ప్రకృతి గీసిన రేఖా పటాలు

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

పరశురాముడు భీకర కోపాగ్నితో ఉగ్రరూపం ధరించి ఇరవై యొక్కసార్లు దండెత్తి భూమిమీది క్షత్రియులను తుడిచిపెట్టాడు. అప్పుడు ఆ క్షత్రసతులు ఋతుకాలాలలో ధర్మం తప్పకుండా మహావిప్రుల వల్ల కూతుళ్లను, కొడుకులను కని క్షత్రధర్మాన్ని నిలబెట్టారు…

వైవస్వతుడనే మనువుకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులైన మానవులు పుట్టారు. మరియు అతనికి వేనుడు మొదలైన యాభై మంది రాజులు పుట్టి, వంశాలను వృద్ధి చేసారు. వారు తమలో తాము యుద్ధాలు చేసుకుని మరణించారు.

                                                                 –శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం

విడి విడిగా ఉటంకించిన పై రెండు వివరాలు ఒక  ఉమ్మడి విషయాన్ని చెబుతున్నాయి. అది క్షత్రజాతి నిర్మూలనం కావడం గురించి, దానిని నిలబెట్టడం గురించి. నాటి ఆయుధోపజీవులైన క్షత్రియగణాలకు చంపడం, చావడం ఒక నిత్యకృత్యంగా, ఆటగా ఉండేదనీ; అది అనేక సంక్షోభాలకు, అవ్యవస్థకు దారితీయించేదనీ, వాటిని అధిగమించడానికి అందుబాటులో ఉన్న మార్గాలను వెతుక్కున్నారనే సంగతిని గుర్తుపెట్టుకుని ముందుకు వెడదాం.

    ***

మనిషి ఊహలు అలవాటుగా మారి, విశ్వాసంగా ఘనీభవించి గిరి గీసుకునే తీరు నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఒకటి చూడండి, భారతదేశపు రేఖాపటాన్ని (చాలావరకు) ఇప్పుడున్న స్థితిలోనే చూడడానికి దశాబ్దాలుగా అలవాటు పడిపోయాం. ఈ రేఖాపటం ఒకప్పుడు మరోలా ఉండేదనీ, రేపు ఇంకోలా ఉండే అవకాశం ఉందనే ఊహ మనకు రానే రాదు. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రేఖాపటాన్ని 58 ఏళ్లుగా చూస్తున్నాం. గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రాంతాలు కలసి ఉన్నప్పటి రేఖాపటమూ;  నేటి మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు కొన్ని కలసి ఉన్న నిజాం రాజ్యం తాలూకు రేఖాపటమూ మరపు పుటల్లోకి జారిపోయాయి. ఇప్పుడవి మన ఊహకు కొత్తగా అనిపిస్తాయి. 1947 కు ముందు భారతదేశ రేఖాపటంలో నేటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు భాగంగా ఉండేవి. కాలంలో ఇంకా వెనక్కి వెళ్ళండి, నేటి అఫ్ఘానిస్తాన్ కూడా భారతఖండంలో ఉండేది. ఇంకా చాలా వెనక్కి వెళ్ళండి. పశ్చిమాసియా నుంచి వాయవ్య భారతం వరకూ మొత్తం ఆర్యావర్తం గా ఉండేదనిపిస్తుంది. మరింత వెనక్కి వెళ్ళండి, రాంభట్ల కృష్ణమూర్తి గారి ప్రకారం యూరప్ కూడా కలసి ఉన్న ప్రదేశాన్నే భారతవర్షం అనేవారు.

చరిత్ర పొడవునా రేఖాపటాలు మారిపోతూనే వచ్చాయి. పదమూడో శతాబ్ది నాటి మంగోలియన్ పాలకుడు చెంగిజ్ ఖాన్ ఏలిన మహాసామ్రాజ్యాన్ని రేఖాపటంలో చూపిస్తే, అది చైనాలోని పెకింగ్ (నేటి బీజింగ్) తో ప్రారంభించి వాయవ్యభారతం మీదుగా హంగరీ వరకూ వ్యాపించి కనిపిస్తుంది. చెంగిజ్ ఖాన్ డీ.ఎన్.ఏ ను పంచుకున్న వారసులు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో చెబుతూ ఆమధ్య ఒక ఆసక్తికర కథనం వెలువడింది. అలాగే, ఒకనాటి మౌర్య సామ్రాజ్యపు రేఖాపటంలో అఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణభారతం వరకూ చేరి ఉండేవి. అశోకుడి నాయనమ్మలలో ఒకామె గ్రీకు సెల్యూకస్ కూతురు.

అయితే, మనిషి ఎప్పుడూ అధికారిక రేఖాపటాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. తనవైన ఊహాపటాలను రాసుకుంటూనే ఉన్నాడు. నదీ నాగరికత వర్ధిల్లిన కాలంలో నది నడిచిన దారి వెంట మనిషి రేఖాపటాలను నిర్మించుకున్నాడు. ఇప్పటికీ ఆదివాసులు కొండలు, గుట్టలు, అడవులు, సెలయేళ్ల వెంబడి తమ రేఖాపటాలను గీసుకుంటూనే ఉంటారు. దూరాలను పెంచిన నాగరికమైన దారులకంటే అతి తక్కువ కాలంలో గమ్యం చేర్చే దారులు వారికి కరతలామలకంగా ఉంటాయి. దండకారణ్యాన్ని రేఖల్లో బంధించడానికి ప్రయత్నించి చూడండి, అది నేటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను విజయవంతంగా ధిక్కరించి వెక్కిరిస్తుంది.  దండకారణ్యాన్ని ఒక రాష్ట్రం చేసి ఆదివాసులకు ఇవ్వకుండా, యధేచ్చగా దోచుకోమని చెప్పి నాలుగు రాష్ట్రాలకు పంచిపెట్టడం; సమన్యాయ రాజ్యాంగం వెలుగులో అమలుచేసే పరమ దురన్యాయంగా అనిపిస్తుంది.  ఆ అన్యాయం  మూలాలు వేల సంవత్సరాల చరిత్రలో ఉన్నాయి. అంటే, కొన్ని అన్యాయాలు ప్రజాస్వామ్యం, సమానత్వం, సమాన హక్కుల వంటి ఆధునిక భావాలను కూడా ధిక్కరించి కొనసాగుతున్నాయన్న మాట.

నేనోసారి నరసాపురం(ప.గో.జిల్లా) వెళ్లినప్పుడు తెలిసిన ఓ సంగతి నన్నెంతో విస్మితుణ్ణి చేసింది. మత్స్యకారులు నరసాపురానికి దగ్గరలో ఉన్న సముద్రతీరం వెంబడే సైకిళ్ళమీద కృష్ణా జిల్లాలోని మచిలీపట్నానికి వెళ్ళి సాయంత్రానికి తిరిగొస్తారట!  సైకిల్ కంటే వేగంగా పయనించే ఏ వాహనం మీద వెళ్ళినా అది సాధ్యం కాదు. మా ఊరి గోదావరి గట్టు మీద నిలబడి చూస్తే, ఎదురుగా నదికి ఆవలి గట్టున తూర్పు గోదావరి జిల్లా ఊళ్ళు ఉంటాయి. కరణంగారు పొద్దుటే గొడుగు పుచ్చుకుని బయలుదేరి పడవలో గోదావరి దాటి తూ.గో. జిల్లా ఊళ్ళకు వెళ్ళి సాయంత్రం చీకటి పడే లోపల తిరిగొస్తూ ఉండేవారు.

భౌగోళిక రేఖాపటాలతో నిమిత్తం లేకుండా నదీతీర గ్రామాల వాళ్ళు ఒకే గుండెతో స్పందించడం నాకు ప్రత్యక్షంగా తెలుసు. పాపికొండలలో పేరంటపల్లి అనే ఓ గిరిజన గ్రామంలో బాలానంద స్వామి అనే ఒక సాధువు ఉండేవారు. పాపికొండలు నేడు మనం కొత్తగా గీసుకున్న ఖమ్మం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడలి కావడం నాకో అద్భుతంగా తోస్తుంది. బాలానంద స్వామి గిరిజనులకు ఎంతో సేవ చేశారు. గోదావరి జిల్లా గ్రామాల వారందరికీ ఆయనమీద భక్తి. ఆయన వృద్ధాప్యంలో అస్వస్థులై రాజమండ్రిలో కాలం చేసినప్పుడు భౌతికకాయాన్ని లాంచీలో రాజమండ్రి నుంచి పేరంటపల్లి తీసుకెళ్లారు. లాంచీ వస్తున్న సంగతి తీరగ్రామాల వాళ్ళందరికీ తెలిసింది. ప్రతి ఊరి రేవులోనూ లాంచీ ఆపారు. ఊళ్ళకు ఊళ్ళు పిల్లా పాపాతో గోదావరి గట్టుకు కదలి వెళ్ళి భౌతికకాయాన్ని దర్శించుకుని కన్నీటి తర్పణం విడిచి వచ్చాయి. లాంచీ మా ఊరి రేవుకి వచ్చినప్పుడు గోదావరి గట్టుకు పరుగెత్తిన జనంలో నేను కూడా ఉన్నాను.

బమ్మెర పోతనామాత్యుడు చంద్రగ్రహణం రోజున తన ఊరి గోదావరిలో స్నానం చేసి, జపతపాలు పూర్తి చేసుకుని భాగవతాంధ్రీకరణకు శ్రీకారం చుట్టారని అంటారు. చాలా ఏళ్లక్రితం చంద్రగ్రహణం రోజునే నేను మా ఊళ్ళో గోదావరి స్నానానికి వెళ్లినప్పుడు ఈ సంగతి గుర్తొచ్చి ఆ సన్నివేశాన్ని ఊహల్లో చిత్రించుకోడానికి ప్రయత్నించాను. పోతనగారు సరిగ్గా ఇలాగే, ఇలాంటి పరిసరాలలోనే; గోదావరి గాలులు మోసుకొచ్చే శీతలస్పర్శ దేహాత్మలను పునీతం చేస్తున్న ఘడియల్లోనే భాగవతాంధ్రీకరణ ప్రారంభించి ఉంటారనిపించింది. ఈ చంద్రగ్రహణం రోజున మా ఊరి గోదావరి దగ్గరి సన్నివేశం నాటి పోతనగారి సన్నివేశానికి అచ్చమైన ప్రతికృతి అయుంటుందనే ఊహ నన్నెంతో ఉత్తేజితుణ్ణి చేసింది. పోతన భాగవత పద్య పరిమళాన్ని మా తీరగ్రామాల వాకిట గోదావరి గాలులే వెదజల్లి వెళ్ళాయనిపిస్తుంది.

ప్రకృతి గీసిన రేఖాపటాలు భిన్నంగా ఉంటాయి.

మనిషి ఉల్లంఘించినది భౌగోళిక రేఖాపటాలను మాత్రమేనా… కాదు. గణం, తెగ, వర్ణం, కులం, జాతి వగైరా చట్రాలను కూడా పురాకాలం నుంచి, నేటి కాలం వరకూ ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. ఆదిమ కాలం నుంచి ఆధునిక కాలం వరకూ జాతుల సాంకర్యం ఎంత పెద్ద ఎత్తున జరిగిపోయిందో చెప్పుకోవడం ప్రారంభిస్తే దానికదే ఒక మహాగ్రంథం అవుతుంది. మనిషి అనుభవం ఇరుకునుంచి వైశాల్యానికి ఎదిగిందని మనం సాధారణంగా అనుకుంటాం. కానీ వైశాల్యం నుంచి ఇరుకులోకి కుదించుకుపోయిందని నాకు అనిపిస్తుంది. పురాచరిత్ర-చరిత్రలతో నా పరిచయం గొప్పదని చెప్పను కానీ, నాకొకటి గాఢంగా అనిపిస్తూ ఉంటుంది. మన పూర్వులు మనకన్నా విశాలమైన ప్రపంచాన్ని చూశారు. విశాలమైన అనుభవాలు పొందారు. వాటిని కొత్త కొత్త సమూహాలతో పంచుకున్నారు. సరిగ్గా ఇదే ఊహను హెచ్. జి. వెల్స్ (A SHORT HISTORY OF THE WORLD) కూడా ప్రకటించడం ఓ అపురూపమైన భావసారూప్యం . దూరాలను జయించడం అతి కష్టంగా ఉండే పురాకాలంలో మనిషి విశాల ప్రపంచాన్ని చూడగలితే, దూరాలను జయించిన నేటి గ్లోబల్ కుగ్రామంలో మనిషి అస్తిత్వం ఇరుకై పోతుండడం నాకు ఆశ్చర్యం గొలుపుతుంది.

మనం దేశాలు, ప్రాంతాలు, మనుషులు, మతాలు, భాషల మధ్యా; కాలాల మధ్యా కృత్రిమంగా కట్టుకున్న ఆనకట్టల మీదుగా, మన కళ్ళు కప్పి చరిత్ర ప్రవహిస్తూనే ఉంటుంది. తన అవిచ్ఛిన్నతను చాటిచెబుతూనే ఉంటుంది.  ఆమధ్య ఓసారి ఓ టీవీ చానెల్ పెట్టగానే అందులో ఓ చర్చ నడుస్తోంది. కొంతమంది యువతీ యువకులు రెండు పక్షాలుగా విడిపోయి ఆవేశంగా వాదించుకుంటున్నారు. అది కాశ్మీర్ గురించిన చర్చ అని వెంటనే తెలిసింది కానీ వారిలో ఒక పక్షం కాశ్మీరీ పండిట్లనీ, ఇంకో పక్షం కాశ్మీరీ ముస్లిం లనే విషయం కొంతసేపటికి కానీ తెలియలేదు. ఎందుకంటే, వారి ఆకృతులు, వేషభాషలు, హావభావాలు ఒక్కలానే ఉన్నాయి. ఒకే కుదురుకు చెందిన జనం అలా మతం కారణంగా విడిపోయి రెండుపక్షాలుగా చీలిపోయి తీవ్రంగా వాదించుకుంటున్న దృశ్యం నాకు విస్మయం కలిగించి ఆలోచన రేకెత్తించింది. నా ఊహల్ని చదివాడా అన్నట్టుగా ఆ చర్చలో పాల్గొన్న ఓ ముస్లిం యువకుడు “మీరూ మేమూ రక్తబంధువులం, మీ మీద మాకు వ్యతిరేకత ఎందుకుంటుంది, మనం ఎప్పటికీ సహజీవనం చేయవలసినవాళ్ళమే” అన్నాడు. ఎవరు ఏమనుకున్నా సరే, కాశ్మీరీలను మతాల లేబుళ్లతో గుర్తించకూడదని అప్పటికప్పుడు నేనొక వ్యక్తిగత నిర్ణయానికి వచ్చాను. మతం మధ్యలో వచ్చింది. వాళ్ళలో ప్రవహించే రక్తం తాలూకు గతం మతం కన్నా చాలా పురాతనం.

mahabharata1

నేటి భౌగోళిక రేఖాపటాలను. మతాలు తదితర ముద్రలను కాసేపు మరచి పోయి పైన పేర్కొన్న మహాభారత కథనానికి తిరిగి వెడదాం. చంపడం, చావడం నిత్యకృత్యంగా మారిన ఆయుధోపజీవులైన క్షత్రియగణాల గురించి అది చెబుతోందనుకున్నాం. మన చూపుల్ని మనదేశం నుంచి మరికొంత వాయవ్యంగా విస్తరించుకుని చూస్తే, అటు అప్ఘానిస్తాన్ నుంచి ఉత్తరభారతం వరకు అంతా ఆయుధోపగణాల నడవగా ఉండేది. అతి ప్రాచీనకాలంలో ఒక యుద్ధం జరిగింది. దశరాజ యుద్ధంగా అది ఋగ్వేదానికెక్కింది.  జలవనరులపై ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధం అది. పది గణాలకు చెందిన రాజులు పరూష్ణీ(నేటి రావీ నదిలో కొంతభాగం) నదీజలాలను మళ్లించడానికి ప్రయత్నించారు. భరతులలో త్వష్టృ అనే ఉపగణానికి చెందిన సుదాస్ దీనిని ప్రతిఘటించాడు. దాంతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సుదాస్ గెలిచాడు. సుదాస్ తో పోరాడిన పది గణాలలో ‘ఫక్తు’లు ఒకరు( మిగిలిన తొమ్మిది: సిమ్యు, తుర్వస, యక్సు, మత్స్య, భృగు, దృహ్యు, భలాన, అలీన, విశానిన్). ఫక్తులను అలెగ్జాండర్ కాలం నాటి గ్రీకులు Pakthyes అన్నారు. ఈ పక్తూన్లనే ఇప్పుడు పఠాన్లు అని కూడా అంటున్నారు. వీరికే పష్టూన్లనే పేరు ఉంది. అప్ఘానిస్తాన్ కు చెంది, గాంధీజీకి అనుయాయిగా మారి సరిహద్దుగాంధీగా ప్రసిద్ధుడైన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఈ తెగకు చెందినవారే.

ఈ ఆయుధోపజీవులను అంతమొందించే కార్యక్రమం మనదేశంలో కోసల, మగధ రాజులతో ప్రారంభమై గుప్త రాజుల వరకూ దాదాపు వెయ్యి సంవత్సరాలపాటు సాగింది. అందుకే అప్ఘానిస్తాన్ నుంచి ఉత్తరభారతం వరకూ ఒకప్పుడు ఆయుధోపజీవుల నడవ (కారిడార్)గా ఉండేదన్న మాట మనకిప్పుడు వినడానికి వింతగా ఉంటుంది.  ఈ ఆయుధోపజీవుల స్వైరవిహారమూ , వారి ఊచకోతా మనదేశంలో బుద్ధుడనే ఒక దార్శనికునీ, అహింస అనే ఒక  ఆదర్శాన్నీ సృష్టించాయి. మౌర్యరాజు అశోకుడికి ఈ ఆయుధోపజీవులే పెద్ద సవాలుగా మారారు. ఆ సవాలును ఎదుర్కొనే క్రమంలో అశోకుడు తీసుకున్న చర్యలు నేటికీ కొనసాగుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అవతరింపజేశాయి. మనదేశానికి గతంగా మారిపోయిన ఈ ఆయుధోప జీవన వ్యవస్థ అప్ఘనిస్తాన్ లో వర్తమానం. అప్ఘానిస్తాన్ కు చెంది, సరిహద్దు గాంధీగా ప్రసిద్ధుడైన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఫక్తూన్ తెగకు చెందినవారే. గాంధీ అనే మరో అహింసావాది ప్రేరణ తో ఆయన ఆయుధోపజీవులను శాంతి మార్గం లోకి మళ్ళించడానికి కృషి చేసారు. కానీ ఆయన కృషి ఫలించిన జాడ లేదు. చరిత్ర అవిచ్ఛిన్నత కు నేటి ఆఫ్ఘనిస్తాను ఒక ఉదాహరణ.

— కల్లూరి భాస్కరం

 

 

Download PDF

8 Comments

  • mohan says:

    Bhaskaram garu

    I am enjoying every piece on our history that you are writing.

  • మీరు చరిత్రపై రాస్తున్నవి ఇంతవరకూ చూడకపోవటం దురదృష్టం. ఇప్పటికైనా చూడటం ఆనందం.
    దూరాలను జయించడం అతి కష్టంగా ఉండే పురాకాలంలో మనిషి విశాల ప్రపంచాన్ని చూడగలితే, దూరాలను జయించిన నేటి గ్లోబల్ కుగ్రామంలో మనిషి అస్తిత్వం ఇరుకై పోతుండడం నాకు ఆశ్చర్యం గొలుపుతుంది. ఎంత వాస్తవం

    • కల్లూరి భాస్కరం says:

      వివిన మూర్తి గారూ…మీ స్పందన ఆనందం కలిగించింది. ధన్యవాదాలు. మిగిలినవి కూడా చదువుతారని ఆశిస్తాను.

  • భాస్కరం గారూ
    బాలానంద స్వామి లేదా పేరంటాల పల్లి స్వామి జీవితం గిరిజన గ్రామాల్లో వారి సేవలు,
    మొదలైన విషయాలేమైనా మరికొంత వివరంగా తెలియజేయగలరా?
    ఆయనకీ సీతారామరాజుకి పోలికలున్నాయనడంలో ఏమేరకు అవకాశాలున్నాయి?

    • కల్లూరి భాస్కరం says:

      శ్రీనివాస్ గారు, బాలానందస్వామి జీవిత చరిత్ర చాలాకాలం క్రితమే పుస్తక రూపంలో వచ్చింది. ఆయన గిరిజనులకు చేసిన సేవల గురించి నాకు కొంత తెలుసు. వాటి గురించి ఈ స్పేస్ లో రాయడం కష్టం. ఏమీ అనుకోకండి. ఆయన సీతారామరాజే నని అప్పట్లో చెప్పుకునేవారు. అందులో ఎంత వాస్తవం ఉందో ఎవరికీ తెలియదు. ఆయనను అడిగినా నవ్వి ఊరుకునేవారు అంటారు.

  • బి.అజయ్ ప్రసాద్ says:

    మీ వ్యాసాలను మొదటి నుంచి ఇష్టంగా చదువుతున్నాను. ముఖ్యంగా ఈ ప్రకృతి గీసిన రేఖాపటాలు వ్యాసం చాలా బాగా బావుంది. ఈ వ్యాసంలో మీ అబ్సర్వేషన్స్ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి.

    • కల్లూరి భాస్కరం says:

      అజయ్ ప్రసాద్ గారూ, నా వ్యాసాలు మీకు నచ్చుతున్నందుకు సంతోషం. మీ స్పందనకు ధన్యవాదాలు.

Leave a Reply to కట్టాశ్రీనివాస్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)