“మాలతమ్మా.. మళ్ళీ ఎప్పుడు కలిసేదీ…?”

malathichandur (2)

bhuvanachandra“అర్ధాంతరంగా మృత్యువొచ్చి” ఆ మహానుభావుడ్ని తీసికెళ్లిపోయింది…!” అన్నారు ఒకరు.. మా విశ్వనాధ ఆశ్రమంలో..

నా వయసప్పుడు 8 సంవత్సరాలు .

“అలాగా! ఎక్కడ్నించి వచ్చింది? ఏ బస్సులో వచ్చింది.. ఎవరితో వచ్చింది?” నవ్వుతూ అడిగారు మా స్వామిజీ బోధానందపురి మహరాజ్.

“అదేంటి స్వామి అలా అంటారూ? మృత్యువంటే చావు కదా…”  చిన్నబుచ్చుకున్నాడాయన.

“అదేనయ్యా అంటున్నది. ఆ చావు ఎక్కడ్నించి వచ్చిందని . తెలుసా? తెలీదు కదూ! చావు ఎక్కడి నించీ రాదు. మనిషి పుట్టిన క్షణమే చావు పుట్టింది. మనిషితో పాటే పెరుగుతుంది. మనిషిలో ‘శక్తి’ సన్నగిల్లాక ఆ మృత్యువు అ మనిషిని తనలో ‘కలిపేసుకుంటుంది..’  ఓ విధంగా చెబితే మృత్యువు అలసిన శరీరానికి ‘ముక్తినిస్తుంది..’ అనగా బాధ్యతలనించి ‘విముక్తి కల్పిస్తుంది’ అన్నారు స్వామీజీ.

ఈ మాటలు ఇన్నేళ్లుగా ఆల్‌మోస్టు ప్రతీరోజూ జ్ఞాపకం వస్తూనే వున్నాయి. ఆ మాటల్ని మరిన్నిసార్లు గుర్తు తెచ్చుకుంటాను – ‘మాలతీ చందూర్’ లాంటి మనసున్న మనుషులు పరమపదించినప్పుడు.

ఒకరు ముందూ, ఒకరు వెనుకా .. తేడా అంతే… అందరం యీ అత్తింటిని వదిలి ‘ఆ’ పుట్టింటికి చేరాల్సిన వాళ్లమే. (లాగా చున్‌రీ మే దాగ్. చుపావూఁ కైసే  పాట గుర్తుందా?)

మృత్యువు ‘ఆడు’కోని జీవి యీ సృష్టిలో ఉంటుందా? అసలు పుడుతుందా? సరే.. ఆ వి షయం పక్కన పెడితే…. “భువనచంద్రగారూ.. మనం ‘పెద్దపీట’లవాళ్ళం. ఇదీ.. నేనెప్పుడు కలిసినా మాలతీ చందూర్ గారు ఆప్యాయంగా నాతో అనే మాట.

ఏలూరు, నూజివీడు ప్రాంతాల వాళ్ళని అప్పటివాళ్ళు ‘పెద్దపీట’లాళ్లు అనేవారు. కారణం భోజనానికి కూర్చునే పీటలు చాలా పెద్దవి చేయించి వాడటమే గాక, ‘అతిథి మర్యాదల్ని’ అద్భుతంగా పాటించేవారు కూడా. మా ఇద్దరి సంభాషణల్లో చోటు చేసుకునే మరో అంశం ‘ఏలూరు’. మా చింతలపూడి ఏలూరికి ముప్పై మైళ్లేగా.. ఇంకా నూజివీడు  చిన్న రసాలతో పెట్టిన ఆవకాయ, మా వూరి దగ్గరున్న ప్రగడవరం పండుమిర్చి, మరియు ఘనత వహించిన ఏలూరి దోమలు.

నాకు వంటావార్పూ రాకపోయినా, నా నాలిక మాత్రం రుచి మరిగిన నాలిక. దాంతో రకరకాల కూరలూ, పచ్చళ్ళూ తయారీ విధానం, ఇంకా మా వేపు మాత్రమే చేసుకునే వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి మెంతిపోపూ మాత్రమే గాక నేతిబీరకాయ పచ్చడి ఘుమఘుమా ఇవన్నీ ఏ సభలోనో, సమావేశంలోనో మేము కలుసుకున్నప్పుడు దొర్లే విషయాలు.

చందూర్‌గారికి ‘తిండి’ యావ పెద్దగా లేదు గనక హాయిగా నవ్వుతూ మా కబుర్లు వినేవారు. ఒకసారి నేను ‘నల్లేరు’ పచ్చడి గురించి చెబితె మాత్రం ఆయన చాలా ఇంట్రెస్టింగ్‌గా విన్నారు. నల్లేరు పచ్చడి గురించి ఆయన అంతకు ముందు వినలేదట.

ఆంధ్రాక్లబ్ (ఆస్కా)లో ఎప్పుడు సభలు జరిగినా ఘంటసాల రత్నకుమార్‌గారు స్వచ్చమైన, అచ్చమైన ఆంధ్రా టిఫిన్లు చేయిస్తారు. ఉల్లిపాయలు దట్టించి, నిమ్మకాయలు పిండిన ఘాటుతోటి పచ్చిమిరపకాయ బజ్జీలు, లేత ‘బంగారు’ రంగులో నుంచి ‘ముదురు’ రంగులోకి అందంగా దిగిన ‘ఆలూ బోండాలు’, ‘స్వర్గం చూడాలా? రా .. నన్ను తిను” అని నోరూరించే చల్ల పునుకులూ, ఎర్రగా వర్రగా ‘మింగెయ్ నన్ను’ అన్నట్లు చూసే అల్లం చెట్నీలు.. వీటన్నింటితోటి ఒకింత చిలిపిదనంతో అందరినీ అలరించే మాలతీ చందూర్‌గారి మధురమైన మాటలూ .. యీ చెన్నై మహానగరంలో నివశించే ఏ తెలుగువాడు మరిచిపోగలడు?

మాలతిగారు  ‘లేని’ సభని ఊహించలేం.  ‘వీడు గొప్పవాడు’, సామాన్యుడు అని చూడకుండా, అందరితోటి హాయిగా కలిసిపోయి, ఆప్యాయతానురాగాల్ని పంచే మాలతిగారు మనని విడిచి ఎక్కడికి పోతారు? శరీరానికేముందీ….. అదెప్పుడైనా మనని విడిలిపోయేదే. కానీ ఆత్మ? పోనీ మనసూ? అంతెందుకూ. ఆవిడ మంచి మాట? మనని విడిచిపోగలదా?

మాలతిగారి గురించి అనుకోగానే మనకి గుర్తొచ్చేది  ప్రమదావనం పాత కెరటాలు. ఇంకా వంటలూ – వార్పులూ. మూడువందలకి పైగా ఆమె చేసిన అనువాద రచనలూ, 25 పైగా చేసిన స్వీయ రచనలు. మాకు అంటే చెన్నైవాళ్లకు వీటన్నిటికన్నా మించి గుర్తొచ్చేవి ఆవిడ నిష్కల్మషమైన నవ్వులూ, ఎవరినీ నొప్పించని ఆమె కామెంట్లూ, సరదాగా, హాయిగా గంగా ప్రవాహంలాగా  ఆవిడ గళం ద్వారా ప్రవహించే  ప్రసంగాలు.

“ఆరోగ్యం ఎలా ఉందమ్మా?” అని అడిగితే పకపకా నవ్వి “ఇదిగో.. ఇలా ఉందయ్యా!” అనేవారు. ఇంకేం!

కష్టాలు ‘చెప్పుకోవడం’, ఇతర్లని విమర్శించడం, తప్పొప్పుల్ని, లోటుపాట్లని ‘వెదకడం’ ఆవిడకి తెలీని విషయాలు.

ఓ మంచి పుస్తకం గురించి మాట్లాడండి.. అంత మంచి ‘శ్రోత’ ప్రపంచంలో దొరకదు.

ఓ సారి మీసాలు బాగా ‘ట్రిమ్’ చేశాను. “ఇదిగో భువనచంద్రా.. నేను లావైనా, నువ్వు మీసాలు తగ్గించినా చూడ్డానికి బాగోదయ్యా! అన్నారు. ఆ తర్వాత ఏనాడూ నేను ‘ట్రిమ్’ చేయ్యలేదు.

చాలా చాలా ఏళ్ళ క్రితం, అంటే ఓ అయిదు దశాబ్దాల  వెనక్కి వెళితే, మాలతీ చందూర్‌గారి ‘ప్రమదావనం’, తెన్నేటి హేమలతగారి ‘ఊహాగానం’, రామలక్ష్మి ఆరుద్రగారి ‘కాలక్షేపం (అంతరంగాలు) పాఠకుల్ని ఉర్రూతలూగించేవి. ముగ్గుర్లో ఎవరు గొప్ప అని కూడా ‘మేం’ వాదించుకునేవాళ్ళం. నా అదృష్టం ఏమోగానీ ఆ మహానుభావురాళ్లు ముగ్గురూ నేను పెద్దయ్యాక పరిచయం కావటం, వారి పాదాలనంటి ఆశీస్సులు నేను పొందటం జరిగింది.

ఇప్పుడే అంటే ఓ పది నిముషాలకి ముందు బలభద్రపాత్రుని రమణిగారితో మాట్లాడుతూ, “రమణిగారూ నలభై ఏళ్ళ క్రితం మాలతీ చందూర్‌గారు వ్రాసిన ‘రెక్కలు – చుక్కలు’ అనే నవల సినిమాకి అద్భుతంగా పనికి వస్తుంది. చక్కని లేడీ ఓరియెంటెడ్ ‘సబ్జెక్ట్’ అన్నాను. ఎందుకంటే యీనాటి సమాజంలో ఆవిడ ‘చూసి, చూపించిన’ పరిస్థితులే ఉన్నాయి.

స్వాతి పత్రికలో ‘పాతకెరటాలు’ ఎన్ని లక్షలమంది పాఠకుల్ని ‘విశ్వ’ పాఠకులుగా మారిచిందో నాకు తెలుసు. స్వాతి ‘మాస’ పత్రిక రాగానే మొదట చదివేది, ఆ శీర్షికకు సంబంధించిన నవలే. అలాగే ‘నన్ను అడగండి’..

ఏమి చెప్పినా, వ్రాసినా, తనదంటూ ఓ విలక్షణ శైలి. తన ‘సాహిత్య సంపద’ని అందరితో పంచుకోవాలనే తపన… ఎవరు ఏది వ్రాసి చూపించినా చెప్పినా, “భలే ఉంది” అంటూ ప్రోత్సహించడం మాలతిగారి జీవలక్షణం. నవ్యలో నేను వ్రాసిన ‘ ‘ఆ ఊరేది’ కథ చదివి, “చివర్లో ఏడిపించావోయ్. నీ సమయాన్నంతా ‘కథ’లకే కేటాయిస్తే ఎంత బాగుంటుందో?” అన్నారు. ఆ స్ఫూర్తితో నేను చాలా కథలు రాసే ‘ధైర్యం’ సమకూర్చుకున్నాను అనటం అతిశయోక్తి కాదు.

ఏ ‘కథ’ చదివినా బాగుంటే ఆవిడతో చెప్పేవాడ్ని. “అదా.. అద్భుతం” అనేవారు. అంటే ఆల్‌రెడీ ఆమె చదివేశారన్నమాట. ” ఓ రోజు మీ ఇంటికొచ్చి నీ లైబ్రరీ చూడాలి..!” అన్నారు. ఆవిడ అన్న ఆ మాట మాత్రం ఇక నా జీవితాంతం ఓ తీరని కలలాగే మిగిలిపోతుంది.

“వివరించడం” అనేది మాలతిగారికి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే ఏలూరులో ఆవిడ ఉపాధ్యాయురాలిగా పని చేశారు. ఆవిడ సెన్సార్ సెంట్రల్ బోర్డు మెంబరుగానూ పని చేశారు. ‘రవ్వలదిద్దులు’ కథ (మొదటిది)ని మా అమ్మగారు గట్టిగా చదువుతుండగా నా చిన్నతనంలో నేను విన్నానని గర్వంగా ఇప్పుడు చెప్పుకోగలను. ఆలోచించు, హృదయనేత్రి, భూమిపుత్రి, శతాబ్ది సూరీడు,  ఇలా 25కి మించి నవలలు రాశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య ఎకాడమీ అవార్డు, భారత భాషా పరిషత్ అవార్డు ఇలా ఎన్నో అవార్డుల్ని అందుకున్నారు.

ఒక్క విషయం విన్నవించుకుంటాను. న్యాయంగా యీ నాలుగు మాటలూ మాలతీ చందూర్‌గారి మృతి సందర్భంగా వ్రాయాల్సినవి . కానీ నా మనసులో ఆ ఆలోచన లేదు. 84 సంవత్సరాలపాటు సంపూర్ణంగా, సంతృప్తిగా జీవించి సాహితీలోకానికి అమూల్య సేవ చేసి, విజ్ఞానపు వెలుగుల్ని లక్షలాది మందికి నెలనెలా పంచుతూ, ఎందరికో ప్రశ్నోత్తరాల ద్వారా బతుకుని దిద్ది బతుకుబాటని చూపిన మాలతీచందూర్‌గారికి మరణం లేదు. ఆఖరికి తన భౌతిక శరీరాన్ని కూడా, ‘వైద్య పరిశోధన’ల నిమిత్తం రాంచంద్ర కళాశాలకు వప్పచెప్పమన్నారంటే, ఆమె వ్యక్తిత్వం ఎంత గొప్పదో  మనం ఊహించుకోవచ్చు.

“లోకాన్నించి  ఏవీ తీసికెళ్లలేం..” ఇది నిజం. కానీ “లోకానికి ఎంతో ఇవ్వొచ్చు…!” ఇది మాలతీ చందూర్‌గారు ప్రాక్టికల్‌గా రుజువు చేసిన నిజం.

అందుకే మాలతమ్మా.. కన్నీళ్లు కార్చి మీకు వీడ్కోలు పలకాలని లేదు. గుండెనిండా ప్రేమతో మిమ్మల్ని తలుచు కుంటాం. ప్రతీ పాత కెరటాన్ని, మా హృదయ సముద్రంలో మరోసారి కదలాడమని వేడుకుంటాం. కలకాలం హృదయాల్లో జీవించే మీకు ‘కన్నీ’టి వీడ్కోళ్లెందుకు?

మీరు వ్రాసిన పుస్తకాల్ని మళ్లీ మళ్లీ చదవాలి. మీ నవ్వుల్ని మాటల్నీ, మళ్లీ మళ్లీ తలుచుకుని రాబోయే తరానికి మీగురించి చెప్పాల్సిన బాధ్యత మాకు ఎలానూ ఉంది కదా!

ఎటొచ్చీ ఒకటే బాధ. ఇకనించీ ఏ సభకి వెళ్లినా, ఏ సమావేశానికి వెళ్లినా ఖాళీగా ఉండే ముందు వుండే మీ కుర్చీ మా గుండెల్ని పిండెయ్యదూ.. మీ జ్ఞాపకాల్లో మమ్మల్ని ముంచెయ్యదూ.

అవునూ.. ఇన్ని వేల పేజీలు వ్రాశారు కదా. మీ జ్ఞాపకాలతో గుండెల్లోంచి పొంగి, ‘కళ్ళల్లోంచి కారే కన్నీళ్ల’ని ఎలా ఆపుకోవాలో మాత్రం ఎందుకు వ్రాయలేదు? అలా రాసి గనక వుంటే ఇవ్వాళ ఇన్ని వందల కళ్లు…. ఎందుకులేమ్మా…. పుట్టింటికేగా వెళ్ళావూ…! మేమూ కలుస్తాంలే.. ఏనాడో ఓనాడు… అన్నట్టు.. మరో మంచి ‘వంట’ కనిపెట్టరూ. మేం వచ్చాక టేస్టు చెయ్యడానికి… పోనీ మాకోసం మళ్లీ యీ  లోకంలోనే పుట్టకూడదూ..

 

నమస్సులతో

భువనచంద్ర..

 

(వంటల గురించి వ్రాసింది ఎందుకంటే మాలతిగారిని తలుచుకుంటూ మంచి భోజనాన్నో, టిఫిన్నో ఇష్టమైన వారికి వడ్డిస్తారని ..)

Download PDF

10 Comments

 • యాజి says:

  చాలా బాగుంది మీ నివాళి. “లాగా చున్‌రీ మే దాగ్. చుపావూఁ కైసే పాట గుర్తుందా?” – సాహిర్ పాట. మరచిపోగలమా?

 • buchi reddy gangula says:

  నివాళి చాల బాగుంది సర్
  చాల చక్కగా వివరించారు
  —————————————-
  బూచి రెడ్డి గంగుల

 • sarada says:

  ఆ మద్రాస్ సభలు , మాలతి చందూర్ గారి కామెంట్స్ ,ఆవిడ వేసే సున్నితమైన జోక్స్ ఎలా మర్చిపోగలం?మీరు అన్నట్లు మాలతి గారు పుట్టినిన్తెకే కదా వెళ్లారు. మనమూ ఈ సారి ఆవిడని చందూర్ గారి తో పాటు కలుసుకోవచు. మైలాపూరు లో ఒక సారి, బాపు గారి ఇంట్లో ఒక సారి ఆవిడని కలవటం తటస్తించింది. నడిచే vignaana సర్వస్వం ఆమె. ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో తన ప్రవర్తన తో చెప్పకనే చెబుతారు. మీ నివాళి చాలా బాగుంది. ధన్యవాదాలు సర్. మీ నివాలితో మళ్ళీ ఒక సారి మద్రాస్ తీసుకు వెళ్లారు మానసికంగా.

 • BHUVANACHANDRA says:

  ధన్యవాదాలు అమ్మా …..నిజంగా మాలతి గారు నిగర్వి …అందరి మనిషి …..కాలపు ఎడారిలో సేద తీర్చే సెలయేరు ….మనసునిండా జ్ఞాపకాలే ………

 • “ఖాళీగా ఉండే ముందు వుండే మీ కుర్చీ” మాత్రమే కాదు, భువనచంద్ర గారు, మద్రాసే బోసి పోయింది!

 • ఉషారాణి says:

  మాలతీ చందూర్ గారి ప్రమదావనం,అడగండి చెపుతా,వంటా-వార్పూ ..ఆంధ్రప్రభ లో చదువుతూ పెరిగాను.మా అమ్మగారు వారికి వీరాభిమాని ..అమ్మకంటె కూడా (ఇప్పుడు బ్రతికి వున్నా అమ్మవయసు 72 సం. ఉండేవి ) పెద్దవారు..అమ్మ ప్రమదావనం,పేజీలన్నీ రెండు పెద్ద బుక్స్ గా బైండింగ్ చేయించి నాకు ఇచ్చింది . ఆవిడ నిజంగా ‘విజ్ఞానఖని ‘..వాకింగ్ ‘ఎన్సైక్లోపెడియా ‘అంటే అతిశయోక్తికాదు..మీరు వారితో మీ అనుభందాన్ని హృద్యంగా వర్ణించారు..మాకు తెలియని ‘మాలతి’గారి ని మీరు చూపించారు ..మీ నివాళి మనసుని కదిలించింది..నిజమే..వారిని ..వారి రచనలలోనూ ..పుస్తకాలలోనూ..మీ వంటి వారి మాటల్లోనూ చూడగలం..మీరు పాటల రచయిత గానే తెలుసు …ఇన్నిరోజులూ..ఇప్పుడు మీలోని రచయిత,స్నేహితుడు..హితుడు,ప్రకృతి ఆరాధకుడూ ..ఇలా అన్ని కోణాలూ చూడగలుగుతున్నా..ధన్యవాదాలు సర్..
  ___/\___

  • bhuvanachandra says:

   చాలా థాంక్స్ అమ్మా …..నిన్ననే మాలతిగారి గురించి ఓ రెండు గంటలు ఫ్రెండ్స్ అందరం కూర్చుని మాట్లాడుకున్నాం ..””.పాతకెరటాలు”’కనిపించక మనోసముద్రం ఘనీభవించింది …తిరిగిరానిలోకాలకి తరలిపోయారు …..ఏమైనా …మీకు మరోసారి ధన్యవాదాలు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)