గాంధారి పెళ్లి

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

అంగములలోన మే లుత్తమాంగ మందు

నుత్తమంబులు గన్నుల యుర్విజనుల

కట్టి కన్నులు లేవను టంతె కాక

యుత్తముడు గాడె సద్గుణయుక్తి నతడు

                                  -నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, పంచమాశ్వాసం)

అవయవాలు అన్నింటిలోనూ ఉత్తమం శిరస్సు, ఆ శిరస్సులోనూ ఉత్తమాలు కన్నులు. అలాంటి కన్నులు లేకపోవడం ఒక్కటే లోటు కానీ, సద్గుణసంపదలో అతడు ఉత్తముడు కాడా ఏమిటని ఈ పద్యం చెబుతోంది. సందర్భమేమిటంటే, గాంధారరాజు సుబలుడు తన కూతురు గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశానని బంధువుల మధ్య ప్రకటించాడు. అప్పుడు బంధువులు ఇలా అనుకున్నారు.

***

మన వివాహ సంబంధాలు బోర్లించిన గోపురం ఆకారంలో ఉంటాయి. పైన ఉండే వైశాల్యమూ, చుట్టుకొలతా కిందికి వెడుతున్న కొద్దీ తగ్గిపోతాయి. పై భాగాన అంతర్జాతీయస్థాయి వివాహాలు ఉంటే, అట్టడుగున ఒకే కుటుంబంలో ఇచ్చి పుచ్చుకునే వివాహసంబంధాలు ఉంటాయి. ఈ మధ్యలో జాతీయం, రాష్ట్రీయం, ప్రాంతీయం, గ్రామం వగైరా  ఉంటాయి. అంతర్జాతీయస్వభావం కలిగిన వివాహాల సంఖ్య తక్కువే అయినా వాటి  భౌగోళిక వైశాల్యం చాలా ఎక్కువ.

రాజీవ్ గాంధీ, సోనీయా గాంధీల వివాహం అంతర్జాతీయం. అలాగే, చాలాకాలంగా ప్రచారంలో ఉన్నట్టు రాహుల్ గాంధీ కొలంబియా అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే జరిగితే అది కూడా అంతర్జాతీయం అవుతుంది.  జాతీయ వివాహాలకు ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వచ్చు. ఇందిరాగాంధీ-ఫిరోజ్ గాంధీల వివాహం జాతీయం. అలాగే, ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ ల వివాహం. కిందికి వెడుతున్న కొద్దీ ఒకే స్వభావం కలిగిన వివాహ సంబంధాల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది కానీ, ఎంపిక స్వేచ్ఛ తగ్గిపోతూ ఉంటుంది. కులం, ప్రాంతం వగైరాలకు చెందిన ప్రాధాన్యాలు, పట్టింపులు అందుకు కారణమవుతాయి. ఒకే కుటుంబంలో ఇచ్చి పుచ్చుకోవడం బహుశా వివాహసంబంధాల సంకుచిత, కనిష్ట రూపం.

కులాల పరంగా చూస్తే, బ్రాహ్మణులు, క్షత్రియుల వంటి రెండు మూడు అగ్రవర్ణాల వారి వివాహ సంబంధాలకు జాతీయస్వభావమూ, ఎంపిక స్వేచ్ఛ ఎక్కువ ఉండడానికి సూత్రరీత్యా అవకాశం ఉంది. శూద్రులకు కూడా ఆ అవకాశం ఉండేది కానీ, వారు అనేక కులాలుగా చీలిపోవడం వల్ల అది తగ్గిపోయింది. వెనకటి సంగతి ఎలా ఉన్నా ఈ రోజున కులాంతర వివాహాలతో పాటు  అంతర్ బ్రాహ్మణ వివాహాలు జాతీయస్వభావాన్ని తెచ్చుకుంటున్నాయి. పైగా అవి ఆక్షేపణీయం కావడం లేదు. నేనీ మధ్య అలాంటి ఓ పెళ్ళికి వెళ్ళాను. వరుడు తెలుగబ్బాయి, వధువు అరవమ్మాయి. వరుని అన్న ఒక మరాఠీ అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆ అమ్మాయి అన్నయ్య ఓ గుజరాతీ అమ్మాయిని చేసుకున్నాడు. ఒకే కులం మధ్య వివాహసంబంధాలు అలా నాలుగు రాష్ట్రాలను, నాలుగు భాషలను ముడి పెట్టాయి.

కులం, శాఖ, ప్రాంతం, భాష వగైరాలతో గిరిగీసుకునే వివాహసంబంధాలే సహజమైనవనీ, శాస్త్రసమ్మతాలనీ, సర్వత్రా అదే ఆనవాయితీ అనే భ్రమ మనలో ఇప్పటికీ చాలామందిలో ఉంది. కానీ ఉన్నతవర్గాలలో వివాహసంబంధాలు ఇప్పుడే కాదు, ఎప్పుడూ  గిరిగీసుకుని లేవు. ఉదాహరణకు, రాజకీయనాయకులు, సినీ నటులు, ఇతర సెలెబ్రటీల వివాహాలు. ఇతరేతర అంశాలు వారి వివాహనిర్ణయాలకు కొలమానం అవుతుంటాయి. వివాహం వ్యక్తిగతం అనుకుంటాం. కానీ వెనకటి రాచకుటుంబాల కాలంలో వివాహం వ్యక్తిగతం కన్నా ఎక్కువ రాజకీయసంబంధి.

రాజకీయ అవసరాలు, ఒప్పందాలలో భాగంగా ఆ వివాహాలు జరగడం సర్వసాధారణం. గజపతుల యువరాజును చెరపట్టిన కృష్ణదేవరాయలు రాజకీయసంధిలో భాగంగా అతని సోదరిని వివాహం చేసుకున్నాడు. అన్నపట్ల క్రూరంగా ప్రవర్తించిన రాయలను ఆమె ఎంత మనస్ఫూర్తిగా ప్రేమించిందో, ఎంత మనోవ్యధ అనుభవించిందో మనకు తెలియదు. తండ్రి రాజకీయ చదరంగంలో పాచికలుగా మారిన రాచకన్నెలు చరిత్ర పొడవునా ఉన్నారు. వాళ్లలానే వాళ్ళ కన్నీళ్లు కూడా అసూర్యం పశ్యలై అంతఃపుర రహస్యాలుగానే మిగిలిపోయి ఉంటాయి. రాచకుటుంబాలలో వివాహ సంబంధాలకు కులీనత, స్థాయి మొదలైనవి గీటురాళ్ళుగా ఉంటాయి కనుక  భాష, ప్రాంతం తదితరాలను అధిగమించడం అనివార్యమవుతుంది. విజయనగరం మహారాజు పాటియాలా మహారాజుతో వియ్యమందడం లాంటివి సహజంగా జరిగిపోతాయి.

మహాభారతానికి వస్తే, కురురాజుగా అభిషిక్తుడైన ధృతరాష్ట్రునికి భీష్ముడు పెళ్లి చేయాలనుకున్నాడు. ఈడు వచ్చిన యువకునికి పెళ్లిచేయాలనుకోవడంలో విశేషమేముంది కానీ, ఆ సమయంలో భీష్ముని ఊహాల్ని ప్రధానంగా మరొకటి ఆక్రమించుకుంది. అప్పటికి కొన్నేళ్ళ క్రితమే కురువంశం ఆగిపోయే ప్రమాదం భయపెట్టింది. వ్యాసుని జోక్యంతో ఆ గండం గడిచింది. ఆ అనుభవం ఇప్పటికీ భీష్ముని ఆలోచనల్లో పచ్చిగానే ఉంది.  కనుక ధృతరాష్ట్రుని పెళ్లిని మించి, ఆ పెళ్లితో కులం నిలిచే అవకాశమే అతనికి కొట్టొచ్చినట్టు కనిపించింది. విదురునితో ఆలోచనలను కలబోసుకున్నాడు. ఇక వధువు ఎవరన్న విషయానికి వస్తే, గాంధారరాజు సుబలుని కూతురు గాంధారి మంచి రూపమూ, లావణ్యమూ, శీలమూ, ఆభిజాత్యమూ కలిగిన కన్య అని బ్రాహ్మణుల ద్వారా విన్నాడు. పైగా వందమంది కొడుకులు కలిగేలా ఆమె వరం పొందిందని తెలిసి మరింత ముచ్చటపడ్డాడు. సుబలునితో మాట్లాడి రమ్మని కొంతమంది వృద్ధులను పంపించాడు.

ధృతరాష్ట్రుడు పుట్టంధుడు. అయినాసరే, సుబలుడు భీష్ముని కోరికను కాదనే అవకాశం లేదు. ఎందుకంటే, రాజు ధృతరాష్ట్రుడే కానీ, రాజ్యరక్షకుడు భీష్ముడే. అతడు పరాక్రమవంతుడే కాక, కాశీ రాజు కూతుళ్లను రాక్షసవివాహ పద్ధతిలో ఎత్తుకు వెళ్ళి, తన తమ్ముడు విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేసిన చరిత్ర అతనికి ఉంది. కనుక ఆ ప్రతిపాదనకు  ఒప్పుకుని మర్యాద నిలుపుకోవడమే మంచిదని సుబలుడు అనుకొని ఉండచ్చు. దాంతో, ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’నని బంధువుల మధ్య ప్రకటించేశాడు. గాంధారి ఆ మాట వింది. తండ్రి అలా మాట ఇచ్చిన క్షణం నుంచే ధృతరాష్ట్రుని తన భర్తగా భావించింది. ఈ కళ్ళతో ఇక పరపురుషుని చూడరాదనుకుని నేత్రపట్టం కట్టుకుంది. ఓ రోజున సోదరుడైన శకుని గాంధారినీ, గొప్ప సంపదనూ వెంటబెట్టుకుని హస్తినాపురానికి విచ్చేశాడు. గాంధారీ-ధృతరాష్ట్రుల వివాహం వైభవంగా జరిగిపోయింది.

నిజానికి అప్పుడు ధృతరాష్ట్రుడు ఒక్క గాంధారిని మాత్రమే పెళ్లిచేసుకోలేదు. ఆమెతోపాటు ఆమె చెల్లెళ్ళు పదిమందిని పెళ్లాడాడు. మహాభారతం వాళ్ళ పేర్లను కూడా ఇచ్చింది. అంతేకాదు, కులం, రూపం, శీలం కలిగిన మరో వందమందిని తెచ్చి ధృతరాష్ట్రునికి ఇచ్చి భీష్ముడు పెళ్లి చేశాడు. ఆ లెక్కన ధృతరాష్ట్రుని భార్యలు నూటపదకొండుగురు అవుతారు. అప్పుడు అతనికి వందమంది కొడుకులు ఉండడంలో ఆశ్చర్యం లేదు. అయితే వారందరినీ  గాంధారి సంతానంగానే చెబుతారు.  గతంలో ఒకసారి చెప్పుకున్నట్టు, మహాభారతంలో కొన్ని వివరాలు ప్రచారంలో లేవు. అలాగే, అనేక సందేహాలకు అందులో తగిన సమాధానం ఉండదు. నూటొక్క మందిని గాంధారి సంతానంగా చెప్పడం అలాంటిదే. గాంధారి చెల్లెళ్ళకు, ఇతర భార్యలకు కలిగిన సంతానాన్ని కూడా పట్టమహిషి అయిన గాంధారికే ఆపాదించి ఉండచ్చు. నూటొక్కరు (కూతురు దుశ్శలతో కలిపి) కౌరవులలో పదిహేడుమందే గాంధారికి పుట్టినవారని ఎస్.ఎల్. భైరప్ప తన ‘పర్వ’ నవలలో అంటారు. అయితే, చిక్కుముడులుగా కనిపించే ఈ సంతానం లెక్క లన్నింటికీ శాస్త్రపరమైన ఇతర వివరణలు లేకపోలేదు. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం.

సుబలుడు ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’ననడం, కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు ‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావం’డనడంలా ధ్వనిస్తుంది. మహాభారత కాలం నుంచీ నేటి వరకూ అప్రతిహతంగా సాగుతున్న పితృస్వామ్యం పదునును ఈ రెండు వాక్యాలూ పట్టి చూపుతాయి. ముక్కుపచ్చలారని తన కూతురును ముసలివాడికిచ్చి పెళ్లి చేసే అఘాయిత్యాన్ని సహించలేక అగ్నిహోత్రావధాన్లు భార్య ప్రతిఘటించడం భోజనాల దగ్గర పెద్ద సీను సృష్టిస్తుంది. మరి సుబలుని నిర్ణయాన్ని అతని భార్యా, పిల్లలు వాస్తవంగా ఎలా తీసుకున్నారో తెలియదు. విశ్వనాథ సత్యనారాయణగారు నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తికి ఉదాహరణగా ఈ ఘట్టాన్ని పితృస్వామ్య కోణం నుంచి వ్యాఖ్యానించారు.  ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’ననగానే బంధువులు మారు మాట్లాడక పోగా, కళ్ళు లేకపోతేనేం గుణవంతుడు కాడా ఏమిటని సరిపెట్టుకోవడం; తండ్రి ఆ మాట అన్న క్షణం నుంచీ గాంధారి ధృతరాష్ట్రునే తన భర్తగా భావించి నేత్రపట్టం కట్టుకోవడం -బంధువర్గంలోనూ కుటుంబసభ్యుల్లోనూ సుబలుని మాటకు గల  తిరుగులేని లక్షణాన్ని, గాంధారి పాతివ్రత్యాన్ని సూచిస్తాయని విశ్వనాథవారు అంటారు.  ఇరావతీ కార్వే తన ‘యుగాంత’లో స్త్రీ కోణం నుంచి ఈ ఘట్టాన్ని చూస్తూ గాంధారి నేత్రపట్టం కట్టుకోవడం తండ్రి నిర్ణయంపట్ల నిరసన సూచకంగా అనుమానిస్తారు. కాలంతోపాటు కలిగే దృష్టిభేదం ప్రతి కాలంలోనూ పురాగాథల్ని సరికొత్తగా వ్యాఖ్యానించుకునే అవకాశం కల్పిస్తుంది. ఆ విధంగా ఆ కథలు నిత్యనవీనత్వాన్ని సంతరించుకుంటూ ఉంటాయి.

అంధత్వాన్నే కాదు, ఏ వైకల్యాన్ని అయినా వేలెత్తి చూపించడం ఇప్పుడు కుసంస్కారం అవుతుందని మనకు తెలుసు. అదలా ఉంచి, ధృతరాష్ట్రునిపై సానుభూతినుంచి కలిగిన ప్రేమతోనే గాంధారి అతనిని భర్తగా అంగీకరించీ ఉండచ్చు.  నిజంగా ఆమె ఆంతర్యం ఏమిటో మనకు తెలియదు. తెలిసే అవకాశం లేదు.

birth-kaurava-gandhari-mahabharat-indian-mythology

చెప్పుకుంటూ వెడితే ఈ ఘట్టంలోని విశేషాలకు అంతే ఉండదు. ధృతరాష్ట్రునికి వధువుకోసం గాంధారం దాకా వెళ్ళారంటే, సమీపంలో సుక్షత్రియకన్య దొరకలేదనుకోవాలి.  గాంధారి రూపలావణ్య శీలాల గురించి భీష్ముడు బ్రాహ్మణుల ద్వారా వినడం ఇంకో విశేషం. బ్రాహ్మణుల ద్వారానే ఎందుకంటే, వాళ్లే ఆనాడు క్షత్రియ కుటుంబాలకు, బయటి ప్రపంచానికి మధ్య వారధులుగానూ, వార్తాహరులుగానూ ఉన్నారు. అంటే, నాలుగు గోడల మధ్య ఆభిజాత్యాన్ని కాపాడుకునే క్షత్రియులకు బహిరంగ అభివ్యక్తి లేదా బయటి ప్రపంచాన్ని చూపించే కిటికీ బ్రాహ్మణులే. అది మళ్ళీ బ్రాహ్మణ-క్షత్రియ అన్యోన్యత గురించిన చర్చలోకి తీసుకువెడుతుంది. దానినలా ఉంచితే, ఎక్కడికైనా యధేచ్చగా వెళ్లగలిగే అవకాశమూ, బహుశా అధికారమూ ఆనాడు బ్రాహ్మణులకే ఉండి ఉండాలి. అది మళ్ళీ నాటి సామాజికమైన అమరికవైపూ, గణసమాజపు తీరు తెన్నులవైపు మనల్ని మళ్లిస్తుంది. అలాగే, ధృతరాష్ట్రుడే గాంధారదేశం వచ్చి గాంధారిని పెళ్లాడకుండా, గాంధారే అతని దగ్గరకు తరలి వెళ్లడమూ విశేషమే.

అంతకు మించి గమనించవలసిన విశేషం ఇంకొకటి ఉంది. అది కుంతి- పాండురాజుల వివాహం. ధృతరాష్ట్రునికి వధువు కోసం గాంధారదేశం దాకా వెళ్లవలసివచ్చింది కానీ, పాండురాజుకు వధువు దగ్గరలోనే, యాదవుల ఇంట దొరికింది. ఆ వధువు కూడా అప్పటికే కొడుకును కన్నది. అన్నదమ్ములే అయినా రాజ్యాధికారం ఉన్న వ్యక్తికీ, లేని వ్యక్తికీ వధువును ఎంపిక చేయడంలో ఉండే తరతమ భేదాలకు ఇది సూచన కావచ్చు. అయితే, ఆ తర్వాత పాండురాజు భీష్ముని అనుమతితో మద్రదేశపు రాచకన్య మాద్రిని కూడా పెళ్లిచేసుకున్నాడు.  మొదటి పెళ్లికీ, ఈ పెళ్లికీ మధ్య ఏం జరిగిందో తెలియదు. కుంతికి సంతానం కలగకపోవడం ఒక కారణంగా కనిపిస్తుంది. లోపం పాండురాజులోనే ఉన్నా దానిని కప్పి పుచ్చడానికి  మాద్రిని ఇచ్చి చేశారని ఎస్.ఎల్. భైరప్ప ఊహిస్తారు. కుంతి చరిత్ర యాదవ-క్షత్రియుల మధ్య నున్న సామాజిక అంతరాన్ని సూచిస్తోందనుకుంటే, అదే కురు-పాండవ శత్రుత్వానికీ అంతిమంగా యుద్ధానికీ దారితీయించిందా అన్నది అన్నింటికంటే ఆసక్తికరమైన ప్రశ్న.

Kunti_Gandhari_Dhrtarashtra

కిందటి వ్యాసం ఆగిపోయిన చోటికి మళ్ళీ వెడదాం.  మధ్య ఆసియాలో ఉన్న నేటి అప్ఘానిస్తానే నాటి గాంధారదేశం. అంటే ధృతరాష్ట్రునికి వధువును మధ్య ఆసియా నుంచి తెచ్చుకున్నారన్నమాట. అంతేకాదు, మాద్రి కూడా అక్కడిదే. మద్రదేశం గాంధారదేశాన్ని ఆనుకునే ఉంటుంది. అది మళ్ళీ ఉత్తర మద్ర, తూర్పు మద్ర అనే రెండు జనపదాలుగా ఉండేది.  ఉత్తరమద్రను ఉత్తర కురుభూములని, బాహ్లిక దేశమని కూడా అనేవారు. గ్రీకులు దానినే బాక్ట్రియా అన్నారు. పురాణ, ఇతిహాస కాలం నాటి భౌగోళిక రేఖా పటాన్ని గీస్తే అది అప్ఘానిస్తాన్ నుంచి  ఉత్తరభారతం వరకూ ఒకే నడవగా ఉన్నట్టు చూపిస్తుందని చెప్పుకున్నాం. అంటే,  మధ్య ఆసియా, భారత ఉపఖండ జనపదాల మధ్య బాంధవ్యాలు, ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు, యుద్ధాలలో పరస్పర సహకారం ఉండేవన్నమాట.

క్షత్రియ వధువుల కోసం గాంధార, మద్రదేశాలవరకూ వెడితే వెళ్లచ్చు కానీ, నిజానికి మద్ర (లేదా బాహ్లిక) జనాలకు మంచి పేరు లేదు. ఆ విషయం కూడా మహాభారతమే చెబుతోంది. దాని గురించి తర్వాత…

 

Download PDF

11 Comments

  • pavan santhosh surampudi says:

    ఈ అంశాలను దాదాపు ఇలాంటి దృక్కోణంతోనే వ్యాఖ్యానించే నవల “పర్వ”. ఆ నవల కూడా మహాభారత ఐతిహాసిక స్థాయిని దిగజార్చకుండా ఆసక్తికరణమైన భిన్నకోణాలను చూపుతూ గంగా నదిలా సాగిపోతుంది. చాలా చక్కని వ్యాసాలూ వ్రాస్తున్నందుకు అభినందనలు. వ్యాసమాలిక పూర్తీ అయ్యాక పుస్తకరూపంలో వచ్చి పాఠకుల్ని అలరించాలని ఆశిస్తున్నాను.

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు పవన్ సంతోష్ గారూ…ఈ వ్యాసాలు తప్పకుండా పుస్తకరూపంలో వస్తాయి.

  • ఇప్పటి కాందహారే గాంధారమని విన్నాను. ఇక – పిల్లకోసం అంత దూరం ఎందుకు వెళ్ళారు? ఆ రోజుల్లో ఎంత రాజైనా చూపులేనివాడు కాబట్టి చులకనై వుంటాడు. మీరు వుదహరించిన పద్యాన్నే చూడండి. “శరీరంలో ముఖ్యమైన తలలో వుండే ముఖ్యమైన కళ్ళులేకపోతే మాత్రమేమీ…” అంటున్నారు గాంధారీ బంధువులు. అందులో ప్రయత్నపూర్వకంగానే చేర్చబడ్డ ఎత్తిపొడుపు కనిపిస్తోంది నాకు. మరో కథ కూడా విన్నాను. గాంధారికి జాతకరీత్యా వైధవ్య యోగం వుందనీ, దాని పరిహారానికి ఒక గాడిదకి ఇచ్చి పెళ్ళి చేసి ఆపై దానిని (గాడిదని) సంహరించారని ఒక కథ. శ్రీకృష్ణుడు ఈ కథ భీముడికి చెప్పటంతో అతను దుర్యోధనుణ్ణి వెక్కిరిస్తాడు. తద్వారా ఆ కథ మొత్తం తెలుసుకున్న ధుర్యోధనుడు గాంధారంపై దండెత్తడం, శకునిని పక్కలో బల్లెంలా చేర్చుకోవడం తెలిసిందే. ఈ కథ నిజమైతే గాడిదకి విధవ అయిన స్త్రీ కాబట్టి దొరికిందే చాలని గుడ్డి భర్తను అంగీకరించి వుండచ్చు. లేదా ఇంతకన్నా మంచి సంబంధం మనకి ఎక్కడ దొరుకుతుందమ్మా అని తల్లిదండ్రులు బ్రతిమిలాడి వుండవచ్చు.

    గాంధారికి నూర్గురు పుట్టే వరం తెలిసి భీష్ముడు ఆమెను దృతరాష్ట్రునకు కట్టబెట్టడం చూడండి. క్షేత్ర ప్రాధాన్యతని తెలుసుకోవడమే కదా? తద్వారా తన వంశాభివృద్ధి ఆశించటం గమనించండి.

    వర్తమానానికి వస్తే ఆంధ్ర బ్రాహ్మణులు కొంత కాలం క్రితం (70 ఏళ్ళు??) ఆడపిల్లలు కరువై కర్నాటక, తమిళనాడు నుంచి అమ్మాయిల్ని పెళ్ళి చేసుకోని తెచ్చుకున్నారు. పాల్ఘాట్ పిల్లని తెచ్చుకున్నారని సాంప్రదాయులు బుగ్గలు నొక్కుకునేవారట. కర్నాటకలో చిన్న పిల్లని పెళ్ళి చేసుకోని ఆంధ్రాకి (ఎత్తుకోని) తెచ్చుకున్నా ఓ ముత్తాతయ మా బంధువుల్లో వుండేవారు.

    ఇలా పొరుగు రాష్ట్రం నుంచి వచ్చే భాష రాని బ్రాహ్మణులను మోసపుచ్చి ఇతర కులస్థులు తమ కూతుర్లని “బ్రాహ్మణ” ముసుగు వేసి అప్పజెప్పేవారని కూడా కథలున్నాయి.

    • Thirupalu says:

      అచ్చం జరిగినట్లే చెపుతున్నారు గాంధార్ కాందహార్ అని. మహాభారతం పురాణమా లేక చరిత్రా సార్? ఈ రామాయణాలు మహాభారతాలు మనల్ని వదిలి పోవా ?

      • పురాణాన్ని మతపరమైన భక్తితో చూడటం వేరు తార్కికమైన చరిత్రకారుని దృష్టితో చూడటం వేరు. ఇక్కడ రెండోది జరుగుతోంది. మీరు మొదటిది అనుకోని ప్రశ్నలు వేస్తున్నారు.

        అచ్చం జరిగనట్లే చెప్తున్నారని మీరు అడుగుతున్నారు, జరగలేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? “మహాభారతం చరిత్రా? పురాణమా?” – పురాణంలో చెప్పినట్లే జరిగి వుండకపోవచ్చు కానీ జరిగింది అనడానికి ఆధారాలు వున్నాయి. భాస్కరంగారి మిగతా వ్యాసాలు చదవండి. కవులు అప్పటి రాజులను పొగిడేటప్పుడు దేవుడని ఇంద్రుడని చెప్పి వుండవచ్చు. వాటిని అలాగే తీసుకోవాల్సిన పనిలేదు.

        గాంధీ లాంటి వ్యక్తి ఈ భూమి మీద నడిచాడంటే తరువాతి తరాలు నమంవని ఒక మహానుభావుడి అప్పుడే చెప్పాడు. మరో వందేళ్ళ తరువాత బుద్ధుడు కూడా మతపరమైన పురాణమేకానీ చరిత్ర కాదుసార్ అని మీలాంటివాళ్ళు అనే అవకాశం వుంది. వీలైతే రాహుల్ సాంకృత్యాయన్ “ఓల్గా నుంచి గంగ వరకు చదవండి. పర్వ చదవండి. ఆ తేడా మీకు అర్థం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు కృష్ణుడు గాలిలో ప్రత్యక్షమై చేతిలో నుంచి చీరలు తెప్పించి వుండకపోవచ్చు. సరిగ్గా అదే సమయానికి హస్తినాపురం వచ్చి జరుగుతున్న ఘోరాన్ని చూసి ఆపి వుండవచ్చు (శ్యాం బెనగల్ భారత్ ఏక్ ఖోజ్‌లో ఇలాగే చూపించారు). “సమయానికి దేవుడిలా వచ్చాడని” అందరూ పొగిడి వుండచ్చు. దాన్ని వూహకొద్దీ కవులు కథలు అల్లి వుండచ్చు. చిత్రకారులు సింబాలిగ్గా చూపించడానికి చీరలు కృష్ణుడి దగ్గరనుంచి వస్తున్నట్లు బొమ్మగీసినట్లు చూపించారనుకోండి. ఆ తరువాత మన సినిమాల దగ్గరికి వచ్చేసరికి శ్రీకృష్ణుడు ఎక్కడో ద్వారకలో కుడి చెయ్యి పైకెత్తితే హస్తినలో గాలిలో ప్రత్యక్షమై చేతిలో నుంచి చీరలు వచ్చినట్లు, నేపధ్యంలో మురళీగానం వినిపించినట్లు చూపించారు. జరిగింది చరిత్ర. చివరికి వచ్చేసరికి తయరైంది – కథ లేక పురాణం. ఈ తేడా తెలుసుకుంటూ వెనక్కివెళ్ళడం మన మూలాలను తెలుసుకోవడం అవుతుంది. మన సమస్యల మూలాలను తెలుసుకోని వాటిని ఎదిరించేందుకు సరంజామా సిద్ధం చేసుకోవడం అవుతుంది. అన్నింటినీ మించి ఒక అనుభవం అవుతుంది.

        కాబట్టి అవి పుక్కిటి పురాణాలు కావని, చరిత్ర అని నమ్మితే మహాభారతాలు, రామాయణాలు మనల్ని వదిలిపెట్టవు. మనం కూడా వాటిని వదిలిపెట్టకపోవడమే శ్రేయస్కరం.

      • Thirupalu says:

        రాహుల్ సాంకృత్యాయన్ “ఓల్గా నుంచి గంగ వరకు ” చాగంటి తులసి గారి అనువాదం చది వాను సార్‌. సాంకృత్యాయన్ సామాజిక ఆంత్రోపాలజి, మాన నాగరికా ప్రస్తానం గురించి చెప్పాడు. మనమూలాలను మరిచి పోదామని నేనే గాదు మరెవ్వరు చెప్పరనుకుంటా. మనము ఎక్కడనుండి వస్తున్నమో తెలియకుంటే మనం ఎక్కడకి పోవాలో కూడ తెలియదు. మనమూలాల్లోని మంచిని జల్లెడపట్టి తీసుకోవటం ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు. ఆజల్లేడపట్టటం లోనే ఒక రాజకీయం ఉంది. దాన్నే నేను ప్రశ్నిసిస్తున్నాను. ఇప్పటి ఖఘోళ శాస్త్రానికి కూడా మనవాల్లు మతాన్ని అంటకడుతున్నారు. బిగ్‌ బాంగ్‌ తియరీకి కూడా మనవాళ్ళు దైవాత్వాన్ని అంట కడుతున్నారు. గాడ్‌ పర్టికల్‌ ని ఎవరి కనుగునంగా వారు అన్వ ఇంచుకుంటున్నారు- ప్రత్యేకంగా ఒక మతమనే కాదు. అన్నీ మతాలవాళ్లు.
        మీరు చెప్పినట్లు తత్వ శాస్త్రం గురించి మాట్లాడే వారు,భారతీయ తత్వశాస్త్రాల్లో మతాన్ని తత్వ శాస్త్రాన్ని విడదీసి చెప్పలేమంటున్నారు అది క్షీర నీర న్యాయం లా కలిసి పోయి ఉంటుంది- చార్వాకం మినహ- (నండూరి రామ్మోహన్‌ గారి విశ్వ దర్శనం.). నేను వేదాలు ఉపనిషిత్తులు గురించి మాట్లాడటం లేదు. రామాయణ మహభారతాలగురించి మాత్రమే. మహభారతంలో ఒక సామాజిక వ్యవస్త ఉంటే ఉండోచ్చు, అంతమాత్రానా అది మనకి ప్రామాణికంగా భావి మ్చాల్సిన అవసరం లేదు.అందులో ఎన్నో నిక్షిప్తాలు, మరెన్నో కల్పనలు. ఆనా టి పాలకులకు అనుగుణంగా రాసుకున్నావే నని నేను కాదు చాలామందే చెప్పారు. (డి.డి. కొశాంబి గారే భగవత్‌ గీతను ఉటంకిస్తూ ఏం చెప్పారో చూడండి.) ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. మార్మికతను ఏదోవిధమగా మానవ మస్తిస్కాల్లో చొప్పించాలని ఉవ్వీళ్ళు ఊరుతున్నారు. ( నేను ఇక్కడ భాస్కరం సార్‌ గారి రచన గురించి మాట్లాడలేదు.ఎందుకంటే ఆయన వ్యాసాలు నేను చదవలేదు కనుక. యాదృక్షికంగా మీ వ్యాక్యను చూడటం జరిగింది) మనరచయితలు కధలు రాస్తే కధకు కావలిసిన పరిసరాలు వర్ణించినపుడు వాస్తవమైనవే కనిస్తాయి. అందువల్ల మన నిజంగా జరిగిన కదే అనుకుంటున్నామా? కధ జీవితాన్ని ప్రతి పలిస్తుంది ఆ కదే జీవితం ఎలా కాదో అలాగే (ఇతిహసమ0టు న్నాఋ) ఆనాటి ఋషుల ( లేక సైంటిష్టుల) కధల్లో పరిసరాలు ఎలా ప్రతిపలిస్తున్నవో అవే ఇతిహాసాలు అని నాభావన.
        మీరు చివరిగా అన్న మాటను ఉటంకిస్తాను: కాబట్టి అవి పుక్కిటి పురాణాలు కావని, చరిత్ర అని నమ్మితే …. అంటూ ముగించారు. ఈ నమ్మితే అనే మాటలోనే ఉన్న సంగ్దితే అవి కావు అని చెప్పటానికి తార్కానంగ బావించవచ్చు. నమ్మకం మీధ ఆధారపడి ఏదీ వాస్తవమవదు.
        ఏమైనా మీ వివరణకునకు కృఉతజ్ఞుతలు!

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు అరిపిరాల గారూ…గాంధారిని ధృతరాష్ట్రునికి ఇవ్వడానికి మీరు చెప్పిన కారణాలూ ఉండచ్చు. అయితే నేను రాజకీయ కారణాలను సూచించాను. మీరన్నట్టు గతంలో పాల్ఘాట్ అమ్మాయిని తెచ్చుకుని పెళ్లి చేసుకున్న ఉదంతాలూ చాలానే ఉన్నాయి.

  • chintalapudivenkateswarlu says:

    పురాగమన శీర్షికపై వస్తున్న విమర్శలో పాల్గొలక తప్పటంలేదు. ‘ఓల్గా నుండి గంగవరకు” అనువదించింది చాగంటి తులసిగారా! అయితే అల్లూరి సత్యనారాయణగారు అనువదించిన పుస్తకం పేరేమిటి?
    ఖగోళ శాస్త్రానికి మనవాళ్ళు మతాన్ని అంటగడుతున్నారన్నారు. అదికూడా నిజమనిపించదు. మన శాస్త్రాల్లో అంగారకుడున్నాడు. అతనికి కుజుడని, క్ష్మాజుడని, ధరాసుతుడని, పుడమిపట్టి అని, భూజుడని, భూసుతుడని, మహీజుడని, భౌముడని అనేకపేర్లున్నాయి. వీటన్నిటికర్ధం భూమికి పుట్టిన వాడనే. అంటే చరిత్రకందని కాలంలో జరిగిన ఒక విస్ఫోటనంలో భూమికి సంబధించిన కొంతభాగం దూరంగా విసిరివేయబడి అంగారక గ్రహమైంది. అందులో మన వాతావరణం ఉందని శాస్త్రజ్ఞులిప్పుడు ఘోషిస్తున్నారు. ఈవేళే అక్కడ నీరుకూడా ఉందనీ మనిషి బ్రతుకవచ్చని ధ్రువీకరించారు. ఇదంతా పూర్వులకు ఎలా తెలిసిందంటారు? వారు ఏగ్రహానికీ పెట్టని పేర్లు ఆ గ్రహానికే ఎందుకు పెట్టారు?
    కాబట్టి పురాణాలను గ్రుడ్డిగా నమ్మొద్దు. హేతుద్రుష్టితో అవగాహన చేసికోవాలి. హేతువు దొరికేదాకా ఆగాలి. తొందర పడకూడదు.

  • Thirupalu says:

    ‘ఓల్గా నుండి గంగవరకు” అనువదించింది చాగంటి తులసిగారా! అయితే అల్లూరి సత్యనారాయణగారు అనువదించిన పుస్తకం. అన్నారు బాగుంది. అల్లూరి సత్యనారాయణగారి పుస్తకం నేను చూల్లేదు సార్. నేను చెప్పిన పుస్తకం మాత్రం విశాలంద్ర వాళ్లు వేశారు. వాల్లనడిగితే గానీ తెలియదు. నాదో విన్నపం. ఒక పుస్తకాన్ని ఎంతమందైనా అనువదించవచ్చు ఎన్ని ప్రచురణ సంస్తలైనా ప్రచురించవచ్చు అనే హేతు బద్దమైన ఆలోచన మీకు వచ్చినట్లైతే ఈ సందేహం మీకు రాదు. మీ ఖగోళ శాస్త్ర సిద్దాంతాన్ని నే ను కూడ నమ్మదలచుకోలేదు.

  • pavan santhosh surampudi says:

    ఇంకా రామాయణ భారతాల గురించి చర్చా అంటే నాకు ఏడుతరాలు నవల గుర్తొస్తోంది. అందుబాటులో ఉన్నదేదైనా ఇలా చులకనగానే అనిపిస్తుంది. ఇంటిపెర్లూ, గోత్రాలూ, ఇతిహాసాలూ, ఊరిపెర్లూ ఇలా ప్రతివాటిలోనూ చరిత్రను నిక్షిప్తమ్ చేసిన జాతిలో పుడితే వెగటుగా తోస్తుంది. అలెక్స్ హేలీలా ఏ ఆధారమూ లేని చోటైతే ఆ మూలాల అన్వేషణ ఉద్వేగభరితంగా తోస్తుంది. ఏ దిక్కో తోచని చరిత్రనే చీకట్లో ఏ ఆధారమూ దొరకని చోట అన్వేషణ బావుంటుంది కానీ ఇన్ని ఆధారాలు, కొండగుర్తులు ఇస్తొంటే ఏం బావుంటుంది?

  • Thirupalu says:

    పవన్ సంతోష్ గారు,
    మీ ఏడు తరాల పుస్తక పరిచయం పుస్తకం నెట్లో చూ శాను. మీ పరిచయం చాలా బాగుంది.
    వంశవృక్షాలతో, ఇంటిపేర్లతో, గోత్రాలతో అవిచ్ఛిన్నమైన చరిత్రనీ, అమృతతుల్యమైన మాతృభాషనీ, తనదైన సంస్కృతీ కలిగి ఉండీ వాటిని కాలదన్నుకునే తెలుగువారు ఈ నవల నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు అనడం కూడా చుశాను.
    ఈ మధ్య కొంత మంది చరిత్రకారులుచెపుతున్న దాని ప్రకారం మన మూలాలనుతెలుసుకోవలసి వస్తే చరిత్రను తిరగ రాసుకోవలసి ఉంటుంది. అదే సమయంలో కొత్తగా తెరకెక్కుతున్న మతాంతీకరణ చరిత్ర ఆ మూలాలకు ముసుగేస్తున్నదని నేను అనుకుంటున్నాను.
    శ్రీ శ్రీ గారి దేశ చరిత్రలు చదవని వారు ఎవరూ ఉండరనుకుంటాను.తారీకులు దస్తవేజులు,ఆ రాణి ప్రేమ పురాణం……….. కాదోయ్‌ చరిత్ర సారం! అన్నట్లుగా చరిత్ర సారం వేరు, వంశవృక్షాలు, ఇంటి పేర్లు, గోత్రాలు— ఇవన్ని మానవ జాతిని వేరు పరిచేవి మాత్రమే! మానవ మూలాలు వేరు వంశ మూలాలు వేరు. రెండు ఒకటి కావు. ఇవన్ని ప్యూడల్‌ సమాజానికి వెన్ను దన్ను గా నిలుస్తున్నవే కాని మానవ జాతికి కాదు. ఏడు తరాల్ని నేను చదవలేదు కానీ, దానికి మీరు చేప్పేదానికి అస్తిమ శతకాంతరం కూడా పొసగదు. ఎందుకంటే భానిస జీవితాలకు అలవాటు చేసిన వారు ఆ భానిసల్ని భానిసలగానే ఉంచదలచుకొని పూర్వవృత్తంతాలు తెలీనీయ కూడదు వాళ్ల భాషని మాట్లాడనీయ కూడదు అని అనిచి పెడతారు. ఇందులో కుంటా తన మూలాలను వెతుకున్నది ఈ భానిస బ్రతుకు బ్రతక కూడదు తన ముందు తరాల్లో ఏమైన గౌరవ ప్రదమైన జీవితం గడిపారేమో చూసుకోవడానికి. ఈ తెల్ల వాల్లకు సమంగ తనకు ఒక ఐడెంటిపికషన్‌ ఉందేమో చూసుకోవడానికి. తన పౌరషాన్ని కూడ బయట పెట్టుకోవడానికి. ఈ కోణం నుండి మీరు ఆలోచించలేదు.
    కొడవటిగంటి కుటుంబ రావు గారు అంటారు – తన సైన్సు వ్యాసాల్లో- ప్రపంచా వ్యాప్తంగా ఉన్న నేటి మానవుడు తన మూలాల్నిబట్టి ప్రతి ఒకడికి వేరొకడు రక్త సమ్బదికుడే అని.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)