వినాయకచవితి జ్ఞాపకం: మాష్టార్ని చూస్తే దిగులు!

నామాల మురళీధర్

నామాల మురళీధర్

“ఒరేయ్ పిల్ల రాక్షసుల్లారా! వినాయకచవితంటే పిల్లల పండగరా. వినాయకుడు విద్యలకు అధిపతి. ఇళ్ళళ్ళోనే కాదు బడిలో కూడా పూజలు చేయాలి. వినాయకుడ్ని కాదంటే చదువబ్బక మొద్దు వెధవల్లా తయారవుతారు.

ఒరేయ్ పిలక పంతులు, మీ గుడికి కొబ్బరికాయలు, అంటిపళ్ళొచ్చాయంట కదా. ఒకటో,రెండో కొబ్బరికాయలు ఒక అరడజను అంటిపెడ పట్రా. ఒరేయ్ కరణంగారబ్బాయ్ మీ ఇంటికి వెల్ల వేస్తున్నారంట కదా. సాయంత్రం కాస్త పట్టుకొచ్చి మన బడిగోడకి కొట్టెయండ్రా” అని ఇంకా ఏదో చెబుతున్న సూర్నారాయణ మాష్టారి మాటలకు అడ్డుపడుతూ కరణంగారబ్బాయ్ లేచాడు.

“పంతులుగారూ, ఇంటి నుండి వెల్ల తీసుకొచ్చి వేస్తే మా నాన్న తంతాడండి” అని వినయంగా విన్నవించుకున్నాడు.

“ఒరేయ్ సన్నాసి, మా ఇంటికొచ్చి వెల్లవెయ్యమన్నానా? బడికే కదా. రోజూ మీరే కదరా ఈ స్కూల్లో కూర్చుని చదువుకునేది. మీ నాన్న ససేమిరా అంటే ఏ సాయంత్రమో ఎవరూ చూడకుండా పట్టుకొచ్చెయ్యాలి కానీ, ఇవన్నీ నేను చెప్పాలట్రా మీకు?” అని లౌక్యం చెప్పారు మాష్టారు.

“దొంగతనం తప్పు కదండీ” అన్నారెవరో వెనకనుండి. పిల్లలంతా గొల్లుమన్నారు.

“ఆ తప్పండి. ఎవడ్రా ఆ అడ్డగాడిద ఆ కిరాణకొట్టు కిష్టి గాడేనా? ఏరా పక్కింటి పంతులమ్మగారి దొడ్లోకి దూరి జాంకాయలెత్తుకు రావటం మాత్రం తప్పు కాదేం? నువ్వు మీ కొట్లో నుండి బియ్యం, పప్పులు పట్రాపో అప్పుడు చెప్తాను వెధవ” అని వెక్కిరిస్తూనే వాడి వాటా ఏంటో చెప్పేసారు మాష్టారు.  “ఒరేయ్ నామాలవారబ్బాయ్ పసుపులు,కుంకుమలులాంటి పూజసామాన్లు ఇంటి నుండి పొట్లాలు కట్టి నువ్వు పట్రా” అని నా సంగతి తేల్చారు.

“మరి పూలు,పత్రి ఎవరు తెస్తారర్రా?” అని అందరిని చూస్తూ అడిగారు.

“పంతులుగారూ, ఆ ఢిల్లీ బామ్మగారింటి పెరట్లో చాలా రకాల పూలున్నాయండి. సాయంత్రం చేసి చీకట్లో కోసుకొచ్చేస్తాను” అన్నాడు తుంటరి పరమేశంగాడు.

మాష్టారు విలాసంగా నవ్వారు. అంతలోనే ఏదో గుర్తొచ్చి “ఒరేయ్ కోతి వెధవ దొరికిపోతే నా పేరు గానీ చెప్పావ్. తాటతీస్తాను” అని హెచ్చరించారు. ఆ అలవాటేనేమో ఇప్పటికీ ఒక పువ్వో, కొమ్మో ఏదో ఒకటి దొంగతనంగా ఎత్తుకొచ్చి వినాయకుడికి పెట్టకపోతే, ఎంత పూజ చేసినా తృప్తే ఉండదు.

ఇన్నేళ్ళొచ్చి ఇంట్లో ఎంత ఘనంగా చేసుకున్నా వినాయకచవితంటే చప్పున గుర్తొచ్చేది మాత్రం పొడుగ్గా, సన్నగా చెఱుకుగడలా ఉండి, తెల్ల జుబ్బా వేసుకుని, షోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని తిట్లతో అందరికీ తలంటు పోస్తూ, తాను నవ్విస్తూ, మా అందరినీ నవ్వించిన సూర్నారయణ మాష్టారే. తుప్పుపట్టిన పాత సైకిల్‌కి ఒక సంచి తగిలించుకుని తిరిగే సూర్నారయణ మాష్టారే.

ఇలా దసరా అనో, వినాయక చవితనో ప్రతి పండగకి పంతులుగారి భత్యాలని ఏదో ఒకటి తెమ్మంటున్నారని మాష్టారంటే చిన్నప్పుడు చాలా కోపం ఉండేది. కొంతమంది తల్లిదండ్రులు బడికొచ్చి మాష్టార్ని నిలదీసేవాళ్ళు కూడా. పాపం మాష్టారు మా దగ్గరే తప్ప ఊర్లో నోరెత్తేవారు కాదు. ఎవరైనా వచ్చి అడిగితే తడబడిపోయి నీళ్ళు నములుతూ నేల చూపులు చూసి వారికి ఏదో సర్దిచెప్పేవారు. అదేంటో గమ్మత్తుగా మాష్టారి మీద అంతవరకూ ఉన్న కోపం పోయి మా మాష్టార్ని ఇలా అందరిముందు నిలదీస్తారా అని ఉక్రోషం వచ్చేసేది. తల్లిడండ్రుల్ని బడికి తీసుకు వచ్చినవాడితో పిల్లలంతా ఒక జట్టుగా కొన్నిరోజులు మాట్లాడకుండా వేలేసేవాళ్ళం.

మాష్టారు అది గమనిస్తే “ఒరేయ్ బడుద్దాయిల్లారా, ఏం పనిరా ఇది? వాడేం చేస్తాడు కుంక. బ్రతకలేక బడిపంతులని, బడిపంతుల మీదకంటే ప్రతివోడు చొక్కా మడతెట్టుకొస్తాడు. సరి సరి వాడినేం అనకండి పాపం” అని వాడిని దగ్గరకి తీసుకునేవారు.

ఆ చిన్న వీధిబడిలో మాష్టారు మాకేం గొప్ప చదువులు చెప్పెయ్యలేదు. కాసిన్ని అక్షరాలు నేర్పారు. అంతకంటే ఎక్కువ చదువు ఆయనకి వచ్చో రాదో నాకిప్పటికీ తెలియదు. కానీ ఆయనకొచ్చినవి, మాకు అక్కరకొచ్చేవి ఆయినా ఆ కాసిన్ని అక్షరాలు, పద్యాలు ఎంతో శ్రద్ధగా చెప్పారు. ఒత్తులు, దీర్ఘాలు స్పష్టంగా పలికేంత వరకూ వల్లెవేయించేవారు.

ఆయనకి అప్పటికే పెళ్ళికెదిగిన కూతురు, ఉద్యోగం లేని కొడుకు ఉండేవారు. పాపం మాష్టారికొచ్చే ఆ గొఱ్ఱెతోక జీతంతోనే కుటుంబాన్ని లాక్కొచ్చేవారు. అది సరిపోక సాయంత్రం ఇంటి దగ్గర మాకు ప్రైవేటు కూడా చెప్పేవారు. పంతులుగారి పెళ్ళప్పుడు కట్నంగా వచ్చాయని చెప్పే ఫ్యాను, రేడియో తప్ప ఇంటిలో పెద్దగా వస్తువులేవీ ఉండేవి కాదు. ఆ పసిప్రాయంలో మా బుర్రలకు తట్టలేదు కానీ ఆ పండగ మామూళ్ళన్నీ ఆ బండెడు కుటుంబాన్ని లాగటానికి ఏమూలకి సరిపోతుంది. “అయ్యవారికి చాలు అయిదువరహాలు. పిల్లలకు చాలు పప్పు బెల్లాలు” అని ఎంతపాడినా అయ్యవారికి అయిదు వరహాలిచ్చే వెర్రిబాగులాడెవడున్నాడు ఆ ఊరిలో.

13_10

వినాయక చవితిరోజు మాష్టారు చెప్పినవన్నీ తీసుకురాకపోయినా, వీలయినవి తీసుకుని వెళ్ళేవాళ్ళం. మాష్టారు “ఏమిరా ఇలా చేసారు” అని కాసేపు నసిగినా అందరిని బుద్దిగా, శ్రద్ధగా కూర్చోబెట్టి నిదానంగా పూజ చేసేవారు. అందరి పేర్లు, గోత్రాలు చెప్పించేవారు. చివర్లో వినాయక వ్రతకథ చెప్పి, అందరి తలల మీద అక్షింతలు చల్లేవారు. పిల్లలు ఎవరూ చెప్పకుండానే వెళ్ళి మాష్టారి కాళ్ళు మొక్కేవారు. మాష్టారు మురిసిపోతూ “ఒరేయ్ బడుద్దాయిలు, పెద్దవాళ్ళయి పెద్ద ఆఫీసర్లయిపోయి ఈ పంతుల్ని, బడిని మర్చిపోకండి” అని మనస్పూర్తిగా దీవించేవారు.

ఉద్యోగంలో చేరాక కూడా ఎప్పుడయినా ఊరు వెళితే రోడ్డు మీద పాత సైకిల్‌తో కనిపించేవారు మాష్టారు. కొడుకుకి పెళ్ళయితే అయ్యింది కాని ఇంకా ఏ పనిలోనూ కుదురుకోలేదు. ఈ వయసులో కూడా కాస్త చత్వారంతో బాధపడుతూ నలుగురైదుగురు పిల్లల్ని వెంటేసుకు తిరుగుతున్న మాష్టార్ని చూస్తే దిగులుగా అనిపిస్తుంది. ప్రైవేట్ కాన్వెంట్‌లు ఎక్కువయిపోవటంతో పంతులుగారి దగ్గరకి పిల్లలని ఎవరూ పంపటంలేదు కానీ మాష్టారి హస్తవాసి మంచిదని అక్షరాభ్యాసం చేసాక ఆయన చేత అక్షరాలు దిద్దించటానికి ఆయన పూర్వ విధ్యార్ధులు తమ పిల్లలను తీసుకు వచ్చి తృణమో, పణమో ఇచ్చి వెళ్తున్నారు.

“వీడిని నా దగ్గరకు పంపకూడదురా నాలుగు రోజులు అక్షరాలు నేర్చుకోవటానికి” అని అక్షరాలు దిద్దుంచుకోవటానికి వచ్చిన ఎవరినైనా మాష్టారు చనువుగా అడిగితే, “మాష్టారూ, ఈ రోజుల్లో చదువులు ఎలా ఉన్నాయో మీకు తెలియదా? పద్యాలు పాతబడిపోయాయి. ఇప్పటి నుండే ఇంగ్లీష్ నేర్పించాలి” అని చెప్పి ఇంకాసేపుంటే ఏమడిగేస్తారో అన్నట్టు అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు.

ఇన్నాళ్ళుగా జీవితమనే యుద్దాన్ని పోరాటానికి వేలమంది దండుని తయారు చేసిన మాష్టారు, యుద్ధమే మారిందో, తన విద్యలే పాతబడిపోయాయో తెలియని వృద్ధ సైనికుడిలా మిగిలిపోయారు. అందమైన అక్షరాల్లో పెట్టలేకో, అమ్ముకోవటం చేతకాకో మరుగునపడిపోయిన ఇలాంటి బీద బడిపంతుల్ల ఆత్మకథలన్నీ మధురకావ్యాలే.

సూర్నారయణ మాష్టారూ, ఆ విద్యలకు అధిపతైన గణపయ్య, విద్యే జీవితంగా గడిపిన మీకు చల్లగా చూడాలని ప్రార్ధిస్తున్నా.

 

Download PDF

29 Comments

  • వ్యాసం బాగున్నది. మీ సూర్య నారాయణ మాష్టారు గారి ఫొటో ఉంటే అప్లోడ్ చెయ్యండి. ఈ రోజున ఉన్న సాంకేతికత మా రోజుల్లో లేక, కంటికి ఎదురుగా తిరుగుతున్నా మా మాష్టార్లని , వారి గుర్తులను పదిలపరుచుకో లేకపొయ్యాము.

    • Mandagondi Naresh says:

      డియర్

      ఇట్’స రియల్లీ నైస్ అంది ! నాకు చాల తొఉచ్య్గ రాసారు అని పించింది !!

      • Mandagondi Naresh says:

        సర్,

        తెలుగు టైపు చాల ప్రమాదం !
        మీరు బాగా రాసారు.
        ఈ వ్యాసం చక్కగా వుంది. మీ కధనం నాకు కూడా కొన్ని గుర్తులు తెచింది.

      • చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు సంతోషం

    • శివరామప్రసాద్‌గారూ,
      ఫోటో తెచ్చే పయత్నం చేస్తాను. చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు సంతోషం

  • కె రామలక్ష్మి (ఆరుద్ర)గారి అక్క గారు కామేశ్వరి గారు నాకు “టీచర్” గారు. వారితో నా కొడుకు కి “అక్షరాభ్యాసం” చేయించాను.
    ఆండాళి కృష్ణమూర్తి గారు లెక్చరర్ గారు, నాకు కాదు. వారిని “మాస్టారు” అనే పిలుచుకునేవారం. వారితో మా అమ్మాయికి అక్షరాభాస్యం చేయించాను.
    వారందర్ని మళ్ళీ గుర్తు చేసింది మీ జ్ఞాపకం. సంతోషం.

  • మీ మాస్టారు గురించి రాసిన రాతలు చదువుతోంటే నా చిన్ననాటి గురువు అంజయ్య పంతులే గుర్తొచ్చారు. ఆనాటి మధుర జ్ఞాపకాల్ని తవ్వి పైకి తీస్తుంటే ఎంత ఆనందమో కదా !

  • ns murty says:

    మురళీధర్ గారూ,

    మంచి రచనకి గీటురాయి ప్రతిపాఠకుడూ అందులోని వస్తువుతోనో, పాత్రలతోనో తనని, తన జీవితాన్ని/ జీవితంలోని సంఘటనలని అన్వయించుకోడం. మీ రచన ప్రతి పాఠకుడికీ (కనీసం నాలుగుపదులు దాటిన పాఠకులలో చాలామందికి ) తమ చిన్ననాటి గురువులు గుర్తొస్తారనడం అతిశయోక్తి కాదేమో. అన్నిటికీ మించి చిన్నతనంలో గురువులపట్ల ఉండే భయమూ, భక్తీ రెండింటినీ బాగా చెప్పేరు. నిజంగా ప్రపంచాన్ని చూడడానికి కళ్ళుతెరిపింఛిన గురువులందరికీ ఇది నివాళి. అభినందనలతో,

  • sasikala says:

    చాలా బాగా వ్రాశారు . ఆ రోజుల్లోకి వెళ్లి కొంచెం బాధగా అనిపించింది . పిల్లలకి మాష్టార్లకి అనుభంధం ఎందుకు
    ఇప్పడు ఏర్పడటం లేదు అని

    • శశికళగారూ,

      ఇప్పుడు పిల్లల జీవితం ఒక రన్నింగ్ రేసుగా మారిపోయింది. అలానే మాష్టార్ల జీవితాలు కూడా ఆర్ధికంగా స్థిరపడే ప్రయత్నంలో వేగవంతమయిపోయాయి. ఇప్పుడు ప్రేమగా విద్యను పంచే మాష్టార్లు తగ్గిపోయారు, మాష్టార్ని అభిమానించే పిల్లలూ తగ్గిపోయారు. చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు సంతోషం

  • aparna says:

    చాలా touching గా ఉన్దండీ..ఆయన ఆర్ధిక స్థాయి గురించి చెప్పినప్పుడు నాకు కూడా అలాంటి మాస్టార్లు గుర్తుకొచ్చి చాలా బాధనిపించింది. ఇంతమంచి జ్ఞాపకాన్ని మాతో పంచుకున్నందుకు చాలా థాంక్స్!

  • పాపం మాకాలం నాటి పంతుళ్ళు. వీధి బడి పంతుళ్ళు .పిల్లడు బడికి రాకపోతే బెత్తం పట్టుకుని వచ్చి అమ్మ చాటునున్న పిల్లడ్నిని సముదాయించి తీసుకెళ్ళ వచ్చిన రోజులు. అమ్మా !మాష్టారు బెత్తం తెచ్చారు కొడతారు, నేనేళ్ళనంటే బెత్తం విసిరేసి బెత్తం లేదు…. . నిన్నేమీ కొట్ట నని బడికి తీసికెళ్ళిన మాష్టారు. మా బడి గ్రామ పంచాయితీ ప్రెసిడెంటు గారి వీధి అరుగు పైన నిర్వహించాబడేది. అప్పుడు బస్తా వడ్లు మూడు రూపాయలు . మూడు బస్తాలు పిల్లాడికి కొలిచేవాళ్ళు రైతులు నూర్పిడిలో. పాపం మా మాష్టారు సంచులు తెచ్చుకొని కొలిచే దాక నిలుచుని వుండటం నాకు బాధేసి మాష్టారూ వెంకయ్య తాత తెచ్చిస్తాడు మీరెండుకూ నిలబడటం అంటే నాన్నగారు నా వంక చూసి నవ్వి అయ్యో మాష్టారూ నేనే బండి మీద పంపుదామనుకున్నా. మీరెళ్ళండి. అని వారిని పంపడం నేను మా నాన్న గారిని కళ్ళం లో వాటేసుకోవడం నాకింకా గుర్తుంది. సంవత్సరానికి పదిరూపాయలు ఫీజనమాట. కాకుంటే పొలం లో పండే కూరగాయలు , పాలు ,మజ్జిగ … , గానుగ దగ్గర నూనె ఆడించినప్పుడు నూనె ,అన్ని రకాల కూరగాయలు, పాలేరు తో పంపడం ఇంకా గుర్తుంది. అప్పుడప్పుడు మా అక్కయ్య నాతొ కూడా పంపించేది. మా పంతులు గారు నాకు తోడపాయాసం పెట్టడం మా అమ్మకు నచ్చేది కాదు…..నామాల మురళీధర్ గారు తమ అనుభవాలను చక్కగా వ్యక్తీకరించారు. అభినందనలు.

    • నూతక్కి రాఘవేంద్రరావు గారూ,
      ఎన్నో మంచి విషయాలు గుర్తుచేసుకున్నారు. మీరు మీ పంతులుగారి పట్ల చూపిన గౌరవం ఈరోజున మృగ్యమైపోతుంది. ఇలాంటి విషయలు విన్నప్పుడే మమ్మల్ని మేము సంస్కరించుకునేది. చాలా సంతోషం.

  • Radha says:

    మురళి, చాలా సంతోషంగా ఉంది. వినాయక చవితికి మా సుందరరావు పంతులుని స్మరించుకుంటూ అయన మాకు పలకల మీద ఓ బొజ్జ గణపయ్య, గజాననమ్ శ్లోకాలు రాసిచ్చేవారని మా స్కూల్ పిల్లలకి చెప్తూ వాళ్ళకి నోట్సుల్లో రాసిచ్చాను. అందరు టీచర్స్ మన సంస్క్రతిని మన పిల్లలకి అందచేసినపుడు వాళ్ళూ మనల్నిభవిష్యత్తులో గుర్తుకు తెచ్చుకుంటారు.
    అభినందనలు
    రాధక్క

    • రాధక్క,

      మీరు చెప్పేది అక్షరాల సత్యం. మనం సమాజానికి ఏమిస్తామో సమాజం మనకి తిరిగి అదే ఇస్తుందని నా నమ్మకం. ఆనాటి బడిపంతుళ్ళు తాము పంచే విద్యని తూకం వేయలేదు. మనసారా నేర్పించారు. మనసారా ఆశీర్వదించారు. అందుకే మనం ఏ స్థాయికి చేరుకున్నా అదంతా వారి ఆశీస్సులే అని నమ్ముతున్నాం. పలచబడుతున్న మన సంస్కృతిని తిరిగి దక్కించుకోవాలంటే అది బడి నుండే మొదలు కావాలి.

  • Prasuna says:

    చాలా బాగా కళ్ళకు కట్టినట్టు రాసారండీ.

    • కల్లూరి భాస్కరం says:

      చాలా బాగుంది. చాలా ఆర్ద్రంగా రాశారు. మీలో మంచి కథకుడు ఉన్నాడు. మంచి భాష ఉంది. మంచి అభివ్యక్తి ఉంది. అభినందనలు.

    • ప్రసూనగారూ,

      అది నా గొప్పతనం కాదండి. మనందరికీ ఉన్న జ్ఞాపకాలు ఇలా చదివినప్పుడు కళ్ళ ముందు కదులుతాయి. మన జ్ఞాపకాల గొప్పతనమది.

  • Rajasekhar says:

    వ్యాసం అద్భుతంగా ఉంది ..వినాయక చవితి కి గురువు కి ఉన్న గొప్ప సంబంధం కళ్ళకు కట్టారు..నా బాల్యం తెరలు తెరలు గా కళ్ళ ముందు గుర్తుకొస్తుంది..గురువు గారికిచ్చే స్వయంపాకం ..తిరిగి ఆయన మా పలక మీద రాసిచ్చే శ్లోకం…పెద్ద మొత్తం లో స్వయంపాకం ఇవ్వమని అమ్మ తో పోట్లాట… ఎన్నని! …ధన్యవాదాలు Naga Muralidhar Namala

    • నిజం రాజశేఖర్‌గారూ. గురువులతో అనుబంధం స్వార్ధమనేది తెలియని పసితనంలో ఏర్పడటం వలనేమో, ఎప్పటికీ కొనసాగుతుంది. నా ఈ వ్యాసం మీకు తీపి జ్ఞాపకాలని గుర్తుచేసిందంటే చాలా సంతోషం. ఉంటానండి.

  • హ్మ్.. మీ మాష్టారి గురించి చెప్తే మా అందరి జ్ఞాపకాల్లోంచి ఎందరెందరో బడిపంతుళ్ళు దిగులుగా తొంగిచూస్తున్నారేంటో!​
    ​​

  • సందార్భానుసారంగా చాలా బావుంది, మురళీ మీ జ్ఞాపకం! మీ మాష్టారు మా కళ్ళముందే మెదులుతున్నారు..
    ఇక్కడ అమెరికాలో పిల్లలకి వీకెండ్స్ లో తెలుగు నేర్పడానికి మాబడి లాంటివి ఉన్నట్టు అక్కడ కూడా కనీసం వారాంతాల్లో అయినా ఏ సంగీతమో, నాట్యమో నేర్పించినట్టు పిల్లలకి పద్యాలు, శ్లోకాలు లాంటివి నేర్పడానికి మీ మాష్టారు లాంటి వారి దగ్గరికి పంపిస్తే బావుండు కదా!!

Leave a Reply to ns murty Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)