ప్రపంచాన్ని చదివించిన ఆమె..!

Malathi-candoor-Banner

చాలా సార్లు మనం పెద్దగా ఆలోచించం కాని, ఇది చాలా ముఖ్యమయిన ప్రశ్న!

వొక రచన మన జీవితంలోకి ఎలా ప్రవేశిస్తుంది? లేదా వొక రచయితో, కవో మన అనుభవంలోకి ఎలా అడుగులు వేసుకుంటూ వస్తారు?

 చెప్పడం కష్టమే!

కాని, మన చదువు అనుభవాలను నెమరేసుకుంటూ ఓ పది నిమిషాలు సాలోచనగా కూర్చున్నప్పుడు వొక్కో రచయితా వొక్కో రచనా వొక్కో మజిలీలా కనిపిస్తాయి. కొన్ని మజిలీలు మనల్ని విస్మయంలో పడేస్తే, ఇంకా కొన్ని మజిలీలు ప్రశ్నలవుతాయి. ఇంకా కొన్ని జవాబులవుతాయి. మాలతి చందూర్ ఏదీ కాదు! అసలు ఆమె రచనలు నేనెప్పుడూ సీరియస్ గా చదవలేదు. ఆమెని నేను సీరియస్ రచయిత్రిగా ఎప్పుడయినా తీసుకున్నానో లేదో తెలీదు. దానికి బలమయిన కారణం వొక్కటే: అసలు సాహిత్యాన్ని వొక సీరియస్ వ్యాపకంగా తీసుకోని కాలం నించీ నేను ఆమె రచనలు చదువుతూ ఉండడమే!

కాని, ఆశ్చర్యం ఏమిటంటే, జీవితంలోని ప్రతి దశలోనూ ఆమె రచనలు ఎదో వొకటి చదువుతూనే వున్నా. వొక రచయితని ఇన్ని దశల్లో ఇన్ని వయసుల్లో చదువుతూ రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

2

నేను మిడిల్ స్కూల్ లో – అంటే ఆరో తరగతి-  చదువుతున్న రోజుల్లో మా అమ్మ గారు రంగనాయకమ్మగారికి వీరాభిమాని. రంగనాయకమ్మ రచనలన్నీ ఆమె మళ్ళీ మళ్ళీ చదివేది. ‘ఆ పుస్తకంలో ఏముంది రెండో సారి చదవడానికి ?’ అని నేను అడిగినప్పుడల్లా నాకు అర్థమయ్యే భాషలో కథలాంటిది ఎదో చెప్పేది. కాని, వాటి మీద నాకు ఆసక్తి వుండేది కాదు. నాకు నాటికల పిచ్చి వుండడం వల్ల కేవలం నాటికల పుస్తకాలే చదివే వాణ్ని ఆ రోజుల్లో!  అవి చదవడానికి బాగుండేవి. పైగా, ఆ డైలాగులు కొట్టుకుంటూ తిరిగే వాణ్ని.

ఇంకో వేపు మా అమ్మగారు మంచి వంటలు చేసేది కాబట్టి, ఎక్కువ సమయం నేనూ అమ్మా వంట గదిలో గడిపే వాళ్ళం. అలా వంటల మీద ఆసక్తి పెంచుకుంటున్న రోజుల్లో ఉన్నట్టుండి వొక రోజు మా ఇంట్లో-వంట గదిలో-   ‘వంటలు- పిండివంటలు’ పుస్తకం ప్రత్యక్షమయింది. మొదటి పేజీ నించి చివరి పేజీ దాకా ఆసక్తిగా చదివిన తొలి పుస్తకాల్లో ఇదీ వొకటి అని ఖాయంగా చెప్పగలను. ఈ పుస్తకం ఎంత ఉపయోగంలో పెట్టానంటే, ఏడాది తిరిగే సరికి నూనె, కూరలూ, పసుపు మరకలతో ఈ పుస్తకం ఇక చదవడానికి వీల్లేకుండా పోయింది. నాన్నగారు బెజవాడ వెళ్తున్నప్పుడు పనిమాలా చెప్పే వాణ్ని “ మాలతి చందూర్ పుస్తకం ఇంకో కాపీ తీసుకు వస్తారా?” అని!

అలా ప్రతి ఏడాది ‘వంటలు-పిండి వంటలు’ పుస్తకం కొత్త ఎడిషన్ మా ఇంట్లో చేరేది. అది చదవడం వల్ల నాకు జరిగిన లాభం ఏమిటంటే, రెండు వందల పేజీల పుస్తకం ఏదన్నా అలవోకగా ధీమాగా  చదివేయడం! అది ‘చందమామ’ చదివే అనుభవం కన్నా భిన్నమయింది నాకు – మెల్లిగా నా చేతులు మా అమ్మగారి పుస్తకాల మీదకి మళ్ళాయి. నాటికలే కాకుండా, కథలూ నవలలూ చదవడం మొదలెట్టాను. అవి చదవడం మొదలెట్టాక మాలతి చందూర్ ‘వంటలు- పిండివంటలు’నా పుస్తక  ప్రపంచంలోంచి నిష్క్రమించింది.

ఏడో తరగతిలో మేం పట్నం- అంటే ఖమ్మం- చేరాం. కాన్వెంటు చదువు నాకు పెద్ద కల్చర్ షాక్. మిగతా పిల్లలు వాళ్ళ ఇంగ్లీషు పలుకులు వింటున్నప్పుడల్లా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్! అసలు నాకేమీ తెలియదు, ఎలాగయినా సరే ఈ లోకాన్ని ఉన్నపళాన అర్థం చేసేసుకోవాలి అని ఆబ. తెల్లారేసరికి మంచి ఇంగ్లీషు మాట్లాడేయాలి, క్లాస్ మేట్ల మైండ్ బ్లాంక్ అయిపోవాలి అని తీర్మానించుకున్న రోజుల్లో  కనిపించిన ఇంగ్లీషు పుస్తకమల్లా చదివేయడం! పిచ్చి పట్టినట్టు రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకాన్ని మొదటి పేజీ నించి చివరి పేజీ దాకా చదివేయడం…శంకరనారాయణ నిఘంటువులో రోజూ కొన్ని పేజీలు  బట్టీ కొట్టడం!

నా అవస్థలు చూసి నాకే అవస్థగా వుండేది. అప్పుడు దొరికింది స్వాతి మాసపత్రిక! అందులో మాలతి గారి కెరటాల్లోకి దూకేసాను. మొదటి సారి చదివిన ఇంగ్లీష్ నవల ‘ of human bondage.’ ఆ నవల చదవడానికి ముందు మాలతి గారి వ్యాసం చదివి, అందులో events అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకొని, ఆ పాత్రల పేర్లు కాగితం మీద తెలుగులో రాసుకొని, ఇంగ్లీషు నవల చదవడం! ఇదీ సాధన! అలా మాలతి గారి సపోర్టుతో  ప్రతి నెలా వొక ఇంగ్లీషు నవల చదవడం, ఆ నవల గురించి ఇంగ్లీషులో సమ్మరీ రాసుకొని, కొన్ని సార్లు మాలతి గారి కెరటాల వ్యాసాన్ని నా బ్రోకెన్ ఇంగ్లీషు  అనువాదం చేసుకోవడం ….అలా, ఏడాది తిరిగే సరికి మాలతి గారు నా చేత పన్నెండు నవలలు చదివించారు. డికెన్స్, థామస్ హార్డీ, జేన్ ఆస్టిన్, వర్జీనియా వూల్ఫ్….ఇలా నా బుర్ర నిండా ఇంగ్లీషు పేర్లు!

ఈ క్రమంలో మాలతి గారు నాకు నేర్పిన పాఠం: జ్ఞానానికి భాష అడ్డంకి కాదు- అని! ఆమె ఎంత కష్టమయిన నవల అయినా సరే, అతి తేలికయిన భాషలో చెప్పేస్తుంటే, అంత లావు లావు నవలలు కూడా ‘వీజీ’ అయిపోయేవి. పైగా, ఆ పిచ్చి అవేశాల ఉద్వేగాల టీనేజ్ లో ఆ చిన్ని వ్యాసాల  గడ్డిపోచ పట్టుకొని ఎంత పొగరుమోత్తనంతో ఎంత గోదారి ఈదానో!

 

4

ఆ తరవాత మాలతి చందూర్ సొంత రచనలు ఏం చదివానో పెద్దగా గుర్తుండని స్థితి కూడా వొకటి వచ్చేసింది. పైగా, ఆమె ‘ప్రశ్నలూ జవాబుల’ శీర్షిక ఆవిడ పట్ల నా గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చింది కూడా!  ఇంత చదువుకొని ఈవిడ ఎందుకిలా మరీ నాసిగా రాస్తారా అనుకునే రోజులు కూడా వచ్చేసాయి. సొంతంగా రాయడం ఎంత కష్టమో కదా అని అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని స్థితి! ఆవిడే పరిచయం చేసిన ప్రపంచ సాహిత్యం అంతా చదివాక, ఆవిడ సొంత రచనలు మరీ అన్యాయంగా అనిపించడం మొదలయింది. చూస్తూ చూస్తూ ఉండగానే, నా చదువు పటంలోంచి  మాలతిగారు నిష్క్రమించేసారు.

కాని, ఆమె ‘కెరటాలే’ తోడు లేకపోతే, నాకు ఈ మాత్రం ఇంగ్లీషు వచ్చేది కాదు. ప్రపంచ సాహిత్యం చదవాలన్న తపన నాలో పుట్టేది కాదు. కాని, నా ముందు పరచుకున్న ప్రపంచంలో మాలతి గారిని ఎక్కడ locate చేసుకోవాలో ఇప్పటికీ నాకు తెలియదు.

afsar— అఫ్సర్

 

 

 

 

Download PDF

22 Comments

  • buchireddy gangula says:

    మిస్ హర్ — తీరని లోటు
    ——————————————
    బుచ్చి రెడ్డి గంగుల

  • Dr.Ismail says:

    A fitting Tribute.

  • సాయి పద్మ says:

    చాలా బాగుంది ..
    . locating her on literary radar with man made GPS is so tough….literally.. you did try on the pillar of your memories.. kudos sir

  • “పాతకెరటాల” గురించి మీరన్న ప్రతిమాటా నిజం !

  • sathyavathi says:

    ఒక పల్లెటూరి జిల్లా పరిషత్ హైస్కూల్లో తెలుగు మీడియం లో చదివిన నాకు చిన్నప్పుడే ఇంగ్లిష్ సాహిత్యం చదివే అలవాటు చేసింది మాలతీ చందూర్ గారే అందుకు ఇవ్వాల్టికి కూడా ఆవిడ్ని తలుచుకుంటాను.మా చిన్నపుడు ఆవిడ మాఇంట్లో ఒక వ్యక్తీ .మా అమ్మకి ఎంబ్రాయిడరి డిజైన్లు మాకు ఇంగ్లిష్ నవలలు,జగతి పత్రికలో బోలెడు కొటేషన్లు ..పత్రిక రాగానే ఈవారం మాలతీ చందూర్ ఎం వ్రాసింది అంటూ అందరం ప్రమదావనమే ముందు చూసిన రోజులు . అవి నా జీవితంలో ఇష్టాలు ఏర్పరుచుకుంటూన్న రోజులు .నాకు మాలతిగారి ని తలుచుకుంటే గుర్తొచ్చేది వంటలు కావు ఎందుకంటే నాకు నలభై ఏళ్ళు దాటాక గానీ వంట చేసే అవకాశం రాలేదు నేను డిక్షనరీ ముందు పెట్టుకుని చదివిన రెబెక్కా ,ఆనా కెరినీనా మదాం బావరి ,వ్యానిటీ ఫెయిర్ అవ్వే గుర్తొస్తాయి నేను మొదటి సారి మద్రాస్ లో కచేరీ రోడ్ లో ఆవిడింటికి వెళ్ళాను మూడు గంటలున్నాను .ఆవిడ కిందకి వచ్చి మళ్లి రండి అని చెప్పారు నా చిన్నప్పటి గురువుని అలా దర్శించుకున్నానన్నమాట ఆరోజుల్లో ఆవిడ రెండు తరాలని ఆకట్టుకున్న రచయిత్రి .ఆవిడ పోయిన వార్త స్క్రోల్ రాగానే నాకు వచ్చిన పోన్ కాల్సే ఎందరి మనసు లో ఆమె నిలిచి వుందో ఉదాహరణ.

  • నా వాల్^పై రాసుకున్న మాటలు

    నూనూగుమీసాల చదువరి తనంలో ఎక్కువగా విన్న పేరు మాలతీ చందూర్
    మీ కాలంలో మీరు చేసిన ప్రభావిత ప్రకంపనాలు ఏదో రీతిగా జీవితంలో పనిచేస్తుంటాయి.
    అందుకే మిమ్మల్ని స్మరించుకుంటూ
    శిరసువంచి నమస్కరిస్తున్నాను

  • narayanasharma says:

    సార్ …ఇప్పుడే చదవడం పూర్తి చేసాను..చాలవరకు సాహితీ వేత్తల వ్యక్తిత్వాలు ఒక్కొకరికి ఒక్కోరకంగా ప్రేరణ నిస్తాయి.ప్రత్యక్షంగా కొన్ని సార్లు పరిచయంలేకున్నా..

    నాకు మాలతీ చందూర్ గారి సాహిత్యంతో చెప్పుకో దగ్గ పరిచయంలేదు.కొన్నేవో పత్రికల్లో చదివాను.

    ఆమె రచనా వ్యక్తిత్వాన్ని బాగా పరిచయం
    చేసారు సార్..మాలతీ చందూర్ గారి రచనలకోసం వెదుకుతాను ఇక..నమస్తే

  • Mercy Margaret says:

    మాలతి చందూర్ గారి గురించి నేను విన్న మాట .. గూగుల్ లేని రోజుల్లోనే ఆవిడ అంతటి సమాచారాన్ని అందించాగాలిగేదని .. నాకు స్వాతి పుస్తకం ద్వారానే ఆవిడ తెలుసు ..
    కెరటాల ద్వారా మీకు తోడూ నడిచిన ఆవిడకి మీరు ఇలా నివాళి ఇవ్వడం బాగుంది సర్

  • నిజమే అఫ్సర్ జి.. మీరన్నట్టు పాత కెరటాల ఉద్ధృతి మెస్మరిజ్ చేసేది. అలాగే ఆమె నవలలు కొంత పెలవం గా అనిపించడమూ — ముఖ్యం గా భూమిపుత్రీ – చాలా నిరాశపడ్డాను ఆ బుక్ చదివి. ఆ తర్వాత ఆమె నవలలు చదివింది చాలా తక్కువ. కానీ — ప్రమదావనం శీర్షిక, పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచే, మా అమ్మగారికి చదివి వినిపించడం ఇప్పటికీ గుర్తే. కాయగూరలు కోసుకుంటూనో, పప్పు రుబ్బుకుంటూనో అమ్మ తలపంకిస్తూ, మధ్యలో ఆవిడని మెచ్చేసుకుంటూ వినేవారు. మా అమ్మగారి తరానికి ఆవిడ ఒక ఐకాన్. మన తరానికి కిటికీ పరదాలా మాలతీ చందూర్ గారు, గాలికి రెపరెపలాటల్లంటి అలవోక వీక్షణాల సాహిత్యం, అద్భుత ఆంగ్ల సాహిత్యానికి పరిచయం అనుకుంటాను.

  • We will miss her for sure!

    ఆవిడ నవలలు రెండు చదివాక రాసింది పాతకెరటాల మాలతీ చందూర్‌గారేనా అన్న అసహనం.. అనవసరంగా అవి చదివి ఆవిడ మీదున్న అభిమానాన్ని చేజేతులా తగ్గించుకున్నానేమో అని కాస్త బాధాను!

    “..మన చదువు అనుభవాలను నెమరేసుకుంటూ ఓ పది నిమిషాలు సాలోచనగా కూర్చున్నప్పుడు వొక్కో రచయితా వొక్కో రచనా వొక్కో మజిలీలా కనిపిస్తాయి….” — చాలా బాగా చెప్పారు!

  • ఒక ప్రముఖ రచయిత్రి నిష్క్రమించింది. ఆమె రచనలు భవిష్యత్ తరాలకు అందుతాయని ఆశిద్దాం
    ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్న్నాను. ఆమె ఆత్మా కు శాంతి చేకూరు గాక
    సాత్యకి
    స/ఓ శేషేంద్ర శర్మ

  • sreedhar parupalli says:

    మాలతీ చందూర్ అన్ని రంగాల్లో ఉండటం వల్ల సీరియస్ రచయితగా కన్పించి ఉండకపోవచ్చు. కానీ ఒక విజ్ఞాన భాండాగారం. ఇంటర్ నెట్ లేని రోజుల్లో జనరల్ నాలెడ్జి టెస్టులకు, ప్రాపంచిక జ్ఞానం కోసం ఆమె ప్రశ్నలు, జవాబులు శీర్షికలు పనికొచ్చాయి. అంతమాత్రం చేత మాలతీ చందూర్ అర్ధం ప్రమదావనాలు, కెరటాలు ఇటువంటి శీర్షికలే కాదు. నిజాలు చెబుతూ ఉండటమే ఆమె పని. అందుకే ఇజాల్లో ఇమడలేదు. నేటి రచయితల్లా, కవుల్లా ఇజాలకు బ్రాండ్ అంబాసిడర్ కాదు. మాలతీ చందూర్ ఒక మోటివేటర్. ఒక స్ఫూర్తిదాత. ఆమె స్ఫూర్తితో అనేక ఆంగ్ల పుస్తకాలు చదివిన నీవు ధన్యుడివి అఫ్సర్. భౌతికంగా లేకపోయినా మాలతీచందూర్ రచనల్లో చిరకాలం నిలచిపోతారు.

  • BHUVANACHANDRA says:

    ఒక విన్నపం ….. మాలతి చందూర్ గారి పుస్తకాలు కొన్ని నిజంగా మనసులో తిష్ట వేస్తాయి …
    ఆమె రాసిన ”’రెక్కలు -చుక్కలు”’ ఆకోవకే చెందుతుంది ….ఒక గాఢమైన వేదనని హృదయంలో మిగులుస్తుంది ….
    వీలుంటే ..,..దొరికితే ,చదవండి…..మాలతిగారు చాలా సాదా సీదా మనిషి ….ఎన్నోసార్లునేను ”మీ పాతకెరటాలునాకెంతో స్పూర్తినీ ఆనందాన్నీ కలిగించాయి ”అని అంటే,” అది నీ సంస్కారం. ఆ నవలలని పరిచయం చెయ్యడం వల్ల నేను ఎంతో ఆనందాన్ని పొందుతున్నా ” అనేవారు.అంత చక్కని వ్యక్తిత్యంవారిది…..వారి కి మనస్పూర్తిగా నమస్కరించటం తప్ప ఇంకేం చెయ్యగలం. ఆ …….వారి ”పాత కెరటాల్ని ”మన రాబోయే తరాల వాళ్లకి అందించగలం …..నమస్సులతో … భువనచంద్ర

  • Radha says:

    ప్రముఖ రచయిత్రి, నా అభిమాన రచయిత్రికి నమస్కరిస్తూ,
    రాధ

  • Gorusu says:

    అఫ్సర్ … మాలతి గారి నివాళి ఎన్నో జ్ఞాపకాలను తట్టి లేపింది . ఆమెతో
    రెండు నెలల కిందటే ఫోన్ లో THE COLOR PURPLE (ఆలిస్ వాకర్) నవలని పాతకెరటాల్లొ పరిచయం చేయమని అభ్యర్తించాను. నవల దొరికితే తప్పక చేస్తానని మాటకూడా ఇచ్చారు. 13 ఏళ్ళ క్రితం మద్రాస్ వెళ్ళినప్పుడు ఆ దంపతులను కలిసాను. 2005 లో మరోసారి వైజాగ్ వచ్చినప్పుడూ మాట్లాడాను. 5 ఏళ్ళ క్రితం హైదరాబాద్ లో అస్మిత మీటింగులో చూసాను. పాతకెరటాలతొ ప్రపంచాన్ని తెలుగు పాటకుల దోసిళ్ళలో పోసిన మాలతీ చందూర్ గారికి ఘాడమయిన నివాళి అర్పిస్తూ …
    – గొరుసు

  • balasudhakarmouli says:

    afsar gaari vyaasam- prapancha saahitya adhyayanam వేగిరంగా చేయాలని – naaku ప్రేరణnu ఇచ్చింది. కారణం శ్రీ.MAALATHI చందూర్ గారే….. ఆ mahaa rachiyitriki- naa nivaali.

  • bhasker says:

    అఫ్సర్ గారూ …
    మాలతి గారి ‘పాత కెరటాలని’ రేపి ఇంతమంది రచయితల హృదయ కెరటాల్ని తట్టి లేపారు!
    చాలా మంచి నివాళి!
    ఆ రోజుల్లో ఆమె పాత కెరటాల్ని ఆబగా చదివిన వాళ్ళల్లో నేనూ ఒకరినైనందుకు గర్విస్తూ.. ఇంగ్లిష్ సాహిత్య బిక్ష ప్రసాదించిన తనకు రుణగ్రస్తున్నవుతు…
    ఆమె ‘ప్రశ్నలు-జవాబులు’ కూడా నాకు బాగా నచ్చేవండీ..! జీవిత సత్యాలు చెపుతూ ఎందరికో దిశా నిర్దేశం కలిగించిదనుకుంటాను. అవి ఎందరికో ఓదార్పు, ఉపశమనం కలిగిస్తూ ఉండేవి. నాకూనూ..
    ఇంత మంచి ‘నివాళి’ కి మిమ్మల్ని మరొకసారి అభినందించకుండా ఉండలేకపోతున్నాను!!
    -మీ భాస్కర్ కూరపాటి.

  • జ్ఞాపకాలను అక్షరాలుగా మార్చడంలో మీ మార్క్ ప్రత్యేకంగా వుంటుంది,.. మాలతీ చందూర్ గారు అనుకోగానే నాకు గుర్తొచ్చేవి,..పాతకెరటాలు,..కానీ ఎందుకో అవన్నీ ఒక పుస్తకంగా వచ్చినట్లులేవు,.. కేవలం ఆ కెరటాల కోసమే స్వాతి మాసపత్రిక కొనేవాడిని,..నిజమే ఆ కెరటాలు ప్రపంచాన్ని చదివించేవి,..ఇప్పుడు ఆ సముద్రం మూగపోయింది,.

  • tahiro says:

    పాతకెరటాలు 3 – 4 సంకలనాలుగా వచ్చాయి . నవోదయ, విశాలాంధ్ర లలో ప్రయత్నిచండి దొరుకుతాయి.

  • మాలతీ చందూర్ గారి గురించి అఫ్సర్ గారు రాసిన వ్యాసం చాలా నిక్కచ్చిగా,సూటిగా ఉండి చక చకా చదివించింది. పాత కెరటాలు చదివి ప్రభావితం కాని తెలుగు పాఠకులు ఉండరేమో! చదువుకునే రోజుల్లో ఎన్నొ ఆంగ్ల నవలలు చదివి, సంక్షిప్తంగా వివరించమంటే మాటలు దొరక్క అవస్థపడే నాకు, ఆవిడ నెలకొక ప్రఖ్యాత నవలని చక్కని సరళమైన భాషలో, ఆ కథలోని నిసర్గ రామణీయకతని అందంగా పరిచయం చేస్తుంటే గొప్ప ఆరాధనగా ఉండేది. ఈ మార్చ్ లో అనుకుంటా ఆవిడకి ఫోన్ చేస్తే ఆమే తీశారు. అంతకు ముందు ఆవిడ అక్కగారు తీసి, ఆమెని పిలిచిన విషయం గుర్తుండి, నా పేరు చెప్పుకుని , మాలతీచందూర్ గారితో మాట్లాడాలని చేసాను , ఆవిడని ఒకసారి పిలవగలరా? అనడిగాను. “ఎక్కడి కెళ్ళి ఆవిడని పిలుచుకురానూ ? నేనే ఆవిడని” అన్నారు. “నీ కథల పుస్తకం ‘ఆసరా’లో కొన్ని కథలు చదివానమ్మా, బావున్నాయి, ఇంకా పుస్తకం పూర్తి చెయ్యలేదు, తీరిక చిక్కాక చదివి చెపుతాను” అన్నారు.
    రెండు తరాల పాఠకులని ప్రభావితం చేసి, తెలుగువారందరికీ ప్రీతిపాత్రులైన మాలతీచందూర్ గారి స్మృతికి నా నమస్సుమాంజలి !

  • Mangu Siva Ram Prasad says:

    మాలతీ చందూరిగారి మహభినిష్క్రమణంతో ఒక మహత్తరమైన తరం అంతరించింది. ఒక ప్రముఖ వార పత్రికలో ఆమె నిర్వహించిన ప్రమదావనం శీర్షిక ఇంటింటిని అలరించింది. తన వ్యాసాల ద్వారా ప్రపంచ సాహిత్యాన్ని తెలుగువారికి పరిచయం చేసిన ఘనత ఆమెది. అఫ్సర్ గారి సంస్మరణ సమయోచితం.

Leave a Reply to సాయి పద్మ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)