పూల బాసలు తెలుసు ఎంకికీ..

ఫోటో: దండమూడి సీతారాం

“బతుకంతా పాటలాగ సాగాలి” అని పాడుకున్నారొక కవి! పాట అంటే కేవలం సంగీతమే కాదు, అందమయిన సాహిత్యం!  ప్రతి పాటకూ ఓ ప్రత్యేకమైన పదనేపథ్యం ఉంటుంది. ఏదో ఒక విషయం పైన  రాయబడిన బోలెడు. నవ్వు, పువ్వు, వెన్నెల, జీవితం.. ఇలానన్నమాట. అలాంటి కొన్ని నేపథ్యాలను ఎన్నుకుని, ప్రతి వ్యాసంలో ఆ నేపథ్యం తాలుకూ పాటలను గుర్తుకు తెచ్చి, వినిపించే ప్రయత్నం చేయబోతోంది “పాట వెంట పయనం…”

 

 

ఫోటో: దండమూడి సీతారాం

ఫోటో: దండమూడి సీతారాం

పువ్వులు“!

సృష్టిలో తియ్యనిది స్నేహమైతే, సృష్టిలోకెల్లా అందమైనవి పువ్వులు అంటే ఒప్పుకోనివారుండరు. నక్షత్రాలు ఆకాశంలో పువ్వులైతే, పువ్వులు భువిపై ఉన్న నక్షత్రాలు కదూ! అసలు పువ్వులు లేని ప్రపంచాన్ని ఊహించగలమా? పువ్వులు లేని ప్రపంచం నవ్వులేని మొహంలా, గడప లేని ఇల్లులా ఉండేదేమో! కరుణశ్రీగారు పుష్పవిలాపాన్ని మాత్రమే చెప్పారు గానీ ఈ పూలకి మాటలు వచ్చి ఉంటే.. మనతో ఎన్నెన్ని కబుర్లు చెప్పి ఉండేవో.. ! ఒక పూల తోటలోంచి వెళ్తుంటే ఆ పువ్వులన్నీ మనతో ఏవేవో కబుర్లు చెప్తున్నట్లే ఉంటుంది. అందుకేనేమో నాయుడు బావ కూడా “పూల బాసలు తెలుసు ఎంకికీ.. తోట పూల మనసులు తెలుసు ఎంకికీ…” అని పాడాడు.

పువ్వులతో నా సాంగత్యం చిన్నప్పటిది. మా చిన్నప్పటి ఇంట్లో వెనుకవైపు పెద్ద పెరడు ఉండేది. అందులో పారిజాతం, రెండు మూడు మల్లె పొదలు, పందిళ్ళపై పాకిన సన్నజాజి, విరజాజి తీగెలు, గులాబీలు, ఇంకా చుట్టూతా ఏవో గడ్డీపువ్వులతో అనేక వర్ణాల్లో ముస్తాబైన  ఆ తోటంతా సాయంత్రమయ్యేసరికీ మనోహరమైన పరిమళాలను ఉండేది. ఇంకా మా వాకిట్లో అమ్మ పెంచిన కనకాంబరాలు, నిత్యమల్లి, బంతిపూలు, మెట్టతామర, రెండు మూడు రంగుల డిసెంబరు పూలు, ముళ్లగోరింటలు కాక మాతో పాటూ పెరిగిన ఓ పెద్ద రేక నందివర్థనం చెట్టూ ఉండేవి. ఇవన్నీ కాక ఊరెళ్తే, మా నాన్నమ్మ పెంచిన తోటలో దేవకాంచనాలు, పదమూడు రకాల రంగురంగుల మందారాలు, ఆకు సంపెంగ, సింహాచలం సంపెంగ, పారిజాతాలు, చామంతులు, నైట్ క్వీన్, సన్నజాజి, రేకమాలతి పూలు.. ఇవన్నీ నాకు స్వాగతం చెప్పేవి. “ఎవరు నేర్పేరమ్మా ఈ కొమ్మకూ.. పూలిమ్మని రెమ్మ రెమ్మకూ..” అని పాడుకుంటూ ఆ పూలచెట్ల మధ్యనే తిరిగేదాన్ని. ఇలా ఈ పూలదీ నాదీ ఏనాటిదో అనుబంధం..! అందుకే నాకనిపిస్తుంది.. పుస్తకాలు నాకు మాట్లాడే స్నేహితులైతే.. పువ్వులు నాతో మౌనంగా సంభాషించే మిత్రులు అని!  అందుకనే ఈ పాట వెంట పయనంలో మొదటగా నాకత్యంత ప్రియమైన పువ్వులపై సినీకవులు రాసిన కొన్ని మధురమైన తెలుగు పాటలను ఇవాళ మీకు గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నా..!

పూల మీద ఎన్నో సినీగీతాలున్నాయి… “ఏ దివిలో విరిసిన పారిజాతమో”(కన్నెవయసు), “ముద్దబంతి పువ్వులో”(మూగమనసులు), “గులాబీలు పూసేవేళ”(భలే అబ్బాయిలు), “మల్లెలు కురిసిన చల్లని వేళలో..”(అడుగుజాడలు),  “సన్నజాజిపూవులు “(అమాయకురాలు),  “నువ్వేనా.. సంపంగి పువ్వున నువ్వేనా”(గుప్పెడుమనసు), “మల్లెలు పూసే వెన్నెల కాసే”(ఇంటింటి రామాయణం), “సిరిమల్లె పువ్వల్లె నవ్వు”(జ్యోతి), “మరుమల్లియ కన్నా తెల్లనిది” (మల్లెపూవు), “సిరిమల్లె నీవే విరిజల్లు కావే”(పంతులమ్మ), “పూసింది పూసింది పున్నాగ..”(సీతారామయ్యగారి మనవరాలు).. చెప్పుకుపోతే ఎన్నో..! పూల సొగసునీ, సోయగాన్నీ, వయ్యారాల్నీ తలుచుకుంటూ మరి నాతో పాటూ మరికొన్ని పూలపాటల్ని వింటూ మీరు కూడా ఆ పరిమళాలను ఆఘ్రాణించండి.

పువ్వులన్నింటిలోనూ మల్లెపూలపై బాగా ఎక్కువ పాటలు రాసారు మన సినీకవులు. అన్నింటిలోనూ ‘మల్లీశ్వరి’ చిత్రంలోని దేవులపల్లి వారి రచన “మనసున మల్లెల..” నాకత్యంత ఇష్టమైన పాట. ఆల్ టైం ఫేవొరేట్ అనచ్చు. ఈ పాటలో సంగీత సరస్వతి భానుమతి గళంతో వెన్నెలలు కాయిస్తుంది. ఎడబాటు లోని విరహాన్నీ, చెలికాని సాన్నిధ్యం లోని అలౌకికానందాన్ని కలగలిపిన ఈ పాటను మీరు చూసేయండి మరి…

http://www.youtube.com/watch?v=CF1v6M6m86U

***

 మల్లెపూలు, గులాబీలూ, సన్నజాజులూ మొదలైన పువ్వులని అమ్ముకునే అమ్మాయి ఓ  పాట పాడుతూ పూలమ్ముతూ ఉంటుంది. పాట బావుంటుంది కానీ కనులు కనబడని ఓ అమ్మాయి పూల అందాలను వర్ణిస్తూ అలా పూలు అమ్ముతుంటే ఎందుకో కళ్ళల్లో నీటిపొర అడ్డుపడకమానదు. “రాజీ నా ప్రాణం” చిత్రంలో “మల్లెపూలు మల్లెపూలు..కావాలా..” అని ఆర్.బాలసరస్వతిదేవి పాడిన పాటని రాసింది కూడా కృష్ణాశాస్త్రి గారే! స్వరపరిచింది ఎస్.హనుమంతరావు. వీరు ఎస్.రాజేశ్వరరావు గారి అన్నగారు.

ఈ పాటను ఇక్కడ చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=7ZxfNYGjEJg

ఈ “మల్లెపూలు మల్లెపూలు..పాటకు ‘La Violetera’ అనే స్పానిష్ ట్యూన్ మాతృక. పాటను తెలుగులో, తమిళంలో కూడా బాల సరస్వతి పాడారు. ఒరిజినల్ స్పానిష్ తో పాటూ తెలుగు, తమిళ భాషల్లో బాల సరస్వతి  పాడిన పాటలను ఒకే విడియోలో క్రింద లింక్ లో వినవచ్చు:

http://www.youtube.com/watch?v=IwEJKZo3q0o

 ***

 

“ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ

గిరిమల్లికలు తప్ప గరికపువ్వులు తప్ప

ఏ కానుకలను అందించగలను చెలీ

గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప

జగతిపై నడయాడు చంచలా మల్లికా తరుణి ఆకృతి దాల్చు

శరదిందు చంద్రికా..శరదిందు చంద్రికా..”

అంటాడో ప్రియుడు..

http://www.raaga.com/player4/?id=192695&mode=100&rand=0.9301893163938075

ఇదే చిత్రం(ఏకవీర)లో చెలి అందాన్ని ప్రశంసిస్తూ, ఆమెను పువ్వులతో, తారలతో పోలుస్తూ.. చెలి కన్నులలో కలువల్లా విరియాలని, చెలి వాల్జెడ సందులలో మల్లియలై తాను విరియాలంటాడు మరొక ప్రేమికుడు..

http://www.youtube.com/watch?v=xOTR-8J9d8I

 

***

 Rajayya 1

 

‘మల్లెకన్న తెల్లన, వెన్నెలంత చల్లన ఏది ఏదని.. ’ అడుగుతాడు ఓ బావ..

‘తేనె కన్నా తీయన, తెలుగంత కమ్మన ఏది ఏదంటుంది’ ఓ మరదలు..

ఈ బావా మరదళ్ళ సరసాన్ని ప్రశ్న- జవాబుల రూపంలో వినడానికి ఎంతో సరదా ఐన పాటగా రూపొందించారు “ఓ సీత కథ” సినిమాకు ‘మహదేవన్’ స్వరపరచగా బాలు, సుశీల గానం చేసారు. ‘సి.నారాయణ రెడ్డి’ రచన.

ఈ గీతాన్ని ఇక్కడ వినవచ్చు:

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4810

 

 ***

 ప్రియుని ఎదలో నిలవాలని, ఇద్దరూ ఒకటిగా కలిసిపోవాలని ఆశ పడుతుంది ప్రియురాలు. అతని సాంగత్యంలో సిగ్గుల మొగ్గై తాను కరిగిపోవాలని ఏవేవో కలలు కంటుంది. అలా కలల ఊయలలో, ఊహల్లో ఉయ్యాలలూగుతూ ఓ ప్రియురాలు పాడుకునే పాట ఇది..

వెన్నెలలో మల్లియలు

మల్లెలలో ఘుమఘుమలు

ఘుమఘుమలో గుసగుసలు

ఏవేవో కోరికలు ఏవేవో కోరికలు..

“మనుషులు-మమతలు” చిత్రంలోని ఈ పాటకు టి. చలపతిరావు సంగీతాన్ని అందించగా, సుశీలమ్మ కమ్మగా పాడారు.

http://www.youtube.com/watch?v=ieRLv2u7rUg

 

***

 అందమైన పడుచుపిల్ల ముద్దబంతి పూలు పెట్టుకుని వయ్యారాలు పోతూ నడుస్తూంటే కొంటె పిల్లాడు ఊరుకుంటాడా?

ఇలా పాడడూ..

http://www.youtube.com/watch?v=dP3eONVT–g

 

***

 ఎన్నాళ్ళ నుండో తాను ఎదురుచూస్తున్న ప్రేమాభిమానాలను తనకు ప్రియమైన అబ్బాయి కళ్ళల్లో హఠాత్తుగా చూసిన ఓ అమ్మాయి ఆశ్చర్యపోతుంది. చెల్లెల్లి పెళ్ళి అయిపోగానే ఇక తన పెళ్ళేనని సంబరపడుతూ చెప్తాడా అబ్బాయి. తన కలవరపాటుకి చామంతి పువ్వు సాయం చేసుకుని ఆ అమ్మాయి పాడే పాటే “ఆత్మీయులు” చిత్రంలో ‘నారాయణరెడ్డి’ రచించిన “ఓ చామంతీ ఏమిటే ఈ వింత..” గీతం. ‘రాజేశ్వరరావు’ గారి స్వరాలతో ముస్తాబైన ఈ పాట ఇక్కడ వినవచ్చు:

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1659

 

 ***

 “చింత పువ్వు ఎరుపు… చిలక ముక్కు ఎరుపు

చేయి చేయి కలుపు లేత వలపు తెలుపు.. రాణీ..” అంటాడు అబ్బాయి

“మల్లె మొగ్గ తెలుపు మంచి మనసు తెలుపు

చేయీ చేయీ కలుపు నిండు వలపు తెలుపు.. రాజా…” అంటుంది అమ్మాయి,

“ఇంటి గౌరవం” చిత్రంలో అలా చింతపువ్వునీ, మల్లె మొగ్గనీ తలుచుకుంటారు మరో ప్రేమికుల జంట. ఈ ‘ఆరుద్ర’ రచనని ఇక్కడ వినవచ్చు:

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2353

 

***

 ప్రేయసిని గులాబీపువుతో పోల్చుతూ, స్త్రీలు గులాబీలంత నాజూకు వారనీ; తుమ్మెదలా దగ్గరకు వచ్చే మగవారిని నమ్మరాదని, మగవారి నైజాన్ని గుర్తించి మలగాలని అన్యాపదేశంగా పాడే పాట ఇది. గాయకుడు అవ్యక్తంగా తన ప్రేమను కూడా తెలుపుతున్నట్లుండే “ఓహో గులాబి బాలా అందాల ప్రేమ మాలా..” పి.బి.శ్రీనివాస్ హిట్ సాంగ్స్ లో ఒకటి. “మంచిమనిషి” చిత్రంలోని ఈ పాట ఇక్కడ చూడచ్చు …

http://www.youtube.com/watch?v=X0yrSorugWo

 

***

 bhanumathi_03

ప్రేయసి ప్రియులతోనే కాదు వసివాడని పూలను వసివాడని పసిహృదయాలతో కూడా పోల్చారు సినీకవులు. కల్లాకపటం ఎరుగని పిల్లలను దేవుడితో పోలుస్తూ పిలలూ దేవుడూ చల్లనివారన్నారు ఒక కవి. పకపక నవ్వుతూ ఇల్లంతా తిరుగుతూ, ఇల్లు పికి పందిరేసేలా అల్లరి చేస్తూ పరుగులెట్టే పిల్లలవల్లనే ఇంటికి అందం. అలా సందడిగా తిరిగే పిల్లలను “సన్నజాజితీవెలోయ్ సంపంగి పువ్వులోయ్..”  అంటూ అందమైన పువ్వులతో పోల్చారు ‘మల్లాది’.  ‘పెండ్యాల నాగేశ్వర రావు’ స్వరపరిచిన “అనురాగం” చిత్రం లోని ఈ సరదా పాట భానుమతి గళంలో ఇక్కడ వినవచ్చు:

http://www.raaga.com/player4/?id=191897&mode=100&rand=0.05453325994312763

 

 

***

“చిన్నారి పొన్నారి పువ్వు.. విరబూసి విరబూసి నవ్వు

మన ఇంటి పొదరింటి పువ్వు.. నిను జూసి ననుజూసి నవ్వు”

 

అంటూ తమ ముంగిట అడుగుబెట్టబోయే నూతన అతిథి గురించిన ఈ పాట “నాదీ ఆడజన్మే” చిత్రంలోది. ‘దాశరథి’ రచనలో ‘ఆర్.సుదర్శనం’ స్వరపరిచిన ఈ గీతాన్ని ఇక్కడ వినవచ్చు:

http://www.raaga.com/player4/?id=193567&mode=100&rand=0.23990890616551042

 

***

 “సిన్నారి నవ్వు.. సిట్టి తామర పువ్వు..

సెరువంత సీకటినీ సుక్కంత ఎలుగు

సుక్కంత ఎలుగేమో సూరీడు కావాల

సిన్నారి సిరునవ్వు బతుకంత పండాలా..”

అని ‘ఇంద్రగంటి శ్రీకాంత శర్మ’గారొక పాట రాసారు “కృష్ణావతారం” సినిమా కోసం. ఈ పాట కూడా నాకు చాలా ఇష్టం. ‘కె.వి.మహాదేవన్’ సంగీతాన్ని అందించగా, బాలు, శైలు ఈ పాటను అద్భుతంగా పాడారు. మెల్లగా, చల్లని తెమ్మెరలా ఉండే ఈ పాట మళ్ళీ మళ్ళీ పెట్టుకుని ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనేలా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి. ఈ పాటను ఇక్కడ వినవచ్చు:

http://www.raaga.com/player4/?id=193134&mode=100&rand=0.27093348116613925

 

 ***

 మరోసారి మరో నేపథ్యంతో, మరికొన్ని మధురగీతాలతో కలుద్దామే మరి…

 

–  తృష్ణ

 

 

 

 

 

Download PDF

15 Comments

  • లలిత says:

    పూలపల్లకిలో కోకిలమ్మ ఊరేగుతూ వచ్చినట్టూ భలే ఎంట్రీ ఇచ్చారు తృష్ణ గారు
    “రండి రండి రండీ దయచేయండీ … తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ ” :)

  • indira says:

    అద్భుతం తృష్ణా!!!చెయ్యి పట్టుకుని నా వెంట రా అంటూ పాటలవనమనే అద్భుత ప్రపంచానికి తీసుకెళ్ళారు.ముఖ్యంగా బాలసరస్వతిగారి మల్లెపూలు,మొల్లపూలు రాజీ నాప్రాణం అనే సినిమాలోది నాకు అత్యంత ఇష్టమైన పాట..చార్లీ చాప్లిన్ సిటీ లైట్స్ ఆధారంగా తీసిందని విన్నాను.మీ కొత్త ఫీచర్ చాలాబాగున్నది. విష్ యు అల్ ది వేరి బెస్ట్.

  • పూల పాటల ఎంపిక బాగుంది, వాటికి తగిన వ్యాఖ్యానాలు కూడా అందమైన కవితల్లా వున్నాయి.
    అభినందనలు.

  • దమయంతి గారూ,
    వ్యాసం, పాటలూ నచ్చినందుకు ధన్యవాదాలు.

  • shaik says:

    పులా వనంలో పాల పిట్టనై ఎగిరిన అనుభూతి
    – తృష్ణ గారికి దోసిళ్ళ నిండుగా పూలతో మనసు నిండుగా థాంక్స్.

  • Mohita says:

    మెయిల్ బాక్స్ లోపూల జల్లు కురిపించారు. చాల థాంక్స్! రాజి
    నా ప్రాణం అనే పాట మొదటి సారి చూసాను మీరు పంపిన లంకె లో!

  • సుధ says:

    తృష్ణగారు, దోసిట సిరి సిరి మల్లెలతో వాకిట నిలిచిన తలపులతో స్వాగతమన్నది నా హృధయం….మీ పాటల తోటలోకి మాకు మేమే చెప్పుకుంటున్నాం…స్వాగతం.

  • ayyagari bhujanga rao says:

    తృష్ణ గారు

    పయనాన్ని పూల తోట మీదుగా ప్రారంభించడం అద్భుతం……పూల పాటలతో మది పరవశించింది….ముందు ముందు మరిన్ని ఆహ్లాదకర గీతాలు మీ నుండి ఆసిస్తూ ….
    నెనరులు.

  • SARMA says:

    మీకు తృష్ణ కన్నా కృష్ణ అని పేరు పెట్టుకోండి.. కృష్ణ కి వ్యతిరేక పదం తృష్ణ … ఇక మీ నమ కారణం కృష్ణ

Leave a Reply to తృష్ణ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)