ఇప్పటి కవిత్వానికి కొన్ని తూకం రాళ్ళు!

kasula

( కవిత్వ విమర్శకుడు కాసుల లింగా రెడ్డి కి సాహితీ గౌతమి వారి ‘బొందుగుల అహల్య-సుందరరావు’అవార్డు ప్రదానం 19 న)

*

ఇలా అంటే చాలా మంది మిత్రులకి కోపంలాంటిది రావచ్చు కాని, అనకుండా ఉండలేకపోతున్నా. అతికొద్ది కాలంలో తెలుగులో కవిత్వ విమర్శ అనేది పూర్తిగా కనుమరుగు కావచ్చు. కారణాలు మీకు తెలియనివి కావు.

వొక పదేళ్ళ క్రితమో, పదిహేనేళ్ళ క్రితమో కవిత్వాన్ని తూచే రాళ్ళు లేవని అనుకునే వాళ్ళం. అసలు ఆ రాళ్ళు అవసరమా అన్న కొత్త ప్రశ్న ఇప్పుడు తలెత్తుతున్నది.  అంతర్జాల మాయాజాలం వల్ల, తక్షణ స్పందనలు శ్రుతి మించిపోయి, కాస్త నిలకడగా వొక మాట అందాం అనే స్పృహ క్రమంగా తగ్గిపోతోంది, ముఖ్యంగా కవిత్వరంగంలో!

వొక కవితని వొకటికి రెండు సార్లు చదివి, కాస్త ఆలోచించి, మాట్లాడదాం అనే ఆలోచనకి విలువ లేకుండా పోతోంది. ఈ స్థితిలో అయితే పొగడ్తలూ కాకపొతే తెగడ్తలూ, మరీ నాసిగా చెప్పాలంటే, ఎదో వొక విధంగా అది పరస్పర పొగడ్తల వొప్పందంగా  మారిపోవడం తప్ప ఇంకో స్థితి కనిపించడం లేదు.

ఇలాంటి స్థితిలో కవిత్వ విమర్శని తన రంగంగా ఎంచుకొని, ఆ రంగంలో తనదైన వొక దారిని ఏర్పరచుకుంటున్న కాసుల లింగా రెడ్డి అరుదయిన కవిత్వ విమర్శకుడిగా కనిపిస్తున్నాడు నాకు.

తను స్వయంగా కవిత్వం రాస్తున్నప్పటికీ, ఇతరుల కవిత్వాన్ని విశ్లేషించడంలో లింగారెడ్డి చూపించే బ్యాలన్స్ అతన్ని మిగిలిన విమర్శకులకు భిన్నంగా నిలబెడ్తుంది.

కవిత్వాన్ని ఆషామాషీ వ్యవహారంగా భావించడం లేదు లింగారెడ్డి. ‘నువ్వు కవిత్వం ఎందుకు రాస్తున్నావనే’ మొదటి ప్రశ్నకీ, ‘కవిత్వ విమర్శ ఎందుకు రాస్తున్నావనే’ రెండో ప్రశ్నకీ లింగారెడ్డి దగ్గిర రెండు  వేర్వేరు సమాధానాలు లేవు. ఆ రెండీటికి అతనిచ్చే సమాధానం వొక్కటే. ఆ రెండీటికి మధ్యా వైరుద్ధ్యం చూపించలేకపోవడం లింగారెడ్డిలో వున్న అందమయిన బలహీనతలాంటి బలం!

తన విమర్శ వ్యాసాల పుస్తకం ‘ఇరువాలు’లో లింగారెడ్డి అంటున్నాడు.

“రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తున్నాను. ఈ ఉండలేని తనం ఎందుకంటే నాకు ఈ సమాజంతో నాకు అనేక పేచీలున్నాయి. ఈ పేచీల్లో నా వాదన వినిపించేందుకు నా తరఫున నియమించుకున్న లాయర్ నా కవిత్వం.”

రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తున్నాను అని ఎవరైనా అంటారు కాని, ఆ తరవాతి వాక్యంలో లింగారెడ్డి కనిపిస్తాడు. అతని ముక్కుసూటి వ్యక్తిత్వం కనిపిస్తుంది. మనలో చాలా సాధారణంగా స్థిరపడి వున్న అభిప్రాయం ఏమిటంటే, వాదన వినిపించేట్టు అయితే వచనమే రాయాలని! కవిత్వాన్ని మనం కేవలం తక్షణ భావోద్వేగ ప్రకటనకే సరిపుచ్చుకుంటూ వచ్చాం కాబట్టి! నిజానికి తక్షణ భావోద్వేగాలలో కూడా వాదనలే వుంటాయి. కాని, అది అంత తేలికగా వొప్పుకోం గాక వొప్పుకోం.

ఉద్వేగాన్ని మించిన విలువ ఇవ్వడం మొదలెడితే కవిత్వం ఏదో ప్రమాదకరమయిన సామగ్రిగా మారిపోతుందన్న ఆందోళన ఈ స్థిరపడి వున్న “కవిత్వ వాదం”లో వినిపిస్తుంది. కాని, అలాంటి ప్రమాదాలతో ఆడుకోవడమే అసలుసిసలు కవిత్వం. అలాంటి ప్రమాదాలని సృష్టించడమే అసలుసిసలు కవిత్వ విమర్శ చేయాల్సిన పని. గత కొద్ది కాలంగా లింగా రెడ్డి కవిత్వ విమర్శకుడిగా చేస్తున్న పని అదే.

lingareddi

లింగారెడ్డి కవిత్వ విమర్శలో అనివార్యంగా రాజకీయ చర్చలు కనిపిస్తాయి. రాజకీయ స్పర్శ లేని సాహిత్యం అతనికి వొంటబట్టదు. అంత మాత్రాన్న ఇతరేతర ధోరణులకు గుడ్డిగా వుండడం అతని లక్షణం కాదు. కవిత్వం అనే పలుకు వుందంటే దాన్ని బంగారంగా కళ్ళకి అద్దుకుంటాడు. ఆ తరవాత అందులో లోతుల్లోకి వెళ్లి, లోపాలూ దోషాలూ నిర్మొహమాటంగా చెప్తాడు. తన కవిత్వ విమర్శ వ్యాసాలకు ‘ఇరువాలు’ అని పేరు పెట్టడంలోనే తన ధోరణి ఏమిటో స్పష్టంగా చెప్పుకున్నాడు లింగారెడ్డి.

ఇరువాలు అంటే రెండు సార్లు.  అది వ్యవసాయ పదం. కవిత్వ వ్యవసాయానికి కూడా అదను చూసి వాడిన పదునైన పదం. నేలని వ్యవసాయ యోగ్యం చేయడంలో – అంటే దున్నడంలో- వుండే రెండు కీలక ప్రక్రియల్ని కవిత్వ విమర్శకి అన్వయిస్తున్నాడు లింగారెడ్డి. నాకు అర్థమైనంత మటుకు అది కవిత్వం చదివే విధానాన్ని అలవాటు చేసే ప్రయత్నంగా చూస్తున్నాను.

ఏ కవితని అయినా రెండు సార్లు చదవడం అనేది ideal. మొదటి సారి చదివినప్పుడు ఆ కవితని అనుభూతిస్తాం. అది అభిరుచిని మొలకెత్తించే ప్రక్రియ. రెండో సరి చదివినప్పుడు అది ఆ అభిరుచిని పెంచే ప్రక్రియ, అంటే- ఆ చదివిన కవితలోని సారాన్ని ఇంకించుకునే ప్రయత్నం. ఈ రెండో దశలో ఎవరికి వాళ్ళు భిన్నమయిన సారాంశాలని గ్రహించవచ్చు. భిన్నమయిన అభిప్రాయాలు ఏర్పడేది కూడా రెండో పఠనంలోనే! ఈ రెండు పఠనాలు ఇప్పటి స్థితిలో అరుదయి పోయాయని నా ఆందోళన. బహుశా, ఈ రెండు పఠనాల మేలు ఎంతటిదో చెప్పడానికే లింగారెడ్డి తన పుస్తకానికి ఈ శీర్షిక పెట్టుకున్నాడని నేను అర్థం చేసుకున్నా.

ఈ పుస్తకంలో లింగారెడ్డి వ్యాసాలు స్వభావ రీత్యా  కొన్ని సమీక్షలు, కొన్ని విమర్శలు. కొన్ని కవిత్వ సంపుటాలూ సంకలనాల మీద రాసినవి. కొన్ని ఇప్పటి ధోరణుల మీద రాసినవి. అసలు ఇతర విమర్శకులు ఎవరూ పట్టించుకోని విలువైన పుస్తకాలూ, కవిత్వ అంశాలని కూడా తీసుకొని, వాటి మీద లోతయిన చర్చ మొదలెట్టడానికి లింగా రెడ్డి ప్రయత్నించాడు. అవి చదివాక- మనం లింగారెడ్డి అభిప్రాయాలతో ఏకీభవిస్తామా లేదా అన్నది పక్కన పెడితే, ఇలాంటి వొక విమర్శకుడు మనకి తక్షణం కావాలి అనిపిస్తుంది. వర్తమానం చీకట్లో అతను వెలిగిస్తున్న దీపపు కాంతి విలువైందనీ అనిపిస్తుంది. కాని, వొక్క మాట అనకుండా ఉండలేను.

లింగా రెడ్డి తన విమర్శని వొక సైద్ధాంతిక కోణం నించి చేస్తున్నాడన్న విషయాన్ని పూర్తిగా గౌరవిస్తూనే, ఆ విమర్శకి అప్పుడప్పుడూ తను వాడుతున్న పరిభాష ఇంకా కొంచెం సరళం కావాలని అనుకుంటున్నా. కొన్ని సార్లు విపరీతమయిన jargon లింగారెడ్డి చెప్పాలనుకుంటున్న/ మనతో పంచుకోవాలనుకుంటున్న ఆలోచనలకి అడ్డంకి గా మార్తుంది. సైద్ధాంతిక నిబద్ధతకీ, jargon కీ సంబంధం లేదని లింగా రెడ్డి గుర్తించాలి. ఆ గుర్తింపు తోడయితే లింగా రెడ్డి విమర్శ భూమార్గం పట్టి, మనందరి ఆలోచనల్లో కొత్త కాంతిని ప్రవేశ పెడ్తుంది.

అదలా ఉంచితే:

ఇవాళ లింగా రెడ్డి  విమర్శ వ్యాసాల సంపుటి “ఇరువాలు” కి లభిస్తున్న ప్రశంసలూ,  పురస్కారాలూ విమర్శకుడిగా అతను చేస్తున్న పనికి వొక legitimacy ని ఇస్తున్నాయి. అతని మార్గం కొందరికైనా నచ్చుతోందన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. అది మున్ముందు వొక మార్గంగా ఏర్పడవచ్చన్న సంకేతాన్ని చూపిస్తున్నాయి.

-అఫ్సర్

ఇరువాలు on Kinige: http://kinige.com/kbook.php?id=1501&name=Iruvalu

 

Download PDF

7 Comments

  • ధన్యవాదాలు అఫ్సర్ గారు

  • కాసుల ప్రతాప రెడ్డి says:

    ఇంకాస్తా లోతుగా ఉంటే బాగుండేదేమో అనిపించింది… అయినా ఆత్మీయ స్పర్శలాగా ఉంది. కాసుల లింగారెడ్డి విమర్శ రాయడం నాకు ఇష్టం లేదు.. విమర్శలో సున్నితంగా పూలతో కొట్టినా రాళ్లు పడే కాలం ఇది..
    -కాసుల ప్రతాపరెడ్డి

  • balasudhakarmouli says:

    ఏ కవితని అయినా రెండు సార్లు చదవడం అనేది ideal. మొదటి సారి చదివినప్పుడు ఆ కవితని అనుభూతిస్తాం. అది అభిరుచిని మొలకెత్తించే ప్రక్రియ. రెండో సరి చదివినప్పుడు అది ఆ అభిరుచిని పెంచే ప్రక్రియ, అంటే- ఆ చదివిన కవితలోని సారాన్ని ఇంకించుకునే ప్రయత్నం.

  • mythili says:

    ” నిజానికి తక్షణ భావోద్వేగాలలో కూడా వాదనలే వుంటాయి. కాని, అది అంత తేలికగా వొప్పుకోం గాక వొప్పుకోం.

    ఉద్వేగాన్ని మించిన విలువ ఇవ్వడం మొదలెడితే కవిత్వం ఏదో ప్రమాదకరమయిన సామగ్రిగా మారిపోతుందన్న ఆందోళన ఈ స్థిరపడి వున్న “కవిత్వ వాదం”లో వినిపిస్తుంది. ”

    కవిత్వ విమర్శ గురించి నాకేమీ తెలియదు, కాని ఈ వాక్యాలు నిజమని తోస్తాయి.

  • కాసుల ప్రతాప రెడ్డి గారిలాగే నాక్కూడా ఇంకొంచెం డెప్త్ లెంగ్త్ వుంటే బాగుండును అనిపించింది.. అప్పుడే అయిపోయిందా అన్న ఫీల్… మీ పద సరళి ఎప్పుడూ ఆత్మీయమే అఫ్సర్ జీ..

  • rajaram.thumucharla says:

    నిజానికీ అఫ్సర్ విశ్లీషణ విమర్శ పైన చేశినట్లు లేదు లింగారెడ్డి గారి కవిత పైన జరిగినట్లుగా చాల హృదయాన్ని గాయపరచని అక్షరపూల సుగంధలా పరిమలించింది.నిర్మొహమాటపు విమర్శ లింగారెడ్డి గారిది.తనదైనా దృక్పతం విమర్శకుడికి వుంటుంది .ఇద్దరినీ ఇరువాలు అభినందిస్తున్నా

Leave a Reply to Jayashree Naidu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)