త్రిపురా… ఓ త్రిపురా!

మిత్రబృందంలో త్రిపుర

వివిన మూర్తి

 

“ఏమిటి నీ ప్రయత్నం?”

“అర్ధం చేసుకుందామని”

“ఎవరిని?”

“—??—”

“ఆయన్నా.. వాళ్లనా.. ”

“అంతేకాదు”

“కాక?”

“చాలా ఉంది. మొత్తాన్ని. రాతని.. చదువుని.. రాయించే చదువుని… చదివించే రాతని.. కమ్యూనికేషన్ని… సాహిత్యాన్ని.. మనిషిని.. నన్ను. ”

“నిన్నా?”

“అవును. నన్నూనూ”

****

“విశాఖపట్నం అంటే సముద్రం”

“కాదు. రాచకొండ. ”

“ఛఛ 13 నంబరు బస్సు.. కేజీహెచ్ అప్పు.. ”

“తెన్నేటి విశ్వనాధం.. అబ్బూరి.. ”

“సింగు హోటలు.. సొంటి బిస్కట్లు”

“కాదు కాదు.. కనక మాలక్ష్మి.. యారాడ కొండ”

“కిట్టటం లేదోయ్.. పాత ఇశాపట్నమా.. ”

“ఇచ్చట మార్గము మూయబడెను.. మార్గమును వెదుకుడి.. ”

****

“హోటల్లో చదివావా?”

“కాలేజీలో చదివాను. ”

“బీట్ రూట్ లాంటి దిబ్బకుర్రాడు దోసిని తినీసి పెసరెట్టుని తడమటం. తెలుగు సినిమా హీరో ఓ దాన్ని వానలో తడిపేసి.. మరోదాన్ని మంచులో ఎక్సర్సైజులు చేయించి.. డాఫర్ పని చెయ్యటం.. ”

“సంబంధం లేదు”

“స్టేట్మెంటా..? నీక్కనపడలేదు”

“చూపించొచ్చుగా”

“చూసిన నీకే కాపడనప్పుడు.. నానేటి సూపించేది”

“ఏంటీ న్యూసెన్సు!!! ”

“ఇమిటేషను బాబూ.. తమాసకాలు కాదు.. ”

“బొంగేం కాదూ.. ”

“ప్యూర్ కాకపోవచ్చు”

“పూర్ కూడా కాదు.. నీ పద్దతిలో నువ్వేడు”

“నా పద్దతా అదేంటది?”

“వాస్తవం.. రాత ద్వారా వాస్తవం.. ”

“నాకలాటి భ్రమలు లేవు. రాతలో ఉండేది వాస్తవ భ్రమ.  కల్పన.”

“వాస్తవం ఉండదా”

“అద్దంలో ఉండేది నువ్వా?”

“కొండలున్నాయి. వాటి మధ్యలోంచి సూర్యుడు పొడవటం ఉంది. సముద్రం ఉంది. ఆ అలల మీద కిరణాలు పడటం.. వీటిని పడవలు చెదిరించటం ఇదంతా.. వాస్తవమే.. ”

“లేదు. భూమి తిరగటమే వాస్తవం.. ”

“రాతలో ఇదంతా నీ కళ్లకి కట్టిస్తాను. నా మనసుకి పట్టిన ప్రతి అనుభూతినీ.. తట్టిన ప్రతి ఊహనీ.. నీ మనసులో పుట్టిస్తాను.. ఇదంతా వాస్తవం కాక.. ?”

“కాదు. ”

“మరి వాస్తవం ఏమిటి?”

“అదేదో నువ్వు చెప్పాలి”

“నేనా?”

“అవును. ఆయన గురించి రాయాలన్న నిర్ణయం నీది. వాస్తవం – కల్పన అన్న ఆలోచన మెదడున పడ్డది నీకు. దానిని కనటం నీ బాధ్యత.. ”

“వెల్లువలో పూచిక పుల్లలు.. మృత్యుంజయుడు.. అల్పజీవి..అసమర్ధుని జీవితయాత్ర.. హిమజ్వాల.. బుచ్చిబాబు.. చంద్రశేఖరుడు.. మార్క్వెజ్.. సాల్ బెల్లో.. వేణు.. ”

మిత్రబృందంలో త్రిపుర

ముందు వరస 1.అత్తలూరి 2. త్రిపుర 3. భరాగో 4. భైరవయ్య 5. కాళీపట్నం
వెనక వరస 1. ఆదూరి సీతారామమూర్తి 2. అల్లం శేషగిరిగావు 3. అబ్బూరి గోపాలకృష్ణ 4. ఎయస్వీ రమణారావు 5. వివిన మూర్తి

“ఆపాపు.. లిస్టు పెద్దదే.. లింకు తెలీటం లేదు.. ”

“అర్ధం కాకపోటమే లింకు.. అర్ధమయూ కాకపోవటమే సంబంధం.. తరతమ భేదాలు.. స్వపరాలు.. ”

“ఏభై ఏళ్లకి పైబడి చదూతున్నావు.. ఏదో ఒకటి గిలుకుతున్నావు.. అర్ధం కాదంటం పొగరు కాదా.. వాళ్లని అవమానించటం కాదా.. నువ్వు గిలికీదీ అర్ధం కానివాళ్లు చాలామంది.. ”

“ఇంగ్లీషున రాసింది అర్ధం కావాలంటే ఇంగ్లీషు రావాలి.. రాదనటం పొగరెలా అవుతుంది.. మహా అయితే సిగ్గు పడాలి.. ఒప్పుకోటానికి కాస్త ఖలేజా ఉండాలి.. లేకపోతే వినాయకుడి బొడ్డులో వేలే.. అది నాకు గాని వాళ్లకి గాని అవమానమూ గాదు.. సన్మానమూ కాదు.. ”

“ఇంగ్లీషు నేర్వొచ్చుగా.. ”

“ప్రయత్నం చేసా. పట్టు దొరకలేదు”

“అసలు కొందరెందుకు అలా రాస్తారు?”

“కొన్ని వివరణలున్నాయి. ఒక ఎఫెక్టుకి అనేక కాజెస్ ఉంటాయి. అనేక చర్యలకి ఒకే ఫలితం ఉండవలసిన అవసరం లేదు. ”

“అన్నీ చెప్పు”

“పొడుగైపోతుంది. పలచనై పోతుంది”

“నువ్వేప్పుడైనా ప్రచురణ గురించి పొడుగు పొట్టిల గురించి .. ”

“రాయటం మొదలు పెట్టేముందు తనేం చెప్పదలుచుకున్నదీ రచయితకి స్పష్టత ఉంటుంది. అంటే ఆ విషయంలో అతను కాన్షస్ అనవచ్చు. ”

“పాత్రను సృష్టిస్తున్నపుడే నూతిలో పడాలా ఉరేసుకోవాలా అన్నది రచయిత నిశ్చయించేసు కుంటాడంటావు. ”

“కాదు. ఓ క్లిష్టస్థితి నుంచి ఓ స్వభావం కలిగిన పాత్ర లేదా సమూహం బైట పడాలన్నది రచయిత కలం పట్టేముందే మనసులో ఉంటుంది. బయట పడటానికి చంపాలా చావాలా పారిపోవాలా అన్నది కథ రాస్తున్నపుడు మారే అవకాశం ఉంది. చనిపోవటానికి రచయిత అనుమతించితే నుయ్యా, ఉరా, ఎండ్రినా, గార్డినలా అన్నది చాలా చిన్ని సమస్య.”

“ఇలస్ట్రేట్ చెయ్యి”

“చావు అన్న కథలో ఓ గుంపు ఓ ప్రత్యేక పరిస్థితి నుంచి బయటపడాలన్నది రాత ఆరంభించేసరికే కాళీపట్నం రామారావు నిర్ణయం. దానికి జొరావరీగా పుల్లలు కొట్టటం కూడా అతని రచనాపూర్వ నిర్ణయం అయుండాలి. రెండవ నిర్ణయం వెనక రచయిత కన్విన్స్ అయిన న్యాయమో, తాత్విక భావజాలమో అలాంటిదేదో ఒకటుంటుంది. ”

“వద్దొద్దు. నీ వ్యూ పాయింట్ కి సార్వత్రికత ఉందీ అంటే ఈయన కథల నుంచే చెప్పాలి. కొంపదీసి కథలే కావంటావా?”

“నిస్సందేహంగా కథలే.. ఏ కథా.. ?”

“అర్ధం కాలేదంటున్నా అన్నీ చదివావుగదా.. ఒక్కటంటే ఒక్కటి నీ ఇలస్ట్రేషన్ కి పనికిరాదా”

“అన్నింటినీ ఈ భావనతో వివరించవచ్చు. సరే.. చీకటిగదులు.. ”

“కానీ.. ”

tripura

“భాస్కర్ పోగొట్టుకుని, పొంది, పోగొట్టుకుంటాడు కల్యాణిని. ఆవిడని పోగొట్టుకోటం అనే బలితో గాని సుఖమూ, స్వేచ్ఛా భాస్కర్ పొందలేకపోయాడన్నది ‘నిజమే’ అయితే కటువైనది. ఈ నిజం అన్నది కలం పట్టే క్షణానికే కథకుని మనసులో ఉంది. అందువల్ల పోగొట్టుకోటం కథకుని నిర్ణయం. స్వేచ్ఛ పొందానని భాస్కర్ అనుకోటం కథకుని రెండవ నిర్ణయమే. దాని వెనుక కథకుడు కన్విన్స్ అయిన తత్వమో, న్యాయమో, క్రమమో మరేదో ఉంది. అదేమిటో నాకు అందలేదు. ”

“పోనీ.. మిగిలినవన్నీ అందేయా?”

“నాకందినవి చెపుతాను.”

“?”

“శేషాచలపతి పొలిటికల్ మీటింగ్ కి వెళ్తాడు. అక్కడివన్నీ ‘కొత్వాలీ’ లో రిపోర్టు చేస్తాడు. అంతకుముందు రాసిన కథలు పాఠకుడు చదవకపోతే ఈ విషయం పాత్ర స్వభావాన్ని అందిస్తుంది. అప్రధానంగా కనిపించే ఈ వాక్యం ఓ విధంగా ఈకథకి ‘కీ’. శేషాచలపతికి బాల్యం ఉంటుంది. తల్లిని తండ్రి చంపటం.. ఆ చంపటంలోని క్రూరత్వం ఓ వాక్యంలో దాచుతాడు కథకుడు. ‘ఆ పూజాగృహంలో, నాన్న అమ్మని చంపి, వూడిపోయిన పన్నుని అరచేతిలో పట్టుకుని చూసుకున్నాడు-’.. కథ భవిష్యత్తు సూచించే ఓ శక్తి మరో వాక్యంలో.. ‘అతడి దోవలో తగిలినవాళ్ల జీవితాల్లో ఒక మలుపు తిప్పిస్తాడు. అతని ధాటికి నిలవటం కష్టం’. ‘రంగు’ సంగతి భాస్కర్ నోట చెప్పిస్తాడు. ‘నేను’ ‘నాది’ బంధాలే కాదు. బాధ్యతలు.. ’ ‘అవును జీవితం బద్దలయేవుండేది’ అంటాడు ఓల్డ్ స్మగ్లర్ ఇటుకల్లాంటి మాటలకు ప్రాణాలు పోస్తుంటే.. ‘మిగతా అంతా సిన్నింగ్ ఫ్లష్ .. ’ అంటున్నపుడు నవ్వులో అమాయకత్వం కళ్లలో క్రూరత్వం పెట్టుకున్న శేషాచలపతి ముందు అడ్లూ, ఆటంకాలూ తొలగించింది కథకుడా.. ఓల్డ్ స్మగ్లరా.. శేషాచలపతేనా.. ?”

“ఇన్ని అందాక కూడా రచయిత విశ్వసించిన తత్వం.. అందలేదా.. ”

“విశ్వసించిన అనటం నాకు ఇష్టం లేదు. అందరూ కాఫ్కా అంటారు గదా.. ఇన్ ద పీనల్ కాలనీ చదివి చలించిపోయాను. మెటమార్పసిస్, ద ట్రయల్ వంటి ప్రసిద్ధాలు చదివానో లేదో గుర్తులేదు. కాని ఆయన ప్రభావం మన కథకుని కథలలో కనిపిస్తుంది. తండ్రీ-కొడుకు సమస్య.. మార్క్వెజ్ అన్నట్లు కాఫ్కాను చదివాక “that it was possible to write in a different way”… ”

“సరేనయ్యా అందరికీ తెలిసినదే గదా.. ”

“అన్నీ అందరికీ తెలిసినవే గనక .. నాకెందుకు అనుకోవాలంటే మూసేస్తాను.. ”

“సరే సరే నీ గోలేదో నువ్వేడు.. ”

“అబ్సర్డిటీ .. తెలుగులో ఎవడేమంటాడో నాకు తెలీదు.. అసంబద్ధతని కాఫ్కాని కలపటం ఉంది.. కన్నడ సాహిత్యంలో ఇది గుర్తుపట్టగలిగేంత కనిపిస్తుంది.. జీవితానికి అర్ధం లేదని చెప్పే అర్ధం కొందరికి గట్టిగానే పడుతుంది .. ఎందుకు.. అన్నీ తెలిసాక కూడా ఏమీ తెలియకుండా పోతోందనిపించటం వల్లనా.. ఎక్కడో అది కేపిటలిజాన్ని.. అంటేటీ.. జనం బాధలకు కారణాన్ని .. కాదంటుందని కొందరు… వాస్తవాన్నే నిరాకరిస్తుందని కొందరూ.. మార్క్సిస్టులే గట్టిగా వాదించుకునేదాన్ని.. సాహిత్య ప్రతిఫలనంలో.. త్రిపుర వంటి వారు.. కథకులే కారేమో అనిపించే కొందరి.. రచనా లక్ష్యం ఏంటి.. చీకటిగదులలో జీవితపు అసంబద్ధత చూపించటమా.. తనని తను ఎలాంటి purposeనీ లక్ష్యాన్నీ మనసులో ఉంచుకోకుండానే వ్యక్తం చేసుకోటమా.. పెద్దాయన రచన.. వాస్తవం నిరాకరణ కోసం కల్పనా.. కల్పన సొగసు కోసం వాస్తవ నిరాకరణా.. రచయిత కల్పనలో ఉద్దేశిత ఉద్దేశ్యం లేకుండానే వాస్తవాన్ని – పాఠకులని.. ప్రభావితం చేస్తుందని ఇంత స్పష్టంగా తెలిసాక .. రచయిత బుర్రలో ఏమున్నా మానినా అతని కల్పన వాస్తవాన్ని కొట్టిపారేసినా.. అది వాస్తవాన్ని వాస్తవంగా ప్రభావితం చేస్తే.. అందులోనూ సామాజిక ప్రయోజనం గాళ్లని .. ఉందనుకునే వాళ్లని.. ఊపేస్తే.. ”

“…………………”

“పన్ను వూడితేనే సలుపు పోతుంది. కల్యాణి పోతేనే స్వేచ్ఛ.. రామాయణానికి ప్రేరణ జంట విడిపోటం లోని దుఃఖం .. దానిలోని సుఖం ఈ కథకి ప్రేరణా.. సుఖానికి రచయిత నమూనా అలక్ నిరంజన్ యా..సుఖం పట్ల అసంతృప్తా.. సంశయమా.. ”

“అదేదో నీకు అర్ధం కాలేదా.. కథకునికి కూడానా.. ?”

“భగవంతం కోసం .. హోటల్లో .. కెజిహెచ్ ఎంట్రన్స్ ఎదురుగా .. పద్మా నివాస్ అనే గుర్తు.. బుర్రలో తిరిగింది.. అది చదివీ, చదివీ .. వాస్తవం, కల్పనల మధ్య.. బుర్ర తిరిగింది కాని కరగలేదు.. ఎదగలేదు .. అసలది చదవి, వేసిన .. సబ్బు.. కి ఏటి బోద పడిందో నాకైతే కనపడ్డవి కనబడ్డాయి గాని.. బోద పడనేదు.. ఏబైయేళ్ల క్రితం అందులో ఉన్నదేదో .. ”

“దానికి కాలం ఏమిటి?”

“నిరీక్షణకా? మెదలవటానికా? అట్నుంచి ఏడులోనూ.. ఇట్నుంచి పదమూడులోనూ రాని భగవంతం రాటానికి.. ”

“నీకు భాష్యకారులు కావాలి.. ”

“వాస్తవానికి అక్కరలేదు.. సుబ్బారాయుడి రహస్యజీవిత మంత బహిర్గతంగా ఉంటే ఎందుకు?”

“కొన్నింటికి ‘కీ’ అక్కరలేదంటావు”

“కొందరికి కావాలి”

“అందరికీ వకాల్తా ఎందుకు?”

“ఐతే కాసుకు..జైలురోడ్డుకీ సింగుహొటలుకీ మధ్య.. అట్నుంచి కుడివైపు వీరాస్వామి.. ఎడంవైపు నేను.. జర్కన్ వద్దని.. బర్మా కార్గో పడవల పెత్తన ప్రపంచం నుంచి .. నిన్నటి వరకూ తనకిందే పనిచేసిన మనుషుల్తో కలిసి.. మురికి వాడలో.. కుళ్లు కంపులో.. ఎలక్ట్రిక్ దీపాలకోసం అరుస్తూ.. నాస్తిక సమాజం కావాలి రావాలి.. పైసా ఇయ్యి పేరు చెపుతా .. వెంకట్రావు కొడుకు.. ప్రభ పుటల్లోంచి.. ”

“నీకూ భాష్యకారుడు కావాలంటావు.. ”                                                                                                                                            tripura_336x190_scaled_cropp

“అది భాష్యకారుడి కథవుతుంది.. నీకథ ఎక్కాలంటే.. నీ ఏడుపు సంగీతం కారాదు.. ”

“అయిందేమో.. ”

“ఎందుకవదూ.. వానవానగా బాంబులు కుర్దుల మీద కరుస్తుంటే కవనశర్మ ఇరాక్ వాసులు.. వాన తగ్గింది పదండి కూరలు కొనుక్కుందాం.. బజారు చేసుకుందాం.. తొడతొక్కిడి.. టేక్ బహుదూర్ .. పదకొండు ద్వారాలు తెరిచి.. ఓ చాయ్ చిన్నారిని మూసి.. మార్ఫియా వద్దు.. బిస్కట్లు కావాలా.. కర్నాటక ఆంద్రా స్వతంత్ర దేశాలై.. మదనపల్లి బోర్డర్లో తుపాకీగుళ్ల వర్షంలో .. టీ.. చాయ్.. టీ.. చాయ్.. దానికి అక్కరలేని వీసా నీకెందుకు వచ్చెయ్ వివినా అంటూ ఆటునించి వల్లంపాటి.. నాదగ్గర వీసాలేదు.. నాకోసం పన్నెండు ద్వారాలు తెరవటానికి నువ్వు టేక్ బహుదూర్ కాలేవు వల్లంపాటీ.. ఉండుండు.. గాజీ మునిగి పోయింది.. నిస్సార్ సబ్ మెరీన్ రెస్క్యూ షిప్ పంపాలి.. పధండి.. నిద్ర లేవండి.. వైర్లు పీకేసి పని ఆరుగంటలది రెండు గంటల్లో.. డ్రైడాక్ డోర్లు తెరుచుకుంటూ నీరు వదులుతుంటే.. ఓడ కూర్చున్న దుంగలు కదిలి కూలుతున్న శబ్దం.. నెమ్మదిగా సముద్రాన్ని కావలించుకుని హుషారుగా తెల్లారగట్ల మూడుగంటల ప్రాంతంలో డాక్ జట్టీ మీద డాంగ్రీలలో వెళ్తున్నవాళ్లకి చెయ్యూపుతూ నించున్న దృశ్యం.. తిరిగి వస్తారా ప్రశ్నల మొక్కలు తలలో ఎదుగుతుంటే పీకేసిన వైర్ల చుట్టల మధ్య సిటిసి సేవిస్తూ.. ”

“నీకు బాధ్యత లేదా?”

“గొలుసులు గొలుసులుగా జ్ఞాపకాలు వరదలా పొంగుతుంటే.. ఏ కాజ్ ఏ ఎఫెక్ట్ విచికిత్స కొట్టుకుపోతుంటే .. తెగిపడ్డ బాధ్యతలకి సానుభూతి చూపించగలను గాని.. బాధ్యత వహించను. ”

“నువ్వెవరివి?”

“ఈ క్షణానికి ఓ బిలియన్ మిలియన్ స్పెర్మటోజోవాలో ఛాన్సు వచ్చిన నారాయణావతారాన్ని. ద్వారం కనిపించక సముద్రాన్ని ద్వారం చేసుకున్న నువ్వుని. ”

“చెప్పు చెప్పు”

“నారాయణకి కనుపించని ద్వారాన్ని కనుగొన్నవాడిని.. ప్రపంచమంతటా లాసా మొనెస్టరీలో.. కింబర్లీ వజ్రపు గనులలో బ్లాక్ ఫారెస్టులో.. నీచేల వాల్మీకిలో.. స్మగ్లర్ లో నన్ను చూసుకున్నవాడిని.. ఇక్కడ ఈ ఆస్తి.. సంతకాలు.. తల్లీ తండ్రీ.. అక్కా చెల్లీ వెదుకులాటలో.. యవ్వనం, దేహం.. వారసత్వాన్ని తెగ్గొట్టాలని.. తీర్ధపురాళ్ల మీంచి.. కోస్టల్ బాటరీ పక్కన నువ్వు ఉరికిన రాత్రే .. ఆ రాత్రే.. ఆఖరురూపాయ.. ఆకలి రూపాయ..ద్రోణంరాజు చలపతిరావు అనీ బిలియన్ మిలియన్ స్పెర్మటోజోవాలో ఒక్కటి ఒకే ఒక్కటి ఆకారం దిద్దుకోకపోతే.. ఇది రాయటానికి త్రిపురని చదవటానికి మిగలని వాడిని.. కనిపించని ద్వారం వరకూ వెళ్లి.. కనిపించినవన్నీ నావే.. నేనే.. నని.. వారసత్వాలు తెగ్గొట్టటం కోసం అదే పరిష్కారం అంటూ వెర్రికేకలు వేసుకుంటూ.. పిచ్చిరాతలు రాసుకుంటూ.. ”

“అంతా వ్యక్తిగతం.. టూ పెర్సనస్.. ట్రూ పెర్సనల్.. ”

“పెర్సనల్ అన్నది అసలు ఉందా.. మనం, మనకి ఎదురయీ సమస్యలు.. వాటికి పరిష్కారంగా కలిగే ఆలోచనలు వాటికి రూపాన్నిచ్చే శబ్దాలు.. సంకేతాల భాష అన్నీ సమాజ ఫలాలే.. ఫలితాలే.. మరోలా చెప్పాలంటే నువ్వుండటం వల్లా మరెందరో ఉండటం వల్లా ఎవరెవరో రాసినవి చదవటం వల్లా.. ”

“మరి వంతెనలు ఎందుకూ.. ?”

“అదీ అసలు ప్రశ్న.. అందులో ఉన్నది త్రిపురే కాదు.. నేనూనూ.. మేం ట్రైటర్సుం.. మేమున్నచోట ధనం ఉంటుంది.. దాన్ని వదులుకోగలం.. అసహ్యించుకోగలం.. జేబులో రాజీనామాలు, గార్డినల్ మాత్రలు, రివాల్వర్లూ అన్నీ మావైపే గురి పెట్టుకోగలం.. రాజూ ఏ పసిబిడ్డల భావి శాంతి స్వప్నాలలో మనిషి కోసం వెక్కివెక్కి ఏడుస్తావ్.. ఏడుస్తూ ఏ ఆయుధం పట్టుకుంటావంటూ మొత్తకుంటాం.. రాజు గురి మారదు.. మా గురి మా గుండెలకి తప్పితే మా మెదడుల మీదకే ఎక్కుపెట్టబడి ఉంటుంది.. అయినా ఆశ.. మేమూ రాజూ ఏ వంతెన మీదైనా కలుసుకుంటామన్న ఆశ.. అందాకా మమ్మల్ని మన్నించమంటూ వేడుకోలు.. మమ్ము తిరస్కరించొద్దని కైమోడ్పులు.. వంతెన ఉందనే మా నమ్మకం.. కాని గురి మారదు.. అతని గురి వేరు.. మాది మాత్రం మావైపే.. నిద్రమాత్రలతో, భర్కీ, రివాల్వర్ నాకోసం నావైపు మృదువుగా మెత్తగా ఎదురుచూస్తుంటే మధ్య పురంలో త్రిపురా.. నేనూ.. ”

“సఫర్ .. ప్రయాణం జరగదా?”

“నడుస్తూనే ఉంటుంది.. రాజు ప్రశ్న వేస్తూనే ఉంటాడు.. ఎందుకంత విషాదం అంటూ.. జవాబుల కోసం మేధావి జీవితంలో.. చీకటి గదుల్లో దొరుకుతుంది.. ప్రవేశించు.. చీకట్లో కనిపించదు.. గదుల్లో చిక్కడి పోతావు కాకుండా పోతావు.. బయట ప్రపంచంలో ఓపెన్ నక్సలైట్ గా అన్నీ వదులుకుని.. లోపలికా బయటకా.. నీ సఫర్? జూడాస్ వి కాగలవు గాని కావుగదా.. ”

“సఫర్ ముగుస్తుందా?”

“ఎలా… కనిపించని ద్వారం లోంచి వంతెనల మీద సఫర్ అభినిష్క్రమణతో కూడా మలుపు.. త్రిపుర రెండవ పురం.. నా మటుక్కు నాకు ప్రధానం.. మొదట జ్ఞాన సేకరణతో.. సేకరించిన జ్ఞానంతో గొడవ.. రెండో దానిలో ఆచరణ ముందు వంగిన తల.. ఆచరించే రాజు ఆచరణ ప్రశ్నల బాణాల ముందు .. వివాహ వ్యవస్థలో సుశీల ప్రేమ స్వంతం..గృహం గృహిణి.. మరి విమల? ఉంటుంది.. జరుగుతుంది.. బయట ఇళ్లంటుకుని.. దేశం దుర్గంధ భూయిష్టమై.. కన్నీళ్ల పర్వతాలను దొర్లించుకుంటున్న చీమల పుట్టల మధ్య.. విమల సాధ్యమా.. సాధ్యమే.. సుశీలా ఎలా ముడెయ్యను మన పిక్నిక్ ముగిసిపోయింది.. అభినిష్క్రమణ కదా ఇది.. రాజూ.. నిన్ను సందేహాలు అడగలేను.. నా ప్రశ్నల కత్తులతో నన్ను నేను చీల్చుకోకుండా ఉండలేను.. బై.. ”

“మూడో పురం.. ?”

“మాలోని అత్తలూరులు చలించి.. ప్రపంచాన్ని చేర్చి.. నువ్విదని.. నీదిదనీ.. నువ్వే ఆహ్వానించని దేన్నో నీముందుంచి.. నీ చుట్టూ ఆరాధకులకి చోటు పెట్టి.. ఎనిమిదేళ్ల ఎడంలో.. ఇంకా ఉన్నానా.. ఓ వాన సాయంత్రం.. సైకిలు కొట్టులో.. సీలలు ఇంకా లూజే.. గ్రీజు వదలదు.. బురదలో కాలు పెట్టకుండా ఉండలేవు.. ఇది అసలు ప్రపంచం కాదు.. కాపీ, నకల్, కౌంటర్ ఫీట్.. మెదడు మడతల్లో డిజార్డర్ చూడు.. డిజార్డర్ లోని ఆర్డర్ కనిపెట్టు.. డాక్టర్ జాన్ పి జాన్ – నీకేం రోగం లేదు బొద్దింక గుర్తింపు.. కుక్క గుర్తింపు కనిపెట్టి కథకట్టే మూర్తీ నీకిలాంటి ఆలోచనలు ఎలావస్తాయి.. నీకు డిజార్డర్ ఏంటి.. ఆర్డర్ లేని ప్రపంచంలో ఆర్డరుందనే వాళ్లలో నారాయణ నట్టులోంచే .. తండ్రి.. ప్రభువు.. సర్వవ్యాపి.. ఎక్కడున్నాడో .. వస్తాడు.. నీచెయ్యి పట్టుకుంటాడని నమ్మవు పట్టుకునీవరకూ.. ”

“మూడోపురంలో నువ్వు లేవా?”

“కౌంటర్ ఫీట్, నకల్, కాపీ ఎక్కడినుంచి వస్తాయి ఒరిజినల్ లేకుండా.. రూపు లేని రాజు చూపూ.. దూరంగా తనలో తనే గొణుక్కునే మూర్తీ.. కల్పనతో కరాలు మోడుస్తున్న వాస్తవ ప్రపంచం ఆరాధకులూ.. ఒరిజనల్ కదా.. ఆ చూపు.. ఆప్రశ్నలు .. చచ్చిపోయాయా.. తుప్పు తుడిపించు.. గీసి పారెయ్.. నట్లు బిగించు.. ఆయిలింగ్ చేయించు.. –ఇవ్వన్నీ ‘పైనే’ – జీవితంలోంచే, ఒరిజినల్ లోంచే కొంటర్ ఫీట్లూ పుడతాయి.. అది గుర్తు పడితే ఒరిజినల్ కుట్ర అవదు. నకలు అన్న ఆలోచనే కుట్ర అవుతుంది. ”

“ఇదీ ఆయనదేనా?”

“నేకపోతే నా పైత్యమా.. నా జొరావరీయా?”

“తేడా తెలీటం నేదు బాబూ”

“తెలాలా?”

నాటి-నేటి త్రిపుర

నాటి-నేటి త్రిపుర

“తెలవాలనీ,  తెలపాలనే గదా నీ ఏడుపు…… ఈ ఏడిపింపూ ”

“ఏడుపా.. కాదే.. ప్రయత్నం.. ఒరిజినల్.. ”

“తేడా ఏంటో?”

“నేనంటే రెండు మనుషులని యిప్పుడిప్పుడే తెలుస్తోంది.. కావాలంటే భగవంతం సంతకం చూడు.. ఒకరినొకరు వెతుక్కుంటూ.. తప్పించుకుంటూ.. ఒకరికొకరు ఎదురైనా గుర్తు పట్టీపట్టనట్లుగా.. ”

“లాభాల గూబల్రాయుడూ నువ్వేనా వలసపక్షీ”

“ఒకవేపే పక్కమీదే మూడు సంవత్సరాల పడుకున్న తర్వాత రెండోవేపు తిరిగి పడుకోటానికి ఉపక్రమించేటపుడు సహజంగా, సంతోషంతో ఎంతో సుఖంగా తేలిగ్గా నిట్టూర్చే వరదరాజులూ.. ఎప్పుడూ ఒకవేపు పడుకోక క్షణంక్షణం మెసిలే నేనూ.. హహ్హహ్హ.. ”

TripuraKathaluPrintBook

“మరినువ్వు?”

”గారబంధ ఆయన్ని గుండోల్లోకి తీసుకున్నవాణ్ణి పెద్దపెద్ద ధియరీలు నాకొద్దు- అతనే నా అంతరాత్మ- నారక్షకుడు.. నా దిగులుకు కారణమూ విరుగుడూ”

“భగవంతం?”

“ఏడేళ్లు ఒక వాక్యాన్ని సరిదిద్దుతూ తెలుసుకున్నది భగవంతం ఒప్పేసుకుని సంతకం పెట్టేసాడు గదా.. ”

“నిజమే గాని-”

“ఒకే ఒక కథని. కుప్పిలి సుదర్శన్ పిల్లిగడ్డాన్ని .. పాలకొండ గ్రంధాలయంలో .. విపుల పాము కరిస్తే.. దాంతో ఇరవై జతల కళ్లని కరపించితే.. పది జతల పెదాలు అర్ధంకాలే అంటే.. ఆరు బుర్రలు ఆంగ్లంకి అను.. అనుమానం చూపుల్తో.. నాలుగు జతల కళ్లు ఉన్మత్త ఉద్విగ్నతతో.. పాము మాజండా జైజై కొట్టి .. అవునవును సాధ్యమే ..ఎప్పుడో  డొస్టోవిస్కీ నేరానికి 67లో మొదలైన శిక్ష ఈ కథాకారాగారంలో ఎవరెవరు ఏఏ పిచ్చి పిచ్చి ఏడుపులతో కాగితాలని పాడుచేసారని లెక్కించుకుంటూ అనుభవిస్తూంటే.. త్రిపుర రామయ్య రాస్తే రాయండి చెక్కొద్దని గొణిగితే .. అసహనం ఫోనుముక్కు మీదనుంచి జారిపోతే.. త్రిపురా ఓ త్రిపురా.. అర్ధమయీ కాని తెలుగు త్రిపురా.. ”

“ఏంటి డౌటు వివినా?”

 “మరేం లేదు గాని త్రిపురా.. నివ్వు ట్రైటరువి.. ”

“నివ్వు కాదేంటి?”

“కాదు. భాషని వాడుకుని దానికి వెన్నుపోటు పొడిచావు. జ్ఞానాన్ని సేకరించి రీసైకిల్ బిన్ లో వేసావు. ‘ఉన్న’ భావనని స్వీకరించి ‘లేని’ భావనగా మార్చేసావు. ‘ఉన్న’ ప్రపంచంలో జీవించి దాన్ని అంతరాత్మ చేసుకుని ‘లేని’ మనుషుల మధ్య అలజడి పుట్టించావు. నువ్వు ట్రైటరువి. బతకటానికే కష్టపడీ ప్రపంచాన్నిమెదడులో మోస్తూ తోచీతోచని ప్రపంచంలో తోపుడుబండి పెట్టుకుని తిరుగుతున్నావు. వాస్తవాన్ని తీసుకుని కల్పనలో వేసుకుని పంచాల్సిన నువ్వు ..వాస్తవాన్నే నిరాకరించే నువ్వు.. నువ్వే ట్రైటరువి.. ”

“వెర్రోడా.. నువ్వూ అంతే.. అక్షరాల గోడల మధ్య సాగని భావప్రసారం కోసం అక్షరాలనే ఆశ్రయించే వాళ్లంతా .. అంతే stabilized అంతటినీ de-stabilize చేయజూసే వాళ్లే వివినా.. పదాల చెకుముకి రాళ్లతో నిప్పు పుట్టించే రచయితలు మనుషులని మాత్రమే కాల్చగలరు.. బండలను కరిగించలేరు. ప్రతి రచనా మనిషిని కాల్చాలనే చూస్తుంది. రైటర్సంతా ట్రైటర్సు కాదనగలవా.. ”

“ మరి రాజు?”

 

 – వివిన మూర్తి

Download PDF

7 Comments

  • bhasker koorapati says:

    చాలా బాగా రాసారండీ. ఒక్క గుక్కలో చదివేసాను. చాలా ఆర్ద్రంగా ఉంది.
    ఫోటో కూడా బావుంది. అందరు రచయితలని ఆట్టే పోల్చుకోలేక పోతున్నాను.
    వాళ్ళ పేర్లు కూడా రాస్తే బావుండేది. ఇప్పటికైనా రాయగలరేమో చూడండి.
    ఇది నా మనవి మాత్రమే!
    —భాస్కర్ కూరపాటి.

  • bhasker koorapati says:

    చాలా బాగా రాసారండీ.
    ఫోటో కూడా బావుంది. అందరు రచయితలని ఆట్టే పోల్చుకోలేక పోతున్నాను.
    వాళ్ళ పేర్లు కూడా రాస్తే బావుండేది. ఇప్పటికైనా రాయగలరేమో చూడండి.
    ఇది నా మనవి మాత్రమే!
    —భాస్కర్ కూరపాటి.

    • ముందు వరస 1.అత్తలూరి 2. త్రిపుర 3. భరాగో 4. భైరవయ్య 5. కాళీపట్నం
      వెనక వరస 1. ఆదూరి సీతారామమూర్తి 2. అల్లం శేషగిరిగావు 3. అబ్బూరి గోపాలకృష్ణ 4. ఎయస్వీ రమణారావు 5. వివిన మూర్తి

  • buchireddy gangula says:

    మూర్తి గారు
    భాగా రాశారు సర్

  • Elanaaga says:

    అక్కడక్కడ అధివాస్తవికతను జొప్పిస్తూ అందంగా రాశారు వివిన మూర్తి గారూ. కంగ్రాట్స్.

  • K.K.Ramaiah says:

    రాజు ప్రశ్న వేస్తూనే ఉంటాడు.. ఎందుకంత విషాదం అంటూ.. జవాబుల కోసం మేధావి జీవితంలో.. చీకటి గదుల్లో దొరుకుతుంది.. ప్రవేశించు.. Thank you Sir

  • రమణ మూర్తి says:

    “పదాల చెకుముకి రాళ్లతో నిప్పు పుట్టించే రచయితలు మనుషులని మాత్రమే కాల్చగలరు.. బండలను కరిగించలేరు..”

    చాలా బాగా రాశారు, వివిన మూర్తి గారూ! అభినందనలు..!!

Leave a Reply to వివిన మూర్తి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)