హోరు

ఇంటికి దగ్గరలో ఎలాటి సముద్రమూ లేదు, పోనీ అలాగని ఏ చిటాకమో చివరికి నీళ్ళగుంట అయినా లేదు. అయినా నాపిచ్చి గాని మూసీ మీదే ఆక్రమణలూ అద్దాల మేడలూ వచ్చాక ఇంకా నదులూ చెరువులూ ఎక్కడ? అయితేనేం ఈ సముద్రపు హోరు ఎక్కడిది? కొంచెం ఇలా ఏకాంతం వాలితే చాలు చెవులు దిబ్బళ్ళు వేసేట్టు ఈ హోరు…

నేనూ సమత చిన్నప్పుడు సముద్రం పక్కన బీచ్ లొ గంటలు గంటలు గడిపినా ఇలా ఎప్పుడూ అనిపించలేదు. అవును అప్పట్లో మద్రాస్ బీచ్ కి దగ్గరలో ఉన్న చిన్న ఇంట్లో పక్కపక్క పోర్షన్స్ లోనే ఉండే వారం ఇద్దరమూ . ఇంట్లో అమ్మ , నేను ,ఇద్దరు తమ్ముళ్ళు …నాన్న. నాన్నకు టీ నగర్ లో ఇరవై నాలుగ్గంటలూ కిటకిటలాడే బట్టల దుకాణం.

పొద్దున్న పూజా పునస్కారాలు భోజనం చేసి షాప్ కి వెళ్తే మళ్ళీ ఆయన తిరిగి వచ్చేది అర్ధరాత్రి పన్నెండు దాటాకే ,అందుకే మా చదువులు , మంచి చెడులన్నీ అమ్మే చూసుకునేది.

పక్కింట్లో ఉండేది సమత ,వాళ్ళమ్మ దేవిక ఇద్దరే . వాళ్ళ నాన్న గురించి ఎవరూ ఎప్పుడూ అడగలేదు , కాని దేవకీ గారు మాత్రం  మొహాన రకరకాల బొట్లు రోజుకొ రకం అలంకరించుకునే వారు.  ఆవిడ ఏదో ఆఫీస్ లో పెద్ద అఫీసరని చెప్పుకునే వారు.వాళ్ళ నాన్న మాత్రం ఎదో తప్పుచేసి ఇల్లు వదిలేసి వెళ్లిపోయాడని అనేవారు.  కాని ఒక్కరోజూ సమత కాని, వాళ్ళమ్మ గాని అయన ఊసే ఎత్తే వారు కాదు.

ఒకే కాంపౌండ్  లో ఉన్న రెండు ఇళ్ళు కొన్నప్పుడు; ఇద్దరికీ పెద్ద అభ్యంతరం అనిపించలేదు. కష్ట సుఖాల్లో , పండుగ పబ్బాల్లో కలిసి మెలిసి ఉండే వారం.

వాళ్ళింట్లో తల్లీ కూతుళ్లిద్దరూ ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడే వారు. దేవకీ గారే మంచి కాన్వెంట్ లో చదువుకున్నారట. అసలు సమత తండ్రి గురించి ఎవరికీ తెలియదు. పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కూడా కాదు. దేవకీ గారు కొత్త కొత్త ఫాషన్లు వదిలిపెట్టకుండా అనుకరిస్తూ ఎప్పుడు చూసినా ఉత్సాహానికి మారుపేరులా ఉండే వారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఒక నిశ్చలమైన నదిలా ఎంతో అందంగా మనోజ్ఞంగా అనిపించేవారు.

సమత మా ఇంట్లో అందరితోటీ చాలా బాగా కలిసిపోయింది. మాఇంట్లో అమ్మ చేసే మల్లెపూల లాంటి ఇడ్లీలు, క్రిస్పీ దోశలు  ఎంతో ఇష్టంగా తినేది. అమ్మకూడా ఇంట్లో అమ్మాయి లాగానే చూసేది. ఏ పండగ వచ్చినా మాతో పాటు సమతకూ రకరకాల డ్రెస్ లు కొనేది. ఏ జాతరకో, పుణ్యక్షేత్రానికో వెళ్ళినా పూసలో, గాజులో కొనకపోతే అనుకోవాలి.

“ఎంతైనా ఆడపిల్ల ఉండే కళే వేరు “ అనేది.

“ పోనీ మించిపోయిందేమిటి , మరోసారి ..”అంటూ ఏడిపించేవాడు నాన్న.

నాకేమో దేవకీ ఆంటీ సాండ్ విచ్ లు , టోస్ట్ లు లాటివి బావుండేవి. చిన్నప్పుడు ఒకసారి  నా పుట్టిన రోజుకి  ఆవిడ కొనిచ్చిన పూలపూల చొక్కా ఎంత ఇష్టమో — అమ్మ చెప్పేది , రోజూ అదే వేసుకునే వాడినట … ఉతకాలి మొర్రో అన్నా వినకుండా … చివరికి అది దాచిపెడితే గాని వేరే షర్ట్ ఏదీ వేసుకోలేదట.

పిల్లలకి ఏ ఇల్లు ఎవరిదని పెద్ద తేడా కూడా తెలిసేది కాదు. అమ్మ ఇంటికి సుదూరంగా మరో రాష్ట్రం లో ఉన్నా పద్ధతులన్నీ తూచా  తప్పకుండా పాటించేది. ఆషాడ మాసంలో బోనాల పండుగ , బతుకమ్మ పేర్చడాలు,కృష్ణాష్టమి…పెద్దలకు బియ్యాలు ఇవ్వడం    వాటిన్నింటికీ దేవకీ గారు , సమత మాతోపాటే ఉండే వారు .అల్లాగే దేవకీ గారు వరలక్ష్మీ వ్రతం, అట్ల తద్దె , సంక్రాంతి పెద్ద గొప్పగా చేసినప్పుడు మేమందరం అక్కడే ఉండే వారం.

పేరుకి రెండు ఇళ్ళయినా ఎప్పుడు  ఎవరు ఎవరింట్లో ఉంటారో ఎప్పుడూ తెలిసేది కాదు.

చిన్నప్పుడు ఇద్దరం కలిసే చదువుకునే వాళ్ళం, ఒకరికొకరం సాయపడే వాళ్ళం. సమతకు లెఖ్ఖలు రావని నేను సాయం చేస్తే, తను నాకు ఇంగ్లీష్ హోమ వర్క్ చేసి పెట్టేది.

తొమ్మిదో తరగతిలో అనుకుంటా ఒకసారి సాయంత్రం ఆరున్నర దాటాక నా ఇంగ్లీష్ హోం వర్క్ కోసం వాళ్ళింటికి వెళ్లాను ఎప్పటిలా , తలుపు ఓరగా వేసుంది. కాస్త జడిపిద్దామని శబ్దం కాకుండా తలుపు తీసి లోపలకు అడుగు పెట్టె లోపలే దేవకీ గారి స్వరం వినబడింది,

“ నువ్వలా మాటిమాటికీ వాళ్ళింటికి వెళ్ళడం ఏంబాగాలేదు, ఇది వరకులా చిన్నపిల్లవు కాదు, అయినా వాళ్ళింట్లో అమ్మాయిలు ఉంటే అదో దారి అందరూ అబ్బాయిలే . ”

“ అమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు.నిన్నటి దాకా లేని తేడా ఇప్పుడెందుకు వస్తోంది, ” సమత గట్టిగానే అడిగింది.

“ ఆడపిల్లలు నిన్నటి దాకా ఉన్నట్టు ఇవాళ ఉన్నారా? నిన్నటిదాకా ఉన్నట్టు నువ్వున్నావా? ఉద్యోగం చేసినంత మాత్రాన ఇష్టారాజ్యంగా వదిలేయ్యనా? అమ్మగా నా బాధ్యతా నాది. నీ హద్దుల్లో నువ్వు ఉండటం మంచిది. పెరిగిన పిల్లవు,” నిశ్శబ్దంగా వెనక్కు వచ్చేశాను.

ఈ దెబ్బకు సమత నాతో మాట్లాడదనుకునాను కాని మర్నాడు సాయంత్రమే స్కూల్ అయాక ఇద్దరం బీచ్ కి వెళ్లి దూరంగా రాళ్ళమీద కూచున్నాం.

“చిన్నప్పటినుండి కలసిపెరిగాం , అప్పుడు లేని హద్దులు ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పు? ఏదేమైనా కానీ నిన్ను చూడందే,మాట్లాడందే నేను ఉండలేను, ” ఖచ్చితంగా చెప్పింది.

అవును అంతకు ముందు బహిరంగంగా అందరిముందూ కలిసి తిరిగే వాళ్ళం , ఇప్పుడు పెద్దలకు తెలియకుండా.

సమత కాలేజీ చదువుకు వచ్చేసరికి నాన్నకు కూడా ఏదో పెద్ద బిజినెస్ ఆఫర్ వచ్చి మద్రాస్ నుండి హైదరాబాద్ మారిపోయాం . అదేం చిత్రమో సరిగ్గా మేము మారే సమయానికి దేవకీ గారికి కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది.

ఇద్దరి ఇళ్ళూ కలిపి రియల్ ఎస్టేట్ వాడికి పెద్ద లాభానికే ఇచ్చేశారు.

హైదరాబాద్ లొ మంచి లొకేషన్ లొ ఇద్దరికీ పక్కపక్కనే ఇళ్ళు చూశాడు నాన్న.

కాలేజి చదువులకు వచ్చాక ఒకరికొకరం పెద్దగా సాయపడలేకపోయినా రోజుకోసారైనా కలిసి జరిగేవి జరుగు తున్నవి ఒకరికొకరం చెప్పుకుని చర్చించుకునే వాళ్ళం .

చివరికి ఇద్దరం  డాక్టర్లమైతే కష్టమని ,ఇల్లు వాకిలీ ఎవరు చూడాలని నేను మెడిసిన్ కి వెళ్తే తను ఫాషన్ డిజైనింగ్ లొ చేరింది.

మనకు ఇద్దరు పిల్లలు చాలు ఒకరిని మెడిసిన్ మరొకరిని ఇంజనీరింగ్ చదివిద్దామని అనుకున్నాము. మేము సెకండియర్ లో ఉండగా చిన్నగా మొదలయ్యాయి ఈ కొత్త గోడలు.

ఎప్పుడో 69 లో అణిగిపోయిన ప్రాంతీయత రాజకీయ లబ్ది కోసం మళ్ళీ తెర మీది కొచ్చింది.

గొడవలు గొడవలుగా ఉంది. ఎప్పుడు కాలేజీలు మూసేస్తారో ,ఎవరు ప్రాణ త్యాగం అంటారో తెలియడం లేదు. సమత కాస్త ఉదాసీనంగా మారిపోయింది.

“ ఈ రాజకీయాలు మనకెందుకు చెప్పు, మనం పరిచయం అయిన రోజున ఉన్నాయా ఇవి, మనం ఒకరిని వదిలి ఒకరం బ్రతకలేమనుకున్న రోజున ఉన్నాయా?”

ఎన్నో మార్లు నచ్చజెప్పాను. “ అవును రవీ , అసలు నువ్వు లేకుండా నేను జీవితాన్నే ఆలోచించలేను. అదేమిటో విడివిడిగా చూస్తే అదివేరు ఇదివేరు అనిపిస్తుంది. కాని అడుగడుగునా ఆచారాలు, పద్ధతులు , ఆనవాయితీలు మళ్ళీ ప్రాంతాల పైనే ఆధారపడి ఉన్నాయి. అంతెందుకు , కూరల్లో పులుసూ బెల్లం వేసుకుంటామని ఆంటీ యే మొదట నవ్వేవారు. అల్లాగే మీరు అన్నిట్లో ఇంత అల్లం వెల్లుల్లి ముద్దా పారేస్తారని మా వాళ్లకు ఈసడింపు. ఏం అర్థం కావటం లేదు రవీ ” అనేది.

ఈ రెండేళ్ళుగా మా రెండిళ్ళ మధ్య కాస్త స్నేహ వాతావరణం తగ్గిందనే చెప్పాలి. ఎవరిల్లు ఎవరి సరదాలు వాళ్ళవిగా ఉంది. బహుశా మా ఇంట్లోనూ  మార్పు అనేది చల్లగా ఏ మూల నుండో దూరి ఉంటుంది.

ఒకరినొకరు పిలుచుకోడం తగ్గిపోయింది. కూరలు వంటలు ఇచ్చిపుచ్చుకోడాలు తగ్గిపోయాయి. అమ్మకు మా ప్రాంతం అనే గర్వం కాస్త వచ్చింది.

“ఇంకెంత ఇవ్వాలో రేపో తేలిపోతుంది. ఎగబడి వచ్చిన నా బిడ్డలంతా తోకముడుసుకొని పోవాలె “అనేది, రెండుమూడు సార్లు నేనే విన్నాను.

“వెర్రినామొహాలు అంతా  నవాబుల చేతుల్లో పెట్టి కూచ్చున్నారు,ఇప్పుడు నాలుగక్షరాలు నేర్చే సరికి పనికిరాకపోతున్నాము” దేవకీ గారు రుసరుసలాడేది.

నాకు నవ్వొచ్చేది.

ఈ నేల ఈ గాలి ప్రతి వ్యక్తీ వాళ్ళ అబ్బ సొత్తు  అయినట్టు దెబ్బలాడుకోడం… మొన్నమొన్నటి వరకు వాళ్ళూ, మేమూ పరాయి రాష్ట్రంలోనే గా ఉన్నాము. అక్కడి వాళ్ళు మమ్మల్నిలా వేరుగా చూడలేదే. మా పనేదో మేం చేసుకున్నాం, కలిసోచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాం.

మరి పుట్టి పెరిగిన చెన్నై మా స్వంత రాష్ట్రమైతే ఇది ఇద్దరికీ వేరే రాష్ట్రమేగా?

ఎక్కడి నుండి పుట్టుకు వస్తోంది ఈ స్వార్ధం నాదనే స్వార్ధం , నేల నాది గాలి నాది ఆకాశం నాదనే స్వార్ధం? వీటికి నేనేం చేశాను? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇప్పుడిక్కడికి వచ్చి మా తాతల నేల నాదనడం?

ఎక్కడికక్కడ ఇలా గోడలు కట్టుకుంటూ పొతే చివరికి ఎవరి చుట్టూ వారికి ఒకగోడ , ఎవరి చుట్టూ వారికి ఒక సముద్రం , దాని హోరు మిగులుతాయేమో!

అమెరికా వెళ్ళినా అంతరిక్షాని కెళ్ళినా ఇక్కడి హక్కులు మాత్రం భద్రంగా  పదిల పరచుకునే తీరతారా ? నా మాతృభూమికి నేనేం చెయ్యగలనన్నది ఆలోచించాలి గాని ..

ఇవెక్కడైనా పోనీ నా సంగతీ, సమత సంగతీ తేలాలి.

ఖచ్చితంగా ఈ జీవిత సగభాగం సమత తప్ప మరొకరు కాలేరు.

భగవంతుడా ఈ హోరునుండి  ఎలా బయట పడాలి?

సమతను కలుసుకుని మూడు రోజులైంది. ఉహు తను కనిపించకపోతేనే తోచదు.

సాయంత్రం సమతను కలిసే వరకూ ఆ హోరు అలాగే కొనసాగింది.

చీకటి పడ్డాక కూడా చాలా సేపు బిర్లా మందిర్ మెట్లమీద అలా కూర్చుండి పోయాం నిశ్శబ్దంగా.

ఎప్పటికో ఏదో చెబ్దామని తలెత్తాను .సరిగ్గా అదే ఉద్దేశ్యంతో సమత నావైపు చూసింది.

ఇద్దరమూ మాట్లాడలేదు.

మళ్ళీ కాస్సేపటికి కాస్త స్థైర్యం కూడగట్టుకుని పెదవి కదిపాను.

“సమతా ఈ ప్రాంతీయ విభజన ఇవ్వాళా జరగవచ్చు, మరో పదేళ్లకు జరగవచ్చు, జరక్కపోనూ వచ్చు. మనం మాత్రం చిన్నప్పటినుండీ పెంచుకున్న ప్రేమ వృక్షం ఇప్పుడిలా ఎవరికోసమో నరికేసుకోము. కాని నీకూ నాకూ సంబంధించినంతవరకే కాదు రేపటి మన బిడ్డల తరానికీ ఈ హోరు , ఈ ఏకాంతపు పోరు వద్దు సమతా. మనబిడ్డలు ఎక్కడి వారవుతారు? ఆలోచించు సమతా ఏ ప్రాంతమయినా మన ఇద్దరిదీ నువ్వు వేరు నేను వేరు కానప్పుడు , నాకు సంబందించిన వన్నీ నీవి, అలాగే నీకు చెందిన వన్నీ నావికూడా. ఏమంటావు”

సమత మాట్లాడలేదు. సుదూరంగా కనిపిస్తున్న బుద్ధ విగ్రహాన్ని చూస్తోంది.

నా మనసులో హోరు మాత్రం చిత్రంగా మాయమయింది.

“రా సమతా , వెళ్దాం చాలా రాత్రయింది” లేచి చెయ్యందించాను.

***

swathi –స్వాతి శ్రీపాద

 

 

 

 

 

 

 

 

Download PDF

11 Comments

  • buchireddy gangula says:

    రవి –సమత— లు పెళ్లి చేసుకొని పిల్లల తో హైదరాబాద్ లో
    హాయిగా — జోరుగా జీవించవచ్చు —ప్రాంతీయ విభజన తో
    వారిద్దరూ నష్ట పోయిందంటూ ఏమి లే దు .
    స్వాతి గారు — విభజన ఎందుకో– దేనికో —ఎంతకాలం నుండి
    పోరు సాగుతుందో—-ఎన్ని ఆత్మ బలిదానాలు ??ఎంతగా
    మోసపోయామో—ఎంత దోపిడీ —?? యిప్పటికి తెలంగాణా
    పక్రియ మొదలు కాగానే —యింకా అనేఖ తిరులతో -అడ్డంకులు కలిపిస్తూ
    —-ఎందుకు ?? దేనికి — విడి పోతే వోరిగేది ఏమిటి — ??
    స్వాతి గారు — చరిత్ర చదవండి- నిజాలు చూడండి —నిజాలు రాయండి
    యిక మీ కథ ఇన్ కంప్లీట్ గా —-
    ———————————————-
    బుచ్చి రెడ్డి గంగుల
    ———————————
    నోట్–రిప్లై ఇవ్వాలనుకుంటే –పెన్ నేమ్స్ తో కాకుండా స్వంత పేర్లతో రాయండి — మనవి

    • స్వాతీ శ్రీపాద says:

      విభజన వద్దని నేను అనలేదు. ఇద్దరు సామాన్యుల అంతరంగం మాత్రమె రాశాను. పుట్టి పెరిగి నిజామాబాద్ లోనే చదువుకున్న నాకన్నా విభజన ఎందుకో– దేనికో —ఎంతకాలం నుండి
      పోరు సాగుతుందో—-ఎన్ని ఆత్మ బలిదానాలు ??ఎంతగా
      మోసపోయామో—ఎంత దోపిడీ —?? యిప్పటికి తెలంగాణా
      పక్రియ మొదలు కాగానే —యింకా అనేఖ తిరులతో -అడ్డంకులు కలిపిస్తూ
      —-ఎందుకు ?? దేనికి — విడి పోతే వోరిగేది ఏమిటి — ?? అనే వారిఅంతరంగమేమితో ఎవరికీ ఎక్కువ తెలుస్తుంది.
      ఇది కేవలం ప్రేమ గురించి అంటే. ఈ సంఘర్షణలో ప్రేమ విలువ గురించి

    • అంకిత్ says:

      —-ఎన్ని ఆత్మ బలిదానాలు ??

      బలిదానాలు అంత గొప్పవైతే అవి చేసి చూయించాలే కానీ వేరేవాళ్ల సమాధుల మీద బంగళాలు కట్టుకోవాలని చూడకూడదు. ఎవరి వాదాలు వాళ్లు ప్రచారం చేసుకోండి. ప్లీజ్, ఆత్మహత్యల్ని మాత్రం గ్లోరిఫై చెయ్యొద్దు..

      అంకిత్

      • buchireddy gangula says:

        అంకిత్ గారు —
        వేరే వాళ్ళ సమాధుల మిధ గోరీలు కట్టుకునేది ఎవరు ??కారణం లేకుండా
        ఎవ్వరు తమ ప్రాణాలను త్యాగం చెయ్యరు సర్ –56 ఏళ్ళ నుండి బానిస బతుకు తో —ఆకలి అరుపులతో — అలమటిస్తూ — గడిపినా మా జీవితాలు
        మీకు అర్థం కావు సర్ —తెలంగాణా కు అన్యాయం జరిగిందా లేదా — –
        చదివీ రాయండి —
        వేయి మంది కి పయిగా అత్మబలిదానాలు —చెప్పుకోవడం లో తప్పు లే దు
        హిందీ రాష్ట్రాలు ఉండగా 2 తెలుగు రాష్ట్రాలు ఉండటం లో తప్పు ఏమిటి ?
        బుచ్చి రెడ్డి గంగుల

  • స్వాతీ శ్రీపాద says:

    కధ అసంపూర్తి కాదు ప్రేమ గెలుస్తుందా ప్రాంతీయాభిమానమా ముగింపు ఏమిటనేది కాలమే చెప్పాలి .

  • ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాటి రచనల ఆవశ్యకత ఎంతైనా వుందని చెప్పక తప్పదు.
    స్వాతి గారూ, గొప్ప సాహసమే చేసారు సుమీ!
    :-) నాకు చాలా నచ్చేసింది కథ, కథాంశం కూడా.
    .
    హార్దికాభివందనాలతో..

  • buchireddy gangula says:

    ఎన్ని కథలు రాసుకున్నా — ఎన్ని గాయాలు రాసుకున్నా —
    తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తీరుతుంది —
    తెలుగు తల్లి– తెలుగు జాతి– అన్ని వొట్టి మాటలు —తెలంగాణా కు
    మోసం– దోపిడీ — అన్యాయం —(నీళ్ళు– నిధులు – నియామకాల్లో )
    చేసినపుడు తెలంగాణా వాళ్ళు తెలుగు వాళ్ళు అని గుర్తుకు రాలేదా —??
    ————-బుచ్చి రెడ్డి గంగుల
    ఎడిటర్స్– దయతో– ఒపిని ఏన్స్ చెప్పుకోనివ్వండి –ప్రాంతీయ బేధాలు వద్దు

  • aparna says:

    స్వాతిగారు…మీ కథ హృద్యంగా ఉంది. నిజమే, నేను కుడా పెళ్ళిళ్ళలో ఇదో కొత్త ప్రస్తావన చేరిందని విన్నా..కాని ఒకవేళ ప్రాంతీయతకే సమత ఓటేస్తే మాత్రం బాధనిపిస్తుంది..

  • Rammohanrao says:

    రచయిత /రచయిత్రి సమకాలీన సమస్యలను విశ్లేషిస్తూ కథలు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం రగులుతున్న సమస్యను ఆధారంగా చేసుకుని విశ్లేషణాత్మక కథని మనముందుంచారు స్వాతి గారు.కథా ప్రక్రియ పరంగా కథ బాగుంది .చేయి తిరిగిన రచయిత్రి అదేం పెద్ద కష్టం కాదు.ఇంకో విషయం రచయిత్రికి రెండు ప్రాంతాల నేపథ్యం ఉంది.ఇరు ప్రాంతాల పై అభిమానమూ ,సమదృష్టి కూడా ఉన్నాయి. అది కథలో ద్యోతకమవుతుంది.ఈ సందర్భంలో నాకో పద్యం గుర్తుకు వస్తుంది.నాకు గుర్తున్నంతవరకు ఇది నేను నేర్చుకున్న తోలి పద్యం.మీ అందరికీ తెలిసిందే. కూరిమి గల దినములలో
    నేరములెన్నడును కలుగ నేరవు మరి యా
    కూరిమి విరసంబైనను
    నేరములే తోచుచుండు నిక్కము సుమతీ.
    దీన్ని రెండు తల్లి పాత్రల ద్వారా చక్కగా చూపించారు.రవి పాత్ర లోకి రచయిత్రి పరకాయ ప్రవేశం చేశారు.అంతాబాగుంది. ముగింపు సమంజసమే .కాని ఎక్కడో అంతర్లీనంగా తెలంగాణా వేర్పాటును
    సమర్థించనట్లు అన్పిస్తుంది.అదొక్కటే అభ్యంతరం.ఎందుకంటే మన రెండు ప్రాంతాల వాళ్లే కాదు రెండు రాష్ట్రాలకు చేందిన కుటుంబాలైనా అన్యోన్యంగా ఉండవచ్చు.అది పెళ్లి దాకా దారి తీయవచ్చు.దానిని నేను పూర్తిగా సమర్థిస్తాను.కథలో రవి నిర్ణయం తో నేను ఏకీభవిస్తాను.రేపు రెండు ప్రాంతాలు విడిపోయినా ఇలాంటి సత్సంబంధాలు కోరుకోవాలి.ఇక ఇప్పటి పరిస్థితుల్లో కలిసి కలహించుకునే కంటే విడిపోయి ప్రేమించుకోవడమే సబబు.ప్రాంతాలు విడిపోయినంత మాత్రాన మనుషులు విడిపోనక్కరలేదు.ఏది ఏమైనా మంచి కథ రాసి మనసుల ప్రక్షాళనలకు దారి చూపిన స్వాతిగారికి అభినందనలు.

  • buchireddy gangula says:

    రవి గారు
    కొంత వరకు నిజం చెప్పారు
    ప్రాంతాలుగా విడిపోయినంత మాత్రాన బంధుత్వం — స్నేహాలు చెరిగి పోవు –
    నా ఫ్యామిలీ లో వోదినలు — మరదళ్ళు —Nellore — చిత్తూర్ కు
    చెందిన వాళ్ళు— కలిసే ఉంటున్నాం— ఈవెన్ రాజస్తాన్ సంభంధాలు కూడా
    చేసుకున్నాం —
    అంతగా గగ్గోలు పడ వలిసిన పని లే దు.–
    నేటికి ముస్లిమ్స్ పరాయి వాళ్ళలాగా చూడటం జర్గుతుంది –అంటరాని తనం యింకా ఉంది —
    యివన్ని దేనికి ??ఎందుకు
    ఏది అయినా మనం చూసే చూపులో ఉంది — మన ఆలోచన విధానం లో ఉంటుంది
    తెలంగాణా విడి పోయి వేరే దేశం కావడం లే దు —అందరం జీవించేది భారత దేశం లోనే —
    చిన్న రాష్ట్రాల ఏర్పాటు తో — పరిపాలన చక్కగా ఉంటుందని —అమెరికా లో నేను చూస్తున్న నిజాలు
    జై తెలంగాణా –యీ tegimpu
    –యీ కోరిక –యీ పోరాటం —నాలుగున్న ర కోట్ల గుండె చప్పుడు —ఏ రాజకీయం లే దు
    సుమారు నాలుగు ఏళ్ళ నుండి ఏదో ఒక రోజు తెలంగాణా ఏర్పడుతుందని —అందరి కి తెలుసు
    యిప్పుడు రబస ఎందుకు —కథలు ఎందుకు — గేయాలు ఎందుకు —మీరంతా అప్పుడు ఎక్కడున్నారు ?
    —————-బుచ్చి రెడ్డి గంగుల

  • స్వాతీ శ్రీపాద says:

    నాలుగేళ్ళు కాదు నలభై మూడేళ్ళు ,69 లోనో ఇంత భీభత్సంగానో గొడవలు జరిగాయి.వాటికి ప్రత్యక్ష సాక్షులం .అయితే పెళ్ళయి చేసుకుని ఉండటం వేరు చేసుకోబోయే ముందు ఆలోచనలు వేరు. ఇక్కడ కన్విన్సింగ్ పాయింట్ ఏదేమైనా అనుబంధం వీగిపోకోడదని.
    నేనెక్కడా విభజన వద్దని అనలేదు. నలభై సంవత్సరాలకిమ్ద పెళ్లి జీవితం ముగిసిపోతున్నా ఇప్పటికీ చిన్న చూపు లేదా వీరుగా చూసే ఇళ్ళు నాకు తెలుసు.
    ఇక్కడ సమస్య విభజన కాదు ఆలోచన అనుబంధం అంతే

Leave a Reply to స్వాతీ శ్రీపాద Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)