బతుకు బండి

Batuku Bandi

venu photo

ఇప్పటికైతే వేణు గురించి చెప్పడానికేం లేదు. ఇతను ఒక మామూలు జర్నలిస్టు. రైతు కడుపున పుట్టిన బిడ్డ. 27 ఏళ్ల పడిలో తోటి సమాజం కోసం బెంగ పెట్టుకుని రచయిత అయ్యాడు. బందరులో పుట్టి హైదరాబాద్‌లో జీవిక కొనసాగిస్తున్నాడు.  తొలి కథ ఈ ఏడాది జనవరిలోనే సాక్షిలో ప్రచురితమైంది. ఇప్పుడిది అతని రెండో కథ. మరి నమ్మొచ్చో లేదో మీరే చెప్పాలి. — వేంపల్లెషరీఫ్‌

 ***

 ‘నీకు అక్క చెల్లెళ్లు లేర్రా దొంగలంజి కొడకా… మనిషన్నాక నీతుండాల్రా’ ప్యాసింజర్‌ రైలు బోగీలో రెండు బాత్రూంల మధ్య ఉన్న స్థలంలోంచి అరుపులు మొదలయ్యాయి. సమయం రాత్రి పన్నెండున్నర. ఏప్రిల్‌ మాసాంతంలో… చల్లని గాలి బోగీ మొత్తాన్ని ఆక్రమించి.. చెవుల్లో హోరు పెడుతుంటే… ఆ హాయిని ఆస్వాదిస్తూ ఆదమరిచి నిద్రపోతున్న వాళ్లందరూ ఆ గోలకు లేచారు.

బాత్రూంలకి ఎదురుగా నాలుగడుగుల  దూరంలో సింగిల్‌ సీట్లో ఉన్న నాకూ మెలకువ వచ్చింది.

‘పొయ్యి నీ అమ్మకు పెట్టరా ముద్దు  బాడ్కో నా కొడకా’ అంటూ ఆ ఇరవై ఎనిమిదేళ్ల స్త్రీ ఎర్ర చొక్కా అతనిపై గట్టిగా అరుస్తోంది. ఆమె పక్కనే ఆమె మూడేళ్ల పాప… బతికే ఉందా? అని సందేహం కలిగించే రీతిలో నిద్రపోతోంది.

‘నువ్వేగా నా ఒళ్లో తలపెట్టావు’ అంటున్నాడా అపరిచితుడు. పీకలదాకా తాగి ఉండటంతో మాటలు తడబడుతున్నాయి.

‘నోరు ముయ్యిరా. ఎక్కువ మాట్టాడితే ఎడంకాలి చెప్పుతో కొడతా నా కొడకా’ అని గట్టిగా అరిచిందామె.

‘ఓయ్‌… ఏమయ్యోయ్‌’ అన్న ఆమె పిలుపుకి నా పక్కనే కింద పడుకుని ఉన్న ఆమె భర్త లేచాడు. ‘ఏమయ్యింది మే’ అంటూ వాళ్ల దగ్గరికి వెళ్లాడు. అతని ఎర్రచొక్కా వెనకంతా మురికి. అతనూ కైపు మీద ఉండటంతో అడుగులు తడబడుతున్నాయి.

‘ఈడు నన్ను ముద్దు పెట్టుకున్నాడయ్యా’ అని చెప్పింది భర్తతో.

‘నా కొడకా’ అంటూ ఆమె భర్త అతని పైకి వెళ్లాడు.  ఇద్దరి వయసూ దాదాపు ముప్పైఐదు ఉంటుంది.

‘ఆమే నా ఒళ్లో పడుకునింది’ అంటున్నాడా అపరిచితుడు.

ఆ ముగ్గురూ టిక్కెట్లు లేకుండానే రైలు ఎక్కారని చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. టిక్కెట్టు లేని ప్రయాణం చట్టరీత్యా నేరం. సమాజరీత్యా లేకీతనం. లేకీవాళ్లతో మనకెందుకు అనుకున్నారో ఏమో… ఎవరూ వాళ్ల గొడవలో వేలు పెట్టలేదు.

‘ఆ నా కొడుకుతో మాటలేంది చెప్పుతో కొట్టక’ గట్టిగా అరిచిందామె. రెచ్చిపోయిన భర్త ఆ అపరిచితుడిపై కలబడ్డాడు. అతను ఒక్క తోపు తొయ్యటంతో వచ్చి నా కాళ్ల దగ్గర పడ్డాడు.

‘చెప్పుతో కొడతా’ అంటూ తూలుతూ చెప్పు చేతిలోకి తీసుకునేలోపే.. ఆ అపరిచితుడు తన కుడికాలి చెప్పుతీసి అతని నెత్తి మీద నాలుగు కొట్టాడు.

‘తప్పు నువ్వుచేసి నా మొగుణ్ని కొడుతున్నావేందిరా బాడ్కో’ అంటూ ఆమె వాళ్ల దగ్గరికొచ్చి ఆ అపరిచితుణ్ని వెనక్కి లాగింది.

‘ఓయ్‌ ఏంది మీ గొడవ. కామ్ముగా ఉంటారా? రైల్లోంచి దింపెయ్యాలా?…’ నాకు అటువైపు బారుసీట్లో కూర్చుని ఉన్న ఓ అరవై ఏళ్ల ముసలాయన గద్దిస్తూ వాళ్ల దగ్గరకొచ్చాడు…. రైలేదో ఆయన సొంత ఆస్తి అయినట్లు.

‘ఈ నీతిమాలినోడు నన్ను ముద్దుపెట్టుకున్నాడు’ ఆ వృద్ధుడితో చెప్పిందామె.

‘అదే నా ఒళ్లో పడుకుంది’ ఆ అపరిచితుడు అన్నాడు.

‘అది అంటున్నావేందిరా నా కొడకా’ అంటూ ఆమె అతని చెంపపై కొట్టబోయింది. ఆ వృద్ధుడే ఆపాడు.

‘ఏంది.. గోల ఆపరా. ఓయ్‌ రైలు ఆపండయ్యా వీళ్లని దించేద్దాం’ అన్నాడా వృద్ధుడు.

భయపడ్డారో ఏమోగానీ ఆ అపరిచితుడు బోగీ అవతలి వైపునకు వెళ్లాడు. భార్యాభర్తలు బాత్‌రూంల దగ్గరికి చేరారు.

అది బెంగుళూరు నుంచి గుంటూరు వస్తున్న ప్యాసింజర్‌. నా వేసవి సెలవులు ముగియటంతో కాలేజీకి బయలుదేరాను నేను. బళ్లారి నుంచి గుంటూరుకు డైరెక్టుగా ప్యాసింజర్‌ బండి లేదు. నేను నరసరావుపేటలో దిగాలి.ప్యాసింజర్‌ అయితే ఖాళీగా ఉంటుంది. రిజర్వేషన్‌ గొడవ ఉండదు. పైగా చార్జీ చాలా తక్కువ. బళ్లారిలో డైరెక్ట్‌ టిక్కెట్టు తీసుకుని… రాయచూరు ప్యాసింజర్‌లో గుంతకల్‌ దాకా వచ్చి ఈ బండి ఎక్కటం మొదటి నుంచీ అలవాటే నాకు. ఆ రోజు ఆ బండి అరగంట ఆలస్యంగా ఆరుగంటలకు వచ్చింది. ఖాళీగా ఉన్న ఓ బోగీ చూసి ఎక్కేశా. సింగిల్‌ సీటు ఓదాన్ని పట్టుకుని కూర్చున్నా. అది బాత్‌రూంలకి ఎదురుగా నాలుగడుగుల దూరంలో ఉంది. కొంచెం మూత్రం వాసన వస్తోంది. కాసేపటికి అదే అలవాటయి పోతుందని నా ధీమా. పది నిమిషాలకి బండి కదిలింది. నా ఎదురుగా ఉన్న బాత్రూంల మధ్యలో ఉన్న స్థలంలో రెండు ప్లాస్టిక్‌ గోతాలున్నాయి. వాటి ఎడమ వైపు సింకు కింద ఓ మహిళ కూర్చుని ఉంది. ఆమె పక్కనే మూడేళ్ల పాప నిద్రపోతోంది. ఆమెను చూస్తే ఎవరికీ ఏ భావనా కలగదు. ఆమె ముఖంలో ఏ కళాకాంతీ లేవు. లోకంలోని అన్యాయాలన్నీ ఒక్కసారిగా దాడిచేస్తే.. భరిస్తూ.. నానాటికీ కృసిస్తున్న తీరుగా ఉంది.

Batuku Bandi

‘ఓయ్‌ ఎవరయ్యా ఈ గోతాలు ఇక్కడ పెట్టింది. బాత్‌రూంకి అడ్డంగా.’ అంటూ ప్రశ్నించాడో యాభైఏళ్ల వ్యక్తి.

‘మాయేనండి’ ఆ స్త్రీకి పక్కనే డోర్‌ దగ్గర కూర్చున్న ఆమె భర్త వచ్చి చెప్పాడు.

‘ఏమున్నయ్యి వాటిలో’ అడిగాడా వ్యక్తి. ‘బేల్దారి సామాను, గిన్నెలండి’ చెప్పాడు భర్త.

‘బెంగుళూరులో మేస్త్రి పనులు అయిపోయినట్టా’ అడిగాడా యాభై ఏళ్ల వ్యక్తి.

‘ఆ.. వానాకాలం వస్తందిగా… ఇక కట్టడం పనులు పెద్దగా సాగవు. ఊళ్లో పనులు మొదలవుతయ్యి. అందుకే వస్తన్నాం’ చెప్పాడు భర్త.

బండి మద్దికెర రాగానే ఎర్రచొక్కా వేసుకున్న ఓ వ్యక్తి ఎక్కాడు. అతని దుస్తులు కొంచెం మాసిపోయి ఉన్నాయి. జుత్తు చింపిరిగా ఉంది. గడ్డం బాగా మాసి ఉంది. అతణ్ని చూస్తే వస్తువులు కాజేసే మాదిరిగా కనిపించాడు నాకు. బోగీలో కాసేపు అటూ ఇటూ తిరిగి మాయమయ్యాడు. డోన్‌లో బండి ఆగింది.

‘ఓయ్‌…పిల్లకి తినటానికి ఏదన్నా తీసుకరాపో’ అని అడిగిందామె భర్తని.

‘ఇక్కడేమీ ఉండవే’ అన్నాడతను.

‘ఉండవంటావేంది. అదిగో వాళ్లు దోసెలు తెచ్చుకుని తింటంటే’ ప్రశ్నించిదామె.

‘ఇంటికి పొయ్యి తిందాంలేమే’ చిరాకుగా చెప్పాడతడను.

‘ఇంటికి పొయ్యేలకి తెల్లారుద్ది. అప్పటిదాకా పిల్ల ఎలా ఉంటది.’ అందామె.

ఆమె పోరు భరించలేక దిగివెళ్లి రెండు ఇడ్లీలు తెచ్చాడు.

‘రెండే తెచ్చావేంది’ ఆమె విరక్తిగా ప్రశ్నించింది.

‘నా దగ్గర డబ్బులు లేవుమే’ అన్నాడతను

.‘తాగటానికయితే ఉంటయ్యా’ ఆమె కోపంగా అంది. పాపను లేపి నోట్లో పెడుతుంటే.. అతనే ఒకటి తినేశాడు.

ఓ అరగంట తర్వాత భర్త బాత్రూంలోకి వెళ్లాడు. ఓ ఖాళీ క్వార్టర్‌ మందు సీసాతో బయటకి వచ్చి తలుపులోంచి బయటకు విసిరేశాడు. మరి కాసేపు అక్కడక్కడే తిరిగి వచ్చి నా పక్కన కింద అలాగే పడుకున్నాడు. బండి నంద్యాల దాటింది. బయటి నుంచి చల్లగాలి ఎక్కడో కురుస్తున్న వాన వాసనను మోసుకొస్తోంది. బోగీలో దాదాపుగా అందరూ కూర్చునే కునిక పాట్లు పడుతున్నారు. ఈ ఏడాదితో డిగ్రీ అయిపోతుంది. తరువాత ఏం చెయ్యాలో ఆలోచిస్తూ కూచున్న నేను. బాత్రూంల దగ్గర మహిళ ఆ దారికి అడ్డంగా అలాగే వాలిపోయి విశ్రమిస్తోంది. అట్టలు కట్టిన ఆమె జుత్తు గాలికి భారంగా కదులుతోంది. ఆమె దుస్తులు బాగా మాసి ఉన్నాయి. ఆమెకు అటువైపుగా రెండు బాత్రూంల మధ్యలో పాప ఉంది. ఇంకా నిద్ర పోలేదు. రెండు చేతులూ గాల్లోకి ఎగరేస్తూ ఆడుకుంటోంది. మధ్యలో కిలకిలా నవ్వుతోంది. ఆ నవ్వు చాలా ముచ్చటగా ఉంది. చిన్నారి జాకెట్టు.. పరికిణీ కూడా మాసి ఉన్నాయి. అయితే నిర్మలమైన ఆ నవ్వు ముందు మాలిన్యం లెక్కలోకి రావటం లేదు. నిర్మలత్వానికి ఉన్న శక్తి నాకు మరోసారి బోధపడింది. రాత్రి పదిన్నర సమయంలో భర్త లేచి తూలుతూ ఆమె దగ్గరికి వెళ్లాడు..ఆమె తల దగ్గర కూర్చుని మరో క్వార్టర్‌ బాటిల్‌ ఖాళీ చేసి సీసా బయటికి విసిరేశాడు. ఓ బీడీ వెలిగించాడు. ఆమె ఒకసారి మెడ లేపి అతణ్ని చూసింది. పాపని పక్కన పడుకోబెట్టుకుని మళ్లీ నిద్రలోకి జారకుంది. అతను కాసేపు అక్కడే కూర్చుని మళ్లీ తిరిగొచ్చి ఇందాకటి స్థానంలో నిద్రపోయాడు. బండి కంబం దాటింది. ఇందాక మాయమైన ఎర్రచొక్కా అపరిచితుడు ఆకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. కాసేపు అటూఇటూ తిరిగాడు. ‘దొంగ’ అని అతనిపై ముందే నాకు గట్టి అభిప్రాయం ఏర్పడటంతో అతణ్ని గమనిస్తూ కూర్చున్నా. కొంత సమయం ఆమె తల పక్కన ఉన్న గేటు దగ్గర నుంచున్నాడు.  తర్వాత ఆమె తల పక్కన కూర్చున్నాడు. తీక్షణంగా ఆమెను గమనించటం ప్రారంభించాడు. నాకు అనుమానం పెరిగింది. అయితే ఆమె ఒంటిమీద వీసమెత్తు బంగారం కూడా లేదు. ఏం చేస్తాడో చూద్దామని అలాగే చూస్తూ కూర్చున్నా. ఆశ్చర్యంగా ఆమె తన తలను అతని ఒళ్లో పెట్టింది. కాసేపటికి అతను ఆమె తలపై నిమరటం మొదలు పెట్టాడు. ఓ అరగంటదాకా ఆ తంతు చూశాక.. హాయి గాలి మళ్లీ నన్ను నిద్రలోకి లాక్కెళ్లింది.

మెలకువ వచ్చే సరికి ఎదురుగా గోల. నాకు ఏమీ అర్థం కాలేదు. ఆమె కదా నేను చూస్తుండగానే అతని ఒళ్లో తల పెట్టి పడుకుంది. అతను అంతసేపు తలపై నిమిరినా నిశ్శబ్దంగా ఉంది. మరి ఇప్పుడు ఎందుకు కేకలేస్తున్నట్టు. వృద్ధుడి కేకల తర్వాత బోగీలో మళ్లీ గాలిహోరు మొదలైంది. బాత్‌రూంల దగ్గర భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు.

‘ఇందాక నువ్వు నా పక్కనే కూసింటివే. ఆడిది కూడా ఎర్ర సొక్కానే ఆయె. ఆడు నువ్వే అనుకున్నా. అందుకే ఒళ్లో తలకాయ పెట్టా. అయినా ఆ నా కొడుక్కి నీతి ఉండొద్దా’ ఆమె భర్తతో చెప్పింది. నాకు అసలు విషయం బోధపడింది. ఆమెను తప్పుగా అనుకున్నందుకు కొంచెం బాధపడ్డా.‘వాడు పీకలదాకా తాగి తూలతన్నడు.. వాణ్ని కొట్టలేకపోతివే.. తోస్తే అక్కడిపోయి పడితివి.. నీ చాతగాని చచ్చినోడా’ ఆమె భర్తను కొంచెం గట్టిగానే తిడుతోంది.‘ఆడు మూరకంగా ఉన్నాడుమే. రాచ్చసి నాయాలు.’ అని ఏదో సర్ది చెబుతున్నాడు భర్త. ఆమె పట్టించుకోవటం లేదు. కాసేపటికి అతను లేచివచ్చి యథాస్థానంలో పడుకున్నాడు. ఆమె నిద్రపోలేదు. పాప బొజ్జపై మెల్లగా జో కొడుతూ కూర్చుంది. బండి మార్కాపురం దాటింది. బోగీ సగం ఖాళీ అయ్యింది. ఈ సారి ఆమెను మరింత పరీక్షగా గమనించాను నేను. ఆమెకు చదవటం కూడా వచ్చి ఉండదు. భర్తే ఆమె ప్రపంచం అయ్యుండాలి. నిర్లిప్తంగా డోర్‌లోంచి అలా బయటకి చూస్తూ కూర్చుందామె. కాసపేపటికి అపరిచితుడు అక్కడికి వచ్చి డోర్‌ దగ్గర నుంచున్నాడు. వాడి మీద ఇంతెత్తున లేస్తుందనుకున్న ఆమె.. ఏమీ పట్టనట్లు అలాగే పాపను జోకొడుతూ కూర్చుంది. ‘నువ్వేగా నా ఒళ్లో తలపెట్టింది’ అంటూ అతను ఆమె పక్కనే కూర్చున్నాడు.ఆమె ఏమీ అనలేదు. కనీసం పక్కకి కూడా జరగలేదు. అతను ఇంకా ఏదో చెబుతుంటే వినీ విననట్లు కూర్చుంది.

‘నేను కాగితాల యాపారం జేస్తా.. వారానికి రెండు వేలు సంపాదిస్తా’ అతను చెప్పాడతను. ‘మీరు యాడనుంచి’ అని అడిగాడా వ్యక్తి. తాగి ఉండటం వల్లో ఏమో ఏ బెరుకూ లేకుండా కొంచెం పెద్దగానే మాట్లాడుతున్నాడు.

‘బెంగళూరులో బేల్దారి పనికి పోయినాం. ఇప్పుడు అయిపోయినయ్యి. అందుకే మా ఊరు దొనకొంద వచ్చేత్తన్నాం.’ చెప్పిందామె.

‘నా పెళ్లాం చచ్చిపొయ్యింది. నాకు మద్దికెరలో ఓ పాతకాగితాల కొట్టుంది. గుంటూరులో నా పెళ్లాం అన్న కూతురి పెళ్లి ఉంటే పోతన్నా’ అని అడక్కుండానే ఆమెతో చెప్పాడతను. కాసేపటికి ఇద్దరూ మాటల్లోకి దిగారు.

‘నీ మొగుడు బాగా సంపాదిత్తాడా?’ అడిగాడా అపరిచితుడు.

ఆ మాటతో ఆమెను మరింత నిర్లిప్తత ఆవహించింది. ‘ఏం చెప్పాలి. నా మొగుడు సచ్చినోడికి ఎప్పుడూ తాగుడు గొడవే. పెళ్లాంపిల్లలు తిన్నారో లేదో కూడా పట్టదు ఆ ఎదవకి. నా కూలి డబ్బులు కూడా తీసుకుని ముండల దగ్గరికి పోతాడు గాలినాబట్ట. ఆడపిల్లను కని నా ఎదన పడేస్తివేందే అని ఎపుడూ కొడతా ఉంటాడు. పీక పిసికి చెరువులో పడేస్తే పోద్ది అంటడు. ఆడి తల్లి అలాగే అనుకుంటే ఆడు ఉండేవోడా? నేను ఎక్కడ సుకపడిపోతానో అని నా ఎదానెయ్యటానికి ఆడితల్లి ఆణ్ని కనింది. పెళ్లాన్నికాపాడుకునే దయిర్యం కూడా లేదు చాతగాని నాబట్టకి’ ఆమె తన ఆక్రోశాన్నంతా వెళ్లగక్కింది.

‘నాతో వచ్చియ్యి. నిన్ను రానిలా చూస్కుంటా. ఆడితో నీకు ఎందుకు. నీ పిల్లని చదివిత్తా’ అతను అడిగాడతను.

అతని ధైర్యం చూసి నాకు మతిపోయింది.

‘తాగుబోతు సచ్చినోల్లని ఎప్పటికి నమ్మాలి? తాగుబోతోడిది పందిబుద్ధి. ఎప్పటికీ బరదలోకే  లాగుతుంటది.’ అందామె.

‘అది కాదు. నేను ఒట్టు పెడతన్నాగా… నిన్ను బాగా చూసుకుంటా.. వచ్చియ్యి నాతో’ అభ్యర్థించాడా వ్యక్తి.

‘చెపితే అర్దమవదా నీకు… తాగుబోతు ఎదవా’ ఆమె కోపంగా అంది.

ఇక అతను ఆ మాట మర్చిపోయాడు. ఇంకా ఏవేవో మాట్లాడుకోవటం ప్రారంభించారు. ఇప్పుడు అతను ఆమె తొడపై కొడుతూ మాట్లాడుతున్నాడు. జేబులోని వందనోట్లు మాటిమాటికీ బయటకుతీసి చూపిస్తున్నాడు. అతని మాటలకు ఆమె మెల్లిగా నవ్వటం ప్రారంభించింది. ఆమె కూడా అతని భుజంపై తడుతూ మాట్లాడుతోంది. నా పక్కనే కింద ఆమె భర్త శవంలా నిద్రపోతున్నాడు. కొంతసేపటికి ఇద్దరూ నావైపు పదేపదే చూడటం మొదలెట్టారు. నాకు కొంత అనుమానంగా తోచింది. వాళ్ల వైపే చూస్తూ కూచున్నా. చల్లగాలికి మళ్లీ నా కళ్లు మూతపడ్డాయి. ఓ పావుగంట తర్వాత ఎందుకో మెలకువచ్చి చూస్తే.. వాళ్లిద్దరూ కనిపించలేదు. పాప అలాగే నిద్రపోతోంది. ఈ మధ్యలో ఏ స్టేషనూ వచ్చినట్లు లేదు. మరి ఎక్కడికి వెళ్లారు. బాత్రూంలలో ఎడమ వైపు ఉన్నది మూసుకుని ఉంది. నా అనుమానం బలపడింది.  ఓ ఐదు నిమిషాల తర్వాత అది మెల్లగా కొంచెం తెరుచుకుంది. ఐదు సెకన్ల అనంతరం ఆ స్త్రీ మెరుపువేగంతో బయటకు వచ్చి… అంతే వేగంగా పాప పక్కన పడుకుంది. ఐదు నిమిషాల తర్వాత అపరిచితుడు కూడా బాత్రూంలోంచి బయటకు వచ్చి… నా పక్కనే ఉన్న బారు సీటులో కిటికీ పక్కన కూర్చున్నాడు. బండి వినుకొండ దాటింది. టైం మూడున్నర. ‘వినుకొండ వచ్చిందా’ ఆమె భర్త అకస్మాత్తుగా లేచి నన్ను అడిగాడు.‘ఇప్పుడే దాటింది’ అని చెప్పా. ‘మేయ్‌ అంటూ అతను లేచెళ్లి భార్యను తొందర పెట్టాడు. ఆ గోతాలను కొంచెం ముందుకు లాగాడు. అపరిచితుడు వెళ్లి వాళ్ల పక్కనే నిలుచున్నాడు.  వాళ్లు దొనకొండలో దిగాలి. అక్కడ బండి నిమిషం కన్నా ఎక్కువ ఆగదు. పైగా ఆ ప్లాట్‌ఫాం ఎత్తు చాలా తక్కువ. బండి ఆగింది. ఆమె పాపను ఎత్తుకుని దిగింది. గోతాలు దించుకోవటానికి భర్త ఇబ్బంది పడుతుంటే ఆ అపరిచితుడు సాయం చేశాడు. బండి కూతపెట్టింది.

‘బండి కదలతంది. వచ్చి సాయం పట్టన్నా’ అని నన్ను పిలిచాడతను. వెళ్లి ఓ చెయ్యి వేశా. బండి మెల్లిగా కదిలింది.‘పొయ్యొస్తాం అన్నా’ అని నవ్వుతూ ఆ అపరిచితుడితో చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయిందా స్త్రీ. నా తల మరోసారి గిర్రున తిరిగిపోయింది. నిమిషం పాటు రెప్ప వేయకుండా అలాగే శూన్యంలోకి చూస్తూ నుంచున్నా. ‘రెండు గుక్కలు విస్కీ తాగటానికి బాత్‌రూంలోకి తీసకపొయ్యింది ఆమె. మంట మంట అని అరిచింది.’ అంటూ ఆ అపరిచితుడు సగం ఖాళీగా ఉన్న మందు సీసా బయటకు తీసి మూత తొలగిస్తూ అటువైపు వెళ్లిపోయాడు. ఈ సారి నా బుర్ర పనిచెయ్యటం మానేసింది. మరో పది నిమిషాల తర్వాత నా స్టేషన్‌ వస్తే దిగిపోయాను నేను.

*

—- వేణుబాబు మన్నం

(కథాచిత్రం అందించిన మహీ బెజవాడకు ధన్యవాదాలు)

Download PDF

7 Comments

  • అత్యధిక మానవ జీవితాలు నిరాసక్తంగా గడిచే ఘడియలతోనూ, మూస సంఘటనలతోనూ, ఏ ప్రత్యేకతా లేని వ్యక్తులతోనూ నిండి ఉంటాయి. వాటి నుండి తెరిపిన పడటానికి, జీవితాల్లో లేని దేన్నో దొరకబుచ్చుకోటానికి మనం సాహిత్యాన్ని ఆశ్రయిస్తాం (or any other art form, for that matter). కథల్లో కూడా అదే రకం మనుషులు, అవే సంఘటనలు ఎదురైతే? Fiction deserves to be based on events that are more than ordinary. ఆ కోణంలో చూస్తే రచయిత తన దైనందిన జీవితంలోని ఓ ప్రయాణఘట్టాన్ని ఉన్నదున్నట్లు ఉటంకిస్తున్నట్లు అనిపించిందే తప్ప ఇది ఓ కథలా అనిపించలేదు. దీన్ని చదివాక ‘అయిపోయింది’ అన్న భావన తప్ప మరే అనుభూతీ నాక్కలగలేదు.

    అయితే, కథకుడు కథలోకి చొరబడి పాత్రల వ్యక్తిత్వాలపై తీర్పులీయకుండా నిగ్రహం పాటించిన వైనం చూస్తే – రచయితకి కథ చెప్పే నేర్పు ఉందనిపించింది. కథాంశం మీద దృష్టి పెడితే ఇంతకన్నా మంచి కథలు రాయగలడనిపించింది.

  • balasudhakarmouli says:

    కథ nannu vismayunni chesindi…. pedarikam- ఈ vyavasthanu nadipistunna dabbulu kosam denikainaa purikolputhundani ఈ కథ- tetathellam chesindi……. baagaa ఆలోచిస్తే- ఈ కథ saadharanangaa anipisunnaa – lolopala గొప్పగా మెలిపెట్టే అంశం వుంది. kathaki వందనం…. పాత్రలకు వందనం…..

  • aparna says:

    కథాంశం ఎంతో బావుంది. ఇంకాస్త నేర్పుగా రాసి ఉంటే అద్భుతమైన కథగా మారేది. కొంచెం మధురాంతకం నరేంద్ర గారి కథ లా అనిపించింది.. కాని మీ వయసుకి ఇది మంచి కథే..hearty కంగ్రాట్స్!!

  • ఆకలి తో రగిలి పోతున్న ప్రాణాలకు ముందు వెనకలతో పని వుండదు. ఒక్కో సారి ఆశలు, కోర్కెలు కూడా!
    అలాటి బ్రతుకుల్లో నీతి వెతకడం, వృధా ప్రయాసే!
    కథ కంటేనూ, కథని మన దృష్టికి తీసుకొచ్చిన విధానం బాగుంది.

  • Padmakar Daggumati

    దరిద్రుల జీవితాలపై యేహ్యత కనపరచక పోవడం రచయితకున్న ఒక గొప్ప లక్షణం. చివరికి చెప్పీ చెప్పకుండా కథలోని అపరిచితుడి పక్షం వహించడం బాగుంది. ‘ఆమె 2 గుక్కలు విస్కీ తాగింది ‘ అని ఆమె కేరెక్టర్ కాపడటానికి అతడి నోటితోనే చెప్పించడం అసలు ట్విస్టు. రైలు ప్రయాణాల్లో ఎదురయ్యే ఇలాంటి వాళ్ళగొడవల వెనక దాగి ఉన్న నిర్లిప్తత,మానవత్వం, ప్రేమ, దయ, అన్నింటినీ ఈజీగా తీసుకునే అనివార్యపు స్పందనలు వంటివి ‘వి. రాజారామ మోహన రావు ‘ కథల్లో తనివితీరా దొరుకుతాయి. ఈ కథతో వేణు ఆయనను, ఆయన కథలని గుర్తుకు తెచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాలి. మంచి కథ.

  • padmarpita says:

    మనసుని కదిలించిన కధాగమనం

  • Naga lakshmi Yenuganti says:

    చదివించిన సారంగాకు వందనం.. కథకి వందనం…పాత్రలకు వందనం…న్యాయ నిర్ణేతలాకాకుండా మనుషులను మనుషులుగానే చూసిన రచయిత “వేణుమన్నం”కు (చిన్నవాడైనందున) నిండునూరేళ్ళు,ఇంకామంచికఠలు రాయటానికి “వినాయకునికి” నివేదనలు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)