రాలిపోయిన వొక వాక్యం గురించి రెండు మాటలు …!

హార్వర్డ్ లో కవిత్వ పాఠాలు చెప్తున్న కాలంలో....

 

హార్వర్డ్ లో కవిత్వ పాఠాలు చెప్తున్న కాలంలో....

హార్వర్డ్ లో కవిత్వ పాఠాలు చెప్తున్న కాలంలో….

ఆగస్టు 30 పొద్దున్న.

వొక కవి చనిపోయిన రోజు మనసెలా  వుంటుంది?

ఇప్పుడు నేను మాత్రం వాన నీళ్ళు భారంగా దేహంలోకి ఇంకుతున్న పొడి నేలలాగా వున్నాను. కొన్ని నల్ల మబ్బులు తిరుగుతున్న బరువయిన గాలిలాగా వున్నాను.

ఆ కవి నాకేమీ బంధువు కాదు. స్నేహితుడూ కాదు. నన్ను రోజూ పలకరించే నా సహోద్యోగి కూడా కాదు. అసలు నాదీ అతనిది వొక భాష కూడా కాదు. వొక దేశం అసలే కాదు.

కాని, వొక కవి! పాతికేళ్ళుగా అక్షరాలా పలకరిస్తున్న కవి. పలవరిస్తున్న కవి – సీమస్ హీని ఇక లేడు! ఇవాళ పొద్దున్న ఆఫీసుకి వెళ్లి కూర్చోగానే ఈ-లేఖలో చిరకాల మిత్రుడు, అమెరికన్ కవి  మాథ్యూ గిన్నెట్ పలకరింత. “విన్నావా? సీమస్ హీని ఇక లేడు! ఇవాళ నువ్వూ నేనూ కలిసి మనిద్దరికీ ఇష్టమైన అతని కవిత ‘The Republic of Conscience’ చదువుకుందామా?”

అప్పటికప్పుడు నాకు చాల ఇష్టమయిన సీమస్ కవిత్వ సంపుటి OPENED GROUND తీసి, ఆ కవితలోంచి వొక్కో కవితా చదువుతున్నప్పుడు కంటి రెప్పలు తడుస్తో పోతున్నాయి.  కొంత దూరం చదివేసరికి అక్షరాలూ అల్లుకుపోయాయి  తడి పొరల కింద. నాకు తెలుసు- ఏడేళ్ళుగా అతని గుండె ఇక పని చేయను అని బలహీనంగా సడి  చేస్తూనే వుంది.

ఇక చదవలేక ఆఫీసులోంచి బయటికి వచ్చి అక్కడే వున్న Turtle pond అనే చిన్న కొలను పక్కన కూర్చొని, అక్కడి నీళ్ళనీ, అందులోని రాళ్ళ మీదికి మెత్తగా పాకుతున్న తాబేళ్లనీ చూస్తూ కూర్చున్నాను. సీమస్ హీని లేడు…అన్న రెండు పదాలు మెదడులోపల మోగుతున్నాయి. శరీరం చాలా అసౌకర్యంగా వుంది. మనసు లోపల్లోపల వెక్కిళ్ళు పెట్టుకుంటోంది.

ఎందుకీ కవి ఇంతగా నాలోపల మిగిలిపోయాడు? డెబ్బై నాలుగేళ్ల అతని దేహ నిష్క్రమణని ఎందుకు వొప్పుకోలేకపోతున్నాను?

కొంత కాలంగా వొక విధమయిన వ్యక్తిగత వైరాగ్యమూ, వైముఖ్యమూ, నా మీద నాకే కోపమూ  లోపల్లోపల పేరుకుపోయి, “ఇంక నేనేమీ రాయను, రాయలేను!” అని మనసూ, చేయీ రాయి చేసుకొని, రాయాల్సిన వాక్యాలన్నీ మనసులోనే భ్రూణ హత్య అయిపోతున్న సమయంలో సీమస్ నా చేత ఈ రెండు మాటలూ  రాయిస్తున్నాడు.

Seamus-Heaney-006

1

సీమస్ హీని నాకు తండ్రి లాంటి వాడు. మా నాన్నగారూ, అతనూ వొకే ఏడాది – అంటే 1939- లోనే పుట్టారు. ఇవాళ పత్రికలో సీమస్ చివరి ఫోటోలో అతని ముగ్గుబుట్టవంటి తలని చూస్తున్నప్పుడు మళ్ళీ నాన్నగారు గుర్తొచ్చారు. బహుశా, ఈ రెండు మరణాల స్మృతి భారం నన్ను మరింత దిగుల్లోకి నెట్టి వుంటుంది. తండ్రిలాంటి స్మృతి…కాని, సీమస్ వాక్యాలు ఎప్పుడూ వొక స్నేహ పరిమళం వీస్తున్నట్టు వుంటాయి.

ఎమ్మే ఇంగ్లీష్  చదువుతున్న సమయంలో నాగార్జున యూనివర్సిటీ కాంపస్ లో మొదటి సారి మా ప్రొఫెసర్ రంగన్ గారు నాకు ఈ ఐర్లాండ్ కవి వాక్యాలు చెప్పారు. అప్పటి నించీ సీమస్ ని వెతికి పట్టుకోవడం నాకొక వ్యాపకంగా మారింది. బెజవాడ గాంధీనగర్ లో ప్రబోధ బుక్ హౌస్ నించి మా ఆస్టిన్ లైబ్రరీ దాకా దొరికిన చోటల్లా సీమస్ కవిత్వం, వచనమూ వొకటికి రెండు సార్లు చదవడం, మననం చేసుకోవడం — ఈ పాతికేళ్ళుగా అతని కవిత్వం చదువుతున్నప్పుడు ఏనాడూ అతని వయసు అడ్డంకి కాలేదు నాకు. అతని భాష అతని దేశమూ పరాయీ అనిపించలేదు. అతని వదల్లేక వదిలిన వూరు నాదే, అతని చనిపోయిన క్రిస్ అన్నయ్య నా అన్నయే! అతను పాఠాలు చెప్పిన ఎలిమెంటరీ స్కూలు కూడా నాదే! అతన్ని మెప్పించిన ఈట్స్, ఇలియట్, థామస్ హార్డీ, టెడ్ హ్యూ నన్నూ మెప్పించారు. చాలా తక్కువ మంది కవులు ఇలా వుంటారు, మనల్ని తమలోకి ఇంకించుకునే వాళ్ళు! తలుపులు బార్లా తెరిచిన మనసుతో వాక్యాల వెంట తోడు తీసుకు వెళ్ళే వాళ్ళు!

భుజమ్మీద చేయి వేసి, ధైర్యం చెప్తూ కాసేపు, నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని అనునయిస్తూ కాసేపు, నా కళ్ళలోకి చూస్తూ ‘జీవితాన్ని కాస్త ప్రేమించవూ’ అని బతిమాలుతూ కాసేపు–వొక కవి కేవలం కొన్ని వాక్యాల ఆసరాతో ఇన్ని రకాల role-plays చేయగలడా అని విస్మయానికి లోను చేస్తూ–గత పాతికేళ్ళుగా సీమస్ అక్షరాలా తోడుగా వున్నాడు. ఇవాళ అలాంటిదేదో వొక తోడు తెగిపోయింది. లోపల మిగిలివున్న ఆ ధైర్యపు మాట ఏదో పుటుక్కున  దారం తెగిన దండలాగా రాలిపోయింది. వొక నిస్త్రాణ – శరీరంలో, మెదడులో!

ఆ కొలనులో నీటి గలగలల మధ్య అతను లేనితనంలోంచి అతని మాటల్ని వెతుక్కుంటూ కూర్చున్నాను. ‘కవిత్వం ఏమిటీ’ అన్న నా ప్రశ్నకి లోపల్నించి సీమస్ ఇలా సమాధానమిస్తున్నాడు: “నేను పుట్టిందీ పెరిగిందీ పొలాల మధ్య..పొలం పనుల మధ్య! అదీ నా వాస్తవ ప్రపంచం. ఆ పనుల మధ్య కొంచెం అలసట తీర్చుకోడానికి నేను ఆడుకోడానికి వెళ్ళే వాణ్ని. ఆ ఆటలో నన్ను నేను, నా వాస్తవ ప్రపంచాన్ని మరచిపోయే వాణ్ని. అంటే, ఆటస్థలం నా ఊహా ప్రపంచం. ఆ రెండీటి మధ్య వున్న ప్రపంచమే కవిత్వం నాకు!”

ఇంకా కొంచెం ముందుకు వెళ్లి మాట్లాడుకుంటే, జీవనోపాధి వల్ల తను పుట్టిన వూరికి దూరంగా వెళ్ళిపోవడం సీమస్ ని ఎప్పుడూ బాధించేది. వొక చిన్న వూళ్ళో బడిలో పాఠాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ చివరికి హార్వర్డ్ దాకా చేరుకున్నాడు సీమస్. ఈ సుదూర ప్రయాణంలో ఎంత ఆనందం వుందో, అంత బాధా వుంది అతనికి!

వొక కవితలో ఆ బాధని ఇలా చెప్పుకున్నాడు:

ఎక్కడెక్కడికో ఎగిరిపోతుంది గాలిపటం.

దాని దారం నీ చేతుల్లో

నీ గుండెని హత్తుకొని ఎలా వుంటుందో చూసావా?

నిజానికి  దారమొక్కటే నీ చేతుల్లో వుంది.

నీ గాలిపటం అందాలన్నీ

ఎక్కడో ఏ శూన్యాన్నో  అలంకరిస్తున్నాయి.

సీమస్ కవిత్వ రహస్యం అంతా ఆ దూరంలోని బాధ చెప్పడమే! ఎక్కడో వొక వూళ్ళో పుడతాం, కొన్నాళ్ళకి ఆ వూరు విడిచి వెళ్ళిపోతాం. వొక్క రోజు కూడా విడిపోతే వుండలేమనట్టుగా తల్లి కొంగు పట్టుకు తిరుగుతాం. ఆ కొంగుని వదిలేసి ఏడు సముద్రాలూ దాటి వెళ్ళిపోతాం. నాన్న భుజాల మీద ఆడుకోలేని రోజులు అర్థరహితంగా అనిపిస్తాయి. చివరికి అలాంటి అర్థరహితమయిన రోజులే జీవితంలో పెరిగిపోతుంటాయి. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి తిరిగిన చెలకలూ, తవ్వి తీసిన చెలమలూ, హోలీ రంగుల కోసం కోసుకొచ్చిన పూలూ, అల్లరి చేస్తూ గడిపిన పండగ రోజులూ ఇవి లేని బతుకు ఏనాడూ వద్దనుకుంటాం.

కాని, అవన్నీ చూస్తూ చూస్తూ ఉండగానే గతస్మృతులు అయిపోతాయి. ఇప్పటి దూరపు బతుకు వొక్కటే మనకి మిగిలి వుంటుంది. సీమస్ కవిత్వమంతా ఆ ఇంటి పలవరింత, ఆ బంధాల పలకరింత. దూరమయిపోయే దగ్గరితనాల తలపోత. అందుకే, సీమస్ వాక్యాలు చదువుతున్నప్పుడు నా మటుకు నాకు అతని అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నట్టు వుంటుంది. నా కాళ్ళని వెనక్కి నడిపించి గతంలోకి తోసుకుంటూ వెళ్ళే బాల్యమిత్రుడు సీమస్.

ఈ ఐరిష్ నేలా, గాలీ, చేలూ...అతని కవిత్వానికి ఊపిరి

ఈ ఐరిష్ నేలా, గాలీ, చేలూ…అతని కవిత్వానికి ఊపిరి

2

నాకు తెలిసీ, నాకు వున్న పరిమితమయిన అనుభవంలోంచి చెప్పాల్సి వస్తే,   కవిత్వం రాయడమే కష్టం. కోరి కోరి మనసుని నొప్పించుకోవడం! వొక్కో వాక్యం వొక్కో  రకం  నొప్పి. కాని, రాయకుండా వుండడం ఇంకా నొప్పిగా వుంటుంది. ఆ రాయలేని నొప్పి కన్నా రాస్తూ పడే నొప్పి సహించడం తేలిక. అందుకే, బాధపడుతూనే రాస్తాం. సీమస్ అంటున్నాడు:

I am tired of speculations about the relation of the poet’s work to the workings of the world he inhabits, and finally I disagree that ‘poetry makes nothing happen.’ It can eventually make new feelings, or feelings about feelings happen, and anybody can see that in this country for a long time to come a refinement of feelings will be more urgent that a reframing of policies or of constitutions.

ఎన్ని వాదాలు చేసినా, వివాదాలు పడినా కవిత్వం వొక అనుభూతి. రాయడం వొక అనుభూతి, చదవడం వొక అనుభూతి, నలుగురితోనూ కవిత్వం గురించి మాట్లాడుకోవడం వొక అనుభూతి. ఎవరైనా నాలుగు కవిత్వ వాక్యాలు వాళ్ళ గొంతులోంచి పలుకుతూ వుంటే వినడం వొక అనుభూతి.

అందుకే, సీమస్ ఎప్పుడూ అంటాడు: “The main thing is to write/ for the joy of it … It’s time to swim/ out on your own and fill the element/ with signatures on your own frequency.”

సీమస్ చివరిదాకా ఆ ‘రాయడం’ అనే ప్రక్రియలోని  అనుభూతిని కాపాడుకున్నాడు, అది ఎంత నొప్పెట్టినా సరే!

Download PDF

14 Comments

 • raghava charya prativadi bhayamkara says:

  ” సీమస్ హీని నాకు తండ్రి లాంటి వాడు.” ఎందుకో మీరు చెప్పిన కారణం బాగుంది. కాలాన్ని మనం గుర్తించ గలుగుతే కాలం మనకు అన్నీగుర్తు చేస్తుంది. కాలం మీద కసి పెంచుకుంటే .. మనతో అది కలిసి రాదు. అలా ఒకడికి (కొందరికి) కలిసి రాని కాలాన్ని మనుషులుగా సింబలైజ్ చేసి తిట్టి పోస్తే అది కవిత్వం అనుకునే రోజుల్లో… “తమలోకి ఇంకించుకునే” … లక్షణం అభిజాత్యంలోకి ఇంకిపోక తప్పదు.

  తన జీవితాన్ని చూసుకోలేని వాడు కూడా కవి అయిపోతుంటే, (లేదా వేరే కారణాల వల్ల)..
  వ్యక్తిగత వైరాగ్యమూ, వైముఖ్యమూ, నా మీద నాకే కోపమూ …. వంటి వాటితో గూడు అల్లుకోవడం సమ్మతమే.
  ఎందుకంటే తితిలిలు అందులోంచే వస్తాయంటారు. (నిజమే కదా?).

 • balasudhakarmouli says:

  adbhutamaina vyaasaM. meeru- adustavaMtulu guruvu gaaru…… seemas(poet) tho meedi- goppa maanasikamaina baMdhaM. prapancha saahityaanni cadavadaM – anubhooti ceMdaDaM- meedaina mee teeru- meeke spnthaM.. meetho, seemantho- nenu kooda link ayyaanu.. i fell in love with your eassy on seemas- guruvu gaaru…..

 • సాయి పద్మ says:

  మన మనసుతో మనం చేసే పరాయీకరణ ప్రయత్నాల కన్నా .. నిర్ల్యక్ష్య ప్రవాసపు దూరం అంత బాధాకరం కాదులే మిత్రమా …కొన్ని అక్షరాలైనా నువ్వు అక్షరాలా మిగిల్చావా లేదా అన్నదే నీకూ, ఇతర్లకీ ముఖ్యం ..!! మంచి వ్యాసం అఫ్సర్ జీ
  ( సీమన్ హీని జ్ఞాపకాల కొత్త గాయాల అలావాటైన నేప్పితో ..!)

 • priya says:

  కొంత కాలంగా వొక విధమయిన వ్యక్తిగత వైరాగ్యమూ, వైముఖ్యమూ, నా మీద నాకే కోపమూ లోపల్లోపల పేరుకుపోయి, “ఇంక నేనేమీ రాయను, రాయలేను!” అని మనసూ, చేయీ రాయి చేసుకొని, రాయాల్సిన వాక్యాలన్నీ మనసులోనే భ్రూణ హత్య అయిపోతున్న సమయం //
  మీలాంటి ఒక గొప్ప కవి ఇలా అనుకుని రాయడం మానేయ కూడదు ( వద్దు ) బాధ మనసుది అయినప్పుడు అదే రాయండి. ఒక కవి మనసు ఇంతలా కష్ట పెట్టిన సమాజం సిగ్గుపడి తలదించుకునేలా రాయండి ..
  సీమస్ చివరిదాకా ఆ ‘రాయడం’ అనే ప్రక్రియలోని అనుభూతిని కాపాడుకున్నాడు, అది ఎంత నొప్పెట్టినా సరే!….కదా !

 • ns murty says:

  డియర్ అఫ్సర్,

  నాకు ఒకోసారి అనిపిస్తుంటుంది … అసలు ఐర్లండు, స్కాట్లండు మట్టిలోనూ, నీటిలోనూ, గాలిలోనూ కవిత్వం ప్రవహిస్తుంటుందేమోనని. బహుశా, ఇంగ్లీషు భాషకి ఐర్లండు, స్కాట్లండు కవులు చేసిన కాంట్రిబ్యూషన్ అనుపమానమైనది.

  కవితో మనం మమేకమై, అతని అనుభూతులు మనం పంచుకోలేకపోతే అతను మనకి కవే కాదు. కవిత్వం ఒక వ్యసనమైన మీ లాంటి వాళ్ల సంగతి చెప్పక్కరలేదు. వ్యక్తులతో ప్రత్యక్షంగా మీకు పరిచయం ఉన్నప్పుడు మీరు వాళ్ళగురించి వ్రాసే స్మృతి వ్యాసాలు బాగుంటాయి అని నా నమ్మకం. Seamus Heaney ని మీరు ఎంతగా లోపలికి శ్వాసిస్తున్నట్టు ఇంకించుకున్నారో, ఈ వ్యాసం ఉదాహరణ.

  “… It’s time to swim/ out on your own and fill the element/ with signatures on your own frequency “… ఎంత అందమైన భావన. ఆ సంతకాలు చెరిగిపోనివి. ఎందుకంటే మనం ఆ elements లోకే పునః పునః వస్తూపోతుంటాము కాబట్టి.

  అభివాదములతో

  • pavan santhosh surampudi says:

   //నాకు ఒకోసారి అనిపిస్తుంటుంది … అసలు ఐర్లండు, స్కాట్లండు మట్టిలోనూ, నీటిలోనూ, గాలిలోనూ కవిత్వం ప్రవహిస్తుంటుందేమోనని. //
   నిజమే గొప్ప పరిశీలన.

 • prof.Raamaa Chandramouli says:

  సీమస్ హీని ..లేకపోవడం గురించి హృదయం ద్రవించేలా చెప్పి అఫ్సర్ కదిలించాడు.
  వ్యక్తి ఒక కవిగా జీవిస్తూనే తనలోని కవిని కాపాడుకోవడం చాలా కష్టం.
  ‘ మనిషంటేనే ఒక వ్యక్తీకరణ ‘ అన్న కవిత జ్ఞాపకమొచ్చింది .అఫ్సర్ కు ధన్యవాదాలు.
  – మౌళి

 • మీ మనసులోంచి వచ్చిన ప్రతి వాక్యం, ప్రతి అక్షరం ఈ కవి మీకెంత ఆప్తుడో చెప్తున్నాయి…
  చాలా చాలా బాగా రాసారు..

  పైనెవరో అన్నట్లు మీరు రాయడం అపేయడమేమిటి? అయినా కవికి వైరాగ్యమేమిటండీ? కవి నిత్య పథికుడు. అతడికి అలుపు ఉండదు.. ఉండకూడదు :)

 • mercy margaret says:

  ఇదంతా చదివాక స్పందించడానికి మనసుకు కొంత సమయం పట్టేట్టు ఉంది. మాటలు ఘనీభవించి గొంతులో ఎదో తెలియని బాధను నింపుకున్న మాట వాస్తవం.

 • ప్రతి పదం మనో వేదనా మయ వెన్నెల ఆర్ద్రత..

 • అఫ్సర్ గారూ, ఇంగ్లీష్ కవిత్వంతో అంతగా పరిచయం లేని నా లాంటి వాళ్లకు మీ వ్యాసం ఒక చుక్కాని. మీరు రాయడం ఆపేస్తే సీమస్ ఆత్మ ఘోషిస్తుంది. రాయండి, నాలాంటి వాళ్లకు మార్గదర్శనం చేసేలా.

 • Thirupalu says:

  ” ఎన్ని వాదాలు చేసినా, వివాదాలు పడినా కవిత్వం వొక అనుభూతి. రాయడం వొక అనుభూతి, చదవడం వొక అనుభూతి, నలుగురితోనూ కవిత్వం గురించి మాట్లాడుకోవడం వొక అనుభూతి. ఎవరైనా నాలుగు కవిత్వ వాక్యాలు వాళ్ళ గొంతులోంచి పలుకుతూ వుంటే వినడం వొక అనుభూతి.”
  అవును నిజం ! అవును నిజం ! మీరన్నది నిజం నిజం !

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)