ఒకరాజు – ఏడుగురు రాణులు

samanya1resize

సామాన్య

అనగనగా అప్పుడెప్పుడో, ఒక రాజ్యం ఉండేది, ఆ రాజ్యానికి ఒకే ఒక్క రాజు ఉండేవాడు. ఆ ఒకే ఒక్క రాజుకి ఏడుగురు రాణులుండేవారు. ఆ రాజు పాపం ఏడుగురు రాణులను పెళ్లి చేసుకున్నా ,ఒక్క రాణి కి కూడా  ఒక్క బిడ్డన్నా పుట్టలేదు. ఇలా ఉండగా ,వాళ్ళ రాజ్యానికి ఒక సన్యాసి వచ్చాడు. ఆ వచ్చిన సన్యాసి రాజు దగ్గరికి కూడా భిక్షకి వచ్చాడు. భిక్షకి వచ్చిన సన్యాసిని చూడగానే రాజుకు చెడ్డ చిరాకు కలిగింది. ముఖం చాలా చిట్లించేసి, ”నేను బోలెడు దానధర్మాలు చేశాను, నా సంపదలో సగం అట్లాగే హరించాను. కానీ నాకు ఒక్క బిడ్డన్నా పుట్టలేదు ”అని విసుక్కున్నాడట . అది విని సాధువు “ఓ రాజా !మరేం భాదపడకు, ఇదిగో ఈ మామిడి విత్తనం  తీసుకుని నీ పెరట్లో పాతు, కొన్ని వారాల్లోనే అది పెరిగి పెద్దై ఒక్కటే ఒక్క మామిడి పండుని ఇస్తుంది. దాన్ని నీ ఏడుగురు రాణుల్ని తినమను.  తప్పకుండా నీకు సంతాన భాగ్యం కలుగుతుంది” అని చెప్పాట్ట. 
 
రాజు ఆ సాధువు చెప్పినట్లే చేసాడట. పాతిన విత్తనం పెరిగి మామిడి చెట్టు అయింది .  సన్యాసి చెప్పినట్లే ఒకేఒక్క కాయని ఇచ్చింది. రాజు గారు ఆ కాయని కోసి రాణులని పిల్చి అందరూ పంచుకు తినండి అని ఇచ్చాడట . రాజుగారి భార్యల్లో చిన్న భార్య “పనులకు ముందు తిండికి వెనక” ఉండేదట. అట్లాగే ఆరోజు కూడా ఏదో పనిమీద ఎక్కడో ఉండగా మిగిలిన ఆరుగురు రాణులు కూడ పలుక్కుని “ఈ పండు మనం తినేద్దాం, అందరూ గర్భం దాలిస్తే పనీపాట చేసేదెవరు, అందుకని చిన్న రాణికి పండు ఇవ్వద్దు” అని నిర్ణయం తీసేసుకుని మామిడి పండుని తినేసి తొక్క, పిక్క బయట పడేసార్ట. అంతలోకి చిన్న రాణి వచ్చింది. వచ్చి “అక్కల్లారా పండులో నా భాగమేది ?” అన్చెప్పి అడిగింది. అడిగితే ఆ రాణులు ధీమాగా “అందరూ గర్భవతులమైతే పనీపాట చేసేదెవరు అందుకనే నీకు లేకుండా మేమే తినేశాం” అని చెప్పారట. అదివిని చిన్న రాణి చాలా బాధపడి అంతా వెతికి వారు పడేసిన ‘తొక్క,పిక్క’ తెచ్చుకుని తిన్నదట. 
 
అప్పుడిక కొంతకాలం గడిచింది. ఆశ్చర్యంగా రాజుగారి ఆరుగురు భార్యలు మాత్రం గర్భవతులు కాలేదు . కానీ, ఏడవ రాణి మాత్రం గర్భవతి అయింది. అదివిని రాజు ఆనందానికి పట్ట పగ్గాల్లేవట, చిన్న రాణిని పువ్వుల్లో పెట్టి చూసుకోవడం మొదలుపెట్టాడు. అట్లా అట్లా చిన్న రాణికి తొమ్మిది నెలలు నిండి రేపోమాపో కనబోతూ ఉందనగా మంత్రులు, సామంతులు రాజుగారిని వేటకి పిలిచారట. మొదట కాదన్నా రాజుగారు చివరికి బయల్దేరి వెళుతూ వెళుతూ ఆంతరంగికులను పిలిచి రాణిగారు మగబిడ్డని ప్రసవిస్తే ఏ గంట కొట్టాలో ఆడపిల్లని ప్రసవిస్తే ఏ గంట కొట్టాలో చెప్పి వెళ్లారట. రెండురోజులు గడిచాక రాజుగారికి రెండుగంటల శబ్దాలూ వినిపించాయి. ఇహనేముంది రాజుగారి ఆనందానికి అంతులేదు. ఆగమేఘాల మీద అంతఃపురానికి బయల్దేరారు. 
 
aadivaaseelu cheppina kathalu
ఇంతలో ఇక్కడేమయిందీ ,చిన్న రాణికి ఒక ఆడ ఒక మగ కవల పిల్లలు పుట్టారు. అదిచూసి మిగిలిన ఆరుగురు రాణులకు కడుపు కాలిపోయింది. ఈ బిడ్డల్ని చూసుకుని రాజు ఈ చిన్న రాణినిక నెత్తికెత్తుకుంటాడు, మనల్ని పట్టించుకునే నాధుడే ఉండడు అని చెప్పి బిడ్డల్ని ప్రసవించి సొమ్మసిల్లి ఉన్న చిన్నరాణి దగ్గరనుండి పిల్లల్ని తీసుకెళ్ళి కుమ్మరింట్లో వదిలార్ట. రాజుగారు వచ్చేసరికి చిన్నరాణి పక్కన రెండు కొత్త చీపురకట్టల్ని పెట్టి, చిన్నరాణి బిడ్డల్ని కనలేదు, చీపుళ్ళని కన్నది అని చెప్పేశారు. అంతే అది వినగానే రాజుగారు అగ్గిమీద గుగ్గిలమైపోయి చిన్నరాణికి గుండు కొట్టించి రాజ్య బహిష్కారం చేయించేశాడు. చిన్నరాణి ఏడ్చుకుని అడవిలో ఒకపాక వేసుకుని ఆ పనీ ఈ పనీ చేసుకుంటూ బ్రతకడం మొదలుపెట్టిందిట. 
 
అట్లా కొన్నేళ్ళు గడిచిపోయాయి. ఇక్కడ ఆరుగురు రాణులు హాయిగా సంతోషంగా ఉన్నారు, ఒకసారి అందరూ కలిసి చెరువుకు స్నానాలకు వెళ్ళారు. వాళ్ళు జలకాలాడుతూ ఉండగా ఏమయిందీ ఒక పాప, బాబు వాళ్ళు ఆడుకునే చెక్క గుర్రాన్ని తీసుకొచ్చి చెరువులో నీళ్ళు తాగించడం మొదలుపెట్టారు. అది చూసి రాణులు హా….హా….హా…… అని నవ్వి “చెక్క గుర్రమెక్కడైనా నీళ్ళు తాగుతుందా” అన్నారట, అది విని ఆ పిల్లలు ఏ అదృశ్యశక్తో మాట్లాడించగా తమకు తెలీకుండానే “ఒక స్త్రీ చీపురకట్టలకు జన్మనివ్వగాలేంది చెక్కగుర్రం నీళ్ళు తాగదా? ” అన్నారట. ఆ మాటలు వినగానే ఆరుగురు రాణులు నివ్వెరపోయి వీళ్ళు ఖచ్చితంగా చిన్న రాణి పిల్లలే అని కనిపెట్టేశారు. అంతే ఇక ఇంటికెళ్ళి అందరూ తలకు గుడ్డకట్టి తలనెప్పి అని చెప్పి పడుకున్నారు. 
 
రాజుగారు వచ్చారు. వచ్చి చూస్తే ఏమయిందీ , రాణులందరికీ ఒకేసారి తలనొప్పి వచ్చి వుంది , రాజుగారు కారణమేందని అడిగారు. రాణులు , ”చెరువు దగ్గరున్న కుమ్మరివాళ్ళ పిల్లలు మమ్మల్ని నానా మాటలూ అన్నారు, వాళ్ళని నరికి ఆ రక్తం మా తలలకు పూయందే మా తలనొప్పి తగ్గదూ” అని చెప్పేశారు. రాజుగారు అదివిని ఆ విధంగానే భటులకు ఆదేశాలు ఇచ్చేశాడు. భటులు పిల్లల్ని నరికేసి రక్తం తెచ్చేశారు, రాణుల తలనొప్పి తగ్గిపోయింది. కానీ ఆ చచ్చిపోయిన పిల్లలిద్దరూ అదే చెరువులో తామరలై వెలిశారు, అందమైన రెండు తామరపూలు. 
 
అప్పుడేమయిందీ … ఒకసారి ఆరుగురు రాణులూ మళ్ళీ చెరువుకు వెళ్ళారు. రాణుల్ని చూడగానే తామరలు తమలో తాము “అమ్మో అరుగో ఆరుగురు రాణులు, మనల్ని చంపించిన రక్కసులు ” అనుకోవడం మొదలు పెట్టాయట. అదివిని రాణులు భయపడిపోయి ఆ తామరలని తెంపి పోగులుపెట్టాలని చూశారట, ఎంత చేసినా తామరలు వాళ్లకి దొరకలేదు, ఇహ అంతే అంతఃపురానికి వెళ్లి ఇంతకముందు లాగే తలనొప్పి అని కూర్చున్నారట. 
 
రాజుగారు రాణుల తలనొప్పికి కారణం తెలుసుకుని యధావిధిగా ఆ తామర పూలని తెంపుకుని రమ్మని భటులను ఆజ్ఞాపించాడట. భటులు వెళ్ళారు . పూలని తెంపబోతే పూలు దూరం దూరం జరిగి “ఏ దాదా కెవురా ఏ బహిన్ కెత్కి / బాబాకా సిపాహి కెతైక్ ఫూల్ మాంగే” (ఈ అన్న పేరు కెవురా ఈ చెల్లి పేరు కెత్కి/ తండ్రి గారి సైనికులు ఈ పూలు కావాలంటున్నారు) అని పాడటం మొదలుపెట్టాయి. వచ్చిన సైనికులు విఫలం చెంది విషయాన్ని రాజుకు చెప్పారు, రాజు ఇంకొంతమంది సైనికులను పంపాడు, వాళ్ళూ విఫలమయ్యారు అలా ఎవరెవరో వెళ్లి అందరూ విఫలమవగా చివరికి మంత్రి “రాజా! చిన్నరాణిని పంపించి చూడండి” అని సలహా ఇచ్చాడు. అప్పుడు రాజు చిన్న రాణికి కబురు పంపగా ఆవిడ “నాకు బంగారుపల్లకి పంపితేనే వస్తాను” అని కబురు చేసిందట రాజు సరే అని చెప్పి చిన్న రానికి బంగారు పల్లకి  పంపాడు. 
 
బంగారు పల్లకి  ఎక్కి చిన్నరాణి చెరువు దగ్గరికి చేరుకునేసరికి ,రాజుకూడా అక్కడికి చేరుకున్నాడు. చెరువు దగ్గర నిలబడి చిన్న రాణి చేతులు చాచగానే తామరలు రెండు వాటంతట అవే చిన్నరాణి చేతుల్లోకి చేరి బిడ్డలుగా మారిపోయాయట, అది చూసి రాజు ఆశ్చర్యపడి జరిగిందంతా తెలుసుకుని, ఆరుగురు రాణులకూ బుర్రగీయించి ,సున్నం బొట్లు పెట్టించి ,గాడిదల మీద ఎక్కించి ఊరంతా ఊరేగించి రాజ్య బహిష్కారం చేయించి చిన్న రాణినీ, పిల్లల్నీ పువ్వుల్లో పెట్టి చూసుకోవడం మొదలుపెట్టాడుట . 
కథనం: సామాన్య
Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)