పుస్తకాల్లో చెదలు…

M_Id_223298_Books_eaten_by_termites_at_Government_Divisional_Library_at_Vishrambaug_wada 

నా పుస్తకాలలోకి చెద పురుగులు ప్రవేశించాయి.

దాదాపు నలభై సంవత్సరాలుగా కూడబెట్టుకుంటున్న పుస్తకాలు.

ఎన్నెన్నో జ్ఞాపకాలూ ఉద్వేగాలూ అనుభవాలూ కన్నీరూ నెత్తురూ కలగలిసిన పుస్తకాలు.

చదివి ఇస్తామని తీసుకుపోయి తిరిగి ఇవ్వని మిత్రులతో తగాదాలు తెచ్చిన పుస్తకాలు. దూరం పెంచిన పుస్తకాలు.

మిత్రులనైతే పుస్తకాలు తిరిగి ఇమ్మని వేధించాను. ఇవ్వకపోతే గొడవపడ్డాను. శత్రువులను చేసుకున్నాను. వందలాది పుస్తకాలు పోగొట్టుకున్నాను. నిజమైన ఆసక్తితో తీసుకుపోయి చదివి, నమ్మకంగా తిరిగి ఇచ్చేవాళ్లతో కూడ ఆ అనుభవంతో కటువుగా మాట్లాడాను. చదివి ఇస్తామని చెప్పి తీసుకుపోయి తిరిగి ఇవ్వనివాళ్లమీద, పరిశోధకులమని చెప్పి పుస్తకాలు ఎత్తుకు పోయినవాళ్ల మీద చాల కోపం తెచ్చుకున్నాను.

పాపం, ఈ చెదల ముందర వాళ్లెంత నయం! పుస్తకాన్ని ఎక్కడో ఒకచోట మిగిల్చారు. నాదగ్గర లేకపోయినా ఆ పుస్తకం ఎక్కడో ఒక అలమరలో భద్రంగానే ఉంది.

మరి ఈ చెదపురుగులను ఏం చేయగలను? లెక్కలేనన్ని పుస్తకాలను నుసిగా, మట్టికుప్పగా, కన్నీటిముద్దగా  మార్చేసిన, ఖండఖండాలుగా విమర్శించి అదృశ్యం చేసిన చెదపురుగులను ఏం చేయగలను? మహావిశ్వమంత పుస్తకాన్ని మటుమాయం చేసిన ఇసుకరేణువంత సన్నని క్రిమిని ఏమనగలను?

నాలుగు ఊళ్లూ, డజను అద్దె ఇళ్లూ, డజన్ల కొద్ది మిత్రులూ వడపోయగా మిగిలిన పుస్తకాలు సొంత ఇంట్లో గోడలకే  షెల్ఫులు పోయించుకుని పెట్టుకున్నాను. ఒక్కవరస పెట్టుకోగలిగితే బాగుండునని ఎంత అనుకున్నా మూడు నాలుగువందల అడుగుల పొడవైన పుస్తకాలు రెండు వరుసలూ మూడు వరుసలూ పెట్టుకోక తప్పలేదు. గోడలకు ఆనుకుని ఉండే వెనుక వరుసలలో ఏ రసాయనిక ప్రక్రియలు జరుగుతున్నాయో తెలియని స్థితిని చేజేతులా తెచ్చిపెట్టుకున్నాను. గోడలలో చెమ్మ పెరిగి చెదలు పుట్టాయి. నాలుగువేల రకాల చెదపురుగులున్నాయట, ఒకరకం చెదపురుగు రోజుకు ఇరవై, ముప్పైవేల గుడ్లు కూడ పెడుతుందట. అలా క్షణక్షణాభివృద్ధి అయ్యే చెదల ప్రధాన ఆహారం సెల్యులోజ్ కుప్పలు కుప్పలుగా పుస్తకాల రూపంలో ఆ గోడల పక్కనే ఉంటే వాటికింకేం కావాలి?

అలా పుస్తకాల మీద ఆహార ఆసక్తితోనో అకడమిక్ ఆసక్తితోనో చెద పురుగులు పుస్తకాలలోకి తొంగిచూశాయి. ఒక్కొక్క పేజీనీ, వాక్యాన్నీ, అక్షరాన్నీ కూడ విమర్శించడం మొదలుపెట్టాయి. కొన్ని నెలల కింద ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే చెద పురుగులు అప్పటికే నాలుగైదు పుస్తకాలను సంపూర్ణంగా చదివేసి తమ నిశిత విమర్శతో తుత్తునియలు చేశాయని బయటపడింది.

నాకు దుఃఖం మొదలయింది గాని అది ఇంగ్లిషు నవలల సెక్షన్ కావడంతో సరే పోనీలే అనుకున్నాను. చెదలు వచ్చే అవకాశం ఉన్నదని నేను అమాయకంగా నమ్మిన రెండు మూడు సెక్షన్లు తీసి అటకెక్కించాను.

చెదలు దావానలంలా వ్యాపిస్తాయని విని ఉన్నాను గనుక వెంటనే ఒక పురుగుల మందుల దుకాణానికి వెళ్లి చెదల మందు అడిగితే కాలకూట విషంలా కనబడే డబ్బా ఒకటి కొనిపించారు. దానితోపాటు ఒక స్ప్ర్రే కూడ కొనిపించారు. ఇంట్లో ఎవరూ లేకుండా చూసి ఆ విషం డబ్బా విప్పి స్ప్రేలోకి దాన్ని ఒంపబోతే ఒకటి రెండు చుక్కలకే కళ్లు బైర్లు కమ్మాయి. ఇంటినిండా భరించలేని వాసన వ్యాపించింది. చెదలే మేలు అనుకుని డబ్బా మూతపెట్టి పైన పడేశాను.

కాని రాత్రీ పగలూ కళ్లముందర చెదలే చెదలు. ఓరోజు మళ్లీ ఇంట్లో ఎవరూ లేకుండా చూసి చెదల మందుల ప్రకటనలు వెతికి పట్టుకుని ఫోన్ చేస్తే పాముల నర్సయ్య లాగ చెదల బాబూరావు ఆపద్బాంధవుడిలా వచ్చాడు. ఒకటి రెండు గంటలలో అయిపోతుందనుకున్న పని ఏడెనిమిది గంటలు పట్టింది.

చెద పురుగులు పుస్తకాలు చదవడమూ విమర్శించి ఖండఖండాలుగా మార్చడమూ మాత్రమే కాదు ప్లైవుడ్ చట్రాలలోకి ప్రవేశించి చెక్కపని కూడ మొదలుపెట్టాయి. కన్నీళ్లే మిగిలాయి గాని పుస్తకాలు మిగలలేదు. చెదల మందు ఘాటు వాసనకు కాదు, పుస్తకాలు పోయినందుకు కళ్ల వెంట ధారాపాతంగా దుఃఖం. అంత దుఃఖంలోనూ ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెదపురుగులు అన్ని సెక్షన్ల పుస్తకాల మీద అంతో ఇంతో చేయి (నోరు కావచ్చు) చేసుకున్నాయి గాని, అన్నిటి కన్న పెద్దదయిన తెలుగు కవిత్వం సెక్షన్ వైపు మాత్రం చూడనైనా చూడలేదు!!

reading1

సెకండ్ హాండ్ పుస్తకాల దుకాణాలూ ఫొటో కాపీయింగ్ సౌకర్యాలూ స్కానింగూ డిజిటలైజేషనూ వచ్చిన తర్వాత, అన్నిటికన్న మిన్నగా మరొకరి దగ్గర ఆ పుస్తకం ఉంటే తస్కరణ సౌకర్యమూ ఉన్నాక పుస్తకాలు పోతే ఏడవనక్కర లేదని అనిపిస్తుందేమో.

పుస్తకం మళ్లీ సంపాదించవచ్చు గాని ఆ పుస్తకంతో కలిసి ఉన్న అనుబంధాలను తిరిగి ఎట్లా సంపాదించగలం?

ఒక్కొక్క పుస్తకం వెనుక, వెనుక మాత్రమేకాదు అట్టమీదా, అట్టవెనుకా, లోపల పేజిపేజికీ ఒక్కొక్క గాథ ఉంటుంది. ఆ అచ్చు పంక్తుల కింద మనం గీసుకున్న గీతలు ఉంటాయి. ఆ పంక్తుల పక్కన అంచులలో మనం చేసిన వ్యాఖ్యలుంటాయి. కొత్త పుస్తకం దొరుకుతుంది గాని ఆ గాథలన్నీ ఎక్కడ దొరుకుతాయి?

ముప్పై ఏళ్ల కింద, ఇరవై ఏళ్లకింద, పదేళ్ల కింద ఏదో ఒక ఊళ్లో ఏదో ఒక దుకాణంలో ఏదో ఒక బుక్ ఫెయిర్ లో ఆ పుస్తకం కొని పేజీలు తిప్పి వాసన చూసి, మొదటి పేజీలో చేసిన సంతకపు ఆ తొలియవ్వన, గరుకు అక్షరాల ఉత్సాహ సంభ్రమాలు మళ్లీ ఎక్కడ ఎట్లా దొరుకుతాయి?

పుస్తకం పోవడమంటే పుస్తకం మాత్రమే పోవడం కాదు. ఒక పుస్తకం వెనుక ఉన్న అనేక జ్ఞాపకాలు పోవడం. పుస్తకాల ఫొటో కాపీలు సంపాదించవచ్చు గాని ఆ జ్ఞాపకాలను ఎట్లా సంపాదించగలం?

నిజంగానే నాదగ్గర ఉన్న వేల పుస్తకాలలో ప్రతి ఒక్కటీ నాలో ఒక జ్ఞాపకాన్ని ప్రేరేపిస్తుంది. ప్రతి ఒక్క పుస్తకంతోనూ నాకొక ప్రత్యేక అనుబంధం ఉంది. అది కొన్ని చోటు, అది కొనడానికి పడిన తపన, అది కానుకగా ఇచ్చిన మిత్రుల జ్ఞాపకం, అది చదువుతున్నప్పుడు, దాని మీద మాట్లాడినప్పుడు అనుభవించిన ఉద్వేగాలు….ఎన్నెన్ని!

ఎప్పుడో 1981లో మొదటిసారి మద్రాసు వెళ్లినప్పుడు మూర్ మార్కెట్ లోకి వెళ్లి ఒక పూటంతా గడిపి కొన్న సెకండ్ హాండ్ పుస్తకాలు, అందులో ముఖ్యంగా ‘ఏపియార్ కు అభిమానంతో మహీధర’ అని రామమోహనరావు గారు స్వయంగా సంతకం చేసి ఇచ్చిన ‘మృత్యువు నీడల్లో…’ ఇప్పుడెక్కడ దొరుకుతుంది? ఆ ఏపీయార్ ‘ఆదర్శజీవులు’ అనువాదం చేసిన అట్లూరి పిచ్చేశ్వరరావు గారు కావచ్చునని ఊహించి పొందిన ఉద్వేగాన్నీ ఆనందాన్నీ ఇప్పుడెట్లా తిరిగి తెచ్చుకోగలను? ఆ మద్రాసు లేదు, చెన్నై అయిపోయింది. ఆ మూర్ మార్కెట్ లేదు, దాన్ని తగలబెట్టి రియల్ ఎస్టేట్ చేసి సెకండ్ హాండ్ పుస్తకాలకు కట్టించి ఇచ్చిన అగ్గిపెట్టెల్లాంటి కొట్లలో ‘అచటి బహుజన రక్త చిహ్నముల యందు నాది ఇదని గుర్తేమిసామి’?’

అలాగే 1982 నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ రోడ్లమీద కొన్న వందల సెకండ్ హాండ్ పుస్తకాల జ్ఞాపకాలు మళ్లీ ఎక్కడ దొరుకుతాయి? మొదటి రోజుల్లో ప్రతి ఆదివారమూ ఎవరో ఒకరికి ప్రేమతో హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ సంతకం చేసి ఇచ్చిన పుస్తకాలు దొరికేవి. ముల్క్ రాజ్ ఆనంద్ ఎవరికో సంతకం చేసి ఇచ్చిన అపాలజీ ఫర్ హీరోయిజం దొరికింది. 1983 మధ్యలో కోటీ ఫుట్ పాత్ ల మీద హఠాత్తుగా వేలాది కమ్యూనిస్టు పుస్తకాలు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో 1940లలో అచ్చయిన తొలి కమ్యూనిస్టు పుస్తకాలు, 1950లలో, 60లలో ప్రపంచ ప్రధాన నగరాలన్నిట్లోనూ కొన్న పుస్తకాలు, ప్రతి పుస్తకం మీద ఎం కె సేన్ అని సంతకం, ఒక తేదీ, ఆ ఊరి పేరుతో సహా దొరికేవి. మొహిత్ సేన్ పుస్తకాలవి.

అంతకు పది, పదిహేను సంవత్సరాల ముందునుంచే జీవితం పుస్తకాల మధ్య, కాగితాల మధ్య గడుస్తోంది. కాని ఎమర్జెన్సీలో, ఇంటర్మీడియెట్ లో నాకన్న చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పి సంపాదించుకుంటున్న నాలుగు రాళ్లతో పుస్తకాలు కొనడం మొదలయింది. వరంగల్ విశాలాంధ్రలో అలా కొన్న పుస్తకాలు, అందులోనూ సోవియట్ పుస్తకాలు ఇప్పుడు చెదలు తినేస్తే ఆ పుస్తకాలూ రావు, ఆ జ్ఞాపకాలూ రావు. ఆ తర్వాత సాహిత్యలోకంలోకి ప్రవేశించాక ఎంతోమంది కవిమిత్రులు, రచయితలు కానుకగా ఇచ్చిన తమ పుస్తకాలు, ఆవిష్కరణ సభల్లో మాట్లాడడం కోసం ఇచ్చిన పుస్తకాలు, ఆ పుస్తకాలలో నేను రాసుకున్న మార్జినల్ నోట్స్… చెద పురుగుల మీద ఎంత కోపం వచ్చినా, సర్పయాగాన్ని మించిన చెదల యాగం చేసినా, ఆ పుస్తకాలైతే తిరిగి రావు గదా…

  ఎన్ వేణుగోపాల్

venu

Download PDF

16 Comments

  • వెనన్న రాసిన ఈ వ్యాసం చదువుతుంటే, పెదవి మీద చిరునవ్వు చివరికంట కొనసాగింది.

    వ్యాసం పూర్తయ్యాక ఎంతో చక్కగా గొప్ప నిబ్బరంతో బాధను గుండెల్లో దాచుకుని, ఏమీ చెయ్య లేని నిస్సహాయత నుంచి చెద పురుగులు చేసిన సహాసానికి, తమ జీవిత ధర్మానికి తలవొంచి- మానవుడు పుస్తకాలతో పొందే విజ్ఞానం తదను గుణంగా వాటితో పొందే అనుబంధం, అల్లుకున్న జ్ఞాపకాలు, అన్నింటిని అ చేద పురుగులు – పునర్మూల్యాంకనం చేసిన వైనం పైన ఎంత గొప్ప వచనం పుట్టింది?

    ఎలాంటి వ్యాసాలు జీవన వాస్తవికత ముంది సారస్వతం చిన్న బోయినట్టు అనిపించినా మల్లి మంచి సాహిత్త్యం ఎలాంటి అనుభవాల లోంచే పునర్జీవిస్తుంది అనిపిస్తోంది.

    ఈ కింది వాక్యాలను మల్లి మల్లి వ్యాసం లో చదివి ఎంజాయ్ చేసాను…

    ….పాపం, ఈ చెదల ముందర వాళ్లెంత నయం! పుస్తకాన్ని ఎక్కడో ఒకచోట మిగిల్చారు. నాదగ్గర లేకపోయినా ఆ పుస్తకం ఎక్కడో ఒక అలమరలో భద్రంగానే ఉంది……

    …..లెక్కలేనన్ని పుస్తకాలను నుసిగా, మట్టికుప్పగా, కన్నీటిముద్దగా మార్చేసిన, ఖండఖండాలుగా విమర్శించి అదృశ్యం చేసిన చెదపురుగులను ఏం చేయగలను?

    ….గోడలకు ఆనుకుని ఉండే వెనుక వరుసలలో ఏ రసాయనిక ప్రక్రియలు జరుగుతున్నాయో తెలియని స్థితి….

    ….అలా చెద పురుగులు ఒక్కొక్క పేజీనీ, వాక్యాన్నీ, అక్షరాన్నీ కూడ విమర్శించడం మొదలుపెట్టాయి. కొన్ని నెలల కింద ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే చెద పురుగులు అప్పటికే నాలుగైదు పుస్తకాలను సంపూర్ణంగా చదివేసి తమ నిశిత విమర్శతో తుత్తునియలు చేశాయని బయటపడింది….

    …చెద పురుగులు పుస్తకాలు చదవడమూ విమర్శించి ఖండఖండాలుగా మార్చడమూ మాత్రమే కాదు ప్లైవుడ్ చట్రాలలోకి ప్రవేశించి చెక్కపని కూడ మొదలుపెట్టాయి…

    కన్నీళ్లే మిగిలాయి గాని పుస్తకాలు మిగలలేదు….

    ఏదో ఒక ఊళ్లో ఏదో ఒక దుకాణంలో ఏదో ఒక బుక్ ఫెయిర్ లో పుస్తకం కొని పేజీలు తిప్పి వాసన చూసి, మొదటి పేజీలో చేసిన సంతకపు ఆ తొలియవ్వన, గరుకు అక్షరాల ఉత్సాహ సంభ్రమాలు మళ్లీ ఎక్కడ ఎట్లా దొరుకుతాయి?

    పుస్తకం పోవడమంటే పుస్తకం మాత్రమే పోవడం కాదు. ఒక పుస్తకం వెనుక ఉన్న అనేక జ్ఞాపకాలు పోవడం.

    పుస్తకాల ఫొటో కాపీలు సంపాదించవచ్చు గాని ఆ జ్ఞాపకాలను ఎట్లా సంపాదించగలం?

    …ఆ జ్ఞాపకాలూ రావు

    చెద పురుగుల మీద ఎంత కోపం వచ్చినా, సర్పయాగాన్ని మించిన చెదల యాగం చేసినా, ఆ పుస్తకాలైతే తిరిగి రావు గదా…

    – వెనన్న విమర్శ సుతిమేత్హగా సాగిన గొప్ప వ్యాసం ఇది.

    మానవీయం విశ్వా దర్శనం అల్లాగే నిజానికి ఇది ఆత్మ విమర్శా వ్యసం కూడా…

    థాంక్ యు ఫర్ ది వండర్ఫుల్ పీస్ అఫ్ లిటరరీ క్రిటిసిసం బ్రదర్…

    లవ్…

    -రమేష్ బాబు కందుకూరి

  • కల్లూరి భాస్కరం says:

    వేణుగోపాల్ గారూ…చాలా బాధ కలిగింది. ఆ బాధను వ్యక్తం చేయడానికి మాటలు దొరకడం లేదు. పుస్తకబంధం ఉన్న ప్రతివాళ్ళకీ మీ ఆవేదన అర్థమవుతుంది. పుస్తకాలను చెదలు తినేయడమే కాక, పుస్తకాల మార్జిన్ లో రాసుకున్న నోట్స్ కూడా పోవడం మరింత చిత్రవధ. మీ వ్యాసం చదువుతుంటే పుస్తకాలను, రచనలను చెదలు తినేసిన ఘటనలు అస్పష్టంగా గుర్తొచ్చాయి. నన్నయ అరణ్యపర్వాన్ని పూర్తిగా రాశాడు కానీ కొంత భాగాన్ని చెదలు తినేసాయనే వాదం కూడా ఉన్నట్టు జ్ఞాపకం.

  • sumabala says:

    ‘‘ఒక్కొక్క పుస్తకం వెనుక, వెనుక మాత్రమేకాదు అట్టమీదా, అట్టవెనుకా, లోపల పేజిపేజికీ ఒక్కొక్క గాథ ఉంటుంది. ఆ అచ్చు పంక్తుల కింద మనం గీసుకున్న గీతలు ఉంటాయి. ఆ పంక్తుల పక్కన అంచులలో మనం చేసిన వ్యాఖ్యలుంటాయి. కొత్త పుస్తకం దొరుకుతుంది గాని ఆ గాథలన్నీ ఎక్కడ దొరుకుతాయి?
    ముప్పై ఏళ్ల కింద, ఇరవై ఏళ్లకింద, పదేళ్ల కింద ఏదో ఒక ఊళ్లో ఏదో ఒక దుకాణంలో ఏదో ఒక బుక్ ఫెయిర్ లో ఆ పుస్తకం కొని పేజీలు తిప్పి వాసన చూసి, మొదటి పేజీలో చేసిన సంతకపు ఆ తొలియవ్వన, గరుకు అక్షరాల ఉత్సాహ సంభ్రమాలు మళ్లీ ఎక్కడ ఎట్లా దొరుకుతాయి?
    చెద పురుగుల మీద ఎంత కోపం వచ్చినా, సర్పయాగాన్ని మించిన చెదల యాగం చేసినా, ఆ పుస్తకాలైతే తిరిగి రావు గదా…’’

    పుస్తకాల మీద మీకున్న అభిమనం…వాటితో పెనవేసుకున్న మీ అనుబంధం…పుస్తకంపై మీ వ్యామోహాన్ని ఈ వ్యాసంలో మనసును తడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో బాదకంటే ఎక్కువ కోపం ఉంటుంది…అయినా మీ వ్యాసంలో ఆ రెండూ అంతర్లీనంగా మాత్రమే కనిపిస్తూ..చదివేవారికి ఆ దృశ్యాన్ని కళ్లకు కడుతున్నాయి. మీ వేదనలో భాగం పంచుతున్నాయి…

    ఏదైనా మనకు అవసరమైనప్పుడు..అనుభవంలోకి వచ్చినప్పుడే కదా దాని గురించి పూర్తిగా తెలుసుకుంటాం…అలా మీరు చెద పురుగుల మీద థీసిస్ చేసినట్టున్నారు…అది ఎంతోమంది పుస్తకప్రియులకు ఓ ముందస్తు హెచ్చరికగా కూడా పనికొస్తుంది.

    ’’మహావిశ్వమంత పుస్తకాన్ని మటుమాయం చేసిన ఇసుకరేణువంత సన్నని క్రిమిని ఏమనగలను?

    . నాలుగువేల రకాల చెదపురుగులున్నాయట, ఒకరకం చెదపురుగు రోజుకు ఇరవై, ముప్పైవేల గుడ్లు కూడ పెడుతుందట.’’

    పనిలో పనిగా తెలుగు కవిత్వానికి ఓ చురక కూడా అంటించారు…

    ‘‘అంత దుఃఖంలోనూ ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెదపురుగులు అన్ని సెక్షన్ల పుస్తకాల మీద అంతో ఇంతో చేయి (నోరు కావచ్చు) చేసుకున్నాయి గాని, అన్నిటి కన్న పెద్దదయిన తెలుగు కవిత్వం సెక్షన్ వైపు మాత్రం చూడనైనా చూడలేదు!!’’

    రెండేళ్ల క్రితం మా ఇంట్లో దొంగలు పడి మా ఇంట్లోని మా పాత జ్ఞాపకాలన్నింటినీ తుడిచిపెట్టుకుపోయారు. మా అమ్మాయికి మొదటిసారి పెట్టిన చిట్టికడియాలు..ఉగ్గుగిన్నెతో పాటూ నా చిన్ననాడు మా తాతయ్య నాకు చేయించిన వెండివస్తువులు..మా అమ్మతో పోట్లాడి మరీ తెచ్చుకున్న తన పెళ్లినాటి కాటుక భరిణ…మా నాన్నమ్మ ఎంతో ప్రేమగా కొనిచ్చిన వెండి మాణిక్యాలు…ఇలా ఎన్నో జ్ఞాపకాలు పోయాయి. అప్పుడు నేను ఇలాగే ఎంతో బాధపడ్డాను. పుస్తకాలకూ వస్తువులకూ పోలిక తెచ్చినందుకు క్షమించండి..కానీ ఏవైనా జ్ఞాపకాలే కదా…వాటితో నాకున్న అనుబంధం అలాంటింది. అవి తలుచుకుంటే ఇప్పటికీ నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. వస్తువు పోయినందుకు కాదు జ్ఞాపకాలు పోయినందుకు..

  • వేణు,
    సాహిత్యభిలాషి అని పుస్తకాన్ని ఇచ్చి, చదివిన తరువాత మళ్ళీ ఇస్తానన్న వారు ఇవ్వకపోతే:
    మిత్రులనైతే పుస్తకాలు తిరిగి ఇమ్మని వేధించాను. ఇవ్వకపోతే గొడవపడ్డాను. శత్రువులను చేసుకున్నాను. వందలాది పుస్తకాలు పోగొట్టుకున్నాను. నిజమైన ఆసక్తితో తీసుకుపోయి చదివి, నమ్మకంగా తిరిగి ఇచ్చేవాళ్లతో కూడ ఆ అనుభవంతో కటువుగా మాట్లాడాను. చదివి ఇస్తామని చెప్పి తీసుకుపోయి తిరిగి ఇవ్వనివాళ్లమీద, పరిశోధకులమని చెప్పి పుస్తకాలు ఎత్తుకు పోయినవాళ్ల మీద చాల కోపం తెచ్చుకున్నాను.

    సరే మరి నా ప్రశ్నకి జవామేమిటి?

    పుస్తకాన్ని దొంగతనంగా తీసుకునివెళ్ళి..దాన్ని మూర్ మార్కెట్టు లో అమ్ముకున్న ఆ దగుల్భాజి (చచ్చిపొయ్యాడు..బతికి ఉండిఉంటే ఆ చెదలకన్న సాహిత్యానికి ఎక్కువ చేటు చేసుండేవాడు) కన్నా చెదే మంచిదేమో అనుకుంటా!

    నిజమే..ఆ పుస్తకాలు దొరకవు..ఏ చేస్తాం? మరోకసారి ఆలాంటి పొరబాటు జరగకుండా జాగ్రత్త పడతాం. అంతకంటే ఏం చెయ్యగలం?

    ఇక ఆ పుస్తకాలు ఒక జ్ఞాపకమే. మనకి వీలున్నప్పుడల్లా ఆ జ్ఞాపకాలతోను సేద తీరడమే!
    By the way thank you for your cherishing thoughts about my father. I know you love him. Thank you.
    .

  • rajani says:

    నీకు పుస్తకాల మీద ఉన్న ప్రేమ అంతా కనిపించింది .చేద పురుగులను ఎంత తిట్టుకున్నా నీ జ్ఞాపకాల పుస్తకాలు తిరిగి రావు కదా
    ,మనసులోని జ్ఞాపకాలను ఏ
    చెదపురుగులు తింటాయి.

  • ఎన్ వేణుగోపాల్ says:

    రమేష్
    భాస్కరం గారూ,
    సుమబాల గారూ,
    అనిల్ గారూ,

    కృతజ్ఞతలు. పుస్తకాన్ని పిచ్చిగా ప్రేమించి, ఆ పుస్తకాల్ని, అంతకన్న ఎక్కువగా ఆ పుస్తకాల జ్ఞాపకాల్ని పోగొట్టుకున్న దుఃఖపు కన్నీళ్లు అవి. నచ్చినందుకు కృతజ్ఞతలు.

    సారాయెవో లో యుద్ధంలో నాశనమైపోయిన గ్రంథాలయాన్ని, పాత పుస్తకాలనూ రక్షించడానికి జరిగిన ప్రయత్నాల మీద ది లవ్ ఆఫ్ బుక్స్ అని ఒక డాక్యుమెంటరీ వచ్చింది. మీరెవరయినా చూశారా? తప్పకుండా చూడండి.

    వి.

  • Gundeboina Srinivas says:

    వ్యాస౦ బాగు౦ది సార్,

    `పుస్తకం మళ్లీ సంపాదించవచ్చు గాని ఆ పుస్తకంతో కలిసి ఉన్న అనుబంధాలను తిరిగి ఎట్లా సంపాదించగలం?’
    అన్న మాటలు మనసులో ముల్లు లాగా గుచ్చుకున్నాయి సార్.
    గు౦డెబోయిన శ్రీనివాస్
    31/10/2013
    7;30p.m

  • వేణు గోపాల్ గారు,
    చిత్రంగా అలా నాకే అనిపించిందో ఇంకెవరికైనా గూడా అనిపించిందో తెలియదు గానీ, ఈ వ్యాసం శీర్షిక దగ్గరనుండీ మీరు చెబుతున్నది నిజంగా పుస్తకాలు తినే చెదలు గురించి కాదనిపించింది. పుస్తకాల్లో రాసిన చెత్త గురించి అనిపించింది. అదే ధోరణితో చాలా చేపు చదివాక, మధ్యలో మీరు నిజంగానే చెదలు గురించి బాధపడుతున్నారనిపించింది.
    ఎందుకో గానీ రెండోసారి చదివాగ్గానీ మీరు అసలు చెదలు గురించే చెబుతున్నారనుకోలేదు.
    I am very sorry!

  • ఒక్కోవాక్యమూ చదువుతుంటే ముళ్ళు గుచ్చుకున్నట్టు బాధ కలిగిందండీ. (అంత దిగులు లోనూ తెలుగుకవిత్వం జోలికి వెళ్ళలేదు అన్నప్పుడు మాత్రం పకాలున నవ్వొచ్చింది) మీరు ముఖ్యంగా మొరపెట్టుకున్న చెదల బాధ తప్ప, దాదాపు మిగతా అన్ని రకాల పుస్తక చౌర్యాల బాధితురాలినే. అందులోనూ పరాయి దేశానికి కష్టంతోనూ ఇష్టంగానూ మోసుకొచ్చుకున్నవీ, నగల కన్నా జాగ్రత్తగా చూసుకున్నవీ విలువ తెలీని వాళ్ళ చేతుల్లో పడి కనబడకుండాపోతే ఏళ్ళ తర్వాత కూడా తలుచుకుంటే కన్నీళ్ళువస్తాయి.

    నాకు పుస్తకాల మీద పేరు రాయటం, గీతలు గియ్యటం లాంటి అలవాట్లు లేవు, కానీ ప్రతీ పుస్తకానికీ పేజీకి ఒక్కో కధ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ కొనుక్కున్నదీ, ఎవరితో కలిసి కొనుక్కున్నదీ, ఎవరితో కలిసి పదే పదే చదువుకున్నదీ లాంటి జ్ఞాపకాలెన్నో. వంట చేస్తూనొ, కాఫీ తాగుతూనో చదివినపుడు పడిన మరకలు, చదివీ చదివీ రంగు మారిన అంచులూ, కన్నీళ్లు పడి అయిన ఆనవాళ్ళు….పుస్తకాన్ని పూర్తి చేసిన తర్వాత దాన్ని గుండెలకానించుకొని, అది తోసిన దిగులు లోకాల్లో తిరుగుతూ కన్నీళ్ళని, లేదా పరిచయం చేసిన మంత్రనగరుల్లో విహరిస్తూ కలలని పంచిన అనుబంధం వేరేపుస్తకం కొనుక్కున్నా ఎలా వస్తుందీ.

    ఇదుగో ఇలాంటి బాధలన్నీ కలిపి చూసుకుంటే ఈ-పుస్తకాలు ఓ పెద్ద వరంగా కనిపిస్తున్నాయి నాకు, కానీ అచ్చు పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడూ, చదువుతూ చదువుతూ మధ్యలో ఆలోచిస్తూ బుగ్గకో, గుండెలకో ఆన్చుకున్నప్పుడు, మనసైన మనిషి భుజాన్ని ఆర్తిగా కౌగలించుకుని కూర్చున్న తృప్తీ, వెచ్చదనమూ ఉండదే :-(

  • Syed Naseer Ahamed says:

    నేను కూడా ఆ బాధలు పడ్డాను వేణుగోపాల్ గారు. 30 సంవస్తరాలుగా నాకు వచ్చిన లేఖలు, నేను సేకరించుకున్న పేపర్ క్లిప్పింగ్స్, నా వందలాది బుక్స్ అన్నిటిని చెదలు మింగేసింది. ఉండవల్లి సెంటర్ లోని నా ఇంట్లో బుక్స్ జాగ్రతగా పెట్టి మా మదం తోపాటు వినుకొండకు వెళ్ళాను. ఆరు సంవస్తరాల తరువాత వచ్చి చూద్దును కదా అక్షరాలన్నీ మాయం. మధ్య లో వచ్చి చూసాను కానీ, అంత బాగున్నట్టే అన్పించింది. తీరా ఇంటికి వచ్చి చూసేసరికి…చాల బాదేసింది. ఓ వారం రోజులు మనిషిని కాలేక పోయాను.

  • ఎన్ వేణుగోపాల్ says:

    గుండెబోయిన శ్రీనివాస్ గారు,
    ప్రసాద్ గారు,
    పద్మవల్లి గారు,

    కృతజ్ఞతలు.

    వి.

  • pavan santhosh surampudi says:

    మహావిద్వాంసులు, అపురూపమైన రచయిత శ్రీ వేలూరి శివశంకరశాస్త్రి ఇల్లు తగులబడి చిన్నతనం నుంచి సేకరించుకున్న మహాగ్రంథాలయం పరశురామ ప్రీతి అయిపోయినపుడు, అంతకు కొన్ని రోజుల ముందు తాను రాసిన అత్యద్భుతమైన అముద్రిత గ్రంథాలున్న పెట్టెను వేరే ఊరు తీసుకుపోతుండగా దొంగిలింపబడ్డప్పుడూ ఆ మహానుభావుడు పడ్డ బాధ గుర్తొచ్చింది నాకు.
    ఎవరైనా నా పుస్తకం చదువుతూ మధ్యకి మడతపెట్టి నలిపితేనే ఆగ్రహోదగ్రుణ్ణై అవతలివాడు మరోమారు నా పుస్తకాలు ముట్టుకోని పరిస్థితికి తెచ్చే నాకు మీ బాధ అర్థమవుతోంది. కానీ ఇక్కడ మీకు ఆ అవకాశం లేదు. మీ పుస్తకాలని పట్టిపల్లారుస్తున్నవి సిగ్గూ ఎగ్గూ లేని క్షుద్రజీవులు.

    • ఎన్ వేణుగోపాల్ says:

      పవన్ సంతోష్ సూరంపూడి గారూ,

      కృతజ్ఞతలు.

      వి.

  • balasudhakarmouli says:

    పుస్తకాలకు నమస్కారం !

  • uahsraninutulapati says:

    మీ పుస్తక ప్రేమ , వాటిని కోల్పోయిన బాధ, ఏమీచేయ్యలేని నిస్సహాయతతో ,అణువంత క్షుద్రజీవిని క్షమిచడం.,అద్భుతంగా తెలియజేసారు.మనసు ఆర్ద్రమయ్యి,కంటనీరు పెట్టించింది.

Leave a Reply to పద్మవల్లి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)