(గత వారం తరువాయి)
నిర్భయ మరణంతో చలించి ఒకేసారి ‘గుడ్‌బై ఇండియా’ వీడ్కోలు నిర్వేదం. ఈ దేశంలో స్త్రీలపై జరిగే దాడులనీ, వేదనలనీ, రోదనలనీ సాహిత్య రూపంగానో లేకపోతే మంచి కళాకారుడి చేతిలో బొమ్మగా మారటం అంత తేలిక కాదు. ఘర్షణలన్నీ గొప్ప కథలుగా కొంతలో కొంత మలచగలుగుతున్నారు. అంటే ఇక్కడ కథలే గొప్ప అని కాదు. అవన్నీ కవిత్వంగా మలచటం అదీ ఒక పరిపక్వమయిన కవిత్వంగా మలచటం లేదా సాహిత్యంగా మారటం చాలా తక్కువగానే జరుగుతుంది. నిర్భయపై చూడండి..
‘నువ్వు బతికొస్తే ఒక్క తల్లి కొడుకయినా
మానవ పునరుజ్జీవన మహోత్సవ పెళ్లి
పీటల వయిపు నీతో నడుస్తాడా
అమ్మల ఆదర్శ స్వరాల హార్మోనియం వినిపిస్తుందా?”
నిజంగా నిర్భయ బతికి ఉంటే ఈ మొదటి లైన్లకి పులకించిపోయేదేమో. పునరుజ్జీవన మహోత్సవ పెళ్లి .. ఎంత అద్భుతమయిన ఊహాదృశ్యం. ఎంతో పొంగిపోయే లోపల కఠోర, కర్కశ నిజాన్ని , సత్యాన్ని పీటలపయిన నడిచే మగపురుగులు ఉండరా? అమ్మల ఆదర్శ స్వరాలు వినిపిస్తయా?. అని బాధితురాలు తరఫున మన మనస్సులోకి దూరి, నిలేసి మేకులు దిగ్గొడతారు. నిజంగా జాతి సిగ్గుతో ముడుచుకుపోవలసిన క్షణాలు.
ఆదివారం సెలవురోజంత అందంగా చెబుతా. మళ్లీ వచ్చే సోమవారాన్ని కళ్లలో కారం కొడతాడు. బతుకు పందెంలో ఉరుకు పరుగులు, చింతలు – వంతలు, వంకరలు, తిరకాసులు, ఎంచక్కా నాయితే సెలవొచ్చింది. మా పిల్లలకి టీవీలో సినిమా ఒచ్చింది. మా అవిడ వంటగదిలో కెల్లాల్సి వచ్చింది. ఆడవాళ్లకి కావలసిన విశ్రాంతి, సెలవ గురించి బద్ధకంగా తీరిగ్గా కూచ్చుని కోడికాలు తిన్నత బాగుంది.
‘గుహని మార్చినంత మాత్రాన
పులిని సింహంగా మారవలేమనీ తెలుసు’
ఆమె మతం కూడా ఏమాత్రం ఉద్ధరించదని, ఇవాంజెలికల్ చర్చి పరంపరలో ఉన్న రాజకీయాల కుళ్ళుని , అందులో దూరే సవర్ణులని, ఓ.సి., క్రీస్తు భక్తులని మీకేం పని, మీవల్లనే మేము జాన్ పుల్లయలం, ఫ్రాన్సిస్ చల్లయలం అవుతున్నాం అని అటు ఆళ్లు, ఇటు ఈళ్లు ఎవరూ మమ్మల్ని కలుపుకోరని సమాజంపయిన, సవర్ణ బోధ గురువులపైనా, ఆ సమాజంపైనా నిరసన జెండా ఎగరేశాడు.
నిన్నటిదాకా రూపాయి చూడని మనం ఏదో ఇవాళ కొద్దిగా పచ్చకాయితాలతో అన్నం తింటంటే, పేరులో రైస్ ఉంది కదా అని భూమి మీద పండే ప్రతి బియ్యం గింజా నేను చెబితేనే తినాలనీ, మా అనుమతి లేకపోతే ఆకలితో చావనయినా చావాలిగాని మాకు ఇష్టం ఉంటేనే ఏ దేశానికయినా కూడెడ్తాం లేదా సముద్రంలో పారబోసుకుంటాం. ఇంక ఎక్కువ మాట్టాడితే ఇరాక్‌లాగా మసి చేసి నేలమట్టం చేయగలం. ఇంకా ఎక్కువయితే మేం సముద్రంలో అన్నీ దొల్లిచ్చుకుంటాం అనే కండకావరపు అమెరికాని ఎత్తి చూపిచ్చే రొట్టెల తనిఖీ. వీళ్లు పిజ్జాలు, బర్గర్‌లు, కోక్‌లు ఎన్నయినా తినొచ్చు, పీకలదాకా పీలవొచ్చు. మనం మన మాంసం, చేపలు, గుడ్లు ఆడికి ఎగుమతి చెయ్యకుండా తింటే ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ‘యాంకీ’బాబు ఒంకర బుష్‌గారి పళ్లు పీకాడు. బడుగులపై బలవంతుడిలాగా, పేద దేశాలమీదేగా అమెరికా ప్రతాపం. మొక్కుబడుల పేరుతో తిరిగి మొలిచే జుట్టుని ఎన్నిసార్లయినా గుండు కొట్టించుకుంటాం. అదే ఏలో, కాలో ఇవ్వాల్సి వత్తే ఇత్తామా? ఇదీ అంతే. మనం ఇప్పటికే రెండుపూటలా బ్రేవ్‌మని ఏడిసిందెక్కడ?. ఆయనకి తెలుగురాదుగా ఈ విషయాలన్నీ ఎవరు చెబుతారు.
ఒకరోజు నేనూ నా స్నేహితుడూ మాట్లాడుకుంటూ పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చిందనే కథ చెప్పుకున్నాం. ఇంత పెద్ద మంద ఉండి ఈ A B, C, D ల పేరుతో ఎదురు పడితే అనాధల్లాగా నొసలు ముడేసుకుని, కళ్ళతో అదేదో కక్కుకుంటున్నారు. ఆప్యాయంగా అందరూ పాలు నీళ్లయితే అధికారపు హంసలకి ఆహారం అందదు కదా. ఎన్నాళ్ళీ Kingmakers బతుకు. మా ఊరిలో మా దగ్గిరలో ఉండే అందగత్తెలు, ఒద్దికయిన వాళ్లు, మానవత్వపు మహిళలు ఇద్దరు, కాళావు, మాంకాళి. ఆళ్ళు ఏది మాట్టాడినా ఎంత బాగున్నా లేక అలంకరించుకున్నా ఆళ్లని సంబోధించటమే వేరు. లంజ, లంజముండ, లంజలభాష, లంజకొడుకులు, ఒసివి చేస్టలు అనే భాషఘోష నాకు తిరిగి తిరిగి తగులుతున్నది. నా మిత్రుడు, మా పక్క ఊరివాడు ‘విజయవాణి'(కన్నడ పత్రిక) సంపాదకుడు పంపన గౌడ మాటల్లో “ఎంతో అభివృద్ధి చెందాం అనుకుంటాం బుజ్జమ్మా, నువ్వు రచయిత్రివయ్యావు. నేను రిపోర్టర్నయ్యాను. కానీ మన ఊళ్లో రెండూ జాంబుల (గ్లాసుల)పద్ధతిని మార్చలేకపోయాం. చీ! ఏం బతుకులు” అని ఇప్పటికీ సిగ్గుపడతాం. వైద్యుడిగా మా నాన్న ఈ డిస్పోజల్స్ రాకముందు గాజు సిరంజితో మా దగ్గెరి వాళ్ళకి జరం వచ్చినపుడు సూది మందేత్తే మూడూర్లు మా నాన్న వైద్యాన్ని బహిష్కరించారు. కానీ మా నాన్న అంతకన్నా మొండోడు. వాళ్లు వచ్చినా వైద్యం చెయ్యనని వాళ్లనే బహిష్కరించిన రోజులున్నాయి. మా ఊరి ‘మాంకాళి’ బ్యాడరు కులానికి చెందిన ‘వీరభద్రి’ అనే దర్జీని ప్రేమించినందుకు ఊరూరూ ఆమెని చంపాలంటే, రండిరా చూసుకుందాం అని మా ఇంట్లోనే ఆరునెలలు దాచాడు. ఈ అడ్డనామాల దురాగతాలు ఒకటా? రెండా? సమస్‌కృతం కలిసిందా భాషంటే, మరి పామరుడిదీ, శ్రమజీవులదీ, చేనుదీ, చెమట చుక్కదీ, కొట్టంలో నించీ కొట్టే మురికిప్యాటల్ది, పశువుల పాలకులదీ, సోమరులదీ, సూటుబూటు బొఱ్ఱల బాబులది కాదు.
భాషంటే జాతరది, చర్చిది. సంస్కృతి మన ఒక్కళ్ళదేనా? సృష్టి కన్నా ముందే సంస్కృతి పుట్టిందా? మా ఊరి బుడకజంగాల నడిగితే విద్య అంటే తెలివే ముందు. గురువే తరవాత. మూర్ఖుడు మాత్రమే గురువులని ఆశ్రయించి కొలుస్తాడు అని అంటారు. మరికొన్ని వేల సంవత్సరాల క్రిందట రాయబడిన ‘పాత నిబంధన’ గ్రంధంలో భాషలు తారుమారయిన ఈ బాజెల్ నగరం కథలు చదువుకోలేదా? పెద్ద మనం డాబులు చెప్పుకునేవాళ్లమేమో. సాటివాళ్లని పశువులకన్నా హీనంగా చూస్తా పెద్ద పెద్ద రిసెర్చి స్కాలర్లు, మేధావులు ఎందుకు అసహ్యించుకుంటున్నారు? గుఱ్ఱం సీతారాములు ఎంత నలగ్గొట్టబడితే గుఱ్ఱం సీతారావణ్‌లవుతారు?
శ్రీలంకలోని నాలుగు మూలజాతులున్నవి. వెడ్డా, అహికుంటిక, రామకుళూవర్, వాగ. ఈ నాలుగింటిలో ఒక్క వెడ్డా తప్ప మిగతా మూడు జాతులు తెలుగు జాతులు. వీళ్లు సింహళం, తమిళం, తెలుగు మాట్లాడగలరు. అదీ ఇంగిలీసు కలవని తెలుగు. అంటే పల్లె తెలుగు. వెడ్డా అనే తెగ దాదాపు అంతరించిపోయే దశలో ఉంది. వెడ్డాల పేర్లు ఇలా చెప్పాడంట. బంటన్న, ఎఱ్ఱ బండన్న, నల్లమ్మ ఇట్టా ఉండి, వాళ్ల భాష మన మూల వాసుల భాషకి చాలా దగ్గరగా ఉందంటే చాలా ఆశ్చర్యపోయాం. ఇవన్నీ ఎవరు పరిశోధనలు చేత్తారు. ఎవరిగోల వాళ్లది. భాష దళితీకరించబడినప్పుడే కదా బాధితులకి నమ్మకం కలిగేది. ఇక్కడ ఒక ఉదా:- చూడండి. వాళ్లలో బతికి ఉన్న మసెన్న అనే శ్రీలంకవాసితో మాట్లాడుతు ఉంటే (పాములు పట్టటం , ఆడిచ్చటం అతని వృత్తి) ఆ తెలుగు మన మూలవాసుల తెలుగుతో కలిసి ఉన్నది. అలాగే భోపాల్ వాసులయిన ఆదీవాసుల్లో ఒక భాగస్తులయిన “శుభాష్ సింగ్, దుర్గాబాయి’కు పర్దాన్ గోండు కళలో నిష్ణాతులు. వాళ్లు సంప్రదాయ బొమ్మలు, పుస్తకాల వ్యాకరణాన్ని అందిస్తూ చిత్రించిన “భీమాయణం (అంబేత్కర్ జీవిత యాత్ర)” ప్రతి ఒక్కరు (H.B.T) చూడదగిన పుస్తకం.
Happy New Year
కొత్త యాడాది సంబరాలు
అంటే ఏది తీసుకుంటాం. ఇక్కడ కవి ఎంత పెద్ద తలలో గుజ్జయినా తోడందే వదలనన్నాను. ఈ వ్యంగ్యం మీరూ చూడండి. అమ్మో! రామాయణం అంటే సామాన్యం కాదు.
‘ఇప్పుడు కవిత్వమూ వ్యభిచారమయ్యింది
సమాజంకోసం మొదట్లో రాస్తాం
పోనుపోను కీర్తికిరీటాల కోసం
రాసి రాసి రంపాన పెడుతుంటాం.
నిజమే ఒక్కోసారి మన వల్ల అవతలవాడు చస్తాడని తెలిసినా మన పిశాచ ఆనందం కోసం రచనా హత్యలు చేత్తానే ఉంటాం. ఒక సభలో ఢిల్లీ ప్రొఫెసర్ చిన్నారావు ఇలా అన్నాడు. “చిన్నప్పుడు ఊరి బయట, ఇప్పుడు రాష్ట్రం బయట” అని. డోంట్ వర్రీ బ్రదర్ కాలం మారింది. మీరు లేందే ఊళ్ళేలేని రోజు ఇవ్వాళ. ఈ దేశంలో ప్రతికులంలోనూ ఒక అంబేత్కర్ రావాలని, అంబేత్కర్‌ని ఉపయోగించుకునే వాళ్లు చెప్పే దళిత బ్రాహ్మణిజానికి కూడా రేవు పెట్టాడు. ఏరు దాటినాక తెప్ప తగలేసినట్టుగా తమకు దళిత అన్నపదమే అసహ్యంగా ఉందని we are more than that అనీ తాము ఆ స్టేజీ దాటామనీ, శుచీ శుభ్రతలో బ్యామ్మర్లతో సమానమనీ అంటుంటే పిచ్చివాళ్లలారా, పడకండి పడకండి ఏ వ్యామోహపు గుండాలలో అని ఆరవాలనే ఉంటది. మొదటిసారి చదివినప్పుడు ఎవరీయన అనే ఆశ్చర్యం, చదవగా చదవగా మనవాడై, వేడై, మెదడులో పురుగులాగా, చెప్పులో ముల్లులాగా గుచ్చుకుంటాడు. చేనేత ఉరినేతలా మారటంపై చూడండి.
‘మా నేతల్ని మేమే నేసుకోవాలి
మా శవాలపై గుడ్డల్ని నేయటమయినా
మా పిల్లలకి నేర్పాలి,
కొడుకులు బట్టలు నెయ్యటం నేర్పారుగానీ
ఉరితాళ్లు పేనటమయినా
వేట కత్తులు నూరటమయినా
నేర్పలేక పోయారు..
ఇది చదివినాక గుండె భగభగమని, తుప్పు పట్టిన సూరులో కత్తి నూరటంలో, ఏ ఉద్యమంలోకో దూకి జండా పట్టటమో, అన్యాయానికి ఉరి వెయ్యటమో, ఏదో లేకపోతే మన పళ్ళనే పటపట, టకటక, కటకట నూరటమో చెయ్యకుండా ఉండం.
‘కామ్రేడ్‌లతో తినిపిచ్చిన ప్రశ్నల ఎండుమిరగాయలు చూడండి.
‘ఆయుధాలు పట్టటం ఇక్కడ ఉద్యమం
మనువుని సంహరించకుండా
మనిషిని వర్గ శత్రువనటం వికటం
పాపం మన కామ్రేడులు మిరపకాయలే కాదు వాటి పొగేసినా చలిచ్చరు.
ఉద్యమ నెలబాలుడి గురించిన గొప్ప వాక్యాలు.
చెట్లెన్ని పడినా వీచెగాలి ఆగదన్నాడు. జనం గుండెల్లో తనెప్పటికీ చచ్చిపోలేదన్నవార్త, తన సమాధినీ చూడగలిగినవాడు. దళితసాగర గీతాన్ని శివమెత్తి పాడుతున్నవాడు రాసినవాడు ఈ కవి. ఇకనించీ మనం కూడా వాళ్ల బతుకు బాసని మాట్టాడదాం. కనీసం ఇందాం. ఫూలన్‌దేవి ఎందుకు తుపాకీ పట్టిందో లోతుగా అధ్యయనం చేద్దాం. పొట్టిలంక మారణహోమం విషయం మరిచిపోయాం, లక్సింపేట అందమయిన సంకలనం అయింది. భాషలో అరసున్న పోయినప్పుడే గుండుసున్న మిగిలిందని దేన్ని కొట్టి చెప్పాలి. దేనితోనూ కొట్టకుండానే మనకి తగిలేట్టు చెప్పాడు.
మిత్రుడు చంద్ర గురించి ఎవరితను అని చెప్పినపుడు, చదివి నేను రాసినంత సంబరపడ్డా. ఆప్తులయినవాళ్లని అరిచేతులమీద నడిపిత్తారని, అంతులేని కన్నీళ్లతో గుండెల్ని తడుపుతారని, బెంగలతో ఊరేగింపు యాత్రలో పూలవుతారని, కాళ్ళకి అడ్డం పడే బంధువులవుతారనిపిచ్చింది. ప్రేమనాలుకల తడిలవుతారు.
మద్దూరి, శిఖామణి, ఎండ్లూరి తరవాత ఎవరంటే ‘విల్సీ’నే . అలా అచ్చంగా వాళ్లకి చెందినాడేం కాదు. ఆశ్చర్యంగా అప్పుడపుడూ ‘మో’గారి పదాలు కూడా పడతయ్యి. “బ్లాక్ కీ నీగ్రో’ తేడా తెలుసుకున్న మిత్రుడు. నిజంగా కవితా ప్రేమికులకి నచ్చే పుస్తకం మాకూ ఒక భాష కావాలి.
దొరికే చోటు: అన్నీ ప్రముఖ పుస్తకాల షాపుల్లో
Ebook: Kinige.com
- మన్నెం సింధు మాధురి
మంచి కతకురాలు సింధు మాధురి, *మాకూ ఒక భాష కావాలి* పై ఇంకా స్పష్టంగా రాయ గలిగేవారు ప్రయత్నిస్తే
ప్రారంభం లో చాలా గొప్పగా అనుకున్నాము. రెండో భాగం కాస్త వాస్తవ్వాన్ని కోల్పోయీ ఏ డాక్టరేట్ కొరకో లేక ఏ సన్మానం కొరకో రాసినట్లుంది! దళితుల భాష వ్యక్తీకరిమ్చదానికి మాత్రం కాదు!