శ్రాద్ధమూ, దాని ఎకనమిక్సూ !

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)వైశంపాయనుడు జనమేజయునితో ఇలా అన్నాడు: బంధుమిత్ర జనాలు అందరికీ పాండవులు ఉదకకర్మ నిర్వర్తించాక మైలదినాలను గంగాతీరంలో గడపడానికి, అక్కడ ఎత్తుపల్లాలు లేని చోట కుటీరాలు నిర్మింపజేశారు. ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైన పెద్దలతో; యుద్ధంలో మృతులైన భరతవీరుల భార్యలతో సహా నెలరోజులు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో వ్యాసుడు, నారదుడు మొదలైన మునులందరూ శిష్యులను వెంటబెట్టుకుని ధర్మరాజును చూడడానికి వచ్చారు…

                                                                                  (శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, ప్రథమాశ్వాసం)

మహాభారతంలోని అనేక ఘట్టాలు, విశేషాలు ప్రచారంలో లేవు. ఎన్నో ఆసక్తికర విషయాలు మరుగున పడిపోయాయి. వాటిలో శ్రాద్ధకర్మ గురించిన ముచ్చట్లు ఒకటి. ‘పాండవుల ఆదాయం కౌరవుల తద్దినానికి ఖర్చైపోయిం’ దనే నానుడి ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది.  కథలోకి వెడితే, ఇది సహజోక్తే తప్ప ఏమాత్రం అతిశయోక్తి కాదని అనిపిస్తుంది.

యుద్ధపర్వాల తర్వాత శాంతిపర్వం  పైన పేర్కొన్న వైశంపాయనుని కథనంతో ప్రారంభమవుతుంది. అది ఒకవిధంగా మృతవీరుల ‘ఆత్మశాంతి’పర్వం కూడా.  భరతవంశీకులు మైల పాటించిన ఆ నెలరోజులూ గంగాతీరం లోని ఆ ప్రాంతం ఒక మినీ హస్తినాపురం అయిపోయిందని పై వివరాలను బట్టి అర్థమవుతుంది. పాండవులు, ధృతరాష్ట్రాది పెద్దలూ, మృతవీరుల కుటుంబాలూ  ఉండడానికి ఎన్ని కుటీరాలు నిర్మింపజేసి ఉంటారో, అందుకు ఎంత శ్రామికశక్తిని వినియోగించి ఉంటారో, వంటలూ-వార్పులూ, ఇతర సేవలూ అందించడానికి ఏ సంఖ్యలో సిబ్బందిని నియమించి ఉంటారో ఊహించుకోవచ్చు. దీనికితోడు, పరామర్శకు  శిష్య, పరివార సమేతంగా వచ్చే మునులు, ఇతర రాజబంధువుల వసతికీ, భోజన, సత్కారాలకూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగే ఉంటాయి. ఇక చనిపోయిన వీరులకు వారి వారి స్థాయిని బట్టి నిర్వహించే పరలోక క్రియలలో సువర్ణదానం, గోదానం, భూదానం వగైరాలు విధిగా ఉండి తీరతాయి. ఇలా లెక్కిస్తే కురుపాండవవీరులు, బంధుమిత్రుల అంత్యక్రియలకు పాండవులు వెచ్చించిన సంపద అనూహ్య ప్రమాణంలో ఉండడంలో ఆశ్చర్యం లేదు.

09balikakka_large

ఇదిగాక ధర్మరాజుకు ఇంకో నైతిక బాధ్యత కూడా ఉంది.  కౌరవుల అంత్యక్రియలకు తను లోటు చేశాడనే భావన  పెదతండ్రి ధృతరాష్ట్రునికీ, పెత్తల్లి గాంధారికే కాక; ఇతరులకూ కలగకుండా చూసుకోవాలి.  శ్రాద్ధ దినాలలో ధృతరాష్ట్రుడు భారీగా గోవులను, బంగారాన్ని దానం చేసి తన నూరుగురు కొడుకులకూ ఘనంగా పరలోక క్రియలు నిర్వహించే ఏర్పాటు ధర్మరాజు చేశాడని మహాభారతం చెబుతోంది. పైగా ధర్మరాజు రాజ్యాధికారాన్ని చేపట్టే సమయానికి ఖజానా ఖాళీ అయిపోయింది.  అశ్వమేధయాగం చేయమని ధర్మరాజుకు వ్యాసుడు సూచించినప్పుడు; నా మీద ఈర్ష్యతో దుర్యోధనుడు అనేకమంది రాజులను, సేనలను కూడగట్టుకునే ప్రయత్నంలో భూమినీ, ఖజానాను ఖర్చుపెట్టేశాడనీ, ఇప్పుడు ధనం లేదనీ ధర్మరాజు అంటాడు. అదలా ఉంచి,  ధర్మరాజు పాలనలో కొన్నేళ్ళు గడచిన తర్వాత,  ధృతరాష్ట్రుడు వానప్రస్థానికి  వెళ్లాలని నిర్ణయించుకుంటాడు.  ధర్మరాజును పిలిచి ఆ సంగతి చెబుతూ; ఇప్పటికే నా కుమారులకు అనేకసార్లు శ్రాద్ధం పెట్టావు కనుక, వారి కోసం ఇంకేమీ చేయవద్దని అంటాడు. ధృతరాష్ట్రుడంతటి వాడు అలా మొహమాట పడడానికి కారణం, శ్రాద్ధకర్మలు కోశాగారాన్ని చాలావరకూ హరించివేయడమే.  అయితే, శ్రాద్ధకర్మ విశ్వాసానికే కాక, వైభవానికీ కొండగుర్తుగా మారిన ఆ రోజుల్లో తను వానప్రస్థానికి  వెళ్లబోయేముందు చివరిసారి కొడుకులకు వైభవోపేతంగా శ్రాద్ధం నిర్వహించాలనే కోర్కెను ధృతరాష్ట్రుడు  అణచుకోలేకపోయాడు. ధర్మరాజు ముందు నేరుగా దానిని బయటపెట్టడానికి మొహమాటపడి విదురునితో చెప్పించాడు. విశేషమేమిటంటే, భీముడు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించగా అర్జునుడు అతణ్ణి మందలించి తన వాటాలోంచి ఆ ఖర్చు భరించడానికి ముందుకు వచ్చాడు. అప్పుడు ధర్మరాజు అర్జునుని మనసులోనే మెచ్చుకున్నాడని మహాభారతం చెబుతోంది.

మహాభారతంలోని ఈ ‘శ్రాద్ధనామిక్స్’ కోణాన్ని ఎవరైనా చర్చించారో లేదో నాకు తెలియదు. అయితే, ప్రపంచమంతటా ఉన్న ఈ అంత్యక్రియల ఆచారం(cult of dead) మిగులు సంపదనే కాక, తెగలకు తెగలనే అంతరింపజేసిందని కోశాంబి అంటాడు. ఉదాహరణకు, మృతసముద్రం సమీపంలోని జోర్డాన్ నదీలోయలో క్రీ.పూ. 3800-3350 మధ్యకాలంలో నివసించిన ఘాసూలియన్లు.  వీరు మృతులను పూడ్చిపెట్టిన చోట రాకాసి గుళ్ళు నిర్మించేవారు. మతపరమైన  సంక్లిష్ట అలంకరణలకు వీరు ప్రసిద్ధులు. బ్రిటన్, ఐబీరియా(స్పెయిన్, పోర్చుగల్, అండోరాలను ఐబీరియా దేశాలంటారు), దక్షిణ భారతదేశాలలో ఇంతకంటే భారీగా రాకాసిగుళ్ళ నిర్మాణం జరిగింది. ‘సామాజిక ప్రగతికి ఏమాత్రం దోహదపడని ఈ పితృకర్మలకు ఉన్న కొద్దిపాటి మిగులునూ ఖర్చు పెట్టేశా’రని కోశాంబి అంటాడు.  ఇటలీకి దక్షిణంగా, లిబియాకు ఉత్తరంగా మధ్యధరా సముద్ర మధ్యంలో మాల్టా దీవులున్నాయి. రాతి యుగం అంతానికి మాల్టా ఒక పవిత్రద్వీపంగా పేరుతెచ్చుకుంది.  ఆ దీవులనుంచి అప్పట్లో భారీ ఎత్తున వ్యాపారం జరుగుతూ ఉండేది. 1930లలో అక్కడ జరిగిన తవ్వకాలలో ప్రతిచోటా అలంకృత అస్థికలశాలు బయటపడ్డాయి. అంటే, వ్యాపారం తాలూకు మిగులునంతటినీ అంత్యక్రియల సంస్కృతి  హరించివేసిందన్నమాట. ఇదే ప్రక్రియను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన మెసపొటేమియా, సింధు నాగరికతలు ఇలాగే అభివృద్ధికి దూరంగా స్తంభించిపోయాయి. ఆహారోత్పాదనకు అవసరమైన మెరుగైన సాధనాలు, పద్ధతులు తమకు అందుబాటులో ఉన్నాసరే,  సింధు నగరాల నిర్మాతలు వాటిని వాడుకోలేకపోయారు. ఇక ఈజిప్టు తన వద్ద ఉన్న భారీ మిగులునంతటినీ, గడియారాలను తయారుచేసేవారు చూపించేటంత సునిశితదృష్టితో(with watch-maker’s accuracy) బ్రహ్మాండమైన పిరమిడ్లను నిర్మించడానికి ఖర్చు పెట్టేసింది. క్రమంగా అంత్యక్రియల సంస్కృతీ, పురోహిత వర్గం దేశం మొత్తాన్ని తినేశాయి.

sraddham

పురా కాలం నుంచి మన కాలంలోకి వద్దాం. ఇంగ్లీష్ లో పేట్రియార్క్(patriarch), పేట్రియార్కీ(patriarchy) అనే మాటలు ఉన్నాయి. పేట్రియార్కీ ని పితృస్వామ్యంగా అనువదించి మనం వాడుకుంటున్నా, పేట్రియార్క్ అనే మాట మన దగ్గర పెద్దగా వినియోగంలో లేదు. అయితే, (ఉమ్మడి)కుటుంబ యజమానిని సూచించే ఆ మాట ఇప్పటికీ ఇంగ్లీష్ లో తరచు వినిపిస్తూనే ఉంటుంది. ఈ మాటకు సమానార్థకం మన పురాణ,ఇతిహాసాలలో కనిపిస్తుంది. అది, ‘ప్రజాపతి’. మన కశ్యపుడు, దక్షుడు మొదలైనవారు; యూదుల అబ్రహాం ప్రజాపతులు. దీని గురించి మరిన్ని వివరాలను వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే…

పేట్రియార్క్ గా చెప్పదగిన ఒక వ్యక్తి మా దగ్గరి బంధువులలో ఒకాయన ఉండేవారు. ఆయనది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. ఆయనకు పదిమంది కొడుకులూ, ముగ్గురు కూతుళ్ళు. వీరు కాక చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అక్క కొడుకులిద్దరిని కూడా ఆయనే పెంచి పెద్దజేశారు. కొడుకులకు ఉద్యోగాలు వచ్చి, పెళ్లిళ్లు అయి, పిల్లలు కలిగి వారికి పెళ్లీడు వచ్చిన తర్వాత కూడా ఆ ఇంట్లో ఉమ్మడి కుటుంబవ్యవస్థే కొనసాగుతూ ఉండేది. కొడుకులు వేరే ఊళ్ళో ఉద్యోగాలు చేస్తున్నాసరే, తండ్రిపట్ల భయభక్తులూ, ఉమ్మడి కుటుంబ సంప్రదాయమూ వారిని నీడలా అంటిపెట్టుకునే ఉండేవి. ఆయన ఇంట్లో తగు మాత్రం పాడి-పంట ఉండేవి. గోసేవ విధిగా జరుగుతూ ఉండేది. కుటుంబ సభ్యులకు అదనంగా వచ్చిపోయే సాధు, సంతులతో; అతిథి అభ్యాగతులతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఆయన ఉదయమే స్నానసంధ్యలూ, పూజాదికాలూ ముగించుకుని చావిడిలో పెద్ద కుర్చీలో గంభీరంగా, సింహంలా కూర్చుని నామ జపం చేసుకుంటే ఉండేవారు. అయినా సరే, ఇంటి వ్యవహారాలు ఏవీ ఆయన కనుసన్నలను దాటిపోయేవి కావు.

శ్రాద్ధకర్మ శాస్త్రోక్తంగా జరపడం పట్ల ఆయనకు ఎంత పట్టింపు అంటే, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఆయన గోవును కొని మరీ దానం చేశారు. అంతేకాదు, దానిని ఎట్టి పరిస్థితులలోనూ అమ్మబోనని దానం పుచ్చుకున్న బ్రాహ్మణుని నుంచి హామీ తీసుకునేవారు. అప్పటికీ నమ్మకం కుదరక, గోవు ఉందో లేదో, గోసేవ సక్రమంగా జరుగుతోందో లేదో చూసిరమ్మని కొన్ని రోజులపాటు ఆ బ్రాహ్మణుని ఇంటికి కొడుకుల్ని పంపించి ఆరా తీసేవారు.

అలా ఉండగా, ఆయన అర్థాంగి కాలం చేశారు. ఆరుగురు కొడుకులు ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉన్నారు. మాసికాలు ఉమ్మడిగా, అందులోనూ నరసాపురంలో పెట్టవలసిందే కనుక సంవత్సరం పొడవునా ప్రతి నెలా కొడుకులు, కోడళ్ళు రైల్లో టికెట్లు రిజర్వు చేసుకుని హైదరాబాద్ నుంచి నరసాపురం బయలుదేరి వెళ్ళేవారు. ఇలా ఏడాది గడిచిచింది. తల్లికి సంవత్సరీకాలు జరిగాయి. విచిత్రంగా ఆ మరునాడే పెద్దాయన కాలం చేశారు. దాంతో ఆరుగురు కొడుకులూ-కోడళ్లూ హైదరాబాద్ నుంచి నరసాపురానికి నెల నెలా వెళ్ళే ఆవృత్తి, మధ్యలో ఎక్కడా విరామం లేకుండా, పునఃప్రారంభమైంది. శ్రాద్ధకర్మలకు ఎటూ వ్యయం భారీగానే జరుగుతుంది. దానికి, రెండేళ్లపాటు జరిగిన ఈ శ్రాద్ధయాత్రా వ్యయం ఏ మేరకు తోడయిందో నన్న ప్రశ్న, దీనిని తలచుకున్నప్పుడల్లా నాలో ఆసక్తిని రేపుతూ ఉంటుంది.

నేను ఆర్థికవేత్తను కాదు. ఒకరి వ్యయం ఇంకొకరికి ఉపాధి అవుతుందనే సాధారణ అవగాహనతో చూసినప్పుడు దీనినంతటినీ దుర్వ్యయం అని చటుక్కున తీర్పు చెప్పే సాహసం చేయలేను. అయితే, ఆ వ్యయం వల్ల కలిగే లాభం  అన్ని వర్గాలకూ సమానంగా పంపిణీ కాకుండా, ఏ ఒక్క వర్గం దగ్గరో పోగుబడితేనే సమస్య. మనిషి ఆర్థికజీవి అంటారు. అంతకంటే ఎక్కువగా విశ్వాసజీవి అనీ; మతంలోనూ, క్రతువులోనే మనిషి పురా కాలం నుంచి ఆధునిక కాలం వరకూ తన అస్తిత్వానికి అర్థం వెతుక్కున్నాడనీ నాకున్న పరిమిత చారిత్రిక జ్ఞానంతో స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చాను. వివాదాస్పదమైన ఈ అంశంలోకి ఇప్పుడు లోతుగా వెళ్ళను కానీ; కోశాంబి అన్నట్టు అంత్యక్రియల సంస్కృతి తూకం తప్పి అభివృద్ధిని అడ్డుకుని దేశాలకు దేశాలనే కబళించి వేసే పరిస్థితికి దారితీయిస్తే తప్పక ఆలోచించవలసిందే.

గొప్పింటి పెళ్లిళ్లలో, ముఖ్యంగా రాజకీయనాయకుల ఇళ్ళల్లో జరిగే పెళ్లిళ్లలో ఆడంబర వ్యయం తరచు సంచలనాత్మకంగా వార్తలకు ఎక్కడం చూస్తూ ఉంటాం. ఎందుకో శ్రాద్ధకర్మల వార్తలు ఆ స్థాయిలో వెలుగు చూడడం లేదు. అలాగే శ్రాద్ధానికి చెందిన ఆర్థిక కోణాన్ని కూడా ఎవరూ పరిశీలిస్తున్నట్టు లేదు. ఒకనాటి శ్రాద్ధ కర్మల వైభవప్రదర్శన ఇప్పుడు తగ్గుముఖం పట్టిందా, లేక దీనికి మరో కారణం ఉందా అన్నది తెలియదు. పురా కాలంలో బహుశా పెళ్లి కంటే ఎక్కువగా చావే వైభవోపేతం అనిపిస్తుంది.

–కల్లూరి భాస్కరం

 

Download PDF

25 Comments

 • రెండు ముక్కలు –
  శ్రాద్ధమూ దాని ఎకనామిక్స్ అన్న తరువాత శ్రాద్ధ కర్మలకు అయ్యే ఖర్చును వృధా ఖర్చు అనడం సబబు కాదు. ఈ విషయాన్ని మీరు ఒప్పుకున్నప్పటికీ శీర్షికతో పొసగడంలేదు కాబట్టి మళ్ళీ ప్రస్తావిస్తున్నాను. అందులోనూ శ్రాద్ధకర్మల కారణంగా చేతులు మారిన సంపద ఏ ఒక్క వర్గం వద్దే పోగుపడుతుందనేది కూడా అపోహ మాత్రమే.

  అయితే ధర్మరాజుకి సంభవించినట్లు ఒకప్పటి కాలంలో చాలా మంది మూడు తరాలవారికి కూడా తద్దినాలు, శ్రాద్ధాలు పెట్టేవారు. పెద్ద కుటుంబాలు, యుద్ధాలు/కలరా/ప్రకౄతి వైపరీత్యాలు ఇత్యాది కారణాలవల్ల తద్దినాలు పెట్టాల్సిన వాళ్ళా లిస్టు ఎక్కువగా వుండటం వల్ల కొన్ని కుటుంబాలు తమ ఆస్థి మొత్తాన్ని ఈ కర్మలకే కరిగించేసుకోవడం జరిగి వుండవచ్చు. ఇక పిరమిడ్ల లాగా భారీ ఖర్చుతో నివాళి ప్రకటించే సంస్కృతి వున్న చోట దేశాలకు దేశాలే మునిగిపోయి వుండవచ్చు.
  అయినప్పటికీ ఇప్పుడున్న సమాజానికి ఇది అన్వయించదు. అందుకు మొదటి కారణం – మీరు చెప్పినట్లు వీటి వైభవ ప్రదర్శన ఇప్పుడు లేదు. మారిన కాలంలో చెట్టుకొకరు పుట్టకొకరు అయిన కుటుంబాల వల్ల తద్దినాల తరహా మారిపోయింది. ఏ అనాధాశ్రమానికో, వృద్ధశ్రమానికో వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ రోజుకి భోజనం పెట్టించడం కొత్తగా పుట్టుకొస్తున్న శ్రాద్ధ ప్రక్రియ. ఇదీ ఒకందుకు మంచిదే..

  • కల్లూరి భాస్కరం says:

   స్పందనకు ధన్యవాదాలండీ. వ్యాస శీర్షిక, శ్రాద్ధకర్మలు వృథా వ్యయం అనే అర్థాన్ని ఇస్తోందా?! ఎలాగో నాకు అర్థం కాలేదు. శ్రాద్ధ కర్మల కారణంగా చేతులు మారే సంపద ఒక వర్గం వద్దే పోగుబడుతుందని కూడా నేను అనలేదు. అలా పోగుబడితేనే సమస్య అన్నాను. తటస్థ దృష్టినుంచి నేను ఆ మాట అన్నానే కానీ తీర్పు చెప్పే పని పెట్టుకోలేదు. శ్రాద్ధ వ్యయం ఒక వర్గం దగ్గరే పొగుబడుతోందని నేను నిష్కర్షగా అంటే అది వేరే చర్చకు, అంటే విషయాంతరానికి దారితీస్తుంది. నా కాలమ్ కు నిర్ణయించుకున్న స్వభావానికి అది అతకదు. పురా కాలం నుంచి నేటి కాలం వరకూ మనిషి జీవితంలో విశ్వాసమూ, మతమూ, క్రతువూ ప్రధాన భూమిక వహిస్తున్నాయి కనుక వాటిని వ్యక్తిగత దృష్టినుంచి కాక చారిత్రక దృష్టినుంచి చూడడమే నాకు ఆసక్తికరం.

 • chintalapudivenkateswarlu says:

  అరిపిరాలవారూ!
  మీరు చెప్పినట్లు తద్దినాల తరహా మారిపోయినా ఇంకా కలవారిళ్ళల్లో వృధాఖర్చు జరుగుతూనే ఉంది. అదలా ఉంచి భాస్కరంగారు ఎక్కడా ఆఖర్చు వ్యర్ధం అనలేదుకదా! వారి అభిప్రాయం భారీ వ్యయం జరుగుతుందనే. వారి అభిప్రాయం బాగానే ఉందనిపించింది.

  • కల్లూరి భాస్కరం says:

   స్పందనకు ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారూ…

 • పురా కాలంలో బహుశా పెళ్లి కంటే ఎక్కువగా చావే వైభవోపేతం అన్నారు. అప్పుడే కాదండీ నేడు కూడా . డబ్బు సంపాదన యావలో పడి, మమతానురాగాలు మరచి బతికి ఉన్నంత కాలం చల్లటి చూపుకు , చక్కని మాటకు , కుసింత ప్రేమకు నోచుకోకుండా కన్నవారిని మానసిక వ్యధకి గురిచేసి పిల్లలు, వారు చనిపోయిన తర్వాత ఆడంబరంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించడం జ్ఞాపికలు అందజేయడం జరుగుతూనే ఉంది. అంతే కాదు విదేశాల్లో ఉన్న మన వాళ్ళయితే తాము రాకుండానే అద్దె బంధువులతో ఇక్కడ ఘనంగా ఆ కార్యక్రమం జరిపించేస్తున్నారని అప్పుడప్పుడూ వచ్చే వార్తలు వింటే ఏమనిపిస్తుంది …

  • కల్లూరి భాస్కరం says:

   ధన్యవాదాలు శాంతి ప్రబోధ గారూ…మీ ఆవేదనలో వాస్తవం ఉంది.

 • భాస్కరం గారూ,

  చాలా ఆసక్తి కరమైన వ్యాసం !
  సత్య ప్రసాద్ గారు చెప్పినట్లు అనాధ శరణాయలయాల్లో ఆబ్దికాల సందర్భంగా అన్న దానాలు చెయడం మంచి పనిగా తోస్తుంది నాకు.

  పోయిన వాళ్ళ పట్ల ప్రేమతోనో,. వాళ్ళ్ను గుర్తు చేసుకుందుకో కాక లోకం కోసం, ఆచారం తప్పకుండా ఉండటం కోసం ఆబ్దికాలు పెట్టేకంటే అదే మంచిది. నాలుగు కడుపులు నిండుతాయి

  • కల్లూరి భాస్కరం says:

   ధన్యవాదాలు సుజాత గారూ…మీరన్నట్టు అన్నదానంతో అనాథల కడుపు నింపడం ఎప్పుడూ మంచిదే. అయితే ఆబ్దికం విశ్వాసానికి సంబంధించినది కనుక విశ్వాసాన్ని జయించడం కష్టం.

 • >> “ఇక ఈజిప్టు తన వద్ద ఉన్న భారీ మిగులునంతటినీ, గడియారాలను తయారుచేసేవారు చూపించేటంత సునిశితదృష్టితో(with watch-maker’s accuracy) బ్రహ్మాండమైన పిరమిడ్లను నిర్మించడానికి ఖర్చు పెట్టేసింది”

  This may not be entirely true. Historians say that pyramid construction, much like the infrastructure development projects undertaken by modern governments, was a means to provide employment for hundreds of thousands of Egyptians during the flood season – when they don’t have any other work.

  • కల్లూరి భాస్కరం says:

   ధన్యవాదాలు అనిల్ గారూ…మీరన్నది కూడా నిజమే. అయితే, వేలాది జనాలకు పని చూపించి తిండి పెట్టడం పిరమిడ్ల నిర్మాణంలో అనుబంధ క్రియే తప్ప ప్రధాన క్రియ కాదనీ, విశ్వాసంతో ముడిపడిన పిరమిడ్ల నిర్మాణమే ప్రధానక్రియ అనీ నేను అనుకుంటాను. మీరు ఉటంకించిన నా వాక్యాలు కూడా ఒక చరిత్రకారుడు(కోశాంబి) అన్నవే. మిగులు నంతటినీ సామాజిక అభివృద్ధికి వినియోగించకుండా పితృకర్మలకు ఖర్చుపెట్టేశారన్న కోశాంబి వ్యాఖ్యను కూడా నేను ఉదహరించాను. ఇప్పటి మాటలో చెప్పుకోవాలంటే ఇది అనుత్పాదక వ్యయం. ఆధునిక ప్రభుత్వాలు చేపట్టే infrastructure ప్రాజెక్టులతో పిరమిడ్ నిర్మాణాలను పోల్చలేము. infrastructure ప్రాజెక్టులు ఉద్యోగాలు, ఆస్తుల కల్పనకు, అభివృద్ధికీ సాయపడతాయి. ఇప్పటికీ ప్రభుత్వాలు వివిధ రూపాలలో అనుత్పాదక వ్యయం చేస్తున్నాయనుకోండి, అది వేరే విషయం. కోశాంబి వ్యాఖ్యలోని సారాంశం ఏమిటంటే, (విశ్వాస సంబంధమైన) అనుత్పాదక వ్యయంతో దేశాలకు దేశాలు దివాళా తీసాయనే.

   • Thirupalu says:

    ఇది నిజమేనంటారా భాస్కరం గారు !
    తేరగాదొరికిన భానిస లు కాదాండి పిరమిడ్లు కట్టిందీ?

 • Vasu says:

  భాస్కరం గారు,
  మీకు మహాభారతం మీద చాలా మక్కువ ఉన్నట్లు ఉంది. మహాభారతం లో ఎన్నో కోణాలు ఉన్నాయి,అటువంటి గ్రంధం లో అంశాలను చెప్పేటప్పుడు మార్క్సిస్ట్ ల కోణంలో (కౌశంబి లాంటి వారి భావాలతో) విశ్లేషించటం సరికాదనుకొంటాను. ఈ రెండిటికి పొసగవు. మార్క్సిస్ట్ ల ఆలోచనా విధానం ఏక కోణంలో ఉంట్టుంది. ఆ కోణంలో నుంచి చూస్తే గతం గురించి, పూర్వీకుల గురించి చులకన భావం ఏర్పడటం తప్పించి, ఆ రచన ఇంకే ప్రయోజనం నెరవేర్చదు. అరిపిరాల అభిప్రాయమే నాది కూడాను.

  • కల్లూరి భాస్కరం says:

   ధన్యవాదాలు వాసుగారూ… మహాభారతానికి అనేక కోణాలు ఉన్నాయనే మీ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తాను. కాకపోతే, నాకు తెలిసిన, అర్థమైన కోణం నుంచి వ్యాఖ్యానించడానికి ప్రయత్నిస్తున్నాను. భిన్న కోణాలకు భిన్న పాఠకులు ఉంటారని అంగీకరిస్తే, నా కోణాన్ని స్వీకరించే పాఠకులు నాకూ ఉంటారని నేను అనుకుంటున్నాను. అప్పుడు ‘ప్రయోజనా’న్ని కూడా ఈ భిన్న కోణ సూత్రం నుంచే నిర్ణయించాలి తప్ప ఏక కోణం నుంచి కాదు. కనుక ఆ నిర్ణయ స్వేచ్ఛను పాఠకులకే వదిలేద్దాం.
   రెండో విషయం…మహాభారతంలోని అంశాలలో పురా చరిత్ర ను చూడడం పైనే నాకు ఎక్కువ ఆసక్తి. కోశాంబి లాంటివారు చేసింది కూడా అదే. అలా చూడడాన్ని మార్క్సిస్ట్ కోణంగా మీరు వర్గీకరిస్తూ ఆ కోణంనుంచి విశ్లేషించడం సరికాదని అంటున్నారు. నా ప్రయత్నానికి (మహాభారతంలో పురా చరిత్రను చూడడం) మార్క్సిస్టు కోణం పనికిరాదని మీరు అంటున్నారు కనుక, ప్రత్యామ్నాయ కోణాన్ని సూచిస్తే పరిశీలించడానికి నాకు అభ్యంతరం లేదు. మార్క్సిస్టు కోణం నుంచే చూడాలన్న పట్టింపు నాకేమీ లేదు. అదీగాక, మీరన్న మార్క్సిస్టు కోణం నుంచి చరిత్రను, సాహిత్యాలను, ఇతిహాసాలను విశ్లేషించే రచనలు ప్రపంచవ్యాప్తంగా పుంఖానుపుంఖంగా ఇప్పటికే వచ్చాయి కనుక మీ అభ్యంతరం పై చర్చ చాలానే జరిగి ఉంటుంది. ఇప్పుడు అందులోకి వెళ్లలేం.
   “ఆ కోణం నుంచి (మీరన్న మార్క్సిస్టు కోణం, నేను అన్న పురా చరిత్ర కోణం)చూస్తే గతం గురించి, పూర్వీకుల గురించి చులకన భావం ఏర్పడటం తప్పించి…” అన్నారు. చరిత్ర చెప్పుకోవడం గతాన్నీ, పూర్వీకులను చులకన చేయడం ఎలా అవుతుందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నాలానే చాలామంది మీ అభిప్రాయంతో ఏకీభవించలేరనే అనుకుంటున్నాను. మంచి-చెడులు కలగలపుగా ఉండే చరిత్రను మనం ఒక తటస్థ స్థితినుంచే చెప్పుకుంటాం. కనీసం నా వరకు నేను అదే చేస్తాను. గతాన్ని చెప్పుకోవడమే చులకన చేయడం అనుకుంటే మనకు చరిత్రే ఉండదు.
   చివరగా, అరిపిరాల అభిప్రాయమే నా అభిప్రాయం అన్నారు. ఈ వాక్యం కూడా నాకు అర్థం కాలేదు. అరిపిరాల వారి అభిప్రాయానికి మీ అభిప్రాయానికీ నాకు ఎక్కడా పోలిక కనిపించలేదు.

 • Vasu says:

  భాస్కరం గారు,

  మన తెలుగు వారి పైన మార్క్సిస్ట్ రచయిత, చరిత్రకారుల ల ప్రభావం చాలా ఉంది. బ్లాగులు చదువుతుంటే ఆ ప్రభావం ఇంకా కొనసాగుతూండటమే కాక, సుమారు మూడు,నాలుగు దశాబ్దాల క్రితం సమాజంలోని పరిస్థితులను ఇంకా వాళ్ల రచనలలో కనిపిస్తుంటుంది. కౌశంబి లాంటి చరిత్రకారుల తదనంతరం ఎన్నో విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. మచ్చుకి ప్రముఖ గాంధేయవాది ధర్మపాల్ గారు కొన్ని సంవత్సరాలు లండన్ లో నివసిస్తూ, బ్రిటిష్ రికార్డ్ లన్నిటిని (ఈ స్టిండియా కంపేని రికార్డ్ లనుపరిశీలించి) మనకు అందుబాటులో లేని ఎన్నోవిషయాలను పుస్తకాలుగా ప్రచూరించారు. ఆయన ఈ పని పూనుకోవటానికి కి ప్రేరణ గాంధి గారు. మన దేశా రాజకీయనాయకులు తెల్ల వాళ్లతో చర్చలు జరిపేటప్పుడు, వాళ్ల వాదనలో డొల్లతనం ఉందని వారికితెలిసినా, నిరుపించటానికి తగిన సాక్షం మనవారి దగ్గర ఉండేది కాదు. స్వాతంత్రం వచ్చాక గాంధి గారు ధర్మపాల్ గారిని 200సం|| క్రితం బ్రిటిష్ పాలనలో రికార్డ్ ల వివరాలు సేకరిస్తే మనదేశ చరిత్రకి,సంస్కృతికి ఎంతో ఉపయోగపడుతుంది అని, ఆపని చేయవలసిందిగా ఆయనని గాంధి గారు కోరారని కొన్ని సం|| క్రితం చదివాను.
  http://archive.org/details/DharampalCollectedWritingsIn5Volumes

 • Vasu says:

  http://en.wikipedia.org/wiki/ధరంపాల్
  ఇక్కడవ్యాఖ్య ప్రచూరించే టప్పుడు లింక్ తెలుగులోకి తర్జుమా అయిపోతున్నాది. అందువలన లింక్లు ఇవ్వటం కష్ట్టమౌతున్నాది. కనుక మీరు వీలైతే మీ ఈ మైల్ అడ్రెస్ ఇవ్వండి. వీలు చూసుకొని నా దగ్గర ఉన్న సమాచారం మీతో పంచుకొంటాను.

 • Vasu says:

  “అరిపిరాల వారి అభిప్రాయానికి మీ అభిప్రాయానికీ నాకు ఎక్కడా పోలిక కనిపించలేదు.”

  నేను స్థులంగా అరిపిరాల వారి అభిప్రాయాన్ని ఏకిభవిస్తాను. నేను రాసింది అతని వ్యాఖ్యకు అదనంగా గా అనుకొండి.

  *మతంలోనూ, క్రతువులోనే మనిషి పురా కాలం నుంచి ఆధునిక కాలం వరకూ తన అస్తిత్వానికి అర్థం వెతుక్కున్నాడనీ*

  అస్తిత్వానికి అర్థం వెతుక్కున్నాడనీ అనే కన్నా, మతంలోనూ, క్రతువులోను విశ్వాసం వలన వంశం పేరుతో మానవజాతికి వారసులను అందివ్వగలిగాడు అని అనుకోవచ్చు. ఇంకొక విషయమేమిటమే ఆచార వ్యవహారాలు అనుత్పాదక వ్యయంగా అనుకొని, రేషనల్ థింకింగ్ అలవరుచుకొని, పాతకాలపు విశ్వాసలపైన ఖర్చు అనవసరం అనుకొంటే మానవజాతిలో ఆర్ధికంగా,సామాజికంగా బాగా అభివృద్దిచెందిన వారు తిన్నగా అంతరించి పోతారు. ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు బాగా అభివృద్ది చెందిన తరువాత కనుమరుగు కావటానికి ఒక కారణం ఇదే. వ్యక్తిగా అనుభవంలో బాగా చదువుకొని రేషనల్ థింకింగ్ గలవారు పెళ్లిళు చేసుకొవటం చాలా చాలా తక్కువ.ఒoటరిగా జీవించే వారు ఎక్కువ.

  • కల్లూరి భాస్కరం says:

   లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు వాసు గారు…ఆచారవ్యవహారాలపై చేసే ఖర్చు అనవసర వ్యయం అని నేను అనలేదండీ. అనుత్పాదకవ్యయం అంటే అనవసర వ్యయం అని అర్థం కాదు. వ్యక్తిగత స్థాయిలో మనమూ, ప్రభుత్వాలూ కూడా చాలా అవసరమయ్యే ఒక్కోసారి అనుత్పాదక వ్యయం చేస్తూ ఉంటాం(చేస్తూ ఉంటాయి). రెండోది, అస్తిత్వానికి అర్థం వెతుక్కుంటాడన్నప్పుడు తన ఒక్కడి అస్తిత్వానికి అని కాదు, మీరన్న వారసులతో సహా మానవజాతి అంతా అందులోకి వస్తారు.

 • కోశాంబిని మించి ప్రాచీన భారతసంస్కృతికి అనాలోచిత వ్యాఖ్యానాలు చేసిన మార్క్సిష్టు చరిత్రకారుడు మరొకడు నాకు కనబడలేదు. ఆయన చెప్పిందే సత్యమనుకుని గుడ్డిగొర్రెల్లా తలూపేసిన చదువుకున్నామనుకుని భ్రమపడిన అనేకులను నేను ఎరుగుదును. ఇకపోతే సంపద అంటే ఏమిటి అనేది మనం అర్ధం చేసుకుంటే ఆ సంపద ఎలా వినియోగింపబడిందో అర్ధం చేసుకుంటే చాలు. కానీ ఆ వినియోగానికి ఏ కారణం అయితె మాత్రం ఏమిటి సమస్య?
  !

  ఉదాహరణకు శ్రాద్దాన్నే తీసుకుందాము. శ్రాద్దంలో అనేకం అవసరాలు ఉన్నాయి:
  ౧) సంతర్పణకు కావాల్సిన బియ్యం = రైతులనుండి బియ్యాన్ని కొనాలి – ఈ విధంగా రైతులకు రాజుయొక్క ధనంలో వాటా దొరుకుతుంది.
  ౨) సంతర్పణకు కూరగాయలు = తమ పెరటిపాదులలో కూరగాయలు పెంచి మిగులు కూరగాయలు విక్రయించే చిన్న కుటుంబాలవారికి రాజుధనంలో వాటా.
  ౩) కుండలు = కుండలు చేసే పనివారికి రాజు ధనంలో వాటా దొరుకుతుంది.
  ౪) బంగారం ఆభరణాలు = బంగారం పనిచేసేవారికి రాజు ధనంలో వాటా దొరుకుతుంది.
  ౫) పాలు = పాలవాడికి ధనం దొరుకుతుంది
  ౬) కట్టెలు = కట్టెలుకొట్టేవాడికి జీవనం దొరుకుతుంది.
  ౭) విస్తరాకులు = ఆ వృత్తిచేసుకునేవారికి జీవనం

  ఇలా చూసుకుంటే ఒక్క శ్రాద్ధం అనే సాకుతో సమాజంలో అనేకులకు జీవనోపాధి దొరుకుంది. హిందీలో ఒక సామెత ఉంది ’ఇస్ దునియా ఎక్ బజార్ హై ఇస్ హాత్ సె దె ఉస్ హాత్ సె లో’ ఈ ప్రపంచం ఒక దుకాణం లాంటిది ఒకచేత్తో ఇచ్చి ఇంకొకచేతితో పుచ్చుకో అని. సమాజంలో అక్కడక్కడా కుప్పలుగా పేరుకుపోయిన ధనరాశులను కరిగించి ప్రజలందరికీ అందించగలిగిన వ్యవస్థలు ఒకనాడు ఉండేవి. అయితే ఆ వ్యవస్థలు స్వచ్చందంగా పాటించబడేవి. అంటే శ్రాద్ధం చెయ్యాలనే శ్రద్ధ విశ్వాసం ఆ రాజులను తమవద్ద ఉన్న నిల్వలను కరిగించేటట్లుగా ప్రోత్సహించేవి. అయితే ఇవాళ మార్క్సిజం వల్ల ప్రపంచం భ్రష్టుపట్టిపోయింది. స్వచ్చందంగా ఇవ్వడాన్ని ప్రోత్సహించకుండా బలవంతంగా లాక్కునే వ్యవస్థని సృష్టించుకున్నాము. అంటే పన్నులరూపంలో బలవంతంగా వసూళ్లు చేస్తున్నాము… దానివల్ల ఎవరికివారు తమకు చెందిన ధనాన్ని దాచిపెట్టేసుకుని ధర్మాన్ని విచక్షణని వదిలేసి తాని ఖర్చుపెడితే తప్ప పక్కవాడు బ్రతకలేడు అన్న విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు.

  అందుకే వీలైనంతవరకు మార్క్సిజాన్ని సోషలిజాన్ని దూరంగా పెట్టి తిరిగి ఒకనాటి స్వచ్చంద పరస్పర ఆధారిత సమాజాన్ని నెలకొల్పాలి. ఒకనాటి హైందవసమాజం పరస్పర ఆధారిత సమాజం. వివాహం, ఉపనయనం, శ్రాద్ధం వంటి నియత కర్మల ప్రోత్సాహం వల్ల రాజులలోని విశ్వాసం వల్ల సమాజానికంతటికీ మేలుకలిగేది. అలా సమాజానికి మేలు కలిగించేదిగాబట్టే ’యజ్ఞం’ అన్నారు. ’సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవో స్వ్తిష్టకామధుక్ ’ భగవద్గీత 3.10 – పూర్వం ఆ ప్రజాపతి ప్రజలను యజ్ఞములను సృష్టించి ఈ యజ్ఞకార్యములను సేవించి మహత్తరమైన శ్రేయస్సును పొందండి అని చెప్పారు. — కాబట్టి మార్క్శిజాన్ని సోషలిజానికి దూరంగా జరిగి హైందవ యజ్ఞభావనకు ప్రజలు దగ్గరగా జరిగిననాడు సమాజ కల్యాణం తప్పనిసరిగా జరుగుతుంది.

  • Thirupalu says:

   సమాజ కల్యాణానికి శ్రాద్ధం పెట్టాలని ఎంత ఆశా!

  • kv ramana says:

   ‘ఇవాళ మార్క్సిజం వల్ల ప్రపంచం భ్రష్టు పట్టిపోయింది. స్వచ్చందంగా ఇవ్వడాన్ని ప్రోత్సహించకుండా బలవంతంగా లాక్కునే వ్యవస్థను సృష్టించుకున్నాం. అంటే పన్నుల రూపంలో బలవంతంగా వసూళ్లు చేస్తున్నాం’
   మీ ఉద్దేశంలో మార్క్సిజం, సోషలిజం పన్నులు ప్రవేశపెట్టాయా? మీరన్న రాజుల కాలంలో పన్నులు లేవా? మీ వాదం భలే ఉంది.

 • JVRKPRASAD says:

  ప్రస్తుత రోజుల్లో ఉన్నంతలోనే అంత్యేష్టి కర్మలు, తద్దినాలు, ఇత్యాది అపరకర్మలు చేస్తునే ఉన్నారు. దోషములు పోగొట్టుటకు చేయు కర్మలనే సంస్కారములు. ధర్మ సూత్రములలో “చత్వారింశత్ సంస్కారా: మరియు అష్టా ఆత్మగుణా:” అనగా 40 సంస్కారములు మరో 8 ఆత్మ గుణముల సంస్కారములతో పాటుగా కలిపి మొత్తం నలభై ఎనిమిది సంస్కారములు చేయుట లేదు. వారి స్థితి, స్థాయిని బట్టి కొన్ని జననానంతర సంస్కారములు (షోడశ సంస్కారములు) జరుపు కుంటున్నారు. ఈ చేయు కొన్నిసంస్కారములు ఆస్థులు అమ్ముకుని, అప్పులు చేసి మాత్రము చేయుట జరుగుట లేదని నా అభిప్రాయము.

 • chintalapudivenkateswarlu says:

  శ్రద్ధతో గడిపే జీవితం కూడా శ్రాద్ధమే! శ్రాద్ధమంటే అపర కర్మకే ఇప్పుడు అర్థం కున్చించుకుపాయింది. అలాగే బ్రహ్మణుడంటె ఒకప్పుడు బ్రహ్మజ్ఞాని. రేపటి సంగతి ఆలోచించకుండా నిత్యం పవిత్ర జీవితమ్ గడిపే వాడు. అలాన్టివారికే ఈ శ్రాద్ధాలు, శ్రద్ధమయ జీవితాలు. ఈ లోకంలో 80% సామాన్యులే! అసామన్యుల్లో జ్ఞానులు ఎంతమంది? వారి గురించి పెట్టిన శ్రాద్దాచారాలు మిగిలినవారికి అనవసరమేగాదా. కులాన్ని బట్టి బ్రాహ్మణులైన వారు నిజానికి శూద్రులతొ సమానం. జీతాలకి పని చేసేవారు నిజంగా శూద్రులె. అటువంటివారు తాము బ్రాహ్మలమని నమ్మించటం కోసం చేసే కర్మలు కూడ ఘనంగా జరుపుకొంటున్నారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అంటుంది గీత. కర్మ చేతనే గాని గుణం చేత కాని వారు శూద్రాచారలు మాత్రమె పాటించాలి మాధవ తురుమెళ్ళ గారూ.

 • భాస్కరం గారికి నమస్కారాలతో..

  భిన్నమైన కోణాన్ని విశ్లేషణాత్మకంగా ముందుంచారు.

  అక్షరాలు కూడా తయారు చేసుకోని ఆదిమసమాజం ఎలావుండేది ? అనేది కొంచెమైనా అర్ధం చేసుకునేందుకు మిగిలిన సరాసరి ఆధారాలుగా నేటికీ మిగిలి వున్న ‘రాక్షసగుళ్ళు’ అని పిలుచుకునే మెగాలిథ్స్ మిగలటానికి కారణం వారికి పితృకర్మలమీద వున్న శ్రద్దే కావచ్చు. ఏయే పరికరాలు వాడేవారు, ఎటువంటి అలంకారాలను ధరించేవారు, ఖగోళ విజ్ఞానం మీద దిశల మీద వీరికి అవగాహన వుందా? అనే విషయాలు వీటిని శోధించే తెలుసుకోగలిగాము.

  ఒక బండను అటునుంచి ఇటు కదిపేందుకు శ్రమ ఖర్చయ్యింది అనుకుందాం, దానికి గానూ ఏదో ఒక రూపం లో ప్రతిఫలం దక్కితే మొత్తంగా పని వృధా అయినట్లు కాదుకదా. నీళ్ళలాగానే ఆర్ధిక సంపదకూడా స్థిరంగా వుండటం కంటే ప్రవహిస్తుంటేనే విలువ. అరిపిరాల వారిది, తురుమెళ్ళ వారి వివరణలు వ్యాసానికి మరింత అందాన్నిచ్చాయి.మీతో పాటు వారికి కూడా ధన్యవాదాలు.

  • కల్లూరి భాస్కరం says:

   శ్రీనివాస్ గారూ, మీ ఆలోచనాత్మక స్పందనకు ధన్యవాదాలు.

 • A GOPALA KRISHNA SAI says:

  CHAKKANI VYASAM CHAKKANI VISLESHANA.

  ARDHIKA, SAMAJIKA, MANASIKA SAMANVYAM VYAKTIGATAM.

  COMMUNISTULU/MARXISTULU KUDA PELLI PERANTALA PERITA VIPARITAM GA KHARCHU PETTADAM CHUSTHUNE VUNNAM.

  PINDI KODDI ROTTE; SRADDHA KODDI SRADDHAM;

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)