శేషేంద్ర అద్భుత సృష్టి – స్వర్ణోత్సవ కావ్యం ‘ఋతుఘోష’

87648618-seshendrasharma-the

సాత్యకి (శేషేంద్ర కుమారుడు)కి గుర్తుందేమో, తెలుగు సాహిత్య ప్రపంచం మాత్రం ఒక విషయాన్ని మర్చి పోయింది. అదేమంటే ఋతుఘోష కావ్యం పుట్టి 50 సంవత్సరాలు అయిందని. అంటే స్వర్ణోత్సవ సంవత్సరం అన్నమాట. పట్టుమని పది సంవత్సరాలు బతకని కవితలు లేదా కవితా సంకలనాలు రాసి, పైరవీలతో పురస్కారాలు పొందుతున్న కవులూ, వారి సాహితీ జీవిత రజతోత్సవాలు ఇంకా ఇతర ఉత్సవాలు చేసుకుంటున్న కాలం ఇది. కాదు చేయించే సాహిత్య సంస్థలున్న ఈ కాలంలో తెలుగు సాహిత్య ప్రపంచం ఋతుఘోష వంటి కావ్యానికి స్వర్ణోత్సవ ఋతువు వచ్చిందన్న సంగతి మర్చి పోవడంలో ఆశ్చర్యం లేదు. సరే. ఈ ఋతు ఘోష కావ్యాన్ని రాసినవాడేమన్నా మామూలు ఆషామాషీ కవా. అంటే కాదు సాక్షాత్తు గుంటూరు శేషేంద్ర శర్మ నోబెల్ బహుమతి కోసం పేరును ఒక ఎంట్రీగా పంపబడినంతటి గొప్పకవి.

ఈతరం కవులకు అంటే నా ఉద్దేశంలో 30 లేదా నలబై సంవత్సరాల లోపున ఉన్న వారికి, ఒక సాహిత్య జిజ్ఞాసతో వెనక్కు పోయి పెద్దల దగ్గర తెలుసుకుంటేతప్ప, గుంటూరు శేషేంద్ర శర్మ మంచి ప్రౌఢనిర్భర వయఃపరిపాకంలో కవిత్వం రాస్తున్న కాలం తెలియదు. అందుకే శేషేంద్ర వారికి కేవలం వచన కవిగా లేదా సాహిత్య విమర్శకుడుగా మాత్రమే తెలిసి ఉండే అవకాశం ఉంటుంది. శేషేంద్ర ఎంత గొప్ప కవి అంటే నన్నయ కన్నా ప్రాచీన కవి అయిన తెలుగు వారి గోల్డు నిబ్బు విశ్వనాథ సత్యనారాయణ గారే ఆయన పద్యాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. అంతే కాదు, పద్యాన్ని శేషేంద్ర లాగా రాయగలిగిన వారు నేడు ఆంధ్ర దేశంలో పట్టు మని పది మంది అయినా లేరు అని చెప్పారు. అంతే కాదు విశ్వనాథ రాసిన కావ్య పీఠికల్లో రెండు చాలా ఉత్తమోత్తమమైనవి అని మా గురుపరంపరలో ఉన్నతులైనవారు చెప్పేవారు. ఒకటి శేషేంద్ర శర్మ ఋతు ఘోష కావ్యానికి, రెండు వి.వి.యల్. నరసింహారావుగారు రాసిన ఆనంద భిక్షువు కావ్యానికి రాసిన పీఠికలు. ఋతు ఘోష మొదటి సారి 1963లో అచ్చు అయింది. తర్వాత చాలా సార్లు ముద్రించబడింది. ఇటీవలే ఆయన కుమారుడు సాత్యకి తిరిగి ముద్రించాడు. ఒక ప్రౌఢమైన పద్య కావ్యం అదీ ఈ కాలంలో ఇన్ని సార్లు అచ్చు కావడం విశేషమే.

ఋతువులను గురించి కావ్యాగానం చేయడం ఈనాటిది కాదు. అలనాటి వాల్మీకి, కాళిదాసుల దగ్గరనుండి ఈనాటి నారాయణ రెడ్డిగారి ఋతు చక్రం దాకా వస్తూనే ఉంది. ఆచరిత్రలోకి పోయే సందర్భం కాదు  కాబట్టి ఆ చర్చను వదిలేస్తున్నాను.  శేషేంద్ర ఋతు ఘోష కావ్యానికి చాలా ప్రత్యేకతలున్నాయి. అది ఒక అనుపమాన (యునీక్) ఋతు కావ్యం. కవి పద్యరచనలో చూపిన ప్రౌఢిమ మాత్రమే దీనికి ప్రధాన కారణం కాదు. శేషేంద్ర ఎంత గొప్ప కవో అంతటి పండితుడు. సంస్కృతాంధ్రాలలో ఆయనుకున్న పాండిత్యం ఆయన కాలంలో పుట్టిన వారికి ఉండడం చాలా అరుదైన విషయం. ప్రచారంలోనికి రాలేదు. ఆయన కూడా తనను తాను అత్యంత ఆధునికుడుగా చెప్పుకోవడానికి ప్రయత్నించడం వల్ల శేషేంద్ర పద్యరచనకు అందవలసిన గౌరవం అందలేదు. లేకుంటే శేషేంద్ర సంప్రదాయ పద్యరచనలో పద్య ఛందోనిర్మాణ సంవిధానంలో మరొక విశ్వనాథ అయిఉండేవాడు.

ఋతుఘోష కావ్యం ఇంత గొప్పది అని చెప్పడానికి మొదటి కారణం దీనిలో ఎక్కడా కృత్రిమత్వం లేకపోవడం. అంటే కవి ఋతువుల్ని తాను చదువుకున్న ప్రాచీన కావ్యాల అనుభవంతో దాని ప్రభావంతో మరికొన్ని పద్యాలను ఋతువుల గురించి రాయడం లేదా మరికొన్ని కొత్త వర్ణనలు చేయడం. ఇలా కాక ప్రతి ఋతువును ప్రతి ఋతువులో వచ్చిన ప్రకృతి రామణీయకాన్ని తను గొంతునిండా అనుభవించి పుడిసిలించిన పద్యాలు ఇవి. అందుకే ప్రతి పద్యం గుండెని సూటిగా తాకుతుంది. ఇందులో మరీ ఎక్కువ పద్యాలు లేవు. ప్రతి ఋతువుకూ ఇన్ని పద్యాలు రాయలనే నియమాన్ని కూడా కవి పెట్టుకోలేదు. రెండు ఋతువులగురించి అయితే ఆరు పద్యాలే రాశాడు. కాని ప్రతి ప్రకృతి పరిణామాన్ని ఒంటి నిండా గుండె నిండాఅనుభవించి రాసిన పద్యాలు ఇందులో ఉన్నాయి. (వసంత 18, గ్రీష్మ 7, వర్ష 10, శరత్తు 7 పద్యాలు 5 గేయాలు, హేమంతం 6, శిశిరం 6). మొత్తం 59 పద్యాలే ఉన్నాయి. కాని ప్రతి పద్యం ఒక ఆణిముత్యం, మరువలేనిది. వెంటాడే గుణం కలిగింది.

శేషేంద్ర పద్యాలలోని భాష అత్యంత ప్రౌఢంగా ఉంటుంది. అది అలనాటి ప్రాచీన తత్సమ బహుళ కావ్యభాష. ఇలాంటి భాష రాయగలిగిన పండితులు మనకు ఆంధ్ర దేశంలో అప్పటికి చాలా మందిఉన్నారు. కాని శేషేంద్ర వంటి భావనా ప్రతిభ ఉన్నవారు ప్రాచీన పద్య ప్రక్రియలో అత్యంత ఆధునిక భావాలను అనుభూతిని రంగరించిన కవి ఆనాటికి లేడు. నేటికీ వెదికి పట్టుకోవలసిందే లేరనే చెప్పవచ్చు. నేడు పద్యరచనలు ఈ స్థాయిలో చేసే వారు లేరు అని చెప్పడం తెలుగు వారికి అవమానమే కాని అలా చెప్పాలంటే మరికాస్త శోధన చేయాలి. సాంప్రదాయికమైన అలంకారాలతో పద్యాలను నడపడం అందరూ చేయగలిగిన, చేసిన పనే. కాని చంపకమాల, ఉత్పలమాల, మత్తేభం, శార్దూలం, సీస పద్యం, కందం వంటి ఛందాలను రాస్తూ పైగా ఋతువుల్ని గురించి రాస్తూ ఆయా ఋతువుల్లో సామాన్య మానవుడు, పేదవాడు పడే బాధల్ని గురించి రాయడం శేషేంద్ర మాత్రమే సాధించిన చూపిన ప్రతిభ, అంతే కాదు సామాజిక చింతన. వృత్త పద్యాలను రాసేటప్పుడు ఏ కవి అయినా ఆగణాలను తప్పనిసరిగా పాటించవలసిందే ఎందుకంటే అవి అక్షర గణాలు కాబట్టి. కాని కవి ఆ పద్యాన్ని ఏ సమాస చాలనంతో ఏ సృజన శక్తితో నడిపాడుఅన్నది ఆ కవికి ఉన్న స్వీయ ప్రతిభను బట్టి ఉంటుంది. ఇక జాతి ఉపజాతి పద్యాలు రాయడం లో కవికి స్వేచ్ఛ ఉంటుంది. కారణం ఇందులో ఇంద్రగణాలు చంద్ర సూర్య గణాలుంటాయి. ఇవి అక్షర గణాలు కాదు మాత్రాగణాలు అంటే కవి తనకు ఇష్టమైన గణాలు ఎంచుకోని రాయవచ్చు. తను ఏవిధమైన లయ సృష్టించాలనుకుంటే దానికి అనువైన గణాలను ఎంచుకోవచ్చు. అంతే కాదు ప్రత్యేకమైన వాక్య నిర్మాణాన్ని అంటే ఇక్కడ పాదనిర్మాణాలను సృష్డించుకోవచ్చు. ఈ పని శేషేంద్ర కంటే ముందు చాలా మంది చేశారు. ఆధునికుడైన కృష్ణశాస్త్రి కూడా పద్యాలలో గణాలను ప్రత్యేకంగా ఎంచుకొని తను కావాలనుకున్న లయను తెచ్చుకున్నాడు. “ఎలదేటి కెరటాల పడిపోవు విరికన్నె వలపు వోలె” ఈ పాదంలో గణాలు చూడండి అన్నీ సలము అనే గణాలను పాదాలలో వాడాడు. కవి ఇంద్రగణాలు ఆరింటిని వాడుకునే స్వేచ్ఛ ఇక్కడి సీస పద్య రచనలో ఉంది. కాని ఒకే గణాన్ని వాడి ఒక ప్రత్యేకమైన లయను ఈ పాదంలో సాధించాడు కవి. శేషేంద్ర సీస పద్య రచనలో ఈ తరహా పాద నిర్మాణ కళను చూపించి సీస పద్యానికి కొత్త అందాన్ని పట్టుకొచ్చాడు, చూడండి.

దుర్నీక్ష్య ప్రభా ధూర్ధరచ్ఛటలతో

క్షేత్ర జీవనుల శిక్షించినాడు

పటు రోష కషాయ కుటిలాంశు కశలతో

గోగణంబుల చావగొట్టినాడు

ఖరమయూఖ క్రూర ఘన కాండ పటలితో

విహగ జాతుల క్షోభవెట్టినాడు

గ్రీష్మకాలప్రాంశు కింశుక ద్యుతులతో

తరువల్లికల కగ్గి దార్చినాడు

గగన ఘనఘోట ఖుర నిరాఘాటధాటి

నలఘు బ్రహ్మాండంబునలగద్రొక్కి

చటుల దుర్జన రాజ్య శాశనమువోలె

సాగె మార్తాండ చండ ప్రచండ రథము.

 

వివిధ నిమ్నోన్నత వీధులం బరుగెత్తి

వైశాఖలో మేను వాల్చె నొకడు

ద్రాఘిష్ఠ ఘంటాపథమ్ములం దిరుగాడి

బెజవాడ కన్నీరు బెట్టె నొకడు

మధ్యాహ్న పరితప్త మార్గమ్ములంబోయి

గుంటూరులో కుప్పగూలె నొకడు,

కాలాహి కుటిల శృంగాటకమ్ములు జుట్టి

నెల్లూరిలో సొమ్మసిల్లెనొకడు

క్రూర దారిద్ర్య దుర్విధి కారణమున

తన భుజాగ్రమునెక్కు భేతాళ మూర్తి

సర్వకాలాను వర్తి రిక్షా ధరించి

లాగలేకను వేసవికాగాలేక.

పైన రెండు సీస పద్యాలలలో గ్రీష్మఋతువును వర్ణించాడు. ఎండా కాలం ఎంత తీక్షణంగా ఉంటుందో అంత ప్రతిభతో రాశాడు ఈ రెండుపద్యాల్ని మొదటి పద్యంలో ఎండ తీవ్రత ఎలా ఉందో చెప్పడం దాని ప్రభావంతో ఏ జనం ఎలా బాధపడుతున్నారో చెప్పడం చేశాడు. సీసపద్యంలో ఒక్కొ పాదానికి  రెండు భాగాలున్నాయి. వాటిలో మొదటి భాగంలో ఒకరమైన నిర్మాణ రీతిని రెండో దానిలో ఒకరమైన నిర్మాణ రీతిని అంటే రెండు భాగాలు కలిపి ఒక పాదానికి ఒక నిర్మాణ రీతిని పెట్టాడు. నాలుగు పాదాలు ఇలాంటి సమమైన నిర్మాణంతో నిర్మించాడు. అందుకే దీనికి అంతటి చక్కటి లయ అమరింది.

ఒక పాదాన్ని చూద్దాం. 1 దుర్నీక్ష్య ప్రభా ధుర్ధరచ్ఛటలతో 2 క్షేత్ర జీవనుల శిక్షించినాడు ఇవి పాదంలో రెండు భాగాలు ఒకటి సూర్యుడి గుణాన్ని చెబుతుంది రెండోది దాని ప్రభావం వల్ల కలిగిన ప్రజల ఇబ్బంది గురించి చెబుతుంది. కన్నెత్తి చూడడానికి ఏమాత్రం వీలుకాని కాంతితో తీక్షణమైన ఎండతో పొలంలో పనిచేసుకునే వారిని శిక్షించాడు అని దీనికి సులభమైన అర్థం. కాని ఈ నిర్మాణ పద్ధతిని నాలుగు పాదాలలో ఒకే విధంగా చేశాడు. నాలుగు పాదాల నిర్మాణంలో సామ్యం చూడండి ప్రతి పాదం చివరలో ఒక క్రియా పదంతో ముగిసింది. శిక్షించినాడు, చావగొట్టినాడు, క్షోభవెట్టినాడు అగ్గిదార్చినాడు అనేవి పాదాంతంలోని నాలుగు క్రియాపదాలు, అలాగే పాదంలోని మొదటి భాగం ముగింపులు అన్నీ ‘తో’  అనే క్రియా సంబంధాన్ని చెప్పే విభక్తితో ముగిసాయి. ఇది పద్య నిర్మాణంలో చూపిన తనదైన కళ. పొలంలో పనిచేసుకునే పనివారిని శిక్షించాడు, గోగణాలను చావగొట్టాడు, విహగజాతుల్ని క్షోభపెట్టాడు, తరువల్లికలకు అగ్గితార్చాడు అలఘు బ్రహ్మాండాన్ని నలగ దొక్కిన సూర్యుడు ఎలా ఉన్నాడంటే అతని రథం దుర్జన రాజ్య శాసనం లాగా కదిలిందట. ఒక మామూలు పద్యకవి అంటే పద్యం రాయడంమాత్రమే వచ్చిన మామూలు కవి గణాలు కిట్టించి సరిపెట్టి పద్యం వచ్చింది అని చెప్పుకోవచ్చు కాని ఉన్న పద్య నియమానలతోనే ప్రత్యేకమైన నిర్మాణ కళని చూపెట్టడం ఛందస్సులో మంచి ప్రభుత ఉన్న కవి మాత్రమే చేయగలడు. అది శేషేంద్ర చేశాడు.

ఇక పైన చూపిన రెండో సీస పద్యంలో కూడా ఇలాంటి ప్రత్యేకమైన నిర్మాణ కళని చూపెట్టాడు.  ఈ పద్యాన్ని రిక్షాకార్మికులు ఎండా కాలంలో పడే బాధను వర్ణించడానికి అంకితం చేశాడు కవి. ఒక్కో పాదాన్ని గమనిస్తే వీటిలోని నిర్మాణ కళ తెలుస్తుంది. పాదం మొదటి భాగంలో ఒక క్రియాపదంతో ముగుస్తుంది రెండో భాగం పడిన బాధతో ముగుస్తుంది. పరుగెత్తి, తిరుగాడి, పోయి, చుట్టి అనే క్రియాపదాలు ఒక్కో పాదం మొదటి భాగంలో చివరిలో వచ్చి కూర్చున్నాయి. అలాగే మేనువాల్చె, కన్నీరు పెట్టె, కుప్పగూలె, సొమ్మసిల్లె అనే నాలుగు బాధను తెలిపే పదాలు అన్నీ ఒక్కో పాదంలో సరిగ్గా ఒకే చోటికి వచ్చేలాగా పాదాలలో వాక్యనిర్మాణాలు చేశాడు కవి. ఇది పద్యరచనలో అత్యుత్తమ నిర్మాణ కళ. అందుకే ఈ పద్యాన్ని చదివితే అత్యంత రమ్యమైన లయ వినిపిస్తుంది. నెల్లూరు, గుంటూరు, బెడవాడు, విశాఖపట్నం నగరం ఏదైతేనేం ఎండకి రిక్షాకార్మికుడు పడిన బాధ కవి తన బాధగా భావించి వర్ణించాడు. ఇలా ప్రతి ఋతువును వర్ణించిన సందర్భాలలో ఆఋతువు పేదవాడికి ఎంత కష్టాన్ని తెచ్చి పెట్టింది అలాగే సంపన్నుడికి ఎలా సుఖాన్ని అమర్చింది అనే విచక్షణతో ఋతువులను వర్ణించాడు శేషేంద్ర. ఋతువుల ప్రభావాన్ని ఇలా వర్ణించిన కవి అంటే ప్రజల బాధన్ని వర్ణించిన తీరు ఇంకా ఏ కవి చేశాడని వెదకాలి.

ఇక పద్యాలలో ఉన్న భాష అత్యంత ప్రాచీన భాష కాని భావాలు అత్యంత నూతనం, సృజన శక్తి భావశబలత సరికొత్తగా మనసుకు హాహి గొలిపే రీతిలోఉంటాయి. కొన్ని పద్యాలు చూద్దాం.

ఈ ఆకాశము నీ మహాజలధులు న్నీధారుణీ మండలం

బీ యందాల తరుప్రపంచనిచయం బీ విశ్వవైశాల్యమెం

తో యంతస్సుషమా సముల్బణముతో నుఱ్ఱూతలూగించె నా

హా యూహా విహగమ్ము తా నెగిరిపో నాశించె నుత్కంఠతో.

 

ఏ మాకంద తకరు ప్రవాళములనో హేలాగతిం గోకిలా

భామాకంఠము శంఖమై మొరసె శుంభత్ కీర నారీ దళ

శ్యామంబై మెరసెన్ నభంబు, భ్రమర జ్యావల్లి మల్లీ సుమ

శ్రీమీనాంక శరమ్ములం గురిసె వాసిం జైత్రమాసమ్మునన్.

రాసింది శార్దూల పద్యాలు భాష కూడా చాలా ప్రౌఢమైంది కానీ భావం అత్యంత సున్నితమైంది. అంతే కాదు కవి ప్రకృతిలో పరవశించి తన స్వీయభావాన్ని ఆవిష్కరించిన తీరు సరికొత్తగా, ఫ్రెష్ గా కనిపిస్తుందీ పద్యంలో. అంతే కాదు పద్యరచనలో పదాలను వెదికినట్లు ఏ పద్యంలో కనిపించదు ఒక్కో పదం దానంతట అదివచ్చి తనకు సరిపడేగణంలో అదే వచ్చి కూర్చున్నంత స్వతంత్రంగా ఉంటుంది శైలి పై పద్యంలో ఇదే కనిపిస్తుంది. భాషలో అంతటి ధార, భావంలో అంతటి ఆవేగం పై పద్యంలో లాగే అన్నంటిలో కనిపిస్తుంది. చైత్ర మాసాన్ని గురించి చెప్పిన పైని రెండో పద్యాన్ని చూడండి ఎక్కడా నట్టుపడదు ధార. నాలుగు పాదాలలో వాక్యం ఏకధాటిగా తిరిగి వచ్చింది ఇది అసాధారణమైన ప్రతిభ ఏ నన్నయ ఏ పోతన ఏ శ్రీనాథుడు వంటి స్థాయి కవులు మాత్రమే చేయగలిగిన పద్యనిర్మాణ శక్తి ఇది. ఇక భావాలు చూద్దాం.

ఇచ్ఛ ప్రకృతిలో రెక్కవిచ్చెనేమొ, యెడద పురుషునిలో మొగ్గ దొడిగె నేమొ విశ్వమందిర కుడ్యముల్ విరగ గొట్టి మోహకల్లోల వీచిక ముంచి వైచె అని తన అనుభూతిని పలికిస్తాడు కవి. ప్రకృతి పట్ల ఒక మోహ కల్లోల వీచిక తనను ముంచి వేసిందని తాను మునిగిపోయిన రీతిని చెప్పాడు. ఏ అంతర్గత సృష్టి సూత్ర మహిమా హేవాకమో అంటాడు ఒక చోట. పొదంల తోటల బాటలాధరలతో పోలేని కూలీ జనుల్ మదిలో గుందుచు చేలలో దిరిగిరా మధ్యాహ్న కాలంబులన్ అంటాడు మరొక చోట. శరీరమొక కారాగారమై తోచగన్ అని అంటాడు ఒక పద్యం చివరిలో ఆసల్ దీరునె దృష్టిచే, మహిత గాఢాలింగనాయుక్తిచే అని సరికొత్తగా చెబుతాడు మత్తేభ పద్యంలో. ప్రకృతి నంతా ఒక పద్యంలో వర్ణించి చివరిలో ఒక శ్రామికుడు ఇంతటి అందమైన ప్రకృతిలో సాయంత్రం దాకా పనిచేసి ఇంటికి బోయేసరికే చీకటి దిక్కులు పిక్కటిల్లింది అని చెబుతాడు. శ్రామికునికి ఈ అందాల ప్రకృతి ఆనందాన్ని ఇవ్వలేకపోయిందని చీకటే మిగిల్చిందని బాధపడతాడు ఒక పద్యపాదంలో.. దూరగ్రహాంతరాగతవినూతన జీవిగ గ్రుమ్మరిల్లి యిల్ సేరగబోవు శ్రామికుడు చీకటి దిక్కుల పిక్కటిల్లగన్ అని రాస్తాడు. ప్రతి పద్యంలో అందం వెనుక ఈ వేదనను చూపుతాడు శేషేంద్ర. ఒక పేద కుటుంబం పడే బాధను ఒకే చోట రెండు పద్యాలలో కూరుస్తాడు. ఇక ఆయన వర్ణించిన ప్రకృతి అందాలు కమనీయం కొన్ని ఇక్కడ గమనిద్దాం.

కనరాదు యామినీ కబరీభరమ్ములో బెడగారు కలికి జాబిల్లి రేక

సికతరీతిగ తమశ్చికురనికరమ్ములో నలతి చుక్కల మోసులలముకొనియె

జిలుగు వెన్నెల చీర చిరిగిపోయినదేమొ కాఱు మబ్బులు మేన గమ్ముకొనియె

యెడదలో నేదేని సుడియుచుండెనొ యేమొ కాకలీ నినదముల్ క్రందుకొనియె

మేను విరిచె నేమె మెల్లగా నిట్టూర్చి

విధురవాయు వీచి విస్తరించె

నాత్మవేదన కొక్క యాకారమై తోచి

నేటి రేయి నన్ను కాటువేసె.

పైది సీస పద్యం కాని ఇందులో సంప్రదాయికమైన అలంకారాలు రాయాలని కవి భావించడు. ప్రతి వర్ణననీ సరికొత్తగా దిద్ది తీర్చాడు కవి. యామిని అంటే రాత్రి కబరీభరం అంటే కొప్పు రాత్రి అనే స్త్రీ కొప్పులో జాబిల్లి రేక కనిపించడం లేదట. తమశ్చికుర నికరం అని అన్నాడు ఇలాంటి సమాసాన్ని ఇంతకు ముందు ఎవరూ సష్టించలేదు. తమస్సు అంటే చీకటి చికురము అంటే వెంట్రుకలు పైన తమశ్చికుర నికరం అనిఅన్నాడు. అంటే వెండ్రుకలు చీకటిలా ఉన్నాయని చెప్పడంకాదు ఆ చీకటి వెంట్రుకల గుంపులా గుబురులా ఉంది అని ఈ సమాసంలో సరికొత్తభావాన్ని సృష్టించాడు కవి. ఇదీ శేషేంద్ర ప్రతిభ. జిలుగు వెన్నెల చీర చిరిగి పోయింది కాబట్టి మేనిమీద కారుమబ్బులు కమ్ముకున్నాయి అన్నాడు. జిలుగు వెన్నెల చీర చినిగి పోయిందేమో అని చెప్పిన కవి ప్రతిభని ఏమని పొగడాలి వాహ్ వాహ్ అని వందసార్లు అనాలి. ఇది అత్యంత నవ్యమైన భావన కాని సంప్రదాయికమైన సీస పద్యంలో రాయగలగడం శేషేంద్ర సాధించిన ఆధునికత. విధుర వాయు వీచి అనడం,  నేటి రేయి ఆత్మవేదన కొక్క ఆకారమై తోచింది అని చెప్పడం అత్యంత నవ్యమైన భావాలు.

ఇక వర్షఋతువను గురించి రాసిన కొన్ని పద్యాలు అత్యంత ప్రౌఢమైనవి గాఢమైన సంస్కృతభాషా పరిజ్ఞానం ఉంటే తప్ప అర్థం కావు. కాని భావాలు అంత్యంత నవ్యం. ప్రకృతి అందాలను ఇంత వర్ణించే కవి పద్యం చివరిలో ఏమంటాడో ఒక చోట చూడండి.

యేమి ధర్మంబు భాగ్యవిహీన దీన

జనులమీదనె దౌర్జన్య చర్యగాని

హేమధామ సముద్దామ సీమలందు

అడుగు వెట్టంగ పర్జన్యుడైన వెఱచు.

అని అంటాడు. పర్జన్యుడు అంటే వర్షాధి దేవతను అదుపులో ఉంచుకునే ఇంద్రుడు కూడా భాగ్యవిహీనులు మీద దౌర్జన్యం చూపిస్తాడు కాని హేమధామ సముద్దామ సీమలలో అంటే కలిగిన వారి బంగారు లోగిళ్ళలో అడుగు పెట్టడానికి ఆయన కూడా భయపడతాడట. నిన్నటి ఫైలిని తుఫాను చేసిన భీభత్సం గుర్తుకు వచ్చేంత నవ్యంగా ఉందీ భావన.

ఇన్ని పద్యాల మధ్యలో నాలుగైదు గేయాలు వాడాడు శేషేంద్ర కొన్ని చూద్దాం.

ముల్లోకములు ఏలు ముద్దు హరిణాంకుడు

విరజాజి తీవలకు విరహిణీ జీవులకు

తరిపి వెన్నెలపాలు తాగించుచున్నాడు

 

ఏగాలికెగసెనో యీ చికిలి తారకలు

అందాల తళుకుతో అప్సరసలకుమల్లె

ఆకాశ రంగానికవతరిస్తున్నాయి.

 

నిర్మాలాకాశంపు నీలాటి రేవులో

పండువెన్నెల నీట పిండి ఆరేసిన

తెలిమబ్బు వలువలు తేలిపోతున్నాయి.

పైభావాలు శేషేంద్ర సృజన శక్తికి మచ్చుతునకలు ముల్లోకములు ఏలే చంద్రుడు విరజాజితీవలకు విరహిణీ జీవులకు తరిపి వెన్నల పాలు తాగిస్తున్నాడంట. వెన్నలను తరిపి పాలు అనిచెప్పడం, నిర్మాలాకాశం అనే నీలాటి రేవులో పండువెన్నెలఅనే నీటిలో పండి ఆరేసిన బట్టలు తెలిమబ్బులు అట అవి తేలి పోతున్నాయట. ఏం చెప్పాలి ఈ భావాల్ని, వాహ్ వాహ్ అంతే. ఇలాంటి మధురమైన వర్ణనలు ప్రతి పాదంలో రంగరించిన అత్యధ్భుత కావ్యం ఋతుఘోష దీన్ని చదవడం అందునా భాషను బాగా అర్థంచేసుకొని చదవడం ఒక అపూర్వమైన, అనుపమానమైన అనుభూతి. ఈ అనుభూతిని ఈ తరం కవులు, పాఠకులు పొందాలి. ఈ నాటి యువతరం కవులు కూడా ఈ ఋతుఘోష కావ్యాన్ని చదివి ఎన్నో నేర్చుకోవచ్చు. అంతే కాదు కవులు అలసత్వాన్ని వదిలిపెట్టాలి. స్నేహించడం, అని ఇంకా రకరకాల కొత్త పదాల్ని కొత్త కవులు ప్రతిభా వంతులు చేస్తున్నారు. నిజమే చేసేటప్పుడు వ్యాకరణం పట్టదు. వ్యాకరణం గురించి మాట్లాడితే మాట్లాడిన వాడు ఛాదస్తుడు. అంతే కాదు శబ్ద స్వరూపం తెలుసుకునే ప్రయత్నం చేయరు. అంటే పుస్తకాలు చదివే బుద్ధి శ్రమపడే లక్షణం అలవరచుకునే వారు తగ్గారు. ఎంత ప్రాచీన భాషలోనైనా ఎంత ప్రాచీన ఛందస్సులోనైనా అత్యంత ఆధునికతని అత్యంత నవ్యమైన సృజన శక్తిని కవి చూపవచ్చు అని చెప్పడానికి ఋతుఘోష కావ్యం మంచి ఉదాహరణ. నేటికవులు దీన్ని చదవాలి శ్రద్ధగా చదవాలి. దీనికి స్వర్ణోత్సవం జరుపుకునే ఈ సంవత్సరంలో మరోసారిదీన్ని ముద్రించాలి. చాలా ఎక్కువ ప్రతులు ఎక్కుమందికి చేరాలి.

పులికొండ సుబ్బాచారి.

subbanna

Download PDF

2 Comments

  • ప్రియ మిత్రులు సుబ్బ్బా చారి గారికి నమస్కారం.
    మీ వ్యాసం బహు హృదయం గా ఉంది. సకాలంలో రుతు ఘోష స్వర్నోస్తవ సందర్భాన్ని సాహితీ జగతు మున్డుచున్చినందుకు మీరు సదా గుర్తొస్తారు మన సారస్వత జగతిలో-
    మీరు సూచించినట్లు త్వరలో కొన్ని ప్రతులు ముద్ద్రించి సభ నిర్వహిద్దము. కావ్యం పయిన సదస్సు / చర్చ గోష్ట్షి సమావేశాపరుడ్డాము.
    భవదీయుడు
    సదా మీ
    సాత్యకి

  • DrPBDVPrasad says:

    హేమంతంబున రెక్కవిప్పిన గులాబీ పూవ్వులాగున్నదే’- మీ వ్యాసం

    ఇంకా చెప్పాల్సింది చాల వుందనే తపన మీలో మిగిలిపోయిందికదూ!
    ఋతుఘోష ప్రకృతి ఇంద్రజాలానికి చేసిన శేషేంద్రజాలం

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)