గాంధీజీ హత్య-పోలీసు ‘శ్రాద్ధం’

Gandhi_Assassinationవర్షరుతువులో ప్రయాణాలను, యుద్ధాలను నిషేధించే మతవిశ్వాసమే పురురాజు ఓటమికి ఒక కారణం కావచ్చుననుకున్నాం. ఒకవేళ పురురాజే ఆ యుద్ధంలో గెలిచి ఉంటే భారతదేశచరిత్ర ఏ మలుపు తిరిగేదో!? అదలా ఉంచి, మతవిశ్వాసం లేదా మతఛాందసం చరిత్రను తిప్పిన మలుపులు ఇంకా ఉన్నాయి.  నాకు అర్థమైనంతవరకు గాంధీజీ హత్యోదంతం వాటిలో ఒకటి. ఎంతో కాలంగా నన్ను వెంటాడుతున్న ఆ కథనాన్ని మీతో పంచుకోడానికి ఇంతకంటె తగిన సందర్భం రాకపోవచ్చు. విషయమేమిటంటే, గాంధీ హత్యను నివారించలేకపోయిన అనేక వైఫల్యాలకు తోడు, ఒక పోలీస్ అధికారి మతవిశ్వాసం కూడా కొంత పాత్ర పోషించింది.

గాంధీజీ హత్యకు ఎలా పథక రచన జరిగిందో, దానిని ఎలా అమలు చేశారో, పోలీస్ దర్యాప్తు ఎలా సాగిందో పూసగుచ్చినట్టు వివరించిన రచనలు చాలానే వచ్చాయి. వాటిలో నేను చదినవి రెండు: మొదటిది, The men who killed Gandhi (మనోహర్ మల్గోంకర్). ఈ రచన ఆధారంగా త్వరలో సినిమా కూడా రాబోతోంది. రెండోది, Freedom at Midnight (Larry Collins and Dominique Lapierre).

మొదటగా గాంధీ హత్యలో పాల్గొన్న కుట్రదారుల పేర్లు చెప్పుకుని ముందుకు వెడదాం: 1. నాథూరాం గాడ్సే 2. నారాయణ్ ఆప్టే 3. విష్ణు కర్కరే 4. గోపాల్ గాడ్సే 5. మదన్ లాల్ పహ్వా 6. దిగంబర్ బడ్గే 7. శంకర్ కిష్టయ్య (బడ్గే దగ్గర పనివాడుగా ఉన్న ఇతను తెలుగువాడు)

1948, జనవరి 30న గాంధీ హత్య జరగడానికి పది రోజులముందు, జనవరి 20న గాడ్సే బృందం ఆయనను హతమార్చడానికి ఒక విఫలయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఢిల్లీలోని బిర్లా హౌస్ లో గాంధీ ప్రసంగ వేదిక సమీపంలో బాంబు పేల్చిన మదన్ లాల్ పహ్వా పోలీసులకు పట్టుబడ్డాడు. అంటే, గాంధీ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తుల వివరాలు సేకరించి, ఇంకోసారి ఆ ప్రయత్నం జరగకుండా నివారించే గట్టి ఆధారం పోలీసులకు దొరికిందన్న మాట. పైగా పది రోజుల వ్యవధి కూడా ఉంది. అయినా నివారించలేకపోవడం భారత పోలీస్, పాలనావ్యవస్థలను శాశ్వతంగా సిగ్గుతో తలవంచుకునేలా చేసిన ఒక హాస్యాస్పద విషాదాధ్యాయం.

జనవరి 20 ప్రయత్నంలో కూడా ఒక మతవిశ్వాసం ప్రభావం చూపడం ఆసక్తికరం. ముందస్తు పథకం ప్రకారం, దిగంబర్ బడ్గే గాంధీ ప్రసంగ వేదిక వెనకనున్న సర్వెంట్స్ క్వార్టర్స్ లోకి వెళ్ళి ఒక గది కిటికీ లోంచి గాంధీ మీద కాల్పులు జరపాలి. తీరా అతను అక్కడికి వెళ్ళేసరికి ఆ గది గుమ్మంలో ఒక ఒంటి కన్ను మనిషి కనిపించాడు! బడ్గే గిరుక్కున వెనుదిరిగి వచ్చేశాడు. ఒంటి కన్ను మనిషి కనబడడం పెద్ద అపశకునం కనుక నేను ఆ గదిలోకి వెళ్ళనని చెప్పేశాడు. ఆ తర్వాత, ఆ కిటికీ లోంచి గాంధీ పై బాంబు విసిరే పని గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సేకు అప్పగించారు. కిటికీ చాలా ఎత్తుగా ఉండడంతో అతను ఆ పని చేయలేకపోయాడు. అంతలో మదన్ లాల్ బాంబు పేల్చడం, పోలీసులకు పట్టుబడడం జరిగిపోయాయి.

Nathuram

కూర్చున్నవారు-ఎడమనుంచి కుడికి: నారాయణ్ ఆప్టే, సావర్కర్, నాథూరాం గాడ్సే, విష్ణు కర్కరే.
నిలబడినవారు-ఎడమనుంచి కుడికి: శంకర్ కిష్టయ్య, గోపాల్ గాడ్సే, మదన్ లాల్ పహ్వా, దిగంబర్ బడ్గే.

ఆ రోజు 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ పోలీస్ ఇన్ స్పెక్టర్ జనరల్ డీ.డబ్ల్యూ. మెహ్రాకు సమాచారం అందింది. మదన్ లాల్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగానికి ఆయన ఆదేశించాడు. అంతలో, “ఈ కేసు దర్యాప్తు నేను స్వయంగా పర్యవేక్షిస్తాను, దాని గురించి పట్టించుకోకు” అని, ఆ సమయంలో ఢిల్లీ పోలీస్ అధిపతిగా కూడా ఉన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ చీఫ్ డీ.జే. సంజీవి ఆయనకు చెప్పాడు. ఏడు గంటలసేపు జరిగిన ఇంటరాగేషన్లో మదన్ లాల్ నుంచి మూడు ముఖ్యమైన క్లూలు దొరికాయి.  వాటి ప్రకారం, కుట్రదారులు ఏడుగురు. మదన్ లాల్ సహా ఏడుగురూ హత్యాయత్నానికి ముందు సావర్కర్ సదన్ కు వెళ్ళి ఆయనను దర్శించుకున్నారు. కుట్రదారులలో ఒకరి పేరు ‘కిర్క్రీ’( కర్కరే పేరు అలా చెప్పాడు). ఇంకొకరు(గాడ్సే) రాష్ట్రీయ లేదా అగ్రణి అనే మరాఠీ వార్తాపత్రికకు ఎడిటర్ గా ఉన్నాడు(ఆ పత్రిక పేరు నిజానికి ‘హిందూ రాష్ట్ర’). ఇంటరాగేషన్ జరుగుతుండగానే కొంతమంది పోలీసులు హిందూ మహాసభ కార్యాలయానికీ, మెరీనా హోటల్ కూ పరుగుతీశారు. హోటల్ లో రూమ్ నెం.40లో వారికి నాలుగో క్లూ దొరికింది. అది హిందూ మహాసభ నాయకుడు అశుతోష్ లాహిరి సంతకంతో ఉన్న ఒక పత్రం.  గాడ్సే, నారాయణ్ ఆప్టేలు ఎనిమిదేళ్లుగా ఆయనకు తెలుసు. హిందూ రాష్ట్ర అనే పత్రికకు గాడ్సే ఎడిటర్ అని కూడా తెలుసు.

ఆ రోజు అర్థరాత్రికి మదన్ లాల్ ఇంటరాగేషన్ ముగించిన పోలీసులు, తొలి నాటి దర్యాప్తు వివరాలు నమోదుచేసి కేసు డైరీని మూసేశారు. ఆ ఏడుగంటల దర్యాప్తులో సేకరించిన వివరాలు పోలీసులకు ఎంతైనా సంతృప్తి కలిగించి ఉంటాయని Freedom at Midnight రచయితలు అంటారు. గాంధీ హత్యాయత్నం వెనుక ఒక పథకం ఉన్నట్టు పోలీసులకు అర్థమైంది. కుట్రదారుల సంఖ్య తెలిసింది. వారు, అప్పటికి కొన్ని మాసాలుగా పోలీసు నిఘాలో ఉన్న వీర సావర్కర్ అనుయాయులన్న సంగతి తెలిసింది. తమకు లభించిన సమాచారం ఆధారంగా కొద్దిపాటి ప్రయత్నం చేసి ఉంటే గాడ్సే, నారాయణ్ ఆప్టే లను వారు ఇట్టే గుర్తించి ఉండేవారు. వాళ్ళిద్దరూ ఢిల్లీ విడిచి పూణేకు బయలుదేరే లోపలే అరెస్ట్ చేసి ఉండేవారు. కానీ అది జరగలేదు. కొన్ని గంటల వ్యవధిలో అంత విలువైన సమాచారం సేకరించిన ఆ దర్యాప్తు, ఆ తర్వాత ఆశ్చర్యం కలిగించేంత నత్త నడక నడిచింది. అది ముప్పై ఏళ్ల (1976 నాటికి ) తర్వాత కూడా వివాదం రేకెత్తిస్తూనే ఉందని పై రచయితలు అంటారు.

 

కుట్రదారులు బొంబాయి రాష్ట్రానికి చెందినవారని తెలిసింది కనుక, కేసు బాధ్యతను ఎవరైనా ఒకరికి  అప్పజెప్పవలసిందిగా బొంబాయి పోలీసులను సంజీవి కోరాడు. వారితో దర్యాప్తును సమన్వయం చేయడానికి ఢిల్లీ సీ.ఐ.డీ అధికారు లిద్దరిని బొంబాయి పంపించాడు. అయితే, ఆ ఇద్దరూ మదన్ లాల్ ఇచ్చిన ప్రాథమిక సమాచార పత్రాన్ని కానీ, గాడ్సే ఎడిటర్ గా ఉన్న పత్రికకు సంబంధించిన ఉజ్జాయింపు సమాచారాన్ని కానీ తీసుకెళ్లకుండా చేతులూపుకుంటూ బొంబాయి చేరారు. వాళ్ళ దగ్గర ఉన్నది ‘కిర్క్రీ’ అనే పేరు రాసుకున్న చిన్న కాగితం ముక్క మాత్రమే.

ఆ సమయంలో బొంబాయి రాష్ట్రంలో భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి హోం మంత్రిగా ఉన్నారు. అప్పటికి వారం రోజుల క్రితం, గాంధీని హత్య చేయబోతున్నామని ఒక వ్యక్తితో మదన్ లాల్ అన్నట్టు వేరే మార్గంలో ఆయనకు సమాచారం అందింది. బొంబాయి సీ.ఐ.డీ స్పెషల్ బ్రాంచ్ కి ఇన్ చార్జిగా ఉన్న డిప్యూటీ పోలీస్ కమిషనర్ నగర్వాలాకు దర్యాప్తు బాధ్యత అప్పగించిన హోం మంత్రి, ఈ సమాచారం కూడా ఇచ్చాడు. అహమ్మద్ నగర్ కు చెందిన విష్ణు కర్కరే పేరు ఆ సమాచారంలో ఉంది.  అంటే, ఢిల్లీ అధికారులు తనను కలసుకునే సమయానికే నగర్వాలా వద్ద వారి దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ, మెరుగైన సమాచారం ఉందన్న మాట.

కర్కరేను గుర్తించడానికి నగర్వాలా వెంటనే సిబ్బందిని రంగంలోకి దించాడు. మదన్ లాల్ వారం క్రితం సావర్కర్ ను కలసిన భోగట్టా కూడా తన వద్ద ఉండడంతో సావర్కర్ ను అరెస్ట్ చేయడానికి అనుమతించమని మొరార్జీ దేశాయిని కోరాడు. దేశాయి కోపంతో మండిపడుతూ “నీకేమైనా పిచ్చా? ఈ రాష్ట్రం మొత్తం భగ్గున అంటుకు పోవాలని నీ ఉద్దేశమా?” అన్నాడు. నగర్వాలా దాంతో అరెస్ట్ ఆలోచన విరమించుకుని సావర్కర్ ఇంటి దగ్గర నిఘా పటిష్టం చేశాడు. కొన్నిగంటల్లోనే అతనికి విష్ణు కర్కరే గురించి సమాచారం అందింది. అంతలో పూణేకు చెందిన చిన్నపాటి ఆయుధ వ్యాపారి దిగంబర్ బడ్గే, కర్కరే సహచరుడన్న సంగతి ఒక పోలీస్ ఇన్ ఫార్మర్ ద్వారా తెలిసింది. ఆ భోగట్టాతో పూణే పోలీసులు బడ్గే దుకాణానికి వెళ్లారు. బడ్గే వారికి కనిపించలేదు. విచిత్రం ఏమిటంటే, ఆ తర్వాత పూణే పోలీసులు బడ్గే ఆచూకీ కోసం మళ్ళీ ప్రయత్నించలేదు. తనకోసం పోలీసులు వచ్చి వెళ్ళిన కొన్ని గంటలకే పూణే చేరుకున్న బడ్గే తర్వాత పది రోజులపాటు తన దుకాణంలో కూర్చుని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అల్లుకుంటూ తీరుబడిగా గడిపాడు.

ఢిల్లీ సీ.ఐ.డీ నుంచి వచ్చిన ఇద్దరు అధికారుల వద్దా పనికొచ్చే సమాచారం ఏమీ లేకపోవడంతో వాళ్ళ సాయం తనకు అక్కర్లేదనుకున్న నగర్వాలా తన వద్దనున్న సమాచారం వారికిచ్చి ఢిల్లీ పంపేశాడు.

జనవరి 24 కల్లా మదన్ లాల్ తనకు తెలిసిన మొత్తం సమాచారాన్ని కక్కేశాడు. ముఖ్యంగా గాడ్సే ఎడిటర్ గా ఉన్న పత్రిక పేరును హిందూ రాష్ట్రీయ గా దాదాపు కరెక్టుగా చెప్పి, అది పూణే నుంచి వెలువడుతుందని కూడా చెప్పాడు. ఢిల్లీ లోని హోం శాఖకు గానీ, సమాచార-ప్రసార శాఖకు కానీ ఒక్క సబ్ ఇన్ స్పెక్టర్ ను పంపితే, ఆ పత్రిక వివరాలు అన్నీ క్షణాలలో తెలిసిపోయేవి. కానీ ఢిల్లీ పోలీస్ చీఫ్ సంజీవి ఆ పని చేయలేదు. గాడ్సే, ఆప్టే లను ఎనిమిదేళ్లుగా ఎరిగున్న అశుతోష్ లాహిరి అనే హిందూ మహాసభ నాయకుని సంతకం ఉన్న పత్రం మొదటి రోజే దొరికినా ఆయనను ప్రశ్నించలేదు. మదన్ లాల్ ఇచ్చిన తాజా సమాచారాన్ని బొంబాయిలోని నగర్వాలాకు అత్యవసరంగా పంపే ఏర్పాటు కూడా చేయలేదు. పూణే పోలీసులకు ఒక్క ఫోన్ కాల్ చేసి హిందూ రాష్ట్ర ఎడిటర్ గురించి అడిగినా చెప్పేవారు. అదీ చేయలేదు.

ఇప్పుడిక ఆయన కంటే ఘనుడైన పోలీస్ అధికారి గురించి చెప్పుకుందాం. ఆయనే నిజానికి మన కథానాయకుడు.  పేరు యూ.హెచ్. రాణా. డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ హోదాలో ఆయన పూణేలో నేర దర్యాప్తు విభాగం ఇన్ చార్జిగా ఉన్నాడు. జనవరి 25వ తేదీన ఒక కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చాడు. పూణేలో ఆయన దగ్గర ఉన్న ఫైళ్లలో గాడ్సే, ఆప్టే, బడ్గే, కర్కరేల గురించిన మొత్తం సమాచారం ఉంది. కర్కరే, ఆప్టేల ఫోటోలు కూడా ఉన్నాయి.  వెంటనే చేయవలసింది, ఆ ఫోటోలను బిర్లా హౌస్ లో గాంధీకి కాపలాగా ఉన్న పోలీసులకు పంపడం. అది జరగలేదు.

రాణాను సంజీవి  తన కార్యాలయానికి పిలిపించాడు. 54 పేజీలు ఉన్న మదన్ లాల్ వాఙ్మూలంలో ఒక్కొక్క పేజీనే  రెండుగంటలపాటు ఇద్దరూ పరిశీలించారు. అందులోని ప్రతి వాక్యానికీ రాణా అప్రమత్తుడు కావలసిందే. ఎందుకంటే కుట్రదారులలో కనీసం ఇద్దరు ఆయన అధికార పరిధిలోకి వస్తారు. హిందూ రాష్ట్ర  అనే పత్రిక పేరు ఆయనకు తెలియక పోయే ప్రశ్నే లేదు. ముందు సంవత్సరం జూలై లోనే ఆ పత్రిక మూసివేతకు ఉత్తర్వులిచ్చారు. ఆ పత్రిక పై ఉంచిన పోలీస్ నిఘాను నవంబర్ లో రాణా స్వయంగా రద్దుచేశాడు. అంతకుముందు పూణేలో జరిగిన ఒక బాంబు పేలుడుకు ఆప్టే బాధ్యుడన్న సమాచారమూ ఆయన దగ్గర ఉంది.

తన అధికార పరిధిలోకి వచ్చే ఇన్ని కీలక వివరాలు దొరికినా, రాణా కనీసం తన కింది అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వలేదు. తక్షణమే దర్యాప్తు ప్రారంభించమని ఆదేశాలు ఇవ్వలేదు. తనైనా హుటాహుటిన విమానంలో బయలుదేరి వెళ్లాలనుకోలేదు. విమాన ప్రయాణం ఆయన ఆరోగ్యానికి పడదట. రైలులో బొంబాయికి బయలు దేరాడు. అది కూడా చుట్టుదారిలో వెళ్ళే ఒక లంఖణాల బండిని ఎంచుకున్నాడు. దాంతో 36 గంటలు పట్టే ప్రయాణకాలానికి మరో 6 గంటలు జమయ్యాయి. అదలా ఉండగా, Freedom at Midnight ఇవ్వని ఒక అదనపు సమాచారాన్ని, నాకు గుర్తున్నంతవరకు, The men who killed Gandhi ఇచ్చింది.  అది బాధనూ, నవ్వునూ కూడా తెప్పించే సమాచారం. రాణా మార్గ మధ్యంలో (గయలో?) దిగి పితృదేవతలకు పిండప్రదానం చేశాడు!

జనవరి 20 న గాంధీ పై జరిగిన హత్యా ప్రయత్నం పై దర్యాప్తు ఇలా నత్త నడకన సాగుతుండగానే అక్కడ పూణేలో గాడ్సే బృందం మరో ప్రయత్నానికి శరవేగంతో సన్నాహాలు చేసుకుంటూ పోయింది. తన శ్రాద్ధ కర్మ ముగించుకుని రాణా మళ్ళీ లంఖణాల రైలెక్కి బొంబాయిలో దిగే లోపలే గాడ్సే, ఆప్టే లు ఢిల్లీ విమానం ఎక్కేశారు. జనవరి 30 న వారు తమ పథకాన్ని అమలు చేయడం… చరిత్ర.

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)—కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

Download PDF

4 Comments

  • MSK says:

    Hi,
    Mana charithra pustakaallo (school pustakaallo) Gandhi ni ee so called group enduku champaro .. reason naaku kanipincha ledu… asalu veellu Gandhi ni enduku champudamanukunnaro koncham vaallu cheppe reason raastara..koncham
    Regards,
    MSK Kishore

    • కల్లూరి భాస్కరం says:

      గాంధీతో ఒక వర్గం వారికి మొదటినుంచీ ఉన్న సిద్ధాంత విభేదాలు, ఆ తర్వాత విపరీత రక్తపాతానికి దారితీయించిన దేశవిభజన, పాకిస్తాన్ కు రూ.55 కోట్లు చెల్లించాలని గాంధీ పట్టుబట్టడం…ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అవి నా వ్యాసం పరిధిలోకి రావు. ఒక పోలీస్ అధికారి మతవిశ్వాసం సహా అనేక పోలీస్ వైఫల్యాలు గాంధీ హత్యను ఎలా ఆపలేకపోయాయో చెప్పడమే నా వ్యాసంలో వస్తువు. మీ స్పందనకు ధన్యవాదాలు కిషోర్ గారూ…

  • వావ్!
    పిచ్చి పలువిధాలు! ఈ పిచ్చి ఇంకా ముదురుతుందేగానీ తగ్గుతున్న ఛాయలు లేవు.
    కుట్ర గురించిన చాలా విషయాలు తెలుసుకున్నాను. కృతజ్ఞున్ని.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)