ఎచటికి పోతావీ రాత్రి?

nirmala story

kondepudi 

ప్రాధమికంగా కవి అయిన ప్రాథమికంగా కవయిత్రి అయినకొండేపూడి నిర్మల కథకురాలిగా కూడా అంతే ప్రసిద్ధం.  వ్యాసం,కాలమ్ లాంటి ఇతర సాహిత్య ప్రక్రియల్లో  కూడా ఆమె కృషి చేస్తున్నారు.వృత్తి పరంగా  ప్రచార, ప్రసార రంగాల్లో విలేకరి గా పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ, స్వచ్చంద సంస్థల్లో  జండర్ కమ్యూనికేషన్స్ అంశాలకు ట్రెయినింగ్ మాడ్యూల్స్ రాయడం, క్లాసులు తీసుకోవడం చేస్తున్నారు. ఈమె రచనలు తమిళ, ఆంగ్ల , మళయాళ  భాషల్లోకి తర్జుమా అయ్యాయి. నిర్మల కథల సంపుటి ” శత్రు స్పర్స “కు చక్కటి ప్రాచుర్యం లభించింది —వేంపల్లె షరీఫ్

 

***

 

 

nirmala story

 

ఎచటికి పోతావీ రాత్రి?

 

భయం ….

వేలాది కాళ్ళతో తరుముకుంటూ వచ్చి చటుక్కున పీక పట్టుకుని కొరికేస్తున్నట్టు..కొరికిన పీకలోంచి గుండెలోకి, ఇంకా ఆ కిందికి చెయ్యి జొనిపి తల్లిపేగుని కెలికి తెంపేసినట్టు…వొణికిపోతోంది సుందరమ్మ. వొళ్లంతా చెమటతో తడిసిపోయింది. దుప్పటి తీసి గాలి పీల్చుకుందామని వుంది. ….భయం.|

సంచీలో  వున్న సీసా వొంచుకుని నీళ్ళు తాగుదామని వుంది…… భయం….|

కదులుతున్న ఆ  రైలు,  పట్టాల  మీద నడుస్తున్నట్టుగా లేదు. తలకాయ మీంచి నడుస్తున్నట్టుగా వుంది. టటా.. టట్.. టటా..టట్ చప్పుడు కాస్తా పట్టుకోండి..కొట్టండి, నరకండి ..అరుపులుగా మారినట్టు అనిపిస్తోంది. ఉన్నట్టుండి విసురుతున్న రాళ్ళ దెబ్బలు తప్పించుకున్నట్టుగా చేతులతో వొళ్ళు కప్పుకోలేక  కాళ్ళు ఝాడించి పక్కకి తిరిగింది సుందరమ్మ.  ఆ కదలికకి  కిటికీ చీకటిలో తల పాతేసుకున్న  ముకుందరావు ఉలిక్కిపడి భార్య వైపు చూశాడు. గుండు చేయించుకుని మఫ్లరు చుట్టుకున్న అతని మొహం కొత్తగా వుంది . రెండు సీట్లకీ మధ్య వున్న జాగాలో పదిహేడు పధ్నాలుగు ఏళ్ళున్న సుమలత, సరోజలు  పాత దుప్పటి మీద  పడుకుని నిద్రపోతున్నారు. పెద్ద పిల్ల ఒద్దికగానే పక్కకి తిరిగి పడుకున్నది గానీ, చిన్న పిల్ల ఎడాపెడా  రెండు కాళ్ళూ తలో పక్కకి నిగడదన్ని పడుకోడం వల్ల..    తడిసిన తెల్లటి పైజమా, లోన వున్న నీలం రంగు చెడ్డీ కనబడుతున్నాయి.. ఆ పిల్లకి మతి స్థిమితం సరిగా లేదు. చూడ్డానికి బలంగా, పొడుగ్గా, అందంగా కనిపిస్తున్నా, మెదడుకింకా ఆరేళ్ళ పసి ప్రాయమే వుందని డాక్టరు చెఫ్ఫాడు.. కాబట్టి అ తల్లికి రోజూ వున్న వున్న సవాలక్ష పనుల్లో  పిల్ల బట్టలు సర్దడం కూడా ఒకటి.   ఎదుటి సీట్లో భూతద్దాల కళ్ళజోడు ఒకటి ఇటే చూస్తోంది. అసహనం పెరిగిపోయిన ముకుందరావు వొంగి ఆ  పిల్ల భుజంమీద ఒక్కటి వేశాడు. తండ్రి ఎందుకలా కొట్టాడో తెలీని సరోజ తల గోక్కుంటూ ఏడుపు లంకించుకుంది.  ఆ దెబ్బ భూతద్దాలకి కూడా తగిలినట్టయి  మొహం ఇంకోవైపు తిప్పుకున్నాడు.. ఎన్నికల సీజను అవడం వల్ల రైల్లో జనాలు కిక్కిరిసి వున్నారు. టి.టి ని పట్టుకుంటే నలుగురిలో ఇద్దరికైనా  బెర్తులు దొరుకుతాయేమో గానీ,  ప్రస్తుతం ఏ పనిమీదా ముకుందరావు ఎవరి ముందూ నిలబడదల్చుకోలేదు.. అటు ఇటూ చూసి రహస్యంగా భార్య చెవిలో ఏదో చెప్పాడు. దుప్పటి ముసుగు తీసిన సుందరమ్మ గబుక్కున లేచి సూట్కేసులోవున్న కట్టుడు చీర ఒకటి తీసి   ఉమ్మడిగా కూతుళ్ళిద్దరి మీదా కప్పింది. బెర్తులో ఇరికి మళ్ళీ యధాప్రకారం ఏడుపులో మునిగిపోయింది. ఆ ఏడుపు ఏమిటో గాని, చప్పుడు లేకుండా గొతులోనే చిదిమెయ్యడం వల్ల ఒకరకం మూగజంతువు మూలుగులా  వుంది.

రైలు ఏదో స్టేషనులో ఆగింది. ముకుందరావు, సుందరమ్మ ఒకేసారి బిగుసుకుపోయారు. ప్రస్తుతం వాళ్ళు వున్న పరి్స్థితిలో  రైలు ఆగడం ఇష్టంలేదు. ఎలాగోలా ఎక్కడికో అక్కడికి ఇంటిల్లిపాదినీ మోసుకుపోయి ఈ ప్రపంచానికి దూరంగా విసిరేస్తే చాలని వుంది. కాని ప్రపంచం లేని చోటెక్కడ వుందో అది తెలీడం లేదు. ప్రయాణం మొదలుపెట్టి నాలుగు రోజులవుతోంది. ఏ రైలు ఎంతదూరం వెడుతుందో అక్కడికి టిక్కెట్టు తీసుకోవడం ఆ మూలకి వెళ్ళిపోవడం, ఇదే వారి దినచర్య.

వారం  క్రితంవరకూ వాళ్ళ జీవితాల్లో  ఈ భయం లేదు . ముకుందరావు ధైర్యంగా తలెతుకునే రోడ్లమీదే తిరిగాడు. సుందరమ్మ సందడిగా చుట్టుపక్కల అందరితో మాట్లాడుతూనే వుంది.  కూతుళ్ళిద్దరూ  ఆడుతూ పాడుతూ  స్కూలుకి వెళ్ళి వస్తూనే వున్నారు. పెళ్ళయి దూరంగా కాపురం చేసుకుంటున్న పెద్ద కూతురు అత్తింటిపోరు గురించి అప్పుడప్పుడు  ఫోన్లు చేస్తూనే వుంది. ఒకే ఒక వార్త వాళ్ళ జీవితాన్ని తలక్రిందులు చేసింది. అవాళ ఉన్నట్టుండి  వార్తలమధ్య పట్నలో చదువుతున్న వాళ్ళ పుత్రరత్నం మోహన్ కుమార్  కనిపించాడు. ఆశ్చర్యంతో  అందరూ టీ.వి ముందు మూగిపోయారు. ఏమిటా వార్త..? ఎవరో అమ్మాయివెంట పడుతున్నట్టు, చంపుతానని బెదిరిస్తున్నట్టు వుంది. మీడియా ఎదుటికి ఈడ్చుకెడుతున్న పోలీసుల చేతుల్లో జేబురుమాలు కప్పుకున్న పుత్రరత్నాన్ని దిగ్భ్రాంతితో గుర్తు పట్టారు. వెంటనే పక్కింటి ఆవిడ వచ్చేసింది. ఇదిగో మీవాడేం చేశాడో  విన్నారా?..అంటూ,  ఆ తర్వాత వెనకింటి ఆవిడ, ఆ తర్వాత కాలనీ సెక్రటరీ, అందరూ ఏదో రకంగా రక్తం విరిచేసి వెళ్ళారు..నిట్టనిలువుగా చితి అంటించిన శవంలా పొగ చూరింది ముకుందరావు మొహం.. ఇంటి తలుపులు బిగించేసింది సుందరమ్మ.  కాలేజీకి పరిగెత్తుకు వెళ్ళి ఫోలీసుల కాళ్ళావేళ్ళా పడి, ప్రిన్సిపాల్ కాళ్ళా వేళ్ళా పడి బెయిలు అడుక్కుని కొడుక్కి  నయానా భయానా బుద్ది చెప్పి  వచ్చాడు ముకుందరావు. . దెబ్బల భయం కొద్దీ మోహన్ కొన్నాళ్ళు బానే వున్నా మళ్ళీ ప్రేమ పిశాచి ఆవహించినట్టు ఆ పిల్ల వెంట పడ్డాడు. దేశం నిండా తల్లితండ్రుల్ని ఎదిరించి ఎగిరిపోయిన ప్రేమ సినిమాలే ఆడుతున్నాయి.. అవి తన పిల్లలు చూడకపోతే బావుండనుకున్నాడు. చిన్నపిల్ల సరోజతో బాధలేదు, అదష్టవశాత్తూ దాని బుర్ర ఎదగలేదు. సుమలతా , మోహన్ కుమార్ కవల పిల్లలు. సినిమాల్లో చూపించినంత విడ్డూరంగా అందర్నీ మోసం చేసేటన్ని పోలికలు వాళ్ళ మొహాల్లో గాని స్వభావాల్లో గాని ఎక్కడాలేవు. కొడుకు దూకుడు పిండం, కూతురు నిదానంగా ప్రవహించే  మందాకినిలాంటిది.

సెలవలకోసం ఇంటికొచ్చిన మోహన్ పక్కన జేరి సుందరమ్మ వాపోయింది.  ” ప్రేమ గోల మనకొద్దు  నాన్నా….అమ్మని చెబుతున్నాను విను. అక్క మొహం చూడు. నువ్వు ఈ పని చేసిన దగ్గర్నించి నీ తమ్ముడు పేపర్లోకి ఎక్కాడు చూశావా అని కాల్చుకుతింటున్నారురా. అసలే వాళ్లు రాక్షసులని నీకు తెలుసు. ఇదిగో ఎదుగుతున్న చెల్లెళ్లని చూడ్రా ఒరే, నువ్వు చదువు  మానేసినా ఫరవాలేదు, కూచోపెట్టి పోషించుకుంటాం, అమ్మాయిల వెంటపడద్దు, మా పరువు తియ్యద్దురా. ఇవేం దెబ్బలురా..నిన్ను వాళ్ళింక చంపేస్తారేమోరా….” . కొడుకుని కావలించుకుని చెప్పి చెప్పి బావురుమని ఏడ్చింది సుందరమ్మ. మోహన్ కదల్లేదు, మెదల్లేదు శిలా విగ్రహంలా కూచున్నాడు. రాత్రికి రాత్రి అందర్నీ నిద్దర్లోకి దింపి వెళ్ళిపోయాక గాని వాడు తమకి దూరంగా ఎంత “అమర పేమికుడై” పోయాడో తెలీలేదు .

ఆ వెళ్ళటం వెళ్ళటం వారం క్రితమే కేసు మళ్ళీ ఫైలు అయినట్టు  తెల్సింది. ఫోలీసులు మోహన్ వొళ్లు హూనాహూనం చేశారు. ఒక్కగానొక్క మగబిడ్డ కావడంతో పాలు  వెన్నలతో పెంచుకున్న సుందరమ్మ. వాడికి పట్టిన దుస్థితి చూసి మూర్చపోయింది.. మళ్ళీ బెయిలు తేవడానికి ముకుందరావుకి మొహమే కాదు పలుకుబడి కూడా చాలలేదు. . కడుపుతీపి కొద్దీ సుందరమ్మ దూరపు బంధువుల్లో వున్న లాయర్ల చుట్టు తిరిగి లేదనిపించుకుంది.. జైలు నించి కూడా వాడు సరాసరి ఇంటికి రాలేదు. హాస్టలులో వున్న బట్టలూ అవీ తెచ్చుకుంటానన్నాడు. ముకుందరావు అనుమానిస్తూనే వున్నాడు. కన్నతల్లి అయిన నేరానికి సుందరమ్మ నమ్మింది. అనేక సినిమాల్లో చూపించినట్టుగానే ఆ పిల్లకోసం   మోహన్ కాలేజీకి వెళ్ళాడని వేటకొడవలితో ఆ పిల్ల భుజం నరికాడని తెల్సింది.. దుష్టుడు, కీచకుడూ, అనే పేర్లతో  వాడి బొమ్మ  పేపరులో చూస్తుంటే ఏదయినా మింగి ఇంట్లో అంతా ఒకేసారి చచ్చిపోదామని అనుకున్నారు. చచ్చిఫొవడానికి ధైర్యం చాల్లేదు. ఆత్మహత్య మహా పాతకం అని గుర్తు చేసుకున్నారు. ఆ పని పోలీసులు మాత్రం ఎంతో చాకచక్యంగా చేశారు కుక్కని కాల్చినట్టు కొడుకుని కాల్చి చంపారు. అనవసరంగా ఎదురు తిరిగాడని, ఆత్మరక్షణ కోసం కాల్చామని చెప్పుకున్నారు. సానుభూతికి, సహానుభూతికి నోచని దుఖం. వాడ్ని చంపిన రోజు జనం పండగ చేసుకున్నారు. అదేమిటని అడగడానికి లెదు. ఏడవడానికి లేదు. శవాన్ని తెచ్చుకుని పూడ్చిపెట్టడానికి  లేదు.. ఒకే ఒక్క రో్జులో  ఆ కుటుంబానికున్న మానవహక్కులు, ప్రాధమిక హక్కులు అన్నీ.. అన్నీమంట కలిసిపోయాయి. కుటుంబానికి కుటుంబమే  భయంతో ఇంటిచుట్టూ తాళాలు వేసి లోన దాక్కున్నారు. ఆడపిల్లలిద్దర్నీ అసలు బైటికే రానివ్వలేదు. భయం…భయం.. నీడ కనబడితే భయం… వెలుగు పరుచుకుంటే భయం….పరువు భయం, ప్రాణభయం. ప్రజా భయం.. మానభయం…రోజుకి  ఇరవై నాలుగు సార్లు అవే దౄశ్యాలు చూసి చూసి చూసి, ఇంటిల్లిపాదీ గోడకేసి తల బాదుకున్నారు..టి.వి పెట్టె మీద పెద్ద నల్ల దుప్పటి కప్పేసినా సమస్య తీరలేదు, .  వార్తలూ, చర్చలూ పక్కింటి నుంచి వినబడుతున్నాయి.  పట్టుకోండి, నరకండి..చంపండి…కేకలు పెడుతూ ఒకరోజు  జనం ఇల్లు చుట్టుముట్టారు. ఫొలీసులే లేకపోతే నలుగురినీ అందరూ ఎప్పుడో దహనం. చేసేవారే…కొడుకు చేసిన నిర్వాకం ముందు ఇంతకాలమూ వాళ్ళు సంపాయించుకున్న మంచితనం మంటకలిసిపోయింది…. పచారీ దుకాణం వాడు అరువు ఇవ్వడం ఎప్పుడో మానేశాడు.. పాల ప్యాకెట్లూ రావడం లేదు. కరెంట్ కనెక్షను ఎందుకు తీసేశారో తెలీడం లేదు. హింస..పీడన….సొంత ఇంట్లోనే ప్రేతాత్మలాగా రాత్రులు మాత్రమే  సంచరిస్తూ పగలంతా నిశ్సబ్దంగా లోన కూచుని, , చివరికి ఒకానొక జడివానలో, ముసుగులు కప్పుకుని  రైలు ఎక్కేశారు. పారిపోవడానికి వున్న ఒకే ఒక చిన్న ఆర్ధిక వెసులుబాటు ముకుందరావు రైల్వే ఉద్యోగి కావడం, ఎంత దూరం వెళ్ళాలో, ఎన్నాళ్ళు వెళ్ళాలో తెలీదు. నిరంతరం ఒక వాహనంలో దొర్లుకుపోతూ వుండటం ఒక్కటే వాళ్ళకి గత్యంతరంగా వుంది.

రైలు మళ్ళీ ఏదో స్టేషనులో ఆగింది. ప్లాటుఫారం మీంచి చపాతీల వాసన గుప్పుమంటూ వచ్చింది.

“అమ్మా చపాతీ  కావాలి, ” పధ్నాలుగేళ్ళ పిల్ల ముద్దు ముద్దుగా అడిగింది. పెద్ద పిల్లకీ ఆకలేసినట్టుంది. అమ్మ వంక చూసింది. ఆమె దుప్పటిలో కూరుకుపోయి వుంది, నాన్నవంక చూసింది.  కిటికీలోంచి కిందికి దూకేశేలా నేలకేసి చూస్తూ  కూచున్నాడు.  మెల్లిగా లేచి  తన దగ్గరున్న చిన్నపర్సులోంచి అయిదు కాయితం తీసింది. పక్కపెట్టె కిటికీలోంచి తొంగిచూసి, రెండు చపాతీలు కొన్నది. చెల్లికొకటి ఇచ్చి, తను ఒకటి తినడం మొదలు పెట్టింది . ఆకలి వాసనకో ఏమో, వెనక్కి ముకుందరావు కూతురుకేసి చూశాడు. సుమలత  అపరాధిలా గతుక్కుమని, వెంటనే తమాయించుకుని  “చెల్లి అడిగింది నాన్నా”  అంటూ ఒక ముక్క తీసి నాన్నకి అందించింది., . ముకుందరావు తీసుకోలేదు. నువ్వే తిను- అన్నట్టుగా  సైగ చేశాదు.  ఆవురావురుమంటూ దాన్ని  సగానికి మడిచి  నోట్లో పెట్టుకుని ఆప్యాయంగా తినడం మొదలుపెట్టింది. మధ్యాన్నం పన్నెండింటికి వాళ్ళమ్మ ఇచ్చిన పులిహోర తర్వాత ఇదే  తిండి. మనం ఎక్కడి కెడుతున్నాం అనే ప్రశ్న తన భాషలో అడిగి కావలసినన్ని తన్నులు తిని వుంది సరోజ. దాని మొహమంతా జేవురించి వుంది… అదే  ప్రశ్న పెద్ద పిల్ల సుమలత మనసులో కూడా వుంది. అయినా అడగదు. ఆ మాటకొస్తే అమ్మానాన్నలకీ తెలీదని దానికి తెలుసు. . కళ్ళతోనే అన్నీ అర్ధం చేసుకుంటుంది. అందుకే దాన్ని వాళ్ళమ్మా, నాన్నలు బంగారుతల్లీ అంటారు.

సరోజ తన చపాతీ గబగబ తినేసి అక్క ఆకులోకి చూస్తోంది. సుమలత తనవాటాలో  సగం చెల్లికి త్యాగం చేసి , కడుపులో ఖాళీని మచినీళ్ళతో నింపుకుంది. ఎందుకంటే ఆ పిచ్చిది  గొడవ మొదలు పెడితే ఒక పట్టాన వూరుకోదని తెలుసు…రైలు మళ్ళి ఎక్కడో ఆగింది, అయితే అది స్టేషనులా లేదు. దొంగలెవరో గొలుసు లాగి పారిపోవడానికి ఆపినట్టున్నారు. ఆ దొంగలు అదే చోట రోజూ గొలుసు లాగుతారని, రైలు ఆగుతుందని నిశ్చయంగా తెలుసు కామోలు,  లాగుడు బండి లో ఒకడు ఆమ్లెట్లు వేస్తున్నాడు. ముకుందరావు అటే చూస్తున్నాడు. ఒక మనిషి కూచోడానికి సరిపోయేంత పెద్ద పెనమ్మీద గుడ్డు పగలకొట్టి పోశాడు. ఎడంచేత్తో మిర్చి, ఉల్లిముక్కలు చల్లాడు . పెనంతో అట్టుని నాలుగు వైపులా ఎత్తాడు. ఖాళీ అయిన డొల్లని అక్కడున్న  పొదలోకి విసిరాడు. ముకుందరావుకి కొడుకు గుర్తు వచ్చాడు. పోలీసులు తన కొడుకుని కూడా పనికి రాని కోడి గుడ్డు డొల్లని విసిరినట్టు చెట్లలోకి విసిరేశారు కదా…. . అనుకునేసరికి గుండె పగిలిపోయింది. పిల్ల అవకుండానే చిదిమేసిన గుడ్డు వెనకగా కనబడుతున్న మొండిగోడమీద  టెన్తుక్లాసు ప్రేమ సినిమా పోస్టరు ఒకటి సరికొత్తగా అతికించి వుంది.. తప్పుచేశానా..?, పదిహేడేళ్లయినా నిండకుండా బస్తీకి తరిమికొట్టాక ఎన్ని ప్రలోభాలు, మైకాలు, ఎరలు, అరలు..?  నేను వాడి కళ్ళు ఎలాగైనా గాని మూస్తే బావుండేదా..? ఎలా ముయ్యాలి. ఈ హింసకి బీజం ఎక్కడ పడిందని వెతకాలి..? ప్చ్..ఈ  ప్లాట్ ఫారమ్మీద అమ్లెట్ పోసే కుర్రాడిలా తన కొడుకు అవిటివాడయినా గాని  కళ్ళముందుండి బతికిపోయేవాడేమో…భుజమ్మీదున్న తువ్వాలు నోట్ళో కుక్కుకుని ఏడవడం మొదలు పెట్టాడు. భర్త ఏడుపు విని సుందరమ్మ లేచి కిటికీ దగ్గర కూచుంది. ముకుందరావు భార్య లేచిన చోట పడుకుని అటువైపు తిరిగాడు. . ఆకలి తీరిన సరోజ సుమలత వొళ్ళో తల పెట్టుకుని పడుకుంది. సుమలత అమ్మకీ నాన్నకీ దగ్గరగా జరిగింది. ముకుందరావు నిశ్సబ్దంగా కూతురి తలా వీపు నిమురుతున్నాడు. అనుకోకుండా మొన్న కొడుకు చేతిలో తెగిన ఆ పిల్ల భుజం గుర్తొస్తోంది . గుండె పగిలేలా రోదిస్తున్న ఆ పిల్ల తల్లి గుర్తొస్తోంది. ఓదార్చడానికి  చాపిన వందలాది చేతులు గుర్తొస్తున్నాయి. మంత్రి గారి ఓదార్పు గుర్తొస్తోంది. ఇంకో పక్క బుల్లెట్ గాయాలతో చిల్లులు  పడ్డ తన కొడుకు శరీరం కనిపిస్తోంది. ఎందుకిలా జరిగిందని అడగలేని తన నిస్సహాయత గుర్తొస్తోంది. కడుపులో వున్న పుండు పగిలిపోయేటట్టు దుప్పటికింద  కుమిలి పోతున్న సుందరమ్మ కనిపిస్తోంది. తడిసిన దూదిని పిండినట్టు కంటి రెఫ్ఫలు బిగించాడు.. . కంటిలోన ఆడుతున్న బొమ్మలు ఒక్కో బొట్టుగా  జారుతున్నాయి.

రైలు మాత్రం టటా..టట్…టటా..టట్…అనడం లేదు, పట్టుకోండి, కొట్టండి…, చంపండి…అని అరుస్తూ పరిగెడుతోంది.

 

 

- కొండేపూడి నిర్మల

చిత్రం: కాశిరాజు

Download PDF

6 Comments

 • రమాసుందరి says:

  నిర్మల గారు, అద్భుతమైన కధ. “పిల్ల అవకుండానే చిదిమేసిన గుడ్డు వెనకగా కనబడుతున్న మొండిగోడమీద టెన్తుక్లాసు ప్రేమ సినిమా పోస్టరు ఒకటి సరికొత్తగా అతికించి వుంది.”….. ఎన్ని కధలు, కవితలు, ఎన్ని సృజనలు సృష్టించి ఈ హత్యలను బహిర్గితం చేయగలం? ఆడపిల్లల మీద దాడులకు ఏడవాలో, ఈ అమానవీయ హత్యలకు రోదించాలో…. సాహసమైన కధావస్తువుని ఎన్నుకొని సమర్ధవంతంగా రాసారు.

 • లియో says:

  సమస్య రెండు కోణాలు చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.

 • kameswari yaddanapudi says:

  సమస్య లో మరోకోణాన్ని చూపటం బాగుంది. అయితే బుద్ధి ఎదగని పాప పాత్ర ఎందుకు ఉన్నదో తెలియలేదు. తల్లిదండ్రులు ఆడ పిల్లల భద్రత విషయంలో ఎంతగా ఆత్రుత పడతారో చూపటానికా

 • కామాక్షీ దేవి says:

  అవును. బుద్ధి ఎదగని పాప పాత్ర, ఆమెని గురించిన వర్ణన రెండూ ఈ కథకి అనవసరమే.

 • Thirupalu says:

  గ్లోబలైజేషన్‌ మనుషుల్ని ఎంత హీనాతి హినంగా తయారు చేసింది! తన కొడుకు ఎందుకు క్రూరుడుగా తయరౌతున్నాడో తెలియని తల్లి తండ్రులు, ఆడ పిల్లల్ని నీ చాతీ నీచంగా చూసే యువతరం, వారిని రెచ్చగుడుతున్న సినిమా సెక్స్‌, క్రైం సంస్కృతి, బితుకు బితుకుకున బ్రతుకు తున్న యువతులు, డబ్బే ప్రధానమైన ప్రపంచం, అందు కోసం ఉచ్చనీచాలు తెలియని లాభ కుతి. ఇన్ని చేస్తూ పెద్ద హీరోలుగా చెలామని అయ్యే సినీ హీరోలు. మాదక ద్రవ్యాల మాపియాలు డబ్బు తప్ప వారిబ్రతుకు ఎటు పోతుందో వారికే తెలుసుకొనెంత తీరిక లేని బ్రతుకులు, ఇస్టంట్‌ శిక్షలు, అదే న్యాయమంటూ … ఎవరిని ధూషించాలో తెలియనిప్రజలూ? పట్టించు కోని పాలకుకులు . ఓహ్‌ ! సమాజం గతి ఎటూ?
  మంచి కధ.

 • PRASADA MURTY says:

  చాలా మంచి కథ. ఇప్పుడు అవసరమైన కథ. ఎందుకిలా జరిగిందని తల్లిదండ్రులు కుమిలిపోవడం కాదు..వీసాల గురించి, కాసుల గురించి తప్ప మరేమీ పిల్లలకు బోధించలేని..అంత తీరికా అంత కోరికా లేని వారికి ఇంకెలాంటి పిల్లలు పుడతారని పెద్దలు పెద్ద మనసు చేసుకుని ప్రశ్నించుకోవలసిన హెచ్చరిక కూడా ఉంది ఈ కథలో. ఇలాంటివి వందలు వేలుగా రావాలి. ఎప్పుడో శ్రీలక్ష్మిని మనోహర్ చంపేసినప్పుడు ఓ కథ రాశాను. ఆంధ్రభూమిలో వచ్చింది. మళ్ళీ ఈ కథ మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. నిర్మలగారికి అభినందనలు.
  -ప్రసాదమూర్తి.

Leave a Reply to kameswari yaddanapudi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)