వీలునామా -11 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి) 

ఎల్సీ ప్రయత్నం

 

ఎల్సీ మనసు రెండో రోజుకి కొంచెం కుదుట పడింది.

రోజూ ఉదయాన్నే లేచి అక్క చెల్లెళ్ళిద్దరూ కాసేపు షికారెళ్ళి రావడం మొదలు పెట్టారు. దాంతో కాస్త మనసు సర్దుకునేసరికి, ఎల్సీ రాసుకోవడనికి కాగితాలు ముందేసుకుని కూర్చుంటుంది. జేన్ ఉద్యోగ ప్రయత్నాలకి బయటికి వెళ్తుంది.

ప్రతీ రోజూ ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం అయినా జేన్ ఉద్యోగ ప్రయత్నాలు అంతగా కలిసి రాలేదు. ఊరికే వుండడం ఇష్టం లేక పెగ్గీకి సహాయం చేస్తూనే వుంది జేన్. పిల్లల పనులు చూడడం, వాళ్ళకి సాయంత్రాలు చదువు చెప్పడం చేయసాగింది. కొద్ది రోజుల్లోనే పిల్లల చదువులు మెరుగవడం గమనించి చాలా సంతోష పడింది పెగ్గీ! అందరికంటే పెద్దవాడు టాం జేన్ దగ్గర బాగా చదువుకోవడం అలవాటు చేసుకున్నాడు.

జేన్ మెల్లి మెల్లగా ఆ పిల్లలు చేసే అల్లరికీ, ఇంట్లో వుండే శబ్దాలకీ అలవాటు పడసాగింది. ఆమెకి బెస్సీ పిల్లలు అయిదుగురూ భలే తెలివైన వాళ్ళనిపించింది. టాం ఎలాగైనా పెద్ద చదువులు చదవాలనీ, మంచి ఉదోగం సంపాదించుకోవాలనీ పట్టుదలగా వున్నాడు.

చదువుకుంటూనే ఒక చిన్న కార్ఖానాలో తీరిక వేళల్లో పని చేయటం మొదలు పెట్టాడు టాం. అక్కడ వాడి కొచ్చే ప్రశ్నలకెవరూ సమాధానం చెప్పేవారు కాదు. అవన్నిటి గురించీ జేన్ తో చర్చించడం వాడికెంతో నచ్చేది. వాడి పట్టుదలా, శ్రధ్ధా జేన్ కెంతో ముచ్చటగా అనిపించేవి.

ఈ ప్రపంచంలో తన అవసరం వున్న మనిషి ఒకరైనా వున్నారన్నమాట అనుకుంది జేన్. అలాగే పెగ్గీ ఆశ ప్రకారం మిగతా పిల్లలకి చక్కగా రాయడం నేర్పించింది జేన్.

జేన్ ప్రభావం ఆ పిల్లల మీద బాగానే పడి, వాళ్ళు తమ మొరటు ప్రవర్తన వదిళేసి ఆమెలా హుందాగా, నాజూగ్గా ప్రవర్తించడం నేర్చుకోసాగారు. పెగ్గీకి ఎప్పుడూ ఏదో ఒక అవసరం వున్న వాళ్ళకి సహాయం చేసే అలవాటు పోలేదు. అలాటి అసహాయులందరినీ తరచూ ఇంటికి తీసుకొస్తూండేది.

అలాటి వారికి సహాయం చేయడానికి తన దగ్గర ఏమీ లేకపోవడం వల్ల సిగ్గు పడేది జేన్. అయితే అవసరంలో వున్న మనిషికి సహాయం చేయడానికి డబ్బొక్కటే మార్గం కాదు, ఇంకా చాలా మార్గాలు వున్నయని కాల క్రమేణా తెలుసుకుంది జేన్. వచ్చిన వారికి చిన్న చిన్న పనులుంటే చేసి పెట్టడం, సలహాలివ్వడం, కాగితాలు రాసి పెట్టడం మొదలైన చాలా పనులు చాలా సులువుగా చేయగలిగేది జేన్.

అయినా ఏదో రకంగా డబ్బు సంపాదించి తననీ చెల్లెల్నీ పోషించుకోవాలన్న దిగులు మాత్రం వదలడంలేదామెని. తనకేమో ఉద్యోగం దొరకడం లేదు. చెల్లెలి కవితల పుస్తకం ఎవరైనా ప్రచురించి కొంచెం డబ్బిస్తే బాగుండు. ఎన్నాళ్ళిలా పెగ్గీ దయా ధర్మాల మీద ఆధారపడి వుండడం, అనుకుందామె.

మొత్తం మీద ఎల్సీ ఒక పుస్తకంలో వెయ్యగ్లిగేన్ని కవితలు రాసిందని అనిపించేక, వాటిని పట్టుకుని పబిషరు దగ్గరికెళ్ళారిద్దరూ. ఆయన ఇంతకు ముందు, “ఆడపిల్లలు ఏదైనా రాసిస్తే ప్రచురించడం తేలిక” అన్నారని గుర్తు జేన్ కి.

పది రోజుల తర్వాత, “ఈ కవితలు బాగానే వున్నా, పుస్తకం లా ప్రచురించేంత బాగా లేవు,” అని ఉత్తరం వచ్చింది ఎల్సీ కి. ఆ ఉత్తరం చదివి ఎల్సీ కృంగిపోయింది.      నిరాశపడ్డ చెల్లెల్ని జేన్ ఓదార్చింది. ఎడిన్ బరో లోని ప్రచురణ సంస్థలు కాకుండా లండన్ పంపిద్దామని సూచించింది జేన్. ఎల్సీ మళ్ళీ ఉత్సాహంతో తన కవితలు లండన్ లోని ప్రచురణాలయాలకి పంపింది. అందరి దగ్గర్నించీ ఒకటే మాట!

“కవితలు బాగానే వున్నా, పుస్తకంలా ప్రచురించేంత బాగాలేవు, క్షమించవలసింది….” అంటూ.

కొన్ని ఉత్తరాలు సంక్షిప్తంగా వుంటే, కొన్ని సుదీర్ఘంగా వుండేవి.

“…మా దగ్గర లెక్కకు మించి కవితా సంకలనాలున్నా, మేము కుమారి ఎల్సీ మెల్విల్ కవితలు అత్యంత శ్రధ్ధతో పరిశీలించాము. మా సంపాదకుడి అభిప్రాయం ప్రకారం అవి ప్రచురణకి ఇంకా సిధ్ధంగా లేక పోవదం మూలాన, వాటిని సంకలనంగా వేయలేమని చెప్పుటకు చింతిస్తున్నాము…” అంటూనో, లేక

“….కుమారి ఎల్సీ మెల్విల్ కవితలు అక్కడక్కడ బానే వున్నా, వాటిల్లో అన్నిట్లో ఒకటే ముఖ్యాంశం అవడం వల్ల పాఠకుడికి ఆసక్తి కలిగించలేవు. అందుచేత వాటిని ప్రచురించడం వీలుపడదని చెప్పుటకు చింతిస్తున్నాము….”

అంటూనో వుండేవి.

అలాటి లేఖ వచ్చిన ప్రతీసారీ, ఎల్సీ కృంగిపోయేది. సంక్షిప్తంగా వున్న లేఖలకంటే సుదీర్ఘ విమర్శలు ఎల్సీని ఎక్కువ బాధించేవి.

నిజానికి ఎల్సీ కవితల్లో భాషా సౌందర్యం, వ్యక్తీకరణలో నాజూకు తక్కువే. అయితే భావంలో గాఢత వుండేది. జీవితానుభవం ఇంకొంచెం వస్తే, ఎల్సీ చక్కటి కవయిత్రి కాగలదు. అయితే ఆ సంగతి ఆమెకి తెలియక పోవడం వల్ల తనకసలు భవిష్యత్తే లేదనుకుని నిరాశపడింది.

తన కవితల రాతప్రతిని ఒక సంచీలో పెట్టి డెస్కులో పడేసింది. ఇక కవితల జోలికీ, పుస్తకాల జోలికీ పోగూడదనుకొంది.

“జేన్! నితో పాటు నేనూ పెగ్గీకి సాయంగా బట్టలు ఇస్త్రీ చేస్తాను. బట్టలు కుట్టడం కూడా ప్రారంభిస్తాను. అనవసరంగా డబ్బంతా పోస్టు మీదా, కాగితాల మీదా దండగ చేసాను. ఇహ ఏదైనా పని వెతుక్కుని నీ కష్టం తగ్గిస్తాను.” అన్నదే కానీ పాపం ఆమె కళ్ళు కన్నీళ్ళతో నిండి పోయాయి. అన్నట్టే బట్టలు కుట్టడంలోనూ, ఇస్త్రీలు చేయడంలోనూ నిమగ్నమైపోయింది ఎల్సీ.

వున్నట్టుండి ఒకరోజు రెండు వుత్తరాలు వచ్చాయి వారి పేరిట. ఒకటి ఫ్రాన్సిస్ దగ్గర్నించయితే, రెండోది రెన్నీ గారి దగ్గర్నించి.

రెన్నీ గారు ఇస్తోన్న కొత్త సంవత్సరం పార్టీకి తాను ఎడిన్ బరో వస్తున్నట్టూ, వచ్చి తప్పక వాళ్ళను కలుసుకుంటాననీ ఫ్రాన్సిస్ రాసాడు. రెన్నీ గారి దగ్గర్నించి పార్టీకి రమ్మన్న ఆహ్వానం వుంది.

కాస్త ఆ పార్టీకి వెళ్ళి నలుగురితో మాట్లాడితే మనసులు కుదుటపడొచ్చు.

పార్టీకోసం అక్కకి కొత్త గౌను కుట్టడం మొదలు పెట్టింది ఎల్సీ. ఈ మధ్య కాలంలో జేన్ చిక్కిపోయి మొహం పాలిపోయింది. అయినా ఎల్సీ కళ్ళకి అక్క అందంగానే అనిపించింది.

 

(సశేషం)

 

 

 

 

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)