“చదువుకున్న మూర్ఖుడు” – ఇంకెవరూ? ….

నా సాహిత్య” ప్రస్థానంలో” మా అన్నదమ్ములకీ, అప్పచెల్లెళ్ళకీ ఏ మాత్రం ప్రమేయం లేదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను కానీ అది ఒక విధంగా అబద్ధమే అవుతుంది. ఎందుకంటే, ముందుగానే చెప్పుకునేది నాది పెద్ద “ప్రస్త్హానం” కానే కాదు. ఏదో మామూలు జనతా క్లాసు ప్రయాణమే అయినా ప్రస్థానం లాంటి పెద్ద, పెద్ద మాటలు వాడితే  నా భుజాలు నేనే తట్టుకోడానికి బావుంటుంది కదా అని తంటాలు పడుతున్నాను. ఇక ఎవరయినా ఒక రచయిత అవడానికి వారసత్వం కారణం కానక్కర లేదు. ఆ మాట కొస్తే నాకు తెలిసీ చాలా మంది సాహితీవేత్తలు తమ పిల్లలని . “మా లాగా కథలు, కవిత్వాలు రాసుకుంటూ అవస్థ పడకుండా హాయిగా చదువుకుని ”పైకి” రమ్మని ప్రోత్సహించిన వారే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ “పైకి” రావడం అంటే డబ్బు సంపాదించుకోవడం అని అర్ధం. అందుకే సుప్రసిద్ధ సాహితీవేత్తల సంతానం చాలా మంది అమెరికాలో పబ్బం గడుపుకుంటున్నారు. ఎందుకో తెలియదు కానీ  వాళ్ళల్లో చాలా మంది గోప్యంగానే ఉంటారు. నా విషయంలో మా బంధువులకి  “రాజా గాడు చదువుకున్నాడు కానీ కథలూ, కమామీషులలో పడిపోయి  పైకి రాలేక పోయాడు” అనేదే చాలా మందికి ఉన్న బాధ. నాకు తెలిసీ  నా ముగ్గురు అన్నయ్యలకీ, తమ్ముడికీ, అక్కకీ, ముగ్గురు చెల్లెళ్మా అన్నదమ్ముల, అప్పచెల్లెళ్ళ లలో ఎవరికీ రచనావ్యాసంగం లేదు.

కానీ మా పెద్దన్నయ్య అందరి లాగా కాదు. కొంతమంది పెద్దన్నయ్యలు నిజంగానే పెద్దన్నయ్యలాగా ఉంటారు. నాకే కాదు….మా చుట్టాల్లో కూడా వరసకి ఏమైనా కానీ, అందరికీ మా పెద్దన్నయ్య పెద్దన్నయ్యే! అందరూ ఉహించినట్టుగానే  అతని పేరు మా తాత గారి పేరే….సూర్య ప్రకాశ రావు. మా కుటుంబంలో ‘కలాపోసన కీ కళాకౌశల్యానికీ కూడా ఆయనే పెద్దాయన. ఉదాహరణకి, మా చిన్నప్పుడు, ముఖ్యంగా మా అక్క పెళ్లి కాక ముందు, ప్రతీ ఏడూ సంక్రాంతి, దసరా మాకే కాక కాకినాడ మొత్తానికే పెద్ద పండుగలు. అందుకు ప్రధాన కారణం, ఆ పెద్దన్నయ్య వారాల తరబడి అతి జాగ్రత్తగా అధ్బుతమైన ఊహాశక్తితో మా అక్క పేరిట ఒక సినిమా సెట్టింగ్ లా నిర్మింఛే బొమ్మల కొలువులే!

rajuఇందుతో జతపరిచిన ఫోటో ఒక్కటే మా దగ్గర ఆ నాటి పండుగ రోజులకి గుర్తుగా మిగిలింది. ఈ ఫోటో అస్పష్టంగా ఉన్నా, అందులో ప్రతీ అంగుళమూ నాకు గుర్తే! చుట్టూ రెండు లెవెల్స్ లో ఆర్చీలు మా అన్నయ్య డిజైన్ చేసేవాడు. అంటే అంగుళం వెడల్పు, మిల్లిమీటర్ మందం ఉండే పొడుగాటి ఇనప బద్దీలని గుండ్రంగా, పలకలగా, త్రికోణాలుగా వంచి బొమ్మల కొలువు మందిరం చుట్టూ జాగ్రత్తగా, పడిపోకుండా పెట్టేవాడు. వాత్తికి సరిగ్గా రంగు రంగుల ఉలిపిరి కాగితాలు, ముచ్చి రేకులూ కత్తిరించి జిగురుతో అతికించి సినిమాలో గుమ్మాలకి తోరణాలలా ధగ ధగ మెరిసేలా అతికించేవాడు. అన్నం ఉడకేసి, గంజి వార్చేసి మెత్తటి ఆ జిగురు తయారు చేసి, సుతిమెత్తగా ఉండే ఆ కాగితాలు ముడుచుకుపోకుండా  జాగ్రత్తగా పులిమి, మా పెద్దన్నయ్య పీట మీదో, నిచ్చెన మీదో నుంచుని రెడీగా ఉన్నప్పుడు అందించే అతి ముఖ్యమైన పని  రాజా-అంజీ లు చేసే వారు. అందులో రాజా అంటే నేను. ఆంజి అంటే  నా తమ్ముడు హనుమంత రావు. మేమిద్దరం ఆ పేర్లతో కావాలా పిల్లలలా పెరిగాం. అమెరికాలో కూడా ఇంకా అలాగే ఉన్నాం. ఇక అసలు బొమ్మలకి ముందు ముఫై, నలభై చతురపు అడుగుల వైశాల్యంలో నేల మీద ఒక పువ్వుల తోటా, పర్వతాలు, జలపాతాలు, మధ్యలో మా అగ్గిపెట్టెలతో తనే తయారు చేసిన మా దొంతమ్మూరు లో  మా తాత గారు పెరిగిన మేడ నమూనా వగైరాలు ఉండేవి. అంతా అయ్యాక  బొమ్మల కొలువు అంతా దేదీప్యమానంగా నూనె దీపాలు,  క్రిస్మస్ లైట్ల తో కళ్ళు జిగేలుమనేట్టు ఉండేది. అంతే కాదు, దీపావళి సమయంలో అయితే, మా స్థలం వీధి గుమ్మం నుంచీ ఇంటి ముందు వరండా దాకా సుమారు రెండు వందల అడుగుల దూరం అటూ, ఇటూ స్తంభాలు పాతి, వాటి మీద దీపాలు పెట్టి మంచి రహదారి ఏర్పాటు చేసే వాడు మా పెద్దన్నయ్య. ఈ వింతలన్నీ చూడడానికి కాకినాడలో అందరే కాక, చుట్టూ పక్కల గ్రామాల నుంచి ఎద్దు బళ్ళు కట్టుకుని వచ్చే వారు.  మా రోడ్డు మీద ఆ నాటి ఎద్దు బళ్ల పార్కింగ్ లా ఇక్కడ అమెరికాలో చేస్తే, నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు.  మా పెద్దన్నయ్య ఎంత సరదా మనిషి అంటే మా చిన్నప్పుడు నాకు ఎప్పుడు ఉత్తరం వ్రాసినా “ఒరేయ్ తుమ్మ జిగురూ” అనే సంబోదించే వాడు. ఎందుకంటే మా స్కూలు ప్రాజెక్ట్స్ అన్నింటికీ మా పొలం గట్ల మీద ఉండే తుమ్మ చెట్లకి గాట్లు పెట్టి, జిగురు ఊరాక దాన్ని సీసాలో పెట్టి నాకు తనే పంపించే వాడు. నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా, ఏ సాహిత్య సభ లో పాల్గొన్నా,  వీలైనంత వరకూ  అన్ని సభలకీ వచ్చి మొదటి వరస లో ఆనందిస్తూ, నన్ను ఆశీర్వదిస్తూ కూచునే మా పెద్దన్నయ్య గత ఏడాది (అక్టోబర్ , 2012) లో తన 80 వ ఏట సహజ మరణం పొందాడు.

raju1

2001  లో, కాకినాడలో మాలో చాలా మంది పుట్టిన ఇంటి ముందు తీసిన ఈ ఫోటోలో మా అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్ళు, వారి కొడుకులు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు  వెరసి మా  సన్నిహిత  కుటుంబం.

ఇక మా చిన్నన్నయ్య ప్రభాకర ముర్తిరాజు గారు మద్రాసులో తను ప్రెసిడెన్సీ కాలేజీ లోను, లా కాలేజ్ లోను చదువుకునేటప్పుడు  మరో విధంగా “కలాపోసన” రంగంలో ఒక వెలుగు వెలిగాడు. అప్పటి ప్రపంచ సుందరి టంగుటూరి సూర్య కుమారి నాయిక పాత్ర ధరించిన నౌకా చరిత్ర దృశ్య నాటకానికి సుప్రసిద్ధ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు రచన, దర్శకత్వం వహిస్తే, మా అన్నయ్య సహకార దర్శకుడిగా వ్యవహరించాడు.  టంగుటూరి సూర్య కుమారి లండన్ వెళ్ళక ముందు మద్రాసులో ఉండే ఆ రోజుల్లో ఆమెకి మా చిన్నన్నయ్య అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే వారు.  పైగా మా ఉరి వారే అయిన నటులు విజయ చందర్,  రామ శర్మ,  ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ (విక్టోరియా హాస్టల్ లో తన సహవాసి)  మొదలైన వారితో సాంగత్యం వలన మా చిన్నన్నయ్య ఆ సంగతులన్నీ అత్యంత రమణీయంగా, స్వతస్సిద్దమైన మాటకారితనంతో మద్రాసు నుంచి  కాకినాడ వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటే రాత్రి తెల్ల వార్లూ వినేవాళ్ళం. పైగా కాకినాడ ప్రాంతాల నుండి ఆ రోజులలో ఎంతో అరుదైన విమానం పైలట్ గా శిక్షణ పొందిన వారిలో బహుశా మా చిన్నన్నయ్యే మొదటి వాడు.  నేను ఇటీవల హైదరాబాద్ వెళ్ళినప్పుడు అనుకోకుండా సింగీతం గారిని కలుసుకున్నప్పుడు ఆయన మా చిన్నన్నయ్యనీ, అలనాటి సంగతులనీ గుర్తుకు తెచ్చుకుని  నాతో పంచుకున్నారు. కానీ మా చిన్నన్నయ్య మద్రాసునీ, అక్కడి జీవితాన్నీ వదులుకుని తను కూడా కాకినాడ తిరిగి వచ్చేసి లాయర్ గా పేరు ప్రఖ్యాతులు పొందాడు. రెండేళ్ళ క్రితం అమెరికాలో ఉన్న తన కొడుకులనీ, నన్ను, మా తమ్ముణ్ణీ చూడడానికి ఇక్కడికి వచ్చి, లాస్ ఏంజేలేస్ లో హఠాత్తుగా గుండె పోటుతో  పోయాడు. మా అమ్మా, నాన్నల తరువాత మా తొమ్మండుగురు సన్నిహిత కుటుంబంలోనూ మా చిన్నన్నయ్యదే మొదటి మరణం.  ఆ తరువాత గత అక్టోబర్,  2012 లో మా పెద్దన్నయ్య కూడా పోయాడు.

ఇందుతో బాటు ముచ్చటగా మా కుటుంబం ఫోటోలు  జతపరుస్తున్నాను. మొదటిది 1955  లో తీసినది. అప్పడు మా ఆఖరి చెల్లెలు ఉషా రేవతి యింకా మా అమ్మ కడుపులోనే ఉంది. ఆ ఫోటోలో నేల మీద ఎడం పక్కన బుద్దిగా కూచున్నది నేనే అని సగర్వంగా చెప్పుకుంటున్నాను. రెండోది  పన్నెండేళ్ల క్రితం కాలానుగతిని వచ్చిన మార్పులతో….అంటే వయస్సు మీరిన తరువాత … మా అన్నదమ్ములం, అప్పచెల్లెళ్ళమూ ఉన్న తీసిన మరొక ఫోటో.

raju3.png

1955  లో మా ఆస్తాన ఫోటో గ్రాఫర్ అయ్యగారి సూర్య నారాయణ గారు తీసిన మా అన్నదమ్ముల, అప్పచెల్లెళ్ళ  ఫోటో.  .

 

 

మా చిన్నప్పుడు మా అక్క కి సంగీతము, డాన్సు నేర్పించే వారు. “ఆ అదంతా పెళ్లి సంగీతము, డాన్సు” అని అందరు అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఆలోచిస్తే వాటి ధర్మమా అని నాకు కూడా వాటిల్లో కాస్త ఆసక్తి కలిగింది అనుకుంటాను. మా అక్కకి సంగీతం నేర్పే మేష్టారు భలే తమాషాగా ఉండే వారు. ఒక వేపు ఆ సంగీతం ప్రాక్టీసు జరుగుతూ ఉంటే మరొక పక్క నేను కూడా “మంధర ధారే, మోక్షము రారె..” అనుకుంటూ పాడేసుకునే వాణ్ణీ. అలాగే మా మూడో మేనత్త (దొడ్డమ్మ అనే వాళ్ళం) “ఆకడ, దూకాడ, దూకుడు కృష్ణా రారా..” అనుకుంటూ చాలా పాటలు పాడుకుంటూ ఉండేది.  ఆ పాటకి నాకు ఇప్పటికీ అర్ధం తెలియక పోయినా నా నాటకాల్లో కొన్నింటిలో దాన్ని వాడుకున్నాను. అలాగే  మా అక్క నేర్చుకున్న  పిళ్ళారి గీతాలు , మంధర దారే  వగైరాలు ఇప్పటికీ పాడుకుంటూ నే ఉంటాను…ఏకాంతంగా ఉన్నప్పుడు. నేను పాడుతుండగా ఎవరైనా వింటే కొంప ములిగి పోదూ?

టూకీగా.. నా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండీ లేనట్టు ఉన్న “కలా పోసన” విత్తనాలు…. నాకు గుర్తున్నంత వరకు… ముందే మనవి చేసినట్టుగా నా చిన్నప్పుడు సాహిత్య పరంగా ఏ విధమైన వారసత్వాలు, ప్రగాఢమైన కుటుంబ వాతావరణమూ లేనే లేవు. అందుకే నేను “ఇలా ఎందుకు తయారయ్యానో”  అని మా వాళ్ళు కొందరు ఆశ్చర్య పడుతూ ఉంటారు.  అంటే మా కుటుంబంలో నేను “చదువుకున్న మూర్ఖుణ్ణి.”

Download PDF

4 Comments

  • Bhuvanachandra says:

    చక్కగా హాయిగా కొన్ని దశాబ్దాల లోతుల్లోకి తీసుకెళ్ళారు ……ఒక్కసారి …ఆ మనుషులు …అనుబంధాలు ..మనసులో తిరుగాడి కళ్ళు చెమ్మగిల్లాయి ….శతమానం భవతి రాజుగారూ ………..నమస్సులతో ….భువనచంద్ర

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      దన్యవాదాలు మహాశయా …కించిత్తు విచారం ఏమిటంటే…మా పెద్ద కుటుంబంలో ఇంకా చెప్పదగిన విశేషాలూ, చెప్పుకోదగ్గ వ్యక్తులూ ఉన్నా…వ్రాసే సమయమూ, నిడివీ మొదలైన ఆరణాల వలన కొన్ని మాత్రమే ముద్రణకి నోచుకుంటాయి. మిగిలినవి మనలోనే ఎక్కడో దాక్కుంటాయి.

      –వంగూరి ఛిట్టెన్ రాజు

  • Ramana Balantrapu says:

    నిడివి, సమయాభావం అంటూ సంకోచించక, మొత్తం పూర్తిగా ఎవ్వరినీ వదలకుండా, అన్ని వివరాలతో వ్రాయమని మనవి. సందర్భోచితంగా ఆయా కాలాలనాటి సామాజిక వివరాలని కూడా ఉటంకించ గలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది అతి గొప్ప ఆత్మకథలజాబితాలో తప్పక చేరుతుంది అని నా ధృడ విశ్వాసం.
    రమణ బాలాంత్రపు

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      ఆత్మ కథలలో “గొప్పది” అంటూ ఏమీ ఉండదు అనుకుంటాను. ఒక వేళ ఉన్నా నాది ఆ కోవలోకి వచ్చే అవకాశం లేదు..ప్రతుత పరంపరలో మా కుటుంబనేపధ్యం మీద వ్రాసుకుంటున్నాను. సామాజిక వివరాలు తరువాత వ్రాసే అవకాసం ఉంది.

      —వంగూరి చిట్టెన్ రాజు

Leave a Reply to Ramana Balantrapu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)