”లోకానికి పొలిమేరన నీ లోకం నిలుపుకో!”

మంజువాటిక

devulapalli1

” నిను కానక నిముసం మనలేను, నువు కనబడితే నిను కనలేను ” అని చిన్నప్పుడు విన్నప్పుడు ఏ  వైరుధ్యమూ తట్టలేదు. కొన్నేళ్ల తర్వాత ” నాలో నిండిన నీవే నాకుచాలు నేటికి, మోయలేని ఈ హాయిని మోయనీ, ఒక్క క్షణం ” అంటే అర్థమయినట్లే ఉండేది.

కృష్ణశాస్త్రి గారు విడిగా  కవిగా పరిచయమయేనాటికి పదమూడేళ్లు నిండాయి నాకు. ” కృష్ణపక్షమ్మొకటె నాకు మిగిలె ” …ఈ వాక్యాలు నా లోపలి దేనికో ఆకృతినిచ్చినట్లు అనిపించింది , ప్రాణస్నేహితురాలిని వదిలి ఉండటం అనే తీవ్రమైన దుఃఖం లో ఉన్నప్పుడు .అది  ఇప్పుడు తలచుకున్నా అవమానంగా ఏమీ అనిపించదు. ఆత్మీయులకి దూరం కావటం కంటె శోకమన్నది లేదని ఈ నాటికీ తోస్తుంది, విధి అనుమతించినన్నాళ్లూ  అహర్నిశలూ చూస్తూ ఉండగలగటం కన్న కోరుకోవలసిన ఆనందమేమీ  లేదు, ఎప్పటికీ.

ఈ మధ్య బుజ్జాయి  గారు రాసిన ‘ నాన్న-నేను ‘ చదివాక కృష్ణశాస్త్రి గారి దృక్పథం తెలిసింది.

” నావలె అతడున్మత్త భావమయశాలి, ఆగికోలేడు రేగు ఊహలనొకింత ! ఇంత చిరు గీతి ఎద వేగిరించునేని పాడుకొనును, తాండవనృత్యమాడుకొనును ”  ఈ మాటలు ఇంచుమించు మూడు దశాబ్దాలు నా జీవితపు టాగ్ లైన్ లు గా ఉండేవి. ఆ రెపరెపలాడిపోయేతనమే నడుపుతూ ఉండేది నన్ను, అలా గాలికి కొట్టుకుపోతూనే  ఉండేదాన్ని.నేల మీద నిలిపేందుకూ  వేరే రచయితలు  ప్రయత్నిస్తూ  ఉండేవారు, కాని  కాలు నిలిస్తేనా !

శాపగ్రస్తులమయి ఈ ప్రపంచంలోకి రావలసి వచ్చిందని అనుకోని మనో జీవులు  ఉంటారా ?   దిగిరావటం దిగిపోవటమేననే ఊహాపోహల కాలమది.

పదిహేడేళ్లు వచ్చేనాటికి అమృతవీణ, మంగళ కాహళి, వ్యాసాల సంపుటులు నాలుగూ విడుదలయాయి. ఆ వచనం ఎంత మార్దవంగా,  రుచిరార్థ  సమ్మితంగా ఉండేదని ! శ్రీశ్రీ గారు రాసిన వ్యాఖ్యానంతో వచ్చాయి అవి. ” ఇక్షుసముద్రం ఎక్కడుందో చూశారా  ” అని మొదలవుతుంది అది. ఆస్వాదానికి ఆహ్వానంతోబాటు చిన్న అవమానమూ ఉంది అక్కడ ” ఇంకా మీరు కోరుకునే ఎన్నో మసాలాలున్నాయి ” అనే మాటల వెనక. అది శ్రీ  శ్రీ ఉద్దేశించారో లేదో నాకు తెలియదు. కృష్ణశాస్త్రి గారి కవిత్వపు, సామీప్యపు ఇంద్రజాలానికి బలంగా లోనయి బయటపడినవారిలో శ్రీ శ్రీ ఒకరని అప్పటికి తెలియదు.

కవితాప్రశస్తి  వ్యాసాలలో ‘ కరుణ ‘ అనేది చాలా కాలం ఊపివేసేది. దుఃఖించేవాడి  గురించి ” అతను తెలిసిపోతాడు , అతని దగ్గర చెప్పులు వదలి తల దించుకుంటాము ” అంటారు. అంతకన్న చెప్పవలసినది లేదు.లిరిక్  శిల్పం అనే వ్యాసమూ నాకు చాలా ఇష్టం. మంత్రపుగవాక్షాల  గురించీ, ప్రమాదభరిత సాగరాల గురించీ కీట్స్ కవితా పంక్తుల  పరిచయం అక్కడే .

కవి పరంపర అనే వ్యాసాల వరసలో ” నా కంటికి తిక్కన్న గారు పొడుగ్గా ఉంటా డు ‘ లాంటి వాక్యాలతో పదచిత్రాలతో ఆయా కవుల రూపురేఖా విలాసాలని బొమ్మ కట్టి చూపటమెంతగా ఆకర్షించేదని ! మహావ్యక్తులు సంపుటం లో చిత్త రంజన్   దాస్ గారి గురించిన వ్యాసం బలంగా, లోతుగా ఉంటుంది.ఆయన రచన కి  బహుశా కృష్ణశాస్త్రి గారే చేసిన అనువాదం ” ఆశకు కూడా అతీతమయిన కష్టాలు  పడటం, రాతిరి కన్నా మృత్యువు కన్నా నల్లని అన్యాయాలను సహించటం  ” అని మొదలయే గీతం గా నన్ను పరిపాలించింది అప్పటిలో.

మన నాయనమ్మ కంటే కొన్నిసార్లు మనకి గాంధారి ఎంత బాగా తెలుస్తుందో చెబుతారు ఇంకొక చోట, ఇతిహాసాల గురించిన  ప్రస్తావనలో.

పొద్దున్నే లేవలేని నా బద్ధకానికీ పద్యం ఎప్పటికీ సమర్థింపు

” తల్లిరేయి, ఆమె చల్లని యొడిపైని నిదురపొమ్ము

నిదుర నిదుర కొక్క కల వెలుంగు పసిడి జలతారు అంచురా

మేలుకొనకు కల వేళ, తండ్రి ! ”

అమృతవీణ దినదినాహారం అప్పుడు. గుంటూరు లో అరుదుగా దొరికే సిం హాచలం  సంపంగి పూరేక్కలు దాచుకున్నాను ఆ పుటలలో, ఉన్నాయి ఇంకా. ప్రేమ లోని, అర్పణ లోని ఎన్ని మన స్స్థితులను  చెప్పారో ఆయన అందులో. ” చిన్ని పూవు పదములపై ఒకటే, కన్నీటి చుక్కలాపై రెండే ” అనే ఏకాంత దర్శనం ఒకసారి, ” తెలివిమాలి నా హృదయపు తలుపు మూసి ఉన్నఫ్ఫుడు తొలగదోసి ద్వారము , లోపలికి రావలయు ప్రభూ, మరలి వెడలిపోకుమా” అని ఏమరపాటు ని  ఎలాగ  పట్టించుకోరాదో ఇంకొకసారి, ” మాట తీసుకొని నాకు మౌనమొసగినావు, మౌనమందుకొని నీకు గానమీయమంటావు! నా కంఠము చీకటైన ఈ కృష్ణ రజని తుదిని నాకయి నీ చెయి సాచిన నా కానుక ఇంతే కద, ఈ కొంచెపు పాటే కద ” అనే నిష్టూరపు ఒప్పుదల మరి ఒకసారి.

ఆ రోజులలోనే మొదటిసారి మల్లీశ్వరి  చూడగలిగాను. ఏమో, అందరూ ఏమేమి అంటారో నాకు తెలియదు, అది కృష్ణశాస్త్రి గారి కృతి నాకు, అంతే… కనీసం ప్రధానంగా.

నల్ల కనుల నాగస్వరం మోగుతూనే ఉంది…. వెండివెన్నెల గొలుసులకు వ్రేలాడిన రేయి ఊయల ఊగుతూనే ఉంది….

స్వాప్నికలోకానికి ఈవల ఎన్నో జరిగితీరుతాయి తప్పదు, నాకూనూ. ఆ   గాటంపుకౌగిలి వదలి కనులు వేరేలా తెరచిచూడవలసిందే. నా లోపలి నన్ను పదిలపరచుకుంది వారివలన. వారే చెప్పిన మాటలు … అవకాశం దొరుకుతూనే పిల్లలని వినమనే మాటలు, జీవనసంరంభం  నడిమధ్యని నిలవలేవు,  దూరమయి నిభాయించుకోలేవు , అందుకే

” లోకానికి పొలిమేరన నీ లోకం నిలుపుకో ! ”

 

( నవంబర్ 1దేవుల పల్లి కృష్ణ శాస్త్రి జయంతి సందర్భంగా )

maithili—మైథిలి అబ్బరాజు

Download PDF

21 Comments

 • kameswari says:

  ఒక కృష్ణ శాస్త్రి గారి మరొక కవితలా ఉంది ఈ వ్యాసం. అభినందనలు

 • mythili says:

  ధన్యవాదాలు కామేశ్వరి గారూ …ఈ ఉదయపు ఆహ్లాదం మీ ప్రశంస!

 • సాయి పద్మ says:

  మాట తీసుకొని నాకు మౌనమొసగినావు, మౌనమందుకొని నీకు గానమీయమంటావు! నా కంఠము చీకటైన ఈ కృష్ణ రజని తుదిని నాకయి నీ చెయి సాచిన నా కానుక ఇంతే కద, ఈ కొంచెపు పాటే కద ” అనే నిష్టూరపు ఒప్పుదల మరి ఒకసారి.
  —హ్మ్మ్.. ఎంత కోయిల పాట ..నిల్వెత్తు చిత్రమయ్యేనో కదా.. అన్నట్టు అనిపించింది .. మీ వ్యాసం.. మిగిలిన కృష్ణపక్షపు లోకపు కబుర్లూ.. సున్నితత్వపు పదును చూపించారు మైధిలి గారూ !!

 • Suresh says:

  ఈ వ్యాసాన్ని పదే పదే చదువుతూనే ఉన్నాను రాత్రంతా. ఇంత గొప్పగా రాసారు అంటే మీకు నరనరాలలో అయన భావుకత్వం జీర్ణించుకొని ఉండి ఉండాలి. హృదయంతో రాసారు అనిపించింది. ఈ వాక్యాలు “శాపగ్రస్తులమయి ఈ ప్రపంచంలోకి రావలసి వచ్చిందని అనుకోని మనో జీవులు ఉంటారా ? దిగిరావటం దిగిపోవటమేననే ఊహాపోహల కాలమది.” ” తెలివిమాలి నా హృదయపు తలుపు మూసి ఉన్నఫ్ఫుడు తొలగదోసి ద్వారము , లోపలికి రావలయు ప్రభూ, మరలి వెడలిపోకుమా” అని ఏమరపాటు ని ఎలాగ పట్టించుకోరాదో ఇంకొకసారి, ” మాట తీసుకొని నాకు మౌనమొసగినావు, మౌనమందుకొని నీకు గానమీయమంటావు! నా కంఠము చీకటైన ఈ కృష్ణ రజని తుదిని నాకయి నీ చెయి సాచిన నా కానుక ఇంతే కద, ఈ కొంచెపు పాటే కద ” లోకానికి పొలిమేరన నీ లోకం నిలుపుకో!” Those sentences, I kept on reading again and again. They are achingly beautiful. You really surprised me and at times really moved me!!

  • mythili says:

   సురేష్ వెంకట్ గారూ, కృష్ణశాస్త్రి గారు మధురాధిపతి సాహిత్యంలో, సర్వం మధురమే కదా ఆయన గురించి !

 • radha says:

  “ముందు తెలిసెనా ప్రభూ ఈ మందిరమిటులుండేనా మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో కాస్త ముందు తెలిసెనా ప్రభూ” – నా కిష్టమైన పాట మైధిలి గారూ. గొప్ప కవిని స్మరించుకునేట్లు చేశారు. ధన్యవాదములు.

 • mythili says:

  చాలా సంతోషం మీ వ్యాఖ్య కి, రాధ గారూ ! ఆ పాట నాకూ ఇష్టమే …

 • Rekha Jyothi says:

  కవిత్వం లో మనసును ముంచేసుకొని …భావుకత్వం లో స్వయం బందీని చేసుకొని … మంచిమాటలతో .. మెలిపెట్టి పిండిన స్పందనలను మీ కలం తో వెలిగించి పంచారు ….. ఈ వెలుగు లో రోజూ చూసే పూతోటే బృందావనంలా ఉంది… మీకు అభినందనలు __/\__

 • mythili says:

  బృందావనం మన లోపలే ఉంటుంది కదా రేఖ గారూ, ధన్యవాదాలు

 • Krishna Moorthy Veloori says:

  మైథిలి గారూ, చాలా చాలా థాంక్స్ అండీ,

  దేవులపల్లి వారి గురించి మీ కామెంట్స్ చదివిన తరువాత వారి కవితా ఖండికలను మరోమారు చదవాలని మల్లీశ్వరిలోని పాటలను మళ్ళీ మళ్ళీ వినాలని ఉన్నదండీ.

  అభినందనలతో,

  కృష్ణమూర్తి వేలూరి,
  అనన్య, 15, 14వ బ్లాక్, శ్రీరాంపుర, మైసూరు-23
  09448977877

  • mythili says:

   తిరిగి వారి కవిత్వాన్ని మీకు చదువుకోవాలనిపించటం కన్న నాకు ఇంకేమి కావాలండీ…ఆనందం గా ఉంది.

 • DrPBDVPrasad says:

  ఆల్కెమి (రసవిద్య) గుట్టు చక్కగా విప్పి సంజీవని కరణితో కృష్ణశాస్త్రిగారిని పంచారు.వ్యాసం బాగుంది ధన్యవాదాలు
  మోయలేని నీరవగళ మున జనించు కోరికతో ఇప్పుడే చక్కగా పలవరించారు.

 • DrPBDVPrasad says:

  ఆల్కెమి (రసవిద్య) గుట్టు చక్కగా విప్పి సంజీవని కరణితో కృష్ణశాస్త్రిగారిని పంచారు.వ్యాసం బాగుంది ధన్యవాదాలు
  మోయలేని నీరవగళ మున జనించు కోరికతో ఇప్పుడే చక్కగా పలవరించారు.

 • mythili says:

  చాలా సంతోషమండీ. రససిద్ధుల యశఃకాయం ప్రపంచానికి సుకృతం కదా !

 • bhasker koorapati says:

  ‘ఆకులో ఆకునై పూవులో పూవునై…’
  అట్లా మీ వ్యాసంలో ఒలలాడానండీ….
  ఇంత మంచి ఆర్టికల్ అందించినందుకు సంతోషంగా ఉంది.
  ‘ఘాటంపు సుఖము నాకటులైన కలుగనీ…’
  ఒక్క కృష్ణ శాస్త్రి గారు తప్ప అట్లా ఎవరు రాయగలరు చెప్పండి?
  మీ ఆర్టికల్ పదే పదే చదువుతున్నానంటే మీరు నమ్మగలరా?
  ధన్యవాదాలు.
  –భాస్కర్ కూరపాటి.

 • mythili says:

  అవునా అండీ, థాంక్ యూ ! ఆకులో ఆకునై పాటకి మాండ్ రాగంలో ఒక ఉద్వేగభరితమైన వరస ఉంది, తరచుగా వినబడేదానికి భిన్నంగా. ఉదకమండలపు అరణ్యాలలో గొంతెత్తి పాడకుండా ఆగలేకపోయాను..:) తెలుగు రాని మా వాహన చోదకుడికి చెప్పుకున్నాను ఆ పాట రాసినది ఎవరో, భావం ఏమిటో.

 • ”నా వలె ఆతడున్మత్త భావ శాలి,……….ఇంత చిరుగీతి ఎద వేగురించునేని పాడుకొనును, తాండవ నృత్య మాడు కొనును”.ఈ చరణాలు ఎందరిని కదిలించాయో ఆరోజుల్లో! వాటిని గుర్తు చేయడం బాగుంది.అవి మీ జీవితపు టాగ్ లైన్లు గా ఉండేవి అనటం ఇంకా బాగుంది.సుందరమైన వచన శైలి .థాంక్స్.

  • mythili says:

   చాలా సంతోషమండీ…ఆ వాక్యాలు మరొకరికి వాడినప్పుడు గుర్తింపుగా, పొగడ్త గా ఉంటూ ఉండేవి కూడా నాకు :)

 • కుమార్ కూనపరాజు says:

  కృష్ణశాస్త్రి గారి సాహితీ సంద్రం లో విహరింప చేసారు . మరోసారి గుర్తుకు చేసిన మైథిలి గారికి ధన్యవాదాలు !!!

 • mythili says:

  థాంక్ యూ అండీ !

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)