ఒక పెళ్లి కథ

samanya_300x250_scaled_croppచాలా చాలా కాలం క్రితం అనగనగా ఒక ఊళ్ళో ఒక పెద్ద కుటుంబం ఉండేది. అవ్వలు,తాతలు,అమ్మలు,నాన్నలు,అన్నలూ, తమ్ముళ్ళూ, అక్కలు, చెల్లెళ్ళతో నిండి ఉండే ఇల్లనమాట. 
 
అదిగో అట్లాంటి ఇంట్లో అందరికంటే పెద్ద కొడుక్కి ఇంకా పెళ్లి కాలేదు. ఎన్ని సంబంధాలు చూసినా కుదరటమే లేదు. ఎట్లాగబ్బా అని చాలా ఆలోచించి ఆ అబ్బాయి ఒక ఋషి వద్దకు వెళ్ళాడు. ఆ ఋషి కూడా బాగా ఆలోచించి సరే అని చెప్పి ఆ అబ్బాయికి మంత్రించిన మామిడిపండు ఒకటి ఇచ్చి, ఈ పండు ఎవరు తింటారో ఆ అమ్మాయే నీ భార్య అని చెప్పాడు. 
 
ఆ అబ్బాయి ఆ మామిడి పండు తీసుకున్నాడు. ఇంటికొస్తున్న దారిలో ఆ మామిడిపండు నాకు ఇవ్వు అని ఏ ఆడపిల్లా అడగలేదు. సరే అని చెప్పి అతను ఆ పండుని తెచ్చి తన గదిలో బల్ల మీద ఉంచి చేలోకి వెళ్ళిపోయాడు. 
 
ఆ ఇంట్లో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారని చెప్పాకదా వాళ్ళలో ఒక అమ్మాయి అంటే ఈ అబ్బాయి స్వంత చెల్లెలు అన్న గదిలోకి వచ్చి అన్న మామిడిపండు తెచ్చినట్లున్నాడని చెప్పి చనువుగా పండు తినేసింది. 
 
సాయంత్రమయింది. చంద్రుడు ఆకాశానికి ఎక్కుతున్నాడు. సూర్యుడు ఇంకో దేశానికి ప్రయాణిస్తున్నాడు. అప్పుడు అన్న ఇంటికొచ్చి తనుపెట్టిన చోట మామిడిపండు లేకపోవడం చూసి ”మామిడి పండు ఏమయింది ?”అని అందర్నీ విచారించాడు. అప్పుడు పండు తిన్న అమ్మాయి వచ్చి “నేను తిన్నాను అన్నయ్యా” అని చెప్పేసింది. అన్న అది విని ఇంట్లో అందర్నీ ఒక చోట జమ చేసి ఋషి చెప్పిన విషయం అందరికీ తెలియ పరచి , ”ఇదిగో నా చెల్లే నా భార్య ”అని చెప్పేశాడు. అరరే ఇదేమైనా బాగుందా, ఆ ఋషి ఏదో చెప్పాడనుకో దాన్ని ఇలా పాటిస్తారా ఎవరైనా, ఆ ఋషికి లేని బుద్ధి మనకైనా ఉండొద్దా అని చెప్పి ఎవరూ అనలేదు, అనకపోగా ”తలరాతను ఎవరు మార్చగలరు, ఎవరికేది రాసి పెట్టుందో అదే జరుగుతుంది” అని పెళ్ళిపనులు మొదలు పెట్టేశారు. 
 
ఇదంతా విన్న అమ్మాయి ఏం చేసిందీ …  ”ఛీ ఛీ నా సొంత అన్నను నేను పెళ్లిచేసుకోవడమేమిటి ”అని చెప్పి ,వెళ్లి ఇంటి ముందు ఉన్న పొడుగాటి తాటిచెట్టుని ఎక్కి కూర్చుంది. ఇక్కడేమో పెళ్లి పందిరి వేసేశారు, విందు కోసం పందుల్ని , మేకల్ని తెచ్చి కట్టేశారు, నలుగు పెట్టడానికి సనికిటి బండ మీద పసుపు నూరేశారు. అయినా అమ్మాయి దిగలేదు. అప్పుడు ఆ పిల్ల అమ్మ వెళ్ళింది , వెళ్లి 
                           
                                                                          ” ఉతుర్ ఉతుర్ బేటీ                                                                   
                                                                            బాంధాలా సువేర్ రేకోతే 
                                                                            బాంధాలా బక్రీ కాందాతే  
                                                                            గాడాలా మాడ్వా సుఖోతే  
                                                                            పీసాలా హల్దీ సుఖోతే.  “
 
                                                                            (దిగు దిగు కూతురా 
                                                                             విందుకు తెచ్చిన పంది ఘీ పెడుతోంది
                                                                             కట్టేసున్న మేక ఏడుస్తోంది
                                                                              పెళ్లిపందిరి ఎండిపోతోంది 
                                                                              నూరిన పసుపు ఆరిపోతోంది )
 అన్నది . అది విని అమ్మాయి  “సారాగే చాల్  రే తాళ్ గాచ్, సారాగే చాల్ రే తాళ్ గాచ్” (ఇంకా పైకి పద తాటిచెట్టు … ఇంకా పైకి పద తాటిచెట్టు] అని అన్నది . అమ్మాయి మాట విని తాటిచెట్టు విల్లులా వంగి ఉన్నది కాస్త కొంచెం నిటారుగా లేచింది.తను పిలిచినా కూతురు దిగాక పోవటం చూసి అమ్మ వెళ్లి పోయింది . 
 అప్పుడిక నాన్న వచ్చాడు. తాడిచెట్టు దగ్గర నిలబడి చేతులు పైకెత్తి 
                                                                                ” ఉతుర్ ఉతుర్ బేటీ                                                                   

                                                                                  బాంధాలా సువేర్ రేకోతే
                                                                                  బాంధాలా బక్రీ కాందాతే 
                                                                                  గాడాలా మాడ్వా సుఖోతే
                                                                                  పీసాలా హల్దీ సుఖోతే. “
 అని పిల్చాడు. అమ్మాయి అది విని వెనకటికి మల్లే “సారాగే చాల్ రే తాళ్ గాచ్, సారాగే చాల్ రే తాళ్ గాచ్” (ఇంకా పైకి పద తాటిచెట్టు… ఇంకా పైకి పద తాటిచెట్టు) అన్నది ,అమ్మాయి మాట విని తాటిచెట్టు మరింత నిటారుగా అయింది. అదిచూసి నావల్ల కాదులే అనుకుని పెళ్ళికొడుకుని అంటే అదే ఆపిల్ల అన్నని పంపించాడు. అతనెళ్ళి 
 

                                                                                  ” ఉతుర్ ఉతుర్ బహిన్ 
                                                                                     బాంధాలా సువేర్ రేకోతే
                                                                                     బాంధాలా బక్రీ కాందాతే 
                                                                                      గాడాలా మాడ్వా సుఖోతే
                                                                                      పీసాలా హల్దీ సుఖోతే. “
 
అని పిలవడం మొదలుపెట్టాడు. అది చూసి  చెల్లి భయపడిపోయి తాడిచెట్టుతో గట్టిగట్టిగా “సారాగే చాల్ రే తాళ్ గాచ్, సారాగే చాల్ రే తాళ్ గాచ్” (ఇంకా పైకి పద తాటిచెట్టు… ఇంకా పైకి పద తాటిచెట్టు) అని తాడిచెట్టుని వేడుకున్నది. తాడిచెట్టు ఈసారి చువ్వలాగా చక్కగా ఆకాశాన్ని అంటినట్టు నిలుచుంది. 
 
ఇక అందరూ విసిగిపోయారు. అప్పటికే చాలా చీకటి పడిపోయింది. అందరూ వెళ్లి పడుకున్నారు. తాటిచెట్టు మీద అమ్మాయి తాటిచెట్టు మీదే ఉండిపోయింది. 
 
అప్పుడిక కాసేపటికి అర్ధరాత్రయింది. అంతవరకు మిలమిలా మంటున్న  నక్షత్రాల ఆకాశం కాస్తా కాటుక మబ్బుల్తో నిండిపోయింది. చీకటి మరింత నల్లబారింది. చూస్తూ చూస్తూ ఉండగానే జోరుమని వాన కురవడం మొదలుపెట్టింది. ఒక్కవాన మాత్రమే అయితే బాగుండేది ఆకాశం ఉరుములతో పిడుగులతో దద్దరిల్లిపోయింది. అమ్మాయి ఉన్న తాటి చెట్టు గాలికి అల్లకల్లోలంగా ఊగడం మొదలెట్టింది. చూసి చూసి తాటిచెట్టు పైన వున్న అమ్మాయికి చాలా భయమేసింది . చూసి చూసి ఇక లాభం లేదనుకుని నెమ్మదిగా తాటిచెట్టు దిగి ఇంట్లోకొచ్చింది. 
 
ఇంటి పెద్ద తలుపు లోపలినుండి గడిపెట్టి ఉంది. 
 
అమ్మాయి నిస్సహాయంగా వానలో తడుస్తూ మొదట తండ్రి గది వద్దకు వెళ్లి “దే… దే … బాబా ఏక్ బీధా టావ్/బాబా ఏక్ బీధా టావ్” (నాన్నా ఉండటానికి కొంచెం స్థలమీ నాన్నా … కొంచెం స్థలమీ నాన్నా) అని అడిగింది. ఆ నాన్న అయ్యో కూతురా అని లోపలికి పిలవకుండా “నాఖే నాఖే బేటీ ఏక్ బీధా టావ్ బేటీ ఏక్ బీధా టావ్” (కుదరదు కుదరదు కూతూరా !నీకు కొంచెం స్థలమీడం కూడా కుదరదు కూతురా!” ]అనేశాడు. 
 
ఆకాశం ఇంకా కుండపోతని మొదలుపెట్టింది, పెద్ద గాలి మొదలయింది,ఆ గాలిని చూసి ఆ పిల్లకి చాలా భయం మొదలయింది, ఆదుర్దాతో తల్లి గది వద్దకు వెళ్ళింది “దే… దే…  ఆయొ ఏక్ బీధా టావ్ … ఆయొ ఏక్ బీధా టావ్” అని అడిగింది. అప్పుడు అమ్మ ఏమన్నదీ, అమ్మ కదా బిడ్డని సైగ్గా అన్నా రానియ్యాలి కదా? కానీ రానీలేదు. ఋషి మాటా మజాకానా ?అందుకని చాలా కటినంగా   “నాఖే నాఖే బేటీ ఏక్ బీధా టావ్ … బేటీ ఏక్ బీధా టావ్” అనేసింది. అమ్మ మాట విని ఆ పిల్లకి దుఃఖమొచ్చింది. ఇక చివరిగా తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అన్న దగ్గరకు వెళ్లి “దే.. దే .. దాదా ఏక్ బీధా టావ్ దాదా ఏక్ బీధా టావ్” అని అడిగింది. అప్పుడు ఆ అన్న ,చెల్లి ఏడుపు విని, చాలా కరుణించిన వాడల్లే , సరే అయితే నువ్వు నన్ను “దేదే సాయా ఏక్ బీధా టావ్ సాయా  ఏక్ బీధా టావ్” (కొంచెం స్థలమీ నా భర్తా కొంచెం స్థలమీ) అని అడుగు అప్పుడు లోపలికి రానిస్తాను అన్నాడు.ఆ అమ్మాయికిఅలా అనాలంటే చాలా బాధేసింది .కానీ వాన ప్రచండమైపోయింది. భూమీ ఆకాశము ఒక్కటై పోయాయి . ఎక్కడో చెరువుగట్టు తెంచుకున్నట్టు మోకాటి వరకూ నీళ్ళు కూడా వచ్చాయి. ఇంక  ఆ అమ్మాయి భయపడి పోయింది. భయపడి ఏడ్చుకుంటూ అన్న చెప్పినట్టే  “దేదే సాయా ఏక్ బీధా టావ్/సాయా ఏక్ బీధా టావ్” అని చెప్పి లోపలి వెళ్ళింది. అంతే కథ. 
Download PDF

2 Comments

Leave a Reply to Lapitha Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)