నాలో మా ఊరు

 GOWRINAIDU

ఊరొదిలి పట్నం వొచ్చినప్పుడు

నాతో తెచ్చుకున్నానొక పచ్చని పంట పొలాన్ని,

తీసుకొచ్చేనొక నదిని,

ఒక చెట్టునీ.. మడిగట్టునీ..

నలుగురు నేస్తాల్నీ,

నాగలి సరే ..

అమర్చుకున్నాను నా పుస్తకాల నడుమ

అద్దాల పలకల మధ్య బొబ్బిలి వీణలా.

అక్కడ మా ఊరిలో

ఇంటిముందు మా అమ్మ కల్లాపు జల్లే వేళ

పట్నంలో నా ఇరుకు గదిలో

పూలజల్లు కురిసి

పరిమళిస్తుంది వేకువ.

అక్కడ మా ఇంటి గడపలో

చెల్లెలు వేసిన తిన్నని పిండిముగ్గు కర్ర

నా గది కిటికీలోంచి కిరణమై తాకి

పులకరిస్తుంది మెలకువ.

పట్నం కదా

నా చుట్టూ విస్తరిస్తున్న ప్రపంచం

నా బతుకేదో నన్ను బతకనివ్వదుగదా,

వేషమూ, భాషా నన్ను నాలాగా ఉండనివ్వవుగదా,

నాకునేను పరాయినైపోతున్నాననుకున్నప్పుడల్లా

ఆకుపచ్చ పంటపొలాన్ని ఎదురుగా పరుచి

పైరగాలిరెపరెపల్లో తేలిపోతాను మైమరచి.

నాతో తెచ్చుకున్న నదిని తెరిచి

తలారా స్నానంచేసి ఈతలుకొడతాను

నేస్తాలతో కలిసి.

నొప్పితెలీకుండా కొంచెం కొంచెం

నన్ను కొరుక్కు తింటుంది నగరమని నాకు తెలుసు,

మత్తేదో జల్లి మెల్లగా

లొంగదీసుకుంటుంది నగరమని నాకు తెలుసు,

అనేకానేక బలహీనతలతో  ఘనీభవించి

నన్ను నేను అసహ్యించుకుంటున్నప్పుడల్లా

చాళ్ళుచాళ్ళుగా దున్ని దున్ని నాగలి

నా హృదయక్షేత్రాన్ని సస్యశ్యామలం చేస్తుంది.

గంటేడ గౌరునాయుడు

Download PDF

11 Comments

  • balasudhakarmouli says:

    Dr.KESAVARA REDDY novel- మూగవాని పిల్లనగ్రోవిలో bakkireDDi పొలాన్ని, నాగలిని ఒదిలి వుండనట్టు – మా gouri నాయుడు మాష్టారికి అవంటే ప్రాణం.

  • balasudhakarmouli says:

    పట్నం కొండచిలువ మీద స్వారి చేయగల శక్తిని గౌరినాయిడు మాష్టారు ఎప్పుడొ సముపార్జించుకున్నారు. ఆయన మార్గం అనుసరణీయం.

  • raghava charya prativadi bhayamkara says:

    జారిపోతున్న జీవితాన్ని ఎలా ఒడిసి పట్టుకోవాలో ఎంచక్కా చెప్పారు.
    ఈ కాస్తా కూడా ప్రయత్నించకుండా జీవితాన్ని చేజార్చుకున్నవారికి ” మాష్టారు ” ( అని balasudhakarmouli గారు సెలవిచ్చారు , నేను ఒప్పుకున్నాను ) సున్నా మార్కులు వేయాల్సిందే.

    • balasudhakarmouli says:

      గౌరినాయిడు మాష్టారు పార్వతీపురంలో.. చుట్టు పక్కలా.. గొప్ప సాహితీ కదలిక తీసుకొస్తూ.. నాలాంటి శిష్యులను కలుపుకుంటున్నారు. his litarature gives me a great motivation…… thank u sir…….

  • నొప్పితెలీకుండా కొంచెం కొంచెం
    నన్ను కొరుక్కు తింటుంది నగరమని నాకు తెలుసు,
    మత్తేదో జల్లి మెల్లగా
    లొంగదీసుకుంటుంది నగరమని నాకు తెలుసు,

    ఈ ఎరుక కలిగి వుండడం మనల్ని మనిషిగా నిలబెడుతుంది మాస్టారు. ఊరి వేలిని విడిచినా ఆ చివరి విద్యుత్ ప్రసరిస్తునే వుంటుంది ఇలా మనలో. అభినందనలతో..

  • ** నన్ను నేను అసహ్యించుకుంటున్నప్పుడల్లా

    చాళ్ళుచాళ్ళుగా దున్ని దున్ని నాగలి

    నా హృదయక్షేత్రాన్ని సస్యశ్యామలం చేస్తుంది.**

    మనసు మౌన రోదనకి ప్రకృతి ఒక్కటే ఓదార్పు
    అది ఇలలో అయినా ఊహల్లో అయినా.. చాలా బాగా చెప్పారు

  • ఎక్కడున్నా మనతో పాటు గుండెల్లో మోసుకెల్లాల్సినవి కొన్నుంటాయ్,.. మనల్ని మనలాగే మిగలనీయడానికి,. బాగుంది,..సార్,..

  • రెడ్డి రామకృష్ణ says:

    గౌరునాయుడు గారికి అపారంగ పల్లె మీదున్న ప్రేమను వ్యక్తం చేసింది కవిత.కొన్ని జ్ఞాపకలు అంతే, తలచు కున్నప్పుడల్లా మనసును తేలిక పరుస్తాయి.కానీ ప్రస్తుత వాస్తవం మాత్రం దానికి భిన్నగానే ఉంది.

  • హృదయ క్షేత్రాన్ని దున్నడానికి నాగలిని మీ వెంబడే ఉండడం అదృష్టం. కవిత చాలా బావుందండి.

  • C.V.SURESH says:

    పల్లె మత్తుని అలా చిన్నగా ఇ౦జెక్ట్ చేశారు పాఠకుడికి. ప్రకృతిలొ స్వేచ్చగా విహరి౦చే స్థితి ను౦డి, కుబ్జ స్వరూప౦లోకి ప్రకృతిని మార్చుకొని, డభ్భుకు కొనుక్కొని ఇ౦ట్లో బ౦ధి౦చి, తాను ప్రకృతి ని అనుభవిస్తున్నానని బ్రమిస్తున్న ఈ నాగరిక ప్రప౦చాన్ని ఎత్తి చూపారు. నాగరిక “బొన్సాయ్” బ్రతుకుల గురి౦చి విడమరిచారు. కవిత చాలా బావు౦ద౦డి!

  • Thirupalu says:

    డా.కేశవరెడ్డి గారి మూగ వాని పిల్లనగ్రొవీ పొలానికి , రైతుకు సంబందమెట్టిదో చెప్పినట్ట్లు, అలాగే నాగలికి రైతుకు ఉన్న సంబందాన్ని అద్బుతంగా ఆవిష్కరించారు. మనిషితనాన్ని ఇంకా మరచి పోని వాల్లలో మీరు మొదటి వారులా ఉంది.

Leave a Reply to రెడ్డి రామకృష్ణ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)