కల తెగిపోతే…అల ఆగిపోతే..అది సాహిర్ పాట!

sahir11

sahir11

“కహా హైన్? కహా హైన్? ముహాఫిజ్ ఖుదీకే….జిన్హే నాజ్ హై హింద్ పర్ ఓ కహా హైన్?”

“తూ హిందు బనేగా న ముస్సల్మాన్ బనేగా..ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా!”

“దేఖ్ తేరే భగవాన్ కి హాలత్ క్యా హోగయా ఇన్సాన్…కిత్నా బదల్ గయా భగవాన్!”

ఇవి సాహిర్ లుధియాన్వి కలంలోంచి ఆవేదన తో మిళితమైన ఆవేశంతో తన్నుకు వచ్చిన కొన్ని కవిత్వపు తునకలు. మనలో నిస్తేజంగా పడిఉన్న అంతరంగాన్ని కొట్టి లేపే కొన్ని పదునైన పదశరాలు. తెలుగు వారికి పెద్దగా పరిచితమైన పేరు కాదు కనక సాహిర్ గారి గురించి క్లుప్తంగా చెప్పుకొని ముందుకు సాగుదాం. అబ్దుల్ హాయి గా లుధియానా (పంజాబ్) లో 1921 లో ఒక జమీందారి వంశంలో జన్మించిన సాహిర్, తన చిన్నతనంలోనే తల్లి తండ్రులు విడిపోయి, తన తల్లితో పెరగడం వల్ల, కటిక దారిద్ర్యాన్ని అనుభవించాడు. లాహోర్ లో కొద్ది కాలం ఒక పత్రిక నడిపి, అతని రాతల కారణంగా అరెస్టు వారెంట్ జారీ అవ్వటంతో, బొంబాయి చేరుకొన్నాడు. తరవాత ముఫ్ఫై సంవత్సరాల పాటు, ఏడు వందల పై చిలుకు సినిమా పాటలు, ఉర్దూ కవితా సంపుటాలు వ్రాసుకుంటూ, హిందీ సినిమా పాటలకి ఉచ్ఛస్థాయి కవిత్వస్థానం కలగజేస్తూ, సాటి లేని కవిగా తన పేరుని ఎవ్వరూ చెరపలేని విధంగా ముద్రించుకొని  1980లో మనలోకం వదిలేశారు.

నిజానికి సాహిర్ లుధియాన్వి వ్రాసిన పాటలు చిన్నపడినుంచి వింటూ పెరిగినా, ఒక కవిగా ఆయన పట్ల ఆసక్తి,  ఆయన శైలి పట్ల అభిమానం పెరగటం మాత్రం కొద్ది కాలం క్రితం జరిగిన విశేషమే!  షుమారు ఒక పదిహేనేళ్ళ క్రితం నేనూ, మా ఆవిడ కలిసి చికాగో నుంచి కాలిఫోర్నియాకి వెకేషన్ మీద వెళ్ళినప్పుడు రూట్ 1 లో  శాన్ఫ్రాన్సిస్కో  నుంచి లాస్ ఏంజిలీస్ వరకూ డ్రైవ్ చేసుకెల్దామని డిసైడ్ అయ్యాం. ఈ రోడ్డు పసిఫిక్ కోస్టంబడి ఒక వైపు ఎత్తైన కొండలతో, మరొక వైపు అందమైన సముద్రపు అలల మధ్యన సాగుతూ, అమెరికా లోని టాప్ త్రీ సీనిక్ డ్రైవుల్లో ఒకటిగా పేరు తెచ్చుకొంది. నా మిత్రుడు దారిలో వినటానికని “The Genius of Sahir Ludhianvi” అని ఒక సి.డి ఇచ్చాడు.

“జాయే తో జాయే కహా..”, “వో సుబహ కభీ తో ఆయేగీ”, “యే దునియా అగర్ మిల్ భి జాయే తో క్యా హైన్?”, “ప్యార్ పర్ బస్ తో నహీ హై మేరా లేకిన్ ఫిర్ భీ”, “ఔరత్ నే జనమ్ దియా మర్దోంకో…ఔర్ మర్దోంనె ఉసె బాజార్ దియా!” అంటూ ఒకదాని తరువాత మరొక “ఏడుపుగొట్టు పాటలు” కారంతా వ్యాపించాయి. ఒక పక్కనేమో కళ్ళు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యం, అటూ ఇటూ చూస్తూ డ్రైవ్ చేస్తున్నందుకు నాకు సన్నగా మందలింపు, మధ్యలో ఈ పాటలు! వాల్యూం తక్కువ చేసి, మా ఫ్రెండుని తిట్టుకుంటూ కొంత దూరం ప్రయాణం చేశాం.  ఇంతకు ముందు ఎప్పుడూ వినని గొంతుతో ఒక పాట మొదలయ్యింది.

“తు ముఝే భూల్ భి జావో తో యే హక్ హై తుమకో…మేరీ బాత్ ఔర్ హై మైనే తో ముహౌబ్బత్ కీ హై!” విన్నది నిజమా కాదా అని నిర్ధారించుకోటానికి వాల్యూం పెంచాను. అనుమానం లేదు, విన్నది కరక్టే! ప్రతిపదానువాదంలో (కవితానువాదం చేసే సాహసం చెయ్యలేను) ఇది, “నన్ను మర్చిపోటానికి నీకు హక్కుంది…నా విషయం వేరు, నేను ప్రేమించాను కదా(నిన్ను)!” ఆ లాజిక్ చాలా ఆసక్తి కరంగా అనిపించింది.

http://www.youtube.com/watch?v=dJAIEEwHTqU

“మేరె దిల్ కి మేరె జస్బాత్ కి కీమత్ క్యా హై (నా హృదయానికీ, భావావేశానికీ, విలువేముంది?)
ఉల్ఝి ఉల్ఝి సి ఖయాలత్ కి కీమత్ క్యా హై (నా క్లిష్ఠమైన ఆలోచనలకి విలువేముంది?)
మైనే క్యోం ప్యార్ కియా..తుమ్ నే న క్యోం ప్యార్ కియా (నేనెందుకు ప్రేమించాను..నువ్వెందుకు ప్రేమించలేదు?)
ఇన్ పరేషాన్ సవాలాత్ కి కీమత్ క్యా హైన్? (ఇలాంటి ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు విలువేముంది?)
….
మై తుమ్హారీ హు..యాహి మేరె లియే క్యా కమ్ హై? (నేను నీదానాను…ఇది చాలదా నాకు?)

తుమ్ మేరే హో కే రహో..యే మేరి కిస్మత్ న సహి” (నువ్వు నావాడుగా ఉండటం…నా తలరాతలో లేనప్పటికీ)

ఈ పాట ప్రేయసీ ప్రియుల మధ్య ఒక సంభాషణ లాగా సాగుతుంది. ఒక రోమాన్స్ డ్యూయెట్ లో ఇంత వింత లాజిక్ కనిపించటం మొదటిసారి అవ్వటం వల్లనేమో, ఆ తరవాత వచ్చే ప్రతి పాట లిరిక్స్ నూ చెవులు రిక్కించి వినటం ప్రారంభించాం. ఆ పైన రూట్ 1 సౌందర్యం కూడా మా ధ్యానాన్ని ఆ పాటల పైనుంచి మరల్చలేకపోయింధి. వెకేషన్ అయిపోయిన తరువాత సాహిర్ పైన రిసెర్చ్ చేసి ఆయన పాటలన్నీ జాగర్తగా పరిశీలించటం ప్రారంభించాను. ఒక సముద్రం లోకి దూకాననిపించింది, అదీ ఈత రాకుండా! ఆయన పాటలలో ఉర్దూ పదాలు చాలా విరివిగా దొర్లుతాయి. ఎదో సందర్భానుసారం అర్థం అయినట్లనిపించినా, ఆ భాషలో పట్టు లేకపోవటం వల్ల, శబ్దసౌందర్యాన్ని ఆస్వాదించటమే ఎక్కువగా ఉండేది. ఆన్లైన్ ఉర్దూ నిఘంటువుల పుణ్యమా అని తరవాత రోజుల్లో ఆ బాధ తొలగిపోయింది. కవి ఎవరో తెలియకపోయినా, ఇంతకు ముందు నాకు నచ్చిన, నా నోట్లో నానుతూ ఉన్న అనేక పాత హిందీ పాటలు కూడా ఆయన కలాన్నే చీల్చుకు పుట్టాయన్నవి కూడా నాకా సమయం లోనే తెలిసింది.

ఆయన పాటలు వింటున్నప్పుడు చాలా సార్లు నాకు, జీవితం పట్ల ఆయనకున్న ఫిలాసఫీ, ఆయనలోని రొమాంటిక్ ఇంటెన్సిటీ, ఆయన సొంత కథ, భావాలనే, ఆయన పాటలలో ప్రతిబింబించేవాడనిపించేది, అది ఆయన ఉద్దేశపూర్వకంగా చేసుండకపోయినా.

సాహిర్ స్వయంగా చిన్నతనంలో ఎన్నో కష్టాలని అనుభవించి ఒక గొప్ప కవిగా పేరునేర్పర్చుకున్న నేపథ్యంలో “హమ్ దోనోం” సినిమాలోని పాట ఇది.

“మై జిందగీ కా సాథ్ నిభాతా చలాగయా.. (నేను జీవితానితో వెన్నంటి సాగుతున్నా)

హర్ ఫిక్ర్కో ధువే మే ఉడాతా చాలాగయా.. (అన్ని దిగుళ్ళనూ పొగలాగా ఊదేసుకుంటూ సాగుతున్నా)

బర్బాదియోంకా శోక్ మనానా ఫిజూల్ థా… ( వినాశనాల (ఓటముల) గురించి విచారం వ్యర్థం)

బర్బాదియోంకా జష్న్ మనాతా చాలా గయా.. (వాటినే పండగ చేసుకొని సాగుతున్నా)

గమ్ ఔర్ ఖుషీ మె ఫర్క్ న మెహసూస్ హో జహా.. (దుఖానికీ సుఖానికీ మధ్య వ్యత్యాసం ఎక్కడైతే ఉండదో)
మై దిల్ కో అస్ మకామ్ పె లాతా చాలా గయా..” (ఆ స్థానానికి నా హృదయాన్ని తీసుకెళ్తూ సాగుతున్నాను)

http://www.youtube.com/watch?v=IzC0_XVE3Vk

గురుదత్ సినిమా ప్యాసా గురించి, దానిలోని పాటల గురించి, కొన్ని Ph.D వ్యాసాలు వ్రాయచ్చు. హీరో ఒక గుర్తింపు లేని కవి. అతడు చనిపోయాడనుకున్న తరవాత, అతడి కవితలు వెలుగులోకొచ్చి, గొప్ప కవిగా గుర్తింపబడతాడు. “నేను బ్రతికేఉన్నాను” అని ఎంత మొత్తుకున్నా వినకుండా పిచ్చోడికింద జమకట్టిన సమాజాన్ని, ఆ కవి  వెలివేసి వెళ్ళిపోవటంతో కథ ముగుస్తుంది. ఒక ఫలించని ప్రేమ కథ, మంచి మనసున్న ఒక వేశ్యతో మరో ప్రేమ కథ, సబ్ ప్లాట్స్ గా ఉంటాయి. ఒక కవికి ఇంతకంటే మంచి అవకాశం దొరుకుతుందా? సాహిర్ ఈ సినిమా పాటల్లో తమ విశ్వరూపాన్ని ఆవిష్కరించారు. ఎంతగా అంటే, ఆ సినిమా పాటలకి చక్కని బాణీలు కట్టిన యస్.డి.బర్మన్ కి కూడా లభించనంత గుర్తింపు సాహిర్ సాహెబ్ కు దక్కేంతలా.

సాహిర్ తన నిజజీవితంలో కూడా రెండు సార్లు విఫలప్రేమాబాధితుడై ఆజన్మ బ్రహ్మచారి గానే మిగిలిపోయాడు. తన భవిష్యత్తుని ముందుగానే గుర్తించి ఈ పాట వ్రాశారా?
“జానే వో కైసే లోగ్ థే జిన్కే ప్యార్ కో ప్యార్ మిలా..” పాట నుంచి.
“బిఛడ్ గయా హర్ సాథీ దేకర్ పల్ దో పల్ కా సాథ్.. (అందరూ దూరమయ్యారు ఒకటి రెండు క్షణాల సాహచర్యం తరవాత)

కిస్కో ఫుర్సత్ హై జొ థామే దీవానోంకా హాథ్.. (ఎవరికి ఓపిక ఒక పిచ్చివాడి చెయ్యి పట్టుకోవటానికి)

హమ్కో అప్నా సాయా తక్ అక్సర్ బేజార్ మిలా..”(చివరికి నా నీడకు కూడా నేనంటే అలసటొచ్చింది)

http://www.youtube.com/watch?v=cmWZHQAKMEk

 

సాహిర్ షాయారీలో స్త్రీల పట్ల, సమాజంలో వారి అణచివేతపట్ల కూడా తీవ్రమైన ఆవేదన కనపడుతుంది. ఆయన దానిని వ్యక్తపరచటంలో ఎక్కడా “రొమాంటిసైజ్” చెయ్యకుండా సూటిగా శులాల్లాంటి మాటల ప్రయోగంతో శ్రోతలను కలవరపెట్టేవారు. ఆ మాటల తీవ్రత ఒక్కోసారి మనని ఎంత బాధ పెడుతుందంటే, అసలు ఆ పాటే వినటం ఆపేద్దాం అనేంత! 1958 లో విడుదలైన “సాధనా” చిత్రం లోని “ఔరత్ నే జనమ్ దియా మర్దోంకో .. మర్దోంనే ఉసే బాజార్ దియా” అనే పాట లోని కొన్ని వాక్యాలు ఇవి.

“జిన్ హోటోన్ నె ఇన్కో ప్యార్ కియా..ఉన్ హోటోన్ కా వ్యాపార్ కియా (ఏ పెదవులైతే ప్రేమనందించాయో, వాటితోనే వ్యాపారం చేసాడు (మగవాడు))

జిస్ కోఖ్ మె ఉస్కా జిస్మ్ ఢలా..ఉస్ కోఖ్ కా కారోబార్ కియా (ఏ గర్భంలో అయితే జన్మించాడో…దానితోనే వ్యాపారం చేశాడు) ……

యే వో బద్కిస్మత్ మా హైన్ జో…బేటోంకి సేజ్ పే లేటీ హై” (ఈమె ఎంత దురదృష్టవంతురాలు అంటే….తన బిడ్డల పరుపుల మీద పడుకుని ఉంది)

http://www.youtube.com/watch?v=dRnHoAI2Pm4

యాభై, అరవై దశాకాలలోనే, సమాజంలో పేరుకుపోతున్న ధనదాహానికీ, నీతిమాలినతనానికీ, అణచివేతకూ, కులమత వివక్షకూ అద్దం పట్టేలా ఎన్నో పాటలు సాహిర్ కలంనుంచి పెల్లుబికాయి.

ప్యాసా లోని “యే దునియా అగర్ మిల్ భి జాయే తో క్యా హై?” కవిత (పాట) బహుళ ప్రాచుర్యం పొందింది.

“జలాదో ఇసే ఫూంక్ డాలో యే దునియా..జలాదో జలాదో జలాదో..

మేరే సామ్నేసే హటాలో యే దునియా

తుమ్హారీ హై తుమ్హీ సంభాలో యే దునియా”

“సమాజాన్ని తగల పెట్టెయ్యండి,  నా ముందరి నుంచి తీసెయ్యండి, మీదైన సమాజాన్ని మీరే ఉంచుకోండి” అన్న వీరావేశం ఈ పాటలో చూపిస్తే, అదే సమాజం పై ఆవేదన వ్యక్తపరుస్తూనే, ఒక మంచి ఉదయం మనకు రాబోతోంది అన్న ఆశాభావం “వో సుబహ కభీ తో ఆయేగీ…” అన్న పాటలో మనకి కనబడుతుంది.

“మానా కే అభీ తేరే మేరే అర్మానోంకి కీమత్ కుచ్ భీ నహీ  (సరే, మన ఆశలకెలాంటి విలువా లేదు)

మిట్టీ క భీ హై కుచ్ మోల్ మగర్, ఇన్సానోంకి కీమత్ కుచ్ భీ నహీ  (మట్టికైనా  కొంత విలువుంది కానీ, మనుషులకు ఏ మాత్రం లేదు)

ఇన్సానోంకీ ఇజ్జత్ జబ్ ఝూటే సిక్కోం మె న తోలీ జాయేగీ (ఏ రోజైతే మనుషుల ఆత్మగౌరవాన్ని డబ్బులతో తూయరో)

వో సుబహ కభీ తో ఆయేగీ” (ఆ ఉదయం ఎపుడో వస్తుంది)

http://www.youtube.com/watch?v=hQYQUo5X6F0

ముస్లిం కుటుంబంలో పుట్టిన సాహిర్, ఒక నాస్తికుడు. ఆ నాస్తికత్వం ఆయన కొన్ని పాటలలో కనపడుతూనే ఉంటుంది. 1954 లో “నాస్తిక్” అనే సినిమాకి కవి ప్రదీప్ “దేఖ్ తేరే ఇన్సాన్ కి హాలత్ క్యా హోగయి భగవాన్..కిత్నా బదల్ గయా ఇన్సాన్” (దేవుడా, చూడు మానవుడి పరిస్థితి – ఎంత మారిపోయాడో మానవుడు) అనే పాట వ్రాసి తానే పాడారు. దానికి జవాబుగా సాహిర్ 1955 లో “రైల్వే ప్లాట్ఫారం” అనే సినిమాకి పాట రాస్తూ ఇలా జవాబు ఇచ్చారు. “దేఖ్ తేరే భగవాన్ కి హాలత్ క్యా హో గయి ఇన్సాన్…కిత్నా బదల్ గయా భగవాన్!” (ఓ మనిషీ చూడు దేవుడెలా మారిపోయాడో!) ఈ పాటలో దైవదూషణ కంటే కూడా, సమాజంలో అవినీతిపరుల ఇంటే లక్ష్మీదేవి ఇంకా ఎక్కువ కొలువుంటోందన్న వాపోతే ఎక్కువగా కనపడుతుంది. ఈ రెండు పాటల బాణీ కూడా ఒకటే!

భగవాన్, ఇన్సాన్ బదల్ గయా: http://www.youtube.com/watch?v=1_5LLtxAB4I

ఇన్సాన్, భగవాన్ బదల్ గయా: http://www.youtube.com/watch?v=geBkwLHtJA8

అలాంటి నాస్తికుడైన సాహిర్ హిందీలో కలకాలం గుర్తుండి పోయే భజన్ కూడా వ్రాసారంటే అది వెంటనే నమ్మబుద్ది కాదు. “హమ్ దోనోం” సినిమాలో, లతాజీ అత్యంత మృదుమధురంగా పాడిన “అల్లా తేరో నామ్..ఈశ్వర్ తేరో నామ్” మరి ఈయన కలంనుండి వచ్చినదే!

సాహిర్ మతం మానవత్వం. ప్రేమే అతని దైవం. ఈ భావం స్ఫురించేటట్లు వ్రాసిన పాటలనేకం. కొన్ని పాటలు టైంలెస్. “తూ హిందూ బనేగా న ముసల్మాన్ బనేగా…ఇన్సాన్ కి ఔలాద్ తు ఇన్సాన్ బనేగా!” ఈ పాట ఎన్నో తరాల అంతరాత్మలను తొలుస్తూనే వస్తోంది. ఈ పాటలో ఒక వ్యక్తి ఒక అనాథ బాలుడిని సాకుతూ, నువ్వు హిందువువీ అవ్వవూ లేక ముస్లిమ్ వీ అవ్వవూ, ఒక మనిషికి పుట్టావు కనక, తప్పక ఒక మనిషివే అవుతావు అని ముచ్చట పడుతూ ఉంటాడు. యష్ చోప్రా దర్శకుడిగా రంగ ప్రవేశం చేసిన “ధూల్ కా ఫూల్” సినిమా లోని పాట ఇది.

“అఛ్ఛా హై అభీ తక్ తేరా కుఛ్ నామ్ నహీ హై (మంచిదయ్యింది, నీకు ఇంకా నామకరణం కాలేదు)

తుమ్కో కిసీ మజహబ్ సే కోయీ కామ్ నహీ హై (నీకు ఏ మతంతోను ఇక పని లేదు)

జిస్ ఇల్మ్ నే ఇన్సానోంకో తక్సీమ్ కియా హై (ఏ జ్ఞానము అయితే మనుషులను విభజించిందో)

ఉస్ ఇల్మ్ కా తుమ్ పర్ కోయీ ఇల్జామ్ నహీ హై” (ఆ జ్ఞానము యొక్క అపవాదు నీ మీద లేదు)

http://www.youtube.com/watch?v=jqcyUkUFzrc

 

సాహిర్ లుధియాన్వి కి మరికొన్ని విశిష్టతలు కూడా ఉన్నాయి. మ్యూజిక్ కంపెనీల నించి రాయల్టీలు రాబట్టిన మొట్టమొదటి గేయరచయిత ఈయన! అలాగే అప్పట్లో చాలా మందికి కొరుకుడు పడని భావాలూ, ప్రవర్తన కూడా ఆయన సొంతం. లతా మంగేష్కర్ ఒక తిరుగులేని గాయనిగా రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో ఆమెకు సంగీత దర్శకుడి తరువాత, అత్యంత ఎక్కువ పారితోషికం ఇచ్చేవారు. గేయరచయితకు ఆమెతో పోలిస్తే తక్కువగా ఇచ్చేవారు. అలాంటిది, సాహిర్ మటుకు, లత కంటే ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించనిదే పాట రాయనని ఘోషణ చెయ్యటంతో, ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితే ఏర్పడింది వారిద్దరి మధ్య. అందుకేనోమో, ఆషా భోంస్లే నే సాహిర్ పాటలు అందరి గాయనీ గాయకుల కంటే ఎక్కువ పాడారు. అయినా సరే ఆయనతోనే ఆయన జీవితాంతం పాటలు వ్రాయించుకున్న దర్శక దిగ్గజాలు ఉన్నారు. దాదాపు ముఫ్ఫై సంవత్సరాల పాటు వీరి సినిమాలన్నిటికీ, సాహిర్ ఒక్కరే గేయరచయిత. వారెవరో కాదు, బి.ఆర్.చోప్రా, యష్ చోప్రా సోదర ద్వయం.

వీరి సినిమాల్లో పాటలన్నీ బహుళ ప్రాచుర్యం పొందినవే. ఒకటా, రెండా, డజన్ల కొద్దీ సూపర్ హిట్ పాటలు! వీళ్ళు వేర్వేరు సంగీత దర్శకులను, గాయనీ గాయకులను వాడుకున్నారు కానీ, గేయ రచయితను మాత్రం మార్చలేదు. అదీ సాహిర్ గొప్పతనం!

సాహిర్ కవిత్వంలోని ఉర్దూ పదాల వాడుక గురించి ముందర చెప్పుకున్నాం. 1964లో విడుదలైన “చిత్రలేఖ” అనే సినిమా నేపథ్యం చంద్రగుప్త మౌర్య కాలం నాటిది. ఉర్దూ పదాలకు ఆస్కారం లేదు. నిజానికి శైలేంద్ర, ప్రదీప్ లాంటి గేయరచయితలు ఇటువంటి సంస్కృత భాషా ప్రాధాన్యం కావాల్సిన పాటలకి పెట్టింది పేరు. సంగీత దర్శకుడు రోషన్ మటుకు సాహిర్ మాత్రమే రాయాలని పట్టుబట్టారుట. అది ఒక సవాలు గా తీసుకొని, తన ప్రకృతికి విరుద్ధంగా సాహిర్ ఎంతో కష్టపడి వ్రాసిన పాట ఇది. ఈ పాట ఒక మూడేళ్ళ క్రితం ఔట్లుక్ వారు జరిపిన పోల్ లో, అత్యంత ఉత్తమమైన పాటగా గుర్తించబడటం కూడా ఒక విశేషమే. ఈ పాటకు మాత్రం సాహిర్ తో సమానమైన ప్రశంశ పాట పాడిన రఫీకీ, బాణీ కట్టిన రోషన్ కీ చెందాల్సిందే!

“మన్ రే తు కాహే న ధీర్ ధరే? (ఓ మనసా ఎందుకు సంయమం వహించలేకపోతున్నావు?)

వో నిర్మోహీ, మోహ న జానే.. జిన్కా మోహ కరే! (ఎవరినైతే నువ్వు మోహించావో…వారు మోహం తెలియని నిర్మోహి)

ఉత్నాహీ ఉప్కార్ సమఝ్ కోయీ..జిత్నా సాథ్ నిభాయే (అంత వరకూ చేసింది ఉపకారమనుకో..ఎంతవరకైతే నీ తోడు నిలిచారో)

జనమ్ మరణ్ కా మేల్ హై సప్నా, యే సప్నా బిస్రా దే (జనన మరణ చక్రం ఒక స్వప్నం..ఈ స్వప్నాని వదలివేయి)

కోయీ న సంగ్ మరే…” (ఎవ్వరూ చావులో నీ తోడు రారు)

http://www.youtube.com/watch?v=uA2FhgF6VY4

రోహన్, సాహిర్ కాంబినేషన్ లో వచ్చిన తాజ్మహల్ సినిమా లోని పాటలు కుడా అజరామరం. “జో వాదా కియా వో నిభానాపడేగా, రోకే జమానా చాహే, రోకే ఖుదాయీ తుమ్కో ఆనా పడేగా” పాట ఈ సినిమాలోదే.

గుమ్రాహ్ చిత్రం లోని “చలో ఎక్ బార్ ఫిర్ సే..అజ్నబీ బాన్ జాయే హమ్ దోనోం”, సాహిర్ వ్రాసిన టాప్ 10 పాటలలో ఒకటిగా నిలచిపోయే పాట. ముఖ్యంగా దానిలోని ఆఖరి చరణం ఆవేదనకీ మరెంతో ఆలోచనకీ గురిచెయ్యక మానదు. విడిపోయిన ప్రేయసీ ప్రియులు మళ్ళీ ఎదురుపడిన నేపథ్యంలో “పద మళ్ళీ ఒక సారి అపరిచుతులుగా మారిపోదాం  మనిద్దరం” అంటూ సాగే ఈ పాట లోని ఆఖరి చరణం ఇది.

“తార్రుఫ్ రోగ్ హో జాయే..తొ ఉస్కో భూల్నా బెహతర్ (ఎప్పుడైతే ఒక పరిచయం, రుగ్మతగా మారుతుందో, దాన్ని మరువటమే మంచిది)

తాల్లుక్ బోఝ్ బన్ జాయే..తొ ఉస్కో తోడ్నా అఛ్ఛా (ఎప్పుడైతే ఒక సంబంధం, బరువు లాగా అనిపిస్తుందో, దాన్ని తెంచుకోవటమే మంచిది)

వో అఫ్సానా జిసే అంజామ్ తక్ లానా న హో మున్కిన్ (ఎప్పుడైతే ఒక కథని దాని యొక్కసరైన ముగింపుకి చేర్చలేకపోతామో)

ఉసే ఎక్ ఖూబ్సూరత్ మోడ్ దేకర్ ఛోడనా అఛ్ఛా” (దానికి ఒక అందమైన మలుపునిచ్చి వదిలేసి ముందుకు సాగటమే మంచిది)

http://www.youtube.com/watch?v=y8GnY2eddzM

సాహిర్ అన్నీ ఇలాంటి గంభీరమైన పాటలూ, వేదాంతం లేక ఘాటైన రోమాన్స్ పాటలు మాత్రమే వ్రాశారేమో అనుకునేరు! అనేక సరదా డ్యూయెట్లు, మరెన్నో హాస్య పాటలూ కూడా రచించారు. అన్నిటి గురించీ చెప్పుకుంటూ పోతే ఓ పుస్తకమే అయిపోతుంది కనక, నాకు నచ్చిన పాటలన్నీ క్లుప్తంగా ప్రస్తావిస్తా. ఆసక్తి కలవారు వీటిలోని పద, భావ చమత్కారాలను నింపాదిగా తరవాత చదువుకొని సాహిర్ కవిత్వాన్ని మరింత ఆస్వాదించచ్చు.

“మాంగ్ కే సాథ్ తుమ్హారా .. మైనే మాంగ్ లియా సంసార్”  (నయా దౌర్)

“ఉడే జబ్ జబ్ జుల్ఫే తేరీ..కువారియోం కా దిల్ ధడ్కే” (నయా దౌర్)

“సర్ జొ తేరా చక్రాయే…యా దిల్ డూబా జాయే” (ప్యాసా)

“తేరా ముజ్హ్సే హై పెహ్లే కా నాతా కోయీ…జానే తూ యా జానే నా” (ఆ గలే లగ్ జా)

“మేరే దిల్ మె ఆజ్ క్యా హై..తు కహే తో మై బతాదూ” (దాగ్)

“గాపుచీ గాపుచీ గమ్ గమ్…కిషీకి కిషీకి కమ్ కమ్” (త్రిశూల్)

“యూ తో హమ్నే లాఖ్ హసీ దేఖే హై..తుమ్సా నహి దేఖా” (తుమ్సా నహి దేఖా)

“ఏ మేరె జోహ్రజబీ తుఝే మాలూమ్ నహీ” (వక్త్)

1976 లో యశ్ చోప్రా నిర్మించిన కభీ కభీ లో ప్యాసా తరవాత మళ్ళీ హీరో ఒక కవి, ఒక భగ్న ప్రేమికుడు. అందులోని హీరో పాత్ర సాహిర్ లుధియాన్వి ప్రేరణతోనే రూపుదిద్దుకున్నదేమో అన్న అనుమానం రాక తప్పదు. హిందీ పాటలతో పరిచయం ఉండి ఈ సినిమా టైటిల్ సాంగ్ తెలియని వారు ఉన్నారంటే నమ్మలేని విషయం; అంత ప్రాచుర్యం పొందింది ఆ పాట! సాధారణంగా తన రచనా శక్తి పట్ల అపరిమితమైన నమ్మకం ఉన్న సాహిర్ ఎదో “ఇంట్రాస్పెక్టివ్ మూడ్” లో జారిపోయి ఈ కవిత వ్రాసినట్లున్నారు. ఈ కవిత నాకు ఎంత నచ్చినా, దీనిలో ఆయన చెప్పిన విషయం, ఆయన పట్ల నాకున్న అవధుల్లేని అభిమానం వల్ల అనుకుంటా,  నా జీవితకాలంలో జరగదేమోనని అనిపిస్తూ ఉంటుంది! నా కాలమ్ ముగింపు కి ఇంత కంటే ఉచితమైన పాట కూడా ఇంకొకటిలేదేమో!

“కల ఔర్ ఆయేంగే నగ్మోంకే ఖిల్తీ కలియా చున్నేవాలే  (రేపు మరిన్ని కవితాపుష్పాలు వస్తాయి, ఏరుకోటానికి)

ముజ్హ్సే బెహ్తార్ కెహ్నే వాలే..తుమ్సే బెహ్తార్ సున్నేవాలే (నా కన్నా బాగా చెప్పకలిగే కవులొస్తారు..మీ కంటే మంచి శ్రోతలోస్తారు)

కల్ కోయీ ముజ్హ్కో యాద్ కరే..క్యోం కోయీ ముజ్హ్కో యాద్ కరే (రేపు నన్ను ఎవరైనా గుర్తుకుతెచ్చుకుంటారు.. అసలు నన్నెందుకు గుర్తుకుతెచ్చుకోవాలి?)

మస్రూఫ్ జమానా మేరె లియే..క్యోం వక్త్ అప్నా బర్బాద్ కరే? (ఈ తీరుబడి లేని ప్రపంచం…నా కోసం ఎందుకు తమ సమయం వ్యర్థం చేసుకోవాలి?)

మై పల్ దో పల్ కా షాయర్ హూ.. పల్ దో పల్ మేరీ కహానీ హై!” (నేను ఒకటి రెండు క్షణాల కవిని..ఒకటి రెండు క్షణాలదే నా కథ!)

http://www.youtube.com/watch?v=bI10wgbeXgc

Siva_3-   యాజి

 

 

 

 

Download PDF

14 Comments

 • Dr.Ismail says:

  సూపర్బ్. I just love most of the songs mentioned here. Enjoyed the essay. Keep writing:-)

 • యాజీ, ఇవాళ మీ వ్యాసంతో సాహిర్ మరో సారి కళ్ళ ముందూ, అతని పాటలన్నీ చెవుల చుట్టూ హోరెత్తాయి. ఎప్పటి నించో ఎదురు చూపు, ఎవరయినా వొక మంచి వ్యాసం సాహిర్ గురించి రాస్తారా అని! మీ వ్యాసం ఆ లోటు తీర్చింది. వొక లోతయిన గాయంలాంటి వైఫల్యాన్ని విజయోన్మత్తతతో గానం చేయడం సాహిర్ కే సాధ్యం. మీరు ఇవాళ ఈ వ్యాసంలో ప్రస్తావించిన ప్రతి పాటా వొక క్లాసిక్. వినాలి, విని తీరాలి. వినకపోతే చెవుల్లోని హృదయమూ, హృదయంలోని చెవులూ మూసుకు పోయినట్టే!

 • కాజ సురేశ్ says:

  అద్భుతమైన వ్యాసము. ఇందులోని అన్ని పాటలు విన్నవే అయినా వాటి వెనక ఉన్న లిరిక్స్ మీద అంతగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఈ ప్రతి పాటని ఆ కోణములో వింటాను. ధన్యవాదాలు

 • మీరు ఉదహరించినవన్నీ కూడా చాలా అద్భుతమైన పాటలు… నాకు అన్నింటిలో
  “ప్యాసా” లోవి చాలా ఇష్టం..!ముఖ్యంగా “జానే వో కైసే”, “యే దునియా అగర్ మిల్ భి జాయె తొ క్యా హై..” రెండూ చాలా ఇష్టం నాకు..
  हर एक जिस्म घायल, हर एक रूह प्यासी
  निगाहो में उलझन, दिलों में उदासी
  ये दुनियाँ हैं या आलम-ए-बदहवासी
  ये दुनियाँ अगर मिल भी जाये तो क्या हैं!
  వినులవిందైన వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

  • యాజి says:

   తృష్ణ గారూ, ఒకటా రెండా..సాహిర్ పాటలలో మనని ఎప్పుడూ వెంటాడుతూ ఉండే పంక్తులు!

   इसको ही जीना कहते है तो युही जीलेंगे
   उफ़ न करेंगे लैब सीलेंगे आंसू पीलेंगे
   गम से अब घबराना कैसा गम सौ बार मिला
   हमने तो जब कलियाँ माँगी थी काँटों का हार मिला!

   जहा एक खिलौना है इंसान की हस्ती
   ये बस्ती है मुर्दा परस्तोंकी बस्ती
   जहा और जीवन से है मौत सस्ती
   ये दुनिया अगर मिल भी जाए तो क्या है?

 • శ్రీరామ్ వేలమూరి says:

  అద్భుతం సార్,, మరో మాటకు తావు లేదు

 • యాజి says:

  Thank you all! I was very skeptical when I wrote this. ఎప్పుడో 80లో చనిపోయిన హిందీ సినిమా పాటల రచయిత గురించి వ్రాస్తే ఎవరైనా చదువుతారా అని. I’m so happy that you encouraged my effort with your appreciation.

  Afsar ji, thank you for the wonderful title and encouraging words (as always)!

  Well, I have a secret hope that at least one reader who is unfamiliar with Sahir chances up on reading this article and develops an interest in his songs. That will be my tribute to this great poet!

 • ns murty says:

  యాజి గారూ,

  ఒక్క సారి గుండెని కవ్వంతో చిలకరించినట్టయింది మీ వ్యాసం చదువుతుంటే. ఉర్దూ నేర్చుకోలేకపోయానన్న చింతతో మరొక్కసారి మనసు చివుక్కుమంది. “తూ హింద్ బనేగా న ముసల్మాన్ బనేగా ” అన్న పాట నా చిన్నతనంలో నన్ను బాగా ప్రభావితం చేసిన దేశభక్తిగీతాలలో ఒకటి. ప్యాసా సినిమాలో పాటలగురించి ఎంత చెప్పినా తక్కువే.
  నిజానికి కవులకి మానవత్వం తప్ప వేరే మతం ఉంటుందనుకోను. ఉన్నట్టు కనిపించేదేదైనా సమాజం కోసం ఒంటిమీద వేసుకునే బట్టలాటిదై ఉంటుంది. సాహిర్ అటువంటి ఒక అపురూపమైన కవి. మీరు చాలా మాడెస్ట్ గా చెప్పినా మీ అనువాదమూ బాగుంది, మీ వ్యాఖ్యానమూ బాగుంది. అభినందనపూర్వక ధన్యవాదాలు.

 • aparna says:

  chaalaa bavundaDee vyaasam. urgent gaa naakishtamaina ee paaTalannee vineyali.. :)

 • BHUVANACHANDRA says:

  యాజీగారూ …కడుపు నిండిపోయింది ఆ పాటలన్నీ నేను రోజూపాడుకునేవే ….సాహిర్ ని తలుచుకోనిరోజు వుండదు …మీ విశ్లేషణ అద్భుతం …ప్రతి పదం మీ గుండెల్లోంచి వొచ్చింది ,,,,,,,,,,,,ఇంకా ఇంకా రాస్తూనే వుండండి ….ఆశీస్సులతో …భువనచంద్ర

 • హృదయమున్ని కదిలించే పాటలను రాసిన కవిని మాకు పరిచయం చేయడమే కాకుండా వారి పాటల్లోని అర్ధాల్ని వివరించినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఉదహరించిన కొన్ని పాటలు విని ఆనందిస్తాము కానీ, మా లాంటి సామాన్య శ్రోతలు రాసినవారిపైన దృష్టి పెట్టము. మీ వ్యాసం చదివిన తరువాత, ఈ పాటలే మళ్ళీ వింటే ఇంకా ఎంజాయ్ చేస్తాము.

Leave a Reply to aparna Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)