అస్పష్ట మహారణ్యంలో పాఠకుల్ని వదిలేసిన “ద్రోహ వృక్షం” కథ !

drohavruksham

‘ద్రోహావృక్షం’అనే కథ చూద్దాం. కథంతా ప్రతీకలతో,సంకేతాలతో నడుస్తుంది. ఒక భావనా ప్రపంచంలో, కల్పనా చాతుర్యంతో కథని నడపడం ఊహా? వ్యూహమా? అనే ప్రశ్న మనకి వస్తుంది. ప్రధానంగా ఇది ద్రోహం కథ. మరి ద్రోహులెవరు? కథలో వాక్యాలు చూద్దాం.

“ఇది నమ్మకద్రోహం నుంచి పుట్టిన అందం. నా జుట్టు చూశావా? ఎర్రటి  రంగులో మిలమిలలాడుతూ” అంటాడు కథలో పాత్ర కొండయ్య. తనని తాను ద్రోహిగా ప్రకటించుకొన్న కొండయ్య ఎవరికి ప్రతీక? కథలో చూద్దాం. “ఊరికి ఆ చివరన వాళ్ళ యిళ్ళు. ఈ చివరన మా ఇళ్ళు” అంటాడు మరో  పాత్ర సంగీతరావు. ఇద్దరి ఇళ్ళూ వూరికి చివర్లలోనే వున్నాయి కాబట్టి ఇద్దరూ మాల – మాదిగ కులాలకి ప్రతీక అనిపిస్తుంది. “రెండు కులాల మధ్యా” అని సంగీత అంటాడు. మరి ఈ ఇద్దర్లో కొండయ్య మాదిగ కులానికి ప్రతీక.మరి మాదిగలు మాలలకి ఎలా ద్రోహం చేశారు? కథలోంచి చూస్తే, గతంలో వాళ్ళిద్దరూ కలిసి ఎదురు కొండ ఎక్కుతారు చాలా కష్టమైన పని అది. కొండ ఎక్కాక “మేము జయించిన రాజ్యాలుగా తోచాయి” అంటాడు సంగీత. రిజర్వేషన్లను సాధించడానికి ఇది సంకేతం.. కథలోనే “రిజర్వేషన్లు, వర్గీకరణ, సభ, నిరసన, దళిత నాయకులు” అని వుంటుంది. అంటే రిజర్వేషన్ల విషయంలో కొండయ్య ద్రోహిగా మారి విభజన కోరాడని అర్ధం అవుతుంది. ద్రోహం చేసీ, మోసం చేసీ, కొందర్ని బలి ఇచ్చి కొండయ్య ఏం సాధించలేదని సంగీత అనుకుంటాడు. కథలో వాక్యాలు చూద్దాం. “ఎన్నిసార్లు గాలాన్ని పైకి లాగినా,అది ఖాళీగానే వుంటుంది. చేపలకట్లా తిండి వేయడానికే అతను అక్కడ కూర్చున్నట్లుగా ఉంది” చేపలు, చెరువు, సమాజానికీ, వేరే కులాలకీ ప్రతీకలు. ఎందుకు కొండయ్య ఏమీ సాధించలేదు? “ప్రాజెక్టువాళ్లు పెట్టిన స్కూలు, ఇప్పుడందులో దళితవాడల్లోని పిల్లలే చదువుతున్నారు. ఒకళ్ళిద్దరు చెంచుల పిల్లలు.” అని వున్నది కథలో. అంటే ప్రభుత్వ పాఠశాలలు దళితులకే పరిమితమయిపోవడం. రిజర్వేషన్లవల్ల ఏమీ వుపయోగం లేకపోవడం.. ఇక్కడ మనం ఆగి అసలు రిజర్వేషన్ల విషయం చూస్తే…

వ్యవసాయక సమాజంలో భూమి మీద యాజమాన్యం ఆధిపత్యం, వుత్పత్తి ప్రక్రియ (వ్యవసాయం)లో భాగం ఆధారంగానే కులాలు ఏర్పడ్డాయనిమనం స్థూలంగా అంగీకరిస్తాం. కులాల మధ్య వృత్యాసాలూ అలాగే ఏర్పడ్డాయి. గ్రామాల్లో నివాసాలు అంతే. వ్యవసాయంలో పెట్టుబడి ప్రవేశంతోనూ, “విద్య” స్థానంలో “చదువు” ప్రవేశంతోనూ వలసలు ప్రారంభమై నగరీకరణ పెరిగింది. “వృత్తి స్థానంలో “వుద్యోగాలు” ప్రవేశించి మనుష్యులు మనుగడ  కోసం సమాజం మీద కాకుండా  ప్రభుత్వం మీద ఆధారపడ్డం మొదలైంది.

కొండయ్య, సంగీతలు కలిసి ఎన్నికొండలెక్కేరోగానీ, అంబేద్కర్ మహాశయుడు ప్రపంచం ముక్కు మీద గుద్ది విషయాన్ని చెప్పడంతో అధికార గణాలు (అగ్రకులాలు) రిజర్వేషన్లు తీసుకొచ్చేయి. అయితే వ్యవసాయంలో ప్రవేశించిన పెట్టుబడి అంతరాల్ని అంతం చెయ్యలేదు. నగరీకరణ క్రమంలో చదువు కూడా కులాల అమరిక క్రమంలోనే వుపయోగపడిందనీ, ఫలితంగానే వుద్యోగాలు అనబడే జీవనోపాధి మార్గంలో అగ్రకులాలవారూ, ధనికులూ పైస్థాయిల్లోనూ, అదే క్రమంలో మిగతా కులాలవారూ కుదురుకున్నారనీ సామాజిక శాస్త్రవేత్తల అధ్యయనం ఋజువు చెస్తోంది.  అది ఆర్ధిక సూత్రం. అది చరిత్ర. దీనిలో భాగంగానే షెడ్యూల్డు కులాలనే వాటిలోనూ తారతమ్యాలు పెరిగాయి. రిజర్వేషన్లవల్ల మాలకులస్థులే ఎక్కువ ప్రయోజనం పొందరన్నది మాదిగ కులస్థుల భావన. స్థూలంగా ఆ భావం నుంచే వర్గీకరణ ఒక అంశంగా ముందుకొచ్చి ఆందోళనరూపం తీసుకొన్నది. తారతమ్యాల పెరుగుదలకీ జీవన మార్గాలు మూసుకుపోవడానికి కారణం భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలు. అది వదిలిపెట్టి కులాలు, ఒకరినొకరు ద్రోహులుగా లెక్కకట్టి మాట్లాడ్డం సరైనది కాదు. రిజర్వేషన్లు వుండే ప్రభుత్వ రంగం కుంచించుకుపోవడం గురించి, యంత్రాలు ప్రభుత్వ వుద్యోగుల్ని తగ్గించి వేయడం గురించి,  అంతరిస్తున్న వృత్తులు, కొత్త జీవనమార్గాల్ని కల్పించలేకపోవడం గురించి భూమితో సహా సహజ, వుమ్మడి వనరుల్ని, వుత్పత్తి సాధనాల్ని స్వంతం చేసుకున్న పెట్టుబడి మానవశ్రమ (జీవనమార్గం)ని దూరం చేసెయ్యడం గురించిమాట్లాడకుండా కులాలమధ్య వుండే వైరుధ్యాల్ని “వాళ్లని నమ్మవద్దు, వాళ్ల పొడ కూడ మన మీద పడకూడదు” అనీ, రెండు కులాల మధ్య పెద్ద పెద్ద కొట్లాటలే జరిగేయి. హత్యకేసులు, కోర్టు వాయిదాలు..” అని రాయడం ఒకళ్ల ఇళ్లు ఒకళ్లు కాల్చుకున్నారనీ, రాళ్లు విసురుకుంటున్నారనీ వాళ్ల మధ్య వైరుధ్యాన్ని వూహాశక్తి ప్రయోగించి వైషమ్యాల స్థాయికి తీసుకెళ్లి రాయడం వాస్తవ విరుద్ధం.ఇళ్ళు తగలబెట్టించేదీ, హత్యలు చేసేది రాజ్యం, ధనికవర్గం, మాలలు ఈ రోజుకి కూడా రాజ్యంలో భాగస్వాములు కాలేదు. అది పూర్తిగా వక్రీకరించి “అయ్యే ఎస్సో ఏదో రాసినట్టున్నావు” అని సంగీతరావు(మాల)ని రాజ్యానికి ప్రతినిధిగా చేసి  కొండయ్య మాట్లాడటం అవాస్తవం మాత్రమే కాదు. అన్యవర్గ ప్రయోజనం కూడా. మాదిగలు వేరే బడి (కులసంఘం) పెట్టుకోవడం గురించి, వాడు  నా ముఖ్యమైన శత్రువు అని రాసి ఏ వర్గం ఆలోచనా ధోరణిని మోసుకొస్తున్నాడు రచయిత. వర్గం అన్నానా? అవును . కొండయ్య మాదిగలకే ప్రతీక కాదు. కమ్యూనిస్టులకి కూడా . కథలో చూస్తే.

“ఎర్రగా భయం గొలిపేలా వుంది జుట్టు” అంటాడు సంగీతరావు కథ ప్రారంభంలోనే” తురాయి మొగ్గ, మోదుగ చెట్లు, గద్దర్, నవంబర్ నెల” అంటాడు.

“నా జుట్టు చూసావా?ఎర్రని రంగులో మిలమిలలాడుతూ” అంటాడు కొండయ్య.

“ఎర్రటి గుండ్రటి మొహం అతనికి” అంటాడు సంగీతరావు కథలో.

“చర్చల కల, తుపాకులు, గెరిల్లా యుద్ధ తంత్రం” అని వున్నది ఇంకాకథలో ” ఈ రంగు పూలను చూసి మోసపోకు. దీని అందాలను  చూసి మోహపడకు. ఇది నమ్మకద్రోహం నుంచి పుట్టిన అందం” అంటాడు కొండయ్య.  బహుశా జూడా రక్తం నాలోనూ పారుతుందేమో” అంటాడు కొండయ్య.

అంటే కమ్యూనిస్టులు ద్రోహులనా? ఎదురు కొండ విప్లవానికి, జయించిన రాజ్యం అంటే ఒక గొప్ప, అధర్శ సమాజానికి సంకేతమైతే, కమ్యూనిస్టులు ద్రోహులని కొండయ్య ద్వారా రచయిత అభిప్రాయ పడ్డట్టు అనుకోవాలి. పైవి రెండూ కలిపితే కమ్యూనిస్టుల్లోని మాదిగలు, లేదా మాదిగలకోసంకమ్యూనిస్టులు మాలలకి లేదా ప్రజలకి ద్రోహం, మోసం చేశారన్న అర్ధం వస్తుంది. అయితే కథలో ఇంకెక్కడా ఈ భావాన్ని ఖండించే వాక్యాలు లేవు కాబట్టి కమ్యూనిస్టులు ఏ విధంగా, ఎవరికి ద్రోహం చేశారో చెప్పవలసిన అవసరం వున్నది.

జూడాస్ గురించీ, బైబిలు గురించీ ఒక కథ చెప్తాడు కొండయ్య. అయితే కొత్త నిబంధన గ్రంధంలో ఎర్ర పొలం గురించి వున్నది కానీ కథలో రాసినట్టు “మరుసటి రోజు చెట్టు మొత్తం వెలిగిపోయి, “దాని కొమ్మల నిండా ఎర్రటి పూలు పూసాయి” అని ఎక్కడ వున్నది అనుమానాస్పదం. పైవన్నీ చదవగానే మనకి హిట్లర్ వుదంతం గుర్తొస్తుంది. హిట్లర్ కూడా జాతి వ్యతిరేక ఆవేశానికి లోనయ్యాడా అనిపిస్తుంది.

Half of all German Banks were Jewish owned, Stock Brokers were Jews.  Half of Newspapers were Jewish” అని చరిత్రకారుడు RALF GEROGE REUTHరాసింది నిజమే కావచ్చు. కానీ హిట్లర్ ఆ సగాన్నీ వాస్తవంగానే చూశారుగాని విశ్లేషణాత్మకంగా చూడనేలేదు. తన చుట్టూ వున్న జర్మన్ ప్రజల కష్టాల్నీ, వారి బీదరికాన్ని చూసిన  హిట్లర్ దానికి కారణం తనని హాస్టల్ నుంచి వెళ్లగొట్టిన యూదులే కారణం అనుకున్నాడు అనిపిస్తుంది. ఆ జాతి ద్వేషంలోంచే అతను

“The personification of the devil as the symbol of all evil assumes the living shape of the Jew”

అన్నాడు. మరింత విషాదం ఏమిటంటే వ్యతిరేకులు కూడా గౌరవించే కార్ల్ మార్క్స్‌ని గొప్ప ఆర్ధికవేత్తగా, సిద్ధాంతకర్తగా కాక ఒక యూదుగానే చూశారు. లెనిన్‌ని అలాగే చూశారు. అందుకే…

“Death to Marxism” అన్నాడు.

“THE HEAVIEST BLOW WHICHEVER STRUCK HUMANITY WAS CHRISTIANITY. BOLSHEVISM IS CHIRISTIANITY’S ILLEGITIMATE CHILD . BOTH ARE INVENTIONS OF THE JEW.” అనే తీవ్ర  తప్పిదం చేశాడు. యూదుల్లో అత్యధికులు కమ్యూనిస్టులుగా వుండడానికి కారణం బీదరికం, దోపిడి అని గుర్తించలేక లక్షలాదిమందిని చంపించేడు. వర్గానికీ, జాతికీ, కులానికీ వున్న పరిధులూ, ప్రమేయాల పట్ల స్పష్టత లేనప్పుడు జరిగే ప్రమాదాలివి.

విషయానికొస్తే షెడ్యూల్డు కులాల్లో మాల, మాదిగలే కాక వేరే కులాలు బోలెడన్ని వున్నాయి. తరతరాలుగా ఎంతో అవమానకరమైన పనులు చేసి బతికిన, బతుకుతున్న ఎన్నో కులాలున్నాయి (పాకీ, రెల్లి, చచ్చర,) అవన్నీ వదిలేసి వర్గీకరణ మాల – మాదిగల సమస్యగా ముందుకు రావడం మనం విశ్లేషించుకోవాలి. ఈ విషయం గురించి కథలో ఏమీలేదు.

కథలో వున్న “చర్చల కల ముగిసి, మళ్ళీ అడవిలోని పొదలకు తుపాకులు మొలుస్తున్నాయని హెచ్చరికలిచ్చారు” అన్న వాక్యంలోంచి చూస్తే రియాజ్ మరణం వెనక ద్రోహం వున్నదని “ఐదు హంసలు” నవలా రచయిత భావిస్తున్నారా  అనిపిస్తుంది.

ఇన్నిరకాల భావాలు కలిగేటట్టుగా అస్పష్టంగా, పరస్పర విరుద్ధ వాక్యాలతో కథ రాయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?

“కప్పి చెప్పడం” అనే దాన్ని ఇంతగా సాగదీసి అస్పష్ట అరణ్యంలో పాఠకుల్ని వదిలెయ్యడం ఎందుకో?

రచయితకు  వుద్ధేశాలు అంటగట్టడం నా ఆశయం కాదు. కాని ఒక కథ ఎలాటి భావాలు కలుగజేసే అవకాశం వున్నదో తెలుసుకోవాలి. ఈ భావాలకు కారణం ప్రయోగం కోసం కధా ? కథ కోసం ప్రయోగమా?  అని ప్రశ్నించుకుని రచయితే తెల్చుకోవాలి.

విషయం కోసం కథ రాస్తే  స్పష్టత, కథ కోసం విషయం తీసుకొస్తే విస్తృతీ తీసుకొస్తే నిడివీ ఉంటాయన్న విషయాన్ని “ఆవు – పులి మరి కొన్ని కథలు” “క్రానికల్స్ ఆఫ్ లవ్” కథలు నిరూపిస్తాయి.

ఈ కథ రచయిత డాక్టర్ వి. చంద్రశేఖర్‌రావు. ఈ కథ వార్త ఆదివారం 2004 డిసెంబరు 26 లో ప్రచురించబడింది.

( సి. ప్రసాద వర్మ కు కృతజ్ఞతలు)

–చిత్ర

Download PDF

9 Comments

  • amarendra says:

    మంచి విశ్లేషణ ..ఇలాంటి వ్యాసాలూ కథలను sradhhagaa చదివే వాళ్లకు చాలా సాయ పడతాయి ..థాంక్స్

  • ఎ.కె.ప్రభాకర్. says:

    కథని మరోసారి లోతుగా తరచి చూసేలా చేసింది ఈ వ్యాసం.కథలో రచయిత గొంతుని గుర్తు పట్టాలి. పాత్రల అభిప్రాయాల్నిరచయితకి ఆపాదించలేం. వివరంగా మరోసారి….

  • Lalitha P. says:

    మంచి విశ్లేషణ రాసారు. మీరు చెప్పినట్టు మాల, మాదిగల మధ్య కొట్లాటలూ, వైషమ్యాల స్థాయికి కథను తీసుకెళ్లటం అతిశయోక్తి అలంకార ప్రయత్నాన్ని కూడా దాటిపోతోంది గానీ, చంద్రశేఖర రావు కథల్లో శైలి రియలిస్టిక్ గా ఎప్పుడూ లేదు. ఆ విలక్షణ శైలే ఆయన కథల అందం. కానీ ఈ కథలో ఆయన చెప్పదలచుకున్న విషయమే అస్పష్టత పులుముకుంది. రిజర్వేషన్ల ఫలాలు తక్కువగా అందుకున్న మాదిగలు ద్రోహులెలా అవుతారో నాకూ అర్ధం కాలేదు. రాజ్యాధికారం కూడా పెట్టుబడి గల వాడిదే. భూమి, పెట్టుబడుల మీద పట్టు లేకుండా రిజర్వేషన్ల మీదే ఎప్పటికీ చూపు సారించటం వలన రాజ్యాధికారం ఎలా వస్తుంది? వర్గాన్ని కాదని కేవలం కులమే అంతిమ సత్యం అనుకోవటం, దానినే సమర్ధించే రచనలు చేయటం వల్ల ఏర్పడే అస్పష్టత ఇది. జూడాస్, హిట్లర్ ల గురించి చాలా చక్కగా రాసారు.

  • Manjari Lakshmi says:

    కథలో వున్న “చర్చల కల ముగిసి, మళ్ళీ అడవిలోని పొదలకు తుపాకులు మొలుస్తున్నాయని హెచ్చరికలిచ్చారు” అన్న వాక్యంలోంచి చూస్తే రియాజ్ మరణం వెనక ద్రోహం వున్నదని “ఐదు హంసలు” నవలా రచయిత భావిస్తున్నారా అనిపిస్తుంది. రియాజ్ ఎవరూ? “ఐదు హంసలు” నవలా నాయకుడా! నిజంగా చనిపోయిన విప్లవ కారుడా. వి. చంద్రశేఖర్ రావుగారి కథలు చాలా అస్పష్టంగా ఉండటం వల్ల అందులో మంచే ఉందో, చెడో ఉందో అర్ధం కాదు. చిత్రగారి సమీక్ష చదవటం వల్ల ద్రోహ వృక్షం కమ్యూనిష్టు పార్టీ, ద్రోహులు అందులో చేరిన మాదిగలు అనే అర్ధం ఈ కథలో ఉన్నట్లు అర్ధమైంది. చిత్రగారి లాంటి వాళ్ళు ఇల్లా కాస్త విడమరిచి విమర్శగా చూపించటం వల్ల కొంతైనా అర్ధం చేసుకోగలుగుతున్నాము ఇటువంటి మార్మిక కథలను. “రిజర్వేషన్ల ఫలాలు తక్కువగా అందుకున్న మాదిగలు ద్రోహులెలా అవుతారో నాకూ అర్ధం కాలేదు.” అన్న పి.లలితగారి మాటలతో నేను ఏకీభవిస్తున్నాను.
    .

  • reddi raamakrishna says:

    బాగుంది మంచి విశ్లేషణ

  • Thirupalu says:

    మీ విశ్లేషణ చాలా బాగుంది. స్థానిక రాజకీయాలు తెలియకుండా ఈ కధ అర్ధం కాదేమో? అయినా మొదటి పేరా లోని ప్రతీకలు ఏదో రెమ్డు రాజకీయ పార్టీల గురించిన పోలిక అనిపిస్తుంది? చివరకు మీరు చెప్పినట్లు స్పష్ట అరణ్యంలో పాఠకుల్ని వదిలెయ్య దమే.
    .

  • Thirupalu says:

    ఈశీర్షిక కు పులుస్టాప్‌ పెట్టారా?

  • Brilliant analysis, sir. Read the story just now and then read your analysis.
    కథ చదువుతూ ఉన్నప్పుడు .. సూపరని అనుకోలేదు గానీ కథకుడు నన్ను చేతి వేలు పట్టుకుని ఆ నల్లమల అడవిలోకి తీసుకుపోయినట్టె అనిపించింది. మాల-మాదిగ, రిజర్వేషన్లు, ఎవరూ బాగు పడకపోవడం – ఈ ప్రతీకల్నే నేనూ గుర్తు పట్టాను. Up to this point, I agree with your analysis.
    ప్రతీకాత్మకంగా రాసిన కథల్లో ప్రతీ పదచిత్రాన్నీ నిజజీవితంలో ఒక ఎలిమెంటుకి ముడి వెయ్యడం బహుశా సాధ్యం కాదేమో. స్థూలంగా రచయిత ఉద్దేశం అర్ధమవుతున్నది కనుక ఆ స్థాయిలోనే భావాన్ని గ్రహించి, కథలోని మిగిలిన వాక్యాల్ని కథకి అవసరమైన పునాదిగా తీసుకోవాలి తప్ప, ప్రతిదానికీ నిజ జీవితంలో దేనికో లంకె ఉండదేమోనని నాకు అనిపించింది.
    కానీ ఇంత నిశితంగా కథని చదివిన మీ పదునైన దృష్టికి జోహార్లు. మార్మికంగా కథ రాయాలనుకునే వాళ్ళు విషయం పట్ల ఎంత స్పష్టత కలిగుండాలో మీ విమర్శ చెబుతున్నది. నమస్తే!

Leave a Reply to reddi raamakrishna Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)