వీలునామా -18వ భాగం

శారద

శారద

కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

ఎల్సీ పరిస్థితి

ఎల్సీ గురించి జేన్ ఆందోళనపడడంలో విపరీతమేమీ లేదు. నిజానికి జేన్ ఊహించినదానికన్న ఎక్కువగానే ఎల్సీ మానసిక శారీరక ఆరోగ్యాలు దిగజారుతున్నాయి. ధైర్యంగా శ్రీమతి డూన్ దగ్గర కుట్టు పనికి వెళ్తోంది కానీ అక్క తోడు లేని ఆమెని ఒంటరితనం లోపల్నించి తినేస్తూంది.

జేన్ కి కూడా చెల్లెలు లేకపోవడం తో కొంచెం ఒంటరిగా అనిపించిన మాటా నిజమే, కానీ ఫిలిప్స్ ఇంట్లో పిల్లలతో, లిల్లీతో, అప్పుడప్పుడూ వచ్చే బ్రాండన్ తో ఆమెకి బాగా పొద్దు గడిచేది. పైగా అక్కడ ఆస్ట్రేలియానించి ఇంటికి తిరిగొచ్చే స్నేహితులతో ఫిలిప్స్ ఇల్లు చాలా సందడిగా వుండేది. వాళ్ళందర్నీ గమనించడం, వాళ్ళ మాటల్ని విని అర్థం చేసుకోవడం, ఆస్ట్రేలియాలో జీవితాన్ని గురించి తెలుసుకోవడం జేన్ కి భలే కాలక్షేపంగా వుండడంతో చెల్లెలి మీద బెంగ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. జేన్ ఈ సంభాషణల గురించి ఉత్తరాల్లో రాసేది. తనకి అలాటి తెలివైన స్నేహితులు లేనందుకూ, తను రాసే ఉత్తరాలు చాలా నిరాసక్తంగా వున్నందుకూ ఎల్సీ ఎంతో బాధపడేది.

ఇంటికి వచ్చి ఎంత అలసిపోయినా లౌరీ పిల్లలకి అక్క అలవాటు చేసిన క్రమశిక్షణ మరచిపోనివ్వలేదు ఎల్సీ. వాళ్ళని రాత్రి పూట అక్కలాగే కూర్చోబెట్టి చదివించడం, వాళ్ళ పుస్తకాలవీ సరిదిద్దడం చేసేది. కానీ టాం అడిగే చిక్కు ప్రశ్నలకి ఆమె దగ్గర సమాధానాలుండేవి కావు. ఆమె కవిత్వమూ మొత్తానికి మూలపడింది. ఎంత ప్రయత్నించినా ఒక్క పంక్తి కూడా రాయలేకపోయింది చాలా రోజులు.

అక్కతో కలిసి నడిచినప్పుడు ఆహ్లాదంగా, సరదాగా అనిపించిన నడక ఇప్పుడు దుర్భరంగా అనిపిస్తూంది. పొద్దున్నే పెగ్గీ ఇంటినుంచి డూన్ గారి కొట్టుకి నడిచే దారిలో వుండే చిన్న చిన్న ఇళ్ళూ, వాటికి అన్నిటికీ ఒకేలా వుండే రంగులూ, ద్వారాలూ, కిటికీలూ అన్నీ తనని చూసి ఎగతాళి చేస్తూన్నట్టనిపించేవామెకు. స్వతహాగా ఆమె అక్కలా శారీరకంగా, మానసికంగా దృఢమైన మనిషి కాదు. దానికి తోడు ఎడిన్ బరో లో వీచే చల్లటి గాలులూ, ఏదో ఆదరాబాదరాగా తినే తిండీ, కృంగిపోతున్న మనస్సూ అన్నీ ఆమె ఆరోగ్యం మీద దాడి చేసాయి. రోజురోజుకీ ఆమె మొహం మరింతగా పాలిపోతూ, ఆకలి మందగిస్తూ, దగ్గుతో సతమతమవసాగింది.

అయితే ఎంతో ఆత్మాభిమానం కలది కావడంతో కూర్చుని పెగ్గీ సంపాదన తినలేక దర్జీ కోట్లో కష్టపడేది. శ్రీమతి డూన్ కొద్ది రోజుల్లోనే ఎల్సీకిచ్చే జీతాన్ని పెంచింది. ఎల్సీకి సహాయం చేసే ఉద్దేశ్యమేనో మరింకేమిటో కానీ, రెన్నీ గారమ్మాయి ఎలీజా తల్లిని బలవంతం చేసి డూన్ కొట్లోనే తమ బట్టలు కుట్టించుకునేది. ఆమెతో బాటు లారా విల్సన్ కూడా వచ్చి స్వయంగా ఎల్సీ తోటే తమ బట్టలు కుట్టించుకున్నారు. వాళ్ళ ఊరి నుంచీ చాలా మంది స్త్రీలు కేవలం ఎల్సీని చూడడానికి డూన్ దుకాణానికొచ్చి తమ బట్టలు కుట్టించుకోవడం మొదలు పెట్టారు. పెరిగిన అమ్మకాలు చూసి డూన్ సంతోషించినా, వెనకటి పరిచయస్తులను ఇలాటి దిగజారిన పరిస్థితులలో చూడడం ఎల్సీకి ప్రాణాంతకంగా వుండేది.

అలాటి రోజుల్లో ఒకరోజు-

veelunama11

ఎలీజా రెన్నీ, లారా విల్సన్ ఇద్దరూ దుకాణానికొచ్చి బట్టలు చూడడం మొదలుపెట్టారు. ఇద్దరూ చాలా సంతోషంగా వెలిగిపోతున్న మొహాలతో హడావిడిగా అనిపించారు. లారా ఫాషన్ పత్రికలు తెరిచి తనకి కావాల్సిన డిజైన్లు ఎన్నిక చేసుకుంటూంటే ఎలీజా ఎల్సీ పక్కకొచ్చి చేరింది. మెల్లిగా గుసగుసగా-

“ఎల్సీ ! అంతా నిశ్చయమైపోయినట్లే! లారాకీ, విలియం డాల్జెల్ కీ పెళ్ళి కుదిరిపోయింది. అదేనోయ్, మీ వూళ్ళో మీ స్నేహితుడూ, మీ అక్కయ్యని ఇష్టపడ్డాడూ, విలియం డాల్జెల్!  ఆ, అతనితోనే! పెళ్ళి కుదిరిపోయింది.  పెళ్ళి బట్టలు కుట్టించడానికి ఇక్కడికే వొస్తుంది చూడు! నన్నడిగితే డూన్ నీకెంతో ఋణ పడి వుండాలి. నువ్వు లేకపోతే మేమసలు ఇలాంటి దుకాణాలవైపే  రాము. అయినా, భలే పెళ్ళిలే! మీ అక్కయ్యకంటే ఎందులో గొప్పని ఈ లారా ని ఆ డాల్జెల్ పెళ్ళాడుతున్నాడో ఆ దేవుడికే ఎరుక! అంతా డబ్బు మహిమ! ఏం చేస్తాం. అయినా లారా డబ్బూ ఆస్తీ అంతా తన పేరునే వుండేలా చూసుకుంటుంది. నాన్నారేకదా ఆమె ఆస్తికి ట్రస్టీ. అంతా పకడ్బందీగా ఏర్పాటు చేయించుకుంది. చూడ్డానికలా వుంది గానీ, మహా గడుసుది. పద్దెనిమిదేళ్ళకే పెళ్ళి కూతుర్నవుతున్నానని మహా మురిసిపోతూందిలే! అయినా డబ్బు కొరకు కాకపోతే దాన్ని పెళ్ళాడేదెవరు! వెధవ నోరూ, అదీనూ! విలియం మాత్రం ఏమన్నా తక్కువ వాడా? ఎంత బాగుంటేనేం, నక్క వినయాలూ వాడూ! నాకైతే విలియం మొహానికి అంటించుకునే ఆ నవ్వూ, అతని అతి వినయాలూ చూస్తూంటే ఒళ్ళు మండుతుంది. తొందరగా ఈ పెళ్ళి అయిపోతే బాగుండు బాబూ! నాకు వీళ్ళ బోరు తప్పుతుంది. ఆ, ఆ, వస్తూన్నా లారా! నచ్చిన డిజైన్లన్నీ చూసుకున్నావా?”

“ఎలీజా! ఇంత ఖరీదైన పెళ్ళి బట్టలు కుట్టడం నావల్లేమవుతుంది?  మీరు మేడం డిఫో దగ్గరకెళ్ళడం మంచిదేమో!” ఎల్సీ మృదువుగా అంది.

“ఏమో బాబూ ! లారాకి నువ్వు ఎన్నిక చేసే రంగులు బాగా నచ్చుతాయట. నాకూ ఆ డిఫో ఎన్నికలకంటే నీ అభిరుచే నచ్చుతుంది!” గారంగా అంది ఎలీజా రెన్నీ.

“అదేమో కానీ, ఇప్పుడు నాకిక్కడ తీరిక లేనంత పని వుంది. పెళ్ళి బట్టలు డిజైను చేసి కుట్టేంత తీరిక లేదు ఎలీజా! అదిగో చూడు, ఎవరో వస్తున్నారు. నేను మీతో తర్వాత మాట్లాడతాను. అసలు మీరు డిఫో దగ్గరకెళ్ళడం మంచిది.”  అక్కణ్ణించి లేచి వెళ్తూ అంది ఎల్సీ. ఆమెకెందుకో లారా విల్సన్ ని చూస్తే ఒళ్ళంతా కారం రాసుకున్నంత మంటగా వుంది. అప్పుడే తలుపు తెరుచుకుని ఒక పెద్దవిడ ఒక పదమూడేళ్ళ అమ్మాయితో లోనకొస్తూంది. వాళ్ళని చూసి ఎల్సీ కంటే ముందు ఎలీజా రెన్నీ లేచి వాళ్ళ ముందుకొచ్చింది.

“అరే! మిస్ థాంసన్! బాగున్నారా? మీ వూర్నించి ఎడిన్ బరో ఎప్పుడొచ్చారు? మా అమ్మ మిమ్మల్ని బాగా తలచుకుంటూంది. తప్పక మా ఇంటికి రావాలి. వూళ్ళో అంతా ఎలా వున్నారు?” చనువుగా ఆవిడని అడిగింది.

“హలో మిస్ రెన్నీ! బాగున్నారా? కొద్ది రోజులు ఎడిన్ బరో లో వుంటాను. తప్పక ఇంటికొచ్చి అమ్మని కలుస్తాను,” మర్యాద పూర్వకంగా అంది మిస్ థాంసన్.

“ఈ అమ్మాయెవరు? మీ మేనకోడలా?”

“అవును ఎలీజా! దీని పేరు గ్రేస్. బాగా చదువుతుంది. వచ్చే వారం ఏదో స్నేహితురాలి పార్టీ వుందిట. దానికోసం ఒక మంచి గౌను కుట్టిద్దామని ఇలా వచ్చాం.”

“అవునా? ఇక్కడ బట్టలు కుట్టరు. ఇక్కడ రంగులూ బట్టలూ ఎన్నిక చేస్తారు. పక్క గదిలో కుట్టించుకోవచ్చు,” ఎలీజా సలహా ఇచ్చింది.

“అలాగా! అయితే నాకూ కొంచెం ఒక టోపీ, షాలూ కావాలి. అవన్నీ ఎన్నిక చేసుకుని గౌను కుట్టించటడానికి తిసికెళ్తా,” అని ఎల్సీ వైపు తిరిగింది మిస్ థాంసన్.

“అన్నట్టు మీరు చిన్న మెల్విల్ అమ్మాయి కదూ? ఆ మధ్య మీ అక్కయ్య జేన్ నన్ను కలవడానికొచ్చింది. ”

“అవునండీ!”

“అదీ సంగతి! ఎక్కడో చూసిన మొహం లాగుందే అనుకున్నాను. మీరిద్దరూ ఇంచుమించు ఒకేలాగున్నారు. మీ అక్కయ్య ఆస్ట్రేలియన్ల ఇంట్లో గవర్నెసు గా చేరిందట కదా? మంచి పని చేసింది. ఆమెని అందరూ మెచ్చుకుంటూంటే భలే సంతోషం వేసిందనుకో! మరి నీ సంగతేంటి? నువ్విక్కడ పని చేస్తున్నావల్లే వుందే! సంతోషం. చిన్నదో పెద్దదో, మనకంటూ ఒక వృత్తి వుండడం మంచిది.”

నవ్వింది ఎల్సీ.

“అది సరే కానీ, నాకు ఒక టోపీ, ఒక షాలూ కొంచెం తయారు చేసి పెడతావా? నాకింతకు ముందు తయారు చేసిన ఆవిడ బలే కొత్త ఫాషన్లతో చేసేది కానీ, ఆ టోపీ నా తల మీద నిలవనే నిలవదు. ఇహ ఎందుకా ఫాషను? కాల్చనా?”

మళ్ళీ నవ్వేసింది ఎల్సీ.

“అలాగే చేస్తాలెండి. మా పెగ్గీ కి చేసినట్టు చేసిస్తా, కొంచెం ఫాషన్ గా ,కొంచెం సౌకర్యంగా వుండేటట్టు చేస్తా, సరేనా?”

“నాకు ఫాషన్ కంటే సౌకర్యం ఎక్కువ ఇష్టం! అది సరే! నువ్వు పెగ్గీ ఇంట్లోనే వుంటున్నావా? తిండి సరిగ్గా తినడంలేదా? ఇంత చిక్కిపోయవ్!”

“పెగ్గీ చాలా మంచిదండీ! అక్కడ నాకేమీ కష్టం లేదు. ఈ మధ్య కొంచెం ఒంట్లో నలతగా వుంది, అంతే. అదే కాకుండా నాకు జేన్ మీద బెంగ ఎక్కువయింది. అన్నట్టు ఫిలిప్స్ గారి సతీమణి నన్ను వాళ్ళింట్లో కొన్ని వారాలు ఉండేలా రమ్మని ఆహ్వానించారు. ఒక సారలా వెళ్ళొస్తే నా ఆరోగ్యం సర్దుకుంటుంది.” ఎల్సీ ధైర్యంగా అంది.

“అది మంచి ఆలోచన. అన్నట్టు మీ బావ, ఫ్రాన్సిస్, ఎస్టేటులో చాలా మార్పులు చేస్తున్నాడు.”

“అవునా? మార్పులతో అందరూ అంగీకరిస్తున్నారా?”

“అందరి సంగతేమోకానీ, నావరకు నాకైతే, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగుండలే. పాలేర్లకు చిన్న చిన్న ఇళ్ళివ్వడం మంచి ఆలోచనే, కానీ, వాళ్ళకి స్వంతంగా భూములు కూడా ఇచ్చేయాలా? అయితే, నేనూ మా పొలంలో పని చేసే పాలేర్లకోసం చిన్న ఇళ్ళు కట్టిద్దామనుకుంటున్నాను.”

“అది సరే కానీ, మిస్ థాంసన్, మీ ఊళ్ళోకి ఒక కొత్త పెళ్ళికూతురు రాబోతున్నట్టు మీకు తెల్సా? అమ్మ మీతో మాట్లాడాలనుకున్నది దాని గురించే, ” మధ్యలో అందుకుంది ఎలీజా రెన్నీ.

“అదేనండీ! లారా విల్సన్ విలియాం డాల్జెల్ ని పెళ్ళాడబోతున్నట్టు మీకింకా తెలియదా?” తనే పొడిగించింది.

“ఓ! అలాగా? వచ్చి మీ అమ్మని కలుస్తాలే. అలాగే ఒకసారి పెగ్గీ వాకర్ ని కూడా చూడాలి,” అంటూ మిస్ థాంసన్ మేన కోడలికి గౌను కొలతలు చెప్పడం కోసం పక్క గదిలోకెళ్ళింది.

లారా పెళ్ళి దగ్గరకొచ్చేసరికి తాను ఈ కొట్టులో కుట్టు పని మానేయగలిగితే బాగుండు అనుకుంది ఎల్సీ. ఆ సాయంత్రం పని ముగించుకొని ఇల్లు చేరేటప్పటికి బ్రాండన్ వచ్చి పెగ్గీతోనూ, తాతగారు థామస్ లౌరీ తోనూ కబుర్లు చెప్తూ కూర్చొని వున్నాడు.

డాక్టరు ఫిలిప్స్ గారు ఎల్సీకి డెర్బీ షైర్ రావడానికి వీలవుతుందేమోనని కనుక్కోమన్నారట. అక్కడ ఒక వారం పది రోజులు చిన్న ఫిలిప్ కుటుంబమూ, జేన్ అందరితో గడిపి, అందరూ కలిసి లండన్ వెళ్ళాలన్న ఆలోచనలో వున్నారు.

అంత తొందరగా అక్కను చూడగలగటం ఎల్సీకి ఎంతగానో నచ్చింది. తనకోసం అంత శ్రమ తీసుకొని ఎడిన్ బరో వచ్చినందుకు బ్రాండన్ కి పదేపదే ధన్యవాదాలు చెప్పింది ఎల్సీ.

(సశేషం)

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)