పుట్టగొడుగు మడి

కె. గీత

కె. గీత

నుదుటి మీదకొక తెల్ల వెంట్రుక

చికాగ్గా-

పండుటాకు కొమ్మను

ఒరుసుకుంటున్నట్లు-

శిశిరం మొదటిసారి

నిర్దయగా తలుపు విరుచుకు పడుతున్నట్లు

నాలో ఎక్కడో పెళపెళా

కొమ్మలు విరిగిపోతున్న చప్పుడు

కొత్త సంవత్సరం వస్తుందంటే

కొత్త బాధేదో నెత్తిన తడుతూన్నట్లుంది

ఎప్పుడు పెద్దవుతామా

అన్న చిన్నప్పటి

ఎదురుచూపు కళ్ల కాయలు

కళ్ల దిగువన వద్దన్నా మొలుస్తున్నాయిపుడు

అదేం విచిత్రమో!

ఎప్పుడూ చెంపలపై వయసు విత్తనాలు

జల్లినట్లు జ్ఞాపకం లేదు

కరిగి కన్నీరయ్యే

కాలాన్ని నిబ్బరంగా మోసిన

మేరు గంభీర భుజాలేనా ఇవి?

ఇప్పుడు నేలవైపు చూస్తున్నాయి?!

girl-before-a-mirror

చిన్నప్పుడే నయం

ముసుగులుండేవి కావు

భయాలుండేవి కావు

కొత్త సంవత్సరపు బాధలుండేవి కావు

అద్దం ముందు నిల్చుంటే

ఇప్పటిలా

మరెవరో కనిపించేవారు కారు

తలమీద ఏముందో తడుముకోవలసిన అవసరం ఉండేది కాదు

జీవితపు రెండో భాగం

నెత్తిన తెల్లగా గుచ్చుకునే ముల్లయ్యి మొదలయ్యింది

ఏం ఎరువు పడుతూందో గానీ

నిద్రపోయి లేచేసరికి కవలలు పుట్టుకొస్తున్నట్లు-

రోజూ పనిగట్టుకుని

కలుపునేరి పారేస్తున్నా

సంవత్సరం గడిచే సరికి తలంతా

పుట్టగొడుగు మడయ్యింది

నుదురు ఎగుడు దిగుడు తిన్నెల ఇసుక ఎడారి అయ్యింది

అయినా నా పిచ్చి గానీ

ప్రవాహం లో నావ వెనక్కి ప్రయాణిస్తుందా!

తలపు పండకున్నా తల పండక మానుతుందా!

తలకు రంగున్నట్లు

మనసుకీ రంగుంటే ఎంత బావుణ్ణు

కాలం గబ గబా

మింగడానికి వస్తున్నా

తెల్లదనాన్ని మళ్లా రంగుల్లో విక్షేపించడానికి

కొన్ని కొత్త జీవిత పట్టకాలు కావాలిప్పుడు

నాణానికి రెండు వైపులూ చూపించే

సరికొత్త కళ్లజోడు కావాలిప్పుడు.

-కె.గీత

Download PDF

13 Comments

  • buchireddy gangula says:

    చాల బాగుంది
    తలకు రంగు ఉన్నట్లు మనుసుకు రంగు — ఎంత గొప్పగా చెప్పారో ???
    —————————
    బుచ్చి రెడ్డి గంగుల

  • Prasuna. says:

    చాలా చాలా బావుంది గీత గారు.

  • kurmanath says:

    చక్కటి కవిత, ఎప్పటి లాగే. గీత గారి కవిత్వం నాకు చాలా ఇష్టం. మన గురించి మనమే రాసుకుంటున్నట్టు, మన వ్యధ, మన సొద మనం ఇంత బాగా చెప్పుకోగలమా అన్నంత బాగా వుంటాయి. ఇది కూడా అలాగే వుంది.
    PS: మొన్ననే మా పాప అంటోంది, నాన్నా జుట్టుకి రంగేసుకోవచ్చు కదా అని. :D
    ఎందుకే, అనడిగితే నవ్వుతోంది. “మంచిగుంటుంది కద, నాన్నా,” అంది.

  • Lalitha P. says:

    ‘తెల్లదనాన్నిమళ్ళా రంగుల్లో విక్షేపించటానికి కొన్ని కొత్త జీవిత పట్టకాలు కావాలి’ – చాలా బాగా రాశారు.

  • amarendra says:

    తలకు రంగు అవసరమేమో కాని మనసుకు రంగు ఎందుకూ? తాజాగా ఉంచుకోగలిగితే అది ఎప్పటికయినా సప్త వర్ణాల హరివిల్లే కదా!

  • తలకు రంగున్నట్లు మనసుకీ రంగుంటే ఎంత బావుణ్ణు .. నిజమే కదా! ఈ వూహే కొత్తగా .. గమ్మత్తుగా. బాగుంది గీత గారూ

  • ఎప్పుడూ చెంపలపై వయసు విత్తనాలు

    జల్లినట్లు జ్ఞాపకం లేదు…

    తెల్లబడుతూ అద్దం ముందు కర్తవ్యాన్ని మేల్కొలిపే జుత్తు మనిషికి వచ్చే మూడో ఉత్తరం అనే వారు మా నాన్నగారు. కలరేసి కప్పెట్టినా దాగని సత్యం ఇది. బాగుంది పుట్టగొడుగు మడి.

  • bhasker koorapati says:

    గీత గారూ,
    మంచి కవిత మీదైన ముద్రతో…
    ‘పాలింకి పోవడానికి మాత్రలున్నట్టు , మనసింకి పోవడానికి మాత్రలుంటే ఎంత బావున్ను’ అన్న పాటిబండ్ల రజని కవితా పాదాలు గుర్తుకొచ్చాయి. గుడ్. ఇలాగే రాయాలి మీరు.
    –భాస్కర్ కూరపాటి.

  • Mangu Siva Ram Prasad says:

    “ప్రవాహం లో నావ వెనక్కి ప్రయాణిస్తుందా!
    తలపు పండకున్నా తల పండక మానుతుందా!”

    జీవన ప్రస్థానానికి చక్కని భాష్యం. కాలం గడియారం ముళ్ళను వెనక్కి తిప్పగలిగితే కళ్ళ కింద నల్ల గీతలు ఏర్పడేవి కావేమో. తలపు మారాకు వేస్తున్నా తల పుట్ట గొడుగు మడి అవుతుంది. శరీరం శిశిర మౌన రాగమైనా మనసు వసంత గానమౌతుంది. మదిలో అనుభూతులు ఆకాశ వీధిలో మేఘ మాలికలైతే మధురోహల మల్లె పూపొదలు ఎలా పరిమళిస్తాయో చెప్తుంది ఈ అనుభూతి కవిత. మంచి భావానికి అక్షర రూపాన్నిచ్చిన గీతగారిని అభినందిస్తూ, మీ సృజనాత్మక లేఖినినుండి ఇలా కవితా మందాకిని జాలువారుతూనే వుండాలని కోరుకుంటూ మీ శ్రేయాభిలాషి .

  • Mohanatulasi says:

    మీ కవితలు, రచనలు చాలా రోజూవారి జరుగుతున్నవాటిల్లా… జీవితానికి దగ్గరగా అనిపిస్తాయి…మీ కవితలు చదవడం మంచి అనుభూతి!

  • cbrao says:

    ***** 5 Likes.

  • కవిత చాలా బాగుంది. అభినందనలు.

  • K.Geeta says:

    నుదుటి మీద పడే తెల్ల వెంట్రుకలు నాచే కవితని రాయిస్తాయని తెలియలేదు అనుభవం లోకి వచ్చేవరకు.
    చిన్నప్పుడంతా ఎప్పుడు పెద్దవ్వుతామా అని ఎదురు చూసిన రోజులు ఇప్పుడు నవ్వు పుట్టిస్తున్నాయి.
    మీ అందరికీ కవిత నచ్చినందుకు పేరు పేరునా ధన్య వాదాలు అనేది చాలా పాత అరిగి పోయిన రికార్డు.
    అయినా పుట్ట గొడుగు మడంత సత్యమైన రికార్డు కాబట్టి మీ అందరికీ పేరు పేరునా ధన్య వాదాలు.
    -గీత

Leave a Reply to Prasuna. Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)