ఎవరి రహస్యం వాళ్ళదే…ఎవరి భాష వాళ్ళదే!

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఆ దుష్యంతు డనంతసత్త్వుడు సమస్తాశాంతమాతంగమ

ర్యాదాలంకృతమైన భూవలయ మాత్మాయత్తమై యుండగా

నాదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో

నాదిక్షత్రచరిత్ర నేలె నజితుండై బాహువీర్యంబునన్

-నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, చతుర్థాశ్వాసం)

దుష్యంతుడు మహాబలవంతుడు; దిక్కుల చివర నున్న ఏనుగులతో అలంకృతమైన భూమండలమంతా తన అధీనంలో ఉండగా; సూర్యకిరణాలూ, గాలీ కూడా చొరలేని మహారణ్యాలను, దేశాలను అజేయ పరాక్రమంతోనూ తొలి క్షత్రియుల నడవడితోనూ ఏలాడని ఈ పద్యం చెబుతోంది.

ఇందులోని భాషా పటాటోపం చూసి ‘మహోగ్రారణ్యా’లతో సహా భూమండలాన్ని ఏలిన దుష్యంతుడు ఎంత పెద్ద రాజో అనుకుంటాం కానీ, కాదు. అలా పటాటోపంగా చెప్పడం పౌరాణిక శైలి. సంపదకూ, అధికారానికీ అప్పటికింకా భూమి కొలమానం కాలేదు. సంపదను గోవులతోనే  కొలిచేవారు. అంటే, నాటికి రాజు గోపతే తప్ప భూపతి కాలేదు.  అసలు సంగతేమిటంటే, నాటి ఉగ్రారణ్యాలను పాలించడాని కంటూ ఏమీలేదు. అప్పటి రాజులకు అవి ఆరో వేలు లాంటివి. పైగా వారి పాలన అరణ్యాలలో చెల్లదు. అక్కడ ఆదివాసులున్నారు. తొలి రాజులు ఆదివాసులను స్వతంత్రజీవనులుగా గుర్తించి వారితో కొంతవరకు సఖ్యంగానే ఉన్నారు. వ్యవసాయ ప్రాధాన్యం పెరిగి, అడవుల్లోకి చొచ్చుకు వెళ్లవలసిన అవసరం ఏర్పడ్డాకే రాజులకూ, ఆదివాసులకూ మధ్య ఘర్షణలు ముదిరాయి. ఆనాటికి మహారణ్యాలను ఛేదించడానికి చాలినంత ఇనుము అందుబాటులోకి రాలేదు. పోడు వ్యవసాయమే ఆధారం. ఇనుము పుష్కలంగా లభించడానికి మరికొన్ని వందల సంవత్సరాలు ఆగాలి. ఇనుము కొరత తీరడంతోనే చాలా మార్పులు జరిగిపోయాయి. జనపదాలు రాజ్యాలు అయ్యాయి. గణాలు జనాలుగా, మహాజనాలుగా మారాయి. అరణ్యాలను పెద్ద ఎత్తున ఛేదించదానికి శ్రామికవర్గం అవసరమై వర్ణవ్యవస్థ బిగుసుకుంది. చివరికి మగధ, కోసల రాజ్యాలతో ఈ సామాజిక పరివర్తన ఒక కొలిక్కి వచ్చింది. అదంతా వేరొక అధ్యాయం.

dushyanta

కాకపోతే, దుష్యంతుడు మహోగ్రారణ్యాలను  ఏలాడన్న కవి, అప్పటికి దేశం అరణ్యమయమనీ, అరణ్యాలు ఇంకా లొంగి రాలేదనే ఒక ముఖ్య చారిత్రక వివరాన్ని అందిస్తున్నాడు.  అదలా ఉంచితే, దుష్యంతుడు ‘ఆదిక్షత్ర చరిత్ర’ తో ఏలాడన్న మాట ఈ వ్యాసానికి ప్రధాన వస్తువు.

నన్నయకు ఇలా ఆదిక్షత్రియులను స్మరించుకోవడం చాలా ఇష్టం. రాజరాజ నరేంద్రుడి గురించి చెబుతూ, అతడు “ఆదిరాజ నిభు డత్యకలంకచరిత్ర సంపదన్’“అంటాడు. “…ఆదిరాజులెల్ల నధిక ధర్మ సత్యయుక్తి జేసి సకల లోకంబులు వడసి భాగదేయ భాగులయిరి” అని అరణ్యపర్వం, ప్రథమాశ్వాసంలో మార్కండేయమునితో ద్రౌపదికి చెప్పిస్తాడు.  ఆది క్షత్రియుల గురించి నన్నయ కలవరింత వెనుక పురాచారిత్రక వారసత్వం చాలా ఉందని నేను అనుకుంటాను. ఎప్పుడో చరిత్రకు అందని కాలంలో (సు)క్షత్రియజాతి క్షీణించిపోయింది. అప్పటినుంచీ సాంప్రదాయిక వర్గాలలో క్షత్రియ క్షీణత ఒక విషాదస్మృతిగా మిగిలిపోయింది. ఒక అఖండగ్రహంలోంచి అర్థభాగం విడిపోయి అదృశ్యమైపోతే, రెండో అర్థభాగం దాని కోసం పరిభ్రమిస్తూ, పరితపించడం లాంటిదే ఇది కూడా. క్షత్రియులు-విప్రులు ఆనాడు ఒక నిరంతరద్వయం. ఒకరి ఉనికికి ఇంకొకరు ఆధారం. ఈ జంట ఒక దశలో సమాజగతిని శాసించింది. మహాభారతంలో అంగారపర్ణుడనే గంధర్వుడు క్షత్రియ-విప్ర అన్యోన్యత గురించి అర్జునుడికి బోధిస్తాడు.  ఎంతో అపురూపమైన ఆ సంభాషణ గురించి మరోసందర్భంలో చెప్పుకుందాం.

అజ్ఞాత కాలానికి చెందిన ఆ విషాదస్మృతి ఒక ఆకాంక్షగా మారి, అంతే అజ్ఞాతంగా వందలు, వేల సంవత్సరాలను దాటుకుంటూ వచ్చి నేటి కాలపు సాంప్రదాయిక వర్గాలలోనూ గుప్తంగా ఉండిపోయింది. అదే ఇక్కడ ఆసక్తికరం.  ‘క్షత్రియులు పరిపాలన చేయా’లనే ఆ ఆకాంక్ష ఈ వర్గాలలో నేటికీ వ్యక్తమవుతుంటుంది. అయితే, మారిన కాలమాన పరిస్థితులలో దానిని యథాతథంగా బయటపెట్టే అవకాశం లేదు కనుక, అది భిన్నరూపాలలో వ్యక్తమవుతుంది.

పాశ్చాత్య ప్రపంచంతో పోల్చితే భారతదేశం ప్రత్యేకత ఇదే. ఇక్కడ పురావారసత్వం పూర్తిగా అంతరించలేదు. దానినే గణసమాజ అవశేషంగా చెప్పుకుంటే, ఆ అవశేషం నేటికీ ఈ దేశంలో పదిలంగానే ఉంది. భారతదేశం వైవిధ్యవంతం అనిపించుకోడానికి అదీ ఒక కారణం. వైవిధ్యవంతం అనే మాట అందరినోటా నలిగి, అరిగి ఇప్పుడు అర్థస్ఫూర్తిని కోల్పోయి ఉండచ్చు కానీ, లోతుల్లోకి వెడితే అది చిత్రవిచిత్ర వాస్తవాలను ఆవిష్కరిస్తుంది. ఒకరకంగా చెప్పుకుంటే, భారతదేశం నేటికీ మహాభారత కాలంలోనూ, మహాభారత సమాజంలోనే ఉంది. దీనినే మరోలా చెబితే, భారతదేశం ఇప్పటికీ క్రీస్తు పూర్వ దశలోనే ఉంది తప్ప క్రీస్తుశకంలోకి అడుగు పెట్టలేదని నాకు అనిపిస్తుంది. క్రీస్తు శకానంతర పరిణామాలు ఇక్కడ సాంకేతిక ప్రాయాలు మాత్రమే.  పాశ్చాత్య సమాజం దృష్టిలో భారతదేశం ఇప్పటికీ ఒక ‘రహస్య’ ప్రదేశం. ఈ ‘రహస్య’ భారతం ఎంతోమంది పాశ్చాత్యులను అన్వేషణకు పురిగొల్పడం (In Search of Secret India- Paul Brunton)  మనకు తెలుసు. నిజానికి భారతదేశం గురించి చెప్పుకునే వైవిధ్యం ఒప్పుడు పాశ్చాత్యంతో సహా ప్రపంచమంతటా ఉంది.  పాశ్చాత్యసమాజం తన వైవిధ్యాన్ని పనిగట్టుకుని తుడిచిపెట్టుకుంది. ఏకశిలా సదృశమైన సమాజాన్ని నిర్మించుకోడానికి ప్రయత్నించింది.  అదో పెద్ద చరిత్ర.  ప్రస్తుతానికి దానిని పక్కన పెట్టి చెప్పుకుంటే,  భారతదేశపు వర్తమానం పాశ్చాత్యసమాజానికి గతం. అది వారిలో ఏవో పురాస్మృతులను రేపుతుంది. భారత్ పట్ల దాని ఆసక్తి, ఆకర్షణల రహస్యం అదే.

ఈ రహస్య భారతంలో, ఏ సమూహానికి ఆ సమూహానికే తమవైన తంతులు, విశ్వాసాలు, సాంస్కృతిక అభివ్యక్తులు, ఆకాంక్షలు ఉన్నాయని గుర్తించినప్పుడు; ఆ సమూహాలను నేను రహస్య సమాజాలు, రహస్య ప్రపంచాలు అంటాను. మళ్ళీ ఈ రహస్య సమాజాల ఉనికి కూడా ఒకప్పుడు ప్రపంచవ్యాప్తమే. ఆ మధ్య డావిన్సీ కోడ్ అనే నవల వచ్చింది. అంతవరకూ పుస్తక పఠనం అలవాటు పెద్దగా లేని యువత కూడా ఆ నవలను విరగబడి చదివింది. అందులోని సస్పెన్స్, థ్రిల్లర్ మసాలా వాళ్ళను ఆకట్టుకుని ఉండచ్చు. వేరే అంశాలు నన్ను ఆకర్షించాయి. అది రహస్య సమాజాల గురించి, గుప్తలిపుల గురించి మాట్లాడుతుంది. అందులో పాశ్చాత్య సమాజాల పురాచరిత్ర ఉంది. ఆ కోణం నుంచి ఆ నవలను ఎవరైనా చర్చించారో లేదో నాకు తెలియదు. అప్పట్లోనే దానిపై నేనొక వ్యాసం రాశాను.

ఇప్పటి సంగతి చెప్పలేను కానీ, నిన్న మొన్నటి వరకు మనదేశంలో ఊరి శివార్లలో కొన్ని రహస్యప్రదేశాలు ఉండేవి. వాటిని పవిత్రమైన తోపులు (sacred groves) అంటారు. మొదట్లో ఆ తోపుల్లో స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉండేది. పురుషుడు వాటిలోకి అడుగుపెడితే విపరీత పరిణామాలుంటాయనేవారు. మన పురాణాలలోనే కాదు, ప్రపంచ పురాణాలలో కూడా ఇందుకు సంబంధించిన కథలున్నాయి. స్త్రీల రహస్య ప్రదేశం లోకి అడుగుపెట్టిన నారదుడు స్త్రీ అయిపోయాడని ఒక పురాణ కథ. ఇటువంటివే జానపద కథల్లోనూ ఉన్నాయి.  ‘జగదేకవీరుని కథ’ అనే సినిమాలో దేవకన్యలు జలక్రీడలాడుతుండగా చూసిన నాయకుడు శిల అయిపోతాడు. పైన చెప్పిన తోపులు క్రమంగా పురుషుల రహస్య ప్రదేశాలుగా మారిపోయాయనీ, వాటిలోకి స్త్రీల ప్రవేశాన్ని నిషేధించారనీ కోశాంబి అంటాడు. మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి జరిగిన పరివర్తనకు అది సూచన.

స్త్రీ, పురుషులు ఒకే కుటుంబంలో, ఒకే ఇంట్లో పక్క పక్కనే ఉంటున్నా ఎవరి రహస్య ప్రపంచాలు వారికి ఉన్నాయనిపిస్తుంది. కొన్ని తంతులలో మా అమ్మ పాటించే గోప్యత, చేసే పనులు నాకు చిన్నప్పుడు విస్మయం కలిగిస్తూ ఉండేవి. స్త్రీలు చేసే నోములు, వ్రతాలు, పేరంటాలు ఒక రహస్య ప్రక్రియలా  అనిపిస్తాయి. వాటి ఆనుపానులు పురుషునికి ఎప్పుడూ పూర్తిగా అర్థం కావు. వాళ్ళు పాడే పాటలు, వాటిలో దొర్లే పలుకుబడులూ పురుషునికి ఎప్పుడూ కొత్తగానే వినిపిస్తాయి. శుభకార్యాలప్పుడు ఆడవాళ్ళు అందరూ చేరి చెప్పుకునే ముచ్చట్లు, చేసే పనులు  పురుషునికి వ్యతిరేకంగా జరిగే ఏదో ‘కుట్ర’ను తలపిస్తాయి. ఈ రహస్య ప్రపంచ వారసత్వం తల్లినుంచి కూతురికి అతి సహజంగా అందిపోయే తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.  ఇక ఉపనయనం తంతు పురుషుల రహస్య ప్రపంచానికి చెందినది. అందులో తల్లి పాత్ర కన్నా, తండ్రి పాత్ర కీలకం.  ఉపనయనం ఒక విధంగా తల్లి ప్రభావాలనుంచి కొడుకును దూరం చేసి, అతనికి పెద్దరికం కల్పించే ప్రక్రియ. ఈ ఉపనయన విధి మన దేశంలోనే, అందులోనూ కొన్ని కులాలలోనే ఉందనేది అపోహ మాత్రమే. ఉపనయనం ప్రపంచమంతటా పురాసమాజాలన్నిటా ఏదో ఒక రూపంలో ఉంది.  దాని గురించి మరెప్పుడైనా చెప్పుకుందాం.

నా చిన్నప్పటినుంచి పోలాల అమావాస్య అనే మాట వింటూ ఉండేవాడిని. మా అమ్మ పోలాల అమావాస్యనాడు కందపిలకను పూజించేది. అది కడుపు చలవకు ఉద్దేశించిన తంతు అని చాలాకాలానికి తెలిసింది. ఆడపిల్లను అత్తవారింటికి పంపేటప్పుడు ఒడి కట్టులో కందపిలకను వేస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఒకానొకప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు అందరూ ఒకే రహస్య ప్రపంచాన్ని పంచుకోవడం! పసిఫిక్ మహాసముద్రంలో టోబ్రియాండ్ దీవులున్నాయి. అక్కడి ఆదివాసుల సౌభాగ్య దేవత పేరు ‘పోలేరు’. వారి ప్రధాన ఆహారం యాం అనే దుంప. పిల్లలు లేని పడతులు ఒక వృద్ధ వనితను ఆశ్రయిస్తారు. ఆమె కడుపు చలవ గల తల్లి కట్టి విడిచిన గడ్డి లంగాను తెచ్చి ఆ పడుచు తల మీద కప్పి, “ఓ పోలేరూ, ఈ పడుచు కడుపు పండించు” అంటూ మంత్రాలు చదువుతుంది. మనకు కూడా పొలి, పోలి, పోలెరు సౌభాగ్య దేవతలే (జనకథ-రాంభట్ల కృష్ణమూర్తి).

images

చెప్పొచ్చేదేమిటంటే, విశ్వాసాలు, ఆచారాలు, ఆకాంక్షలు కాలానికి లొంగినట్టు కనిపిస్తూనే కాలాన్ని ధిక్కరిస్తాయి. కాలాన్ని ఏమార్చడానికి అవి రహస్యాల ముసుగులు ధరిస్తాయి. గుప్తలిపులుగా మారి రహస్య సమాజాలను సృష్టిస్తాయి. ఆదిక్షత్రియుల గురించిన కలవరింత అలాంటిదే నని నేను అనుకుంటాను. అదలా ఉంచి, ఈ దేశంలో ఒకే భాష మాట్లాడుతూ, ఒకే ప్రాంతానికి చెందినవారి మధ్య కూడా నిగూఢత అనే ఇనప తెరలు ఉన్నాయనీ, ఒకరికొకరు తెలియనితనం ఉందనీ ఛళ్ళున చరచి చెప్పిన ఒక ఘటన ఈ సందర్భంలో గుర్తుకొస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు-కొవ్వూరు రైలుమార్గంలో బ్రాహ్మణగూడెం అనే ఊరు, నిజానికి బాపన్న గూడెం అనే పేరుకు అది సంస్కృతీకరణ. ఓ శీతాకాలం సాయంత్రం కొవ్వూరు వెళ్ళడం కోసం బ్రాహ్మణగూడెం స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తున్నాను.  అదో చిన్న స్టేషన్. రైలు లేటు. క్రమంగా చీకట్లు ముసురుకున్నాయి. చలి ప్రారంభమైంది. అంతలో స్టేషన్ ను ఆనుకునే ఉన్న ఓ విశాల ప్రదేశంలో కొంతమంది చెరుకు పిప్పి పోగేసి మంట పెట్టారు. బతుకు జీవుడా అనుకుంటూ నేను కూడా  ఆ మంట దగ్గరికి చేరాను. చూస్తూ ఉండగానే ఆ పరిసరాలలో ఉన్న ఆడా, మగా; చిన్నా పెద్దా అంతా వచ్చి వాలిపోయారు. ఆ వెచ్చదనం ఉల్లాసం నింపినట్టుంది, కబుర్లు ప్రారంభమయ్యాయి. మాటలు ఒకరినుంచి ఒకరికి అంత్యాక్షరిలా ప్రవహించసాగాయి. అవి క్రమంగా సరసాలుగా మారాయి. సరసాలు ఒకరి ‘సంబంధాలు’ ఒకరు కెలుక్కునే వరకూ వెళ్ళాయి. ఆ సమయంలో వాళ్ళ ముఖాలలో విరబూసిన  తుళ్లింతలు, ఇకిలింతలు, చిరునవ్వులు, సిగ్గు దొంతరల కాంతులు  ఆ చలిమంటతో పోటీ పడ్డాయి. పోటాపోటీగా మాటలు రువ్వడంలో ఆడా, మగా ఎవరూ ఎవరూ ఎవరికీ తీసిపోవడం లేదు.

నేను అప్రతిభుడినైపోయాను. నా చెవులను నేను నమ్మలేకపోయాను. సభ్యత గురించి, సంస్కారం గురించి  ‘నా ప్రపంచం’ నాలో నూరిపోసిన నమ్మకాలు ఆ క్షణంలోనే ఆ చలిమంటలో దూకి ఆత్మాహుతి చేసుకుంటున్నట్టు అనిపించింది. ఈ దేశంలో భిన్న సమాజాలు, భిన్న ప్రపంచాల ఉనికి అర్థమయింది.

కోశాంబి అంటాడు:

Better-known religious observances can also be traced back into the primitive or prehistoric past. The holi spring festival, an obscene and nowadays rather  depraved saturnalia, has dancing around a great bonfire as its central feature. …it is always followed the next day by a great deal of vociferous public obscenity; in out-of-the-way places by sexual license and promiscuity as well. In prehistory the diet was poor, life hard, procreation none too easy. The obscenity was then necessary as a stimulus. (The Culture & Civilization of Ancient India-in Historical Outline)

ఇప్పుడు తలచుకుంటే, శీతవేళ దేహానికి గిలిగింతలు పెట్టే ఆ వెచ్చని అనుభవం, మనిషి జన్యుసంపుటిలో లోతుగా ఇంకిపోయిన ఏవో ఆదిమస్మృతులను అప్రయత్నంగా రెచ్చగొట్టిందనిపిస్తుంది. ఎప్పుడో ఊహ కందని కాలంలో రాజుకున్న ఆ చలినెగడు అప్పటినుంచీ అలాగే నిలిచి మండుతోందనిపిస్తుంది.

 

 – కల్లూరి భాస్కరం

 

 

Download PDF

5 Comments

 • కోశాంబి హోలీ పండగని విశ్లేషించిన దృష్టితో గుజరాత్‌లో జరిగే “దాండియా” నవరాత్రి వుత్సవాలను కూడా చూస్తే ఈ వాదానికి మరికొన్ని ఆధారాలు లభించగలవేమో..

 • chintalapudivenkateswarlu says:

  ఈ వ్యాసంలో నలదమయంతి కథాచిత్రం ఎందుకు ఉంచినట్లు? ఆ ప్రస్తావనే లేదుకదా!

 • భూమి పొరలలోని పురావస్తు ఆధారాలలాగే మన సాంప్రదాయాల పొరలు ఎన్నో చారిత్రక అవశేషాలు మనకి అందిస్తాయని అంటారు కోశాంబి. అదే మన దేశ సంస్కృతి ప్రత్యేకత . చాలా ఆసక్తి కలిగిస్తాయి ఈ విషయాలు.

 • చాలా బావుందండీ

  • కల్లూరి భాస్కరం says:

   అరిపిరాల, చింతలపూడి వెంకటేశ్వర్లు, యన్. సీతారాం రెడ్డి, ఎస్. నారాయణస్వామి…ధన్యవాదాలండీ

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)