వీలునామా

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

  జేన్ కొత్త బాధ్యతలు       

అనుకున్నట్టే ఆ తరవాత కొద్దిరోజులకే బ్రాండన్ పెగ్గీ ఇంటికొచ్చి జేన్ కి ఫిలిప్స్ ఇంట్లో ఉద్యోగం ఖాయమయినట్టే చెప్పాడు. మరో రెండు రోజుల్లో ఫిలిప్స్ స్వయంగా ఎడిన్ బరో వచ్చి జేన్ ని కలిసి అంతా ఖాయం చేద్దామనుకుంటున్నారట.

మరో రెండు రోజులకి ఫిలిప్స్ పెగ్గీ ఇంటికొచ్చాడు. అయితే తన కూడా పిల్లలు ఎమిలీ, హేరియట్ ని తీసుకు రాలేదు. ఇద్దరూ జలుబుతో పడకేసారన్నాడు. పిల్లల్ని చూడాలని ఎంతో ఆశపడ్డ పెగ్గీ నిరాశ చెందింది.

జేన్, ఎల్సీ ఇద్దరూ ఫిలిప్స్ ప్రవర్తనా, మర్యాదా, మన్ననా చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, పెగ్గీ ఆయన ఇంట్లో పనిమనిషి! అయినా పెగ్గీతో, పెగ్గీ ఇంట్లో పిల్లలతో, తాతగారు లౌరీ తో ఫిలిప్స్ చాలా మర్యాదగా మాట్లాడాడు.

ఫిలిప్స్ ఇద్దరు అక్క చెల్లెళ్ళతో మాట్లాడి తన ఇంటికి జేన్ లాటి మనిషి అవసరం వుందని అనుకున్నాడు. తన ఇంటి వ్యవహారాలు చూస్తూ, పిల్లలకి చదువులు చెప్తే ఏడాదికి డెభ్భై పౌండ్లు జీతం కింద ఇస్తానని చెప్పాడు. అయితే జేన్ రెండే రోజుల్లో బయల్దేరవలసి వుంటుంది.

“మేము ఈ ఎండాకాలం ఇటువైపే వస్తున్నాము కాబట్టి మీరూ ఎడిన్ బరో వచ్చి మీ చెల్లాయిని కలుసుకోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం మీరు వెంటనే నాతో బయల్దేరాల్సి వుంటుంది.” అన్నాడు ఫిలిప్స్.

“అలాగే బయల్దేరతాను. ఎల్సీ కి వీడ్కోలు చెప్పడం తప్ప ఇక్కడ నాకు మాత్రం పెద్ద పనేముందని?” అంది జేన్.

“అయ్యా! ఇంతకీ పిల్లలెలా వున్నారు?  నేను ఆస్ట్రేలియా వదిలేటప్పటికి ఎమిలీకి నాలుగున్నరేళ్ళు. ఇప్పుడు బాగా పొడుగయిందా?” కుతూహలంగా అడిగింది పెగ్గీ. “ఈ ఎండాకాలం ఇక్కడికే వస్తున్నామని చెప్పా కదా? అప్పుడు చూద్దువుగాని. ఎల్సీ నిన్నయితే గుర్తు పడుతుంది, నువ్వు దాన్ని గుర్తు పడతావో లేదో కాని! నీకు గుర్తుందా పెగ్గీ? ఒకసారిఎవరో ఆర్టిస్టుతో నీ బొమ్మ గీయించా. అదింకా వుంది ఎల్సీ దగ్గర!”

“అవునా? అయినా మీరు పిల్లల్ని గారాబం చేసి పాడు చేస్తారు సారూ! హేరియట్ తరవాత పుట్టిన పిల్లల పేర్లేమిటి?”

“కాన్స్టాన్స్, హ్యూబర్ట్, ఈవా.”

“ఆహా! అమ్మగారికి ఇంగ్లండు నచ్చిందా?”

“చాలా! ఇక్కడి నించి ఆస్ట్రేలియా రాననే అంటోంది. నాక్కూడా ఆవిడ పిల్లల్ని పట్టుకుని ఇక్కడ వుండడమే మంచిదనిపిస్తోంది. నేను వెళ్తూ వస్తూ వుంటాననుకో.”

“అవునండీ! ఇక్కడైతే స్నేహితులూ కుటుంబమూ వుంటాయి. అందుకే ఆవిడకి ఇక్కడ నచ్చి వుండొచ్చు. మిగతా అంతా ఎలా వున్నారు? బెన్నెట్, మార్తా బాగున్నారా? మార్తా టక్ ని పెళ్ళాడిందేమో కదా?”

“అవును పెగ్గీ! ఇద్దరూ అక్కడే వున్నారు. బెన్నెట్ ఎంత పని మంతురాలో ఎంత మంచిదో నీకు తెలుసు కదా? ఆవిడ మొగుడేమో తాగుబోతు, సోమరి. అదే తెలివి తక్కువ మార్తాని అందర్లోకీ కష్టపడి పనిచేసే టక్ కట్టుకున్నాడు. కొన్నిసార్లు ఇలాటి అవక తవక పెళ్ళిళ్ళని చూస్తే విచిత్రంగా వుంటుంది.”

ఫిలిప్స్ వెళ్ళిపోయింతర్వాత పెగ్గీ అమ్మాయిలతో,

“మగవాళ్ళకి తమ పెళ్ళి తప్ప అందరి పెళ్ళిళ్ళూ అవక తవకగానే అనిపిస్తాయనుకుంటా! నాకైతే అసలు ఫిలిప్స్ గారి పెళ్ళే అన్నిటికన్నా అవకతవక పెళ్ళి అనిపిస్తుంది. జేన్, నువ్వు శ్రీమతి ఫిలిప్స్ గారితో కచ్చితంగా వుండలి సుమా! ఆయనేమో మహా మెతక మనిషి,” అంది.

***

veelunama11

ఫిలిప్స్ దగ్గర అక్కకి ఉద్యోగం ఖరారు కాగానే ఎల్సీ శ్రీమతి డూన్ దగ్గర కుట్టు పనిలో చేరడానికెళ్ళింది. జేన్ కి దొరికీ ఉద్యోగం సంగతి విని డూన్ ఎంతో సంతోషించింది.

రెన్నీ కుటుంబం జేన్ వెళ్ళే ముందు ఆమెకోసం చిన్న విందు కూడ ఏర్పాటు చేసారు. ఎలీజా రెన్నీ అయితే అక్క చెల్లెళ్ళిద్దరినీ తాను బ్రాండన్ కి పరిచయం చేయడం వల్లనే ఇదంతా జరిగిందని ఎంతో సంతోషించింది. వాళ్ళ ఇంట్లో విందుకు బ్రాండన్, ఫ్రాన్సిస్, లారా విల్సన్ అందరూ వచ్చారు. ఫ్రాన్సిస్ మొహం వేలాడేసుకుని కూర్చున్నా, బ్రాండన్ తన జోకులతో అందరినీ నవ్వించాడు.

రెండు రోజుల అనంతరం జేన్ తో పాటు ఫిలిప్స్ మాత్రమే కాకుండా బ్రాండన్ కూడా వున్నాడు. ఇద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు. జేన్ మాత్రం తన ఆలోచనల్లో తనుండిపోయింది.

***

ప్రయాణం ముగిసి ఇల్లు చేరిన జేన్ శ్రీమతి ఫిలిప్స్ ని చూడగానే ఆశ్చర్యంతో నిల్చుండిపోయింది. తన  జన్మలో అంత అందగత్తెని చూసి వుండలేదు మరి. అయితే ఆమె నోరెత్తి మాట్లాడగానే ఆ పారవశ్యం కొంచెం భంగమైన మాటా నిజమే. ఏ మాత్రం విద్యాగంధమూ, సంస్కారమూ, నాజూకూ లేని మొరటు తెలివితక్కువ మాటలతో ఆమె మౌనంగా వుంటే బాగుండనిపిస్తుంది పక్కవారికి.

కానీ, ఆమె అందం మాత్రం వర్ణనాతీతం. పొడవుగా, మంచి అంగ సౌష్ఠవం తో పాటు, పాల మీగడలాటి రంగూ, అద్దాల్లాటి చెక్కిళ్ళూ, బాదం కాయల్లాటి మట్టి రంగు కళ్ళూ, ఎర్రటి పెదిమలూ, తరంగాల్లా భుజాల చుట్టూ పరుచుకున్న మెత్తటి ఒత్తైన జుట్టూ, ఆమె వైపు ఎంతసేపైనా చూస్తూ వుండిపోవచ్చు.ఆమెని చూడగానే ఆమెని ఫిలిప్స్ ఎందుకు అంతగా ఇష్టపడి చేసుకున్నాడో అర్థమయిపోతుంది. అంత అందగత్తెనని ఆమెకూ తెలిసే వుండాలి. దాంతో సహజంగా ఆత్మ విశ్వాసమూ, ఇతర్లు తన మాట జవదాటరన్న నమ్మకమూ వుండే వుంటాయి. ఈవిడ కింద పని చేయగలుగుతానా, అని భయపడింది జేన్.

ఆమె పెగ్గీ వర్ణించినదానికంటే బాగున్నట్టనిపించింది జేన్ కి. పెగ్గీ వర్ణించింది పదహారేళ్ళ పసి మొగ్గని. ఇప్పుడు తన ముందున్నది ఇరవై యేడేళ్ళ పరిపక్వమైన స్త్రీత్వం. అయిదుగురు పిల్లల తల్లిలా అనిపించనేలేదామె. ఎమిలీకి తల్లి పోలికా,తల్లి అందమూ రాలేదు. అయితే మహా చురుకు. హేరియట్ కొంచెం ముద్దుగానే వున్నా, తల్లి అందం ముందు దిగదుడుపే.

వాళ్ళు ఇల్లు చేరగానే ఎమిలీ తండ్రిని చుట్టుకుపోయింది. హేరియట్ ఆయన వళ్ళోకెక్కి కూర్చుంది. కాన్స్టాన్స్ ఆయన గడ్డాన్ని పీకడం మొదలు పెట్టాడు. మొత్తానికి అందరికీ తండ్రి దగ్గర చాలా చేరిక లాగుంది.

“అబ్బ! నువ్వొస్తున్నావని ఫిలిప్స్ చెప్పగానే ఎగిరిగంతేసా జేన్! ఈ పిల్లల పనీ, ఇంటిపనీ తెగక చస్తున్నాను. అయినా ఇంగ్లండు వచ్చేది ఏదో కాలక్షేపానికో సరదాకో అనుకున్నా కానీ ఈ గొడ్డు చాకిరీ వుంటుందని నాకేం తెలుసు! ఇదిగో పిల్లలూ! కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. లేకపోతే మీ పంతులమ్మ వెళ్ళిపోతుంది.”

“నేను నా ఇష్టమొచ్చినట్టుంటా, నాన్న దగ్గరున్నట్టే!” ఎమిలీ తండ్రి మొహం మీద ముద్దులు కురిపిస్తూ అంది.

“ఎమిలీకి అసలు కుదురే వుండదు. అసలు దానికి బుధ్ధి చెప్పేవాళ్ళే దొరకలేదు ఆస్ట్రేలియాలో, ఇక్కడ ఇహ మీ శిక్షణలో కొంచెం బాగు పడుతుందేమో!” బ్రాండన్ అన్నాడు.

ఎమిలీ తండ్రినొదిలి బ్రాండన్ మీదకి ఉరికింది.

“బాగు పడటమా? అంటే మీ ఏష్ ఫీల్డ్ ఇంట్లో పిల్లలు ఉంటారే, వాళ్ళలాగానా? వద్దు బాబూ, వద్దు! వాళ్ళంత మొద్దు మొహాలెక్కడా వుండరు. వాళ్ళకి మట్టి పిసికి బొమ్మలు చెయ్యడమూ రాదు, చెట్లెక్కడమూ రాదు, గోడలేక్కడమూ రాదు. ఆ రోజు ఆ తోటలో నేనూ హేరియట్ ఎంత హాయిగా పరుగులు తీస్తూ ఆడుకున్నామో! వాళ్ళకేమో అసలు పరిగెత్తడమంటేనే భయం!” అల్లరిగా అంది ఎమిలీ.

“మరి వాళ్ళలాగా నీకు చదువొచ్చా? అయినా ఫిలిప్స్! ఇక నేను వీళ్ళని ఏష్ ఫీల్డ్ తీసికెళ్ళను. తోటంతా పరుగులు పెడుతూ మన పరువు తీస్తారు.”

“తీసికెళ్ళకపోయినా ఏం ఫర్వాలేదు. అసలక్కడ మాకెంత బోరు కొట్టిందో! హేరియట్ కి అక్కడ నచ్చిందేమో నాకు తెలియదు మరి!”

“నాకు పుస్తకాలంటే అసహ్యం!” వున్నట్టుండి అంది హేరియట్.

“బొమ్మల పుస్తకాలో, కథల పుస్తకాలో అయితే తప్ప!”

“జేన్! పిల్లల మాటలు పట్టించుకోకండి,” ఫిలిప్స్ సంజాయిషీగా అన్నాడు.

“అయ్యో! మరేం ఫర్వాలేదండీ. కొన్నాళ్ళకి వాళ్ళకి చదువూ, పుస్తకాల మీద ఇష్టం కలిగించడానికే ప్రయత్నిస్తాను.”

“లిల్లీ! పెగ్గీ అక్కయ్య పిల్లలు ఏం చదువుతారనుకున్నావు? అంతా జేన్ చలవే! పెగ్గీ వాళ్ళకోసం ఎంతెంత డబ్బు కర్చు పెడుతోందో!”

“పెగ్గీ కెలాగైనా మధ్య తరగతిలోకెళ్ళిపోవాలన్న ఆశ. మరీ ఆకాశానికి నిచ్చెనలు వేయడం అంత మంచిది కాదేమో!”

“ఆ పిల్లల తెలివితేటలూ కష్టమూ చూస్తే నువ్వీ మాట అనవు. ఏదో ఒక రోజు నేను టాం లౌరీ ఎదుట టోపీ చేతిలో పట్టుకుని నిలబడ్డా ఆశ్చర్యం లేదు!”

“పో స్టాన్లీ! నీవన్నీ పిచ్చి మాటలు” లిల్లీ అతన్ని వేళాకోళం చేసింది. ఫిలిప్స్ దంపతుల పేర్లు లిల్లీ,  స్టాన్లీ అని అప్పుడే తెలిసింది జేన్ కి.

“మాటలు కాదు. టాం నిజంగానే ఒక పెద్ద ఇంజినీరయ్యాడనుకో, ఏ రైల్వే లైనో వేయించడానికి ఆస్ట్రేలియా వచ్చాడనుకో, అప్పుడు నేను చెప్పినట్టేగా అయేది. అదంతా ఎందుగ్గానీ, నాకు ఆ పిల్లలనీ, వాళ్ళ చదువులనీ చూస్తే ముచ్చటగా అనిపించినమాట నిజం. దానికంతటికీ కారణం జేన్ వాళ్ళకిచ్చిన శిక్షణ అని చెప్పింది పెగ్గీ!”

“ఓ! అందుకన్నమాట నువు జేన్ ని ఇక్కడకి తీసుకొచ్చింది,” నవ్వాడు బ్రాండన్.

“నాకూ పెగీ పిల్లలు నచ్చినా, మరీ నీ అంత కాదు. ఎమిలీ, నిన్ను జేన్ మెల్విల్ ఆ పెగ్గీ పిల్లల్లా తయారు చేయాలన్నదే మీ నాన్న ఆస. వాళ్ళలా నీకూ చదువు మీదా, విద్య మీదా ఆసక్తి పెరిగిపోతుంది ఇక!” ఎమిలీని వేళాకోళం చేసాడు బ్రాండన్.

“మీకు చిన్నప్పట్నించీ చదువుకోవడం అంటే ఇష్టంగా వుండేదా?” కుతూహలంగా జేన్ ని అడిగింది ఎమిలీ.

“అవును ఎమిలీ!” నవ్వుతూ జవాబిచ్చింది జేన్.

“మా అమ్మ కూడా అదే మాట అంటుంది, కాని ఆవిడ అసలు స్కూల్ కెళ్ళిందే లేదు. మరీ ఇంతింత కాకపోయినా, కొంచెం చదువు బానే వుంటుందేమో!”

లిల్లీ ఫిలిప్స్ కి జేన్ చాలా నచ్చింది. ఆమె చదువు ఎక్కువై వుండొచ్చు కానీ, రూపు రేఖలు చాలా సామాన్యం గా వున్నాయి. దాంతో ఒకలాటి జాలి కలిగిందామెకు జేన్ పట్ల. దానికి తోడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని విన్నది.

అందులో ఆమెకి ఇంటి పనులు చేసుకోవడం, డబ్బు లెక్కలు చూసుకోవడం కొంచెం కూడా చేత కాదు. ఎంతో ఓపికస్తుడూ, పెళ్ళాన్ని విపరీతంగా ప్రేమించేవాడూ అయిన ఫిలిప్స్ కూడా భార్య దుబారా ఖర్చు చూసి కొంచెం విసుక్కున్నాడు. ఇప్పుడిక ఆయనే వెతికి ఇంటి పనికీ డబ్బు లెక్కలకీ ఒక మనిషిని పెట్టాడు కాబట్టి తాను ఆ బాధ్యతలన్నీ పట్టించుకోనక్కరలేదు. అందువల్ల జేన్ తో వీలైనంత మంచిగా ప్రవర్తించాలని నిశ్చయించుకుంది.

రాత్రి పది కొట్టగానే లిల్లీ ఫిలిప్స్ నిద్రొస్తూందని వెళ్ళి పడుకున్నది. వెళ్ళేముందు భర్తతో జేన్ కి అప్పజెప్పవల్సిన బాధ్యతలు గుర్తు చేసి మరీ వెళ్ళిందావిడ.

రాత్రి పొద్దుపోయేంతవరకూ ఫిలిప్స్ జేన్ కి శ్రధ్ధగా ఇంటి వ్యవహారాలూ, జమా ఖర్చులూ అన్నీ బోధపర్చాడు. ఇంటి తాళాలూ, లెక్క పుస్తకాలూ, అన్నీ జేన్ కి అప్పగించాడు.

“జేన్!నువ్వు ఇంట్లో ఒక ఉద్యోగిలాకంటే, ఇంటి మనిషిగా వుంటే ఎక్కువ సంతోషిస్తాను. నీకు లిల్లీ గురించి మొత్తం తెలియదు. ఆమె వయసులో పెద్దదైనా ఆ పిల్లల కంటే పసిది. నీకు వీలైతే నువ్వు ఆమెకీ కొంచెం చదువూ సంస్కారం నేర్పితే నీకెంతో ఋణపడివుంటాను!” ఇబ్బందితో ఆయన మొహం ఎర్రబడింది.

ఆలాగేనని ఆయనకి మాటిచ్చినా, తనకంటే వయసులో పెద్దదీ, మహా రాణులకుండే అందచందాలున్నదీ, ఇంటి యజమానురాలూ అయిన లిలీని చదువు వైపు మళ్ళించడం సాధ్యమేనా అన్న ఆలోచనతో నిద్ర పట్టలేదు జేన్ కి. తన మాట పిల్లలు వింటారో వినరో నని జేన్ బెంగ పడింది. కానీ, ఊరంతా ముద్దూ, గారాబమూ చేయడం అలవాటైన ఫిలిప్స్ పిల్లలకి జేన్ క్రమశిక్షణ నిజానికి బాగనిపించింది. మౌనంగా, తక్కువ మాట్లాడుతూ హుందాగా వుండే తమ గురువుగారు చెప్పినట్టు నడుచుకోవడం వాళ్ళకి కొత్తగా, హాయిగా అనిపించింది.

ముందుగా జేన్ వాళ్ళ పాఠ్యాంశాలన్నీ వాళ్ళకి సులువుగా అర్థమయ్యేలాగు మార్చేసింది. అది వాళ్ళకి అన్నిటికన్నా యెక్కువగా నచ్చింది. ఏ సంగతినైనా సరళంగా ఓపిగ్గా బీధించే ఆమె పధ్ధతీ, దానికన్నా అసలామెకున్న విషయ పరిఙ్ఞానమూ వాళ్ళకి చాలా అబ్బురంగా అనిపించింది.  భూగోళశాస్త్రమూ, చరిత్రా లాటి మహా విసుగు పుట్టే అంశాలని కూడా ఆమె చాలా ఆసక్తికరంగా మార్చింది.      తండ్రి దగ్గర ఎమిలీ, హేరియట్ ఇదివరకే చక్కవగా చదవనూ, రాయనూ నేర్చుకున్నారు. వాళ్ళకి రానిదల్లా, లెక్కలూ, చరిత్రా లాటి విషయాలు. స్వతహాగా చురుకైన పిల్లలు కాబట్టి వాళ్ళు జేన్ పధ్ధతులకి వెంటనే అలవాటు పడిపోయారు.

లిల్లీ కి జేన్ మొత్తంగా నచ్చినా, ఆమె స్కాట్ లాండు యాస కొంచెం కూడా నచ్చలేదు. పిల్లలూ అదే యాసతో మాట్లాడతారేమోనని భయపడింది కూడా.

లిల్లీ కి ప్రస్తుతం వున్న సమస్య- తన అత్తవారింటికి వెళ్ళడం. అక్కడ ఆస్ట్రేలియాలో ఆమె నిరక్షరాస్యతనూ, మొరటుతనాన్నీ ఎవరూ పట్టించుకోలేరు. కానీ, ఇక్కడ స్టాన్లీ చెల్లెళ్ళూ, బంధువులూ అంతా చాలా చదువుకున్న వాళ్ళు. మహా నాజూకు మనుషులు. క్రితం సారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తననీ, తన పిల్లల్నీ ఎలా పల్లెటూరు బైతుల్లా చూసారో లిలీ కింకా గుర్తే. జేన్ ని  చుస్తూనే తనూ ఆమెలా చిన్న గొంతుతో మాట్లాడడం, నాజూగ్గా  ప్రవర్తించడం నేర్చుకోవాలనుకుంది. ఇప్పుడు పిల్లల ఆలనా పాలనా అంతా జేన్ చూస్తుండడంతో ఆమెకి తీరిక కూడా చిక్కింది.

ఆమెకి పాపం, చదవడం కానీ, కుట్టు పని కానీ, సంగీతం కానీ, ఏదీ రాదు. ఆవిడకి వచ్చిందల్లా, అలా సోఫాలో కూర్చొని పగటి కలలు కనడం. ఆవిడ అలౌకిక సౌందర్యం వల్ల, ఆమె అలా కూర్చొని ఆలోచిస్తూన్నప్పుడు ఆమె ఏదో అద్భుతమైన తత్త్వ చింతన చేస్తూందేమోనని పిస్తుంది కానీ, ప్రాపంచిక విషయాలు ఆలోచించే మామూలు స్త్రీలా అనిపించనే అనిపించదు.

ఒకానొక మధ్యాహ్నం అలాటి అలౌకిక స్థితిలోనే ఆమె విద్యాభ్యాసం గురించి జేన్ దగ్గర ప్రస్తావించింది. జేన్ చదువూ, ఇతర వ్యాపకాల గురించీ వినగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి, నోరు తెరుచుకుంది. ఆడపిల్ల మగపిల్లల్లా లెక్కలూ, సైన్సూ చదవడమా? అంతవరకూ ఆమె అమ్మాయిల చదువంటే ఏదో సంసార పక్షంగా కుట్లూ అల్లికలూ, కాలక్షేపం పుస్తకాలూ కవితలూ, పది ముందు గొప్పగా చెప్పుకోవడానికి కాస్త సంగీతమూ  అంతే అనుకుంది. కానీ చదువంటే కఠోర పరిశ్రమ అనీ, దాంతో మనసుకీ, మెదడుకీ రెక్కలు మొలిపించుకోవచ్చనీ ఊహించనే లేదు. అసలు చదువు పూర్తయింతర్వాత కూడా జేన్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండడం ఆమెకి కొరుకుడు పడని విషయం.

తనకి పదహారేళ్ళకే పెళ్ళయిపోవడం తలచుకొని నిట్టూర్చింది లిల్లీ. అంతకుముందు కూడా ఒకటే ఊర్లు మారడంతో ఆమె ఎక్కడా కుదురుగా బడికి వెళ్ళిందే లేదు. ఆస్ట్రేలియాలో వాళ్ళున్న కొన్ని ప్రాంతాల్లో అసలు ఆడపిల్లలకి బళ్ళే లేవు! ఆ మాటకొస్తే ఇప్పుడూ అంతే. అసలు పిల్లల చదువులు అక్కడుంటే పాడవుతాయనే కదా స్టాన్లీ కుటుంబాన్ని ఇంగ్లండు తీసుకొచ్చింది. ఇప్పుడు లిల్లీకి జేన్ చదువు చెప్తే బాగుండనిపించడం మొదలయింది. కానీ జేన్ ఏమంటుందో! నవ్వుతుందేమో, “ఈ వయసులో చదువుకుని ఏం చేస్తారండీ” అని ఎగతాళి చేస్తుందేమో!

జేన్ ఆ అభిప్రాయాన్ని వినగానే ఎగతాళి చేయలేదు సరికదా, ఎంతో ప్రోత్సహించింది. అయితే ఏ విషయం చదవాలన్న విషయం మీద ఇద్దరూ ఒక అభిప్రాయానికి రాలేకపోయారు.  తనకి పూలు తయారు చేయడమూ, పియానో వాయించడమూ ఇష్టమని చెప్పింది జేన్ తో.

“హ్మ్మ్మ్మ్… దురదృష్టవశాత్తూ అవి రెండూ నాకంతగా రావండి. ఒక పని చేద్దాం. అవి నేర్పించడానికి ఎవరీనా టీచర్లు దొరుకుతారేమో చూద్దాం. అంతవరకూ నేను మామూలు చదువు చెప్తాను. అయితే సంగీతం నేర్చుకోవాలంటే కొంచెం కష్టంపడాల్సి వుంటుందేమో!” అన్నది జేన్.

“ఎందుకూ? ఎమిలీ, హేరియట్ ఏమంత కష్టపడుతున్నారు? కనీసం గంటసేపుకూడా సాధన చేయరు! అన్నట్టు నువ్వుకూడా గంటసేపు సాధన చాలన్నావట?”

“అవును, నేను మూడు గంటలు పియానో దగ్గరఊరికే కూర్చునేకంటే, గంట సేపు శ్రధ్ధగా సాధన చేసి తర్వాత ఆడుకొమ్మన్నాను. ఆ వయసులో అంతకంటే ఎక్కువ అవసరమూ లేదూ, వాళ్ళు చేయనూ లేరు. అదే మనలాటి వాళ్ళం ఎక్కువ సమయమూ శక్తీ వెచ్చించాల్సి వుంటుంది,” వివరించింది జేన్.

“అవునవును! అప్పణ్ణించి పిల్లలు రోజూ సాధన చేస్తున్నారట. నాతో చెప్పారు. అయితే నీకొచ్చిందే నాకు నేర్పు. సంగీతం రాకుంటే అది వొదిలేద్దాం.”

***

(సశేషం)

 

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)