వెతుక్కుంటూ పోవాల్సింది ప్రకృతి లోనికే!

ప్రయత్న పూర్వకంగానే యంత్రమయం చేసుకున్న బ్రతుకుల్ని కూడా కాలం తరుముతూనే ఉంటుంది. నిర్విరామంగా సాగిపోయే ఆ పరుగులో తుప్పట్టిన యంత్రాల వాసనే ఎటు చూసినా. ఆ పరుగైనా కాస్త జీవంతో నవ్వాలంటే మనల్ని ప్రేమించే ప్రకృతి సహాయం ఎంత అవసరమో, మూర్ఖుల్లా కళ్ళుమూసుకుని పరుగెడితే ఏం కోల్పోతామో సుస్పష్టంగా, సూటిగా, సరళమైన వాడుక భాషలో ‘సుహానా సఫర్ ‘ కవితలో చెబుతారు ఇక్బాల్ చంద్. 

iqbal

ప్రకృతి సౌందర్యానికి ఒక చిరునామా కోనసీమ. అక్కడి అందాల్ని పచ్చగా శ్వాసిస్తూ గోదారి పరవళ్ళలాంటి పదాలతో మనకు వర్ణించి చెప్తాడు కవి. మనసారా, తనువారా అక్కడి ప్రకృతి ప్రేమని అనుభవిస్తూ తన దాహార్తిని తీర్చుకోవాలనుకుంటాడు. ఏడ్చే బిడ్డను అక్కున చేర్చుకుని లాలించే తల్లి లాంటిది కోనసీమ అంటాడు మొదటి వాక్యంలోనే. అలా తల్లితో సమానమంటూ అగ్రతాంబూలమిచ్చేయడంలోనే తెలుస్తుంది అక్కడి ప్రకృతి మనకందించే ప్రేమ ఎలాంటిదో.

ఏడ్చే బిడ్డను లాలించి

          స్తన్యం పట్టే అమ్మ కోనసీమ

చిన్న పాయల నీళ్ళ జారుడు లోకి

          చందమామ చేపపిల్లనై ఎగురుతూ

          దాహాన్ని కసితీరా తీర్చుకుంటే బావుండుననిపిస్తోంది

అంతటి ప్రకృతి సౌందర్యానికి వర్షం కూడా తోడైతే ఇక భావుకుల పరిస్థితి చెప్పేదేముంది. మానసికానందానికి సమయం కేటాయించుకోలేని దైనందిన జీవితాలు ఎడారిలో పయనిస్తున్నట్టే ఉంటాయి. మనసనేది సంతోషపడకపోతే కళ్ళలోకి వెలుగెలా వస్తుంది మరి? అందుకే

ఎడారిలో తడారి ఆరిన కంటివొత్తులు

           కోనగాలి తాకి మళ్ళీ దీపిస్తాయి

అంటాడు.

 

కోనసీమ అందాలు చూశాక మనసు తడవని మనిషుండడు. మచ్చుకైనా భావుకత్వం లేని మనిషైనా సరే, అక్కడి ప్రకృతిని కళ్ళార్పకుండా చూస్తాడు. అనుభూతులూ , స్పందనలూ అవసరం లేని కఠినమైన మనిషయినా, అక్కడున్నంతసేపూ, గోదారి నీళ్ళలో కాళ్ళు తడుపుకుంటూ నాట్యమాడే పచ్చని చెట్టవుతాడు. అది చెప్పడానికే

 

ఇక్కడ పాషాణ కత్తులైనా

            విత్తులై పాతుకుని మొక్కలై ఎదగాల్సిందే

అంటాడు కవి.

 

నాగరికత అని అబద్ధం చెప్పుకుంటూ తిరిగే ఈ నాటి బ్రతుకుల్ని రక్షించేది, రక్షించాల్సిందీ ప్రకృతి ఒక్కటే. ప్రకృతిని సంరక్షించుకోలేకపోతున్నాం. ప్రేమించలేకపోతున్నాం. కనీసం ఆటవిడుపుగానైనా ప్రకృతిని కాసేపు చూస్తూ మన కళ్ళని వెలిగించుకోగలిగితే, పచ్చని పాటని కాసేపు వినగలిగితే, బ్రతుకు పరుగు అహ్లాదంగా సాగుతుంది.

  అనాగరికపు అబధ్థపు గదుల్లోంచి

            మనిషి వెతుక్కుంటూ పోవాల్సింది ప్రకృతి లోనికే

మనిషికి ఏనాటికైనా ప్రకృతే గమ్యమని చెప్పడానికి ఇంతకంటే శక్తివంతమైన వాక్యం వేరే అవసరం లేదనుకుంటాను.

 

పూర్తి కవిత:

 

  సుహానా సఫర్

————

  ఏడ్చే బిడ్డను లాలించి

               స్తన్యం పట్టే అమ్మ కోనసీమ

               వర్షం వచ్చి తడిసినా సరే

               కిటికీ తెరిచి చూపుల్తో అల్లుకోవాల్సిందే

               వెలిసిపోయే ఊపిరి చిత్రాలపై

               కొత్త రంగులు పూస్తాయి

               ఎడారిలో తడారి ఆరిన కంటివొత్తులు

               కోనగాలి తాకి మళ్ళీ దీపిస్తాయి

               చిన్న పాయల నీళ్ళ జారుడు లోకి

               చందమామ చేపపిల్లనై ఎగురుతూ

               దాహాన్ని కసితీరా తీర్చుకుంటే బావుండుననిపిస్తోంది

               ఎక్కడి దుఃఖితుల చెంపల్ని తుడవటానికో

               ఆకుల సందుల్లోంచి జారిపోతూ మబ్బు చాపలు

               కాలం తరిమే బ్రతుకులై తేలిపోతూంటాయి.

               జల్లు పడుతూ … ఊగుతున్న చేట్లూ …

               అంతర్ముఖంగా మాత్రమే పలకరించే

               ఇంకా లిపి లేని ఏ భాషో ఆవిష్కరించుకుంటుంది.

               ఏ గంధర్వుడు వదిలి వెళ్ళిన స్వప్నాంతర్యమో

               పచ్చ శాలువా కప్పుకుని నడుస్తున్న

               నిండు గర్భిణీ గుంభనపునవ్వులా ఉంది

               ఎవరూ అల్లని ఈ పహ్చ తివాచీ మీంచి నడుస్తుంటే

               గోలీలాడుతూ పోగొట్టుకున్న క్షణాలు పలకరిస్తాయి

               గుండె ముడతలిప్పుతుంటే

               ఎన్ని నగ్న ప్రపంచాలు రెప్పలు తెరిచి నవ్వుతాయో

               ఇక్కడ పాషాణ కత్తులైనా

               విత్తులై పాతుకుని మొక్కలై ఎదగాల్సిందే

               ఇక్కడి ప్రతీ ఆకుకూ తెలుసు ప్రకృతి రహస్యం

               దాహార్తుల పెదాల్ని ఎలా స్పృశించాలో

               ఇక్కడ కదిలే ప్రతి గాలి పైటకూ తెలుసు

               ప్రకృతి కొత్త రుతువై మనిషిని కవిత్వం చేస్తుంది

               ఈ అనాథస్వామ్యంలో మనిషిని రక్షించేది ప్రకృతే

               అనాగరికపు అబధ్థపు గదుల్లోంచి

               మనిషి వెతుక్కుంటూ పోవాల్సింది ప్రకృతి లోనికే.

– ప్రసూన రవీంద్రన్ PrasunaRavindran

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)