ఒక్కసారిగా ఎంత వెన్నెల!

 

    PrasunaRavindran

చీకటి…చీకటి…

మండుటెండలో సైతం

మనసు ఖాళీల్లో నిండిపోయిన చీకటి.

పొద్దు వాలినా

ఒక తేడా తెలీని తనంలోంచి

నిర్నిద్రతో

క్షణాలన్నీ నిస్సహాయంగా మండిపోయాక

నిరాశగా పడున్న

చందమామ పుస్తకంలోంచి

ఏ వన దేవతో దయ తలచి వస్తుంది.

నొప్పి కళ్ళలో

ఓ కలను పిండి

తన చేత్తో కళ్ళు మూస్తుంది.

 poem1

చీకట్లను చేదుకుంటూ

పొగ బండి దూసుకుంటూ పోతుంది.

ఎదురుగా …

ఆకాశమంతా పరుచుకున్న చంద్ర బింబం

ప్రతి దిక్కులోనూ ప్రతిఫలిస్తూ

దోచుకోలేనంత వెన్నెల …

సుడిగుండంలా ఉక్కిరి బిక్కిరి చేసాక

సాయం చెయ్యలేనని

భాష చేతులెత్తేసాక

చేసేందుకేముంటుంది !

కవిత్వీకరించాలనే అలోచనలన్నీ

ఒలిచిపారేసి

ఒక్కసారి

ఆ వెన్నెల సముద్రంలో

నాలోని నన్ను

కడిగేసుకోవడం తప్ప!

      ప్రసూన రవీంద్రన్

Download PDF

5 Comments

  • కోడూరి విజయకుమార్ says:

    పోయెం బాగుందండి!

    ‘చందమామ పుస్తకంలోంచి / ఏ వన దేవతో దయ తలచి వస్తుంది.
    నొప్పి కళ్ళలో ఓ కలను పిండి / తన చేత్తో కళ్ళు మూస్తుంది.’

    ‘ఆకాశమంతా పరుచుకున్న చంద్ర బింబం / ప్రతి దిక్కులోనూ ప్రతిఫలిస్తూ / దోచుకోలేనంత వెన్నెల’

    ‘ఒక్కసారి ఆ వెన్నెల సముద్రంలో / నాలోని నన్ను కడిగేసుకోవడం తప్ప’
    …………….. కొత్త వ్యక్తీకరణలు బావున్నాయి !

  • vijay kumar svk says:

    వహ్ చాలా బాగుంది మీ చీకటి కవిత… :)

  • Mohanatulasi says:

    Beautiful feel….ముగింపు చాలా బాగుంది Pras!

  • Mangu Siva Ram Prasad says:

    “దోచుకోలేనంత వెన్నెల …/ సుడిగుండంలా ఉక్కిరి బిక్కిరి చేసాక/ సాయం చెయ్యలేనని / భాష చేతులెత్తేసాక” ….
    “ఆ వెన్నెల సముద్రంలో / నాలోని నన్ను/ కడిగేసుకోవడం తప్ప!” అని ఒక అద్భుతమైన భావ చిత్రాన్ని మనోనేత్రం ముందు నిలిపారు కవయిత్రి ప్రసూనగారు. వెన్నల తలపుకు మనసుకు మైమరపు కలగడం సహజం. వెన్నల సముద్రంలో ఆత్మప్రక్షాళన ఎంత చక్కటి భావన! స్వచ్చమైన వెన్నెలలా మనసు కూడా నిర్మలంగా ఉంచుకోవాలనే ఆలోచన చాల బాగుంది ప్రసూనగారు. ఒక అనిర్వచనీయమైన భావుకతకు ఒక ఉదాత్మైన రూప కల్పన. శుభ కామన ప్రసూన.

  • Prasuna says:

    కవిత నచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు. :-)

Leave a Reply to Mangu Siva Ram Prasad Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)