మా వంగూరి హౌస్ – మా మామిడి చెట్టూ…

నేను పుట్టిన ఇల్లూ- మమ్మల్ని చూసుకున్న సూన్నారాయణా

 

chitten rajuమా తాత గారు తన స్వార్జితంతో మొదటి ఆస్తిగా ఫిబ్రవరి  2, 1921 లో కాకినాడలో అప్పడు రామారావు పేట అని పిలవబడే ప్రాంతంలో (పిఠాపురం రాజా వారి పేరిట) ఒక్కొక్కటీ 1800  గజాలు ఉండే పక్క పక్కనే ఉండే రెండు ఇళ్ళ స్థలాలు – వెరసి 3600  గజాల స్థలం కొన్నారు. అప్పటి నుంచి, ఇప్పటి దాకా ఆ స్థలం మా అధీనంలోనే ఉంది. కాకినాడ మొత్తం మీద సుమారు తొంభై సంవత్సరాలకి పైగా ఒకే కుటుంబం అధీనంలో ఉన్న అతి కొద్ది గృహాలలో మాది ఒకటి అని నేను అప్పుడప్పుడు గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను.

మా తాత గారు ఆ స్థలం కొన్నాక అక్కడ ఒక పెద్ద మేడ కట్టుకోడానికి ప్రణాళిక వేసుకుంటూ ఉండగా  1923 లో 38 వ కాంగ్రెస్ మహా సభలు జరిగాయి. ఆ మహా సభల ఆహ్వాన సంఘం కార్యదర్శి, స్వాతంత్ర్య సమార యోధుడు, మా తాత గారి తోటి లాయర్ అయిన మహర్షి బులుసు సాంబ మూర్తి (పొట్టి శ్రీ రాములు గారు మద్రాసు లో ఆయన ఇంట్లోనే నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారు.—పాపం.) గారి అభ్యర్ధన మీద మా ఇంటి స్థలం అంతా పెద్ద పందిళ్ళు వేసి ఆ కాంగ్రెస్ సభలకి భోజన శాలగా మార్చారు. అక్కడికి వంద గజాల దూరం లోనే ప్రధాన వేదిక. ఆ వేదిక మీద నుంచి మహాత్మా గాంధీ గారు డిశంబర్ 24, 1923 నాడు ప్రసంగించారు.  . ఆ మహా సభల తరవాత ఆ పేట  పేరు గాంధీ నగరం గా మార్చారు. ఇప్పటికీ అది గాంధీ నగరమే! ఆ కాంగ్రెస్ సభలలోనే  జవాహర్లాల్ నెహ్రూ అనే 35 సంవత్సరాల యువకుడు మొదటి సారిగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గా ఎన్నిక అయ్యాడు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన మహమ్మద్ ఆలీ పేరే ఇప్పటికీ మా రోడ్డు పేరు. మా రోడ్డు పేరు “వంగూరి వారి వీధి” అని మారుస్తామని మ్యునిసిపాలిటీ వారు కొన్ని సార్లు అడిగినా ఒక అలనాటి ముస్లిం నాయకుడి పేరు తీసేసి మా పేరు పెట్టడం సమంజసం అనిపించక మేమే వద్దన్నాం.  అతిశయోక్తి అయినా ఇప్పటి మా ఇంటి ప్రాంగణం అప్పటి భోజన ప్రాంగణం కాబట్టి గాంధీ గారు, నెహ్రూ గారు మా “ఇంటి” కి భోజనానికి వచ్చారు అని నేను చెప్పుకోవడం నాకు సరదా.

ఇక్కడ నేను విన్న ఒక చిన్న పిట్ట కథ ఏమిటంటే ఆ ప్రధాన ప్రాంగణం లోపలికి వెళ్ళడానికి సరి అయిన బేడ్జ్ పెట్టుకోవాలి. నెహ్రూ గారు అది మర్చి పోయి హడావుడి గా లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు 13 ఏళ్ల వాలంటీర్ గా ఉన్న దుర్గాబాయమ్మ గారు ఆయన్ని అడ్డగించి ఆయన ఎంత చెప్పినా, ఆఖరికి సాంబ మూర్తి గారు స్వయంగా వచ్చి చెప్పేదాకా లోపలికికి వెళ్ళనియ్యకుండా అడ్డుకున్నారట.  ఆ విధంగా వారిద్దరికీ పరిచయం అయి జీవిత కాలం నిలిచింది.

నెహ్రూ గారి మంత్రివర్గంలో దుర్గాబాయమ్మ గారి భర్త దేశ్ ముఖ్ గారు ఆర్ధిక మంత్రిగా పని చేశారు. వారు జీవించినంత కాలం మా బావ గారు నండూరి వెంకట సూర్య నారాయణ మూర్తి గారు (హై కోర్ట్ సీనియర్ అడ్వోకేట్)  ఎంతో ఆత్మీయులుగా ఉండి,  లీగల్ సలహా దారుగా వ్యవహరించే వారు. అన్నట్టు, మా అక్కా, బావ గారూ ఉండేది హైదరాబాద్ లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ కాలనీ లోనే!

నేను పుట్టిన ఇల్లూ- మమ్మల్ని చూసుకున్న సూన్నారాయణా

నేను పుట్టిన ఇల్లూ- మమ్మల్ని చూసుకున్న సూన్నారాయణా

 

ఆ కాంగ్రెస్ మహా సభల హడావుడి అంతా అయ్యాక మా తాత గారు మేడ కట్టడం ఆలస్యం అవుతోంది అనుకుని 1925 లో స్థలానికి ఆగ్నేయం మూల ఐదు గదులతో తాత్కాలింగా ఒక ఔట్ హౌస్ కట్టి, గృహ ప్రవేశం చేసారు. అది ఏ ముహూర్తాన చేసారో కానీ ఆ ఇల్లే మూడు తరాలకీ సొంత ఇల్లు అయిపోయింది.  అంత పెద్ద స్థలంలో పెద్ద మేడ కట్టుకుందామనుకున్న మా తాత గారి ఆశ నెరవేర లేదు. ఆయన పోయిన ఏడాది తరువాత 1952 లో మా పెద్దన్నయ్య ఆ మేడ నమూనా ని అగ్గిపెట్టెలతో తయారు చేసి ప్రతీ బొమ్మల కొలువు లోనూ పెట్టేవాడు. ఆ మేడ నమూనా ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను.  నాకు పదిహేనేళ్ళు వచ్చే దాకా కూడా పకడ్బందీగా కొండ రాళ్లతో వేసిన  ఆ మేడ పునాదులు స్థలం మధ్యలో ఉండేవి. మా నాన్న గారు కూడా ఆ మేడ ఇక కట్టలేం అని నిర్ణయించుకుని ఆ పునాదులు తీసేయించి ,  మొత్తం 3600 గజాల స్థలాన్నీ పూల మొక్కలతో, చెట్లతో నందన వనంగా మార్చారు.

1925  లో మా తాత గారూ, బామ్మ గారూ గృహ ప్రవేశం చేసిన కొన్ని రోజులలో ఒక విచిత్రం జరిగింది. ఒక మండు వేసవి నాటి మధ్యాహ్నం ఒక ముసలాయన లోపలి వచ్చి “అమ్మా, దాహంగా ఉంది. కాస్త మంచి నీళ్ళు ఇప్పించండి” అని అడిగాడు. మా బామ్మ గారు ఆయన్ని చూడగానే “అయ్యో పాపం ఈయన భోజం కూడా చెయ్య లేదేమో” అని అడిగి అరిటాకు వేసి కడుపు నిండా భోజనం పెట్టారు. ఆయన సంతృప్తిగా భోజనం చేసి, కాస్సేపు విశ్రమించి లేచి వెళ్తూ తన చేతి సంచీ లోంచి ఒక్కటంటే ఒక్క మామిడి పండు తీసి “అమ్మా, ఈ పండు తిని, ఆ టెంక ఎక్కడైనా పాతండి. అది చెట్టుగా ఎదిగి, దాని పళ్ళు మీ మనవలు, ముని మనవలూ కూడా తింటారు” అని మనసారా ఆశీర్వదించి, ఆ మామిడ పండు ఆవిడ చేతిలో పెట్టి మాయమై పోయారు. అంటే మళ్ళీ ఎప్పుడూ కనపడ లేదు.

మా తాత గారు, బామ్మ గార్లలో ఆ పండు ఎవరు తిన్నారో లేక అప్పటికి చిన్న పిల్లలయిన మా నాన్న గారు, ముగ్గురు మేనత్తలలో ఎవరు ఆ పండు ముక్కలు ఉప్పు, కారం వేసుకుని తినేసి ఆ టెంక ఇంటి ముందు విసిరేసారో తెలియదు కానీ….అ బంగిన పల్లి మామిడి టెంక వేళ్ళూనుకుని, చెట్టుగా ఎదిగి ఇప్పటికీ గత 88 సంవత్సరాలగా అద్భుతమైన పళ్ళు కాస్తూ, వంద మంది పైగా ఉన్న మా బృహత్ కుటుంబం అస్తిత్వానికి నీడ పడుతూ వయోభారంతో కుంగినా గంభీరంగా, దర్జాగా, నిరంతరం కూసే మూడు తరాల కోయిల వంశానికి పట్టుగొమ్మగా నిలుస్తూ, ఇది వ్రాస్తున్నప్పుడు నాకు కన్నీళ్లు తెప్పిస్తోంది.

ఆ మామిడి చెట్టు కిందే నా ఇరవై ఏళ్ల చిన్న తనం అంతా గడిచింది. నాదే ఏమిటి, మా అన్నదమ్ములు, అప్ప చెల్లెళ్ళు, మా ఇంట్లో ఉండి చదువుకున్న నాలుగు తరాల బంధువులు అందరికీ ఆ మామిడి చెట్టే ఆయువు పట్టు. కేరమ్స్, చెస్,  పేకాట ఏ ఆట, ఆడుకున్నా ఆ చెట్టు నీడనే. రాత్రి టీ తాగుతూ గుడి దీపాల వెలుగులో పరీక్షలకి చదువుకున్నా ఆ చెట్టు కిందే! అది చిన్న చిన్న పిందెలు వేసి ఆ మాత్రం బరువుకే కిందకి వాలగానే కుర్చీ పీట వేసుకుని పెన్నుతో ఆ పిందెల మీద మా పేర్లు రాసేసుకుని , అవి పెద్దయ్యే దాకా రోజూ, కొలుచుకుంటూ అంటే ఆరాధించడమే కాదు, ఎవరి పిందె ఎంత పెరిగిందీ అని సైజు కూడా కొలుచుకుంటూ, మొత్తం వేసవి శలవులకి మరే వ్యాపకాలు పెట్టుకోకుండా ఉన్నా అదంతా  ఆ చెట్టు మహిమే! ఆ చెట్టు కొమ్మలోంచి తెల్లవారు ఘాము నుంచీ మధ్యాహ్నం దాకా ఎడతెరిపి లేకుండా వినపడే కోకిలారావానికి మేము తిరిగి “కోయ్, కుహూ” అని అరవ గానే ఆ కోకిల రెచ్చి పోయి యింకా గట్టిగా సమాధానంగా చెప్పడం, “ఏమిట్రా ఈ వెధవ కాకి గోల”  అని మా పెద్ద వాళ్ళు కోప్పడడం ఎంత హాయిగా ఉండేదో! ఆ చెట్టు కిందే నా మొట్ట మొదటి ఇంగ్లీషు నవల (పెర్రీ మేసన్) చదివాను. చేతికందిన ప్రతీ వార, దిన పత్రికలూ పెద్ద వాళ్ళు కోప్పడుతున్నా డిటెక్టివ్  నవలలూ అక్కడే చదివాను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను సాహిత్యంలో సేద తీరింది ఆమామిడి చెట్టు నీడ లోనే!

మా తాత గారూ, మా నాన్న గారూ కట్టుకుమ్దామనుకునా మేడ నమునా

మా తాత గారూ, మా నాన్న గారూ కట్టుకుమ్దామనుకునా మేడ నమునా

సుమారు ముఫై ఏళ్ల క్రితం కాకినాడ లో వచ్చిన పెను తుఫానులో మా మామిడి చెట్టు మా ఇంటి మీద పడి కూల్చి పారెయ్యకుండా, నిట్ట నులువుగా గంభీరంగా ఉండేదల్లా, సొగసుగా మరొక పక్కకి వాలి మా మీద యింకా ఎంతో దయ, ప్రేమ కురిపిస్తూనే ఉంది. రెండు, మూడేళ్ళ కొకసారి కాయలు కాస్తూనే ఉంది. నేను కాకినాడ వెళ్ళినప్పుడల్లా ఆ మూడో తరం కోకిలారావం రోజుకి ఐదారు గంటలు వింటూనే ఉంటాను. నన్నూ, నా చాదస్తాన్నీ చూసి మా వాళ్ళు అందరూ చాటుగా నవ్వుకుంటూ ఉంటూనే ఉంటారు. అందుకే అంటారు ఎవరి పిచ్చి వారికి ఆనందం అని.

మా చిన్నన్నయ్యకి పెళ్ళయి ఐదుగురు పిల్లలు పుట్టాక, ఇల్లు చాలక అప్పటికి వేరే ఇల్లు కట్టుకున్నాడు. దానికి అమెరికా లో ఉన్న మా తమ్ముడూ, నేనూ ప్రత్యక్షంగానూ, పరోక్షం గానూ చేసిన సహాయం గురించి తెలిసిన మిత్రులు, కాకినాడ బార్ రూమ్ (కోర్ట్ ప్రాంగణంలో లాయర్ల విశ్రాంతి గది) సహాధ్యాయులు దాన్ని డాలర్ హౌస్ అని వేళాకోళం చేసే వారు. ఆ తరవాత నా పై వాడు సుబ్బన్నయ్య మణిపాల్ లో ఎం.. బీ. బీ. యస్ తరువాత  ప్రతిష్టాత్మకమైన పాండిచ్చేరి జిప్మెర్ లో మాస్టర్ ఆఫ్ సర్జరీ చేసి కాకినాడ రంగరాయ  మెడికల్ కాలేజీ లో ప్రొఫెసర్ గా చేరి, ఇంటి తో బాటు అతని భార్య (మా వదిన ) డా. శేషమాంబ గారి కోసం గైనకాలజీ క్లినిక్ కూడా కట్టుకున్నాడు. సుమారు పదేళ్ళ క్రితం 80 ఏళ్ల ‘వయస్సు” వచ్చి మా పెద్దన్నయ్య ఉంటున్న మా ఇంటికి చిన్నా, పెద్దా రిపేర్లు రావడం మొదలుపెట్టాయి. అప్పుడు మా తమ్ముడు  (వాడు యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా, బెర్క్ లీ లో మాస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ చెయ్యడానికి 1970 లో అమెరికా వచ్చాడు) వాడి వాటా స్థలంలో మేడ కట్టుకున్నాడు.

ఆ తరువాత బాగా పాత పడిపోయి అవసాన దశలో ఉన్న మా ఇంటిని మనసు దిటవు చేసుకుని, నిర్దాక్షిణ్యంగా నేల కూల్చి చదును చేసేశాం. మా ఇల్లు పడగొట్టి ‘స్మశానానికి’ తరలించడానికి వారం ముందు తీసిన ఫోటో ఇందుతో జత పరుస్తున్నాను. ఆ ముందు నుల్చుని ఆ ఇంటికి ‘ఆఖరి చూపులు’ చూడడానికి వచ్చిన వాడు తన పదో ఏట మా ఇంట్లో పని వాడి గా ప్రవేశించి, అరవై ఏళ్ళకి పైగా మాతోనే ఉండి, మమ్మల్ని ఎత్తుకుని మోసిన ‘సూన్నారాయణ’.  వాడి ఎడం పక్కన ఉన్న రెండు కిటికీల గది  మా ఇంట్లో శాశ్వతంగా ఉన్న “పురిటి గది”. ఆ గదిలోనే నేను పుట్టాను. మొక్కై వంగక పోయినా, తుఫాను ధాటికి మానై వంగిపోయిన మా మామిడి చెట్టు ఇంకా ఇంటి ముందు గంభీరంగానే ఉంది.  అదృష్టమో, దురదృష్టమో చెప్ప లేను కానీ నేను ఆ ఇంటి ఆఖరి చూపులకి నోచు కోలేదు. ఆ మాట కొస్తే 1983 లో మా నాన్న గారు పోయినప్పుడు కానీ, 1999 లో మా అమ్మ పోయినప్పుడూ నేను వారి ఆఖరి చూపులకి నోచుకో లేదు. అది నాకు “అమెరికా వలస” ప్రసాదించిన విమోచన లేని శాపం.

మా ఇంటి సంగతులు ఇంకా చాలా ఉన్నాయి…

Download PDF

10 Comments

  • suvarchala says:

    ఆ ఇల్లు..ఆ మామిడి చెట్టు ఫలాలు పుష్కలంగా అందుకొని ఆనందించిన భాగ్యశీలులు మీరు! మీ ఇంటి జీవనచిత్రన్ని ..మీవాళ్లని మీ కబుర్ల ద్వారా చూసినట్లనిపించింది.

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      ఈ నెలలో పదిహేను రోజులు వర్షాలలో తడుస్తున్న ఆ మామిడి చెట్టునే చూస్తూ, మా క్తుమ సభ్యులం అమ్దరమూ మా పెద్దన్నయ్య సంవత్సరీకాలు జరిపించి హ్యూస్టన్ తిరిగి వచ్చ్చాను. మీ స్పందనకి ధన్యవాదాలు.

  • kameswari yaddanapudi says:

    చిట్టెన్ రాజుగారు !

    నమస్కారం. పాత సంగతులను ఆప్యాయంగా తలచుకోవటం కూడా గొప్పవిషయమే. మనకు మనమే, మనజీవితమే గొప్ప అవుతున్న ఈ రోజుల్లో పాత ఇంటిని, పనిచేసిన వ్యక్తిని ఆప్యాయంగా తలచుకోవటం, కృతజ్ఞతతో చెట్టునే కాదు, పెద్దలను, తలచుకోవటం ఈ రోజుల్లో అరుదై పోతున్న సుగుణం. అభినందనలు.

    కామేశ్వరి

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      మీ స్పందనకి ధన్యవాదాలు కామేశ్వరి గారూ

  • K.Geeta says:

    మీ ఇంటి కథ చదువుతూంటే నా చిన్ననాటి మేం అద్దెకున్న కుప్పయ్య గారి మేడ, మా అమ్మ గారిల్లు జ్ఞాపకానికి వచ్చాయి.
    (ఇప్పుడు రెండూ లేవు అక్కడ). ఎక్కడి నించి ఎక్కడికి ప్రయాణం చేసినా మనసు చిన్నప్పటి ఇంట్లోనే అతుక్కుపోయి ఉంటుంది కదండి! నాకిప్పటికీ నా జ్ఞాపకాల్లోని ఆ ఇళ్ళకి నమూనా లు తయారు చెయ్యాలని ఉంటుంది. అయితే అగ్గిపెట్టెల్లేవీ అమెరికాలో. ఆన్ లైను లో ఎలాగో మీకు తెలిస్తే చెబ్దురూ! నేను మీ రచనలకు పేద్ద “పంఖా” ని.
    -కె.గీత

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      చిన్నప్పటి ఇల్లూ, ఆ వాతావరణమూ కలకాలం గుర్తుపెట్టుకుని నెమరు వేసుకోవడం ఎవరికైనా అతుక్కుపోయే ఉంటుంది. కొంత మందికి అది వ్రాసే అదృష్టం ఉంటుంది..అంతే..

      అమెరికాలో అగ్గిపెట్టెలు లేకపోవడం ఏమిటీ…చిన్నా, పెద్దా సైజుల్లో కూడా దొరుకుతాయి. కానీ వాటితో ఇల్లు కట్టుకోడానికి టైం మటుకు ఉండదు.

  • geetika says:

    ప్రతి మాటలోనూ బోలెడన్ని అనుభూతుల్ని నింపి, మమ్మల్నీ మధురమైన మీ జీవితానుభవాలలోకి తీసుకెళ్ళిపోయారు.
    మీ రచనల్లో చాలావరకూ హ్యాస్యానికి ప్రాధాన్యతనే చూశాను నేను. ఇది చదువుతుంటే ఒక కుటుంబ కధలోని సంఘటనలు కళ్ళముందు కదులుతున్నట్టుగ అనిపించింది.

    ఉద్విగ్నంగా చదువుతున్న నాకు.. చివరి పేరాలోని వాక్యాలు…

    || అదృష్టమో, దురదృష్టమో చెప్ప లేను కానీ నేను ఆ ఇంటి ఆఖరి చూపులకి నోచు కోలేదు. ఆ మాట కొస్తే 1983 లో మా నాన్న గారు పోయినప్పుడు కానీ, 1999 లో మా అమ్మ పోయినప్పుడూ నేను వారి ఆఖరి చూపులకి నోచుకో లేదు. అది నాకు “అమెరికా వలస” ప్రసాదించిన విమోచన లేని శాపం. ||

    … చదువుతుంటే నాకు తెలీకుండానే నా కళ్ళలో చెమ్మ చేరింది.
    మీరు మరిన్ని భావాల్ని మాతో పంచుకోవాలని ఆశిస్తున్నాను.

    గీతిక B

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      నా అనుభూతుల్ని మీ అనుభూతులుగా తీసుకున్నందుకు ధన్యవాదాలు.

  • బివి లక్ష్మీ నారాయణ says:

    ఎలాగైనా ఒకసారి అక్కడకొచ్చి ఆ అద్భుతంగా అల్లుకున్న మమతల పొదరింటిని దర్శించాలని ఎంతో ఆశపడ్డానండీ..ప్చ్..చివరకు నిరాశే మిగిల్చారు..నిజం- అద్భుమైన అనుభూతులు మీ స్వంతమైనందుకు -ఇప్పుడు కోల్పోయినందుకు విచారంతో కూడిన శుభాకాంక్షలు

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      తప్పకుండానూ …ఎటొచ్చీ మా పాత ఇల్లు లేదు. కానీ ఆ స్థలమూ, మా అన్నయ్యలు, మా తమ్ముడు కట్టుకున్న ఇళ్ళు , మామిడి చెట్టూ తప్పకుండా చూడవచ్చును.

Leave a Reply to వంగూరి చిట్టెన్ రాజు Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)