నేటికీ ‘పురి’ విప్పుతున్న వంశం

 Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)హిమకరు దొట్టి పూరు భరతేశు కురుప్రభు పాండుభూపతుల్

క్రమమున వంశకర్తలనగా మహి నొప్పిన యస్మదీయ వం

శమున బ్రసిద్ధులై విమల సద్గుణశోభితులైన పాండవో

త్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్ట మెంతయున్

-నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, ప్రథమాశ్వాసం)

(చంద్రునితో మొదలు పెట్టి, పూరుడు, భరతుడు, కురువు, పాండురాజు క్రమంగా వంశకర్తలైన నా వంశంలో ప్రసిద్ధులు, సద్గుణవంతులు అయిన పాండవోత్తముల చరిత్ర నాకు ఎప్పుడూ వినాలనే ఉంటుంది)

నన్నయభట్టారకునితో రాజరాజనరేంద్రుడు అన్న మాటలివి.  క్రీ.శ. 11 వ శతాబ్దిలో రాజమహేంద్రవరం రాజధానిగా వేంగీ రాజ్యాన్ని పాలించిన తూర్పు చాళుక్య రాజు -రాజరాజ నరేంద్రుడు తనను పాండవ వంశీకునిగా చెప్పుకుంటున్నాడు! అదెలాగో తెలియదు. ఋషి వంటి నన్నయ ఈ అభూతకల్పనను ఆమోదించి దానికి పద్య రూపం ఇవ్వడం, ఇప్పటి చరిత్ర ప్రమాణాలతో చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. వాస్తవం ఏమిటంటే, నన్నయ ఋషితుల్యుడే, అవిరళ జపహోమ తత్పరుడే. కానీ, ‘కుసుమాస్త్రుండైన(మన్మథుడైనా) జొన్న కూడే కుడుచున్’ అంటూ ఒకప్పటి పలనాటి పరిస్థితుల గురించి శ్రీనాథుడు అన్నట్టుగా; ఎంతటివాడైనా దేశకాల పరిస్థితులకు లొంగి ఉండక తప్పదు.

కనుక, నన్నయ తప్పేమీలేదు. తప్పు ఉంటే గింటే మనకు చరిత్ర గురించిన స్పృహ, పట్టింపు, క్రమశిక్షణ లేకపోవడంలో ఉంది. కల్పనను చరిత్రగా చలామణీ చేయడం, చరిత్రను కల్పనగా మార్చడం మొదటినుంచీ మన సంప్రదాయంలో ఉన్నదే. అభూతకల్పన (myth making) అనేది ప్రపంచమంతటా మనిషి స్వభావంలో ఆదిమకాలంనుంచీ ఉందనీ, అది సానుకూల పాత్రను కూడా పోషించిందనీ A SHORT HISTORY OF MYTH లో కరేన్ ఆర్మ్ స్ట్రాంగ్ అనే రచయిత్రి అంటారు. ఘటనాక్రమంతో కూడిన చరిత్రను నమోదు చేసే క్రమశిక్షణ అభివృద్ధి చెందిన తర్వాత myth making కు ఆదరణ తగ్గి, అపహాస్యానికి లోనవుతూ వచ్చిందని ఆమె అంటారు. కాకపోతే, ఈ అభూత కల్పన ప్రక్రియ మన దేశంలో మరింత ఎక్కువ కాలం కొనసాగి, ఇప్పటికీ చలామణిలోనే ఉంది. ఈ రచయిత్రి పరిశీలన గురించి మరిన్ని విషయాలు చెప్పుకునే అవకాశం ముందు ముందు రావచ్చు కనుక ప్రస్తుతానికి వద్దాం.

యయాతి, దేవయాని, శర్మిష్టలు మహాభారత ప్రసిద్ధులు. యయాతికి దేవయాని వల్ల యదు, తుర్వసులనే ఇద్దరు కొడుకులు; శర్మిష్ట వల్ల ద్రుహ్యుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. పై పద్యంలో పేర్కొన్నది ఈ పూరుడినే. అతనిని తన వంశకర్తలలో ఒకడిగా రాజరాజ నరేంద్రుడు చెప్పుకుంటే;  మనుచరిత్రలో అల్లసాని పెద్దన  శ్రీకృష్ణ దేవరాయలను యయాతి మరో కొడుకైన తుర్వసునితో ముడిపెట్టాడు.  1509-1529 మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణ దేవరాయలు ‘తుళువ’ వంశీకుడు.  పెద్దనగారికి తుర్వస-తుళువల మధ్య పోలిక కనిపించింది. అంతే, రాయలవారిని తుర్వస వంశీకుని చేశాడు. పెద్దనను ఒరవడిగా తీసుకుని నంది తిమ్మన కూడా పారిజాతాపహరణములో రాయలవారిని తుర్వస వంశీకునిగా పేర్కొనడమే కాక, మరో అడుగు ముందుకు వేసి యాదవుడైన శ్రీకృష్ణుడే శ్రీకృష్ణ దేవరాయలుగా అవతరించారడంటూ శ్లేషయుక్తంగా పద్యాలు రాశాడు.

Krishna3

ఎందుకిలా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోవడం ప్రారంభిస్తే, అది చాతుర్వర్ణ్య(నాలుగు వర్ణాల) చరిత్ర మొత్తంలోకి మనల్ని తీసుకువెడుతుంది.  క్లుప్తంగా చెప్పుకుంటే, నిజానికి నాలుగు వర్ణాలు అనే చట్రం సూత్రరీత్యానే కానీ ఆచరణలో ఉన్నది తక్కువ.  వర్ణవిభజనతో ప్రారంభమై వృత్తి విభజనగా పరిణమించిన ఈ నాలుగు వర్ణాల చట్రాన్ని పకడ్బందీగా ఉంచే ప్రయత్నం ఏనాడూ ఫలించలేదు. వర్ణసాంకర్యంతో పాటు వృత్తి సాంకర్యమూ పెద్ద ఎత్తున జరిగిపోయింది.  దక్షిణభారతానికి వచ్చేసరికి నాలుగు వర్ణాల చట్రం మరింత సడలి పోయింది. అయినాసరే, రాజ్యాధికారం క్షత్రియుడిదనీ, లేదా రాజ్యాధికారం కలిగిన వారు అందరూ క్షత్రియులేననే భావన సాంప్రదాయిక వర్గాలలో నిన్నమొన్నటి వరకూ  ఉండిపోయింది.  రాజ్యాధికారం క్షత్రియేతర వర్ణాల చేతుల్లోకి వెళ్లడం చరిత్రపూర్వ కాలంలోనే మొదలై, చరిత్ర కాలంలో సంపూర్ణమైనట్టు కనిపిస్తుంది.  క్షత్రియుల్లో చరిత్రకాలానికి ముందే హెచ్చు, తగ్గులు వచ్చి; వన్నె తక్కువ క్షత్రియులను వ్రాత్య క్షత్రియులనడం ప్రారంభించారు. శాక్య వంశీకుడైన బుద్ధుడు, లిచ్ఛవీ తెగకు చెందిన మహావీరుడు వ్రాత్యక్షత్రియులే. మనదేశంలో నేడు మనకు తెలిసిన అర్థంలో రాజ్యం వ్యవస్థీకృతం కావడం మగధ, కోసల రాజ్యాలతో(క్రీ.పూ. 6వ శతాబ్దం) ప్రారంభమైంది. అయితే ఈ రెండు రాజ్యాల పాలకులనూ హీన జాతి క్షత్రియులనీ, క్షత్ర బంధువులనీ అన్నారే తప్ప సుక్షత్రియులుగా గుర్తించలేదు. ఎలా పిలిచినా అందులో క్షత్రియ పదం ఉండడం, రాచరికానికీ-క్షత్రియత్వానికీ ముందునుంచీ ఉన్న ముడిని సూచిస్తుంది. మగధ, కోసల రాజులు తమను క్షత్రియులుగా గుర్తింపజేసుకోడానికీ, క్షత్రియులతో వివాహసంబంధం ద్వారా తమ సామాజిక స్థాయిని పెంచుకోడానికి చేసిన ప్రయత్నాలు కొన్ని ఆసక్తికర ఘట్టాలను సృష్టించాయి. వాటి గురించి త్వరలోనే చెప్పుకుందాం. దక్షిణ భారతానికి వచ్చేసరికి రాజ్యాధికారానికీ, క్షత్రియత్వానికీ ఉన్న సంబంధం మరింత పలచబారి చతుర్థ కులస్థులు(శూద్రులు) రాజులు కావడం మొదలైంది. అయినా సరే, క్షత్రియులన్న ముద్ర కోసం వారు కూడా  ఆరాటపడడం; సూర్య, చంద్ర రాజవంశాలతో ఏదో ఒక వంశంతో తమను ముడి పెట్టుకోవడం కొనసాగింది. ఇందులో భాగంగా ‘హిరణ్యగర్భ’ క్రతువుల వంటివీ పుట్టుకొచ్చాయి. రాజ రాజనరేంద్రుడు తనను పాండవవంశీకునిగా చెప్పకోవడం, కృష్ణ దేవరాయలను తుర్వస వంశీకునిగా పెద్దన పేర్కొనడం వెనుక ఇదీ అసలు విషయం.

శూన్యం నుంచి పుట్టిన వర్ణ/వృత్తి విభజన మొదట రెండు వర్ణాలతో మొదలై ఆ తర్వాత మూడు, నాలుగు వర్ణాలుగా మారి క్రమంగా అసంఖ్యాక కులాల అవతరణకు దారితీయించింది. వర్ణవ్యవస్థా పరిణామ క్రమాన్ని, ముఖ్యంగా క్షత్రియులనుంచి  వైశ్యవర్ణం ఏర్పడిన తీరును రొమీలా థాపర్ From Lineage to State అనే రచనలో చాలా ఆసక్తికరంగా చర్చించారు. దాని గురించి ముందు ముందు చెప్పుకుందాం. భారతీయ సమాజంలోనూ, రాజకీయాలలోనూ కులం ఇప్పటికీ పాత్ర పోషిస్తూనే ఉంది. అయినా సరే, కుల/వర్ణ పరిణామక్రమం గురించిన చరిత్ర చర్చలో లేదు. వాటి గురించి అపోహలు, అపార్థాలే ప్రచారంలో ఉన్నాయి తప్ప స్పష్టత లేదు. ఆమధ్య జనగణనతోపాటే కులగణన కూడా చేపట్టాలని పార్లమెంటులో కొన్ని రాజకీయపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వం గుండెల్లో రాయి పడింది. కులగణన అంటే కందిరీగల తుట్టను కదపడమేనని అది భావించింది. దేశవ్యాప్తంగా కులాలు వేల సంఖ్యలో ఉండడం అందుకు ఒక కారణం. సాంప్రదాయికంగా చూస్తే, ‘పంచ’ములను కలుపుకుని వర్ణాలు అయిదే. ఇప్పటి భాషలో అగ్ర/అగ్రేతరాలుగా చెప్పుకుంటే, అవి రెండే. జరిగింది ఏమిటంటే, చతుర్థ వర్ణమే వేల కులాలుగా చీలిపోయింది. వాటన్నిటినీ చతుర్థవర్ణంగా గుర్తిస్తే మిగిలేది సాంప్రదాయికమైన పంచమవర్ణ వ్యవస్థే.

కులం గురించిన ఈ పరిశీలన చారిత్రక దృష్టినుంచి చేస్తున్నదే తప్ప మరొకటి కాదని మనవి చేస్తూ ముందుకు వెడతాను.

క్షత్రియేతర వర్ణాలనుంచి రాజులు అవతరించడం ప్రారంభమయ్యాక, వారు సాంప్రదాయిక విభజనలోకి రారు కనుక ప్రారంభంలో వారిని వన్నె తక్కువ క్షత్రియులనీ, క్షత్ర బంధువులనీ అంటే; చరిత్రకారులు వారిని అస్పష్ట మూలాలు కలిగినవారుగా చెప్పడం ప్రారంభించారు. నేడు మనకు తెలిసిన అర్థంలో రాజ్యం వ్యవస్థీకృతం కావడం వీరితోనే మొదలైంది. దక్షిణభారతానికి వచ్చేసరికి సాంప్రదాయిక వర్ణ విభజన మరింత పలచబారి, స్థానిక తెగలనుంచి రాజులు ఆవర్భవించారు. శాతవాహన రాజులతో ప్రారంభించి, చాళుక్యులు, విజయనగర రాజుల వరకూ దాదాపు అందరినీ చరిత్రకారులు అస్పష్ట మూలాలు కలిగినవారుగానే చెప్పారు. సాంప్రదాయిక విభజన ప్రకారం వీరంతా చతుర్థవర్ణంలోకే వస్తారు. క్షత్రియత్వం వీరిపై కృత్రిమ ఆపాదన మాత్రమే.

ఇంకా విశేషం ఏమిటంటే, ఒక కోణం నుంచి చూసినప్పుడు మహాభారతం ప్రధానంగా రెండు విషయాలు చెబుతోంది. మొదటిది, సాంప్రదాయిక క్షత్రియులు అంతరించిపోవడం గురించి! హోమర్ చెప్పిన ‘ఇలియడ్’ లానే మహాభారతం కూడా ఒక గొప్ప వంశం అంతరించిపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ ప్రారంభమవుతుందని కోశాంబి అంటాడు. రెండోది, రాజ్యాధికారం క్షత్రియేతర వర్ణాల చేతుల్లోకి వెళ్ళడం గురించి! ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్న ఈ చర్చను వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే…

కోశాంబి మౌలికంగా గణితశాస్త్రజ్ఞుడు. ఆయన నిర్ధారణలు చాలా చోట్ల గణిత సూత్రాలలా ముక్తసరిగా ఉంటాయి. వాటి ఆధారంగా ఒక్కోసారి మనం లెక్కలు చేసుకోవలసిందే. గట్టి ఆధారాలు లేకుండా ఊహల మీద ఆధారపడి నిర్ధారణకు రావడానికి ఆయన ఒప్పుకోడు. అటువంటి వ్యక్తి, అలెగ్జాండర్ తో పోరాడిన పోరస్ పురువంశపు చివరి రాజు అనడమే కాదు, పంజాబ్ లో ఈ రోజున ‘పురి’ అనే ఇంటిపేరు ఉన్న వారు పురువంశీకులే కావచ్చునని అంటాడు. ఆవిధంగా ఇతిహాస కాలాన్ని ఆధునిక కాలానికి తీసుకొచ్చి రెంటి మధ్యా అవిచ్ఛిన్నత ను కల్పిస్తున్న కోశాంబి పరిశీలన పురాచరిత్రాన్వేషకులకు ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది. ఆయన ప్రకారం చూసినప్పుడు, పదకొండో శతాబ్దికి చెందిన రాజరాజనరేంద్రుడు పూరుని తన వంశకర్తలలో ఒకడిగా చెప్పుకున్నా అది కల్పన మాత్రమే. 21వ శతాబ్దికి చెందిన ప్రసిద్ధ సినీ నటులు అమ్రీష్ పురి, ఓం పురి; పాత్రికేయుడు, రచయిత బలరాజ్ పురి; రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ కె.ఆర్. పురి; వ్యాపారవేత్త, ఇండియా టుడే ఎడిటర్-ఇన్-చీఫ్ అరుణ్ పురి తదితరులు అసలు సిసలు పురు వంశీకులు అవుతారు. పురు వంశీకులు వేద కాలం నుంచి నేటి కాలం వరకూ పంజాబ్, దాని చుట్టుపక్కలే ఉన్నారు.
ఓం పురి

ఓం పురి

ఇక యయాతి కొడుకైన తుర్వసునితో కృష్ణ దేవరాయలను పెద్దన ముడిపెట్టాడని చెప్పుకున్నాం. దీని వివరాలలోకి వెళ్ళడం మరింత ఆసక్తిదాయకం.  రాంభట్ల కృష్ణమూర్తి(వేద భూమి) ప్రకారం, యయాతి తండ్రి నహుషుడు పశ్చిమాసియాకు చెందినవాడు. మ్లేచ్ఛ భాషలో నహుషుడు అనే మాటకు కొండచిలువ అని అర్థం. ఆనాడు వైదికార్యులకు పశ్చిమాసియాతో దగ్గరి సంబంధాలు ఉండేవి. పశ్చిమాసియా నుంచి వాయవ్య భారతం వరకూ ఆనాడు ఆర్యావర్తంగా ఉండేదనిపిస్తుంది.  వేదార్థ నిర్ణయం చేసేటప్పుడు కొన్ని మాటలకు ఆర్యభాషల్లో అర్థం దొరకనప్పుడు మ్లేచ్ఛ భాషార్థాన్ని చూడమని పూర్వమీమాంసా సూత్రకర్త జైమిని చెప్పడాన్ని రాంభట్ల ఉదహరిస్తారు. యయాతి కొడుకు తుర్వసుని పేరులోని ‘తురు’ అనే మాటకు మ్లేచ్ఛ భాష అయిన సుమేరులో ‘పల్లం’ అని అర్థం. తుర్వసును సుమేరులు ‘తుర్కీ’ అంటారు. నేటి టర్కీ యే ఈ తుర్కీ. సుమేరు భాషలో ‘కీ’ అంటే భూమి అని అర్థం. తుర్కీ అంటే పల్లపు భూమి. తుర్వసు అనే మాటలోని వసువుకూ భూమి అనే అర్థం. ‘తురుష్కులు’ అనే మాట కూడా తురు నుంచే పుట్టిందని ఎక్కడో చదివిన జ్ఞాపకం. ఆవిధంగా చూసినప్పుడు, పదిహేనో శతాబ్దికి చెంది, దక్షిణ భారత రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలను కేవలం తుళువ/తుర్వసుల మధ్య ఉన్న స్వల్పమైన ఉచ్చారణ సామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తుర్వస వంశీకునిగా చెప్పడం myth making లో మన కవుల ప్రావీణ్యానికి మచ్చు తునక.

 –కల్లూరి భాస్కరం

 

 

 

Download PDF

1 Comment

  • chintalapudivenkateswarlu says:

    భాస్కరంగారూ!
    పూర్వం ఎక్కడో చదివాను శివాజీని కూడా ఇలాగే పట్టాభిషేక సమయంలో కాశీపండితులొకరు వచ్చి ముందు క్షత్రియుడుగా మార్చి తరువాత పని ముగించినట్లు. ఇలా చెప్పుకుపోతే చాలా వుంటాయి. అసలు కౌరవ వంశమే సంకరమైనట్లు ఎవరూ సుక్షత్రియులు కానట్లు మహాభారతం చెబుతోంది. ఇక ఈకాలంలో సంగతి చెప్పేదేముంటుంది? మీ వ్యాసం చాలా బాగుంది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)