‘ఖేల్’ … ఒక ‘యోగిని’ విషాదం ..

ఒక ఫాల్గుణ మాసపు మధ్యాన్నం ..  విశాఖపట్నం దగ్గర..  ఆకుపచ్చని కొండని మేలిముసుగులా ధరించినట్టున్న తలుపులమ్మ లోవ గుడిలో,  పూజారితో “ఈ దేవతకు పులిహోర, రవ్వ లడ్డూ మాత్రమె నైవేద్యం పెడుతున్నారా లేక మాంసం కూడానా?” అని అడిగాను. “తల్లికి మాంసం నైవేద్యవెడతానండి. అమ్మకేది కావాలో అదే పెట్టాలి కదా! బ్రాహ్మణ పూజారిని గవర్నమెంటు పెట్టింది కానండి, ఆయన పూజలు ఆయనవి” అన్నాడాయన.

తిరుపతి  పెద గంగమ్మ గుడిలో పూజారిణి, తరాలుగా దేవతను పూజిస్తున్న తనను ఆ పదవినుంచి తప్పించి, మగ పూజారిని పెట్టటానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వివరిస్తుంది.

ఆదిలాబాద్ దగ్గరలోని ఒక గోండు గ్రామం వెలుపల, చెట్ల మధ్య చిన్న చిన్న హిందూ దేవతల విగ్రహాలను పెట్టారు. “గోండు దేవతల రాజ్యంలో వీళ్ళు ఎక్కడినుంచి వచ్చారా?” అనుకున్నాను.

పాత దేవుళ్ళ ప్రభ తగ్గుతూ, కొత్త దేవుళ్ళు వెలుస్తూ, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకం పూజలూ, పద్ధతులది పైచేయి అవుతుండటం ముక్కోటి దేవుళ్ళూ, ఎంతో వైవిధ్యమూ ఉన్న హిందూ మతంలో సాధారణమే కానీ….

కొన్ని రకాల పూజా పద్ధతులూ, ఆచారాలూ … ముఖ్యంగా స్త్రీ దేవతల విషయంలో చాలా మార్పులు చెందిపోతూ వస్తున్నాయి.  ఏ సమాజంలో స్త్రీ ఎలా ఉండాలని అనుకుంటారో అదే పద్ధతిలో దేవతల మూసలూ తయారు చేసుకుంటుందా ఆ సమాజం?  ఎప్పుడైనా ఒక వింత ఆకర్షణతోనూ, భయంతోనూ,  అడ్డూ అదుపూ లేని స్త్రీ శక్తిని పూజించే రోజులు కొంతకాలంపాటు వచ్చినా, మళ్ళీ వెంటనే తేరుకుని దేవతను అదుపు చేస్తుందా పురుష స్వామ్యం?

*****

*

సబా దివాన్                                             రాహుల్ రాయ్

స్త్రీ శక్తి , పురుష దేవతల ఛాయగా ఎలా మారిపోయిందో, అదే ప్రక్రియ సమాజంలోనూ ఎలా కనిపిస్తోందో వివరించే ఒక డాక్యుమెంటరీ చిత్రం ‘ఖేల్’  ……

 సబా దివాన్, రాహుల్ రాయ్ అనే డాక్యుమెంటరీ చిత్ర దర్శకులు 1994 లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

బ్రాహ్మణ వాద మూసలోని స్త్రీత్వం కంటే భిన్నమైన స్త్రీ తత్వాన్ని వెదికే ఒక అన్వేషణగా ఈ చిత్రం మొదలవుతుంది. స్త్రీ శక్తి ఏ అడ్డంకులూ లేకుండా ప్రవహించే ఒక చోటు కోసం వెదుకులాట.  అచ్చంగా ఆడదానికి మాత్రమే పరిమితమైన ఆది భౌతికత కోసం చూడటం…

మహా యోగినిగా స్త్రీని చూడటం కోసం వారు బుందేల్ ఖండ్ తిరిగి, యోగిని గుడుల గురించి ఆరా తీసారు. బాందా జిల్లా లోని లోఖ్డీ గ్రామం దగ్గర ఒక కొండ మీద ఏ పూజలూ లేని గుడి వారికి కనిపించింది.  పెద్ద వృత్తాకారంలో కనిపించే స్థలంలో ఎటు చూసినా విరిగిపడిన స్త్రీ విగ్రహాలే. వృత్తం.. ఒక సామాన్యత లో ఒక పరిపూర్ణత.  ఆ పరిపూర్ణతను మేము  ఒప్పుకోమంటూ చేసిన విధ్వంసం భీభత్సంగా కనిపిస్తుంది. విరిగిన విగ్రహాల దగ్గర ఇప్పుడు భైరవుడు ఉన్నాడు. చాలా విగ్రహాలను దొంగలు పట్టుకు పోయారు.   అటువంటి వృత్తం మరోచోట కూడా వీరికి శిధిలావస్థలో కనిపించింది. ఆ స్థలంలో ఇంతకుముందు  ఏముండేదని వీరు అడిగితే,   స్థానికులు ఒక అఖాడా (వ్యాయామశాల) అని  చెప్తారు.

(తాంత్రిక విద్యల్లో ఆరితేరిన స్త్రీలు ఒకప్పుడు  ఉండేవారు. హఠయోగాన్ని నేర్చుకున్న వీరిని, యోగినులు అనేవారు. ఇవి రహస్య విద్యలవటం వల్ల, ఆ సమూహంలో ఉండేవారికి తప్ప, బయటి సమాజానికి వారిగురించి పెద్దగా తెలియదు. విచిత్రంగా, అన్నిటా మగవారి పెత్తనమే ఉండే కాలంలో… ఎనిమిది నుంఛీ  పదకొండో శతాబ్దం వరకూ ఉత్తర భారత దేశంలో యోగిని గుడుల నిర్మాణం జరిగింది. పురాణాలలో సప్త మాతృకలు అని చెప్పబడేవారు (బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండి) (చండిక,మహాలక్ష్మి లతో కలిపి వీరిని నవ మాతృకలు అని కూడా అంటారు) దుర్గాదేవి శరీరం నుంచి పుట్టి, దుష్ట శక్తులతో ఆమె చేసిన యుద్ధంలో ఆమెకు సహాయం చేసిన సైన్యం.  ప్రతి మాతృకా ఒక యోగిని. వీరికి మళ్ళీ కొంతమంది యోగినులు అనుయాయులు.  మొత్తంగా వీరి సంఖ్య మాతృకలతో కలిసి, 64, లేదా 81 ఉంటుంది. ఇప్పటికీ ఈ యోగిని గుడులు ఒడిషాలో రెండు, మధ్య ప్రదేశ్ లో రెండు ఉన్నాయి. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాల వారికే సరిగ్గా తెలియదు.)

విరిగిన విగ్రహాల మధ్య ఒక యోగిని. (లోఖ్డీ వద్ద).

ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ లోకి వెళ్తే..  ఇంకా అక్కడి అడవి ప్రాంతాల అన్వేషణలో చిత్ర దర్శకులకు  అరుదైన ‘జోగినుల’ గురించి తెలిసింది.. ఇక ఎన్ని కథలో. ‘కోల్’ తెగవారు నివసించే బుందేల్ ఖండ్ అడవుల్లో ఈ ‘జోగిని’ ఒక గొప్ప కల్పన,. మాయ. అద్భుతం.. నిజం..

పుల్లలూ, ఆకులూ ఏరుకుంటూ ఈ అడవుల్లో ఎక్కువగా తిరిగే ‘కోల్’ స్త్రీలకు జోగినులు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారట. సంస్కత కావ్య వర్ణనలలో యోగినిగా మారిన మహారాణి,  ఒక రాజకుమారుడిని చిలుకగా మార్చి, తనకు కావలసినప్పుడు అతన్ని మనిషి రూపం లోకి తెచ్చి ప్రేమించే యోగిని… వంటివి ఉంటే, అడవుల్లో చిన్న అందమైన బాలునిగా కనిపించి, చేతుల్లోకి తీసుకోగానే మాయమయ్యే జోగిని, చిన్ని బాలుని రూపంలో కనిపించి, చూస్తుండగానే పెద్ద మగవానిలా మారే మాయా జోగిని… ‘కోల్’ స్త్రీల సామూహిక అంతచ్చేతనలో సజీవంగా ఉన్నారు. మండు వేసవి మధ్యాన్నాల్లో జోగినులు పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ తమకు కనిపిస్తారని, పక్కింటివాళ్ళ గురించి చెప్పినంత సులువుగా వీరు చెప్తారు ఈ చిత్రంలో.  ఒక మగవాడు నది ఒడ్డున జోగిని మాయలో పడి, తోటివారు పిలుస్తున్నా పట్టించుకోకుండా నిలబడిపోతే, తమ కులదేవత వచ్చి చెంపదెబ్బ కొట్టి, అతన్ని రక్షించిందట.  స్త్రీల మాయాశక్తి గురించిన ఇలాంటి కథలు మనమంతా ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం కదా!

సబా దివాన్ ఈ  ‘కోల్’ స్త్రీలను యోగినుల గురించి అడిగితే తమకు అదేమీ తెలియదని చెప్తారు. వారికి తెలిసిన జోగిని అడవినేలుతుంది.  క్రూర మృగాలను అదుపులో పెడుతుంది.   కలల్లో కనిపిస్తుంది. ఆవహిస్తుంది.

.

 

ఉత్తరప్రదేశ్ లో మాయమై, ఈ మధ్యనే ఫ్రాన్స్ నుంచి మన దేశానికి తిరిగి వచ్చిన పదవ శతాబ్దపు యోగిని విగ్రహం.

వృత్తాకారపు యోగిని గుడుల్లోని మాయ, అడవుల్లో తిరిగే ఈ జోగినీ మాయ ఒకటేనా? తాంత్రిక యోగిని, అడవి తెగల్లోని జోగిని ఒకటే ఎందుకు కాకూడదు? సప్త మాతృకల వలె జోగినులనూ ఏడుగురు అక్క చెల్లెళ్లుగా చెప్తున్నారు.

కాళిదాసు, భవభూతి వర్ణించిన  మహా యోగినుల జాడలు ఎక్కడ? ఈ అడవుల్లోనా? స్థల, కాల, సంస్కృతులనూ, కులాన్నీ, వర్గాన్నీ అధిగమించిన సామూహిక జ్ఞాపకాలు ఇవేనా? … ఇదీ సబా దివాన్ ఆలోచన.

‘ఖేల్’ లో ….

రామ్ కలీ, శివ కుమారి ..  అనే ఇద్దరు స్త్రీలు.

రామ్ కలీ .. దేవతకు అంకితమైన స్త్రీ.  పొయ్యి మంట వెలుగులో అలసిన మొహం, చెదిరిన జుట్టుతో నెమ్మదిగా ఎన్నో మాట్లాడుతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు భూస్వామి తనను చెరచబోతే, అతన్ని చంపేసి పోలీస్ స్టేషన్ లో నింపాదిగా ఆ విషయం తెలియచేసిన చరిత్ర ఈమెకు ఉందట.  పుట్టిన మూడు రోజులకే ఈమెను దేవత ఎత్తుకుపోయిందని చెపుతుంది. ఎంత వెదికినా పిల్ల దొరకక, ఆమె తండ్రి అమ్మవారి గుడికి వెళ్లి అడిగితే, దేవత కనిపించి, తాను కాళి నని, ఏడుగురు అక్కచెల్లెళ్ళలో మొదటిదానిననీ చెప్పి, తనకు గుడి కట్టిస్తే ఈ పిల్లను తిరిగి ఇస్తానని చెప్పిందట.  పన్నెండేళ్ళ పాటు ఈ పిల్ల పెళ్ళీ, సంసారం లేకుండా తనకు సేవ చెయ్యాలని చెప్పిందట. ఆ మాట పట్టించుకోకుండా తండ్రి తనకు పెళ్లి చేస్తే,  దేవత అక్కడికి వచ్చి తన అత్తవారింట్లో అందరినీ నాశనం చేసిందని చెప్తుంది. ఊరంతా భయపడే ఒక పురుష శక్తి అడవిలో ఆకులు ఏరుకునేటప్పుడు తనను భయపెట్టాలని చూస్తే, తను ఏ మాత్రం భయపడక అతడిని తన మంత్రాలతో కట్టేసి ఊరికి తెచ్చానని చెప్తుంది.  కష్టపడి వంటలు చేసి, ఇదంతా దేవతకు పెట్టాలనీ, ఆమె సేవ చెయ్యకపోతే తను జబ్బు పడిపోతాననీ అంటుంది.

శివకుమారి .. అడవిలో కట్టెలు కొడుతూ, బక్క పల్చని శరీరంతో, విచారమూ, బతుకు భారమూ కలగలిసి ముఖాన్ని అద్దుకున్నట్టు కనిపిస్తుంది. దేవత ఆవహించి మూడు నెలల పాటు అడవిలోనే ఉండిపోయాననీ, పిల్లలని కూడా తన తోనే ఉంచుకుంటే, దేవత వారికి పళ్ళు సమకూర్చి వారి ఆకలి తీర్చిందనీ చెప్తుంది. దేవత ఆవహించినప్పుడు నెలల తరబడి తిండీ, నీరూ లేకుండా, ముళ్ళూ, రాళ్ళలో తిరిగానని చెప్తుంది. అదంతా ఒక నరకం లాగా ఉండేదని చెప్తుంది. సిగ్గూ, లజ్జా పోయాయంటుంది. ఇప్పుడు దేవత తనను వదలకుండా, తన సేవ కోసమే నువ్వు పుట్టావని అంటుందని చెప్తుంది.

వీళ్ళిద్దరూ దేవి ఆవహించినప్పుడు  జబ్బులు బాగుచేస్తామని చెప్తారు.

రామ్ కలీ, శివకుమారి .. వీరిద్దరూ కలుసుకునే సందర్భం కూడా ఈ చిత్రంలో ఒక చోట వస్తుంది. ఇద్దరు శక్తిమంతులైన స్త్రీలు.. ఇద్దరు న్యురోటిక్ స్త్రీలు.. సమాజపు అడుగుపొర లో బ్రతికే వీళ్ళు .. దేవత సాయంతో మగవారిని ధిక్కరించి, ఆజ్ఞాపించే వీళ్ళు.. కలిసిన సందర్భం అపురూపం. శివకుమారి వణికే చేతిని తన చేతిలోకి తీసుకుని, ఆమె బేలతనాన్నీ, న్యురోసిస్ నంతా పోగొట్టేలా మెత్తగా మాట్లాడుతూ, ఒక తల్లి తన బిడ్డను లాలించినట్టు దగ్గరికి తీసుకుంటుంది రామ్ కలీ.

శివకుమారి                        శివకుమారి, రామ్ కలీ

శాంతి

ఈ చిత్ర దర్శకులతో మాట్లాడటానికే ఇష్టపడని స్త్రీ .. శాంతి. ఒకసారి మాట్లాడటం మొదలు పెట్టాక, ప్రవాహంలా చెప్పుకు పోతుంది.  కొండమీద ఉన్న గుడిలో పూజలూ, గుడి గంటల ధ్వనుల మధ్య ఆమె బాల్యం. ఎప్పుడూ దైవ సన్నిధానమే. పెరిగి పెద్దదౌతున్న కొద్దీ ఆంక్షలు. గుడికి వెళ్ళకుండా ఉండలేని ఆమె యాతన. తనకు బలవంతాన పెళ్లి చేసినా, తను మాత్రం   ఎనిమిదేళ్ళ పాటు  భర్త  నీడ కూడా తనమీద పడనివ్వలేదంటుంది.

 ఇక్కడ కథ మనల్ని బేడా ఘాట్ (మధ్యప్రదేశ్, జబల్పూరు దగ్గర) యోగిని గుడికి తీసుకుపోతుంది.  పూర్ణ వృత్తాన్ని  ఎనభై ఒక్క భాగాలుగా చేసి, విగ్రహాలను ప్రతిష్టించిన యోగిని గుడి.. కొన్ని విగ్రహాలకు మృగాల తలలూ, స్త్రీ శరీరాలూ ఉంటాయి. ఆది శక్తి వివిధ రూపాల్లో యధేచ్చగా ప్రవహించిన చోటు.. నేలంతా చదునుగా పరచిన నాప రాళ్ళు. చుట్టూ వేప చెట్లు.  గాలీ, వెలుతురూ నిండి ప్రకాశించే చోటు. యోగిని గుడులను అప్పటి మిగతా గుడుల వాస్తు సంప్రదాయానికి విరుద్ధంగా నిర్మించారు. చుట్టూ వలయంగా విగ్రహాలు. మధ్యలో ఖాళీ స్థలం. ఇదీ యోగిని ఆలయ నిర్మాణ శైలి. తాంత్రిక ఆరాధనా వ్యవస్థకు గొప్ప చిహ్నం.

బేడా ఘాట్

మహా భాగవత పురాణంలోని అంతగా ప్రాచుర్యం లేని ఒక శాక్తేయ వర్ణన ప్రకారం సతి, కాళి నీడగా మారి మంటలు రేపి, తన యోగిని అనుయాయులతో కలిసి, దక్ష యజ్ఞాన్ని భగ్నం చేస్తుందట.  తనను దక్ష యజ్ఞానికి వెళ్ళవద్దని చెప్పిన శంకరునిపై అలిగిన సతి, జుట్టు విరబోసుకుని, దిగంబరురాలై, నాలుక వేలాడేసుకుని, చెమటలతో తడిసి, ప్రచండంగా తన తల్లిని చేరుకుంటుంది. తల్లి ప్రసూతి ఈ దాక్షాయణిని దగ్గరకు తీసుకుని, చెంగుతో ముఖాన్ని తుదిచి, గుండెలకు హత్తుకుంటుంది.  దక్షుడు సతిని నిందిస్తాడు. అప్పుడామె భీభత్సంగా మారి, యోగినులతో కలిసి మదిరా పాన మత్తురాలై నాట్యంచేసి, యజ్ఞాన్ని భంగం చేస్తుంది. శంకరుడు వచ్చాక, ఆ చితి మంటలు మళ్ళీ రగిలి అతడు తన వంతు పూర్తి చేస్తాడట.  బేడా ఘాట్ యోగిని విగ్రహాలను చిత్రిస్తూ, స్తోత్రం వినిపిస్తూ, మధ్యలో ఈ కథను చెప్తుంది సబా దివాన్.

బేడా ఘాట్ గుడిలో చాలా విగ్రహాలు అంగాలు విరిగి కనిపిస్తాయి.  ఈ ఫిల్మ్ లో, ఆ విగ్రహాలతో అత్తవారింటిలో శాంతి పడిన అవస్తనూ, హింసనూ పోల్చి చూపిస్తుంటే, ఆ అణచివేత మనల్ని ఒక తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తుంది. తన వంటిలో ఏ భాగాన్నీ వదలకుండా ఎలా కొట్టి హింసించారో ఆమె చెప్తుంటే, చేతులూ, కాళ్ళూ, స్తనాలూ విరిగిన విగ్రహాలు కనిపిస్తూ ఎంతో బాధిస్తాయి.  యుగాలుగా స్త్రీ శక్తిని, మార్మికతనూ చూసి ఆకర్షితులౌతూనే, భయంతో మళ్ళీ దాన్ని అదుపులో పెట్టాలని ప్రయత్నించే పురుషస్వామ్యపు  విశ్వరూపం కళ్ళకు కడుతుంది.

చాలా సేపు బేడా ఘాట్ విగ్రహాలను అర్ధ వృత్తంగానే చిత్రీకరించి, మనల్ని మరో లోకం లోకి తీసుకెళ్తూ, ఒక్క సారిగా ఆ వృత్తపు మధ్య భాగాన్ని చూపిస్తారు.  ఒక షాక్.  ఆ మధ్యలో ఒక శివాలయం. దీన్ని తరువాతి కాలంలో ఎప్పుడు కట్టేసారో !  నిరాఘాటంగా స్త్రీ శక్తి ప్రవహించే చోటుని, ఆ మండలాన్ని ఛేదిస్తూ, సాంప్రదాయక శివాలయం…  ఇక్కడ పార్వతి శివుడి పక్కన అనుయాయి.  ఈ శివాలయ నిర్మాణంతో శక్తి మండలాన్ని విచ్చిన్నం చేసారంటుంది సబా దివాన్.  అలాగే మధ్య ప్రదేశ్ లోని మతౌళి దగ్గర ఇంకో వృత్తాకారపు గుడినీ చిత్రీకరించారు. అక్కడ స్త్రీ విగ్రహాలని తొలగించి, శివ లింగాలను ప్రతిష్టించారు. తాంత్రిక యోగినీ వ్యవస్థ గురించి మనకు తెలియకుండా చేసే ఈ ప్రయత్నాలూ, శాంతి వంటి స్త్రీల స్వేచ్చకు వేసే సంకెళ్ళూ ఒకలాంటివే

.

బేడా ఘాట్ యోగిని విగ్రహం       యోగిని స్థానం లో శివలింగం (మతౌళి)     వృత్తం మధ్య శివుని మంటపం (మతౌళి)

‘కోల్’ తెగ వారు జరుపుకునే నవరాత్రి పండుగలో ఒక రోజు దాక్షాయణి (సతి) తన తల్లిని కలుసుకొనే పండుగ జరుగుతుంది. కానీ ఈ ఉత్సవాల్లో స్త్రీలంతా ముసుగులు వేసుకుని కూర్చుంటే, మగవాళ్ళదే ‘ఖేల్’ అంతా! దేవత  భక్తురాలు శివకుమారి కూడా నిర్వికారంగా చూస్తూ కూర్చుంటుంది.

 

చివరిగా, శాంతి ఇంట్లో ఆమె కూతురు కేశ్ కలీ కనిపిస్తుంది.  అత్తవారింటి నుంచి వచ్చేసింది ఈమె.  వాళ్ళింట్లో అత్త తనను సరిగా పని చేయటం లేదని తిడుతూ, కొడుతూ ఉంటుందట. ఇక తను తల్లి దగ్గరే ఉంటానంటుంది.  ‘ఈ పిల్లను అత్త ఇంటికి పంపవా?’ అని శాంతిని అడిగితే, ‘తనకు ఇష్టమైతే వెళుతుంది. లేదా ఇక్కడే ఉంటుంది’ అని చెప్తుంది. తాను అనుభవించిన బాధ తన బిడ్డకు వద్దనుకొనే తల్లి మనసు శాంతిది. ఈ ‘సతి’ తన తల్లి దగ్గర ఊరట పొందుతోంది.

సతీ దేవి తన తల్లి దగ్గర చేరటం, శివకుమారి రామ్ కలీ దగ్గర ఊరట పొందటం, కేశ్ కలీ  తన తల్లి శాంతి దగ్గర ఉండిపోవటం… ఆడదాన్ని ఆడదే అర్ధం చేసుకోగలదనే భావాన్నీ, బిడ్డలను లాలించే దేవత కారుణ్యాన్నీ  సూచిస్తుంది. కథా చిత్రం కాకుండా ఒక డాక్యుమెంటరీ చిత్రంలో ఇంత హృద్యంగా ఇది చెప్పటానికి కుదరటం అనేది ఈ చిత్ర దర్శకులకు దొరికిన అరుదైన అవకాశం.

శుభా ముద్గల్ సంగీతం, గానం..  ముఖ్యంగా అడవుల్లో జోగినుల మార్మికతను మనమూ అనుభూతి చెందేలా తీసిన కొన్ని షాట్లు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. యోగిని గుడుల చిత్రీకరణ సరేసరి.

మనకు కలిగే  బాధ,  యుగాలుగా   స్త్రీలందరికీ

కేవలం యోగిని ఆరాధనా వ్యవస్థ గురించే అయివుంటే ఈ ఫిల్మ్ ఒక సంస్కృతిని మాత్రమె వివరించే డాక్యుమెంటరీ అయివుండేది. ఇది కల్పిత సినిమా కథా కాదు. ఇందులోని స్త్రీలు పాత్రలూ కావు.  ఒక anthropological/ ethnographic  డాక్యుమెంటరీలో రక్త మాంసాలతో అదే ప్రదేశంలో తిరుగాడే ఒక తెగ స్త్రీలూ, వారి భిన్నత్వం, తెగువ, మార్మికత, పేదరికం, బాధలు.. అన్నీ కలిపి చూస్తున్నప్పుడు

చెందిన సామూహిక అస్తిత్వ వేదన.

 

****

హిందూ సమాజంలో, పంటలనూ, బిడ్డలనూ కాపాడుతూ వుండే గ్రామదేవతలకున్న ఒక ప్రత్యేక స్థానం కొన్నాళ్ళకు అంతరించిపోతుందేమో అని అనుమానం వచ్చేంతగా బ్రాహ్మణీకరణ జరుగుతోంది. జాతరలు చేసి, బలులు ఇచ్చి, ఊరంతా సంబరాలు జరుపుకోవటం అనేది, సామూహికంగా స్త్రీ శక్తిని ఆరాధించే ఒక తంతు.  ఆదిమ పురుషుడికి స్త్రీత్వం, మాతృత్వం,  అద్భుతాల్లా కనిపించేయి. వ్యావసాయిక సమాజాల్లో పంటలనిచ్చే భూములనూ, పిల్లలనిచ్చే తల్లులనూ పోల్చి చూసుకుని, స్త్రీని దేవత రూపంలో కొలిచారు. పంటలూ, పిల్లలూ పదిలంగా ఉండాలంటే అమ్మ శక్తిని సంతృప్తి పరచాలని భావించారు. వీరిని పూజించటం లో భయం, భక్తీ .. రెండిటినీ ప్రదర్శించారు.  సాలగ్రామ పూజలు చేసే బ్రాహ్మణులూ కూడా గ్రామ దేవత పూజల్లో పాల్గొనటానికి మినహాయింపు కాదు.  బ్రాహ్మణ స్త్రీలు గ్రామ దేవతకు పెరుగన్నంతో చల్లని నైవేద్యం పెడతారు.  పసుపూ, కుంకం, చీరలూ సమర్పించుకుంటారు. మరి ఇప్పుడు గ్రామాలను మొత్తంగా పట్టణాలకు తరలించే పని పెట్టుకున్న ప్రభుత్వాలు మనవి. అదే అభివృద్ధి అంటున్నారు. ఈ వెల్లువలో కొట్టుకుపోతున్నవి ఊళ్ళలోని వృత్తులూ, వ్యవసాయమే కాదు. ఒక సంస్కృతి కూడా.

స్త్రీల శరీరాలే కాదు వారి గర్భాశయాలు కూడా అంగట్లో అద్దెకు దొరుకుతున్న ఈ రోజుల్లో స్త్రీ శక్తికి విలువేముంది? ఉగ్ర రూప గ్రామ దేవతలు కూడా సాత్విక వైష్ణవ అమ్మవార్లయిపోతున్నారు.  అన్ని రకాల దేవతల వైవిధ్యం నశించి, వారంతా సంస్కృత మంత్రాలూ, రాముడూ, సీతా, ఆంజనేయుడూ… వీటిలో హింద్వైక్యం చెందుతున్నారు. ఉగ్ర, ధైర్య, స్థైర్య, కారుణ్య రూపాలలో ఊరినీ, బిడ్డలనూ, పంటలనూ కాపాడే అమ్మ శక్తిని రాను రానూ సాత్వికతకు మాత్రమే ప్రతీకగా ఉండే ఒక నమూనాగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  కొన్నాళ్ళకు కలకత్తా కాళి కూడా రూపం మారి, సీత లాగా ముసుగు వేసుకుంటుందేమో!

ఒకపక్క స్త్రీలను పూజిస్తామంటూనే మరో పక్క మానభంగాలూ, ఆడ పిండాల హత్యలూ జరిగి పోతున్న సమాజాల్లో స్త్రీ దేవతల సాత్విక పరిణామం కూడా ఒక ‘ఖేల్’.

lalitha parnandi—  ల.లి.త.

Download PDF

5 Comments

  • Thirupalu says:

    శాక్తేయం మాతృస్వామిక వ్యవస్తకు ప్రతీక ! ఈ పురుషాదిక్య సమాజంలో అమ్మ తల్లికి, ఇతర గ్రామ దేవతలకు నవీన హిందు ఈకరణలో భాగంగా యోగినీ విషాదం చెందక తప్పదు.

  • Vadrevu Ch Veerabhadrudu says:

    లలిత గారి వ్యాసం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆమె భావాలు చదవగానే నాకు In All Her Names: Explorations of The Feminine In Divinity (హార్పర్ సంఫ్రంసిచో, 1991) అనే పుస్తకం గుర్తొచ్చింది. సుప్రసిద్ధ మైథాలజిస్టు జోసెఫ్ కాంప్ బెల్ ప్రేరణతో రాసిన పరిశోధనాత్మక వ్యాసాల సంపుటి అది. దానిలో వారు చెప్పిందేమంటే మానవనాగారికత మెసపొటేమియాతో మొదలుకాలేదనీ అంతకన్నా మహనీయమైన స్త్రీమూర్తి ఆరాధన ప్రపంచమంతా విస్తరించిఉందనేదానికి సాక్ష్యాలు నేడు లభ్యమవుతున్నాయనీ. భారతదేశంలో కూడా సాత్త్విక, రాజసిక, తమాసిక స్త్రీమూర్తి రూపాలు విడివిడిగానూ ఉన్నాయి, వాటన్నటినీ అందంగా అల్లి మాలగా గుచ్చిన లలితాసహస్రనమాలు కూడా ఉన్నాయి. ( ఈ వ్యాస రచయిత్రి పేరు లలిత కావడం విశేషం.) లలితను ‘సవ్యాపసవ్యమార్గ స్థా’ అని పిలవడం గమనించాలి. దేవిరూపాల్ని సాత్వికీకరించడం శిర్డీ సాయినాథుణ్ణి హిందూపద్ధతిలోమాత్రమే పూజించడం ఈ దేశంలో సాధారణంగా జరిగేదే. కాని దేవీమూర్తులు కూడా తమమీద పడ్డ దుమ్ముని విదిలించుకుని తమ స్వస్వరూపాలతో సాక్షాత్కరించడం కూడా ఈ దేశంలో మాత్రమే కాదు, ప్రపమ్చమంతటా కూడా జరుగుతున్నదే.

    • Lalitha P. says:

      వ్యాసం మీకు నచ్చినందుకు సంతోషం. హిందూ మత వైవిధ్యం రక రకాల ఆచారాల్లో కనిపించటం కాకుండా ఒక మోనోలిథిక్ సంస్కృతి వలె తయారు అవుతుండటం బాధిస్తుంది. ‘సవ్యాపసవ్య మార్గ స్థా’ అని లలితాదేవిని గుర్తించారని అన్నారు. శాక్తేయాన్ని, తాంత్రిక విధానాన్ని స్త్రీ దేవతలనుంచి విడదీయలేము కానీ ప్రపంచవ్యాప్తంగానే మన చరిత్రలో స్త్రీల domestication తో పాటు స్త్రీదేవతల domestication కూడా జరుగుతున్నది. దేవీమూర్తులు మీరన్నట్టు దుమ్ము దులుపుకుని మేమున్నామని తెలియచేస్తూనే ఉంటారు.

  • satya says:

    లలిత గారి వ్యాసంచాలా వివరంగాదృశ్య రూపంగా గా వుంది

  • naresh says:

    An insightful article ; i found the subject matter a little scholarly though ! From the arrogation of medieval shaktic temples to the transmogrification of varied forms of mother Shakthi , the tragedy endures….

Leave a Reply to naresh Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)