వొక కొండపిల్ల

sudhakar

విజయనగరం జిల్లాలోని ” పోరాం’ గ్రామంలో జూన్ 22, 1986లో పుట్టారు బాలసుధాకర్ మౌళి. ఇప్పటి వరకు నాలుగు కథలు రాశారు. కవిత్వంలోనూ ప్రవేశం ఉంది. మొదటి కథ “థింసా దారిలో’ 2011లో సాహిత్య ప్రస్థానంలో ప్రచురితమైంది. ఈయన కథ “గొంతెండిపోతోంది’  హిందీలోకి అనువాదమైంది. రాశికన్నా వాసి ముఖ్యమనే ఈ రచయిత బడుగు, బలహీన వర్గాల తరపున నిలబడి మాట్లాడతాడు.

వేంపల్లెషరీఫ్

 

 

1

పార్వతి..
కొండకు కొత్తందం వచ్చినట్టుండే నీలికళ్ల కొండ పిల్ల ‘పార్వతి’. పచ్చని చెట్లను ప్రేమతో అల్లుకున్న సన్నటి తీగలా, తీగె  పవిటంచుకు పూసిన ఎర్రటి పువ్వులా.. అడవి అడవినంతా గుండెల్లో నింపుకున్న కోయపిల్ల పార్వతి.

అడవి నెత్తురంతా థింసా రంగే..
అలాంటిది- అడవికే థింసాని నేర్పే వసంతోత్సవ నాట్యకారిణి పార్వతి.

నెత్తి మీద సూర్యున్ని అలంకరించుకుని కిందకు దిగుతున్న వనకన్యలా.. పార్వతి నడుస్తోంది. కాలిమువ్వల సవ్వడి లయాత్మకంగా చుట్టూ ధ్వనిస్తోంది.
ఆమె నడుస్తున్న దారంతా ‘కొండపూల సుగంధం’. మొక్కా మొక్కా, పువ్వూ పువ్వూ-
ఆమె వెళ్లిన వేపే చూస్తూ.. దిగులు పడుతూ.. పార్వతి పునరాగమనానికై రేపటిని కాంక్షిస్తూ……

సంధ్యా కాంతి- చల్లని గాలిని వెంటేసుకుని కొండ దిగువకు ప్రసరిస్తుంది.
పార్వతి నడుస్తూ నడుస్తూ వెనక్కి తిరిగి.. అడవిని ఆప్యాయంగా చూసుకుంది.

ఇప్పుడిప్పుడే బతుకు రహస్యాలను గ్రహిస్తున్న పార్వతి నడకలో- గొప్ప జీవితేచ్ఛ తొణికిసలాడుతుంది.

2

పార్వతికి పదహారేళ్లు.
అమ్మలేని పార్వతి- కొండ కొంగు పట్టుకుని అడవంతా పిల్లకోడిలా కలియతిరుగుతుంది.

కొండ మీద పుట్టే ప్రతీ ప్రాణి.. పార్వతికి పరిచయమే. గూళ్లల్లో నుంచి గువ్వపిల్లలను చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెడుతుంది.
తుప్పల్లో ముడుచుకు కూచున్న కుందేటి కూనల్ని పట్టుకుని శరీరంపై మృధువుగా నిమురుతుంది. లేళ్లతో పాటూ గంతులేస్తుంది. అడవి మేకల ఆలన తీరుస్తుంది.
పామన్నా.. పురుగన్నా… ఏ మాత్రం భయపడదు పార్వతి.
పార్వతికి- కొండ మీద అమ్మ మీద ఉన్నంత ప్రేమ.
కొండంటే.. పార్వతికి అమ్మే.

కొండ పాదాల చెంత పార్వతి ‘గుడిసె’.
గుడిసె ముందు జామచెట్టు.
చెట్టు నీడలో అమ్మ ‘లచిక’ సమాధి.
సమాధిపైన.. చెట్టు కొమ్మకు వేలాడుతూ ‘ఊయల’.
రోజూ చీకటి పడే వేళ- లచిక వచ్చి ఊయల ఊగుతుందని అమ్మమ్మ ‘మరియమ్మ’ నమ్మిక. ఎప్పుడైనా పార్వతి ఊయలలో ఊగుతుంటే.. అలా ముచ్చటగా కళ్లార్పకుండా చూస్తూనే వుంటుంది ‘మరియమ్మ’.

పార్వతి రావడం- మరియమ్మ చూసింది.

”పారోతి.. ఎలిపొచ్చినవమ్మా.. తల్లీ… కొండకు పొద్దుచ్చినేళ ఎల్లినవు… సీకటి పడ్డంక వొచ్చినవా…. పామూ పురుగూ కరుత్తదన్నా యినవే.. నా సిట్టి తల్లి…….. అడవిల పడ్డ పద్దినాలకే నిన్ను నా సేతిల ఎట్టి
ఎల్లిపోనాది గదే మీ అమ్మ….. దాన్నని యిప్పుడేటిలే.. అదా గూటిలో గంటిజావ.. తాంగి తొంగో… పెటకన జాంకాయ మర్సిపోకు……………..”

పార్వతి- అమ్మమ్మ ఉంచిన గంటిజావ తిని.. ఏరుకొచ్చిన కొండరేగు పళ్లు నంజుకుని… ఆరుబయట అమ్మమ్మ పక్కనే.. చుక్కల్ని లెక్కపెడుతూ మెల్లగా నిద్రలోకి జారుకుంది.

Picture 059

3

తెల్లారింది.
కొండ గుమ్మం- పసుపు రాసినట్టు ధగధగా మెరిసిపోతుంది. ఎక్కడ నుంచి వచ్చిందో.. జామచెట్టు కొమ్మపైన కూర్చున్న ‘ఎర్రముక్కు పిట్ట’ కమ్మగా కూస్తుంది.
అడవిలో- రోజూ పార్వతి వినే కూతే అది. సంబరపడింది.
”యే.. ఎర్రముక్కు పిట్టా! అడవికి రమ్మని పిలుపుకొచ్చినవటే.. పార్వతి రాకపోతే అడవి మాడిపోదూ.. పువ్వూ పిందే రాలిపోవూ… చిలకలు అలకపూనవూ…………!”
పార్వతి మాటలను అర్థం చేసుకున్నట్టుంది- ‘ఎర్రముక్కు పిట్ట’ తుర్రున ఎగిరిపోయింది. అడవంతటికీ పార్వతి మెళకువ గురించి కబురందించాలనుకుందేమో……….

గుడిసె ముందు- అడవి కోళ్లకు ‘గంటిలు’ వేస్తూ… పెంచుకుంటున్న కుందేలు పిల్లని గంప కింద నుంచి చేతుల్లోకి తీసుకుని ముఖానికి ఆనించుకుని గారాము చేసింది.

అమ్మమ్మ ‘మరియమ్మ’- పార్వతిని చూసి గతాన్ని గుర్తు తెచ్చుకుంది.
గతంలో జరిగిన సంఘటలన్నీ- మరియమ్మకు రోజూ జ్ఞాపకానికొస్తూనే ఉంటాయి.

‘పారొతి అమ్మకి పదనాలుగో ఈడుకే లగ్గమయింది. దీనికి పదేడేళొత్తున్నయి.. ఈ మాగమాసానికి.. ఈ ఈడుకొ అయ్య సేతిల ఎట్టాల…. దీనికా బాగ్గిం నేదు. తల్లీ నేదు. తండ్రీ నేడు. నాను సూత్తే ముసిలి ముండని……..’
‘లచికను- పారొతి తండ్రి మోసం సేసాడు. కొండ దిగువూరినించొచ్చి.. కొండోలతో సేయం నటించి.. కొండోల కట్టమంతా దోసుకునీవోడు. ఎదిగిన లచికను సూసి.. పేమించానని.. పేణమని సెప్పి లగ్గమాడాడు. లచికకు కడుపొచ్చాక సల్లగ జారుకుని ఎలిపోనాడు. మళ్లా పికరనేదు…………….’
గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ కళ్లు తుడుచుకుంది.

జ్ఞాపకాల దొంతరల నుంచి బయటకొచ్చి…..
”అమ్మా… పారొతి.. పిట్టలకు మేత ఏత్తున్నవటే తల్లీ…. ”
పార్వతి దగ్గరకొచ్చి తలని గుండెలకు ఆనించుకుని నుదుట మీద ముద్దు పెట్టుకుంది.

అమ్మ గుండెల మీద- బెంగా భీతీ లేకుండా తలవాల్చుకోవాల్సిన పార్వతి.. అమ్మమ్మ నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది.

పార్వతికి- తండ్రి గురించిన విషయాలేవీ తెలియకుండా పెంచింది మరియమ్మ. ‘తండ్రి వలనే తల్లి చనిపోయిందని’ మాత్రం పార్వతికి తెలుసు.
కానీ ఊరిలో ఆ నోటా ఈ నోటా విన్న మాటలని బట్టి… యిప్పుడిప్పుడే ‘తల్లి ఎందుకు చనిపోయిందో…’  అర్థమౌతుంది పార్వతికి.

దిగువ ఊర్ల గురించీ.. ఆ మనుషుల గురించీ.. వాళ్ల ‘మాయా-మర్మం’ గురించీ తెలుసుకుంటుంది. అందుకే పార్వతికి దిగువ ఊర్లన్నా.. ఆ మనుషులన్నా భయం.

ఎప్పుడైనా గుడిసెకు ఎవరన్నా కొత్తవాళ్లు వస్తే.. బిగుసుకుని.. గుడిసె లోపలికెలిపోతుంది. ఆ రోజంతా ఎవరితోనూ మాట్లాడదు. బయటకు చెప్పుకోలేని బాధ.. పార్వతిని చుట్టు ముడుతుంది.       ఎలాంటి బాధలోనైనా పార్వతికి ఉపశమనం- ‘థింసా’నే. పార్వతికి ‘థింసా’ అంటే ప్రాణంతో సమానం. తల్లి ‘లచిక’ కూడా ఆ కొండ చుట్టు పక్కల ఊర్లలో మంచి ‘థింసా’ నర్తకిగా గుర్తింపు తెచ్చుకుంది. తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన ‘కళ’ను కొనసాగించాలని పార్వతి ఆశ.
ఆడా మగా- చేయి చేయి కలుపుకుని.. ఒకరినొకరు అనుసరిస్తూ… తుడుం దరువులకి అనుగుణంగా కాళ్లను లయబద్ధంగా కదపడమంటే…. పార్వతికి ఎక్కడలేని ఉత్సాహం. పార్వతి ‘థింసా’ని చూసిన.. ఆ ‘ఊరి’ స్త్రీలు పార్వతిని- వాళ్ల అమ్మతో పోల్చుతుంటారు. అలాంటప్పుడు పార్వతి గుండె తడవుతుంది. ఇంకా ఇంకా
బాగా నర్తించాలని పట్టుదల పెరుగుతుంది.

4

‘పండగ రోజులు’ దగ్గర పడుతున్నాయి.
కొండ ఊరిలో ‘ఆనందం’ తాండవిస్తుంది.
మగవాళ్లు, నడి వయసు ఆడవాళ్లూ.. దిగువ ఊర్లకెళ్లి… కట్టెలు, బొగ్గులు, చింతపండు, సీతఫలాలు అమ్మి.. పప్పు, నూనె, కొత్తబట్టలు కొనుక్కొని కొండకు తిరిగి వస్తున్నారు.
తుడుంలు, డప్పులు, పినలగర్రలు- సవరించుకుంటున్నారు.

కొండ ఊరికి పండగంటే.. ఇప్పుడు- ‘దిగువ ఊర్ల పండగే’.
కొండోల కందికొత్తల పండగ, విత్తనాల పండగ ఇవన్నీ.. కొత్తతరాలకు అనుభవంలో లేవు. వాళ్లకు పండగంటే సంక్రాంతి, కనుమలే.
కొండ ఊరివాళ్లు.. పండగ పూట- దిగువ ఊర్లకెళ్లి థింసా చేస్తారు. ఐదారు ఊర్ల నుంచి పిండివంటలు, బియ్యంలాంటివి కొండకు తీసుకుని వస్తారు. ప్రతీ ఏటా పండగప్పుడు దిగువకు వెళ్లడం.. కొండవాళ్లకు రివాజుగా మారిపోయింది.
ఎప్పుడూ వెళ్లడం వేరు. పండగ పూట వెళ్లడం వేరు. పండగ రోజుల్లో వాళ్లకు ‘థింసా..’ జీవితాధారంగా కూడా మారిపోయింది.

థింసా- కొండ గుండెల్లో ప్రవహించే ‘జీననది’.
తరతరాలుగా గిరిపుత్రుల సంస్కృతిని మోస్తున్న ‘అడవి తల్లి గుండె లయ’.

dhimsa_dance

పార్వతికి- థింసా అంటే ప్రాణం. కొండ ఒడిలో పుట్టి నడక నేర్చినప్పటి  నుంచి ‘థింసా’నే చూస్తుంది. థింసాలోనే సేదతీరుతుంది. ‘కొండా-థింసా’ పార్వతికి రెండు కళ్లు.
థింసా కోసం- దిగువ ఊర్ల మీద ఉన్న అయిష్టతను పక్కన పెట్టి.. పండగ రోజు- దిగువకు తన వాళ్లతో పాటూ వెళ్లింది.
కనుమకూ, ముక్కనుమకూ రెండు రోజులూ ‘థింసా’ ఆడింది.
తర్వాత- అందరూ తిరిగి కొండకు వచ్చేసారు.

పార్వతికి ఉబుసుపోలేదు. ‘థింసా’ ఇచ్చిన మత్తును మరిచిపోలేకపోతుంది. తుడుంలు, డప్పులు, పినలగర్రలు మధ్య ఆడిన కాళ్లను, చేతులను పదేపది చూసుకుంది. ఆ వాయిద్యపరికరాలన్నీ.. యిప్పుడు మూలకు చేరాయి.

థింసా- కేవలం ‘ఆకలి తీర్చే ఆట’గానే మారిందని పార్వతికి బెంగ.       పండగలోనో, జాతరలోనో మాత్రమే కనిపించే.. ‘థింసా’ స్థితికి- పార్వతికి గుండె కోసేసినంత దుఃఖం.

ఒంటరిగా, నిశబ్దంగా- అడవిలోకి బయలుదేరింది పార్వతి. ఆకూ ఆకూ.. కొమ్మా కొమ్మా- పార్వతి రాకను గమనించి గూళ్లలోకి సందేశాన్ని పంపాయి. పక్షులన్నీ కిలకిలమని అరుస్తూ.. వచ్చి.. పార్వతిని పలకరించాయి.
లేళ్లూ, కుందేల్లూ- పార్వతికి ఎదురొచ్చాయి.
చెవులు రిక్కించి.. పార్వతి మాట కోసం- అలా చూస్తూనే ఉన్నాయి.

పార్వతి ఎవరితోనూ ఏ మాటా ఆడలేదు.
ఓ చెట్టు కింద మౌనంగా కూర్చుంది.
తన ఆలోచనల్లో- ‘అమ్మ, థింసా’ తప్ప ఇంకోటి లేదు.

5

కొన్ని రోజులు ఇలాగే స్తబ్దంగా గడిచాయి.

ఒక రోజు- కొండకు ‘దుర్వార్త’ వచ్చింది.
”కొండను బాంబులతో పేల్సి.. పెద్దపెద్ద బండలను పట్నం తీసికిలిపోతారట!  ఆటితో గొప్పగొప్ప భవంతులు, డేంలు కడతారట! కొండోల గుడిసిలన్నీ కూల్సిత్తారట! యెక్కడో దిగువున వుండడానికి కుసింత జాగవ సూపెడతారట! పని కూడా సూపెడతారట…………….!”
కొండంతా- ఈ వార్త దావానలంలా పాకింది. కొండోల్లంతా ఒకరి ముఖాల్నొకరు చూసుకున్నారు. కొందరు బిక్కచచ్చినట్టు ఊరుకున్నారు. కొందరు గుండెలు బాదుకున్నారు. కొందరు ధైర్యం చేసి.. ఈ వార్త నిజమో! కాదో! తెలుసుకోవడానికి దిగువకు వెళదామనుకున్నారు. వెళ్లారు.
‘అంతా నిజమేనని…. ‘ వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చారు.

కొండోలు అల్లాడిపోయారు.
‘ఎప్పుడు కొండను పేల్చేస్తారో……’ అని గుండెని రాయి చేసుకుని.. క్షణం క్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఆ ‘చెడ్డ రోజు’ రానే వచ్చింది.
కొండోళ్ల ప్రమేయం లేకుండా గుడిసెలన్నింటినీ ప్రొక్లెయినర్లతో దౌర్జన్యంగా తీసేసారు.  పెద్ద పెద్ద లారీలు, లారీలతో రకరకాల మిషన్ల్, ఎక్కడెక్కడి నుంచో.. రోజు రోజుకీ.. ట్రాక్టర్లతో కూలీలు. అంతా గోల గోల.

కొండ ముందు- ‘నాగర్జునా క్వారీ వర్క్స్’ బోర్డు పడింది. క్వారీ పనులు ప్రారంభమయ్యాయి.
రోజూ- ఎ.సి కార్లు వచ్చి ఆగుతున్నాయి. అందులో నుంచి ఖరీదైన మనుషులు దిగుతున్నారు. కూలోళ్ల చెమటతో లేచిన ఎ.సి రూముల్లోకి వెళ్లి సేదతీరుతున్నారు.
బయట ఎండనక, వాననక కూలీలు- ఇరవై నాలుగు గంటలూ పనిచేస్తున్నారు.

బాంబులతో కొండ దద్దరిల్లిపోతుంది.
మిషన్లతో- చతురస్రాకారంగా, దీర్ఘచతురస్రాకారంగా పెద్ద పెద్ద బండలను కోసి.. పెద్ద పెద్ద లారీల మీదకెక్కించి పట్నం తీసుకెళిపోతున్నారు.
పనంతా- వాళ్లు అనుకున్న లెక్క ప్రకారం జరుగుతుంది.
కొండోళ్లంతా చెట్టుకొకరు, పుట్టకొకరు చెదిరిపోయారు. కలివిడిగా వొక చోట బతికిన వాళ్లందరూ ఉన్నట్టుండి అదృశ్యపోయారు.
ఒకటీ, అరా కొండోళ్లు మాత్రం- వాళ్ల దయాదాక్షిణ్యాలతో ఎ.సి. గదులకు దూరంగా పాకలు వేసుకున్నారు. వొకరిద్దర్ని పనిలోకి తీసుకున్నారు. కొండ దిగువ ఊర్ల వాళ్లను కూడా చాలా తక్కువ మందిని.. అదీ చిన్నాచితక పనుల్లోకే తీసుకున్నారు.

‘మరియమ్మ, పార్వతి’ని కూడా అక్కడే పాకల్లో ఉండడానికి అనుమతిచ్చారు.
ఇన్నాళ్లూ అండగా ఉన్న కొండ స్వరూపం ఒక్కసారిగా మారిపోవడంతో.. వాళ్లకిదంతా అయోమయంగా అనిపించింది. చూస్తుండగానే రోజు రోజుకీ కొండ తరిగిపోతుంది. పెద్ద పెద్ద గొయ్యలు పుడుతున్నాయి.
బాంబుల శబ్దానికి పక్షులన్నీ- ఎటో ఎగిరిపోయాయి. కుందేళ్లూ, నెమళ్లూ- క్వారీ యజమానుల ఆకలికి  బలైపోతున్నాయి.

మరియమ్మ, పార్వతి కొండ దగ్గరే.. శిథిలమౌతున్న కొండ దగ్గరే… కాలాన్ని ఈడుస్తూ- కొండ ఔన్నత్యాన్ని తలచుకుంటూ.. దుఃఖించి, దుఃఖించి చివరకు వాళ్లు ఏడ్వడమే మరిచిపోయారు.

కొండల్లో- పార్వతి తిరుగాడిన ప్రదేశాలన్నీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.
పార్వతి తల్లి ‘లచిక’ సమాధి- ఎక్కడుందో ఆనవాలు కూడా కనిపించట్లేదు. పలకబారిన పళ్లతో గుమగుమలాడే జామచెట్టూ అదృశ్యమైపోయింది. తెల్లారితే పలకరించే ‘ఎర్రముక్కు పిట్టా’ కనిపించలేదు.

థింసా?!
బాంబుల శబ్దానికి, సుత్తి దెబ్బలకు- కుంటి కాళ్లతో ఎక్కడ.. ఏ రాతిపొరల మధ్యన మరణవేదన పడుతుందో!
థింసా నాట్యకారిణి ‘పార్వతి’- యిప్పుడు ఏ ప్రత్యేకతలు లేని రోజు కూలీ.
మరియమ్మ- గతం జ్ఞాపకాలను వర్తమాన విషాదంతో నెమరువేసుకుంటూ.. భవిష్యత్తుని ఎంత మాత్రం కలగనని వొక పరాజిత. కాలం తనను వెళ్లదీస్తుందో! తనే కాలాన్ని వెళ్లదీస్తుందో!

పార్వతి వొక్కర్తే- యిప్పుడు ఇంటికి ఆదరువు.
చిన్న చిన్న రాళ్లను గమెన్లతో ఎత్తడం, క్వారీ పనోళ్ల వంటకు నీళ్లు పట్టడం- పార్వతి పని.

6

రోజులు గడుస్తున్నాయి.

వొక రోజు చీకటి పడిన వేళ-
ఎప్పటి నుంచి అదును కోసం ఎదురుచూస్తున్నాడో… ‘సూపర్ వైజర్- ప్రసాద్’ పార్వతిని అడ్డగించాడు. పట్నం నుంచి నెల రోజుల కిందటే క్వారీలో జాయిన్ అయ్యాడు. బతిమాలి, బుజ్జగించి, ధైర్యం చెప్పి, మాయ మాట్లాడి, పెళ్లి చేసుకుంటానని….. కోరిక తీర్చుకున్నాడు.
కొండని, థింసాని, అమ్మని కోల్పోయిన పార్వతి- అతనిని నమ్మింది. కొన్నాళ్లు కాపురం చేసాడు. ఫలితంగా గర్భం దాల్చింది.

ఉన్నట్టుండి- ఒంట్లో ఏ జబ్బూ లేకుండానే.. అమ్మమ్మ చనిపోయింది.
పార్వతికి తెలిసినంతలో ‘అమ్మమ్మ’ మరణమే తొలి మరణం.

దిగులు పడింది.
అమ్మమ్మ మరణానికి కారణం- ఆలోచిస్తున్న కొద్దీ పార్వతికి అర్థమవసాగింది.

కొన్ని రోజుల తర్వాత-
పట్నం పని మీద వెళ్తున్నానని చెప్పాడు ప్రసాద్. మళ్లీ తిరిగి రాలేదు.
క్వారీలో- తోటి ఉద్యోగస్తులనడిగితే తెలియదన్నారు. యజమానులు పార్వతిని పట్టించుకోలేదు.
పైగా.. ”నీలాటి ముండ అవసరం తీరింది.. యెల్లి పట్నంలో.. యే ముండ పక్కన తొంగుండో…..”

నోటికొచ్చిన మాటలన్నీ ఆడారు.
పార్వతికి కోపం వచ్చింది. దుఃఖం వచ్చింది. కానీ ఏమీ చేయలేని చేతకానితనం.

రోజులు గడుస్తున్నాయి.
పార్వతికి- తొమ్మిది నెలలు నిండాయి. కూలీల సాయంతో సంక్రాంతి రోజున- సూర్యుడు ఆకాశంలో పొడుస్తుండగా ‘ఆడబిడ్డ’ని కనింది.
అమ్మ లేదు. అమ్మమ్మా లేదు.
కొండా లేదు. ‘థింసా’ లేదు.
పార్వతి.. పురిటితల్లి పార్వతి.. వొంటరి ఆడది.

తన కన్నా ముందే.. మోసపోయి ఆత్మహత్య చేసుకున్న ‘అమ్మ’ గుర్తొచ్చింది. ప్రతీసారి మోసపోతున్న తన జాతి గుర్తొచ్చింది. మా వాళ్లలా నేనూ మోసపోయాననుకుంది.

Picture 060

7

ఆ రోజు అర్థరాత్రి-

పార్వతి- వొంటిలో ఉన్న శక్తినంతటినీ కూడదీసుకుంది.
‘థింసా’ ఆడి ఆడి రాటుదేలిన కాళ్లు రెండింటినీ.. దగ్గరకు లాగి నిటారుగా నిలబడింది.
నేల మీద- అమాయకంగా నిద్రిస్తున్న పసికందుని పైకి తీసి, చీరతో వీపు వెనక్కి కట్టుకుని.. అడుగు ముందుకు వేసింది.  బయలుదేరింది.

అడవి లోపలకి లోపలికి ఇంకా లోపలికి.. లోపలి లోపలికి నడుస్తోంది.
నడుస్తోంది.
నడుస్తోంది.
బొడ్డులో వొక కత్తిని రహస్యంగా పెట్టుకుంది. దారిలో- మొదటి వేటుగా వొక ‘సింహాన్ని’ నరికింది. ఈసారి- బక్కాబడుగుజీవాల నెత్తురు తాగుతున్న ‘నరసింహాల్నే’ నరకాలనుకుంటుంది.

‘తన సంస్కృతిని- తన జాతిని రక్షించుకోవడమనే మహా సంకల్పంతో బయలుదేరిన ఓ వీరవనితా.. జయహో…. జయ జయహో………………….’
చీకట్లో- ఏ లోయల్నుంచో.. ఏ రాళ్ల అంతర్భాగాల నుంచో… పురాతనమైన, పరిచయమైన గొంతు వొకటి తెరలు తెరలుగా ప్రతిధ్వనిస్తోంది.

8

ఈ రోజు పార్వతి చూపు ‘అరణ్యం’ వైపు..
రేపు ?

– బాల సుధాకర్ మౌళి

కథాచిత్రాలు: ఎస్. గురుమూర్తి

Download PDF

17 Comments

  • మెర్సీ మార్గరెట్ says:

    చాలా బాగుంది మీ కథ. ఆలోచింప చేసింది. ఇంకా మరిన్ని కథలు మీ నుండి ఆశిస్తున్నాను తమ్ముడు. అభినందనలు.

  • బాగుంది నాన్న…కథాంశం చాల మంచిది ..ఆలోచనల్లో కసి…రాతల్లో కాస్త పసి పతనం ఉన్న ..మా మంచి బాల సుధాకర్ కి అభినందనలు ..మీ అనుభవాలను రంగరించి మంచి మంచి కథలుగా మలచండి..శుభాకాంక్షలు ..

    • balasudhakarmouli says:

      మీ మాటలకు ధన్యుణ్ణి అమ్మా …….. మీ అభినందన నాకు విపరీతమైన ఉత్తేజాన్ని ఇస్తుంది ….

  • sreemathi pudota showreelu teacher says:

    సుధాకర్ ఆడపిల్ల ,కొండపిల్ల గాని పట్నంపిల్లగాని మగవాడి చేతిలో మోసపో యే కతలు చదివిచదివి విసుగోస్తున్నది ఇక నినా ఆడపిల్లను ద్రుడచిత్తం కలదానిగా చిన్నప్పటినుండే సాహసిగా అట్లాంటి మగవాడి పొగరు అణిచే ఆదిశక్తిగా మలుస్తావని ఆశపడుతున్నాను ఇప్పుడిప్పుడే రాస్తున్నప్పటికీ కథాగమనం బాగున్నది గురుమూర్తి గారి బొమ్మలు చాలా అందముగా ఉన్నాయ్

    • balasudhakarmouli says:

      మీ గొప్ప సలహాకు కృతజ్ఞతలు. అలాంటి కథలు వస్తాయి. అయితే మనం జీవిస్తున్న వ్యవస్థ తీరు మీద వాటి జననం ఆధారపడి ఉంది. ఈ వ్యవస్థలో దురహంకార మగవాడి చేతిలో ఓడి ఓడి… ఆ ఓటమి నుంచే శక్తిని సముపార్జించుకునే స్త్రీలు కనిపిస్తారు. ఆ పోరాట పరిమళమే వేరు. వ్యవస్థ మారి… మహానుభావులు కలలుగన్న నూతన వ్యవస్థ ఏర్పడ్డాక…. ఇంకా అలాంటి కథల అవసరం ఉండదు. ఇప్పటికే మన ఆధునిక స్త్రీ అనేక ముసుగులను ఛేదించుకుని బయటకు వొచ్చింది. ప్రయాణం ముందుకే గానీ వెనక్కి కాదు… మనమందరం ఆ పనిని వేగిరంగా నడిపించగలిగే చేవను కూడగట్టుకోవాలి. మీ స్పందనకు వందనం.

  • Brahma Bathuluri says:

    చాలా బాగుంది .. పార్వతి కళ్ళతో అడవిని చూస్తున్నట్లు అనిపించింది కథ చదువుతున్నంత సేపు… !

  • moida srinivasarao says:

    మౌళి మంచి అంశాన్ని కథగా ఎంచుకున్నావు. బాగుంది

  • chintalapudivenkateswarlu says:

    మౌళిగారూ!
    మీ కథ చాలాబాగుంది. వ్రాసింది ఐదో కథైనా శైలి పరంగా అమోఘం. నేను భద్రాచలంలో పనిచేసినపుడు మా చుట్టూ ఇలాంటి కథలే. అప్పుడనుకొనేవాణ్ణి- ఈ అంశమ్మీద ఎవరైనా వ్రాస్తే బాగుండని. వ్రాశారుగాని మీలా లక్ష్యం చూపిస్తూ వ్రాయలేదు. కోరిక తీర్చారు.

    • balasudhakarmouli says:

      చింతలపూడి వెంకటేశ్వర్రావు గారూ.. ధన్యవాదాలు……
      నా చిన్నప్పుడు మా ఇంటి పక్క నుంచి పెద్ద పెద్ద లారీలు మూడు నాలుగు కొండల ముక్కలను వేసుకుని పట్నం వైపు …. ఎన్.హెచ్.5 రోడ్డుకి వెళ్లిపోతుండేవి.
      నాకు దుఃఖం….
      నేను ఆ కొండల దగ్గరికే రేంబళ్లుకి వెళ్లేవాడిని… మా ఊర్లో వినేవాడిని- గుసగుసలు- ‘గిరిజన యువతులను, అలాగే పెద్దోల అండలేని వెనుకబడిన వర్గాలకు చెందిన- పని చేసుకునే యువతులను ముగ్గురిని నాశనం చేసి చంపేశారని……’
      ఇంకా ఎందరు బలయ్యారో……

      ఇప్పుడు కొండలు స్థానే గొయ్యలున్నాయి.
      మా ఊరి రహదారికి కూడా గాయాలే…….

      ఆ ప్రైవేట్ కంపెనీ తన పని తాను చక్కగా కానిచ్చి సల్లగ జారుకుంది.
      రైతుల, కూలీల గతి- పట్నం వలసకు క్యూ…..

      దురద్రుష్టవాశాత్తు మన ఊర్లు అన్నీ ‘మార్కెట్ మాయ’కు – అలాగే తయారయ్యాయి.

      బాధ కలిగించే విషయమేమంటే…. ఆ బలిపశువుల్లాంటి యువతులు తిరగబడకపోవడం. మరణించడం.
      ఎలా ఎదురుతిరగగలరు?!
      అంత బలమెక్కడిది?

      సాగనీ… ఎన్నాళ్లు సాగుతుందో……..

      ”అనేకులింకా, అభాగ్యులంతా,
      అనాథులంతా,
      అశాంతులంతా
      దీర్ఘశ్రుతిలో, తీవ్రధ్వనితో
      విప్లవశంఖం వినిపిస్తారోయ్……….”

  • రాజశేఖర్ గుదిబండి says:

    చాలా బాగా రాసాడు బాల సుధాకర్ మౌళి. పార్వతి ఆ మహారణ్యం లోకి వెళ్లి ఎం సాధిస్తుంది అని అన్పించవచ్చు , కాని సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని చరిత్ర చెప్తుంది…అలాగే సుధాకర్ మౌళి రాసిన ఈ కధాంశం పాతదే , సాధారనమినదే అన్పించవచ్చు . కాని అందులో రచయిత నిజాయితీ , ప్రగాఢమైన విశ్వాసం , సమాజం పట్ల నిబద్ధత , బాధ్యతా మనల్ని ముగ్దుల్ని చేస్తుంది…ఇవే అతన్ని ముందుండి నడిపిస్తాయి , సమాజాన్ని కూడా నడిపించేలా చేస్తాయి… అభినందనలు బాల సుధాకర్ మౌళి గారు…..

    • balasudhakarmouli says:

      ”పార్వతి ఆ మహారణ్యం లోకి వెళ్లి ఎం సాధిస్తుంది అని అన్పించవచ్చు , కాని సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని చరిత్ర చెప్తుంది…” పార్వతి మీద మీ నమ్మకానికీ నా వందనాలు.

  • కాజ సురేశ్ says:

    కవితాత్మకముగా ఉన్న మొదటి బాగము చాలా బాగుంది. అభినందనలు.

  • chintalapudivenkateswarlu says:

    మరీ అంత నిరాశపడక్కర లేదనుకుంటా మౌళిగారూ! అక్కడ ఒక పని జరిగింది- ఒకటి రెండు తరాలు పోయాక అలా మో’సపోయిన వాళ్ళ మగపిల్లలు విప్లవం ప్రకటించారు. ఎదురు తిరిగారు. ఇప్పుడు అలా చేసిన వారి వంశాలు అక్కడ లేవు. ఐతే వంచకులు అక్కడే స్థిరపడి ఆస్తులు సంపాదించారు. ఇప్పుడు వదిలిపెట్టి పోలేక పోయారు. ఇప్పుడు ఉద్యోగస్థుల్ని అలా చేస్తే కట్టేసి పెళ్ళి చేస్తున్నారు. అన్ని చోట్లా అలాగే జరుగుగాక! అని ఆశిద్దాం.

  • ఎ.కె.ప్రభాకర్. says:

    లచిక లా పార్వతి మోసపోగూదనుకుంటూ కథ చదివాను.కానీ మోసపోయింది. అయితే తల్లిలా కూతురు చావును వెతుక్కొంటూ వెళ్ళలేదు. చావులకు పరిష్కారాన్ని వెతికే దిశలో పయనించింది. ఆ పయనమే కొండల్ని కూడా కాపాడుతుందని నమ్మిక.యువ కథకుడు మౌలికి కథారణ్యంలోకి స్వాగతం.దారి తప్పకుండా అడవిని గెలవాలని – గెల్చి కాపాడాలనీ ఆశిస్తున్నా.

  • K.Wilsonrao says:

    మౌళి మీ కవిత్వం మళ్ళీ మళ్ళీ వినాలని వుంది.

  • balasudhakarmouli says:

    * ఎ.కె. ప్రభాకర్ గారూ.. మీ కథా విశ్లేష్ణ లు 1 ఆర్ 2 చదివాను అండి. ధన్యావాదాలండి.
    * విల్సన్ రావ్ గారూ… ధన్యవాదాలండి.

  • balasudhakarmouli says:

    ధన్యవాదాలు ఎ.కె. ప్రభాకర్ గారూ… మీ కథా విశ్లే ష్ణలు ఒకటి, రెండు చదివానండి. థ్యాంక్యూ…
    విల్సన్ రావ్ గారూ… ధన్యవాదాలండి.

Leave a Reply to sreemathi pudota showreelu teacher Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)