ఏక్ ఫిలిం కా సుల్తాన్ (హీరో)

bhuvanachandra

Untold Stories 

ఈ టైటిల్ నేను అతనికి పెట్టలేదు.. అతనికి అతనే పెట్టుకోవడమేగాక, ‘ఆధ్యాత్మికంగా’ నవ్వి నాతో చెప్పాడు. “అదేమిటి?” అన్నాను. అతన్ని కలిసింది మౌంట్‌రోడ్డులో. ఒకప్పుడు ‘స్పెన్సర్శ్  ఉండే చోటికి దగ్గర్లో, సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నా. “సార్.. సిగ్నల్ దాటాక ఓ క్షణం ఆపుతారా?” పేవ్‌మెంట్ మీదనించి తెలుగులో అరిచాడు. ఆయన్ని చూస్తే చాలా వృద్ధుడు. ముఖంలో కొద్దోగొప్పో ‘అలిసిపోయిన వర్ఛస్సు’ మిగిలుంది.

సిగ్నల్స్ క్రాస్ చేశాక ఆపాను.

“థాంక్స్ సార్..” మిమ్మల్నేదీ  యాచించటానికి రాలేదు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. నా వయసులో ఉన్నవాడూ, ఇలా మురికి బట్టలు వేసుకున్నవాడూ ఎవరు కారుని ఆపినా, అడుక్కోవటానికే అనుకుంటారు…” చిన్నగా నవ్వి అన్నాడు.

“చెప్పండి.” అన్నాను.  ఇంకేమనాలో తెలియక.

“మీరు నాకు తెలుసు. చాలా సినిమాల్లో ‘గుంపులో గోవిందం’ వేషాలు వేశాను. అయితే ఓ విషయం చెప్పుకోవాలి. నేను ఏక్ ఫిలిం హీరోని. ఏక్ దిన్ కా సుల్తాన్‌లాగా..! మళ్లీ మందహాసం.

“చెప్పండి..!” అన్నాను.

మద్రాసు ఎండలకి ప్రసిద్ధి. అయితే ఆ ఎండ మంచిదే. చెమట పడుతుంది. స్నానం చేశాక వొళ్లు హాయిగా తేలిగ్గా వుంటుంది. సాయంత్రం నాలుక్కల్లా సముద్రపు గాలి వీస్తుంది. కొంచెం జిడ్డుగా. కొంచెం చల్లగా. ఏమైనా మద్రాసు ప్రత్యేకత మద్రాసుదే.

“రామకృష్ణగారు (త్వరలో ఆయన ఫోటో, సెల్ నంబర్‌తో సహా పరిచయం చెయ్యబోతున్నాను.) మీ గురించి చెప్పారు. నెలనెలా మీరు రాస్తున్న ‘అన్‌టోల్డ్ స్టోరీస్’ గురించి కూడా చెప్పారు. నాకో చిన్న ఆశ. నా కథ కూడా మీరు రాస్తారని. ఎందుకంటే…” సందేహించాడు.

“సందేహం వద్దు. ఎందుకూ?” అన్నాను.

“అమెరికాలో వున్న నా పిల్లలెవరన్నా చదివి మళ్లీ నన్ను కలిసే ప్రయత్నం చేస్తారని..” కొంచెం సిగ్గుపడుతూ అన్నాడు”

“రేపు మీరు మా యింటికి రాగలరా?” నా ‘కార్డ్’ ఇస్తూ అన్నాను.

“తప్పకుండా. అంతకంటేనా..” ఆనందంగా అన్నాడూ.

ఓ పది నిమిషాల తరవాత జ్ఞాపకం వచ్చింది. ఆయన తన పేరు చెప్పలేదనీ… నేను అడగలేదనీ..

 

***

 

“నా అసలు పేరు ‘ఫలానా’. అయి తే దయచేసి నా కథని పేరు మార్చి రాయండి. ఆ పేరు కూడా నేనే చెబుతాను.. ‘యాదయ్య’. ” అన్నాడు. “అసలు పేరు రాయకపోతే మీ పిల్లలు ఎలా గుర్తుపడతారూ? అయినా మీ పిల్లలు ‘సారంగ’ పత్రికని చదువుతారని గ్యారంటీ లేదుగా. ఒక పని చెయ్యండి. మీ పిల్లల పేర్లు. వాళ్లు ఏం చేస్తున్నారో  చెబితే అమెరికాలో వున్న నా ఫ్రెండ్స్‌కి చెబుతా. తోటకూర ప్రసాద్‌గారికీ, వంగూరి చిట్టెన్ రాజుగారికీ, కిరణ్ ప్రభ గారికీ, కల్పన, అఫ్సర్‌గార్లకీ చెబితే కొంత ప్రయోజనం ఉంటుంది..” అన్నాను.

అతను గాఢంగా నిట్టూర్చాడు. “వాళ్లకి నేనంటే అసహ్యం. అలా నన్ను అసహ్యించుకోవడానికి వాళ్ల కారణాలు వాళ్ళకున్నాయి. వాళ్లకి తెలీంది ఒకటే. నా జీవితం గురించి. అది చదివితే కొంత అర్ధం  చేసుకుంటారని నా ఆశ…”

“సరే. మీరన్నట్టుగానే చేద్దాం. చెప్పండి.” అన్నాను.

“మాది విజయవాడ దగ్గర ఓ పల్లెటూరు. ఆ వూరికంతటికీ సంపన్న కుటుంబం మాదే. నేను చదివింది గుంటూరు AC కాలేజీలో . మా వూల్లో  గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొట్టమొదటి వ్యక్తిని నేనే. మావాళ్లకి నేనంటే ప్రాణం. ఎంత అడిగితే అంతా ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో “గోల్డ్ ఫ్లేకు టీన్ను”లు కొని స్టైల్ మెయిన్‌టైన్ చేసినవాన్ని నేనే. ఇంకో విషయం.. కొంగర జగ్గయ్యగారూ, గుమ్మడిగారూ, వాళ్లంతా నాకు అప్పట్నించే  పరిచయం..” నిట్టూర్చాడు.

కష్టపడి పైకొచ్చినవాళ్లకి తన మీద తనకి విపరీతమైన నమ్మకమూ, ధైర్యమూ వుంటాయి. పైనించి కిందకి దిగినవాడికి ‘ఆత్మన్యూనత, తన మీద తనకి జాలి ‘డెవలప్’ అవుతాయి.  “తర్వాత?”

“ఇప్పుడిలా వున్నాగానీ నేను చాలా అందంగా  వుండేవాన్ని. దాంతో సహజంగానే సినిమా ఫీల్డువైపు అడుగులు   పడ్డాయి. “కళ్లు మెరుస్తుండగా” అన్నాడు.

“ఊ !”

“మైలాపూర్‌లో ఓ పెద్ద ఇల్లు అద్దెకి తీసుకున్నాను. మాక్జిమమ్ ఫర్నీచర్, అలంకార సామగ్రి, అంతా స్పెన్సర్స్ నించే. అప్పట్లోనే “బ్యూక్” కారు కొన్నాను. పాండీ బజార్లో కారు పార్కు చేసి అటుపక్కన CSRగారు నిలబడి వుంటే, ఇటు పక్క నా బ్యూక్‌ని పార్క్ చేసి నేను నిలబడి వుండేవాడిని. అయ్యా.. ఆ రోజులు వేరు,  నిర్మాతలూ, దర్శకులూ బాగా చదువుకున్నవారూ, “సినిమా” మీద ప్రేమతో వచ్చినవారు. ప్రొడ్యూసరు  కృష్ణాజిల్లావాడే.  మాకు తెలిసినవాడే.  కాస్త దూరపు బంధువు కూడానూ..” మళ్లీ నిట్టూర్చాడు.

కన్నీళ్లు ఆవిరైనప్పుడు  వచ్చేవే ‘నిట్టూర్పులు’. కళ్లల్లో ఇంకా కన్నీరు మిగల్లేదన్నమాట. గుండెల్లో  ఉండే బాధే..  ‘నిట్టూర్పుల సెగల’ రూపంలో బయటికొస్తుందేమో!

“తర్వాత?” అడిగాను.

“పిక్చర్ మొదలైంది. హీరోయిన్ తమిళమ్మాయి. చాలా అందగత్తె. ఓ వారం షూటింగ్ జరిగాక మా నాన్నగారు సీరియస్ అని నాకు ‘టెలిగ్రాం’ వచ్చింది. రాత్రికి రాత్రే కార్లో బయలుదేరాను. ‘తడ’ దాటాక యాక్సిడెంటైంది. డ్రైవర్‌కి బాగా దెబ్బలు తగిలాయి. నా కాలు విరిగింది. స్పృహ వచ్చి మళ్లీ ఊరికి బయలుదేరడానికి రెండు రోజులు పట్టింది. కాలికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అన్నారు. సిమెంటు కట్టు కట్టారు. ఇంటికి వెళ్ళేసరికి నాన్న పరిస్థితి క్షీణించింది. “బాబూ .. చచ్చి మళ్ళీ నీ కడుపున పుట్టాలనుంది. పెళ్లి చేసుకోవా?” అని బ్రతిమిలాడాడు. బంధువులు కూడా తండ్రి కోర్కె తీర్చమని పట్టు బట్టారు. మూడు రోజుల్లో ముహూర్తం చూశారు. సిమెంటు కట్టుతోనే పెళ్లి పీటలమీద కూర్చున్నాను. ఆయన కళ్లు ఎటో చూస్తున్నాయి శూన్యంగా. బహుశా ‘మాసిపోయిన’ గతంలోకి చూస్తూ వుండొచ్చు.

“ఆ రోజుల్లో ఫలానా పిల్ల అని చెప్పడానికే కాని, పెళ్లి చూపులూ, ఫోటోలు ఉండేవి కావు. నా విషయంలో నేను అదృష్టవంతుడ్నే. పిల్ల నాకు తెలిసిన పిల్లే. ఆ రోజుల్లోనే సెకెండ్ ఫాం చదివింది. ఆడపిల్లలకది గొప్ప చదువే. అదీ వ్యవసాయదారుల కుటుంబాల్లో…!”

“ఊ..!”

“వాళ్ళు   పెద్దగా ‘వున్నవాళ్లు’ కాదు గానీ, మంచి కుటుంబం. పెళ్లి అయినాక నెలన్నర మా వూళ్ళోనే వుండాల్సొచ్చింది.  మద్రాసు వచ్చి నా షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదుగా. యవ్వనం ఎలాంటిదంటే సిమెంటు కట్టు కాపురానికి అంతగా అడ్డురాలేదు. ఆ తర్వాత డాక్టర్‌కి చూపిస్తే మరో నెలన్నర రెస్టు తీసుకుని తీరాలన్నాడు. నా కథని చెబుతూ విసిగిస్తున్నానేమో” అడిగాడు.

నిజమే,  ప్రతీ వ్యక్తికీ తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన చాలా ముఖ్యమైనదిగా, చాలా విలువైనదిగా అనిపిస్తుంది. ఇతరుల జీవితాల్లోనూ అలాంటివే ఉంటాయనీ, వాటిని ‘అంతగా’ వివరించక్కర్లేదని అనుకోరు.

వయసైన వాళ్లైతే మరీనూ, అందుకే ఇంట్లో వున్న వయసైన వాళ్లని పిల్లలు విసుక్కునేది. క్లుప్తంగా, చెప్పాల్సినంత వరకూ చెబితే గొడవుండదుగా.

అయితే నా పాత్ర వేరూ. ‘కొంచెం’ ‘క్లుప్తంగా’ ‘చెప్పండి’ అనడానికి వీల్లేదు. అలా అంటే ఆయన చిన్నబుచ్చుకుని చెప్పాల్సిన ముఖ్యమైన విషయాల్ని చెప్పలేకపోవచ్చు.

“లేదు లేదు.. చాలా ఇంట్రెస్టింగా ఉంది. చెప్పండి..!” అన్నాను.

“ఏతావాతా మూడు నెలలు మావూళ్లోనే వున్నాను. దాంతో నా భార్య సరోజకి నెల కూడా తప్పింది. మళ్లీ మద్రాసొచ్చాను. అందరూ మహదానందంగా ఆహ్వానించారు. షూటింగ్ మొదలైన వారం రోజుల తరవాత మా నాన్న పోయారని ‘తెలిగ్రాం వచ్చింది”

మరో నిట్టూర్పు. ఇది ‘జ్ఞాపకాల సమాధి’ ని తవ్వి తీస్తున్న నిట్టూర్పు.

మళ్ళీ వూరెళ్ళాను. దినకర్మలు పూర్తిచేసి తిరిగి వచ్చేసరికి పదిహేను రోజులైంది. మళ్ళీ షూటింగ్ మొదలైన రెండు రోజులకి నిర్మాత బాత్‌రూంలో కాలుజారి పడ్డాడు. కాలు బెణికిందిగానీ ‘తుంటి’ భాగం బాగా రప్చరైంది. మద్రాసు సెంట్రల్ దగ్గరున్న G.H. (జనరల్ హాస్పిటల్) డాక్టర్లు   కనీసం మూడు నెలల రెస్ట్ ఇవ్వమన్నారు. మళ్లీ షూటింగ్ ఆగింది..!”

“ఊ”

“ఇన్నిసార్లు షూటింగ్ ఆగటంతో నాకు ‘అన్‌లక్కీ’ అన్న పేరొచ్చింది. పేరొచ్చింది అనడం కంటే అలా కొంతమంది నన్ను ప్రొజక్ట్ చేశారనడం సబబు. సంసారం ‘రుచి’ మరిగినవాడ్ని. హీరోయిన్ కూడా క్లోజ్‌గా మూవ్ కావడంతో ‘కాస్త’ దారి తప్పాను. నాకేం తెలుసు, నటీమణుల(కొందరి) కళ్లు మనమీద కన్నా మన పర్సు మీదే వుంటాయనీ. వ్యవసాయం మూలబడటంతో ( మా నాన్న మృతివల్ల) నాకు ఇంటినుంచి వచ్చే రాబడి తగ్గింది. నెలకీ, రెణ్నెల్లకీ ఊరు పోవడం ఎకరమో, రెండెకరాలో అమ్మడం మామూలైంది. నా భార్య అడ్డుపడ్డా లాభం లేకపోయింది. ఆ నటీమణి మత్తులో నేను పూర్తిగా కూరుకుపోయానని అప్పుడు నాకే తెలీదు. నా పిక్చర్ రిలీజైతే నంబర్ వన్ నేనే అవుతాననీ, కుప్పలు తెప్పలుగా డబ్బు సంపాదిస్తానని నా నమ్మకం.: మళ్లీ మరో నిట్టూర్పు.

“మరి…”అడగాల్సింది అడగలేక ఊరుకున్నాను.

“మీరు అడగబోయి ఆగిన ప్రశ్న నాకు అర్ధమైంది.. ఎవరూ’సుద్దులు’ చెప్పలేదా? అని కదూ? చెప్పారు.. జగ్గయ్యగారు చెప్పారు. యీ సినీ పరిశ్రమలో సత్‌ప్రవర్తన ముఖ్యమనీ, దానికి చాలా విలువుందనీ.. వింటేనా? మూడు నెలలు గడిచాక డైరెక్టర్ భార్య చనిపోయింది. దాంతో మళ్లీ కొన్ని రోజులు షూటింగ్ ఆగింది. నా ఫేట్ ఏమోగానీ మళ్లీ షూటింగ్ మొదలు కాకముందే ప్రొడ్యూసర్ ‘హరీ’ అన్నాడు. దాంతో నాది ‘ఇనపపాదం’ అన్నారు. పిక్చర్ ఆగిపోయింది. ఓ ఆవేశం, పట్టుదలతో నేనే మిగిలిన పరికరాల్నీ కారు చౌకగా అమ్మి సినిమా పూర్తి చేద్దామనుకున్నా. నాకూ, మా అవిడకీ గొడవలు జరిగాయి. అయినా ఆస్తి అమ్మి మద్రాసు వచ్చి షూటింగ్ మొదలెట్టించా. చనిపోయిన ప్రొడ్యూసర్ కొడుక్కి అప్పటిదాకా అయిన ఖర్చుని ముట్టజెప్పి సినిమాకి నేనే ప్రొడ్యూసర్‌నయ్యా.  డైరెక్టర్ నాకు సినిమా నిర్మాణం గురించి ఏమీ తెలియదని తెలుసుకుని సినిమాని చుట్టేశాడు గానీ, ఖర్చుల చిట్టా మాత్రం భారీగా నాకు చూపించాడు. సినిమా రిలీజ్ కాలేదు. రిలీజ్ చెయ్యడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఒకరు ‘పైసా’ ఇవ్వకుండా రిలీజ్ చెయ్యడానికి ఒప్పుకున్నారు. మొదటి షో, అంటే మార్నింగ్ ‘షో’లోనే అది ఫ్లాప్ సినిమాగా పేరు తెచ్చుకుంది కానీ, నా అందం మాత్రం ప్రజల్ని ఆకర్షించిందనే చెప్పాలి.” మరో నిట్టూర్పు.

మొహంజొదారో, హరప్పాల్ని తవ్వినప్పుడు ఏం బయట పడ్డాయి? కుండపెంకులు, ఇటికలూ, ఎముకలూ, పుర్రెలూ అంతేనా?

అతని నిట్టూర్పుల్లో నాకు కనిపించినవీ అంతే.. జ్ఞాపకాల రూపంలో..

“సినీపరిశ్రమ ఓ గొప్ప ఊబి. ఇందులో దిగకూడదు. దిగాక బయటికి రావడం బ్రహ్మతరం కాదు. నా ఫెయిల్యూర్‌ని జీర్ణించుకోలేకపోయాను. అప్పటివరకు నా గోల్డ్ ఫ్లేక్ టిన్నుల్లోంచి చనువుగా సిగరెట్లు తీసుకుని తాగినవాళ్లు, నేను వాళ్ల ‘స్నేహితుడ’నని గొప్పగా చెప్పుకున్నవాళ్లు మొహం చాటేశారు. ఆస్తి పోయిందని (ఖర్చయిందని) తెలిశాక నా ‘హీరోయిన్’ ఇంట్లో వుండి కూడా ‘లేనని’ చెప్పించింది. తరవాత మరో ‘అప్‌కమింగ్’ హీరోకి ‘భార్య’గా సెటిల్ అయింది”అక్కడి దాకా చెప్పి ఆగాడు.

“నేను మళ్లీ పంతంతో మరో పిక్చర్‌లో నా ‘వర్త్‌’ ని నిరూపించుకోవాలనుకున్నాను. నా భార్యా, వాళ్ల తల్లిదండ్రులకి ఏకైక సంతానం. ఓ ఏడాది అత్తారింట్లోనే ఉండి, వాళ్లకి బాగా ‘నూరి పోసి’ అస్తిని అమ్మించి సినిమా మొదలెట్టాను. నా భార్య మొదటి కాన్పులో మగపిల్లాడ్ని, రెండో కాంపులో ఆడపిల్లని ప్రసవించింది గానీ నేను మాత్రం ‘సక్సెస్’ని సాధించలేకపోయాను. నానా కారణాల వల్ల నేను మొదలెట్టిన సినిమా ఆగిపోయింది. మూడేళ్లు గడిచాయి. నాకు మరో కొడుకు పుట్టాడు. ఓ నిజం చెప్పాలి. నేను నా భార్య దగ్గరికి వెళ్లానే గానీ ఏనాడూ నా భార్యని మద్రాస్‌కి తీసుకురాలేదు. జనందృష్టి లో నేను బ్రహ్మచారినే. పెళ్ళాయినవాడంటే ‘గ్లామర్’ పోతుందని పెళ్ళయిన విషయం ‘లీక్’ కానివ్వలా!” మరో దీర్ఘ  నిట్టూర్పు .

జ్ఞాపకాల శవాలు కాలిన వాసనుంది అందులో.

నేను ఏమీ మాట్లాడలా. గుర్తు తెచ్చుకుంటాడని మౌనంగా ఉండలేదు. మర్చిపోలేరుగా మనుషులు అడగటాన్ని.

“అప్పులు పెరిగినై. ఊళ్ళో ఇల్లూ అమ్మేశా. అప్పుడు నా భార్య ఆన్నది. నీకోసం నీ బిడ్డల్ని నాశనం చెయ్యలేనని”..దాంతో నాకు కోపం వచ్చింది. పొమ్మన్నా. వెళ్ళిపోయింది. చాలాసార్లు కలుద్దామనిపించేది. బిడ్డల్ని చూసుకోవాలనిపించేది. కానీ ఆమె అడ్డువచ్చేది!” ఈ నిట్టూర్పులో మమకారం తప్ప అహంకారం కనపడలేదు.

నా భార్య వాళ్ల మేనమామల దగ్గరకి (బోంబే) వెళ్లిపోయింది. రెండుసార్లు నా పిల్లల గురించి ఎంక్వైర్ చేశా. వాళ్లకి ఏం చెప్పారో ఏమో నా పేరు వినగానే, ‘డోంట్ టాక్ అబౌట్ హిం’ అన్నారుట.” మరో నిట్టూర్పు.

ప్రతి వ్యక్తి తన ‘తప్పుని’ సమర్ధించుకుంటాడు. యీయన ఆ ప్రిన్సిపుల్‌కి అతీతుడు కాడనిపించింది. “కేవలం ఆస్తి పాడు చేసినందువల్లే మీ పిల్లలు మీకు దూరమయ్యారా?” అని అడిగాను.

మా ఇద్దరి మధ్యా ‘నిశ్శబ్దం’ చాలా సేపు రాజ్యమేలింది. “నేను మరో తప్పు చేశా. అది ‘తాగుడు.’ నా పరాజయాన్ని జీర్ణించుకోలేక తాగుడు  మొదలెట్టా.. బానిసనయ్యాను. రెండో సినిమా కోసం బంగళా అమ్మేశా. టి.నగర్ రైల్వే ట్రాక్ పక్కనున్న గుడిసెల్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడే నా భార్యతో పోట్లాట జరగటం. ఆ కచ్చలో మరో ఎక్‌స్ట్రా నటిని దగ్గరికి తీయడం జరిగింది” తలొంచుకున్నాడు.

“మీరు గ్రాడ్యుయేట్ కదా.. కనీసం ఉద్యోగం కోసం ప్రయత్నించలేదా?” అడిగాను.

“యీ ఫీల్డు సంగతి మీకు తెలీనిది ఏముందీ? మీరు మెకానికల్ ఇంజనీరని నాకు తెల్సు. ఇపుడు మీరీ ప్రొఫెషన్ని వదిలి మళ్లీ స్పేనర్ పట్టుకోగలరా?” ఆయన మాటల్లో కొంచెం కోపం. నాకు నవ్వొచ్చింది.

“అయ్యా,  అదృష్టవశాత్తు నేను నిలదొక్కుకున్నా గనక యీ ఫీల్డులోనే వున్నాను. మీరనుకున్నట్టు నాకు ఇంకా పేరు రావాలనీ, ఇంకా డబ్బు సంపాదించి అస్తులు కూడబెట్టాలనీ ఏనాడూ లేదు. అందుకే పరిశ్రమ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయినా నేను ఇక్కడే ఉండిపోయా. నాకొచ్చే పాటలు చాలు. తీసికెళ్లలేనివి పోగు చెయ్యటం ఎందుకు?When  you can’t carry .. why should you collect?”  ఇదే నా ప్రిన్స్‌పుల్. మా నాన్నగారు నాకు నేర్పింది ఇదే.. యీ క్షణంలో కూడా ‘రెంచి్’ పట్టుకోవడానికి నేను సిద్ధమే?” అన్నాను.

“అది మీ స్వభావం. చిన్నతనం నించీ స్వేచ్చగా  పెరగటం వల్ల ఎవరి కిందో పని చెయ్యడం నామొషీ అనిపించి ఉద్యోగ ప్రయత్నం చెయ్యలేదు” నిర్లిప్తంగా అన్నాడు.

“సరే.. తరవాత ఏమైంది?”

“ఎక్‌స్ట్రాగా మిగిలా. తాగుడువల్ల అందం పోయింది. ఆరోగ్యం పాడు అయింది. నిజం చెప్పాలంటే ఏ ఎక్‌స్ట్రా నటిని దగ్గరికి తీశానో ఆవిడే మూడునెళ్ల క్రితం వరకూ నన్ను పోషించింది. మూణ్నెల్లక్రితం చచ్చిపోయింది..” మరో సుదీర్ఘ నిట్టూర్పు.

“యాదయ్య అనే పేరు పెట్టమన్నారు. ఆ పేరు మీ వాళ్లకి తెలుసా?”

“పిల్లలు చిన్నప్పుడు నన్ను యాదూ, యాదయ్యా, యాదీ అంటూ  పిలిచేవారు. అందుకే ఆ పేరు పెట్టమన్నాను.”

“సరే. నిజం చెబితే ఇది పత్రికకి ఎక్కాల్సిన కథ కానే కాదు. కానీ పంపుతా. దేనికంటే కొందరైనా మీలాగా కాకుండా ‘బాధ్యతల్ని’ తెలుసుకొంటారని. అయ్యా.. మీరేమీ అనుకోకండి. మీలో నాకు కనిపిస్తున్నది పచ్చి స్వార్ధం. దానితో మీ పెద్దల ప్రేమని గానీ, మీ భార్యాపిల్లల బాగోగులు గానీ, వృద్ధులైన మీ అత్తామామల మంచి చెడ్డల్ని గానీ చూడకుండా మీ కీర్తి కండూతి కోసం సర్వాన్ని నాశనం చేశారు.  మిమ్మల్ని విమర్శించే హక్కు నాకు లేదు. కనీసం అంత చదువు చదివి ఓ చిన్న ఉద్యోగం చేసినా ఎంతో బాగుండేది. అల్లా చెయ్యకపోగా మళ్లీ ఓ స్త్రీ మీదే ఆధారపడ్డారు. ఇప్పుడు కూడా మీ ప్రయత్నం  పిల్లల్ని మంచి చేసుకుని వారి మీద ఆధారపడాలనే గానీ వారి మీద ప్రేమవల్ల కాదు. అవునా?” సూటిగా అడిగాను.

మామూలుగా అయితే అతనెవరో ? నేనెవరో? కానీ అతనడిగింది ఆయన కథ వ్రాయమని. అందువల్లే అలా మాట్లాడాను.

విన్నాక నాకు అనిపించింది ఒకటే. మనిషి ‘ఇంత’ స్వార్ధపరుడుగా కూడా ఉంటాడా అని. కళ్లెదురుగానే ఉన్నాడుగా.

“నే తెలిసి ఏ తప్పూ చేయ్యలేదు. పరిస్థితులవల్లే ఇలా అయ్యాను” రోషంగా అని లేచాడు.

“తప్పుని పక్కవాళ్ల మీద తొయ్యడమో, పరిస్థితులను అడ్డుపెట్టుకోవడమో మీ అంత చదువుకున్నవాళ్లు చెయ్యాల్సిన పని కాదు. నా మాటలు మీకు బాధ కలిగిస్తే క్షమించండి. అయితే మీ కథని మాత్రం రాసి పంపుతాను. మీ పిల్లలు దాన్ని చదివి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అది మీ అదృష్టం.” నేనూ లేచాను.

అయ్యా.. ఇదీ సంగతి. ఇతని జీవితంలోంచి నేర్చుకోవల్సింది చాలా వుంది. కనీసం మనిషి ‘ఎలా వుండకూడదో’ తెలుస్తుందిగా. ‘బాధ్యతా రాహిత్యానికి’ ఇతనో లైవ్ ఎగ్జాంపుల్. నేను చెప్పగలిగింది ఇంతే..

 

మళ్లీ కలుద్దాం.

నమస్సులతో

భువనచంద్ర

Download PDF

10 Comments

  • మేము ఒక్క సినిమాలో నటించిన వాళ్ళని సరదాగా “ఏకచిత్రాధిపతి” అనేవాళ్ళం. మీ “ఏక్ ఫిలిం కా సుల్తాన్” కథ (కథ అనకూడదేమో) బాగుంది. అతని మీద జాలిపడకుండా అతని తప్పులకు అతన్నే బాధ్యుణ్ణి చేస్తూ రాయటం గొప్పగా వుంది. అది నిజం కూడా. ఓ విషాదమైన జాలి కథగా కూడా ఇదే విషయాన్ని రాయవచ్చు. అలా రాయని మీ సంయమనాకి, మీ వాస్తవిక దృష్టికి అభినందనలు.

    • BHUVANACHANDRA says:

      ధన్యవాదాలు సత్యప్రసాద్ గారూ ……thank యు….

      • BHUVANACHANDRA says:

        మీరు రాసిన కదా చదివాను …చాలా బాగుంది …ఇంకా ఇంకా రాయండి ….నమస్తే

  • యాజి says:

    ఏ రకంగా చూసినా ఏ మాత్రం జాలి కలిగించలేని కారెక్టర్. మీరు చివరకు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. కొద్దిగా పశ్చాత్తాపమున్నా, తల దించుకొని వెళ్ళేవాడు. ఇంకా “పరిస్థితుల ప్రభావం” అంటూ సమర్ధించుకొస్తున్నాడంటే, ఆ మనిషి వ్యక్తిత్వం ఏమిటో తెలుస్తోంది. I pity his children!

    • BHUVANACHANDRA says:

      థాంక్స్ యాజీ గారూ …….పిల్లల గురించిన ఆలోచన చేసివుంటే ఆయన కధఅసలు మనకు తెలిసేదే కాదు ….అయితే ఈ పరిశ్రమలో ”స్త్రీల”మీద ఆధారపడి బతికేవాళ్ళు చాలామంది వున్నా ….ఇతని లా కాదు ….థాంక్స్ సర్

  • DrPBDVPrasad says:

    సెకండ్ ఫారం మాత్రమే చదివిన అతని భార్యని గురించి రాయగలిగితే మంచికథ అయ్యేది.పిల్లల్ని ప్రయోజకుల్ని చేసే తల్లి తండ్రి తానే అయినందుకు ఆమెను గురించి రాస్తే వ్యక్తిత్వ వికాస రచయితలకయిన ఆమె జీవితం మంచి సబ్జెక్టే

    • BHUVANACHANDRA says:

      మీది చక్కని సూచన …….ఆమె వివరాలు తెలుసుకుని ఆమె అనుమతిస్తే తప్పక రాస్తాను ….థాంక్స్ ప్రసాద్ గారూ

      • DrPBDVPrasad says:

        వ్యసనాలకు లోనై కుటుంబాన్ని ఏడిపించే అటువంటి వ్యక్తులపైన చికాకు కలిగనా
        “అయ్యా.. ఇదీ సంగతి. ఇతని జీవితంలోంచి నేర్చుకోవల్సింది చాలా వుంది. కనీసం మనిషి ‘ఎలా వుండకూడదో’ తెలుస్తుందిగా. ‘బాధ్యతా రాహిత్యానికి’ ఇతనో లైవ్ ఎగ్జాంపుల్. నేను చెప్పగలిగింది ఇంతే..” అన్న మీ పదాలపైన ,కథలో కనపడని ఆమే(అతడి భార్య) పైన చాల గౌరవం కలుగుతాయి

        హార్థిక సాహిత్యాభినందనలతో

  • వంగూరి చిట్టెన్ రాజు says:

    మీ కథ ఇప్ప్పుడే చదివాను. నిజమో కాదో తెలియదు కానీ కథా, కథనం, ముగింపు,.. అద్భుతం.
    మీలా వ్రాయగలిగే (నై) పుణ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో అని అసూయ పడ్డాను.

    –వంగూరి చిట్టెన్ రాజు

    • BHUVANACHANDRA says:

      రాజా గారూ ….నన్ను ఉత్సాహ పరచడానికి అలా అన్నారని నాకు తెలుసు …..లేకపోతె మీముందు నేనెంత ….మీరిచ్చిన ఉత్సాహంతో మరిన్ని కధలు రాస్తాను ……..సదా మీ ఆశీస్సులు కోరుకునే మీ భువనచంద్ర

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)