మన కథా ప్రయాణం గురించి…ఒక విహంగ వీక్షణం!

telanga

సదస్సు

గమనిక: ” తెలుగు కథ – ప్రాంతీయ అస్తిత్వం ” అనే అంశం పై  ఆగస్ట్ 2,3-2013 న జరగాల్సిన యు. జి. సి. జాతీయ సదస్సు సమైక్యాంధ్ర -తెలంగాణ ఉద్యమాల ఉద్రిక్త వాతావరణం  వలన ఆగష్టు చివరి వారం/సెప్టెంబర్ మొదటి వారానికి  వాయిదా వేస్తున్నాం. మళ్ళీ ఎప్పుడు నిర్వహించేది సరైన తేదీతో సంప్రదిస్తాం.

- వెల్దండి శ్రీధర్

గత రెండు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యాన్ని అనేక అస్తిత్వ ఉద్యమాలు కుదిపేస్తున్నాయి. వర్గం. కులం, జెండర్, మతం, భాష, జాతి, ప్రాంతం… ఇలా వివిధ అస్తిత్వాలు ఎన్నో నూతన పార్శ్వాల్ని ఆవిష్కరిస్తున్నాయి. ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చడంతో పాటు ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే మతం, ఒకే మార్కెట్, ఒకే ఆలోచనా స్రవంతిలోకి మార్చాలని చాప కింది నీరులా వస్తోన్న ప్రపంచీకరణ సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా భిన్న సమూహాలు, భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భిన్న ప్రాంతాలు తమ అస్తిత్వ అన్వేషణలో తమను తాము పునర్నిర్మించుకుంటున్నాయి .

ఈ కోణంలోనే విభిన్న అస్తిత్వ ఉద్యమాలతో పాటే ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం కూడా బలం పుంజుకుంటోంది. అసలు ప్రపంచీకరణకు విరుగుడు స్థానికత లేదా ప్రాంతీయతనే అనే స్పృహతో గత రెండు దశాబ్దాలుగా మానవ సమాజం జీవిస్తోంది. ఈ దృష్టితోనే అనేక దేశాల్లో వివిధ అస్తిత్వ ఉద్యమాలు తలెత్తుతున్నాయి . ఆఫ్రికాలో వివిధ జాతుల అస్తిత్వ పోరాటాలు, శ్రీలంకలో తమిళుల సంఘర్షణ, సోవియట్ యునియన్ విఛ్ఛిత్తి… ఇలా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత దేశంలో ఐతే గ్రీన్ హంట్, టైగర్ ప్రాజెక్ట్ లను, సెజ్ ఉద్యమాలను, ప్రాజెక్ట్ కారిడార్లను ఈ కోణంలోనే చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలోని గిరిజన సంస్కృతిని,  తెలంగాణలోని బొగ్గు నిక్షేపాలను, భాషను, సంస్కృతిని, రాయలసీమలోని రాతి నిక్షేపాలను, గనులను ధ్వంసం చేయడాన్ని, కొల్లగొట్టడాన్ని ఈ దృష్టితోనే చూడాల్సిఉంది. ఈ అన్ని పరిణామాలను గూగీ, మహాశ్వేతాదేవి, అరుందతీ రాయ్ ల నుండి మన తెలుగు కవులు, రచయితల దాకా అనేకులు తమ కవిత్వంలో, కథల్లో చిత్రించారు.

telanga

“ప్రాంతీయ ముద్ర అంటనిదే ఒక కళా రూపానికి జీవం రాదు. జీవితాన్ని చిత్రించదలుచుకున్నప్పుడు, ప్రజల కష్టసుఖాలు నిజాయితీగా వ్యక్తీకరించ దలుచుకున్నప్పుడు ప్రాంతీయతా భావనల ప్రమేయం లేకుండా సాధ్యం కాదు” అంటారు నందిని సిధారెడ్డి. ఒక ప్రాంతం యొక్క దుఃఖ స్పర్శను ఇతరులు ఎప్పటికీ యథార్థంగా చిత్రించలేరు. ఒకని మృత్యువును మరొకడు ఎత్తుకోనట్లే ఒక ప్రాంతం విశిష్టతను మరో ప్రాంతం  ప్రతిబింబించదు. దేనికదే సాటి. ఏ ప్రాంతం ఇంకో ప్రాంతానికి నమూనా కాదు. దేనికదే ప్రత్యేకమైనది. మనిషి ప్రపంచాన్ని ఆవిష్కరించినట్లు ఒక ప్రాంతం ఆ ప్రాంతీయుల ఆత్మను ఆవిష్కరిస్తుంది.

ఏ లక్షణాలైతే మనిషిని ఇతర జంతువుల నుంచి వేరు చేసి చూపుతాయో అలాగే కొన్ని సంస్కృతులు, సంప్రదాయాలు, వేష భాషలు, సుఖ దుఃఖాలు ఒక ప్రాంతాన్ని మరో ప్రాంతంతో వేరు చేసి చూపుతాయి. ఇదే ప్రాంతీయ  అస్తిత్వం. ఈ నేపథ్యంలో ప్రాంతీయ అస్తిత్వ “సోయి” తో అనేక కథలు వెలువడ్డాయి. మన అనుభవం, జ్ఞానం ఎప్పుడూ సంపూర్ణం కాదు. శకలాలు మాత్రమే. తెలుగు కథా సాహిత్యంలో అనేక ఖాళీలున్నాయి. వీటిని అర్థం చేసుకోవడం, కథా సాహిత్య విస్తృతిని తరచి చూడడం, శిల్ప మెరుగుదలకు జరిగిన దోహదాన్ని, మొత్తంగా తెలుగు కథా సాహిత్యాన్ని పునరాలోచింపజేయడం లేదా ఒక విద్యాత్మిక సమీక్ష (Academic Review) చేయడం ఈ సదస్సు ఉద్దేశం.

తెలుగు కథపై అభిరుచిని, విజ్ఞానాన్ని కల్గించడం, తెలుగు కథ సమగ్ర రూపాన్ని దర్శింప జేయడం, తెలుగు కథలో ప్రాంతీయ అస్తిత్వాన్ని చర్చించడం, తెలుగు కథ శైలీ శిల్పాలలో తొక్కిన కొత్తదన్నాన్ని శోధించడం, తెలుగు కథ కాల పరిణామం లో సంతరించుకొన్న మార్పును అధ్యయనం  చేయడం, తెలుగు కథా ప్రయాణంలో మనం ఎక్కడున్నాం? ఏం  సాధించాం? ఎలా ముందుకు సాగాలి? చర్చించడం, తెలుగు సాహిత్యం పై అస్తిత్వ స్పృహతో వెలువడిన కథ ఏ  మేరకు ప్రభావాన్ని చూపిందో పరిశీలించడం సదస్సు లక్ష్య్యాలు.

sridhar

               - వెల్దండి శ్రీధర్,

జాతీయ సదస్సు సంచాలకులు 

 

Download PDF

2 Comments

 • tahiro says:

  శ్రీధర్ గారూ మీ తెలుగు కథ – ప్రాంతీయ అస్తిత్వం సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటున్నా.

  – తహిరో

 • కల్లూరి భాస్కరం says:

  “వర్గం, కులం, జెండర్….ఇలా వివిధ అస్తిత్వాలు ఎన్నో నూతన పార్స్వాలు ఆవిష్కరిస్తున్నాయి”
  ఆ నూతన పార్స్వాలు ఏమిటి?

  “ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చడంతోపాటు ఒకే భాష, ఒకే సంస్కృతి…లోకి మార్చాలని చాపకింద నీరులా వస్తున్న ప్రపంచీకరణ…”
  ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చడం, ఒకే మార్కెట్ సరే; మీరు చెప్పిన మిగిలినవి కూడా ప్రపంచీకరణ అజెండాలో ఉన్నాయా? ఉన్నట్టు ఏ అధ్యయనమైనా చెబుతోందా? లేక ఇవన్నీ ప్రపంచీకరణ పర్యవసానాలని చెప్పడం మీ ఉద్దేశమా?

  “ప్రపంచీకరణ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా భిన్న సమూహాలు, భిన్న సంస్కృతులు…తమ అస్తిత్వ అన్వేషణలో తమను తాము పునర్నిర్మించుకుంటున్నాయి”
  ప్రపంచీకరణే ఇందుకు కారణమా? ప్రపంచీకరణ లేకపోతే ఇవి జరగవా? అప్పుడు ఏం జరిగేది? అస్తిత్వ అన్వేషణ మానుకునేవా? ఈ అభిప్రాయానికి కూడా ఏ అధ్యయనం ఆధారం?
  “ప్రపంచీకరణకు విరుగుడు స్థానికత లేదా ప్రాంతీయత అనే స్పృహతో రెండు దశాబ్దాలుగా మానవ సమాజం జీవిస్తోంది”
  ప్రపంచీకరణకు ముందు స్థానికత లేదా ప్రాంతీయతా స్పృహ లేవా? ప్రపంచీకరణతోనే వచ్చాయా? ఏ అధ్యయనం దీనికి ఆధారం?
  “భారతదేశంలో గ్రీన్ హంట్, టైగర్ ప్రాజెక్ట్ లను, సెజ్ ఉద్యమాలను, ప్రాజెక్ట్ కారిడార్లను ఈ కోణంలోనే (అస్తిత్వ పోరాటాల కోణంలో)చూడాల్సి ఉంటుంది”
  వీటిలో నర్మదా సరోవర్, పోలవరం వగైరాలను ఎందుకు మినహాయించారు?
  చూసారా…మీ చిన్న వ్యాసంలోనే ఎన్ని ఖాళీలు ఉన్నాయో! తెలుగు సాహిత్య విమర్శలోనే ఈ ఖాళీలు ఉన్నాయా?
  గత నాలుగేళ్లుగా ప్రపంచీకరణ మీద పెద్దగా చర్చ జరగడం లేదు. దాని మీద నాకిప్పుడు ఒక స్పష్టమైన అభిప్రాయం లేదు. మీరు ప్రపంచీకరణ అంటున్నారు కనుక కాస్త స్పష్టత ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే పై ప్రశ్నలు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)