేయమంటునారు. అతను కిందకు దిగాడు. నువ్వు క్రేన్ పైన ఎక్కావు. క్రేన్ మిమ్మల్ని పైకి తీసుకుపోయింది. చుట్టూ నిలబడ్డ అందరిలో మీ పట్ల ఎంతో ఆరాధన. ఆ రోజు స్ట్రీట్ ప్లే రికార్డ్ చేస్తున్నారు. ఈ ప్రపంచంలో అసమానతలు పోవాలనీ, ప్రపంచం శాంతినే కోరుకుంటుందని, అసలు పిల్లలు ఎపుడూ ఎలాంటి యుద్ధాలని చివరకు అమ్మానాన్న పోట్లాడుకోవటం కూడా వాళ్ల మనసుని గాయపరుస్తుందనే అర్ధం వచ్చేలా మీరు యాంకర్‌కి బిట్ బిట్ ఇంట్రడక్షన్ చెబుతున్నారు. కెమేరా ముందుకు ఒక్కో అడుగు వేస్తూ యాంకర్ డైలాగ్ చెబుతోంది. అప్పుడు మీ మొహం చూశాను.  ఏముందా మొహంలో? .. జుట్టు చెదిరిపోయి గడ్డం పెరిగి అతి మామూలు పాంటూ షర్ట్. కానీ మీ మొహంలో నాకు కనిపించింది ఈ ప్రపంచాన్ని మొత్తం ప్రేమించే కరుణ, మనుష్యులంటే ఇష్టం, దయ, చుట్టూ వున్న వాస్తవాల్ని అర్ధం చేసుకొనే తెలివి. అందరూ శాంతిగా వుండాలంటే నేను సాయం చేస్తానన్న ఆతృత. ఇదంతా చూశాక మీలో .. ఓకే.. మా నాన్న అర్ధం చేసుకొన్నారు. కానీ మా అమ్మకి, అన్నయ్యకి ఎంతో ఆశ్చర్యం. మీ ఉద్యోగంతో నేనేం సుఖపడతాను అంటారు. నాన్న నాకోసం ఎంతో గొప్ప చదువుకొన్న సంబంధం చూశారు. నేను యు.ఎస్‌లో స్థిర పడవచ్చు. కానీ డియర్ శ్రీకాంత్ . మీతో జీవితంలో నాకు శాంతి ఉంటుంది. మీ తెలివితేటలు నాకు సొంతంగా కావాలి. జీవితంలో దేన్నయినా ఇతరులకోసం తృణప్రాయంగా త్యాగం చేయగల మీ మనస్సు, సాహచర్యం నాకు కావాలి. ఎదుటి మనిషి గౌరవం కోసం మీ తాపత్రయం, ఎవరు నొచ్చుకొన్నా మీకొచ్చే కోపం ఇదంతా నాకు ఎంతో ఇష్టం. చాలా త్వరలో నాన్న మీ దగ్గరకు వస్తారు. ఈ సమ్మర్లోనే మన పెళ్లి. పెళ్ళీకి కూడా  ప్రోగ్రామ్స్ అడ్డం వస్తున్నాయంటే మాత్రం నేనూరుకోను.

శ్రీకాంత్ నవ్వుమొహంతో లెటర్ జేబులో పెట్టుకొన్నాడు.

“ఏమిటి అంటోంది” అంటూ వచ్చాడు శ్రీధర్.

“ఏముంది సమ్మర్‌లో పెళ్ళి.. మనం అంటే మేడంకు గ్లామర్..”

శ్రీధర్ నవ్వాడు.

” ఆ గ్లామర్.. పెళ్ళయ్యాక తెలుస్తుంది. ఏ పూటా వేళకి ఇంటికి రాకుండా ఏ నిముషం మన చేతిలో లేకుండా, పండగా, సరదాలు, పెళ్ళి  పేరంటం దేనికైనా సరే ఉద్యోగం చైనా గోడలా అడ్డంగా నిలబడుతుందని తెలియక పిచ్చిది సరదా పడుతోంది.ఔ

“మా దేవత చూడరాదూ. ఆవిడకి నాతో పోట్లాడటానికి ఇప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్‌లు దొరుకుతాయి. చాలా కొత్త తిట్లు నేర్చుకొంది. ఒకే ఒక్క కోరికరా బాబూ వేళకి ఇంటికి రమ్మని. ఆ ఒక్కటీ అడగొద్దంటాను.”

“పెళ్లయితే మనం బుక్కయిపోతామా” అన్నాడు భయంగా శ్రీకాంత్.

“ఇంకో రకంగా నరుక్కొద్దాం బ్రదర్.. ప్రెస్.. ఈ ఐదక్షరాలకే ఈ దేశంలో కాస్త గ్లామరుందా? పోలీసులు ఆపరా, సినిమా టిక్కెట్లు, దేవుడి దర్శనాలు, గెస్ట్‌హౌస్ బుకింగ్‌లు, అడపాదడపా నమస్కారాలు, సెలబ్రిటీల ఫంక్షన్లు, ఫుల్ జోష్ భయ్యా.. నువ్వేం గాబరా అవకు. నే మంత్రం చెబుతాగా?” అన్నాడు శ్రీధర్.

“శ్రీధర్‌గారూ ఎక్కడున్నారు. వైజాగ్ రాజు ఫ్లాష్ ఇస్తున్నాడు ఇటు రండి సర్..” పిసీఅర్ నుంచి ఫోన్‌లో మొత్తుకొన్నాడు కంప్యూటర్ ఆపరేటర్.

“నిజంగా చావొచ్చినా ఆ యముణ్ణి ఫైవ్ మినిట్స్ ఆగమనాలిరా మగడా.. వస్తున్నా..” క్రిందకు పరుగెత్తాడు శ్రీధర్.

జేబులోంచి మళ్లీ ఉత్తరం తీసి పట్టుకొన్నాడు శ్రీకాంత్.

డియర్ శ్రీకాంత్…

 

 

– సమాప్తం –

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)