వీలునామా – 19 వ భాగం

veelunama11
శారద

శారద

 

కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

ఎల్సీనిర్ణయం 

 బ్రాండన్ అసలు ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్ళాడే ఉద్దేశ్యంతో ఆస్ట్రేలియానించి ఇంగ్లండు వచ్చాడు. ఒక ఆరు నెలలు రకరకాల అమ్మాయిలని కలిసి, మాట్లాడాడు. డాక్టరు ఫిలిప్స్ గారమ్మాయ్యి హేరియట్ అతనికి కొంచెం నచ్చినట్టే అనిపించింది. కానీ ఎందుకో ఆమెని పెళ్ళాడేంత నచ్చలేదు. ఆ ఆలోచనల్లో ఉండగానే అతను ఎల్సీ మెల్విల్ ని రెన్నీ గారింట విందులో కలిసాడు.

అప్పట్నించీ అతనికి ఆమె ధ్యాసే మనసంతా నిండిపోయింది. ఆమె సౌమ్యమైన రూపమూ, చదువూ, సంస్కారమూ, సన్నటి స్కాటిష్ యాసతో కూడిన మాటలూ, అన్నీ అతని మనసుని పట్టి లాగినాయి. ఆమె నిస్సహాయత అతని మనసుని కరగించి వేస్తే, ఆ పరిస్థితులలో ఆమె చూపించిన ధైర్యం అతనికి అబ్బురమనిపించింది.

ఇప్పుడు ఎల్సీని చూస్తుంటే కొంచెం చిక్కి, కళా కాంతులు తగ్గినట్టున్నా, తను మొదటి రోజు చూసినట్టే వుంది. ఆమెని తను పెళ్ళాడతాడు! తన స్నేహంలో, సంరక్షణలో ఆమె ఆరోగ్యం పుంజుకుంటుంది. ఆ కవితల పుస్తకం కూడా తను అచ్చేయిస్తాడు. ఒక పుస్తకాన్ని తమ హాల్లో టేబిల్ మీద అందరికీ కనబడేలా వుంచుతాడు కూడ! స్నేహితుల్లో, బంధువుల్లో అందరిలో తన హోద చకచకా పెరిగిపోతుంది!  చదువుకున్నదీ, కవితలు రాసేదీ, డబ్బున్న కుటుంబానికి చెందిందీ అయిన భార్య వుండడం ఎంత గర్వ కారణం.

ఇప్పుడు డబ్బు లేక కుట్టు పనికెళ్తూండొచ్చు. అయితే మాత్రం? నిజానికి అదీ గర్వపడాల్సిన విషయమే కదా? ఇలాటి ఆలోచనలన్నీ బ్రాండన్ మనసులో సుళ్ళు తిరుగుతున్నాతు. అతని మనసు అతని కుటుంబ సభ్యులకర్థవకపోయి వుండొచ్చు కాక! పెగ్గీ త్వరగానే కనిపెట్టేసింది.

ఎలాగైనా ఎల్సీని ఈ పెళ్ళికొప్పించాలి అనుకుందామె. వెంటనే తాతగారితో మాటల్లో యథాలాపంగా అన్నట్టు బ్రాండన్ మంచితనం గురించీ, దయా గుణాలగురించీ చెప్పింది.

***

veelunama11

డాక్టరు గారింటికి ప్రయాణమయ్యారు ఎల్సీ, బ్రాండన్. రైలులో ఒంటరిగా ఆమెతో ప్రయాణం చేసే అవకాశం దొరికినందుకు పొంగిపోయాడు బ్రాండన్. ఈ ఏకాంతంలోనే ఆమెకి తన మనసులో మాట చెప్పాలనుకున్నాడు. ఎలాగో తత్తరపడుతూనే ధైర్యంగా ఆమె అంటే తనకున్న ఇష్టాన్నీ మాటల్లో తెలియజేసాడు.

ఎల్సీ మొహం పాలిపోయింది.

“అయ్యో! అలా అనకండి. మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలియడంలేదు,” మొహం చేతుల్లో కప్పేసుకుంది.

“అదేమిటి మిస్ ఎల్సీ? అలా అంటున్నారెందుకు? మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. ఆస్ట్రేలియా చాలా బాగుంటుంది. అక్కడ నేనొక మంచి ఇల్లు కూడా కట్టించుకున్నాను. పెగ్గీ అక్కణ్ణించి వచ్చేసింతర్వాత ఇల్లంతా బాగు చేయించాను. మీకక్కడ అంతా హాయిగా గడిచిపోతుంది. మీ కవితల పుస్తకం కూడా అచ్చేయించాలని ఆశపడుతున్నా..”

“కవితల పుస్తకమా?” అయోమయంగా అడిగింది ఎల్సీ.

“అవును! మీర్రాసిన కవితలన్నీ చదివాను. చాలా బాగున్నాయి. అవన్నీ పుస్తకంగా అచ్చేయిస్తాను. మా వూళ్ళో అందరూ మిమ్మల్నీ, మీ తెలివితేటల్నీ చూసి మెచ్చుకుంటారు. నేనైతే గర్వంతో పొంగిపోతానేమో! కాదనకండి.”

నిట్టూర్చింది ఎల్సీ. ఆత్రంగా ఆమె వైపు చూస్తున్నాడు బ్రాండన్.

“మీరు పొరబడుతున్నారు బ్రాండన్. నేను మీరనుకున్నంత తెలివైన దాన్ని కాను. ఆ కవితలన్నీ ఉత్త చెత్త రాతలు. వాటిల్లో వస్తువూ బాలేదు, శిల్పం అంతకంటే బాలేదు. ఇలా బట్టలు కుట్టుకోవడానికి మాత్రమే నాకు అర్హత వుంది.”

“అని మీరనుకుంటున్నారు. కానీ నా అభిప్రాయం వేరు. ఇలా దిగజారి బట్టలకొట్లో పని చేయాల్సిన స్త్రీకాదు మీరు.”

“మన కడుపు మనం నింపుకోవడం లో దిగజారడం ఏముందిలెండి.”

“ఒప్పుకుంటాను. అయినా మీరు ఇలా బట్టలు కుట్టుకుంటూ మీ పొట్ట పోసుకోవడం అన్న విషయం నన్ను చాలా బాధిస్తుంది. ఈ సంగతి తెలిసిన నాటినుంచీ నాకు కంటి నిండా నిద్దర కూడా పట్టలేదు. నేను మిమ్మల్ని ఈ పరిస్థితిలో వుండనీయను.”

“నన్ను చూసి జాలిపడుతున్నారా? అది నన్నెంత నొప్పిస్తుందో మీకు తెలుసా?”

“జాలి కాదు! మీమ్మల్ని ప్రేమిస్తున్నాను.” ధైర్యంగా అన్నాడు బ్రాండన్.

“మీ ప్రేమ జాలిలోంచి పుట్టింది. నా మీద మీరు జాలి పడటం మానేసిన మరుక్షణం మీ ప్రేమా చచ్చిపోతుంది. వద్దు బ్రాండన్. నేను మిమ్మల్ని పెళ్ళాడలేను. నన్ను క్షమించండి.”

ఆమె గొంతులో వున్న నిరాశా నిస్పృహలు పసిగట్టి బ్రాండన్ ఆశ్చర్యపోయాడు. ఆమె చెప్పే మాటలు అబధ్ధాలనిపించడంలేదు. అంటే, ఆమె మనసులో ఇంకెవరైనా వున్నారేమో! లేకపోతే, హాయిగా ఏ బాదరబందీలూ లేని జీవితాన్ని తనిస్తానని చెప్తున్నా, దర్జీ పని చేస్తూ బ్రతకడమే బాగుండడం ఏమిటి? ఇందులో ఏదో తిరకాసుంది.

ఎప్పుడూ ఆమె మొహంలో వుండే దిగులూ, చిక్కి శల్యమైపోతూ వుండడం, ఆమె నిట్టూర్పులూ, అన్నిటికంటే ఆమె కవిత్వం రాయడం, అన్నీ చూస్తే అలాగే అనిపిస్తుంది. బాగున్న రోజుల్లో ఎవరో నీచుడు ఆమెని ప్రేమలోకి దింపి వుంటాడు. ఇప్పుడు ఆమె డబ్బంతా పోగానే మొహం చాటేసి వుంటాడు. ఎంతటి నీచుడు. బ్రాండన్ మనసులో ఆమె పట్ల ప్రేమ సంగతేమోకానీ, జాలి మాత్రం ఇంకా పెరిగిపోయింది.

సౌకర్యవంతమైన జీవితాన్నీ, ప్రేమనీ పంచి ఇస్తానని ఒకవైపు తను చెప్తూంటే ఎప్పడిదో పుచ్చిపోయిన ప్రేమనీ, ఆ ప్రేమికుణ్ణీ తల్చుకుని బాధ పడుతూనే వుంటానంటే, అది ఆమె ఖర్మ! తనేం చేయలేడు, అనుకున్నాడతను. ఆ సంగతి రెట్టించి అడగడం కూడా అమర్యాదగా అనిపించింది. ముభావంగా వుండిపోయాడు.

ఆమె పెళ్ళికి ఒప్పుకోని వుంటే అతని మనసులో ఆమె పట్ల మిణుకు మిణుకు మంటూ వున్న ప్రేమ పదింతలయేది. నిజంగానే ఆమెని సూఖపెట్టడానికి పగలూ రాత్రీ కష్టపడి వుండేవాడు. ఆమె కాదనడంతో ఆ మిణుకు మిణుకు మంటూ వున్న ప్రేమ ఆరిపోయింది. కనీసం తను అందించాలనుకున్న ప్రేమకి ధన్యవాదాలు కూడా చెప్పలేదామె. ఎందుకో తల దించుకుని మౌనంగా వుండిపోయింది. పక్క స్టేషనులో ఇంకొంతమంది ఆ పెట్టెలోకెక్కడంతో ఆ ఇబ్బందికరమైన మౌనానికి తెర పడింది.

ఎల్సీ మనసంతా అల్లకల్లోలంగా వుంది. ఆమెకీ మౌనం దుర్భరంగా వుంది. అయినా ఏం మాట్లాడాలో తోచలేదు. అతను ఇంతకు ముందు పెగ్గీని కూడా ఇలాగే పెళ్ళాడమని అడిగాడు. పెగ్గీ నిరాకరించింది. ఆయన కనబడ్డ ప్రతీ ఆడదాన్నీ ప్రేమించేవాడల్లే వుందే!

నిజం చెప్పాలంటే ఆతని లాంటి కష్టజీవిని పెగ్గీలాంటి స్త్రీయే సుఖపెట్టగలదు. తనలాటి దుర్బలురాలు కాదు. తన ఆరోగ్యమూ బాగుండలేదు. అతనితో సమానంగా శారీరక కష్టమూ చేయలేదు. కాలనీలో ఒంటరితనంతో పోరాడుతున్న అతనికి ప్రేమనూ, స్నేహాన్నీ ఇవ్వలేదు. తనని పెళ్ళాడడం వల్ల అతనికేమాత్రమూ సుఖం వుండదు సరి కదా, తనని కని పెట్టుకోని వుండడం అతనికి అదనపు భారం. అతను తన మీద పడుతున్న జాలిని ఉపయోగించుకొని అతని పైన తన బరువును మోపడం ఏం న్యాయం? ఇలా సాగుతోన్న ఆమె ఆలోచనల గురించి తెలిస్తే బ్రాండన్ ఎంత ఆశ్చర్య పడి వుండేవాడో!

రైలు గమ్యం చేరుకుంది. ఇద్దరూ కిందికి దిగారు. డాక్టరు ఫిలిప్స్ గారి పల్లెటూరికి గుర్రపు బగ్గీ మాట్లాడుకుని ఎక్కారు. చలికి కొయ్యబారిపోయినట్టున్న ఆమె చేతులు పట్టుకుని ఆమెని బండేక్కించాడు బ్రాండన్. మరింతగా ముడుచుకుపోయిన ఆమెని చూసి,

“మిస్ ఎల్సీ, నను చూసి భయపడుతున్నారల్లే వుందే! ఈ విషయం నేనింకో నరమానవుడికి తెలియనివ్వను. నేను మాట్లాడితే మీకు ఇబ్బందిగా వుందంటే అసలు మీతో మాట్లాడనే మాట్లాడను. చెప్పండి, నిజంగా నేను మీతో మాట్లాడడం మీకిష్టం లేదా?” ఆశగా అడిగాడు.

“అవును! మీరింక నాతో మాట్లాడడమూ, నాతో స్నేహం చేయడమూ మానేస్తే మంచిది. నన్ను నమ్మండి! నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది మీకు.”

“మీరు కాదన్నాక ఇహ ఎంత మంచి అమ్మాయి కనబడి ఏం లాభం లెండి. అయినా మీరు నన్ను దూరంగా వుండమంటే అలాగే వుంటాను.”

***

వాళ్ళు ఇల్లు చేరేసరికి జేన్ పిల్లలకి చదువు చెప్తోంది. ఆ రోజూ లిల్లీ కూడా పిల్లలతోపాటే కూర్చోని వుంది చదువుకుంటూ.

ఎల్సీని నఖశిఖ పర్యంతమూ పరికించి చూసింది లిల్లీ. మొహం బానే వుంది కానీ, కళ్ళు బాగా అలిసిపోయినట్టున్నాయి. బాగా పాలిపోయి కూడా వుంది. కాస్త కండ పడితే కాని మనుషుల్లోకి లెక్కకి రాదు, మరీ స్తంభం లాగుంది, అనుకుంది.

ఫిలిప్స్ చెల్లెళ్ళు కూడా ఎల్సీ కంటే జేన్ బాగుంటుందని తీర్మానించేసారు. ఫిలిప్స్ మాత్రం ఎల్సీ అనారోగ్యం వల్ల అలా అనిపిస్తుంది కానీ, మంచి అందగత్తె అని చెప్పాడు ఆడవాళ్ళందరితో. డాక్టరు ఫిలిప్స్ గారు ముందా దగ్గు సంగతేమిటో తేల్చెయ్యాలన్నారు. అందరూ ఆమె పట్ల చూపించిన ఆప్యాయత చూసి ఎల్సీ కొంచెం సర్దుకుంది.

చెల్లెలి మొహం చూస్తూనే జేన్ ఆమె మనసెందుకో అలజడి గా వుందని పసి కట్టింది. అయితే అదంతా అనారోగ్యం వల్లనే ననీ, డాక్టరు గారి వైద్యం తో ఎల్సీ మళ్ళీ ఎప్పట్లాగే అవుతుందనీ తనకి తనే సర్ది చెప్పుకుంది.

ఆ రాత్రి ఇద్దరూ ఒంటరిగా వున్నప్పుడు ఎల్సీ అక్కతో బ్రాండన్ ప్రతిపాదన గురించి అంతా చెప్పింది. జేన్ మౌనాన్ని చూసి భయపడింది ఎల్సీ.

“జేన్! నా మీద కోపంగా వుందా? తప్పు చేసాననుకుంటున్నావా? నాకతని మీద ఏ కోశానా ప్రేమలేదు. అలాటప్పుడు అతన్ని పెళ్ళాడడం అతన్ని మోసం చేయడమే అవుతంది కదా? ” ప్రాధేయపడింది ఎల్సీ.

“పిచ్చిదానా! నీమీద కోపం ఎందుకే? నువ్వేం తప్పు చేసావని?” శాంతంగా అంది జేన్.

“అది కాదు జేన్! ఒంటరితనమూ, పేదరికమూ నన్నెంత బాధపెడుతున్నాయో, ఎంత దుర్భరంగా వుందో నీకు తెలీదు. ఆ పరిస్థితులకి బెదిరిపోయి అతన్ని పెళ్ళాడొచ్చు. కానీ, ఎప్పటికైనా అతనికి నిజం తెలియకపోదు. అతని మీద ఇష్టం తో కాక కేవలం పరిస్థితుల వల్ల అతన్ని పెళ్ళాడానని తెలిస్తే అతను ఎంత బాధ పడతాడు?”

“ఇప్పుడు నీకతనంటే పెద్ద ఇష్టం లేకపోవచ్చు ఎల్సీ! ఇంకొన్ని రోజులయుంటే నీకతని మీద ఇష్టం పుట్టేదేమో. ఇలాటి ఇష్టాయిష్టాలు ఒక్క క్షణంలో పుట్టేవి కాదు. నువ్వతన్ని కొంచెం వ్యవధి అడిగివుంటే అయిపోయేది.”

“కానీ, జేన్, నీకు గుర్తుందా? అతను పెగ్గీనీ పెళ్ళి చేసుకొమ్మని అడిగాడు. ”

జేన్ ఏమీ మాట్లాడలేదు.

“చెప్పు జేన్! చాలా మొరటుతనంగా అతన్ని బాధ పెట్టానా? కనీసం ఎందుకు వద్దన్నానో కూడా చెప్పలేదు. నేనేం పరపాటు చేయలేదు కదూ?” ఆవేదనగా అడిగింది అక్కని.

“ఎల్సీ! పొరపాటో కాదో ఎవరం చెప్పగలం? నిజమే, నీకు బ్రాండన్ కనబడ్డ ప్రతీ ఆడదాని దగ్గరా పెళ్ళి ప్రస్తావన తెస్తాడనీ, అతను నీకు తగడనీ అనిపించొచ్చు. అయితే, మనకి ఎవరు నచ్చుతారన్నది కాదు ప్రశ్న, మనం ఎవరికైనా నచ్చుతామా అన్నది సమస్య. మళ్ళీ నిన్నిలాంటి మనిషి ముందుకొచ్చి పెళ్ళాడకపోవచ్చు! ఇప్పుడు ఆలోచించి ఏమీ లాభం లేదనుకో, అయినా చెప్తున్నాను. అతను చాలా మంచి వాడనీ మనకు తెలుసు. అతను మనకెన్నో రకాలుగా సాయపడ్డాడు కాబట్టి మనమంటే ఏమూలో అభిమానం వుండే వుండాలి. ఎప్పుడో కొన్నేళ్ళ కింద పెగ్గీని పెళ్ళాడమని అడిగే వుండవచ్చు. అయితే ఏం? చిన్నతనంలో, ఆస్ట్రేలియా లాటి కాలనీలో ఒంటరిగా బ్రతికే మనిషి ఎలా ప్రవర్తిస్తాడో మనమెలా ఊహించగలం? పెగ్గీ కాదన్నా, ఇప్పటికీ పెగ్గీ పట్ల మర్యాదగా ప్రవర్తిస్తాడు. లండన్ లో కూడా అతను ఫిలిప్స్ ఇంటికొచ్చినప్పుడు చూసాను. నాకు అతను చాలా మంచివాడనిపించింది. ఇప్పుడు మనమున్న పరిస్థితి కంటే అతనితో బ్రతుకే నీకెంతో బాగుండేదేమో. ఆలోచించు.”

“వద్దు జేన్! ఎంతో కష్టపడి నేనా పిరికితనాన్ని వదిలించుకున్నాను. ఈ కష్టాలకి భయపడి, ఏమాత్రం ప్రేమలేకుండా, అతనికి నేనసలు తగనని తెలిసీ పెళ్ళాడగలనా? నాకు బాగా తెలుసు జేన్. అతను నన్ను చూసి జాలి పడుతున్నాడు. అసలు ఒక మనిషి నన్ను ప్రేమించే పరిస్థితిలో వున్నానా నేను? నా అవతారం చూడు! నా వాలకం చూడు! ఏముందని నన్నెవరైనా ప్రేమిస్తారు? అసలు జేన్, నాకా దర్జీ కొట్లో ఎంత దుర్భరంగా, ఎంత అవమానంగా వుందో తెలుసా? అవమానం నా పనిని తలచుకోని కాదు. ఊరికే అనవసరంగా నా మీద జాలి ఒలకపోస్తూ ఏదో ఒక వంకన నన్ను చూడడానికొచ్చే మన ఊరివాళ్ళ వల్ల. నిన్ను చూస్తే ఎవరికీ జాలనిపించదు జేన్. ధైర్యంగా తలెత్తుకోని నడవగలవనిపిస్తుంది. నన్ను చూస్తేనే ఎక్కళ్ళేని జాలీ ముంచుకొస్తుంది మనుషులకి. నాకది ఎంత చిరాగ్గా వుంటుందో చెప్పలేను. ఇప్పుడితనూ నన్ను చూసి జాలిపడే పెళ్ళాడతానన్నాడు. అది నాకెంత అవమానంగా వుంటుందో అర్థం చేసుకోరెవరూ. ”

ఆమె ఆవేశాన్ని చూసి జేన్ నవ్వింది.

“ఎంత అమాయకురాలివి ఎల్సీ! నువ్వు చక్కటి మంచి అమ్మాయివి. తళ తళ లాడే నీ నీలి రంగు కళ్ళూ, సౌమ్యంగా ఆహ్లాదంగా వినిపించే నీ గొంతూ, చదువూ సంస్కారమూ అన్నీ వున్నాయి నీకు. నిన్ను ఎవరూ ప్రేమించకపోవడం ఏమిటి? అసలు ఇంత ఆత్మ విశ్వాసం లోపిస్తుందెందుకు నీలో? బ్రాండన్ కి నీమీదున్నది జాలి కాదు, గౌరవం. కష్టాల్లో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎవరి సాయం కోసమో ఎదురు చూడకుండా దర్జీ కొట్లో పనికి కుదురుకున్నావన్న గౌరవం. నాకైతే ఏ కోశానా అతనికి నీమీదున్నది జాలి మాత్రమే అనిపించడం లేదు.”

“పోనీలే జేన్!  పెళ్ళయింతరవాత నేనంత గొప్ప స్త్రీనేమీ కానని తెలిసి నిరాశ పడడం కంటే ఇప్పుడు కొంచెం బాధ పడడమే మంచిది. అదలా వుంచు జేన్. నాకు నా ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళనగా వుంది. ఎడిన్ బరో చలికి బాగా దగ్గు ముదిరింది. ఏదైనే ఊపిరి తిత్తుల్లో జబ్బేమో! నేను పెళ్ళి వద్దనడానికి అది కూడా ఒక కారణం. ఈ ఊపిరి తిత్తుల్లో జబ్బుతో నేను చచ్చిపోతే…”

“ఎల్సీ! ఏంటా మాటలు? నీకే జబ్బు లేదు. రేపే డాక్టరు గారిని నిన్ను మొత్తం పరీక్ష చేయమంటాను. ఆయన చేతిలో ఏ జబ్బైనా ఇట్టే నయమైపోతూంది తెల్సా? చాలా అనుభవమూ, తెలివి తేటలూ వున్న మనిషాయన. నీకేం భయం లేదు. నువ్విక్కడికి వచ్చి మంచి పని చేసావు.”

“జేన్! నువ్విక్కడ వీళ్ళింట్లో హాయిగా వున్నావు కదూ? అందరూ నిన్ను చాలా ఇష్టపడుతున్నారు. జీతం బాగానే ఇస్తున్నారా లేదా?”

“అవును ఎల్సీ! ఈ ఉద్యోగం మనకు భగవంతుడే ఇచ్చాడు. నీకెందుకు! నీకూ అన్నీ నేను సరి చేస్తాగా? హాయిగా ఇక్కడున్న నాలుగు రోజులూ విశ్రాంతి తీసుకో!”

ఆ రాత్రి ఎల్సీ నిద్ర పోయినా జేన్ కి చాలా సేపు నిద్ర పట్టలేదు. ఎల్సీ బ్రాండన్ తో పెళ్ళికొప్పుకోని వుంటే ఎంత బాగుండేది. ఆమె భవిష్యత్తు స్థిర పడేది. ఆమె లాటి అమాయకురాలు బ్రాండన్ రక్షణలో ఎంతైనా సుఖపడివుండేది.  డాక్టరు గారి చికిత్సలో ఎల్సీ కోలుకోగానే బ్రాండన్ మళ్ళీ ఎల్సీతో మాట్లాడితే బాగుండు! ఆలోచనల్లోనే నిద్ర పోయింది జేన్.

***

(సశేషం)

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)