అదే…అదే..మణిమహేష్!

( గత వారం తరువాయి)

అలా ఓ మూడుగంటలు కబుర్లతో సాగగా  మొత్తం పది కిలోమీటర్లు గడిచి ‘సుంద్రశ్’ అన్న ప్రడేశం చేరాం, దాని పొలిమేరల్లోనే నాజూకు స్వరూపం, పల్చని శరీరం ఉన్న ఓ నలభై ఏళ్ల మనిషి కనిపించి మాటల్లో పెట్టాడు.  ‘అదిగో ఆ చిట్ట చివర ఉన్న లంగరు మాదే. మీరు వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి సేద తీరాలి’ అన్నాడు. వెళ్లాం. మాటల్లో తెలిసింది.  ఈయన బెంగుళూరులో మెడిసిన్ చేసారని.  కాంగ్రా జిల్లాలో గవర్నమెంటు డాక్టరు. “మొన్న ఉత్తరాఖండ్ ఉత్పాతం వల్ల యాత్రికుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. లేకపోతే ఈపాటికి కిటకిటలాడుతూ ఉండవలసింది” అన్నాడాయన.

బడలికలూ, ఆకళ్ళూ తీర్చుకొనేసరికి మూడయిపోయింది.  భోజనంతోపాటు లౌడ్‌స్పీకర్లో శివభక్తి గీతాలు… వాటి పారవశ్యంతో చిందులు వేస్తోన్న ఆబాలగోపాలం. ఈలోగా నేనూ ఉన్నానంటూ భోరున వర్షం. అసలు అప్పటిదాకా కురవకపొవడమే విశేషం. ఏదేమైనా వర్షం పుణ్యమా అని సందిగ్ధంలో పడ్డాం. ఆలోచనలు .. చర్చలు..

“ఇంకా మూడు కిలోమీటర్లూ, రెండు గంటల ప్రయాణం ఉంది. వర్షం వెలిసిన మాట నిజమే గానీ మళ్లీ కురిసే అవకాశం ఉంది.  తెగబడి వెళ్ళడం ఎందుకూ? ఈ ప్రదేశం బావుంది. వసతి పుష్కలంగా ఉంది. రాత్రికుండిపోదాం” నా ప్రపోజలు. అందరూ ఓకే అన్నా నాయకుడు సంజయ్ వీటో చేసాడు. “పోనీ మీరూ, ముక్తా గుర్రాలమీద రండి. మిగిలిన అయిదుగురం రిస్కు తీసుకుని నడచి వస్తాం” అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే అదే మంచి నిర్ణయం అని తేలింది. నలభై నిమిషాలు. ఆశ్వారోహణ చేయగా మరో రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న ‘గౌరీకుండ్’ చేరాం. ‘పార్వతీదేవి స్నానాలు చేసే కుండమిది’ అని జనుల నమ్మకం.

ఇహ వెళ్లాల్సింది ఒకే ఒక్క కిలోమీటరు. వర్షం పూర్తిగా వెలిసింది. అందరం వచ్చేదాకా ఆగుదాం’ అని నేనూ, ముక్తా అక్కడ దిగాం.  మిగిలిన యాత్రికులు దాదాపుగా లేరు. ‘తన మొక్కు తీర్చుకోవడం కోసం ఆ రాళ్లల్లో, నీళ్లల్లో, మంచులో, చలిలో నగ్న పాదాలతో పైకి వెళుతోన్న ఓ పాతికేళ్ళావిడా, ఆవిడ అడుగులకు మడుగులొత్తుతూ సహకరిస్తోన్న అన్యోన్యపు భర్తా – అక్కడ కనిపించిన అపురూప దృశ్యం’ రెండు మూడు లంగర్లు … ఓ డిస్పెన్సరీ.. అరడజను ధాభాలు.. హెచ్‌పి సర్కారు వారి అత్యాధునిక టెంట్లు వంటి ముచ్చటైన ప్రదేశం ఆ గౌరీకుండ్. అల్లదిగో ఆ చిరుకొండ వెనకనే మణిమహేశ్వర్  అన్నారు.

 SAM_9371

సంజయ్, ముక్తాలతో నాది పదిహేనిరవై ఏళ్ల పరిచయం . అప్పట్లో ఓ ఆఫీసు సాంస్కృతిక కార్యక్రమానికి ముక్తా , నేనూ వ్యాఖ్యాతలుగా వ్యవహరించాం కూడానూ. స్నేహం కాకపోయినా మంచి పరిచయం, చనువూ ఉన్నాయి. మా బృందం రావడానికి మరో గంటైనా పడుతుంది గాబట్టి అక్కడి లంగర్లో చెప్పి మరీ పంచదార లేని టీ చేయించుకుని తాగాం. వంద గజాల దూరాన ఉన్న నదీ వంతెన దగ్గరకు నడక సాగించాం. మాటల మధ్యలో “ఎంతవరకు చదువుకున్నావు” అని అడిగాను. “ఎమ్మెస్సీ మాత్స్” అంది. అంత చదివి కనీసం టీచరుగానైనా ఉద్యోగం చెయ్యాలనిపించలేదా? వాటే వేస్టావ్ రేర్ టాలెంట్” అని నావైన దుడుకు బాణీలో నిష్ఠూరించాను. నవ్వేసి ఊరుకుంది. ఓ పది నిమిషాల తర్వాత వివరించింది. “నాన్న గవర్నమెంటు ఉద్యోగి. నాకు పెళ్ళి అవకముందే హృదయ రోగిష్టి అయ్యారు. అమ్మకు అంతగా వ్యవహారజ్ఞానం లేదు. ముగ్గురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. నా పెళ్ళి దగ్గర్నించి ఇంట్లో అన్ని వ్యవహారాలకూ  నేనే పెద్దను. అదిగాక నా భర్త, పాప, సంసారం. ఆపైన రెండువైపులనుంచి దగ్గర బంధువుల తాకిడి. వీటన్నిటి మధ్య ఉద్యోగం గురించి ఆలోచించే అవకాశం లేకపోయింది. తమ్ముడు ఆలస్యంగా  ఈ మధ్యనే జీవితంలో సెటిల్ అయ్యాడు..” పి.సత్యవతి గారు మెచ్చరేమో అనిపించినా ఇదంతా విన్నాక ఆవిడంటే గౌరవం పదిరెట్లు పెరిగింది.

అందరూ గౌరీకుండ్ చేరేసరికి దాదాపు ఆరు. మరో ముగ్గురు గుర్రాలవైపు మొగ్గు చూపారు. అప్పటికే పరిచయమయిన సురేంద్రపాల్‌గారి లంగర్లో టీలు తాగి మమ్మల్ని ఆ రాత్రికి అక్కడే ఉంచేలా ఆయన చేసిన ప్రయత్నాలను సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగాం. ఓ పంజాబు గ్రామ పంచాయితీ సెక్రటరీ అట ఆయన.

అంతా కలిసి అయిదుగురం గుర్రాలమీద, సంజయ్, ప్రధి కాలినడకన గౌరీకుండ్, మణిమహేశ్వర్‌ల మధ్య ఆ నలభై నిమిషాలలో సూర్యుడు, మబ్బులు, కొండలు, లోయలు, పచ్చని పచ్చిక, గాఢపు నీలాకాశం – అన్నీ కూడబలుక్కొని అద్భుత సౌందర్య ఆవిష్కరణకు పూనుకొన్నాయి. ఎదురుగా సువిశాలమైన లోయలో వేలాడుతూ మేఘాలు, వాటిమీద రంగులు చిమ్ముతూ అస్తమించే సూర్యుడి బంగారు కిరణాలు. ఆ కిరణాల సుతిమెత్తని స్పర్శలో ధగధగ వెలిగిపోతున్న హిమగిరి శిఖరాలు. ఓ పావుగంటా ఇరవై నిమిషాలు గుండె గొంతులోన కొట్టాడింది. గుర్రం మనిషిని అడిగి, ఆపించి రెండు మూడు ఫోటోలు తీసానేగాని అసలు ఆ క్షణాలు గుర్ర్రం మీద ఉండదగినవి కాదు. నడక అయితే బావుండేది.

ముసిరీ ముసరని చీకట్లలో ఏడుగంటలవేళ ఏడుగురమూ మణిమహేష్ సరోవర తీరం చేరాం. చిన్న తటాకమది. చుట్టూ అరకిలోమీటరు పొడవున పరిక్రమ మార్గం, ఎదురుగా నిడుపాటి మణిమహేష్ శిఖరం. శిఖరాగ్రాన మంచు తొడుగు. కొండ చరియల్లో గ్లేషియర్లు. అటు ఇటు గరుకుపాటి పర్వత శ్రేణులు. వెనక్కి తిరిగితే గౌరీకుండ్. ఇంకా ఆపైన కనిపించే  సువిశాలమైన లోయ. ప్లాస్టిక్కు, కల్మషమూ లేని  సరోవర జలాలు. అందులో ప్రతిబింబించే కైలాస పర్వతం .. చక్కని దృశ్యం. దేవుడి సంగతి దేవుడెరుగు.. నాలాటి సామాన్యునికి సరిపడే సౌందర్యం పుష్కలంగా  ఉంది. అక్కడి సంప్రదాయమేమో.. గుడి అంటూ శాశ్వత నిర్మాణం ఏమీ లేదు. సరోవర తీరంలో ఒకచోట చిన్నపాటి అరుగు. శివుని ప్రతిమ. అలంకరణ.. పూజలు.. అరడజనుకు పైగా లంగర్లూ. దాభాలూ.. విశాలమైన గుడారాల నివాసాలు. సూర్యుని అంతిమ వెలుగురేకల్లో కైలాస శిఖరాన్ని చూసి పరవశిస్తోన్న పదీ పదిహేనుమంది భక్తులు.. నిశ్శబ్ద ప్రశాంత వాతావరణం.

అందము, ఆనందమూ ఎలా ఉన్నా అందరమూ విపరీతంగా అలసిపోయి ఉన్నాం. జీరో డిగ్రీల దరిదాపుల్లో చలి. అంచేత స్నానాల ప్రసక్తి లేనేలేదు. ఉన్నంతలోనే కొంచెం ఫ్రెష్ అయ్యి. ఎనిమిదిన్నరకల్లా లంగరు భోజనాలు ముగించుకొని గుడారాలలో నిద్రకు ఉపక్రమించాం. తెచ్చిన స్వెట్టర్లన్నీ వదలకుండా వేసుకొన్నాం. వాళ్ళిచ్చిన రెండు రెండూ రగ్గులకు తోడు రెండు అడిగి పుచ్చుకున్నాం. మొత్తానికి చలిపులి బాధ తెలియకుండా రాత్రి గడిచింది.

అన్నట్టు అవి పున్నమి రాత్రులు. నేనూ సంజయ్ ముందే అనుకొని తెల్లవారుఝామున నాలుగు గంటలకు గుడారం బయటకు వచ్చాం నిండుచంద్రుడు. వందలాది తారలు. వెండి కైలాసశిఖరం. మరువలేని అనుభవం. అన్నట్టు ఆ శీఖరాగ్రాన భక్త శిఖామణులకు ఒకోసారి రాత్రిళ్లు మణీదీపాల వెలుగు కనిపిస్తుందట. శబరిమలై శైలిలో నన్నమాట. మాకా ఛాయలు కనిపించనేలేదు. విశ్వాసం ముఖ్యం గదా!

ఆగస్టు 23 ఉదయం ఆరింటికే రోజు మొదలయింది.

100_8613

సరోవరం చుట్టూ ఒకటికి రెండుసార్లు ప్రదక్షిణ. “అరే.. నీళ్లమీద  మెరుస్తూ ఏవిటదీ?’ అని వెళ్లి చూస్తే పలకలు గట్టిన మంచు. ఆ మంచునీళ్లలోనే స్నానాలు చేస్తోన్న సాహస భక్తులు. మేమంతా భయపడినా ప్రధి సాహసించాడు. అయిదారు మునకలు వేసాడు. రెండోమునక అతికష్టమయినది. ఉండేలు దెబ్బ తెలియని పిల్లకాకుల్లా మొదటి మునక చలాగ్గా వేసేస్తాం. దాంతో రుచి తెలుస్తుంది. రెండోది వెయ్యడానికి పదిరెట్లు ధైర్యసాహసాలు కావాలి’ అన్నది అతని చక్కని విశ్లేషణ.

సంజీవ్‌గారు పూజ అన్నారు. అదో అరగంట. లంగర్లో ఒకటికి రెండుసార్లు వేడివేడి అతి తియ్యని తేనీరు తాగి, అల్పాహారమూ ‘స్వీకరించి’ మరోసారి, మరోసారి  తటాకాన్నీ, అబేధ్యమైన (ఇప్పటిదాకా ఎవరూ ఎక్కలేకపోయిన ) కైలాసశిఖరాన్ని చూసి, చూసి మనసులో నింపుకొని  ఏడున్నరకు తిరుగు ప్రయాణం మొదలెట్టాం. హడ్సర్ చేరేసేరికి సాయంత్రం మూడున్నర . “ఓరిదేవుడో… ఈ దిగడం కన్నా ఆ ఎక్కడమే సుఖంగా ఉంది” అని (అసహజంగా) అనిపించిన మార్గమది!

నా కాలు (ఇదే చివరిసారిలెండి!) చిద్విలాసాలు చిందుతూ కనిపించింది. పట్టరాని ఆశ్చర్యం నాకు. భక్తులూ, ఆస్తికులూ – ఇదంతా ఆ మహాదేవుని లీల. అనే సందర్భమిది. మరి నాలాంటి అవిశ్వాసికి ఆ అవకాశం లేదాయే!!

ఉపశృతి:

1. పైకి వెళ్ళేటపుడూ, కిందకు దిగేటపుడూ ఓ అచ్చమైన పంజాబీ గ్రామీణ కుటుంబం తోడుగా వచ్చింది. భీష్మాచార్యుని వంటి తాతగారు, నాలుగేళ్ళ బుడుగులాంటి మనవడు. వాడి అమ్మా, నాన్నా, బాబాయి, అత్తయ్య, నాయనమ్మా, దారంతా మాటలు – తాతామనవళ్ళతో విడివడేటప్పుడు పచ్చబొట్ల పల్చని ముప్పై ఏళ్ల అత్త్తయ్య వచ్చి పరిచయం చేసుకొంది. ఊళ్లో టీచరట. వాళ్ల జీపు బయల్దేరుతోంటే, తాతామనవళ్ళు వీడ్కోలు చెప్పడం సరేసరి.. ఈవిడ పక్కసీట్లోంచి వంగి తల బయటపెట్టి మరీ ఆత్మీయంగా చెయ్యి ఊపింది. నాకీ పుణ్యయాత్రలో సరైన విశ్వాస స్నేహఫలం దొరికిందని అంబరమంత సంబరం.

2. ఏసీ రైళ్లు, ఇన్నోవాలూ, గుర్రాలూ – ఇన్ని హంగులతో ప్రయాణం చేసినా ‘సత్రం భోజనం – మఠం నిద్ర ‘ పుణ్యమా అని మా ఖర్చు మనిషికి నాలుగువేలే.. ఎంత చవక!!

 – దాసరి అమరేంద్ర

 

 

Download PDF

2 Comments

Leave a Reply to amarendra Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)