త్రిపుర గారూ !మీరు ఎక్కడికీ వెళ్ళ లేదనే నా నమ్మకం…

600277_473103009426641_557986530_n

త్రిపుర గారూ !

మీకు ఉత్తరం రాసి ఎన్నాళ్ళయిందో. అప్పుడెపుడో చాలా ఏళ్ళ కిందట మీరు అగర్తలా అంచుల్లో ఉన్నపుడు  పెద్ద ఉత్తరం రాసాను. దానికి మీరు రెండు చిన్న వాక్యాల జవాబిచ్చారు. నేను చిన్నబుచ్చుకొని పెద్ద కాగితం మీద తిరిగి నేను కూడా ఒకే వాక్యం రాసి పంపాను. “నీ ఒక్క వాక్యం వెనుక వున్నఖాళీకాయితం నాకు ఎన్నో చెప్పిందంటూ” అప్పుడు మీరు నాకు పేద్ద ఉత్తరం రాసారు. అప్పుడే మీరంటే ఏమిటో తెలిసింది. త్రిపురకి ఎక్కువ మాటలు, పెద్ద ఉత్తరాలు అక్కర్లేదు. లౌడ్ వాయిస్ పనికిరాదు.  అంతే కదూ  !

అందుకే పెద్ద ఉత్తరం రాయను. కానీ ఎన్నో జ్ఞాపకం వస్తున్నాయి. కన్నీళ్ళు అనకూడదేమో అలాంటివే  ఏవో….. వాటి మధ్య నుంచే . రెవెన్యూ గెస్ట్ హౌసులో దిగారు మీరు  84 డిసెంబర్ అని గుర్తు. అనాబ్ షాహి ద్రాక్షపళ్ళ మీది పలచని పొర వొలిచి మీ చేతులో పెడుతుంటే అవి తింటూ చిన్నగా కబుర్లు చెబుతూ ఇంక చాలు ఇరవై మూడు తిన్నానన్నారు. అదీ త్రిపుర. లెక్క తప్పకుండా జీవితాన్ని  ఆస్వాదించటం అంటే అదే కదా  –

అప్పట్లో మా తమ్ముడు చెప్పినట్లు మీ ప్రేమ పొందాలని మేమందరం పోటీ పడ్డాం. కానీ మీరు భక్తసులభులు. మేం కోరిన దాని కన్నా ఎక్కువ ప్రేమించారు మమ్మల్నందరిని.

తొంభై ఎనిమిదిలో అనుకుంటాను కాఫ్కా కవితలు పుస్తకం శాఫాలిక డాబా మీద ఆవిష్కరించాము. ఆ రోజు భోగి పండుగ. మద్యాహ్నం మూడు దాటాక కాఫ్కా వాసన కొట్టే కొత్త పుస్తకాలు పట్టుకొని విజయవాడ నుంచి విశ్వేశ్వర రావు, వి. చంద్రశేఖరరావు గార్లు  దిగారు. “నాకు క్రౌడ్ పనికి రాదు.  చిన్న గేథరింగ్ చాలు” అన్నారు మీరు . మీ  అక్కయ్య, లక్ష్మి తల్లి గారు , సంధ్య, మేమూ అంతే. మీరు అలా కలల్లోంచి ఊహలలోకి జారుతూ పుస్తకావిష్కరణ చేయించుకున్నారు.

 

ఆ మర్నాటి ఉదయం నా చెయ్యి పట్టుకుని “పాపా! నా డ్రీమ్ నిజం చేసావు” అన్నారు. మీకు అప్పుడు చెప్ప లేదు కానీ ఈ జన్మను సార్ధకం చెయ్యడానికి ఈ ఒక్క మాటా చాలదా ? అనుకున్నాను.

 tripura

ఆ సాయంత్రం ఇస్మాయిల్ గారూ మీరూ మళ్ళీ శేఫాలిక పెరట్లో నేరేడు చెట్టు కింద గాజు గ్లాసులు కాకుండా స్టీలు గ్లాసుల్లో కబుర్లు తాగారు, ఎవరికీ తెలియకుండా. చివర్లో ఎమ్మెస్ సూర్యనారాయణ వచ్చి,కనిపెట్టేసి, మీ ఇద్దరినీ చంటి పిల్లలుగా మార్చేస్తే, వాడిని నాలుగు తిట్టి, నేనూ లక్ష్మి గారూ మిమ్మల్ని నిద్రపుచ్చి తెల్లవారే సరికి మళ్ళీ పెద్దవాడ్ని చేసేసాం కదా! అప్పుడు సామర్లకోట స్టేషన్ లో మిమ్మల్ని రైలెక్కించి ఇంటికి వచ్చాక నేననుకున్నట్టే మీరూ ఉత్తరంలో రాసారు. ” రైలు దిగి మళ్ళీ కాకినాడరైలెక్కి వెనక్కి వచ్చేయ్యాలనిపించింది” అని.

 

ఆ నాలుగు రోజులూ మీరూ, లక్ష్మి గారూ నా దగ్గర మా అమ్మా, నాన్నల్లా ఉన్నారు.  సరిగ్గానే రాస్తున్నాను.  మీరూ అమ్మలాగ ఆమె నాన్నలాగ.  అదే సమయంలో నా కడుపున పుట్టిన పిల్లల్లాగా కూడా ఉన్నారు.  భోజనం టైములో ప్లేట్ పట్టుకుని “అమ్మా అన్నం పెట్టు తల్లీ ” అని సరదాగా గోల  చేస్తూ.

 

ఆ  మర్నాడు ఉదయాన్నే రెడీ అయి బయటికి తీసికెళ్ళి” మీరిద్దరూ ఇప్పుడు మంచి చీరలు కొనుక్కోవాలి, నేను కొని పెడతాను” అని సంధ్యకీ నాకు ఎంతో అందమైన చీరలు సెలక్టు చేసి కొనిపెట్టారు.  అలాంటప్పుడు ఈయనా ? చీకటి గదులు రాసిన త్రిపుర ? అద్దంలోని శేషా చలపతిరావ్ చేత” గొప్ప మజా ! స్కాండ్రల్ !” అనిపించిన త్రిపురా? అని మాటి మాటికీ ఆశ్చర్య పోయేదాన్ని.

 

అవును మీ కథల పుస్తకాలు నా దగ్గర రెండు ఉండేవి.  ఒకటి ఇంటి దగ్గర చదవడానికి, మరోటి ప్రయాణాల్లోకి.  ఎన్ని సార్లు చదివేనూ ఆ కథలు.  ప్రతి సారీ శరీరంలోకి నెత్తురు ఎక్కిస్తున్నట్టుఉంటుంది .ఆ తర్వాతే కదా మిమ్మల్ని చూసాను.  అస్సలు పోలిక లేదు.  ఆ కథలకీ మీకూ సమన్వయం కుదర్చడం ఏళ్లు గడిచినా సాధ్యం కాలేదు.

 

మీరు చాలా సింపుల్.  మీ ప్రేమ పొందడం చాలా సులువు.  మీతో సంభాషణ మరెంతో సరళంగా హాయిగా ఉంటుంది.  కానీ మీ కథలు ఒక పట్టాన కాదు బహు పట్టాన కూడా అంతు బట్టవు.  కానీ వాటిని చదువుతూ ద్వారాలు తెరుచుకుంటూ లోపలికి ప్రవేశిస్తూ ఉంటే ఏదో మైకం ఎక్కి అందులోంచి మెదడు లోపలి పొరలు ఒక్కక్కటిగా తొలగి మెలకువ లోకి ఒత్తిగిలినట్టవుతుంది.

 

మీ లోపలి ప్రపంచానికీ, బయటి ప్రపంచానికీ మధ్య ఇంత దృఢమైన ఉక్కు వంతెన ఎలా కట్టగలిగారు ? వంతెన ఇవతలినుంచి చూస్తే అవతలి మీరు కనపడడం లేదు మా లాంటి వాళ్లకి.  మీరు జర్కన్.  వీరా స్వామిని జర్కన్ అన్నారు మీరు.  కానీ మీరే జర్కన్.  అలా జీవించగలగడం ఒక మోహం లాగ నన్ను చాలా కాలంగా పట్టుకుని పీడిస్తోంది.  సరళ జీవనం అనే మోహం అది. కానీ అది ఎంతటి దుస్సాధ్యమో మొదలు పెడితేనే గానీ  అర్థం కాదు.

 

ఇంత సులువుగా బతుకుతూన్నమీరు  ఎక్కడికో వెళ్ళేరని అందరూ అంటున్నారు .  మా అమ్మ, నాన్నల్లాగా, ఇస్మాయిల్ గారి లాగ మీరూ ఎక్కడికీ వెళ్ళ లేదనే నా నమ్మకం.

600277_473103009426641_557986530_n

విశాఖ సముద్ర తీరంలోని ఒక అందమైన పాత కాలపు ఇంట్లో మనం రాత్రి ఎంతో సేపు చెప్పుకున్న కబుర్లు, రామలక్ష్మి అపార్మెంట్ లో మీ ఇద్దరితో కలిసి నేను నాలుగు రోజులు గడిపినప్పుడు ఉదయాన్నే మనిద్దరం కాఫీ తాగుతూ చెప్పుకున్న సంగతులు అన్నీ అలాగే ఉన్నాయి.  కొంచెం కూడా రంగు తగ్గలేదు.  మీ కథల్లో మీరు  సకృత్తుగా- కానీ  -ఎంతో అవసరంగా వాడిన సంస్కృత పదాలు ఏరి నేను చెప్తుంటే మేఘాలయ హోటల్లో మీరూ, అమ్మా దోసెలు తినడం మానేసిమరీ కుతూహలంగా వినడం ఇప్పుడే జరుగుతోన్నట్టుంది.

 

మీలోని భాస్కర్ శేషాని క్షమిస్తాడు.  దయతో ఆదరిస్తాడు.  ఘోరంగా మోసపోయినా, దిగమింగుకుని ,సహించుకుని శేషియోతాలూకు  వెనక జీవితం గురించి యోచించమంటాడు.  లోకంలో మూడు వంతులు ఉప్పునీరున్నట్లు శేషియోలే  ఉంటారు.  వాళ్ళను సహిస్తూ జీవితాన్ని హుందాగా జీవించడం ఎలాగో చెప్పడం కోసమే ఇంతటి పనితనంతో కథలు చెక్కుతూ జీవించిన త్రిపురగారూ !అవనీ మీ జీవన సాధన లో భాగమైన ఆత్మకథ లే అని కదా మీరు అంటారు .అసలు ఆత్మకథలు అలాగే వుండాలని చెప్తూ కన్ఫెషనల్ గా వుండాలన్నారు ఆత్మకథ గా రాయడం లో సెల్ఫ్ డిసీవింగ్ఎలిమెంట్ ఉంటుందని మీరే పసిగట్టగలరు .

మా లాంటి వాళ్ళం ఉన్నత కాలం మీ కథలు మా దాహాలకు జలాశయాలవుతాయి.  మీ జ్ఞాపకాలు ఇంకెన్నో ఉన్నాయి  అవి నేను ఉన్నంత కాలం నాతోనే ఉంటాయి కదా!అంత కాలమూమీరు ఈ లోకంలో మాతో ఉన్నట్టే .
త్రిపురా త్రిపురా అని తల్లడిల్లిపోతున్న రామయ్య గారికి చెప్పండి నేను ఆయన బాధ చూడలేకుండా ఉన్నాను.

 

“గాలివాన చెట్లను ఊపినట్లు ఊపిన” మీ కథల పుస్తకంలోంచి అమాంతం లేచి వచ్చి “పాపా ఇస్మాయిల్ గారికి నేనిచ్చిన  టీ షర్ట్ సరిపోయిందా,ఆయనకు నచ్చిందా” అని పలకరిస్తూనే ఉన్నారు మీరు.  రామయ్య గారితో కూడా ఒక్కసారి చెప్పండి ”కాకినాడ నుంచి వచ్చిన పాపకీ వాళ్ళ స్నేహితులకీ నీ గురించి గంట సేపు చెప్పాను” అని.

 

కాసేపు విశ్రాంతి తీసుకుంటారా! మళ్ళీ మాట్లాడుకుందాం.  ఈ లోగా లక్ష్మి అమ్మతో కబుర్లు చెప్పి వస్తాను. ఉండనా కాసేపు

 

వెండి వుంగరం తో  దృఢంగా వుండే

మీ చెయ్యి తాకి  కాసేపు వీడ్కోలు తీసుకోనా?

- వాడ్రేవు వీరలక్ష్మి దేవి

————————————————–

‘లేఖా సాహితి’ మీ శీర్షిక

వేగం పెరిగిన ఇప్పటి జీవితాల్లోంచి కనుమరుగై పోతున్న ఒక అందమయిన ప్రక్రియ: లేఖ.

కాని, లేఖ రాయాలి అనిపించే బలమయిన అనుభూతి ఇంకా మిగిలి వుందనే మా ఆశ.

మీరొక లేఖ రాయండి ఈ శీర్షిక కోసం…మీ మనసు లోపల దాచి పెట్టుకుంటున్న మాటలకు ఒక రూపాన్నివ్వండి. ఒక రచన చదివాకో, ఒక రచయితని కలిసాకో, ఒక సాహిత్య సమావేశం తరవాతనో, ఒక అందమయిన సంభాషణ జరిగాకో…ఆ కబుర్లన్నీ కలబోసుకునే లేఖ రాయండి. ఎవరినో ఒకరిని ఉద్దేశించే మీరు రాయక్కర్లేదు. కాని, మీరు రాయాలనుకున్నదే రాయండి. ‘సారంగ’ ద్వారా మీ ఆత్మీయ సాహిత్య ప్రపంచంతో పంచుకోండి.

మీ లేఖని పంపాల్సిన ఈ-చిరునామా: editor@saarangabooks.com

—————————

Download PDF

15 Comments

 • buchireddy gangula says:

  వీరలక్ష్మి గారు
  ఎంతో అదృష్ట వంతులు మీరు — Tripura గారితో గడిపే భాగ్యం
  దొరికినందుకు —
  చక్కగా రాశ్రారు —
  ——————————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 • amarendra says:

  ఏమని చెప్పను? eemee చెప్పకుండా ఉండటం కష్టం గా ఉంది !

 • v veeralakshmidevi says:

  అమరేంద్ర గారు thanks

 • Elanaaga says:

  వీరలక్ష్మీ దేవి గారూ!

  మనసులోని ఆత్మీయత తాలూకు మరువపు పరిమళాన్ని కాయితమ్మీద ఇలా మీలాగా పరచటం అందరి వల్లా అయ్యే పని కాదు. అనుభవాలను, జ్ఞాపకాలను గురించిన ఇట్లాంటి మీ వ్యాసాలన్నింటిలోనూ మీ సంస్కారగంధం గుబాళించటాన్ని గమనించకుండా వుండలేరు యెవరైనా. రాస్తూనే వుండండి యిలానే. అభినందనలతో -

  • v veeralakshmidevi says:

   ఎలనాగ గారూ ఎంతో సంతోషం కలిగించే మాటలు రాసారు.ఇవే రాయిస్తూ వుంటాయి

 • మెర్సీ మార్గరెట్ says:

  వీరలక్ష్మి గారు ,
  ఈ ఉత్తరం చదువుతున్నంత సేపు , మీరెంత అదృష్టవంతులు అనిపించింది. వెండి వుంగరం తో దృఢంగా వుండే

  మీ చెయ్యి తాకి కాసేపు వీడ్కోలు తీసుకోనా? అని రాసిన చివరి మాటలు చదవగానే ఒక లాంటి నీటిపొర కళ్ళను కమ్మినట్టు ఉంది. నిజమే త్రిపురగారు ఎక్కడికి వెళ్లి ఉండరు. ఇలా మీ జ్ఞాపకాలలో ఎప్పటికి సజీవంగా మీతోనే ..

  మరి ముఖ్యంగా మీ జ్ఞాపకాలను ఇలా మీ లేఖ ద్వారా పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  • v veeralakshmidevi says:

   మెర్సీగారూ మీలా స్పందిచగల వారికోసమే ఏదైనా రాయాలనిపిస్తుంది

 • vadrevu chinaveerabhadrudu says:

  అక్కా, త్రిపుర గారి గురించి నేనూ రాసాను, నువ్వూ రాసావు. కాని ఎంత తేడా. త్రిపురని ఒక సాహిత్యవ్యక్తిగా భావించడం కష్టమంటూనే తెలుగుసాహిత్యంలో త్రిపుర స్థానం ఏమిటీ, ఆయన దర్శనమేమిటీ వగైరా ప్రశ్నల్ని నేను వదిలిపెట్టలేకపోయాను. కాని నువ్వు త్రిపురని ఎలా చూసావో అదే రాసావు. చిన్నప్పణ్ణుంచీ నువ్వొక ఆశ్చర్యం నాకు. 1973లో నువ్వు ఆంధ్రా ఉద్యమం రోజుల్లో సాహసించి మరీ నన్ను చూడాలని తాడికొండ స్కూలుకి వచ్చేసావు. ఆ రాత్రి మా క్లాసు వెనక కబడీ కోర్టులో ఇసికలో కూచుని మాతో కబుర్లు చెప్పావు. మనమీదంతా వెన్నెల. అప్పుడు నా క్లాసుమేట్ జె.వి.ఎస్.డి.పి.రాజు, నాలానే పదేళ్ళ వయసు పిల్లవాడు, ‘ఒరే, మీ అక్క చాలా గొప్పదిరా ‘ అన్నాడు. నాకెంత గర్వంగా అనిపించిందో చెప్పలేను. ఇప్పుడు నువ్వు రాసింది చదివి త్రిపుర గారు కూడా ‘మీ అక్క చాలా గోప్పదయ్యా’ అంటున్నారు.

  • vveeralakshmidevi says:

   జె వి ఎస్ డి పి రాజు కి త్రిపుర గారికి ఆట్టే తేడా లేదనుకుంటాను
   వాళ్ళిద్దరికీ నా కృతజ్ఞతలు

 • చాలా బావుందండి… అదృష్టవంతులు మీరు!

 • నరశింహశర్మ మంత్రాల says:

  శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మి దేవి గారికి, నమస్కారం. ఎక్కడా అతిశయోక్తులు, ఆర్భాటాలు, డాబు,దర్పం ముఖ్యంగా అబద్ధాలు లేకుండా నిశ్శబ్దంగా జాలువారే సుజలస్రవంతిలా, హాయిగా,ఆహ్లాదంగా వ్రాయాలంటే, ముందుగా ఆ గోరువెచ్చని స్పర్శ ప్రశాంతత విస్తరించిన హృదయంలోంచే జనించాలి. మీరు కాగితంపై కలంతో రాసినా మేము కళ్ళతో చూస్తూ హృదయంతో చదువుకున్నాము. నాకు తెలిసిన ఓ రహస్యం చెప్పనా! “ఆత్మవిశ్వాసం” ఎవరైతే నిరంతరం తమ అంతఃకరణతో తమ లౌకిక జీవనాన్నిక్రమబద్ధం చేసుకుంటూ ఉంటారో వారికే జీవితంలోని ప్రతి పార్శం అందంగా,ఆనందంగా ద్యోక్తమౌతుంది. మరుగుపడిన నాలోని ప్రశాంతతను వెలికితీసుకొనే ప్రయత్నంలో శలవతీసుకుంటాను.

  • vveeralakshmidevi says:

   శర్మ గారు
   ఏదైనా గుర్తు పట్టడానికి కూడా అంతరంగం అద్దం లాగానే వుండాలి బహుశా అందుకే అల్లా రాయగలిగారు మీరు .
   ధన్యవాదాలు

 • మంచి రచన

Leave a Reply to vveeralakshmidevi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)