కిరాయి సేనగా మారిన క్షత్రియ యోధులు

 

కృష్ణుడు: (అభిమన్యుని మరణానికి శోకిస్తున్న అర్జునునితో)  నీకిది తగునా? శూరులంతా పోయేది ఇలాగే కదా? ఎందుకు దుఃఖిస్తున్నావు? సేనలను సమీకరించుకుని ఆయుధమే జీవనంగా చేసుకోవడం వీరధర్మమని నీకు తెలియదా? శత్రువులను చంపి, భూమిపై కీర్తిని నిలిపి నీ కొడుకు ఒంటరిగా స్వర్గాన్ని అందుకోవడం ప్రియమే తప్ప అప్రియ మెలా అవుతుంది?

                                                                                                                         –తిక్కన

(శ్రీ మదాంధ్ర మహాభారతం, ద్రోణపర్వం, ద్వితీయాశ్వాసం)

***

ఆయుధోపజీవుల విషయంలో అలెగ్జాండర్ తెచ్చుకున్న అపకీర్తి గురించి రాద్దామనుకునేసరికి, ఆయుధోపజీవులు లేదా ఆయుధోపజీవనం అనే మాటలు మహాభారతంలో అనేకచోట్ల వాడిన సంగతి గుర్తొచ్చింది. నోట్సు తిరగేస్తుంటే, ఆ మాటలు వాడిన రెండు సందర్భాలు అప్పటికప్పుడు కనిపించాయి. పైన చెప్పింది మొదటిది.

రెండోది, కర్ణపర్వం, తృతీయాశ్వాసంలో దుర్యోధనుడు తన సేనను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం. శౌర్యమూ, బలమూ కలిగిన మీరంతా యుద్ధభారమంతా ఒక్క కర్ణుని మీదే వదిలేసి, అర్జునుని ఎదుర్కోకపోవడం ఆయుధోపజీవుల పద్ధతేనా అని దుర్యోధనుడు నిష్టుర మాడతాడు.

మహాభారతకాలంనుంచీ, ఇంకా అంతకంటే చాలా ముందునుంచీ ఉన్నఆయుధోపజీవనం; చరిత్రకాలం మీదుగా నేటి కాలం వరకూ నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉండడం ఇక్కడ ప్రధానంగా ఆకర్షించే అంశం. ఆయుధోపజీవనం ఒక  సమస్యగా మారిందని కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. మహాభారతం ఎలాంటిదో చెప్పే ఒక ప్రసిద్ధ పద్యం ఉంది. ధర్మశాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రమనీ, అధ్యాత్మవేత్తలు వేదాంతమనీ, నీతివిచక్షణులు నీతిశాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ, లాక్షణికులు అనేక లక్ష్యాల సమాహారమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహు పురాణాల సముదాయమనీ మహాభారతాన్ని భావిస్తారని ఆ పద్య సారాంశం. వీటన్నిటికీ అదనంగా నేను ఆయుధోపజీవన కోణాన్ని జోడిస్తాను!

మరో అడుగు ముందుకు వేసి ఇంకో మాట కూడా అంటాను…నా ఉద్దేశంలో ఆయుధోపజీవనం సృష్టించిన సమస్యలను, సంక్షోభాలను చిత్రించి చర్చించడమే మహాభారతంలో ఆద్యంతమూ వ్యాపించిన ప్రధానవస్తువు. మహాభారత ప్రారంభమే క్షత్రియులనే ఒక యోధజాతి అంతరించడం గురించీ, క్షత్రియసతులు అందుబాటులో ఉన్న పద్ధతుల్లో ఆ జాతికి ఎలాగో ప్రాణం పోయడం గురించీ చెబుతుంది. అంతేకాదు, క్రమంగా రాజ్యాధికారం క్షత్రియేతరుల చేతుల్లోకి వెళ్లిపోవడం గురించీ చెప్పి ముగుస్తుంది. ఆవిధంగా చూసినప్పుడు, మహాభారతం ఒక జాతి  క్షీణతను చెప్పే విషాదాంత ఇతిహాసం.

ఇలా ఆయుధోపజీవన కోణం నుంచి చేసే మహాభారత పునర్వ్యాఖ్యానం ఒకటి, రెండు వ్యాసాలకు లొంగేది కాదు. కనుక ఆ లోతుల్లోకి ఇప్పుడే వెళ్లకుండా క్లుప్తంగా చెప్పుకుంటే, మహాభారత పాత్రలనేకం ఆయుధోపజీవనాన్ని, అంటే హింసను ఒక సమస్యగా గుర్తిస్తాయి. దానినుంచి బయటపడడానికి పెనుగులాడతాయి. ఆ పెనుగులాటలో అవి ఓటమీ చెందుతాయి. కొన్ని పాత్రలు హింసకు అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా చీలిపోయి చర్చించుకోవడం కనిపిస్తుంది. ఆ చర్చ చాలాచోట్ల హింసా, అహింసావాదాల రూపం తీసుకుంటుంది. పురా కాలంనుంచి చరిత్ర కాలం వైపు సాగుతున్న కొద్దీ  హింసా-అహింసల మధ్య సాగే ఈ అంతర్మథనం ఒక స్పష్టతను తెచ్చుకుంటున్నట్టూ కనిపిస్తుంది. క్రమంగా అది  మహావీరుడు, బుద్ధుడు అనే ఇద్దరు ప్రవక్తలకు; జైన, బౌద్ధాలనే రెండు మతాలకు జన్మనిచ్చింది. అయినాసరే, ఆయుధోజీవనం ఇప్పటికీ ఒక సమస్యగానే ఉందంటే, అజ్ఞాతకాలంలో మొదలైన హింసా-అహింసావాదాల చర్చ నేటికీ అసంపూర్ణంగానే  మిగిలిపోయిందన్నమాట.

Draupadi_s_presented_to_a_parcheesi_game

స్థూలంగా చెప్పుకుంటే; మహాభారతంలో భీముడు, ద్రౌపది, కృష్ణుడు హింసావాదంవైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తారు. చావు ఎప్పటికైనా తప్పదు, చచ్చేలోపల శత్రువుపై పగతీర్చుకోని జన్మ వృథా అనేది భీముని సిద్ధాంతం. ఆ విషయంలో అతనికి ఎలాంటి సందిగ్ధతా లేదు. అలాగే, శత్రువును ఎంత క్రూరంగానైనా చంపడం రాజధర్మమని కృష్ణుని సూత్రీకరణ.  ధర్మరాజుకు అహింస వైపు మొగ్గు ఉన్నా హింసను నివారించలేకపోయిన నిస్సహాయత అతనిది. అర్జునుడి పాత్ర మరింత విలక్షణం. అతను హింస-అహింసల మధ్య సందిగ్ధాన్ని ఎదుర్కొంటాడు. అతనిపై ఇటు ధర్మరాజు ప్రభావమూ, అటు కృష్ణుడి ప్రభావమూ రెండూ ఉంటాయి. తండ్రి, తాతలను, అన్నదమ్ములను ఎలా  చంపనని యుద్ధప్రారంభంలో ప్రశ్నించిన అర్జునుడే; సముచిత హింస అహింసే అవుతుందని ఆ తర్వాత ధర్మరాజుతో వాదిస్తాడు. శత్రువులనుంచి సంపదను గుంజుకుని బంధుమిత్రసహితంగా అనుభవించడమే రాజధర్మమంటాడు. హింస-అహింసల మధ్య సంఘర్షణను ఎదుర్కొన్న మరో పాత్ర అశ్వత్థామ. ‘నేను విప్రకులంలో జన్మించి కూడా దురదృష్టం కొద్దీ రాజోచిత ధర్మాన్ని అనుసరించాను, ఇప్పుడు మధ్యలో విప్రధర్మానికి మళ్ళలేను’ అని ఉపపాండవులను చంపడానికి వెళ్లబోయేముందు కృప, కృతవర్మలతో అంటాడు.

వ్యాస, భీష్మ, ద్రోణులలో కులధర్మం గురించిన పట్టింపు ఎక్కువగా కనిపిస్తుంది. తరాల మధ్య అంతరం కూడా  అందుకు  కారణం కావచ్చు. నువ్విక వానప్రస్థానికి వెడితే మంచిదని ధృతరాష్ట్రునికి వ్యాసుడు సలహా ఇస్తూ, ‘రాజులు యుద్ధంలోనైనా చావాలి, దృఢ సమాధితోనైనా శరీరాన్ని విడిచిపెట్టాలి. అంతే తప్ప, వృద్ధులై రోగంతో మంచం పట్టి చావడం మేలా, ఓ భరతముఖ్యా?’ అంటాడు. ‘భరతముఖ్యా’ అనడంలో ఉద్దేశం, భరతులు ఆయుధోపజీవులు సుమా అని గుర్తుచేయడమే.  భీష్ముడు కూడా అర్జునుడిలానే ఒక దశలో హింస-అహింసల మధ్య సందిగ్ధతను ఎదుర్కొన్నట్టు కనిపిస్తాడు. అయితే, ఇద్దరి సందిగ్ధతా ఒకలాంటివి కావు. భీష్ముడు  హింసపట్ల విసుగు ప్రకటిస్తూనే, రాజుల హింసను కులధర్మంగా నొక్కి చెబుతాడు. ‘పది రోజుల్లో ఉత్తమ క్షత్రియుల నెందరినో వాడి బాణాలతో చంపేశాను. విసుగుపుట్టింది. ఇక ఈ శరీరం విడిచి పెట్టడం మంచి’దని అనుకుంటాడు. ‘పుట్టినప్పటి నుంచీ క్రౌర్యంతో రాజులను చంపడంలోనే నా కాలం గడచిపోయింది, విసుగుపుట్టింది, ఇక నేనీ రాక్షస కృత్యం చేయలే’నని ధర్మరాజుతో అంటాడు. అర్జునుడిలో హింసా వైముఖ్యం వ్యవస్థాగతమైనదైతే, భీష్ముడి వైముఖ్యం వ్యక్తిగతం.  భీష్ముని మాటల్లో హింస పట్ల విచారాన్ని మించి, ఉత్తమ క్షత్రియులు అంతరించిపోతున్నారే నన్న ఆవేదన కనిపిస్తుంది. ఇదే భీష్ముడు అంపశయ్య మీద అంతిమక్షణాలకు ఎదురుచూస్తున్న సమయంలో కూడా ; ‘విప్రులకు అధ్యయనం ఎలాగో, రాజులకు యుద్ధం అలాగ. పాపపరులైనప్పుడు తల్లిదండ్రులను, పుత్రపౌత్రులను, గురువులనైనా సరే; యుద్ధంలో చంపడం ధర్మమే. రాజులకు యుద్ధాన్ని మించిన ఉత్తమధర్మం లే’దని ధర్మరాజుతో అంటాడు. అంతేకాదు, యుద్ధాన్ని యజ్ఞంతో పోల్చుతూ, ‘ఏ యజ్ఞమూ సంగ్రామయజ్ఞానికి సాటిరావు’ అంటాడు.

ఇక ద్రోణుడి విషయానికి వస్తే, అభిమన్యుని వధలో ముఖ్యపాత్ర పోషించిన సైంధవుడు; అర్జునుడు  తనను చంపుతానని చేసిన ప్రతిజ్ఞకు భయపడి ద్రోణాచార్యుని కలసుకున్నప్పుడు, ‘కులధర్మం శిథిలం కాకుండా వెళ్ళి యుద్ధం చేయి’ అని ద్రోణుడు అతనితో అంటాడు. మరి విప్రుడైన ద్రోణుడు కులధర్మం తప్పలేదా అన్న ప్రశ్న రావచ్చు కానీ దానిని వ్యక్తిగత దోషంగానే చూడాలి. తను చేసిన తప్పు పట్ల  స్పృహతోనే అతను సైంధవుడికి ఆ సలహా ఇచ్చి ఉండచ్చు.

ఇంతకీ చరిత్రకందని ఆ కాలంలోనే హింస-అహింసల మధ్య ఇంత అంతర్మథనం, ఇంత చర్చ ఎందుకు సంభవించాయన్నది మరో కీలకమైన ప్రశ్న. దానికి సంక్షిప్తంగా చెప్పుకోదగిన సమాధానం ఏమిటంటే, హింస సామాజిక పురోగమనానికి తీవ్ర ఆటంకంగా మారే పరిస్థితులు ఆనాటికే తోసుకువస్తున్నాయి. రాజకీయార్థిక రూపంలో మౌలికమైన మార్పు వస్తోంది. అన్న పుష్కలత్వాన్ని సాధిస్తూ పెరుగుతున్న జనాభాను ఆదుకుంటున్న అభివృద్ధికర సాధనంగా వ్యవసాయం నానాటికీ బలం పుంజుకుంటోంది. దానికితోడు ఇనుము లభ్యత అటు వ్యవసాయానికి సాయపడుతూనే, విచిత్రంగా ఇటు హింసా విజృంభణకూ దారితీయిస్తోంది. వ్యవసాయవిస్తరణకు గణసమాజమూ, ఆయుధోపజీవనమూ అడ్డంకిగా పరిణమించడమే అందుకు కారణం. చరిత్రకాలానికి వస్తున్న కొద్దీ వ్యవసాయ శక్తులకూ, యథాతథవాదులకూ మధ్య సంఘర్షణ మరింత తీవ్ర రూపం ధరించబోతోంది.

దానిని అలా ఉంచి ప్రస్తుతానికి వచ్చే ముందు, ఒక మాట చెప్పుకోవాలి. భీష్ముడు యుద్ధాన్ని ‘సంగ్రామయజ్ఞం’ అన్నాడు. ఆ మాట నాకు ఇప్పటి ‘జిహాద్’ లా ధ్వనిస్తుంది!

మహాభారతంలో ఆది నుంచి అంతం వరకూ  వ్యాపించిన క్షత్రియ క్షీణత, అధికారచ్యుతి అనే దారాలను పట్టుకుని నేరుగా అలెగ్జాండర్ దగ్గరికి వద్దాం. మనదేశంలో క్రీ. పూ. నాలుగైదు శతాబ్దాలకు చెందిన సాహిత్యం కానీ, ఇతర పత్రాలుకానీ, స్పష్టమైన తేదీ గల శాసనాలు కానీ ఏవీ లభ్యం కావని కోశాంబీ అంటూనే; కాకపోతే ఈ కాలం మనకు మొదటిసారి ఒక కచ్చితమైన చారిత్రక పరిణామం తాలూకు తేదీని నమోదు చేసి అందించిందని అంటాడు. అదే, పంజాబ్ పై అలెగ్జాండర్ చేసిన దాడి(క్రీ. పూ. 327). నాటి గ్రీకు కథనాలలోంచి ఆనాటి భారతీయ దృశ్యాన్ని చరిత్ర అనే కొత్త కళ్ళద్దాలతో వీక్షించే అవకాశాన్ని ఈ దాడి మనకు ఇచ్చిందని కోశాంబీ అంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, పౌరాణిక భారతం అలెగ్జాండర్ రాకతో చారిత్రకదశలోకి అడుగుపెట్టింది.

అప్పటికి పర్షియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న ప్రాంతాలను అలెగ్జాండర్ అవలీలగా జయించుకుంటూ వాటిలో చివరిదైన సింధునదీ ప్రాంతం దాకా వచ్చాడు. సింధుకు పశ్చిమంగా ఉన్న ప్రధాన వర్తక నగరం పుష్కరావతి(నేటి పేరు, చరసద్ద) ముప్పై రోజుల ముట్టడితో చేజిక్కింది. ఆ విజయం కలిగించిన ఉత్సాహంతో అలెగ్జాండర్ సింధు నదిని దాటి గాంధార జనపదంలోకి వచ్చాడు. అక్కడ మరో ప్రసిద్ధ వర్తక, సాంస్కృతిక నగరం ఉంది. అదే, తక్షశిల(ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది). తక్షశిల రాజు అంభి యుద్ధం చేయకుండానే లొంగిపోయి, కప్పం చెల్లించుకున్నాడు. అంతేకాదు, ఇద్దరం పంచుకోవడానికి కావలసినంత ఉంది, ఎందుకొచ్చిన యుద్ధమని కూడా ప్రశ్నించాడు. పైగా, ఇక్కడి నుంచి నీళ్ళు మళ్లించుకునే ఉద్దేశం నీకు లేనప్పుడు మనం యుద్ధం చేయడంలో అర్థమేముందని కూడా అన్నాడు. తక్షశిల రాజు ఇలా నీళ్ళ ప్రస్తావన చేయడం వెనుక చాలా చారిత్రక వారసత్వం ఉంది. నీళ్ళ కోసమే ఈ ప్రాంతంలో ఋగ్వేదకాలం నుంచీ యుద్ధాలు జరిగాయి. దశరాజ యుద్ధం గురించి ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం.

Alexander_the_Great_Founding_Alexandria

అలెగ్జాండర్ కు ఇక్కడి నుంచి నీళ్ళు మళ్లించుకునే ఉద్దేశం ఎలాగూ లేదు. అయితే, అంభిని అతను విడిచిపెట్టడానికి అదొక్కటే కారణం కాదు. సైనిక ప్రాముఖ్యం లేని వర్తక నగరాలు అన్నిటివిషయంలోనూ అతను అదే విధానాన్ని అనుసరించాడు.

ఆ తర్వాతే అలెగ్జాండర్ కు అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. స్వేచ్చా, స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్న గణ నగరాలు ఒకటొకటిగా కుప్పకూలినా,  గణయోధులనుంచి అలెగ్జాండర్ తీవ్ర ప్రతిఘటననే ఎదుర్కోవలసివచ్చింది.  ఉమ్మడి శత్రువును కలసి ఎదుర్కొనే ఐకమత్యం గణయోధులలో లేకపోవచ్చు కానీ, యుద్ధం వాళ్ళకు మంచినీళ్ళ ప్రాయం.

ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యవివరం ఏమిటంటే, ఈ గణయోధులకు ఆనాడు క్షత్రియయోధులు సహకరించారు. వారప్పటికి తమవి కాని నగరాల తరపున కూడా పోరాడే కిరాయిసైనికుల స్థాయికి దిగజారిపోయారు. అలెగ్జాండర్ పాలిట ఈ వృత్తి యోధులే సింహస్వప్నమయ్యారు. ప్లూటార్క్ ఇలా రాస్తాడు:

భారతదేశంలోని ఈ అత్యుత్తమ యోధులు (తక్షశిల సమీపంలోని)కిరాయి సైనికులుగా మారి ఆయా నగరాల రక్షణకు బాధ్యత వహిస్తూ వచ్చారు. ఆ పనిలో సాటిలేని శౌర్య సాహసాలు ప్రదర్శిస్తూ అలెగ్జాండర్ ను ముప్పుతిప్పలు పెట్టారు. ఒక దశలో అలెగ్జాండర్ వీళ్లతో సంధి చేసుకున్నట్టే చేసుకుని; వారు విజయగర్వంతో వెనుదిరిగి వెడుతుంటే వెనకనుంచి  దాడి చేయించి ఊచకోత కోయించాడు. ఈ ఒక్క నమ్మకద్రోహమే అతని యుద్ధ విజయాల కీర్తికి ఒక కళంకంగా మిగిలిపోయింది.

ఈ వృత్తి యోధులను ప్రాణాలతో విడిచిపెడితే, రేపు తీవ్ర ప్రతిఘటన కేంద్రంగా మారతారన్న భయంతోనే అలెగ్జాండర్ విశ్వాసఘాతుకానికి పాల్పడ్డాడు. ఇలా క్షత్రియులు గణనిర్బంధాలనుంచి బయటపడి కిరాయి సైనికులుగా మారి ఏ నగరరక్షణకైనా సిద్ధపడడం, అప్పటికీ కొన్ని ఋగ్వేద గణాలు మిగిలి ఉన్న ఆ ప్రాంతంలో ఒక నూతన పరిణామమని కోశాంబి అంటాడు. గణనిర్బంధాలనుంచి బయటపడడం కూడా ఒక ఆసక్తికరపరిణామం. నిజానికి గణనిర్బంధాలనుంచి క్షత్రియులకన్నా మొదట బయటపడినది  బ్రాహ్మణులు. అందు గురించిన విశేషాలను మరో సందర్భానికి వాయిదా వేస్తే…

ఒక మల్ల విలుకాడు వేసిన బాణం అలెగ్జాండర్ కాయానికి పెను గాయం చేసిందని గతంలో చెప్పుకున్నాం. అలాగే,  వృత్తి యోధులను నమ్మించి వెన్నుపోటు పొడవడం అతని కీర్తికాయానికి తూట్లు పొడిచింది. అదలా ఉంచితే, మహాభారత కాలంనుంచీ క్షీణతనూ, అధికారచ్యుతినీ ఎదుర్కొంటున్న క్షత్రియులు; అలెగ్జాండర్ కాలానికి వచ్చేసరికి కిరాయి సైనికుల స్థాయికి జారిపోవడంలో ఒక ఆశ్చర్యకరమైన  చారిత్రక అవిచ్చిన్నత కనిపిస్తుంది.  అంతేకాదు, అది మహాభారతకాలాన్ని నేరుగా చరిత్ర కాలంలోకి తీసుకొస్తుంది.

 – కల్లూరి భాస్కరం

 

Download PDF

9 Comments

 • Pavan Santhosh Surampudi says:

  మీరెందుకు మీదైన ఈ కోణాలన్నిటిని సృజనాత్మక నవలగానో కథలగానో మలచకూడదు?

  • కల్లూరి భాస్కరం says:

   నిజమే, నవలగానో, కథగానో మలచవచ్చు పవన్ సంతోష్ గారూ…ఆ పని ఇప్పటికే చాలామంది చేశారు కూడా. ముందు ముందు నేను చేయనని చెప్పలేను కానీ; ఒక form లో నవలను, కథను చదవడానికి అలవాటుపడిన పాఠకులు వాటిని చరిత్రగా చదువుతారా, లేక ఆ ప్రక్రియలకు సంబంధించిన ఇతరేతర అంశాలు వాళ్ళ ఊహల్ని డామినేట్ చేస్తాయా అన్న సందేహం నాకుంది. మనం ఏదో ఒక రూపానికి బందీ అయిపోతాం. వైవిధ్యాన్ని త్వరగా గుర్తించం. మహాభారతమే తీసుకోండి, దానిని ఓ పూజాగ్రంథంగా చూడడం నాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. నా ఉద్దేశంలో మహాభారతం మన సామాజిక, రాజకీయ, ఆర్థిక చరిత్ర. అది పూర్తిగా ఒక సెక్యులర్ రచన. మీ ప్రశ్న నిజానికి ఒక పెద్ద చర్చకు వస్తువు కాదగినది. ధన్యవాదాలు.

 • chintalapudivenkateswarlu says:

  మీరు ఉటంకించిన భీష్ముని సంగ్రామ యజ్ఞం మీరన్నట్లు జిహాద్నితలపిస్తుంది. అందుకు కారణం మన దేశం జైన బౌద్ధాల కారణంగా అనుకొండి, హింస పట్ల విరక్తి అనుకొండి శాంతి కాముకమై అహింసను ఆశ్రయించింది. అందువల్ల ఇక్కడ యుద్ధ ప్రీతి తగ్గింది. కాని పాచ్శాత్య దేశాల్లో ఈక్రమమ్ జరగలేదు. ఈ ప్రపంచంలో ఈవ్యత్యసాల వల్లనే ఒక చొట హింస మరొకచోట అహింస మధ్య యుద్ధాలు జరిగి, అవీ మతాల మధ్య కావడంతో ఒక మతం విశ్రుంఘలంగా వ్యాపిస్తే ఎన్నో మతాలు క్షీణదశకు చేరుకున్నాయి. సంగ్రామ యజ్ఞం జిహాద్ కు సంబంధం ఇది అనుకొంటున్నాను భాస్కరం గారు!

  • కల్లూరి భాస్కరం says:

   ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారూ…మన దేశం అహింసను, పాశ్చాత్యదేశాలు హింసను ఆశ్రయించాయన్న మీ అభిప్రాయాన్ని ఎంతమంది ఆమోదిస్తారో చెప్పలేను. మనం గొప్ప అహింసావాదులమేమీ కాదని నా అభిప్రాయం.

 • SriRam says:

  *భీష్ముడు యుద్ధాన్ని ‘సంగ్రామయజ్ఞం’ అన్నాడు. ఆ మాట నాకు ఇప్పటి ‘జిహాద్’ లా ధ్వనిస్తుంది!*

  మీరు భీష్ముడు ‘సంగ్రామయజ్ఞం’అన్న మాటను, జీహాద్ లా ధ్వనిస్తుంది అనటం చాలా ఆశ్చర్యం గా ఉంది. భీష్ముడి విషయానికే వస్తే ఆయన చేసిన యుద్దాలు మతపరమైనవి కావు. ఆ కాలంలో యుద్దాల వెనుక ఐడియాలజి లేదు. పెద్ద యుద్దమనుకొన్న మహాభారత యుద్దం జరిగింది కొన్ని రోజులు మాత్రమే. ఇక ఆయన యుద్దం చేసేటప్పుడు ఎన్నో రకాల షరతులు/నియమాలు పాటించాడు అని మహాభారత యుద్దం గురించి చదివితే తెలుస్తుంది. అందులో ముఖ్యమైనవి స్రీలు, పిల్లలను వధించనని,అలాగే తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు ఉన్నటువంటివారిని వధించనని, ఇలా ఎన్నో నియమాలు ఆయన యుద్దానికి మునుపే చెపుతాడు. యుద్దం లో కూడా ఆచరిస్తాడు. ఇవి మీకు తెలియనివి కాదు కదా!

  జిహాద్ మతానికి సంబంధించినది. దానికి ఒక దేశం, ప్రదేశం అనే ఎల్లలు లేవు. ప్రాంతాన్ని బట్టి మరుతూంట్టుంది. యుద్దానికి నియమాలే లేవు.స్రీలు కూడా యుద్దానికి చేతనైన సహాయం చేస్తారు. అది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. యుద్దం చేసేవాళ్లు శత్రువు అనుకొన్న దేశంలో విద్వంసం సృష్టించటమే ప్రధానం. రద్ది గున్న కూడాళ్లలో/రోడ్లో, పగలు రాత్రి అని వేళాపాళా లేకుండా బాంబులు పెట్టి పేల్చటం. స్రీలు,పురుషులు,పిల్లలు,ముసలి వాళ్లు చివరికి స్వమతస్థులు సైతం చనిపోయినా పరిగణలోకి తీసుకోరు. అదొక దశ, దిశలేని గందరగోళ యుద్దం. అందులో చాలా రకాలు కూడా ఉన్నాయి. ఈ రెండింటికి ఉత్తర దక్షిణాలంత తేడ ఉంది.

  సెక్సువల్ జీహాద్
  http://vihanga.com/?p=10017

  భాస్కరంగారు మీరు రాసే ఈ సీరిస్ ను అనుసరిస్తున్నాను. ఎన్నో నియమాలు పెట్టుకొని యుద్దాలు చేసిన (చివరి యుద్దమైన మహాభారత యుద్దాన్ని ధర్మయుద్దం అని పేర్కొంటారు కూడాను)భీష్ముడు ‘సంగ్రామయజ్ఞం’ అన్నమాటను జిహాద్ తో పోల్చటం సరి అయినది కాదు. కనుక మీరు ఈ వ్యాఖ్యను వ్యాసం నుండి తొలగిస్తే బాగుంట్టుందని అనుకొంటాను. ఈ వ్యాసం చదవటం వెంటనే నాకు స్పురించిన దానిని ఇక్కడ రాశాను. నా వాదనలో లోపాలు ఉంటే మీరు చెప్పవచ్చు.

 • కల్లూరి భాస్కరం says:

  శ్రీ రామ్ గారూ, ధన్యవాదాలు. యుద్ధం గురించిన అంశాలు రాబోయే వ్యాసాల్లో కూడా రావడానికి అవకాశం ఉంది కనుక ఇప్పుడు క్లుప్తంగా మాత్రమే స్పందిస్తాను.
  మతం అనే మాటను ఇప్పుడు మనం ఒక నిర్దిష్ట అర్థంలో వాడుతున్నాం. క్రైస్తవం, ఇస్లాం లాంటి వ్యవస్థీకృత మతాలు వచ్చిన తర్వాతే ఆ మాటకు నిర్దిష్టార్థం ఏర్పడింది. అలాగే, మతాన్నీ, లౌకికాన్నీ వేరు చూసి చూడడం ప్రారంభించాక ఆ నిర్దిష్ట అర్థం మరింత బలపడింది. ఇలా వేరు చేసి చూడడం వెనుక కూడా చాలా చరిత్ర ఉంది.
  పురాకాలానికి వెడితే మతం, లౌకికం అనేవి వేర్వేరుగా లేవు. ప్రతి లౌకిక చర్య వెనుక మతభావన లేదా విశ్వాసం ఉంది. కనుక యుద్ధం అనేది ఒక పవిత్ర చర్య. దానినే క్షత్రియధర్మంగా, కులధర్మంగా భీష్ముడే కాక మహాభారత పాత్రలు అనేకం నొక్కి చెబుతాయి. సంగ్రామయజ్ఞం అనే మాట యుద్ధ పవిత్రతను సూచిస్తుంది. జిహాదీలు కూడా తమ యుద్ధాన్ని పవిత్రయుద్ధమనీ, ధర్మయుద్ధమనే ఆంటారు. సంగ్రామయజ్ఞం అనే మాట జిహాద్ లా ధ్వనిస్తుందన్ననా వ్యాఖ్య యథాలాపంగా అన్నది కాదు. ఆయుధోపజీవనుల గురించిన చర్చలో భాగంగా అన్నాను. ఒకప్పుడు మనదేశంలోనైనా, ఇప్పుడు అప్ఘాన్ మొదలైన చోట్ల అయినా ఆయుధోపజీవనం ఒక మతం, ఒక ధర్మం.
  జిహాదీల విచక్షణా రహితమైన నరమేధం గురించిన మీ అభిప్రాయం నిజమే. అయితే, హిరోషిమా, నాగసాకీ ల మీద అణుబాంబులు వేసినవారు; ఇప్పుడు పాక్-అప్ఘానిస్తాన్ సరిహద్దుల్లో ద్రోన్ దాడులు చేస్తూ పౌరులను కూడా చంపుతున్నవారు జిహాదీలు కారు.
  నేను కేవలం తటస్థ భూమిక నుంచి మాత్రమే పురాచరిత్రను పరిశీలిస్తున్నాను. మంచి, చెడులపై తీర్పు చెప్పడం కానీ; ఏదో ఒక పక్షంవైపునుంచి వ్యాఖ్యానించడం కానీ నేను పెట్టుకోలేదు.

  • SriRam says:

   మీరిచ్చిన సమాధానం చదివిన తరువాత, అసలికి ఈ విషయం పైన ఎవరైనా చర్చించారా అని మిత్రుల ద్వారా ఆరా తీశాను. వాళ్ళు ఈ క్రింది వ్యాసం పంపారు. ఈ వ్యాసాన్ని రాసిన వారు మంచి పండితుడిలాగా ఉన్నారు. చాలా విపులంగా రాశారు. మీకు నచ్చుతుందేమో ఈ టపాను కూడా చదవండి.

   http://koenraadelst.blogspot.in/2013/06/the-difference-between-dharma-yuddha.html

   • కల్లూరి భాస్కరం says:

    లింక్ ఇచ్చినందుకు థాంక్స్ శ్రీరామ్ గారూ…తప్పకుండా చదువుతాను

 • కల్లూరి భాస్కరం says:

  శ్రీ రామ్ గారూ…మీరు సూచించిన వ్యాసం చదివాను. నిజం చెప్పాలంటే అందులో ఉన్న self righteous mindset నన్ను చాలా భయపెట్టింది. జిహాద్ అనేది ఆయుధాలతోనే చేయక్కర్లేదు, ఆలోచనలతో కూడా చేయచ్చనిపించింది. ఈ వ్యాస పరంపర సందర్భంలో ఆ చర్చలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అదీగాక మతాలకు సంబంధించిన చర్చ మీద నాకు ఆసక్తి కూడా లేదు. సాధ్యమైతే ఎప్పుడైనా మనం వ్యక్తిగతంగా అభిప్రాయాలు పంచుకోవలసిందే.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)