పులి – కోతి – ముసలావిడ

samanya1resize
అనగనగా ఒకూర్లోనేమో ఒక ముసలాయన ముసలామె ఉండేవారు. వాళ్ళ బాగోగులను కనిపెట్టడానికి పాపం  వాళ్లకి పిల్లాపీసు లేరు. అందుకని ముసలివాళ్ళయినా వాళ్ళ పని వాళ్ళే చేసుకుని తినాల్సి వచ్చేది.  వయసులో ఉన్నప్పుడు, కోతలకి, నాట్లకి వెళ్ళినా ముసలి వాళ్లయ్యేసరికి ఇక ఆ పని చెయ్యలేక వచ్చేశారు.
కానీ మరి తిండి కావాలి కదా, వాళ్ళ పరిస్థితేమో “అంగట్లో బియ్యం – తంగేడు కట్టె” కదా అందుకని చెప్పి ఇద్దరూ అడవికెళ్ళి పుల్లలేరుకొచ్చి, మోపులుగా కట్టి ఊర్లో తిరిగి అమ్ముకునే వారనమాట.ఒకసారి ముసలాయన, ముసలావిడ పుల్లలకోసమని ఇదిగో అట్లా అడవికి వెళితేనూ, వాళ్ళకో కోతిపిల్ల దొరికింది. కుయ్యోమోర్రోమని అమ్మకోసం ఏడుస్తుంటే ముసలివాళ్ళు సరే పాపమని చెప్పి ఇంటికి తీసుకొచ్చి బిడ్డలాగా పెంచుకోవడం మొదలుపెట్టారు. కోతిపిల్ల పెరిగి పెద్దదై అచ్చం బిడ్డలాగా వాళ్లకి ఆ పనిలోనూ ఈ పనిలోనూ చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేది.ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి ముసలాయనకు బోల్డు జ్వరమొచ్చింది, మంచం దిగలేకపోయాట్ట. అప్పుడు ముసలమ్మ ఆయనకీ గంజి కాచిపోసి “ఏవయ్యా!నేనట్టా అడివిలోకి బొయ్యి పుల్లలేరుకొస్తా భద్రంగా ఉండు” అని చెప్పి, కోతికి కూడా ముసలాయనకు కాపలా ఉండమని చెప్పి అడివికి పొయ్యింది. అప్పుడేమయ్యిందీ, బాగా ఆకలేస్తూ ఉన్న పులి ఒకటి గాండ్రు గాండ్రు మంటూ ముసలమ్మకి ఎదురు వచ్చింది, వచ్చి “ముసలీ……ముసలీ నేనిప్పుడు నిన్ను తినేస్తా” అని చెప్పింది.

అది విని ముసలామె భయపడిపోయిందనుకున్నారా? అబ్బే అస్సలు భయపడలేదు.  పైగా పులితో “ఓ పులీ! నేను ఇదిగో ఈ ఎండు పుల్లలాగా ఒంటి మీద వీసెడు మాంసమన్నా లేకుండా ఒరుటుకుపోయి బక్కగా ఉన్నాను కదా,నన్ను తింటే నీకేమొస్తుందీ? ” అని అన్నదట, అది విని పులి “ఓ ముసలీ! మరేం పర్లేదు నాకు చాలా ఆకలిగా ఉంది, నీతో నాకడుపు నిండినంత మడసానికి నిండనీ” అన్నదట.

అప్పుడు ముసలమ్మ “పులీ……..పులీ నువ్వన్నది కూడా నిజమే అనుకో, కానీ ఈ ఒక్కరోజుకీ ఊరుకో నేను ఇంటికి పొయ్యి రేపు మా ముసలాయన్ను పంపుతా ఆయనైతే లావుగా, రుచిగా ఉంటాడు, నీ కడుపు నిండుతుంది” అన్నదట. పులి ఆ లావు ముసలాయన్ను ఊహించుకుని, ఆశపడి “సరే అయితే నువ్వెళ్ళి ముసలాయన్ను పంపాలి మరి, ఏం?” అన్నదట. ముసలామె “అట్లాగే” అని చెప్పి వచ్చేసింది.

ఇంక అప్పుడు రాత్రి అయిపోయి ‘రేపు’ వచ్చేసింది. ముసలాయనకి జ్వరం తగ్గనే లేదు, ముసలమ్మ ఈరోజూ కూడా కట్టెపుల్లలకని అడవికి బయల్దేరింది.
అప్పుడేమయిందీ పులి లావుగా ఉండే ముసలాయన కోసం ఎదురు చూసి చూసి, ఇహ లాభం లేదు అని చెప్పి వెతుక్కుంటూ అడవికి అడ్డంబడింది. అట్లా వెతుకుతూ ఉండగా ఏమయిందీ దానికి ముసల్ది ఎదురొచ్చింది. పాపం పిచ్చి పులి ఇప్పుడైనా ముసల్దాన్ని తినెయ్యాలి కదా……..అబ్బే తినలేదు, తినకపోగా
“ముసలీ……ముసలీ……. నాకెందుకు అబద్ధం చెప్పావ్” అని ప్రశ్నలకి కూర్చుంది. ముసలామె బోల్డు తెలివైంది కదా అంత సులభంగా పులి దగ్గర బోల్తా పడుతుందా? అప్పుడామె ఏమన్నదీ………. “ఇదిగో పులీ నా మీద నేరాలు మోపకు నేను ముసలాయన్ని నీ దగ్గరికి పంపే ఇటొచ్చాను, ఆయన్ని పట్టుకోలేక
నన్నంటావేం” అని.

అదివిని పులి నాలిక కొరుక్కుని “సరే ముసలావిడా జరిగిందేదో జరిగిపోయింది. నాకు లావు ముసలాయనేం వద్దు నిన్ను తినేసి నా ఆకలి తీర్చుకుంటా” అన్నది.

అందుకు ముసలామె “లేదు లేదు పులీ తొందర పడబాకు రేపు ముసలాయన్ని సరిగ్గా ఇక్కడికే తీసుకొస్తా నీమీదొట్టు సరేనా” అని చెప్పి వెళ్ళిపోయింది.

ఇక్కడ ముసలాయన కొంచెం కోలుకున్నాడు. ముసలావిడ అడివిలో జరిగిన పులి సంగతి ఆయనకి చెప్పేసింది. ఆయన కోతిని తీసుకుని అడవికి బయల్దేరాడు. కోతి ఏం చేసిందీ……….ముసలాయనకంటే ముందు అడవిలోపలికి వెళ్ళి పులితో అసలేం ఎరగనట్టు “పులీ……….పులీ………ఇంకా ఇక్కడే ఉన్నావేం? నది పొంగిపోయింది ఎల్లువ ఇంకాసేపట్లో అడవిని ముంచేయబోతోంది పారిపో” అన్నది.
అనడమే కాకుండా ఆకులతో చేసిన పడవని చూపించి ఇదిగో వరదలో వాడటానికి నేనీ పడవను చేసుకున్నాను అని చెప్పింది. పులి అది చూసి “కోతీ నాక్కూడా అటువంటి పడవ ఒకటి చేసీవా” అని అడిగింది. కోతి సరే అని ఒక పడవ చేసి పులిని ఎక్కమని చెప్పి  అడవి తీగలతో పడవని పైకిలాగి పులిని ఎత్తులో కట్టేసింది.

అప్పుడింక ముసలాయన వచ్చి కోతితో కలిసి పడవ కింద ఎండు ఆకులతో నిప్పుపెట్టి ఇద్దరూ వెళ్ళిపోయారు. కాసేపటికి పడవ కాలిపోయి పులి డామ్మని పడిపోయింది.పాపం పులికి చాలా కోపం వచ్చింది. ఇట్లా కాదు పని అనుకుని పెద్ద పథకమేసుకుని ముసలాయన్ని ముసలావిడని ఒకటేసారి తినేద్దామని చెప్పి వాళ్ళ ఊరికి వెళ్ళింది.

పులి రావడం ముందే చూసిన కోతి ఇంట్లోకి వెళ్లి తలుపులన్నీ వేసి పొయ్యిలో పనసగింజలు వేసింది. అవి సరిగా పులి ఆ ఇంటికి చేరిన సమయానికి పేలాయి. ఆ శబ్దం విని పులి ఝడుసుకున్నది. “అమ్మో ఈ ముసలోళ్ళు నన్ను చంపడానికి పెద్ద పథకాలే పన్నుతున్నారు. బతికుంటే బలుసాకు తినొచ్చు ముందు పారిపోదాం” అనుకుని అడవిలోకి పారిపోయింది.

 –సామాన్య

 

Download PDF

2 Comments

  • bhasker says:

    కథ చాలా సులభశైలిలో ఉందండీ సామాన్యగారూ…!
    నిజంగా మీరెంత సామాన్యులు!!
    నిజంగా మీరెంత అసామాన్యులు!!!
    హాట్స్ ఆఫ్ …!
    -భాస్కర్ కూరపాటి.

  • MALLIKARJUNA says:

    సూపర్

Leave a Reply to bhasker Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)