తెలంగాణా కవులు/ రచయితలూ ఇపుడేం చేయాలి?

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

 

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

యివాళ్ళ తెలంగాణ రచయితలు ఒక చౌరస్తాలో నిలబడి ఉన్నారు. గత దశాబ్ది కాలంగా తెలంగాణ రచయితలు, తెలంగాణ అస్తిత్వాన్ని, విముక్తి, స్వేచ్చా స్వాతంత్ర్యాకాంక్షలను, ప్ర్రత్యేక రాష్ట్ర  ఆకాంక్షలను యెలుగెత్తి చాటారు. తమ రచనల్లో – పాట, కవిత్వం, కథ, నవల, సాహిత్య విమర్శ – అన్ని సాహితీ ప్రక్రియల ద్వారా ప్రధానంగా  వారు చాటింది ఈ ఆకాంక్షలనే! అయితే కేవలం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష్లని మాత్రమే చాటితే తెలంగాణ సాహిత్యం రాజకీయ ప్రచార సాహిత్యం మాత్రమే అయి ఉండేది. కానీ గత దశాబ్దంన్నర కాలంగా తెలంగాణ రచయితలు సృష్టించిన సాహిత్యం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మాత్రమే కాకుండా,  అనేక విషయాలని తడిమింది.

ముందుగా తెలంగాణ రచయితలు తమ అస్తిత్వాన్ని కనుక్కొన్నారు. తెలుగు భాష, సంసృతి, సాహిత్యం మొత్తం కూడా యెట్లా ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలోని కొన్ని సామాజిక వర్గాల  వారి గుప్పిట్లోనే ఉండిపోయి, వారు రాసిందే సాహిత్యం, వారు మాట్లాడిందే భాష, వారిదే అసలైన సంస్కృతి అనే పద్దతిలో చలామణీ అయిందో, ఈ క్రమంలో మిగతా వెనుకబడ్డ ప్రాంతాల వారి సాహిత్యం, భాష, సంస్కృతుల లానే తాము కూడా యెట్లా అణచివేతకు గురయ్యారో, అయితే తాము గురయిన అణచివేత కు ప్రత్యేక చారిత్రిక కారణాలూ, ప్రత్యేక సందర్భమూ యెట్ల్లా ఉన్నయో గుర్తించారు. నిజానికి ప్రజా సాహిత్యం లో ప్రజల భాషకు పెద్ద పీట వేసినప్పటికీ , మాండలిక భాష అంటూ తెలంగాణ భాషకున్న ప్రత్యేక అస్తిత్వాన్ని, చారిత్రిక నేపథ్యాన్ని ప్రగతిశీల వాదులుగా చెప్పుకుంటున్న వారు కూడా   గుర్తించ నిరాకరించారో, తెలంగాణ రచయితలు బట్టబయలు చేసారు. తెలంగాణ లో మరుగున పడ్డ అనేక గొప్ప సాహిత్యకారులను, వారు సృష్టించిన సాహిత్యాన్ని వెలికి తీసారు. సాహిత్య విమర్శకు కొత్త తెలంగాణ దృష్టిని దృక్కోణాన్ని అందించి పదునెక్కించారు. గత తెలుగు సాహిత్య చరిత్రనూ దృక్పథాలను తెలంగాణ దృక్పథంతో వినిర్మాణం చేసి సాహిత్య చరిత్రనూ, సాహిత్య విమర్శనూ తిరగ రాసారు. కొత్త తెలంగాణ సాహిత్య శకాన్ని సృష్టించారు.

అట్లే తెలంగాణ ప్రజా జీవితంలో, సంస్కృతిలో, చరిత్రలోని అనేక అంశాలని వెలికితీయడమే కాకుండా , కొత్తగా కనుగొన్నారు, సూత్రీకరించారు, సిద్ధాంతీకరించారు . దీని వెనుక – తెలంగాణ సాహిత్యకారులు తమ సాహిత్య చరిత్రను (గత చరిత్రనూ, నడుస్తున్న చరిత్రనూ)   పునర్నిర్మించడానికీ, పునర్లిఖించడానికీ,  వినూత్నంగా కనుక్కోవడానికీ (discover ), “కేవలం తెలంగాణ దృష్టీ దృక్పథమూ మాత్రమే ప్రధానం”  అనే ‘సంకుచితంగా’ కనబడుతున్నట్ట నిపించే భావన ఆలంబన ఐంది. ‘సర్వే జనా సుఖినోభవంతు’ నుండి ‘ప్రపంచ కార్మికులారా యేకం కండి”  నుండి, ‘రైతాంగ ఆదివాసీ విముక్తి పోరాటాలు వర్దిల్లాలి’ నుండి ఒక ప్రాంతీయ వాద దృక్పథానికి సాహిత్యంలో localized outlook కీ, expression కీ ప్రయాణించారు తెలంగాణ రచయితలు.

అయితే ఈ ప్రయాణానికి తెలంగాణ ఉద్యమ  చారిత్రక సందర్భం యెంత దోహదపడిందో , తాము తెలంగాణ సమాజపు అనేక దశల్లో సాధించిన పరిణామాలు, పరిణతీ, acquire చేసుకున్న చారిత్రిక అనుభవమూ, జ్ఞానమూ అంతే దోహదపడ్దాయి. యేదీ సమాజంలో చరిత్ర లేకుండా ఊడిపడదు కదా! అయితే కొన్ని సందర్భాల్లో తెలంగాణ రచయితలు ఒక తీవ్రమైన దృక్పథాన్ని అవలంబించి కొంత గత చరిత్రని నిరాకరించిన సందర్భమూ లేక పోలేదు. అచారిత్రికంగా అనిపించినా ఇది అన్ని అస్తిత్వ వాద ఉద్యమాల్లో మనకు సాధారణంగా కనబడే లక్షణమే! తమని తాము  నిర్మించుకునేందుకు, స్థాపించుకునేందుకు చాలా సార్లు పునాదుల్నీ, నేపథ్యాన్నీ పూర్తిగా నిరాకరించే ధోరణి సరైంది కాకపోవచ్చేమో కాని అసందర్భమూ అచారిత్రికమూ మాత్రం కాదు. ముఖ్యంగా ఒక ప్రాంతం విముక్తి కోసం పోరాడుతున్న ఉద్యమ నేపథ్యంలో, అన్ని రంగాల్లో  జరిగే assertions లో ఇది మనం చూస్తాం. అదే తెలంగాణ రచయితల్లో సాహిత్య విమర్శకుల్లో కూడా వ్యక్తమైంది.

ఐతే తెలంగాణ జీవితాన్ని అనేక సందర్భాల్లోంచి, అనేక పార్శ్వాలనుంచి, అనేక కోణాలనుంచి తెలంగాణ సాహిత్యం తెలంగాణ ఉద్యమ బీజాలు మొలకెత్తడం ప్రారంభించిన 1990 దశాబ్దం అర్ధ భాగం నుండే అద్భుతంగా ఆవిష్కరించడం ప్రారంభించింది. యే కాలంలో నైనా , యే స్థలంలో నైనా సాహిత్యం ఉద్యమం రాకని యెలుగెత్తే వైతాళిక పాత్ర పోషిస్తుంది అనేది తెలంగాణ విషయం లో అక్షర సత్యం. కథల్లో, నవలల్లో, కవిత్వంలో, మరీ ముఖ్యం పాటలో తెలంగాణ జీవితం లోని, చరిత్రలోని మున్నెన్నడూ వెలికిరాని ప్రతిఫలించని అనేక కొత్త కోణాలు ఆవిష్కరించబడ్డాయి. సాహిత్య విమర్శ కొత్త దృక్పథాలని ప్రకటించింది. ఐతే ప్రాంతీయ వాద అస్తిత్వ సాహిత్యమూ ఉద్యమంగా కనబడ్డా,  తెలంగాణ ఉద్యమమూ సాహిత్యమూ ప్రధానంగా ప్రపంచంలోని బడుగు దేశాలనీ, ప్రాంతాలనీ, ప్రజలనీ ముంచెత్తి వేసిన ప్రపంచీకరణకు ధీటుగా తన అస్తిత్వాన్ని నిలబెట్టి,  సవాలు చేసి, ప్రత్యామ్నాయంగా ఒక కొత్త సామాజిక నమూనాని ప్రకటించి, తన వనరులని తానే అనుభవించగలిగే రాజ్యనియంత్రణ, అధికారమూ కోసం చేసిన, చేస్తున్న  ఒక గొప్ప చారిత్రిక యుద్ధం ! యెలుగెత్తిన ప్రజాగ్రహ ప్రకటన! ఇందులో తెలంగాణ రచయితలు గొప్ప చారిత్రిక పాత్రను పోషించారు. పోషిస్తున్నారు. యిట్ల్లా ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చిన అస్తిత్వ ఉద్యమాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుంది, తెలంగాణ సాహిత్యమూ సాహిత్యకారులూ తెలంగాణ ఉద్యమానికి జెండాలై రెప రెప లాడుతారు.

యివాళ్ళ తెలంగాణ రచయితలు ఒక చౌరస్తాలో ఉండడానికి కారణం తెలంగాణ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంధి దశ!

ఒక వైపు కేంద్రంలో అధికారం లోనున్న ఒక ప్రధాన జాతీయపార్టీ అనేక సంవత్సరాల జాప్యం తర్వాత ప్రజా ఉద్యమాల పెను ఉప్పెనల ఒత్తిడికీ, మరుగుతున్న తెలంగాణ ప్రజాగ్రహానికి జడిసి, యెడతెరపిలేకుండా కొనసాగుతున్న తెలంగాణ యువకుల ఆత్మబలిదానాలకు తలవంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. అయితే ఇప్పటిదాకా యెక్కడుందో కూడా తెలియని సమైక్యాంధ్ర ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన మరుక్షణమే ప్రత్యక్షమై నాటినుండి నేటి దాకా అనేక కుట్రలూ, కూహకాలతో కేంద్రప్రభుత్వం మీద వత్తిడి పెంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టివేయాలని రాజకీయ పార్టీలకు అతీతంగా సీమాంధ్ర పెత్తందార్ల నాయకుల కనుసన్నల్లో నడుస్తూ చేతననంతగా ప్రయత్నించినస్తున్నది. తిరిగి 2009 డిసంబర్ ను పునరావృతం చేయాలని శాయశక్తులా కుట్రలు పన్నుతున్నది. అందుకే తెలంగాణ రచయితల మీద బాధ్యత నాలుగు రెట్లవుతున్నది.

నారాయణస్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి

ఒకటి: గతంలో లాగే (వీలయితే ఇంకా ఉధృతంగా) తెలంగాణ అస్తిత్వం నిలుపుకునే సాహిత్యం సృష్టిస్తూ పోవడం,

రెండు: వచ్చిన తెలంగాణ యేదో ఒక రాజకీయ పార్టీ అనుగ్రహిస్తేనో, దయాదాక్షిణ్యాల భిక్షలాగానో రాలేదని అది తెలంగాణ ప్రజా ఉద్యమాల వల్ల, ఆత్మ బలిదానాల వల్ల వచ్చిందనీ స్పష్టంగా గుర్తెరిగి దానిని కాపాడుకునే దిశగా ఉద్యమ సాహిత్య సృష్టి చేయడం,

మూడు: జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం స్పష్టంగా సీమాంధ్ర పెత్తందార్ల , దొపిడీ దార్ల నాయకత్వంలో వారి ప్రయోజనాలకోసం సాగుతున్న ఉద్యమమనీ దానికి నిజంగా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు యెంతమాత్రమూ పట్టవనీ (నిజంగా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలే ప్రధానమై ఉంటే శ్రీకాకుళం నుండి అనంతపూర్ దాకా ప్రజలని పట్టి పీడిస్తున్న అనేకానేక సమస్యలమీద ఉద్యమం జరిగి ఉండేది) కేవల హైదరాబాదుని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న  రాజకీయార్థిక శక్తుల ప్రయోజనాలే ముఖ్యమనీ  యెలుగెత్తి చాటాలి.

నాలుగోదీ ముఖ్యమైనదీ – ఇప్పుడు పెత్తందార్ల కనుసన్నల్లో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం కుట్రపూరితంగా  తెలంగాణా ప్రజలకూ, సీమాంధ్ర ప్రజలకూ మధ్య సృష్టిస్తున్న తీవ్రమైన వైషమ్యాలనూ, వైమనస్యాలనూ రూపుమాపేందుకు, తిరిగి సామాన్య తెలుగు ప్రజల మధ్య స్నేహపూరిత సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించేందుకు పూనుకోవాలి. ఈ పని రచయితలే చేయగలరు.

బాధ్యత సీమాంధ్ర రచయితలమీదా ఉన్నప్పటికీ, ప్రధానంగా ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించాల్సింది తెలంగాణ రచయితలే! యిరు ప్రాంతాల తెలుగు ప్రజల మధ్య ఒకరి హక్కులను ఒకరు, ఒకరి స్వేచ్చను యింకొకరు, ఒకరి వాటాను యింకొకరు, ఒకరి అభివృధ్ధిని యింకొకరు, ఒకరికొకరు భంగం కలుగకుండా గౌరవించుకుని facilitate చేసుకుని, పంచుకునే ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పే అత్యవసర కర్తవ్యానికి  తెలంగాణ రచయితలు పూనుకోవాలి. ఈ పని యిరు ప్రాంతాల రాజకీయ పార్టీలు వాటి నాయకులూ చెయ్యరు – అందుచేత దీనికి తెలంగాణ రచయితలే పూనుకోవాలి! అప్రజాస్వామిక వలస  పాలకులనీ, అన్ని రంగాల్లో  వారి అంతర్వలసీకరణ ఆధిపత్య ఆజమాయిషీ కుట్రలనీ యెట్లా ఐతే వ్యతిరేకించి తిప్పికొట్టడానికి పదునైన సాహిత్యాయుధాలని సృష్టించారో, అట్లే యిరుప్రాంతాల ప్రజలు విడిపోయి సఖ్యంగా ఉండేందుకు, విభజన సృష్టించే అభద్రతలను పోగొట్టేందుకు, విభజన తర్వాత పంపకాలు ప్రజాస్వామ్యయుతంగా జరిగేందుకు, యిరుప్రాంతాల ప్రజల్లో ఉన్న ప్రజాస్వామిక సంస్కృతినీ , ఆకాంక్షలను కలిసికట్టుగా నిలబెట్టేందుకు తెలంగాణ రచయితలు పెద్ద యెత్తున పూనుకోవాలి – నాయకత్వం వహించాలి! యీ క్రమంలో సీమాంధ్ర ప్రాంతపు రచయితలను ప్రజాస్వామ్యయుతంగా కలుపుకుని పోవాలి. విడిపోయి కలసి ఉండే ఒక సాంస్కృతిక వారధి నిర్మించాలి.

అంతే కాదు – విభజన జరింగితర్వాత జరిగే సాహిత్య, సాంస్కృతిక పునర్నిర్మాణానికి అవసరమయ్యే ఒక్కొక యిటుకరాయినీ యిప్పట్నుంచే సమకూర్చుకోవడమూ ప్రారంబించాలి! అందు కోసము అవసరమైన భవిష్యత్తు దృష్టినీ , నిర్మాణాత్మకమైన దృక్కోణాన్నీ దృక్పథాన్నీ అభివృద్ధి చేయాలి. అంటే యిప్పటిదాకా చేస్తూ వచ్చిన వినిర్మాణాన్ని కొనసాగిస్తునే కొత్తని ప్రయత్న పూర్వకంగా నిర్మించే చారిత్రిక దృష్టిని సమిష్టిగా యేర్పర్చుకోవాలి.

– నారాయణస్వామి వెంకట యోగి

index

———————————————————————-

తెలంగాణా కవులు నిశ్శబ్దంగా వున్నదెపుడని?

ప్రస్తుత పరిస్థితులలో ఈ ప్రశ్నని ఎలా స్వీకరించాలన్నదే మొదటి సవాలు –

‘తెలంగాణా ప్రజల స్వప్నం’ సాకారమవుతోన్న వేళ ‘తెలంగాణా కవులు ఇపుడేం చేయాలి?’ అన్నదే అడిగిన వారి ఉద్దేశ్యమైతే నేనందుకు సిద్ధంగా లేను –

ఇంకా సవాలక్ష సందేహాలున్నాయి …

గతానుభవాలు మిగిల్చిన నమ్మక ద్రోహపు గాయాల సాక్షిగా, తెలంగాణా రాష్ట్ర సాకారం కల ‘ సంపూర్ణంగా’ నిజమైతే తప్ప, తెలంగాణా ప్రజలెవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు-

ప్రజాకవి కాళోజీ మాటల్లోనే చెప్పాలంటే- “ప్రజలూ – నేనూ కలిసి ప్రజల్లో ఒకనిగా ‘నా గొడవ’ బద్మాశులైన పాలకులకు చెబుతున్నాను”

కాబట్టి, తెలంగాణా రాష్ట్ర కల ఇంకా సాకారం కాలేదు కాబట్టి, తెలంగాణా కవులు తెలంగాణా ని తర  తరాలుగా  ఎలా గానం చేస్తూ వొస్తున్నారో ఆ పనిని ఇక ముందూ కొనసాగిస్తారు …

ఆ మాటకొస్తే, తెలంగాణా కవులు నిశ్శబ్దంగా వున్నదెపుడని? ….

కోడూరి విజయ్ కుమార్

కోడూరి విజయ్ కుమార్

తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట కాలంలో ప్రజల చేతిలో శక్తివంతమైన గేయాలనీ/కవితలనీ పెట్టి వాళ్ళని సాయుధులని చేసి, తాము కూడా స్వయంగా ఆ పోరాటం లోకి దిగిన కాళోజీ, సుద్దాల హనుమంతు లాంటి కవులు ఎందరో ?

అనంతర కాలంలో తెలంగాణా భారత దేశం లో విలీనమైన తరువాత కూడా భూస్వాముల/దొరల ఆగడాలను ప్రతిఘటిస్తూ సాగిన అద్భుత ప్రజా ఉద్యమాలనూ, ఆ ఉద్యమాలను అణిచివేసే క్రమంలో ప్రభుత్వాలు తెలంగాణా పల్లెలని రణభూములుగా, మరుభూములుగా మార్చి వేసినపుడు కూడా చెరబండరాజు, వరవర రావు, జ్వాలాముఖి, సిద్దారెడ్డి, అలిశెట్టి ప్రభాకర్, దర్భశయనం లాంటి కవులు గొప్ప కవిత్వాన్ని సృజించారు.

ఇక గద్దర్, గోరటి వెంకన్న లాంటి తెలంగాణా  ప్రజా వాగ్గేయకారుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? …. బహుశా, తెలంగాణా ప్రజా ఉద్యమాలతో కలిసి నడిచిన గత చరిత్ర వల్లనే అనుకుంటాను, మలి  దశ తెలంగాణా ఉద్యమంలో ‘పాట’ తరువాత,  తెలంగాణా కవిత్వమే ముందు వరుసలో నిలబడి ఉద్యమానికి బాసటగా నిలిచింది-

కాబట్టి, ఇంకా తెలంగాణా కల సాకారం కాలేదు గనుక, తెలంగాణా కవులు ఇప్పటిదాకా తాము పోషిస్తూ వొచ్చిన పాత్రనే మరింత శక్తివంతంగా పోషిస్తారు. ‘పోషించాలి’ అనే మాట ఎందుకు వాడడం లేదంటే, తెలంగాణా కవులు ఇప్పటి దాకా పోషించిన పాత్రని ఎవరో ఆదేశిస్తేనో / సలహా యిస్తేనో పోషించలేదు. తిరిగి కాళోజీ మాటనే తీసుకుంటే, తెలంగాణా కవి తన ప్రజా సమూహపు గొంతునే వినిపించాడు ఏ కాలంలోనైనా!

‘తెలంగాణా కవులు ఇపుడేం చేయాలి?’ … అనే ప్రశ్నని మరో విధంగా స్వీకరిస్తే … అంటే, ఒక వేళ తెలంగాణా కన్న కల సంపూర్ణంగా సాకారమైతే ….. అప్పుడు తెలంగాణా కవులేం చేయాలి?

ఒక్క కవులు మాత్రమే అని ఏముంది? …. ఆలోచనా పరులైన పౌరులు ఎవరైనా తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఏ అన్యాయాలని సరిదిద్ద వలసి వున్నదని తెలంగాణా ఉద్యమించిందో ఆ దిద్దుబాట్ల ప్రక్రియ నిజాయితీగా జరుగుతున్నదీ, లేనిదీ జాగరూకతతో గమనించాలి. సాటి మనుషుల పట్ల, సమాజం పట్ల బాధ్యతతో మెలిగే పౌరులకు కవిత్వ కళ కూడా వుంటే, సమాజంలోని అసమానతలని  చూస్తూ ఏమీ ఎరగనట్లు సాక్షీ భూతులుగా పడి వుండ  లేరు … రేపటి తెలంగాణా లో కవులు అసలు ఉండలేరు.

బహుశా, ప్రజాకవి కాళోజీ లా “దోపిడి చేసే ప్రాంతేతరులను /దూరంగా తన్ని తరుముదాం /ప్రాంతం వారే దోపిడి చేస్తే /ప్రాణాలతో పాతరేస్తం ” అని మరొక యుద్ధ దుందుభి మోగిస్తారు!

అయితే, కవిత్వం ఒక కళ … కవులెవరైనా పనిగట్టుకుని, అది తెలంగాణ కోసమైనా, మరొక దాని కోసమైనా, కవిత్వం రాస్తే అది మిగలదు. ప్రజల ఉద్యమాలతో, వాళ్ళ సమస్యలతో మమేకం అయిన వాళ్ళు  స్పందించకుండా ఉండలేరు  … కవిత్వం చేయగల శక్తి వున్న  వారు ఆ వేదనని కవిత్వ రూపంలో వ్యక్తం చేస్తారు … అంతే  తేడా!

తెలంగాణా ఏర్పడిన తరువాత కవులు/రచయితలు చేయవలసిన పని, మిగతా వాటి సంగతి ఎలా వున్నా, ఒకటి మాత్రం వుంది అనిపిస్తుంది. కారణాలేమైనా, కారకులెవరైనా ప్రస్తుతం తెలుగు మాట్లాడే ప్రజల మధ్య ఒక భయానక అమానవీయ వాతావరణం కమ్ముకుని వుంది. బహుశా, కాలక్రమంలో ఒక మానవీయ వాతావరణాన్ని సృష్టించేందుకు ముందుగా తెలంగాణా కవులు చొరవ తీసుకోవలసి వుంది-

తెలంగాణా ఏర్పడినా, ఏర్పడక పోయినా ఎపుడేమి చేయాలన్న సంగతి తెలంగాణా కవులకు ఎవరూ చెప్పవలసిన అవసరం లేదనే అనుకుంటున్నాను …

ఎందుకంటే, “పరిస్థితులేట్లా వున్నాయని కాదు …. పరిస్థితులలో మనమెట్లా ఉన్నామని?” అన్న కాళోజీ లాంటి తెలంగాణా వైతాళికుల మాట ఒకటి వారికి ఎప్పుడూ దారి చూపిస్తుంది –

 

కోడూరి విజయకుమార్ 

హైదరాబాద్ – 17 సెప్టెంబర్ 2013

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

————————————————————————————

సాహిత్య చరిత్ర నిర్మాణం జరగాలి

ఆరుపదుల పైబడిన ఉద్యమంలో ఈ  ప్రత్యేకరాష్ట్రకల సాకారమవడానికి ఇప్పుడు అతిదగ్గరలో ఉంది తెలంగాణా. ఈ కాలంలోనే రాష్ట్ర సాధన చివరిపేజీలోనించే ఓ భవిష్యత్ దర్శనం కావాలి. నిజానికి గత దశాబ్దిని “తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవన దశ”గా అభివర్ణించుకోవలసిన అవసరం ఉంది.

తెలంగాణా సంస్కృతి, సంప్రదాయం,జీవితం సమైక్య రాష్ట్రంలో నిరాదరణకి , అణచివేతకి గురయ్యాక ఉద్యమంతో సాధించుకున్న ఫలాలు నిండుగ కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే తెలంగాణా కవులు,కళాకారులు,మేథావులు భాష పట్ల ఈకాలంలో ఎక్కువ శ్రద్దని కనబరిచారు.ఇది పొక్కిలి,మత్తడి మొదలైన సంకలనాలతో పాటు మునుం వరకు కూడా కవిత్వంలో ఒక ప్రధాన పరికరంగా జీవధారలా సాగుతుంది.

ఎం. నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

ఈ కాలాన్నించి గతకాలపు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తరానికి గతాన్ని ఎలా అందించాలనేది ఇప్పుడాలోచించ వలసిన సమయం. తెలంగాణా సాహిత్యం ,చరిత్ర,భాష  రేపటి తరానికి అందడానికి ఏంచేయాలనేది ఇప్పుడాలోచించ వలసిన అంశం.

అందుకోసం రూపొందించవలసిన ప్రధాన అవసరాలు భాషాచరిత్ర,సాహిత్య చరిత్ర,నిఘంటువు.తెలుగులోనే అధికశాతం నిఘంటువులు సాహిత్యనిఘంటువులే.ప్రజా సమూహంలో ఉన్నభాషని నిఘంటువు రూపంలోకి తేవాలి. గతంలో వచ్చిన  నలిమెల భాస్కర్-“తెలంగాణా పదకోశం”, రవ్వా శ్రీహరి “నల్ల గొండ జిల్లా ప్రజల భాష”కొంత మేరకు ఈ అవసరాన్ని తీరుస్తాయి.కాని ఇది ఇంకా విస్తృత రూపంలో రావాల్సిన అవసరం ఉన్నది.

తెలంగాణా భాషకుండే ప్రత్యేక లక్షణాలను బట్టి సాహిత్య , ఔపయోగిక,మౌఖిక,జాన పద ధోరణులనుండి , కళలనుండి వర్ణం , పదం, వాక్యం మొదలైన స్థాయిల్లో భాషనిర్మాణాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.ఇందుకోసం ఒక భాషా చరిత్ర కావాలి.

సుమారు ఆరువందల సంవత్సరాలు సుల్తానుల పరిపాలనలో ఉన్నా, రాజ భాష మరొకటైనా అవసరాల మేరకు ఆ పదజాలాన్ని తనలో సంలీనం చేసుకుంది కాని తన ఉనికిని కోల్పోలేదు.దేశీ మాధ్యమంగా ఉండటం వల్ల ద్రవిడ జాతుల ప్రభావమూ ఎక్కువే.ఆయా మార్గాలనించి భాషని విశ్లేషించు కోవల్సిన అవసరం ఉంది.

తెలంగాణాలో జానపద,మౌఖిక  సాహిత్యంతో పాటు లిఖిత సాహిత్యం అధికమే. వీటన్నిటినీ బయటికి తేవడమే కాక అన్ని ప్రక్రియలను సమగ్రంగా చిత్రించ గల, అన్ని వాదాలను సమూలంగా నిర్వచించ గల”సాహిత్య చరిత్రను “అందించ గలగాలి.ఈ క్రమంలో తొలిదశలో తెలంగాణ రచయితల వేదిక తీసుకొచ్చిన కథా సంకలనం గాని, ఆతరువాత వచ్చిన “నూరు తెలంగాణా కథలు”గాని గమనించ దగినవి. ఈ మార్గంలోనే  సాహిత్య చరిత్ర నిర్మాణం జరగాలి.

తెలంగణ లోని సాహిత్య మూర్తుల జీవితాలను రానున్న తరాలకు అందించేందుకు వారి ఆదర్శ జీవితాలను చిత్రించాల్సిన అవసరముంది.చరిత్ర రచన రచయితల బాధ్యత కాకపోయినా  గతంలో వచ్చిన ఒకే ఒక తెలంగాణా చరిత్ర (సుంకి రెడ్ది నారాయణ రెడ్డి)రచయితలందించిందే.ఈ అవసరం దృష్ట్యా మరింత లోతైన పరిశీలనలు జరగాలి. మతాలకతీతంగా జరిగే పండగల గురించి ,సంస్కృతి సంప్రదాయాల గురించి అందించ గలగాలి.

ఈ క్రమంలో రచయితలు గతానికంటే ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుందనేది సత్యమే అయినా కాపాడుకొని, సాధించుకున్న దానిని తరువాతి తరాలకు అందించ వలసిన అవసరమూ ఉంది.

              -ఎం.నారాయణ శర్మ

 

Download PDF

3 Comments

 • buchireddy gangula says:

  ప్రజా ఉద్యమాన్ని చూస్తూ—వేయి మంధీ కి పై గా ఆత్మ బలి ధానాలు
  చేసుకున్నా— స్పంధించ ని అంపశయ్య నవీన్ లాంటి రచయితలు— జగ్గారెడ్డి లాంటి
  నాయకులు –అక్కడ — – ఇక్కడ అమెరికా లో కూడా ఉన్నారు–
  ఇచ్చిన తెలంగాణా ను కాంగ్రెస్ మళ్లీ వాపస్ తీసుకుంటుం ధని— మురిసి పోతూ
  ముచ్చట్లు చెప్పే—వాళ్ళు లేకపోలే ధు కుమార్ గారు
  ఈ రోజు సీమాంధ్ర లో జరుగుతున్న— సమ్మెలు–ఆంధోలనలు— రాజీనామాలు
  అన్ని హై ధ రా బాద్ కోసం–కోసమే—టి . వి ల లో– పత్రికల్లో— పెద్దగా చూపిస్తూ
  —— ప్ర చారం లో కూడా తేడాలు– –వత్యా సాలు ???
  ముగ్గురు — చాలా చక్కగా వివరించారు
  మొదలు తెలంగాణా పక్రియ పూర్తి అయి ప్రెసిడెంట్ గారి ఆమోధం తో
  ప్రకటన వి డు ధ ల అయ్యేంతవరకు ???
  ————————
  బుచ్చి రెడ్డి గంగుల

 • Rammohanrao says:

  మంచి చర్చ.నాయకులకూ ప్రజానీకానికి మధ్య వారధులు కవులు,రచయితలు.ఒక రకంగా నాయకులకు దిశానిర్దేశం చేయవలసిన అవసరం కూడా వీరి పై ఉన్నది.మనదైన సంస్కృతి పైన మమకారం పెంపొందించే రచనలు చేయవలసిన ఆవశ్యకత ఉన్నది.ప్రజా చైతన్యం తో బాటు ఉద్యమ స్ఫూర్తిని కలిగించే సాహిత్యం కవులు రచయితలు విరివిగా సృష్టించి తద్వారా ప్రజల దృష్టిని లక్ష్యం వైపుకి మళ్లి ంచాలి.ఈ దిశలో గత దశాబ్ద కాలంగా ప్రయత్నాలు బాగానే జరుగుతున్నా కొంత పేలవమైన సాహిత్యం కలుపు మొక్కల్లా వచ్చి అసలు పంటను చెడగొట్టే ప్రమాదమున్నది.కలం పట్టగానే కవి కాడు కత్తి పట్టగానే వీరుడు కాడు.మనో నిష్ఠ,బాధ్యత ,సమర్థత కలిగిన రచయితల వల్ల మాత్రమే ఈ పని నెరవేరుతుంది.రాసి కన్నా వాసి ముఖ్యం.ఉబలాటాలు ఉంటే సరి పోదు.ప్రణాలిక అవసరం.
  ప్రస్తుతం పాడిందే పాటరా అన్నట్లు కాకుండ ఎక్కడి వారక్కడ ప్రాంతీయ సామాజిక,చారిత్రిక, సాంస్కృతిక, సాహిత్య విషయక వస్తు నేపథ్యంగా వివిధ ప్రక్రియల ద్వారా సాహిత్యసృష్టి జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత మనం స్వీకరించాలి.

 • ఎస్.హరగోపాల్ says:

  కవులు, రచయితలకు ఎప్పుడేం రాయాల్నో తెలిసినవిద్యే. ఎల్లపుడు ప్రజలపక్షం వహించే వాళ్ళనే కవులని, రచయితలని గుర్తుంచుకుంటున్నాం.యివాళ్టి సంగతి ప్రత్యేకసందర్భం. తెలంగాణరాష్ట్రం కోసమేనైతే కవులేం చెయ్యాలె, రచయితలేం రాయాలెనన్నదానికి ఇంకా నిజం కానిదానికి, కోటి అనుమానాలు వున్నదానిగురించి రాసేదేం లేదు కాని, మనకల నిజమైతుందన్న ఆశతో రాయడం వేరేసంగతి.

  ఏండ్లుపూండ్లుగా తెలంగాణాలో కవులేం రాస్తున్నరో అదే రాస్తాలో రాస్తరు.కాళోజి లెక్కనె ప్రజలగొడవే రాసి ధిక్కారం గొంతుతోనే లేస్తరు. తెలంగాణాసాయుధపోరాట కాలం నుంచి పాట,పోరాటం ధరించిన కవుల వారసత్వం నిలుపుతరు.ఎప్పటికప్పుడు మారుతున్న పోరాటాలకు జెండాలై నినాదాలిస్తరు. ఊరేగింపుల ముందునిలుస్తరు.

  ఇపుడు ప్రజల్లో వున్న భయాలు, ఆ భయాలను పురిగొల్పుతున్న దుర్మార్గపు అరాచకీయ వ్యవస్థలపట్ల ప్రజల్ని మేలుకొల్పి మేల్కొనివుండేటట్టు చూస్తరు.

  మాసిపోయిన మనతెలంగాణాభాషను కవులు, రచయితలు రాయడం అలవాటుచేసుకోవాలె. మనం మన భాషను మన ముసలోల్ల దగ్గర నేర్చుకోవాలె, ఆ భాషను సేకరించాలె, నిఘంటువులని తయారు చేసుకోవాలె. భాషావేత్తలు తెలంగాణాభాష ఎట్ల ప్రత్యేకమైందో చెప్పాలె.ఎంత కాలం నుండి ఎంత సంపన్నంగా వుండేదో రాయాలి. బయటికిరాని తెలంగాణా రచనలను వెతికిపట్టుకోవాలె. అన్ని రకాల సాహిత్యాన్ని సేకరించి, పరిష్కరించాలి.

  చరిత్ర విషయంలో తెలంగాణాకు చాలా అన్యాయం జరిగింది. ఇక్కడి ప్రాచీన, ఆధునిక చరిత్ర నిర్లక్ష్యానికి గురైంది. ఇక్కడున్న అపారమైన చారిత్రక పూర్వయుగ విశేషాలు కాని, శాసనాలు కాని, శిల్పసంపద గాని ఏదో పట్టీపట్టనట్లు కొంచెమే పేర్కొనబడ్డయి. మన చరిత్రను మనం యదార్థంగా రాసుకోవాలె. ఆ పనికి ఎవరైన పూనుకోవాలె కదా.

  మనసంస్కృతి – మన సంప్రదాయాలని ( మతాతీతంగా, కులాతీతంగా) నిలబెట్టుకోవాలె. వాటిలో మన జీవనసంస్కృతిని దొరకబట్టుకుని కాపాడుకోవాలె. మనతెలంగాణాను మనం మళ్ళీ డిస్కవర్ చేస్కోవాలె.అందుకు తెలంగాణాను పునర్నిర్మాణం చేసుకోవాలె. దానికి కవి,గాయక,రచయితలు అందరు సనాతన సంచార మౌఖిక, లిఖిత సంప్రదాయాల్నన్నింటిని పరిశోధించాలె. ఇప్పటిదాకా నిర్లక్ష్యానికి గురైన మన భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర లన్నింటిని మళ్ళీ తిరగరాసుకోవాలె. ఇదొక సంధి సందర్భం. ప్రత్యేక పోరాటమెంతనో ఆ తర్వాత కూడా అంతే పటిమతోని పోట్లాడాలె. తెలంగాణాపోరాట చరిత్రను రేపటితరం కోసం నిష్కర్షగా రాసిపెట్టాలి.

  కవులు రేపటి తెలంగాణాలో ( ఎంత గొప్పగా వూహించినా అది మళ్ళీ ఈ రాజ్యలక్షణాలను వొదులుకునేదైతే కాదుగదా, అందుకని బద్మాష్ పాలకులతో తగాదా తప్పదుగా ) ప్రజల చేతుల్లో పదనెక్కిన పద్యమై, పాటై,కవితలై మోగుతరు.

  ఎస్. హరగోపాల్, తెలంగాణా

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)