జొరం

Joram

venkatakrishna 

కవి , కథకుడు జి. వెంకట కృష్ణ తొలి కథ “పామును మి౦గిన కప్ప“1994 లో ఆ౦ధ్రప్రభ లో అచ్చయ్యి౦ది . ఇప్పటివరకు వెంకట కృష్ణ 45 కథలు రాసారు.
రె౦డు కథా స౦కలనాలు : గరుడ స్త౦భ౦ (2005 లో) , చిలుకకలు వాలిన చెట్టు (2010) మూడు కవిత్వ సంకలనాలు వచ్చాయి. ఒకటి దీర్ఘ కవిత గా వచ్చింది. వెంకట కృష్ణ పుట్టినదిఅన౦తపుర౦ జిల్లా, వుద్యోగరీత్యా సహకార శాఖలో డిప్యూటి డైరెక్టర్ గా పని చేస్తూ  కర్నూలులో 20 సంవత్సరాలుగా నివాస౦ ఉంటున్నారు. రె౦డు కథా స౦కలానాలకు సహ స౦పాదకత్వ౦ (1) కథా సమయ౦, కర్నూలు 2000 స౦వత్సర౦. (2) హ౦ద్రీ కథలు, కర్నూలు (2003) వహించారు. –వేంపల్లె షరీఫ్

   ***

 

అనిల్ కు కార్టూన్ ఛానెల్  బోర్ కొట్టింది.ఛానెల్  మార్చితే,  స్క్రీన్ మీద తెలుగు అర్ధనగ్నపాటలకు  గెంతులు వేస్తున్న హీరో హీరోయిన్లు. అనిల్ దానికే కళ్లప్పగించాడు. వాడి కళ్ళల్లో మెరుపులు, వాడి తలలో ఏవో దృశ్యాలు. ఆ నృత్యంలోని లయలో, ఆ వూపుల్లో లీలామాత్రంగా వాడు రాత్రుల్లో వినే గుసగుసలూ, శబ్దాలూ పోల్చుకుంటున్నాడు. టీవీ చూస్తున్నాడు కానీ, యింకేదో లోపల జరుగుతుంది. పాటకు అనుగుణంగా శరీరాన్ని కదిలిస్తున్నాడు. అంతలో లోపల్నుంచి హాల్లోకొచ్చి వాడిని గమనించిన వాళ్లమ్మ

“రేయ్! ఏందిరా నువ్ చేస్తుండేది?” అంది

ఉలిక్కిపడి, టీవీ స్క్రీన్ మీద నుంచి కళ్ళు తిప్పి వాళ్ళమ్మను చూసి రిమోట్ తో టీవీని ఆఫ్ చేసి, తమకం పూనిన వాడిలాగా అమ్మను వాటేసుకుని “బోర్ కొడుతుందమ్మా!” అంటూ సరాగాలు పోయాడు. కొడుకును చేతులతో బిగించి ముద్దుపెట్టుకుంటూ . “చదువుకోవచ్చు, బొమ్మలు గీసుకోవచ్చు, బోర్ కొడుతుందంటే ఎట్ల నాన్నా”

“పోమ్మా! ఎప్పుడూ చదూకోమంటావు…” అంటూ గునిసి “ఎందుకమ్మా పాటలు చూడొద్దంటావు?..”

“వాటిని చూస్తే నీకేం అర్ధమవుతుందిరా.. ఆ నడుం తిప్పడంలో నీకేం తెలుస్తుందిరా. అవన్నీ గబ్బు పాటల్రా”

“అయితే టీవీల్లో ఎందుకొస్తున్నాయి?  . నాకేమో చూడాలనిపిస్తుందబ్బా..” అంటూ అమ్మను మరింతగా హత్తుకున్నాడు. “అట్లాంటివి చూడగూడదు. అది సరే  హోమ్ వర్క్ కంప్లీట్ చేసావా..” అంటూ చేతుల పట్టు వదిలేసింది.

వాడు నేల మీదికి జారుతూ, భూమిని తాకిన బంతిలా పైకి లేచి “ఎప్పుడో చేసేసాను…” అంటూ బైటికి వెళ్తున్నాడు.

“రేయ్ ! బయటికొద్దు ” అంది అమ్మ

“నేను ఆడుకునేకి పోతానమ్మా. పక్కింటి అన్నవాళ్లు క్రికెట్ ఆడుతున్నారు ”

“రేయ్ బయటికొద్దు అన్నానా…” అంటూ బయటికొచ్చింది ఆమె.

“రామ్మా పట్టుకుందువు రా చూద్దాం. ” అంటూ పట్టుకునీకి వస్తే తప్పించుకునేందుకు కాచుకున్నాడు.

వాళ్లమ్మ ఒక అడుగు వేస్తే వాడు నలుగడుగులు పరిగెడుతూ స్కేటింగ్ లాగా జారుతాడు.

మొదట రెండుమూడుసార్లు ఆటలాగా అనిపించినా తర్వాత వాళ్లమ్మకు కోపం రావడం మొదలైంది. వాడికేమో ఆటలో మజా ఎక్కువైంది.

అంతలో పక్కింటి ఆంటీ బయటికొచ్చి

“ఏంది కమలా కొడుకుతో కొట్లాటా?…” అంది.

“చూడండి ఆంటీ. వీడు యింతలేడు మాటే వినడు. ఆ జారడం చూడండి. కాళ్లు యిరుగుతాయేమోనని భయమవుతుంది. ఎర్రటి ఎండ, బండలు పేలాలు ఏపుకునేంత కాలిపోతున్నాయి. యీ ఎండల్లో బయట ఆడుకుంటానంటాడు..”

“అవు..  ఎంత ఎండగుంది కమలా.. పిల్లనాయాళ్లు యీ ఎండల్లో తిరిగి జ్వరాలొచ్చి పడతారు. మా సురేష్‌గాడు ఎప్పుడు జారుకున్నాడో సూడు క్రికెట్ బ్యాట్ పట్టుకుని.”

‘టీవీలు చూసి పిల్లలు చెడిపోతున్నారు ఆంటీ. క్రికెట్ ఆటలూ, సినిమా పాటలూ, అబ్బా.. చెడిపేస్తున్నాయి..”

వీళ్లు మాటల్లో పడగానే.. “బై అమ్మా బై బై..” అంటూ వురుకుతున్నాడు అనిల్.

“రేయ్ యిప్పుడు కాదురా సాయంత్రం యింటికొస్తావా. అప్పుడు చెప్తారా నీ కథ… నిన్నూ..” దంచుతానన్నట్లు యాక్షన్ చేసింది వీధిలో కొచ్చి కమల.

వాడు దూరంనుండే బెదిరినట్టు నటిస్తూ…

“నన్ను నలిపేస్తావు గదామ్మా.. రాత్రి నాన్న…” యింకా ఏదో అంటూ యిందాక టీవీలో చూసిన ఒక చేష్టను అభినయించాడు.

కమల బిత్తరపోయింది. “ఏమన్నాడు వాడు. యేదో అన్నాడే. కంత్రీనాయలు. ఎక్కడ వింటాడు యిట్లాంటి మాటలు” అనుకుంటూ సిగ్గుతో కుంచించుకుపోతూ, ఎవరన్నా గమనిస్తున్నారా అని చుట్టూ చూసింది.

పక్కింటి ఆంటి నవ్వుకుంటూ లోనికి పోతోంది.

కొత్తగా కడుతూ ఎందువల్లనో పని నిలిచిపోయిన రెండతస్తుల భవనంలో పిల్లల సందడి. కింద కొందరు క్రికెట్ ఆడుతుంటే పైన కొందరు అల్లరి చేస్తున్నారు. అనిల్ క్రికెట్ వైపు వెళ్తున్నవాడల్లా పైకి చూసాడు. తనతోపాటు స్కూల్ కొచ్చే సునీత రంగురంగు సున్నాలున్న గౌన్లో బలే వుంది. అనిల్ మెట్ల మీదుగా పైకి నడిచాడు. మెదడంతా రంగురంగు సున్నాలు గెంతులు వేస్తున్నాయి. పైన ఐదారు మంది పిల్లలు ఆడుకుంటున్నారు. సునీత దగ్గరకు పోయి నవ్వి ఆ పిల్ల వెనకాలే తిరుగుతున్నాడు. ఆమె కింద పడేసుకుంటున్న ఆటబొమ్మలన్నీ అందిస్తున్నాడు.

ఆ పిల్ల నవ్వుతూ “ఆ యిటుకలతో యిల్లు కడదామా?” అంది. అంతే పక్కనే వున్న యిటుకలను మోసుకొచ్చి గదులు గదులుగా కట్టాడు. హాలు, బెడ్రూం, కిచెన్ ల కోసం చదరాలు చదరాలు పేర్చి ‘బాగుందా’ అన్నాడు. ఆ అమ్మాయి కిలకిలా నవ్వింది. తన బొమ్మలన్నీ ఆ గదుల్లో సర్దింది. ఒక పెద్ద అక్క వచ్చి వీళ్లిద్దరూ ఏం చేస్తున్నారా అని చూసి “యిటుకలతో యిల్లేం బాగాలేదు. యిసుకలో గూడుకడితే బాగుంటుందిరా అనిల్” అంది.

“కదాక్కా.. యిస్క యాడుందక్కా..” సునీత.

“లోపల చూడండి” అని యెవరో పిలిస్తే పరిగెత్తింది.

అనిల్ కు  కూడా అందరి ముందుగా సునీతతో ఆడుకోవడం యిష్టం లేదు. మెల్లిగా ఆ అమ్మాయి చెవిలో “లోపలికి పోయి యిసుక  వెతుకుదామా?” అంటే ఆ పిల్ల తలూపింది. ఇద్దరూ ఒక హాలు దాటి, నడవాకు పక్కనున్న గదిలోకి వెళ్లారు. అది స్టోర్ రూం అయినా పూజగదైనా అయుండొచ్చు. యిరుకుగా వుంది. చీకటిగా వుంది. చల్లగా వుంది. ఏదో వింత చిత్తడి వాసన. యిద్దరూ దాన్ని ఆస్వాదిస్తూ కాస్సేపు నిలబడ్డారు. ఆ తర్వాత భయంతో వెలుగు కన్పిస్తున్న ఎదురుగదిలోకి పరిగెత్తారు. ఆ గది సగానికి యిసుక వుంది. యిద్దరూ ఎగిరి దుమికారు. అనిల్ శ్రద్ధగా గూడు కట్టాడు. కట్టేంతసేపు తదేకంగా చూసిన సునీత గూడు పూర్తి కాగానే, గూడు మీద ఎగిరి దుంకింది. అనిల్ ఒకసారి దీర్ఘంగా ఆమెని చూసి, ఆమె నవ్వును అందుకొని, మళ్లీ గూడు కట్టి ఆమెవైపు చూశాడు. ఒక నవ్వు విసిరి ఎగిరి దుంకింది. అనిల్ మళ్లీ కట్టాడు. ఈసారి ఆ పిల్ల దుమకలేదు. “ఇద్దరూ కలిసి ఒకేసారి దుంకుదాం” అంది.

అనిల్‌కు చాలా సంబరమైంది. చీకటి గదిలో నిల్చున్నప్పటి అనుభూతి వొళ్లంతా పాకింది. ఇద్దరూ ఒకర్నొకరు పట్టుకొని వొకేసారి ఎగిరి జంటగా గూడును కాళ్లతో తొక్కారు. రెండు జతల కాళ్ల అచ్చులు అద్భుతంగా పడ్డాయి. అనిల్ ఆ అచ్చుల పక్కనే మళ్లీ గూడు కట్టాడు. ఇద్దరూ వొకర్నొకరు పట్టుకొని గూడు మీద ఎగిరి దుమికారు. మళ్లీ రెండు జతల కాళ్ల అచ్చులు… అనిల్ మళ్లీ మళ్లీ గూడు కట్టాడు. మళ్లీ మళ్లీ ఆ పిల్ల స్పర్శతో అనిల్ గుండెల్లో రక్తం పొంగులు పెట్టింది. టీవీ స్క్రీన్ మీది పాట లయలా వూపింది. రంగురంగు సున్నాలు తనతోపాటు గెంతులు వేస్తుంటే అద్భుతంగా అన్పించింది. వాళ్ల కాళ్ల అచ్చులతో ఒక వృత్తం ఏర్పడింది. అనిల్‌కు ఆ వృత్తం చుట్టూ ఇంకో వృత్తం పడితే బాగుంటుందనిపించింది.

అంతలో…

“రేయ్.. మీరిద్దరూ యిక్కడున్నారా?.. వాచ్‌మాన్ అరుస్తున్నాడు  పైనుండొద్దని. కిందికి పోదాం రాండి. ఏయ్ సునీ రావే మీ మమ్మీ పిలుస్తాంది..” ఇంతకు ముందొచ్చిన అక్కే సునీతను లాక్కుపోయింది. అనిల్ తలలో చీకటి చీకటి సున్నాలు తిరుగుతున్నాయి. వుసూరుమంటూ మెట్లు దిగాడు. ఎదురుగా సర్రుమంటూ క్రికెట్ బాల్ దూసుకొచ్చింది.

“రేయ్ అనిలూ ఆ బాల్ అందీరా..” కాస్త దూరంనుంచే ఒక అన్న అరుస్తున్నాడు.

“అన్నా నాకూ కొంచెం బ్యాటింగ్ యివ్వవా…?” అంటూ  ఫీల్దింగ్‌లో కలిసిపోయాడు.

Joram

రాత్రి పడుకున్నారు. అనిల్ కళ్ళేమో మూసుకుపోతున్నాయి. నిద్రను ఆపుకుంటూ వొళ్లంతా చెవులు చేసుకొని ఏవేవో గుసగుసల్నీ, గాజుల చప్పుడునూ వినాలని  ప్రయత్నిస్తున్నాడు. అందుకు భిన్నంగా

“యిల్లు మారదామండీ.. పిల్లలకు సెపరేట్ రూమ్ వుండేలాంటిదానికి” అంటోంది అమ్మ.

“పిల్లలు అంటున్నావు.. యిప్పటికి వాడొక్కడే కదా వున్నది. బహువచనానికేమైనా ఏర్పాట్లు చేద్దామా?”

“మీ రెండర్ధాల మాటలూ మీరూ. అవి వినే వీడు యింతలేడు బజార్లో మాట్లాడుతున్నాడు. నాకు తల కొట్టేసినట్ట్లనిపిస్తోంది” నాన్న గట్టిగా నవ్వుతూ, తర్వాత నవ్వు ఆపుకుంటూ .. యేదో అన్నాడు గుసగుసగా.

“నీకు దండం స్వామి. గమ్మున పడుకో. నాకు బాగాలేదుగానీ..”

నాన్న మళ్లీ యేదో అన్నాడు..

“నీ గబ్బు మాటలు వింటూ, ఆ గబ్బు పాటలు, టీవీల్లో చూస్తూ వీడు యెట్లా తయారైతాడొ నీక్కొంచెం కూడా యేమనిపించదా?” అమ్మ గట్టిగా అడిగింది.

అమ్మ మాటలు అనిల్‌కు నిరాశ కలిగించాయి.

“అయినా కమలా చిన్నపిల్లల గ్రహణశక్తి వాడిగా వుంటుంది. యిట్లా టీవీ వొక్కటే కాదు. వీధిలో, స్కూల్లో, స్నేహబంధాల్లో ఎన్నో తెలుస్తాయి వాళ్లకు. వాళ్ల శరీరమొక ఫాక్టరీ. వాళ్ల మెదడొక కంప్యూటర్. ఏవేవో సంకేతాలతో ఏదేదో ఏర్పడుతూ పోతుంది. ఫలానా దానివల్లే ఫలానా విధంగా అయ్యారని నువ్వు నిర్ధారించలేవు. భారతదేశంలో మనలాంటి యిండ్లు సరే, అమెరికాలో, యూరోప్‌లో పుట్టినప్పటినుంచి వేరేగా వుంచే పిల్లల్లో కూడా పువ్వు విచ్చుకున్నంత రహస్యంగా లైంగిక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అయినా తల్లిదండ్రులుగా మన ప్రయత్నాలు మనం చేయాల్సిందే. యీసారెట్లాగూ సాలరీ పెరుగుతుంది. వేరే బెడ్రూమున్న  యింట్లోకి మారుదాం…”

నాన్న మాటలు ఏమీ అర్ధం కాకున్నా అనిల్‌కు మరింత చేదుగా అన్పించాయి. కళ్లు మూసుకుపోతున్నాయి. ఏవేవో దృశ్యాలు పీడకలల్లా దొర్లిపోతున్నాయి. సునీతను ఎవరో లాక్కుపోతున్నట్లూ. మరి ఎప్పటికీ కన్పించనంత దూరం వెళ్లిపోయినట్లూ, లేదు తలుపులు బిగించిన గూడులో వూపిరాడక కూరుకుపోయినట్లు, ఆ గూడు మీద అమ్మానాన్న ఎగిరి దుముకుతున్నట్లూ. తన కళ్లు కట్టేసి, చేతుల్లో బ్యాట్ పెట్టి “రన్ చేయి, రన్ రన్”అంటూ  వెనుకల పడుతున్నట్లూ..

పొద్దునుకి జొరమొచ్చింది అనిల్‌కు. అమ్మా నాన్న మొఖం మీద తొంగి చూస్తుంటే బరువుగా కళ్లు తెరిచాడు. నుదుటిమీదా, ఎద మీదా చేత్తో స్పర్శిస్తుంది అమ్మ.

“వొల్లు కాలిపోతాంది కదండి. డాక్టర్ దగ్గరకు తీసుకుపోదాం” అంటొంది.

“మాటే వినడు. ఎండకూ, గాలికీ పగలంతా తిరుగుతాడు. యింగ జొరం రమ్మంటే రాదా..” గొణుక్కుంటోంది.

మూడు రోజులకి అనిల్ మామూలు స్థితికి వచ్చాడు. ఆ సాయంత్రానికి జ్వరం తెరిపిచ్చింది. మంచం మీదనుండి లేచి బయటికొచ్చాడు. ఇంటి మందు పక్కింటి ఆంటీ, అమ్మ  మల్లెపూలు దండలు అల్లుకుంటున్నారు.

“డాక్టర్ దగ్గరకు పోయినట్లుంటిరి గదా కమలా ఏమన్నారు…?”

“కన్‌ఫర్మ్ అయినట్లే ఆంటీ..”

“ఏరా అనిలూ నీకు చెల్లెలో, తమ్ముడో రాబోతున్నారు. నువ్వేమో జొరంతో పడుకుంటివీ..” నవ్వుతూ అంది పక్కింటి ఆంటీ..

ఏమీ అర్ధం కాకుంటే అమ్మ వైపు చూసాడు అనిల్.

అమ్మ సిగ్గుతో ఆంటీ వైపు చూస్తోంది.

“నాకెవరూ వద్దు. మా అమ్మనే గావాల…” పరుగున వచ్చి కమలను వాటేసుకొని, “అమ్మా, అమ్మా నీ దగ్గరే పడుకుంటా, నాకు వేరే మంచమొద్దు. మీ మధ్యనే పండుకుంటా..”బేలగా అంటున్నాడు.

“యీ మూడు రోజులు నా దగ్గరే పండుకున్నావ్ గద నాన్నా.. పొట్ట మీద పడొద్దమ్మా..” అనునయంగా అంటొంది కమల.

“యింగేం పండుకుంటావు మీ అమ్మ పక్కన. ఆ కాలం అయిపోయిందిరా అనిలూ..”

పక్కింటి ఆంటీ మాటలు వింటుంటే మళ్లీ జ్వరమొచ్చేట్లుంది అనిల్‌కు. కళ్ళలో నీళ్లు తిరుగుతున్న అనిల్‌ని చూసి “తిక్క నా కొడుకు” అని లాలనగా దగ్గరకు తీసుకుంది కమల..

 

కథ: జి. వెంకట కృష్ణ

కథాచిత్రం: మహీ బెజవాడ

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)